[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
వసువుల వృత్తాంతము
[dropcap]వ[/dropcap]సువులు ఒక్కొక్కళ్లే గంగకి కొడుకులుగా పుడుతున్నారు. గంగ వాళ్లని పుట్టీ పుట్టగానే తీసుకుని వెళ్లి గంగానదిలో పారేసి వస్తోంది. శంతనుడు కొడుకుల్ని అంత దయ లేకుండా గంగలో ఎందుకు విసిరేస్తున్నావు అని భార్యని అడగలేక బాధపడేవాడు. అలా అడిగితే ఆమె వెళ్లిపోతుందని భయపడేవాడు. అంతవరకు ఏడుగురు కొడుకుల్ని నదిలో పడేసింది. తరువాత ఎనిమిదో కొడుకు కలిగాడు. శంతనుడికి ఆ కొడుకు మీద మమకారం కలిగింది. అతణ్ని కూడా గంగలో వేసేస్తున్న భార్యని చూసి “అపురూపమైన కొడుకుల్ని పొంది రాక్షస స్వభావంతో అందర్నీ గంగలో పడేశావు. బాలసూర్యుడిలా వెలిగి పోతున్న ఈ కొడుకుని గంగలో పడెయ్యడానికి నేను అంగీకరించను” అన్నాడు.
తను చేస్తున్న పనికి అడ్డగించిన శంతనమహారాజుని చూసి “రాజా! ముందు మనం అనుకున్న నియమం ప్రకారం నువ్వు నేను చేస్తున్న పనికి అడ్డు పడ్డావు కనుక నేను నిన్ను విడిచి వెళ్లిపోతున్నాను. నేను మూడు లోకాల్లోను పరమ పవిత్రురాలిగా పేరు పొందిన నదీ రూపమైన గంగని. వశిష్ఠుడి శాపం వల్ల అష్ఠ వసువులు భూమి మీద పుట్టవలసి వచ్చింది. వాళ్లు నా గర్భం నుంచే పుట్టాలని, భూమి మీద ఎక్కువ కాలం ఉండకుండా పుట్టిన వెంటనే విముక్తి చెయ్యమని అడిగారు.
ఆ వసువుల కోరిక మీద మానవ రూపంలో నీకు భార్యగా వచ్చి వసువుల్ని బిడ్డలుగా కన్నాను. దీని వల్ల నీకు శాశ్వత పుణ్య లోకాలు కలుగుతాయి. ఈ ఎనిమిదో కొడుకు వసువుల్లో ఒక్కొక్కళ్ల నాలుగవ అంశాన్ని ధరించి సమస్త ధర్మాలు తెలిసినవాడుగా జన్మించాడు. లోకాన్ని ఉద్ధరించడం కోసం భూలోకంలో చాలా కాలం జీవిస్తాడు” అని చెప్పింది గంగ.
శంతనుడు “ఏ దోషాలు లేని వసువులు దేవతలతోను, అన్ని లోకాల ప్రజలతోను పూజించబడతారు కదా? అటువంటి వసువుల్ని భూలోకంలో పుట్టమని వశిష్ఠ మహర్షి ఎందుకు శపించాడు? పుట్టిన ఏడుగురు వసువులు పుడుతూనే స్వర్గానికి వెళ్లడం, ఈ ఎనిమిదవ వసువు భూలోకంలో చాలాకాలం జీవించడానికీ గల కారణం ఏమిటి?” అని అడిగాడు.
శంతనుడు అడిగినదాన్ని విని గంగ “వరుణుడు అనే మహర్షి గొప్ప తపస్సంపన్నుడు, గొప్ప పుణ్యవంతుడు. అతడి కొడుకు బ్రహ్మతో సమానుడు, దేవముని, అన్ని లోకాలతోను పూజింపబడేవాడు అయిన వశిష్ఠ మహర్షి. రత్నాలతో వెలుగుతూ ఉండే మేరు పర్వత గుహ లోపలి భాగంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకునేవాడు. దక్షప్రజాపతి కూతురు సురభికి పుట్టిన ‘నందిని’ వశిష్ఠ మహర్షి దగ్గర హోమధేనువుగా ఉండేది. హోమానికి కావలసిన వస్తువుల్ని తన పొదుగు ద్వారా అందించేది. పాలధారతో పాటు కోరుకున్న వస్తువులన్నీ సమకూర్చి పెట్టేది.
ఒకరోజు నిశ్చింతగా తపస్సు చేసుకుంటున్న వశిష్ఠుడి ఆశ్రమానికి ఎనిమిది మంది వసువులు తమ భార్యలతో కలిసి విహారానికి వెళ్లారు. వశిష్ఠుడి దగ్గరున్న హోమధేనువుని చూసి దాని గొప్పతనానికి ఆశ్చర్య పడ్డారు. అప్పుడు ఎనిమిదో వసువు భార్య భర్తతో “ఈ నందినీ ధేనువు పాలు తాగిన మనుష్యులు పదివేల సంవత్సరాలు ముసలితనం, రోగం లేకుండా అమరత్వంతో సుఖంగా జీవిస్తారట. దీనికి యజమాని పాలకుడు అయినవాడు అందరికంటే నిజమైన గొప్పవాడుగా చెప్పబడతాడు. భూలోకంలో ఉశీనర దేశపు రాజకుమార్తె జితవతి నా ప్రాణస్నేహితురాలు. నాకు ఆమెకి ఏదయినా మంచి చెయ్యాలని ఎప్పుడూ అనిపిస్తుంది. ఈ ఆవుని ఆమెకు పంపిద్దాము” అంది.
