తెలుగు సాహిత్య విమర్శ స్థితి చూపే ‘దిక్చక్రం’

3
3

[శ్రీ ఆడెపు లక్ష్మీపతి రచించిన ‘దిక్చక్రం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కృష్ణచైతన్య]

[dropcap]ఆ[/dropcap]డెపు లక్ష్మీపతి వివిధ సందర్భాలలో రచించిన 48 సాహిత్య వ్యాసాల సంపుటి ‘దిక్చక్రం’. ఈ 48 వ్యాసాలను నాలుగు విభాగాలలో పొందుపరిచారు. ‘కవిత్వం’, ‘కథలు’, ‘నవలలు’, ‘కొత్త రచనా రీతులు’ అన్నవి ఆ నాలుగు విభాగాలు.

కవిత్వం విభాగంలో ఆరు వ్యాసాలున్నాయి.  కథల విభాగంలో ఇరవై రెండు వ్యాసాలున్నాయి. నవలలు విభాగంలో ఏడు వ్యాసాలున్నాయి. కొత్త రచనా రీతులు, వాదాలు, తాత్విక ధోరణుల విశ్లేషణ విభాగంలో  పధ్నాలుగు వ్యాసాలున్నాయి.  ఈ సంపుటిలోని వ్యాసాల అంశాలు ఆసక్తి కరమైనవి, ఉపయుక్తమైనవి. కానీ, వ్యాసాల నిర్వహణలో వ్యాస రచయిత పలు సందర్భాలలో అసలు విషయం మరచి ఎటెటొ తిరుగుతున్నాట్టనిపిస్తుంది.

ఈ వ్యాసాలలో, ముఖ్యంగా నిడివి పరిమితి లేని సందర్భాలలో రాసిన వ్యాసాలలో ప్రధానంగా కనిపించే అంశం అసలు విషయం లోకి దిగే కన్నా ముందరి సుదీర్ఘమైన ఉపోద్ఘాతం. మొదటి వ్యాసం ‘మూల మలుపులో కవిత్వం – ఒక పరామర్శ’ తోనే దీన్ని గమనించే వీలు చిక్కుతుంది. నిజానికి అసలు వ్యాసం అయిదవ పేజీలో ‘ఇటీవలి కాలంలో వస్తుపరంగా’ అంటూ ఆరంభమయ్యే పేరా నుంచి ఉంటుంది. అంతకు ముందు కవి చేసే పని గురించి, కవిత ఎలా ఉండాలి, కవిత్వాన్ని ఎలా రాయాలి వంటి – ప్రస్తుత వ్యాసానికి – అప్రస్తుతమైన అంశాలు ఉపోద్ఘాతంలో చోటు చేసుకున్నాయి. ఈ వివరాలు వదిలేసినా వ్యాసానికి ఎంచుకున్న ప్రధానాంశానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇది ఈ ఒక్క వ్యాసంలోనే కాదు, పలు ఇతర వ్యాసాలలోనూ కనబడటంతో, బహుశా ఇది వ్యాసకర్త రచనా సంవిధానంలో ఒక భాగం అనుకోవాల్సి వస్తుంది. ఇలా ఉన్న ఉపోద్ఘాతాలన్నీ ఆంగ్ల సాహిత్యానికి సంబంధించినవి కావటంతో వ్యాసకర్తకు ఆంగ్ల సాహిత్యంపై మక్కువ ఎక్కువ, ఆంగ్ల సాహిత్య అధ్యయనం అధికం అనిపిస్తుంది. ఆ వెంటనే తెలుగు సాహిత్యం నుంచి ఉదాహరణలు లేకపోవడంతో తెలుగు సాహిత్యంపై అంత లోతైన అధ్యయనం లేదనే భావన కలిగే ఆస్కారం ఉంది.

