అన్వాంటెడ్ ఛైల్డ్

5
4

[డా. ఎ. ఎం. అయోధ్యారెడ్డి రచించిన ‘అన్వాంటెడ్ ఛైల్డ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“కం[/dropcap]గ్రాట్స్ మేడం..! మీకు పాప పుట్టింది” నర్సు చెప్పింది.

“పాపనా?” నా గొంతు తడబడింది. ఎదురుదెబ్బ తగిలినట్టు విలవిల్లాడాను. కళ్లనుంచి అశ్రువులు జారి దిండులో ఇంకినయి.

నా కన్నీళ్లను నర్సు ఆనందబాష్పాలనుకుంది. తెల్లటి వస్త్రంలో చుట్టిన పసికందును నాకు చూపించబోయింది.

“ప్లీజ్! దూరంగా తీసుకెళ్లు. నన్ను కాస్సేపు ఒంటరిగా వొదిలెయ్యి” అన్నాను.

నర్సు కళ్లు ఆశ్చర్యంతో పెద్దవైనయి. తన సర్వీసులో ఎందరో తల్లుల్ని చూసివుంటది. నా ధోరణి కొత్తగా అనిపించి ముఖం చిన్నబుచ్చుకుంది. మరేం మాట్లాడకుండా పాపని తీసుకుపోయింది. కాస్సేపటి తర్వాత తిరిగొచ్చి నన్ను మెల్లగా నడిపించుకెళ్ళి స్నానం చేయించింది. ఒళ్లు తుడిచి నైడ్రస్ వేసి పడుకునేందుకు సాయపడింది.

“మీరిక విశ్రాంతి తీసుకోండి మేడం! నిద్రలేచాక మైండ్ ఫ్రెష్ అవుతుంది. అప్పుడు పాపని చూడొచ్చు”

నర్సుకు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నా డిప్రెషను ఆమెకి తెలియదు. తెలిసినా అర్థమయ్యే అవకాశం లేదు. ఈ విషయంలో నా భర్తనే నన్ను అర్థం చేసుకోలేకపోయాడు.

విజిటింగ్ టైములో ఆయన ఉత్సాహంగా లోపలికొచ్చాడు. పూలగుచ్ఛం అందిస్తూ వొంగి నుదుటిమీద ముద్దుపెట్టాడు. నాలో స్పందన లేదు. ముఖం పక్కకి తిప్పుకున్నా. అది చూసి అతని కళ్ళలో క్షణం బాధ కదిలినా సర్దుకున్నాడు. మంచం చివరన కూర్చొని నా చేయి తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు “నర్సరీ వార్డుకు వెళ్ళొస్తున్నా. అక్కడ మన పాపను చూశాను. చాలా అందంగా ఉంది అచ్చం నీలాగే” అన్నాడు.

“అవునా.. నేను చూడలేదు” అన్నాను నిర్లిప్తంగా.

“పాప నీతోపాటు ఉండాలిగా? నర్సరీలో ఎందుకు? తల్లులంతా తమ పిల్లల్ని పక్కనే ఉంచుకున్నారు”

“నా దగ్గరొద్దని చెప్పాను. నాకిష్టంలేదు”

అతడు షాకయ్యాడు. తర్వాత నా చేయి సున్నితంగా నొక్కుతూ చెప్పాడు “సుజీ.. నీలో దుఃఖం వుంటే కరువుదీరా ఏడువు. అలాగైనా మనసులో భారం దిగిపోతుంది. నువిప్పుడు బాగా అలిసిపోయున్నావు. ముందు రెస్టు తీసుకో..”

నేను మాట్లాడకుండా పడుకున్నాను. అతని మనసులో సంఘర్షణ అర్థమైంది. అది కనబడకుండా చిన్నగా నవ్వుతూ సంభాషణ మళ్లించాడు. “డార్లింగ్.. పాపకి ఏం పేరు పెట్టుకుందాం?”

“నాకు సంబంధం లేదు, నీ ఇష్టమొచ్చింది పెట్టుకో”

“నువ్వే ఏదైనా సజెస్టు చేయి”

“నేను చెయ్యను, నాకవసరం లేదు”

“చిన్నపిల్లలా ఏమిటిది? ఇన్నాళ్ళూ బిడ్డకోసం ఆరాటపడ్డావు. ఇప్పుడేమో ఇట్లా..”