భార్య అడిగిన దానికి తన సోదరులు కూడా ఏకీభవించడం వల్ల ప్రభాసుడు హోమధేనువుని తనతో పట్టుకుని వెళ్లిపోయాడు. వశిష్ఠ మహర్షికి తన హోమధేనువు కనబడలేదు. అడవి మొత్తం వెతికాడు. చివరికి యోగదృష్టితో చూసి వసువులు తీసుకుని వెళ్లారని తెలుసుకున్నాడు. వశిష్ఠుడు వసువుల్ని మానవజన్మ ఎత్తమని శపించాడు. వాళ్లు భయపడి వశిష్ఠ మహర్షిని “మహర్షీ! నువ్వు అన్ని ధర్మాలు తెలిసినవాడివి. మేము చాలా అవివేకంగా ప్రవర్తించాము. నీ శాపం అనుభవించక తప్పదని తెలుసు. కనీసం మేము భూలోకంలో ఎక్కువ కాలం జీవించకుండా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు!” అని ప్రార్థించారు.
వశిష్ఠ మహర్షి వాళ్లని దయ తలిచి “మీరు అనుకున్నట్టే జరిగేలా చేస్తాను కాని ఈ ఎనివిదవ వసువు ప్రభాసుడు చేసిన నేరం క్షమించరానిది కనుక ఇతడు భూలోకంలో ఎక్కువ కాలం జీవిస్తాడు. ఇతడికి సంతానం కూడా ఉండదు అని చెప్పాడు” అని వివరంగా చెప్పింది.
తరువాత గంగాదేవి శంతనుడికి తన నిజ స్వరూపాన్ని చూపించింది. వసువుల పుట్టుక, వాళ్లు స్వర్గానికి వెళ్లడానికి గల కారణం, భీష్ముడి పుట్టుకకి సంబంధించిన నిజాలు చెప్పింది. తరువాత తమ కొడుకుకి దేవవ్రతుడు అని పేరు పెట్టింది. అతడు పెరిగి పెద్దయ్యేవరకు తన దగ్గరే ఉంటాడని చెప్పి శంతనమహారాజుని ఒప్పించి దేవవ్రతుణ్ని తనతో తీసుకుని వెళ్లిపోయింది. శంతనుడు వెంటవెంటనే జరిగిపోయినదానికి ఆశ్చర్యపోతూ గంగ తనని విడిచి వెళ్లిపోయినందుకు చాలా బాధపడ్డాడు.
భీష్ముడి యువరాజ్య పట్టాభిషేకము
భూమి మీద ఉన్న క్షత్రియవంశపు రాజులందరు శంతనుడి మాటకు కట్టుబడి వినయంగా ప్రవర్తించేవాళ్లు. అతడి కీర్తి అన్ని వైపులా ప్రకాశిస్తోంది. రాజ్య ధర్మాన్ని అతిక్రమించకుండా సముద్రాల వరకు వ్యాపించి ఉన్న భూమి మీద నివసిస్తున్న ప్రజలందరినీ రక్షిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు శంతనుడు.
ఒకరోజు వేటకోసం గంగానది ఒడ్డుకి వెళ్లాడు. అక్కడ గంగలో నీరు తక్కువగా ఉన్నట్టు కనిపించింది. దాన్ని చూసి గంగ తనకు దూరమయ్యాక చిక్కిపోయిందేమో అన్నట్టు కనిపిస్తోంది అనుకుంటూ నడుస్తున్నాడు. నది ఇలా ఉండడానికి కారణం ఏమిటో అని అలోచిస్తూ ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాడు. శంతనుడు అక్కడ విల్లమ్ములు పట్టుకుని ధనుర్విద్యని సాధన చేసుకుంటున్నాడు.
అంతలో మంచి నడవడిక, తనతో సమానమైన పరాక్రమంతో తనకు గంగకు కలిగిన కుమారుడు గొప్ప కీర్తి కలవాడు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. కాని, పుట్టిన మొదటి రోజున మాత్రమే చూడ్డం వల్ల శంతనుడు తన కుమారుణ్ని గుర్తుపట్టలేక పోయాడు. చూస్తూనే శంతనుడికి అతడితో అనుబంధమున్నట్టు అనిపించింది. అతడి వైపే చుస్తూ నిలబడిపోయాడు. ఆ బాలుడు కూడా శంతనుణ్ని ప్రేమతో చూస్తూ ఉండిపోయాడు.
ఇంతలో గంగాదేవి అక్కడికి వచ్చింది. ఆభరణాలతో అలంకరించబడిన కొడుకు చెయ్యి పట్టుకుని భర్తకి బాలుణ్ని పరిచయం చేసింది. “మహారాజా! ఇతడు మీ కుమారుడు దేవవ్రతుడు. వశిష్ఠ మహర్షి దగ్గర వేదవేదాంగాలు చదివాడు. శుక్రుడు, బృహస్పతి దగ్గర ధర్మశాస్త్రాలతో సహా శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. ముఖ్యమైన అస్త్రాల్ని ప్రయోగించడంలో పరశురాముడికి ఉన్నంత సమర్థత, ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడికి ఉన్నంత జ్ఞానము కలిగిన నీ కుమారుణ్ని నీకు అప్పగిస్తున్నాను” అంది.
తన కొడుకుని చూసుకున్న శంతనుడు ధనరాశిని పొందిన పేదవాడిలా పొంగిపోయాడు. అతడి చెయ్యి పట్టుకుని తన రాజధానికి తీసుకుని వచ్చాడు. రాజ్యంలో ఉన్న ముఖ్యులైన వాళ్లందర్నీ సమావేశ పరిచాడు. గాంగేయుడికి యువరాజ్య పట్టాభిషేకం జరిపించి రాజ్యభారమంతా అప్పగించాడు.