‘ఒక కావ్యం తనను ఎందుకు ఆకర్షించింది? అందులో ఉన్న ఏ విధానం వల్ల అది తన మీద ప్రభావం చూపించింది?’ అన్న విషయాలలో విమర్శ ‘వ్యక్తిస్పర్శ’ (impersonal) ని అధిగమిస్తే తప్ప విమర్శ సమగ్రం కాదు – అంటాడు టి.ఎస్. ఇల్లియట్. అంతే కాదు, “We do not find the impressions of another person, however sensitive, very significant.” అని అంటాడు ‘The Sacred Wood’ అనే రచనలో. కానీ ఈ పుస్తకంలో అడుగడుగునా రచయిత అభిప్రాయాలు, అలోచనలను generalize చేసి వాటిని కొలబద్దగా సృజనాత్మక రచనలను పరిశీలించడం కనిపిస్తుంది. “విమర్శను ఒక వైయక్తిక వ్యవహారంగానూ, కేవలం స్వీయాభిరుచికి సంబంధించిన విషయంగానూ భావించి చేసే రచన (విమర్శ) శాస్త్రీయం కాకపోవటమే కాక, అది ఓ ప్రశంస కిందనో, పొగడ్త గానో జారిపోతుంది” అంటారు ముదిగొండ వీరభద్రయ్య ‘ప్రశంస-విమర్శ’ అన్న వ్యాసంలో. కాబట్టి ఎప్పుడైతే విమర్శకుడు  తన వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టాయిష్టాలను ఒక రచన మంచిచెడ్డలు నిర్ణయించటానికి కొలబద్దగా పరిగణిస్తాడో అప్పుడా రచన శాస్త్రీయతను కోల్పోతుంది. ఇది ఈ పుస్తకంలోని పలు వ్యాసాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా పలు వ్యాసాలకు ముందున్న సుదీర్ఘమైన  ఉపోద్ఘాతాలు వాటిలో ప్రదర్శితమవుతున్న విదేశీ రచనల ప్రస్తావనలు, తరువాత వ్యాసంలోని ప్రధానాంశాన్ని ఏ రకంగా ఇనుమడింప చేయకపోవటం గమనిస్తే, అసలయిన వ్యాసాంశంతో ఎలాంటి సంబంధం లేకపోవటం గమనిస్తే,  ఎక్కడో ఈ వ్యాసాల రచయితలో తాను పాశ్చాత్య సాహిత్యాన్ని ఎంతో అధ్యయనం చేశాడన్న అహంభావం కనిపిస్తున్నదేమో, తాను ఇతరులకు నేర్పించాల్సిందెంతో వున్నదని అనుకుంటున్నట్టు  భావన కలుగుతుంది. ఇందులోని వ్యాసాలు చదువుతుంటే ఆ భావన బలపడుతుంది. విదేశీ రచనలను లోతుగా అధ్యయనం  చేసిన తెలుగు రచయితలు, విమర్శకులు, జర్నలిస్టులు అంత ఎక్కువ సంఖ్యలో లేరన్న సత్యాన్ని అంగీకరించినా, ఈ ఉపోద్ఘాతాలలోని ‘ధోరణి’ అంత ఆరోగ్యకరంగా అనిపించదు. ఎందుకంటే “the ultimate end of criticism is much more to establish the principles  of writing than to furnish rules” (Coleridge) అన్న దాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ వ్యాసాలలో అడుగడుగునా వ్యాసకర్త, అధ్యాపకుడై రచయితలకి పాఠాలు చెప్తున్నట్లు తోస్తుంది. పాఠకులను రచయితలను ఎడ్యుకేట్ చేసే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నట్టు అనిపిస్తుంది.

“కవిత్వ పంక్తులు (stanzas) కవిత్వాంశాన్ని literal గా చెప్పకూడదు. అవి non-literal వ్యక్తీకరణలుగా ఉండి పాఠకుని ఊహకు పని కల్పించాలి.” (పేజీ 25) అంటూ ఆరంభమైన పేరా మొత్తం కవిత్వం ఎలా రాయాలో నేర్పుతుంది. సూత్రాలను తీర్మానించటం కనిపిస్తుంది.