“నేను ఆరాటపడింది బాబు కోసం. పాపా కోసం కాదు. పోయిన నా చింటూ మళ్లా కడుపున పుడతాడని ఆశపడ్డా. బాబు పుడితే చింటూ పేరు పెట్టుకొని వాడులేని లోటు తీరుతుందని ఆశించా”

“అర్థంలేకుండా మాట్లాడకు. పాప కూడా మనిషే. ఒకవేళ బాబు పుట్టివున్నా వాడు చింటూ స్థానం తీసుకోలేడు. ఎప్పటికీ చింటూ కాలేడు. ఒక బిడ్డని మరో బిడ్డగా భావించుకోవడం తప్పు. చింటూ ఇప్పుడీ లోకంలో లేడు. ఈ నిజం నువు ఒప్పుకోక తప్పదు. ఈ పాప పెరిగి పెద్దయితే చింటూ మాదిరే ప్రేమను పంచుతావనే నమ్మకం నాకుంది”

“ఎప్పటికీ జరగదు. నా బాబు స్థానం మరెవరికీ ఇవ్వలేను”

రవి నిస్సహాయంగా నావంక చూస్తుండిపోయాడు. అతని ముఖంలో వేదన చూసి నా మనసుకు ఒకింత సంతృప్తి. చింటూ స్మృతిలో వ్యథ చెందుతున్న నాకు బాబు చావుకు కారణమైన భర్త క్షోభపడుతుంటే అదో ఊరట.

ఎంత అయిష్టమైనా పాప పనులు కొన్ని చేసుకోక తప్పలేదు. పసికందుకి కనీసం పాలుకూడా పట్టకపోతే అదో ఇష్యూ అవుతుందని ఇష్టంలేకున్నా చేశాను. కానీ ఒకటి రెండు నిమిషాలకన్నా పాపను ఎత్తుకోలేను. పాపని చూస్తే నాలో కొంచెం కూడా స్పందన లేదు.

ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక రవి కొన్నిరోజులు ఆఫీసుకి సెలవుపెట్టి నాకు తోడున్నాడు. ఇంటి పనుల్లో సాయపడ్డాడు. కాఫీ చేయడం, కూరలు కోయడం, కుక్కర్లో అన్నం వండటం, వాషింగ్ మిషనులో బట్టలుతకడం, పాపకి పాలు కలిపివ్వడం.. చాలా పనులు చేశాడు.

గతంలో చింటుకు కేటాయించిన గదిలోకి మారిపొమ్మని ఒకరోజు రవి చెప్పాడు. కానీ అందుకు నేనొప్పుకోలేదు.

“వొద్దు.. ఆ గది నిండా చింటూ జ్ఞాపకాలున్నయి. వాటిని ఇతరులతో పంచుకోలేను. ఆ గదిలో మరెవరికీ చోటులేదు”

“ఆ గది నీకూ పాపకూ కంఫర్టుగా ఉంటదని చెప్పాను. నువు దాన్నో దేవాలయంలా భావించడంలో అర్థంలేదు. దయచేసి గతంలోంచి బయటికిరా. ఇప్పుడు మనకో పాప వుంది. తన భవిష్యత్తులోకి చూడు. అదే నీకూ, అందరికీ మంచిది”

రవి ఎంతచెప్పినా పట్టించుకోలేదు. అతడు తిరిగి డ్యూటీలో చేరాక కొద్దిరోజులు సాయంగా మా అమ్మ వొచ్చింది. ఆమె రాగానే నేనేదీ పట్టించుకోకుండా అన్నీ పనులూ ఆమె మీదే వేశాను. కానీ ఇదెక్కువ రోజులు సాగలేదు.

నాన్నకు ఆరోగ్యం బాగోలేక అమ్మ అర్ధాంతరంగా వెళ్లిపోవాల్సివొచ్చింది.

“నిన్నీ స్థితిలో వొదిలివెళ్ళడం నాకిష్టం లేదు బేబీ.. కానీ తప్పటం లేదు” అంది.

తాను వెళ్లిపోతూ కొన్ని మాటలు చెప్పింది “నేనిలా అంటున్నానని బాధపడకు. కొద్దిరోజులుగా గమనిస్తున్నా. పాప మీద నీకేమాత్రం ధ్యాస లేదు. అసలు పట్టించుకోవు. పాప పనులేవీ చెయ్యలేదననుగానీ తల్లిగా ఆ చిన్నారి పట్ల నీలో కొంచెం కూడా స్పందన లేదని గ్రహించాను”

“అదేంటమ్మా! పాప పనులు చేస్తున్నానే. పాలు పడుతున్నా. బట్టలు మారుస్తున్నా. ఉయ్యాలలో పొత్తిళ్ళు మార్చి తనని నిద్రపుచ్చుతున్నా”

“అవన్నీ ఎవరైనా చేస్తారు. ఏదో తప్పదన్న బాధ్యతతో చేస్తున్నావు. నిజానికి ఎంత చక్కటి పాప.. ముద్దులు మూటగడుతుంది. తల్లిగా నువ్వెంత ఆనందపడాలి?”

“మనసులో ప్రేమ లేకుండా ఫీలవడం కష్టం” అన్నాను.

“పాప సంగతి అటుంచు. మరి మీ ఆయన్ని ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నావు? నేను గమనించలేదనుకున్నవా? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. అతను మంచివాడు. నీపట్ల ఎంత ప్రేమగా ఉంటాడు? ఏం తప్పుచేశాడని బాధపెడుతున్నవు? అడుగడుగునా చిన్నబుచ్చుతావు. మీరిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి మరిచావా?”

“అదేం లేదు. అతనితో మామూలుగానే ఉన్నాను”

“అబద్ధమాడకు. అతనికి దూరంగా తప్పుకుంటావు. ప్రతి మాటనూ విభేదిస్తావు. చులకన చేస్తావు. నాకెందుకో నువ్వతన్ని దేనికోసమో శిక్షిస్తున్నట్టు అనిపిస్తుంది”

నేను సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అమ్మ మాటల్లో వాస్తవం ఉంది. ఏం చెయ్యను..? రవిని చూడగానే చింటూ గుర్తొస్తాడు.

జరిగిన విషాదం గుర్తొస్తుంది. మనసు వికలమవుతుంది. బాబు ఈ లోకంలో లేకపోవడానికి కారకుడు భర్తనే అన్న సంగతి గుర్తొచ్చి కోపం పెరుగుతుంది. అదే అతనిమీద ద్వేషంగా మారింది. అతని తప్పు వల్లనే బాబు పోయాడు. ఇందుకు అతన్ని ఎంతకాలమైనా క్షమించదు. చింటూ నా సర్వస్వం. పెళ్ళయిన మూడేళ్ళకు పుట్టాడు. అల్లారుముద్దుగా చూసుకున్నాం. వాడు రవికి కూడా ప్రాణమే.

ఒకరోజు బాబు స్కూల్లో వార్షికోత్సవం జరిగింది. రవి వాడిని తీసుకొని ఫంక్షనుకు వెళ్ళాడు. మామూలుగా బాబుతో నేను వెళ్ళివుండేదాన్ని. ఆవేళ కొంచెం వొంట్లో సిక్నెస్ వల్ల వెళ్లలేదు. అప్పుటికి నేను ప్రెగ్నెంట్. ఆరోజు రవికి సెలవు. ఇంట్లోనే వున్నాడు. అతనితో బాబుని పంపించాను. నాకిప్పటికీ గుర్తుంది.. వాళ్లు వెళ్ళేటప్పుడు పదేపదే జాగ్రత్తలు చెప్పటం.

“రవీ జాగ్రత్త. నీతో బాబు వున్నాడు”

“నాకు తెలుసులే” రవి నవ్వుతూ అన్నాడు. తండ్రి నడుముకు చేతులు చుట్టి వెనుక కూర్చున్నాడు చింటు.

“చింటూ.. డాడీని గట్టిగా పట్టుకో” అరిచి చెప్పాను. వాడికి కారు కన్నా బైకు మీద వెళ్లడమే ఇష్టం. బైకు ఎక్కేందుకు గొడవ చేస్తుంటాడు. చింటూ వెనక్కి చూస్తూ చేయి ఉపాడు. నాకదే వాడి చివరిచూపు అయింది. రవి యాక్సిడెంట్ చేశాడు. అతని బైకును ఒక ఆటో గుద్దేసింది. బైకు అదుపుతప్పి దూరంగా పడింది. రవి కొద్ది గాయాలతో బయటపడ్డాడు. కానీ చింటూ ఎగిరి డివైడర్‌కు గుద్దుకున్నాడు. తలకి ఫ్రాక్చర్ అయింది. నేను హాస్పిటల్ చేరుకునేటప్పటికే వాడు పోయాడు.

వాడి మరణంతో నా దేహంలో ఒక భాగం చచ్చుబడినట్టు అయింది. గుండెలవిసేలా రోదించాను. రవి దిగ్భ్రాంతికి గురయ్యాడు. నేనతన్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. బాబు చావుకి బాధ్యుడు అతడేనన్న భావన అప్పటికే నా మనసులో బలంగా నాటుకుంది.

ఆరునెలలు గడిచాయి. ఆ ప్రభావం నుంచి రవి మెల్లగా తేరుకున్నాడు. కానీ నేను కుంగిపోయాను. గర్భవతినైన నాకు, చింటూ మళ్ళీ నా కడుపునే జన్మిస్తాడన్న ఆశ రూపం చెందుతూ వొచ్చింది.

 ***

అమ్మ ఊరెళ్ళిపోయాక పాపను కొంచెం ఎక్కువ శ్రద్ధగా చూడాల్సివచ్చింది. భావోద్వేగాలు లేకున్నా బాధ్యతలు పెంచుకున్నాను.

ఇంతచేస్తున్నా ఎప్పుడూ పాపని ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. చిత్రంగా పాపకూడా నన్నెక్కువ ఇబ్బంది పెట్టేది కాదు. ఏడ్చేది తక్కువ. పాలు తాగి ఆడుకునేది.. లేదా నిద్రపోయేది. ఆ విధంగా పాపకి నా అవసరం మరీ ఎక్కువుండేది కాదు.