‘2008 కథా సాహిత్య సింహావలోకనం’ వ్యాసానికి ముందు 7 పేజీల ఉపోద్ఘాతంలో ఒక్క తెలుగు కథ ఉదాహరణ లేదు. నిజానికి ఆ తరువాత కూడా మరో నాలుగు పేజీలు ఉపోద్ఘాతమే. ‘ఏటా కొన్ని వందల కథలు ప్రచురితమవుతున్నాయి’ నుంచి అసలు వ్యాసం ఆరంభమవుతుంది. అంటే 76వ పేజీ నుంచి 88వ పేజీ వరకు ఉపోద్ఘాతం అన్న మాట. ఈ 12 పేజీలు తీసేసినా ప్రధాన వ్యాసానికి ఎలాంటి ఢోకా లేదు. తెలుగు సాహిత్య వ్యాసాలతో పాటు తెలుగు పాఠకులకు ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేయటం కోసమో, లేక రచన ప్రణాళిక లోపం వల్లనో రచయిత ఇంత సుదీర్ఘమైన అప్రస్తుతమైన ఉపోద్ఘాతాలు రాస్తున్నారనిపిస్తుంది. సినిమా ఆరంభం కన్నా  ముందు  వచ్చే డాక్యుమెంటరీ ఎప్పుడయిపోతుందా అని ఎదురుచూసినట్టు అసలు వ్యాసం ఆరంభానికి ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఉపోద్ఘాతం వదిలి, అసలు వ్యాసం ఆరంభానికి వెళ్ళిపోవటం సంభవిస్తుంది.  పఠనీయతను దెబ్బతీసే చాటంత అప్రస్తుత ఉపోద్ఘాతలు లేకపోతే, పుస్తకం నిడివి తగ్గేది, పఠనీయత మరింత పెరిగేది. ఇలాంటి వ్యాసాలు ఈ పుస్తకంలో అధికంగా కనిపించటంతో వ్యాసకర్తకు  రచనపై నియంత్రణ లేదన్న భావన బలంగా అనిపిస్తుంది. చెప్పదలచుకున్న అంశాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పేబదులు అనవసరమైన పాండిత్య ప్రదర్శనను అసందర్భంగా చేస్తున్నట్టు తోస్తుంది.

ఈ సంపుటిలోని సాహిత్య వ్యాసాలు, ముఖ్యంగా కథలకు సంబంధించిన సాహిత్య వ్యాసాలలోనూ అప్రస్తుత ఉపోద్ఘాత ధోరణితో పాటు మరో ధోరణి కనిపిస్తుంది. రచయితకు ఇతరులు రాసిన కథల పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ‘మెతుకు సీమల వెతల బతుకుల్లోంచి వికసించిన కథలు’ అన్న ముందుమాట వ్యాసంలో అలవాటయిన సుదీర్ఘోపోద్ఘాతం ఉంటుంది. ఇందులో ముందుమాట ఆవశ్యకత, కథల ప్రయోజనాలు వంటి అంశాలను స్పృశిస్తూ (4 1/2 పేజీలు) ‘పాత కొత్తల మేలు కలయిక’ అంటూ అసలు సంకలనం ప్రస్తావనలోకి దిగుతుంది వ్యాసం.

‘2008 సాహిత్య సింహావలోకనం’ వ్యాసంలో ప్రస్తావించిన ప్రతి కథలోనూ ఏదో ఓ లోపం ఎంచటం కనిపిస్తుంది. వారణాసి నాగలక్ష్మి రాసిన ‘చిన్నబోదా చిన్ని ప్రాణం’ అనే కథను విమర్శిస్తూ, “పిండాన్ని బతికించటం కోసం మాతృత్వం సెంటిమెంటును తెచ్చినా, ఆ బంధం తోటే పాత్ర (సుజిత్) వ్యక్తిత్వాన్ని ఉరితీసింది రచయిత్రి” (పేజీ 93) అనటం నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి కల్పిస్తుంది. ఇక్కడ పిండాన్ని బ్రతికించటం తప్పా? మాతృత్వం సెంటిమెంటు తప్పా? భర్త పట్ల వ్యతిరేకత పెంచుకోవటాన్ని సమర్థించిన రచయిత, ఆమెలో మాతృత్వం జాగృతమై పిండాన్ని బ్రతికించుకోవాలనుకోవటంలో అభ్యంతరం ఏమిటో, ఎందుకో  ఎంత తలబ్రద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. బహుశా ఈ కథ ముగింపు, నాయిక భ్రూణహత్యకి పాల్పడి, భర్తను వదిలి ‘నా కెరీర్’ అంటూ విదేశాలకు వెళ్ళిపోతే ఆ పాత్ర వ్యక్తిత్వం నిలబడినట్టు అనిపించేదేమో వ్యాసకర్తకు! కథను కథగా కాక ఒక ఉద్యమానికో ఆదర్శానికో కొమ్ముకాసే ప్రక్రియగా రంగుటద్దాలు ధరించి సాహిత్య విశ్లేషణ చేస్తే ప్రాకృతిక విషయాలు కూడా వికృతంగా తోస్తాయి అనటానికి ఈ వ్యాఖ్య ఒక ఉదాహరణ.  అయితే 2008 కథల సింహావలోకనం వ్యాసంలో దాదాపుగా ఒకే భావజాలానికి చెందినవారివే, ఒకే రకమైన ఆలోచనను సమర్థించే రచయితల రచనలనే ప్రస్తావించటం యాదృచ్ఛికం కాదనిపిస్తుంది. జిల్లెళ్ల బాలాజీ, వారణాసి నాగలక్ష్మిల కథలను ప్రస్తావించినా వాటిని తీసిపారేయటం కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో మాఫియా ముఠాలు మెచ్చే భావజాలాన్ని, రచయితలని ప్రస్తావిస్తేనే, విమర్శకుడికి  గుర్తింపు లభిస్తుందన్న ఆలోచన  ఈ వ్యాసాలు చదువుతుంటే బలపడతుంది. ఎందుకంటే, రచనను విశ్లేషించి నిగ్గు తేల్చటం కన్నా, ఇతరుల అభిప్రాయాలను ఉదాహరించటం, విదేశీ కథల ఉదాహరణలివ్వటమే ఎక్కువగా కనిపిస్తుంది.