అయితే మరోపక్క రవిని పట్టించుకోవడం మానేశాను. చింటూ మరణం తర్వాత మేమెప్పుడూ సన్నిహితంగా లేము. ప్రేమగా దగ్గరైందీ లేదు. పాప జన్మించి ఆరునెలలు గడిచిపోయాయి. శారీరకంగా మా మధ్య ఎడబాటు. ఎప్పుడైనా రవి దగ్గరికొస్తే నేను దూరంగా వైదొలగడం. గర్భవతిగా ఉన్నప్పుడు నా అనాసక్తిని అతడు అర్థం చేసుకున్నట్టున్నాడు. ఎలాంటి వొత్తిడి చేయకుండా దూరంగా వున్నాడు. అయితే అప్పుడూ ఇప్పటికీ నేనతన్ని దూరంగానే ఉంచాను. మనసులోని ద్వేషం వల్ల అతని స్పర్శ కూడా సహించలేకున్నా.

అప్పటివరకు ఓపిగ్గా వున్న రవి నా ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. చొరవచేస్తే విసుక్కున్నాను.

“ప్లీజ్ రవీ! దగ్గరికి రాకు. నాకిష్టం లేదు, నన్నొదిలెయ్యి”

అతడు నిట్టూర్చి “నామీద ప్రేమ పోయిందా” అన్నాడు.

“అదేం కాదు, ఇప్పుడు మనసు బాగాలేదు అంతే..”

తర్వాత మరెప్పుడూ అతడు నాకు సన్నిహితంగా రాలేదు. నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడని భావించాను. కానీ కోపంతో దూరమైనట్టు గ్రహించలేకపోయాను. ఇంట్లో తెలియని ఒక శ్మశాన ప్రశాంతత నెలకొన్నది. ఈ పరిణామాలతో నిమిత్తం లేకుండా ఏడుపైనా.. సందడైనా అది ఉయ్యాలలో పాప చేస్తున్నదే. ఇంట్లో ఉండేది ఇద్దరమే గనుక పాప తొందరగానే మాకు అలవాటుపడి గుర్తించడం నేర్చుకున్నది.

ఓ రోజు మధ్యాహ్నం పాలు పడుతుంటే పాప నావైపే పరీక్షగా చూస్తూ బోసిగా నవ్వింది. ఆ నవ్వు కొన్ని క్షణాలు మైమరిచేలా చేసింది. బదులుగా నేనూ ఉల్లాసంగా నవ్వాను. అదే నేను తొలిసారి పాపతో ఆనందించిన సందర్భం. కానీ కొన్ని క్షణాలే. వెంటనే మళ్ళీ మామూలై పోయాను. ఎందుకో ఆ పసిదాన్ని ప్రేమించకపోయినా అసహ్యించుకోవద్దని అనిపించింది. మనసులో ఎంత బాధయినా వుండనీ, పాప మీద చిరాకుతో నిర్లక్ష్యం చేయొద్దనుకున్నా.

రవి ఆలస్యంగా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఇదివరకు ఆఫీసు నుంచి నేరుగా వొచ్చేవాడు. చాలాసేపు పాపతో గడిపేవాడు. గతంలో చింటుతో కబుర్లు చెపుతూ ఆడిన ఆటలు ఇప్పుడు పాపతో ఆడుతుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా కూతురితో గడిపేందుకు ఇష్టపడతాడు. అతడట్లా చింటూను పూర్తిగా మరిచిపోయి పాపతో ఆనందంగా ఉండటం నాకెందుకో నచ్చలేదు. సూటిపోటీ మాటలతో దెప్పిపొడిచేదాన్ని. ఏదో సాకు చెప్పి పాపను అతన్నుంచి దూరం తీసుకెళ్ళేదాన్ని.

రవిలో అలవాట్లలో మార్పు వచ్చింది. ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరుతున్నాడు. దినచర్య ఒక క్రమపద్ధతి లేకుండా అయింది. ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. ఒకోసారి బాగా తాగి వొస్తాడు. అతడు ఎప్పుడొచ్చినా, యే స్థితిలో వున్నా నాకు సంబంధం లేనట్టు ఉండిపోయాను. నాకు ఒంటరితనం అలవాటైంది.

చిత్రంగా నేనెంతమాత్రం ఇష్టపడని పాపనే ఇప్పుడు నాకు తోడైంది. అప్పుడప్పుడూ చింటూ గదిలోకి వెళతాను. చింటూ మంచం మీద కూర్చొని వాడి జ్ఞాపకాలను నెమరేస్తూ గడుపుతాను. వాడు ఆడుకున్న బొమ్మలు ఒక్కోటి బయటికి తీసిచూస్తూ ఆనందిస్తాను. బీరువాలోని వాడి బట్టల్ని తడిమి చింటును స్పర్శించిన అనుభూతి పొందుతాను. వాడికెంతో ఇష్టమైన సూపర్మేన్ బొమ్మ కళ్ళలోకి ఉండిపోతాను. ఆ బొమ్మ ప్రత్యేకంగా ఉంటుంది. రవి సింగపూర్ వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొచ్చాడు. దానికి అమర్చిన నీలంరంగు కళ్లు చిన్నగా కదులుతూ జీవకళ ప్రదర్శిస్తాయి. మనల్నే చూస్తున్నట్టు ఉంటాయి. ఆ బొమ్మతోనే చింటూ ఎక్కువగా గడిపేవాడు. ఆ బొమ్మ వాడికున్న అన్ని బొమ్మల్లోకల్లా పెద్దది. తర్వాత నాకెక్కువ ఊరట కలిగించే వస్తువు వాడి ఫోటో ఆల్బమ్. వాడి పుట్టినరోజు, ఇతర ఫంక్షన్లు, టూర్లు వెళ్ళినప్పుటి ఫోటోలు. చింటూ స్కూలు ఫంక్షన్లు వార్షికోత్సవాల సందర్భంగా తీసిన చిత్రాలు ఉన్నాయి.

చింటూ చివరిసారి దిగిన ఫోటో కనిపించింది. ఎంతో ముద్దుగా ఉన్నాడు. నావైపే చూస్తున్నట్టు అనిపించింది. వాడు ఎదురుగా వున్నట్టుగానే భావించి ఫోటోతో కబుర్లు చెప్పాను. చెంపల వెంట కన్నీళ్ళు కారిపోతుంటే అట్లా ఎంతసేపున్నానో తెలియదు.

 ***

ఓ రోజు రవి అసలు ఇంటికే రాలేదు.

పదకొండు దాటేసరికి నాలో ఆందోళన పెరిగింది. చెప్పకుండా ఎక్కడికి పోయాడు? భయమేసింది. నిస్సహాయతతో ఏడుపొచ్చింది.

అర్థరాత్రి దాటినా అతడు రాలేదు. టెన్షనుతో ఏమీ తోచలేదు. అప్పుడర్థమైంది.. చింటూ విషయంలో రవిని ఎంతగా ద్వేషించినా మనసులో అతనిమీద ప్రేమ వుంది. దాదాపు తొమ్మిది నెలలుగా అతనిపై అయిష్టత పెంచుకున్నాను. నిశ్శబ్ద యుద్ధం సాగించాను. ఇప్పుడతడు ఏమయ్యాడన్న ఆందోళనలో మనసు తల్లడిల్లుతుంది.

నాలో తెలియని మార్పు జరుగుతున్నట్టు గ్రహించాను. చింటూ మరణానికి బాధ్యున్నిచేసి నిందిస్తూ మానసికంగా హింసించాను.

ఆలోచిస్తే చింటూ ఘటనలో నిజానికి అతని తప్పేం లేదు. బాబుని అతడూ అపారంగా ప్రేమించాడు.

యాక్సిడెంటులో బాబు పోయాడు. రవి బతికి బయటపడ్డాడు. ఇప్పుడనిపిస్తుంది.. రవికి ఏమైనా అయివుంటే..?

మర్నాడు కూడా రవి రాకపోయేసరికి నాలో భయం తారస్థాయికి పెరిగింది. అతడు పూర్తిగా నా జీవితం లోంచే వెళ్లిపోయాడన్న యోచనతో వొణికాను. ఆ రాత్రి పడుకున్నానన్న మాటేగాని ఆలోచనలు మనసును ఉక్కిరిబిక్కిరి చేసినయి. ఎంతకీ నిద్రరాలేదు.

రెండు గంటలప్పుడు బయట బైకు చప్పుడైంది. రవి తనదగ్గరున్న కీతో లాక్ తీసి లోపలికొచ్చాడు.

లైటు వేయకుండా అట్లా చీకట్లోనే బట్టలు మార్చుకుంటుంటే అడిగాను: “రెండు రోజులుగా ఇంటికి రాలేదు ఎక్కడికెళ్ళావు?”

అతడు బదులు చెప్పకుండా “ఓ.. నువ్వింకా మేలుకునే ఉన్నావా?” అన్నాడు.

“రెండ్రోజులు నువు రాకపోతే ఎక్కడికెళ్లావో తెలియక ఎంత టెన్షన్ పడ్డాను. ఇంక నిద్ర ఎలా వస్తుంది..?”

నా మాటలు అతనికి ఆశ్చర్యం కలిగించి వుండాలి. కానీ చీకట్లో ముఖంలోని భావాలు కనిపించలేదు.