విమర్శకుడి దృష్టి తెలుగు సాహిత్యంలో ఒక రంగుకే పరిమితమయినదన్న ఆలోచన కథలు, నవలల గురించిన ఒకో వ్యాసం చదువుతూంటే బలపడుతుంది. ముఖ్యంగా ‘సైన్స్ ఫిక్షన్’ కథల గురించి ప్రస్తావిస్తూ, సైన్స్ ఫిక్షన్ కథలను ఉద్యమంలా రాస్తున్న డా. చిత్తర్వు మధు పేరు ప్రస్తావించకపోవటం ఈ ఆలోచనను బలపరుస్తుంది.  ఇతరుల రచనలలో ఏదో ఓ లోపం ఎంచిన రచయిత, తాను రచించిన కథా నేపథ్యం గురించిన వ్యాసంలో “శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తర్వాత తెలుగు రచయితలు నాటకీయ శిల్పం గురించి మర్చిపోయారు. అందుకే, ప్రత్యేకించి నేను ఎంచుకొన్న వస్తువుకు నప్పినట్టుగా ఉంటుందని ఈ శిల్పం ప్రయోగించాను. ‘ముసల్దాని ముల్లె’ కథ ‘ఆహ్వానం’ మాసపత్రికలో ప్రచురితమయ్యాకా, ఒకరిద్దరు రచయితలు తమ కథల్లో నాటకీయ శిల్పాన్ని వాడారు” (పేజీ 107) అనటం రచయిత ‘అహంభావా’న్ని స్పష్టంగా ప్రదర్శించటమే కాదు, నాటకీయ శిల్పాన్ని మరిచిపోవటం ఏమిటన్న ప్రశ్ననీ లేవనెత్తుతుంది. పైగా, ఆ నాటకీయ శిల్పాన్ని – శ్రీపాద తర్వాత తానే ప్రయోగించటం గురించి ఇంకాస్త వివరిస్తే, అహంభావం అనిపించినదే లోతైన అధ్యయనంగా తోచేది. కానీ రచయిత వ్యాస నిడివి పరిమితి వల్ల కాబోలు వివరణ ఇవ్వలేదు.

‘శీలా వీర్రాజు కథల్లో మనస్తత్వ చిత్రణ’ వ్యాసంలో మానసిక శాస్త్రం తప్ప అన్నీ ఉన్నాయి. పాత్రలు ధీర గుణం ప్రదర్శించటం, ఆత్మన్యూనతా భావంతో క్రుంగిపోతాయి వంటి వ్యాఖ్యలు మనస్తత్వ విశ్లేషణ క్రిందకి రావు. Fictional Finalism, denial of reality వంటి పదాల ప్రయోగం మనస్తత్వ చిత్రణను విశ్లేషించటం కాదు.వాటిని సరైన  సందర్భంలో, సరైన రీతిలో ప్రయోగించకపోతే, ఈ పదాల అర్ధాలే చులకన అవుతాయి.   పైగా ఆయా కథలలో ఆయా పాత్రలకు ఈ మానసిక శాస్త్ర పదజాలం నప్పదు. ‘Denial of reality’ అంటే వాస్తవాన్ని ధిక్కరించటం కాదు, వాస్తవాన్ని ఒప్పుకోకపోవటం, వాస్తవాన్ని తిరస్కరించటం. కథలో ప్రధాన పాత్ర తన ఊహలు అవాస్తవం అని గ్రహించాక, ఆ అమ్మాయిని చూడొద్దని నిశ్చయించుకుంటాడు. అంటే నిజంతో రాజీ పడ్డట్టు. అలా కాక, ఆమె వెంటపడి, ఆమెకు మళ్ళీ పెళ్ళయినా ఏమీ కానట్టే ఆమెని ప్రేమిస్తున్నాడని  భ్రమ పడటం denial of reality. అలాగే Fictional Finalism వంటి సిద్ధాంతాలని ‘హ్లాదిని’ కథకు వర్తింపజేయాలనుకోవటం కుదరదు. తన సిద్ధాంతాన్ని ఇలా అన్వయించటం జోసెఫ్ ఆడ్లర్ కూడా ఆమోదించకపోవచ్చు.