“ఎక్కడికి పోయేదీ చెప్పిపోవచ్చు కదా…”

“ఎందుకు చెప్పడం? అంత అవసరమనుకోలేదు”

“రెండ్రోజులుగా తాగుతూనే ఉన్నావా?”

“లేదులే, మొన్న ఒకసారి.. అంతే”

“మరైతే ఇంటికి రాకుండా ఎక్కడున్నావు”

“ఎక్కడుంటే ఏమిటి.. వొదిలెయ్. నువు పడుకో” మాటదాటేసే ప్రయత్నం చేశాడు.

“ఒక్క తాగుడేనా.. లేక అమ్మాయిలతో కూడా తిరుగుతున్నావా?”

అతడు జవాబు చెప్పలేదు. అటుతిరిగి పడుకున్నాడు.

“చెప్పవేం? రెండురోజులు ఎక్కడున్నావు? నీకు ఆడాళ్ళతో స్నేహాలు ఎక్కువేగా. ఏ స్నేహితురాలి ఇంట్లోనో వుండిపోయావా?”

“అవును, అమ్మాయితోనే వున్నాను. అయినా నేనెక్కడుంటే ఎందుకు? నీకు అవసరం లేదుగా?” కటువుగా అన్నాడు.

షాక్ తగిలినట్టయింది. అతడంత పెడసరంగా జవాబిస్తాడనుకోలేదు. తెలియకుండానే దుఃఖం ముంచుకొచ్చింది.

“ఎట్లా చేయగలిగావా పని? సిగ్గులేదూ.. పెళ్ళాం పిల్లలున్నవాడివి”

“ఎందుకు చేయకూడదు? భార్యగా నువు సరిగా ఉన్నావా? ముందు నిన్ను నువ్వు తెలుసుకో”

“నా మీద నింద వేస్తున్నావా? చింటూ పోయాక మనసు బాగలేక నీకు దూరంగా వున్నమాట నిజమే. అంతమాత్రాన సిగ్గులేకుండా ఇంకో ఆడదాని దగ్గరికి పోతావా? నా చాటుగా నువ్విలాంటి నీతిమాలిన పనులుచేస్తే సహించను”

“ఎందుకని? చింటూ విషయంలో నన్నో హంతకునిగా భావించి హింసిస్తున్నావు. అంతేకాని నేను పడే వ్యథ నీకర్థంకాదు. భర్తను చులకన చేస్తూ, అంత తిరస్కారంగా ఎలా ఉండగలవు? ఇందుకు నువు కొంచెమైనా పశ్చాత్తాపపడ్డట్టు ఎప్పుడూ చూడలేదు. నాకూ ఇష్టాలూ కోరికలుంటయి. నువ్వంత నిర్లక్ష్యం చేసినప్పుడు వేరేదారి లేదు”

“ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు! దానికి దీనికి పోలికనా? నేను పశ్చాత్తాపపడి సారీ చెప్పాలా.. ఎందుకు చెప్పాలి..? నా చింటూను లేకుండా చేసినందుకా..?”

“ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు? జరిగింది యాక్సిడెంటని నీకు తెలుసు. చింటు నాకూ కోడుకేనన్న సంగతి మర్చిపోవద్దు. వాడు లేని లోటు నాకు లేదా? నీకు ఒక్కదానికే ఉందా? ఇంకెంతకాలం వేధిస్తావు?”

“అవును! నిన్నెప్పటికీ క్షమించను. నువు చేసిందానికి బతుకంతా అసహ్యించుకుంటాను. నా బాబుని చంపింది నువ్వే..”

“పిచ్చిదానిలా మాట్లాడకు. నేను బాబుని చంపుతానా? ఆ యాక్సిడెంటులో బాబు కాకుండా నేను పోయినా బాగుండేది”

“ఈ మాటలకేమిలే. నిజానికి నువు బాబునెప్పుడో మర్చిపోయావు. హాయిగా బయట తిరుగుతున్నావు. నువ్విలా విచ్చలవిడిగా వుంటే సహించను. ఇంట్లోంచి వెళ్లిపోతాను. అప్పుడు నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో..?”

“బెదిరిస్తున్నావా? వెళితే వెళ్ళు. పాపనేం చేద్దామనుకుంటున్నావు”

“నాతో తీసుకుపోతాను” చప్పున అన్నాను.

“అయితే పో. నీ బుద్ధున్న చోటికి వెళ్ళు. నచ్చినట్టు బతుకు. ఇక నీకూ నాకూ సంబంధం లేదు” విసురుగా లేచిపోయి హాల్లో సోఫామీద పడుకున్నాడు.

 ***

మరుసటి ఉదయమే సామాన్లు సర్దుకోవడం ప్రారంభించాను. కొద్దిరోజులు అమ్మ దగ్గరుండి, తర్వాత భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకోవాలని భావించాను. పాపకు సంబంధించిన వస్తువులు సర్దుతుంటే రవి అన్నాడు:

“ఒక్కదానివి ఇంత లాగేజీ మోసుకొని వెళ్ళడం కష్టం. అందుకే ఇంట్లోంచి నేనే వెళ్లిపోతాను. నువ్వూ పాప ఇక్కడే వుండండి”

అసలే తిక్కగా ఉన్నాను, అతని మాటలకు నాలో సహనం పోయింది.

“ఎందుకు? హాయిగా నీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉందామని చూస్తున్నావా? కానీయ్, నువ్వెక్కడపోతే నాకేంటి? జీవితంలో మళ్ళా నీ ముఖం చూడాలనుకోవడం లేదు” గట్టిగా అరిచాను. అంత కోపం ఎట్లా వచ్చిందో తెలియదు. రెండురోజులు అతడు ఇంటికి రాకపోతే ఎంత కంగారుపడింది..? ఎంత అల్లాడింది?

ఇకమీదట రవితో సామరస్యంగా ఉందామని అనుకుంది. చింటూ విషయంలో నిందించరాదనుకుంది. అతనిపై ప్రేమ తగ్గలేదన్న వాస్తవం కూడా గ్రహించింది. తీరా ఇప్పుడు ఆవేశాన్ని కంట్రోలు చేసుకోలేక ఇష్టమొచ్చినట్టు అనేసింది.

దుఃఖాన్ని నిలువరించుకోలేక ఏడ్చాను. నాలో కలిగిన మార్పులన్నీ అతడు నిర్లిప్తంగా చూస్తుండిపోయాడు. ఇదే గతంలోనైతే నేను కొంచెం చిన్నబుచ్చుకున్నా, కంటతడి పెట్టినా ఊరుకునేవాడు కాదు. ప్రేమగా దగ్గరికి తీసుకొని బుజ్జగించేవాడు. ఆవిధంగా పరిస్థితి మళ్ళీ సాధారణమై పోయేది. రవి ఇప్పుడిలా కఠినంగా మారడానికి కారణం నేనేనా..? అంతా నా తప్పేనా? నా ధోరణి వల్లే అతడు మారిపోయాడా? వాస్తవానికి అతడు చాలారోజులు సహనం వహించాడు. ఎన్ని అవమానాలైనా సహిస్తూ వచ్చాడు. కానీ నేను అపార్థం చీకట్లోనే వుండిపోయాను.

రవి లేచి మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. నావైపు చూడను కూడా లేదు. దీనికంతటికీ బాధ్యులెవరు? ఈ ప్రశ్న నన్ను భయపెట్టింది. పరుగెత్తివెళ్ళి అతన్ని ఆపాలని, నన్ను విడిచి వెళ్లొద్దని కోరాలనిపించింది. అన్నీ మరచి ఆనందంగా ఉందామని, నన్ను క్షమించమని ఆడగాలనుకున్నాను.

కానీ నాలో అభిమానం భావోద్వేగాలకు అడ్డుగా నిలిచింది. ఏదీ చేయలేక అలా బొమ్మలా ఉండిపోయాను.

అతనిక ఎప్పటికీ వెనుదిరిగి చూడడు. నా అవసరం ఉండదు. ఇన్నాళ్ల నా ప్రవర్తన అతనిలో ఈ నిర్లిప్తతకు దారితీసింది. పాపను కూడా కన్నెత్తి చూడలేదంటే అతని గుండె ఎంత ఘనీభవించిందవో అర్థమైంది.

మెల్లగా నడిచి చింటూ గదిలోకెళ్ళాను. సూపర్‌మేన్ బొమ్మ తీసుకొని మంచం మీద కూలబడ్డాను. దాని నీలికళ్ళలోకి తదేకంగా కొన్నిక్షణాలు చూశాను. నాలో దుఃఖం తన్నుకొచ్చింది. చాలాసేపు విలపించాను. నాస్థితి నాకే దయనీయంగా అనిపించింది.

అవతలి గదిలో పాప ఏడవటం వినిపించింది. ఒక్క ఉదుటున లేచాను. అట్లా లేవడంతో నా వొళ్ళో సూపర్‌మేన్ బొమ్మ ఎగిరి కిందపడింది. తీసిచూస్తే బొమ్మ మొహం పగిలింది. మిటకరిస్తూ జీవంతో కదిలే నీలం కనుగుడ్లు రాలిపడ్డాయి. కళ్లు వుండే స్థానంలో రెండు రంధ్రాలు కనిపిస్తున్నాయి. కోపమూ నిస్సహాయతా కంపించిపోయేలా చేశాయి. బొమ్మను విసిరేసి బయటికి నడిచాను.

చింటూకి ఎంతో ఇష్టమైన టాయ్ పగిలిపోయింది. దీనికి పాపే కారణం. పాప ఏడుపే నన్ను ఉలికిపడేలా చేసింది.

ఏం కొంపలు మునిగినయని అంతలా ఏడుస్తుంది..? కోపం పాప మీదకు మళ్ళింది. నా ముఖంలో ఏం కనిపించిందో టక్కున ఏడుపు ఆపేసింది పాప. బెదురు కళ్లతో నన్నే తదేకంగా చూసింది.

పాపను ఆ స్థితిలో చూసి నా కోపం ఒక్కసారిగా చల్లబడింది. పసికందు బెదురు చూపులు నన్ను కదిలించినయి. పాపని తొలిసారి చూస్తున్నన్నట్టు కళ్ళనిండా ప్రేమతో చేతుల్లోకి తీసుకొని గుండెకు హత్తుకున్నా.

“బంగారు తల్లి.. భయపడ్డావా చిన్నారీ..” అనునయించాను.

పాప ముద్దుగా, మరోపక్క నిస్సహాయంగా కనిపించింది. నాలో ప్రేమ పెల్లుబికింది. పాప తలమీదా బుగ్గల మీదా పదేపదే ముద్దులు పెట్టాను. తన లేత నాసిక చివరని పెదాలతో స్పృశించాను. సున్నితంగా కళ్లు, ముఖం తుడిచాను. మెడ ఇంకా స్థిరంగా నిలబడటం లేదు. తలను నా గుండెలకు ఆనించి హత్తుకున్నా. పాప కళ్ళు పెద్దవిచేస్తూ నన్ను చూసింది. నా ముఖంలో ఏం కనిపించిందో బోసినోరుతో మనోహరంగా నవ్వింది. ఆ నవ్వు చల్లగా.. వెన్నెల కురిసినట్టుగా.. నా తప్పుల్ని ప్రక్షాళన చేసినట్టు అనిపించింది.

పాప ముఖంలోకి ప్రేమతో చూస్తూ తొలిసారి హాయిగా నవ్వాను. నాలో మాతృ మమత పొంగింది. ఆంతరంగంలో చిన్న కదలిక.

చింటూ గుర్తొచ్చాడు. చిత్రంగా ఆవేదన స్థానంలో తెలియని ప్రశాంతత. చింటూను ఎప్పటికీ మరిచిపోలేనని తెలుసు. వాడులేని లోటు తీరదనీ తెలుసు. కానీ చింటూ జ్ఞాపకాలతో నాలో అడ్డుగా నిలుచున్న గోడలు ఇప్పుడు లేవు.

నన్ను వ్యాకులతలోకి నెట్టిన, నన్ను నన్నుగా మిగలకుండా చేసిన గతం ఇప్పుడంత తీవ్రంగా అనిపించ లేదు.

***

చింటూ బట్టలు, ఆడుకున్న బొమ్మలు, ఫోటోలు, వాడికి సంబంధించిన వస్తువులన్నీ ఒక సూటుకేసులో జాగ్రత్తగా సర్దిపెట్టి దాచేశాను.

వేరే గదిలోని ఉయ్యాలతో సహా పాపకు చెందిన వస్తువులన్నీ తీసుకొని చింటు గదిలోకి మారిపోయాను.

నా మనసులో తెరలు తొలగినట్టయింది. ధైర్యంగా రవికి ఫోన్ చేశాను. అర్జంటుగా మాట్లాడాల్సివుందని, ఒకసారి ఇంటికి రావాలని కోరాను. “ఫోనులో అన్నీ వివరంగా చెప్పలేను. ఇప్పటిదాకా చింటూ యాదిలో మూర్ఖంగా ప్రవర్తించాను. నీ పట్ల చూపిన తిరస్కారానికి చింతిస్తున్నా. బాబు మరణానికి నిన్ను బాధ్యున్ని చేసినందుకు, నీ మనసు గాయపర్చినందుకు సిగ్గుపడుతున్నా. ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను రవీ.. నాలో ఏ భ్రమలూ లేవు. నా వేదనలో నిన్నేకాదు.. అభం శుభం తెలియని పాపని కూడా శిక్షించాను.

అన్నిటికీ నన్ను క్షమించు రవీ.. ఇంటికొచ్చేయి. ఐ లవ్ యూ”

గుండెభారాన్ని దింపుకొని రవి కోసం ఎదురుచూశాను. ఇవేమీ తెలియని పాప ఉయ్యాల్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నది.

చింటూ మా జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగా వుంటాడు. మేము గతాన్ని మరిచి పోలేకపోవచ్చు. అయితే చింటూ జ్ఞాపకాల మధ్యే బహుశా సంతోషిస్తూ జీవించడాన్ని నేర్చుకుంటాం. పాప మాకు కొత్తవెలుగు. పాప వెలుగులో చింటూను చూసుకుంటాం. బాబు మాకో తీయటి విషాదమై మిగిలిపోతాడు. నా కళ్ళూ మనసూ రవి రాకకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here