అలాగే ‘విచిత్రత్రయం’ కథలో స్నేహితుడి భార్య మోహంలో పడకుండా ఉండేందుకు వేశ్య ఇంట్లో సమయం గడపటం ‘repressive attitude’ క్రిందకు రాదు. Repression అంటే అణచివేత. ఇక్కడ అతను కోరికను అణచివేయలేదు. అతనికి ఆమె మోహంలో పడాలని లేదు. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇది moral psychology క్రిందకు వస్తుంది. Kristiansen and Hotte ఈ విషయమై ఎన్నో పరిశోధనలు చేసి ‘theory of reasoned action’ అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. Value-attitude-behaviour depends on the individual and their moral reasoning. వీళ్ళే value justification hypothesis ను ప్రతిపాదించారు. దాని ప్రకారం ‘individuals justify their intuitive emotions and actions through post-hoc moral reasoning.’ దీన్ని social intuitionist theory అని కూడా అంటారు. స్నేహితుడి భార్య ‘దాహం’ తీర్చ నిరాకరించటం suppression of desire గా భావించటం కుదరదు. అది moral attitude. అది moral psychology క్రిందకు వస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే ఇంకా బోలెడన్ని అంశాలు చర్చించాలి ఉంటుంది. అది ఈ విమర్శ పరిధికి బాహిరం.

‘రంగుటద్దాలు’ లోని నాయికది ‘Icarus complex’ అనటం కూడా పొరపాటు. ఇలా, ఒక్కో వ్యాసాన్ని లోతుగా పరిశీలిస్తూవెళ్తే, బాహ్యాడంబరం, పటాటొపాలతో అదరగోట్టటం కనిపిస్తుంది. ఈ వ్యాసాలు చదువుతూంటే, ఓ ఆంగ్ల సినిమాలోని దృశ్యం  గుర్తుకువస్తుంది. హీరో ముందు కత్తి పట్టుకుని ఓ పాత్ర దూకుతుంది. కత్తితో పలు విన్యాసాలు చేస్తుందా పాత్ర. ప్రేక్షకుడు ఎంత గొప్ప యుద్ధం జరుగుతుందో, హీరో ఈ కష్టం ఎలా గట్టేక్కుతాడో అని ఉత్కంఠతో చూస్తూంటాడు. హీరొ కూల్ గా జేబులోంచి తుపాకీ తీసి, ఆ కత్తి విన్యాసాల వీరుడిని కాలుస్తాడు.

ఈ సంకలనంలో పఠనీయతతో పాటు, విభిన్నమైన అంశాలను ప్రస్తావించిన వ్యాసాలు – ‘ఆధునిక సాహిత్య ప్రక్రియగా కథ – సంవిధాన, ఉపాంగాల పరిచయం’, ‘చిత్రకన్ను లో కథలు – ఒక పరిశీలన’ ‘మెలకువలో కనే కల’, ‘సాహిత్యం – వస్తు, శైలి, శిల్పాల పరిశీలన’ వంటి వ్యాసాలలోనూ రచయిత చెప్పిన అంశాలతో ఏకీభవించపోయినా, రచయిత తెలుగు రచనల ఉదాహరణలను అరుదుగా ఇస్తున్న అంశాన్ని విస్మరించినా, వ్యాసాలు ఆంగ్ల వ్యాసాల వాసనలు కొడుతున్నా,  రచయిత లోతైన అధ్యయనం, కథ గురించి చెప్పాలన్న తపన, తపనలోని నిజాయితీ వంటి విషయాలు రచయిత పట్ల గౌరవం కలిగిస్తాయి. బహుశా విదేశీ సాహిత్యాన్ని అధికంగా అధ్యయనం చేయటం వల్ల, అలాంటి సాహిత్య సృజన తెలుగులో కనబడకపోవటం వల్ల, కొత్తగా రాస్తున్నవారూ మూసధోరణిలో పోతూండటం వల్ల కలుగుతున్న ‘అసహనం’ పాలు అధికం కావటం వల్ల వ్యాసాల ధోరణి అహంకారపూరితం, పాండిత్య ప్రదర్శనల్లా అనిపిస్తుందేమో అన్న ఆలోచన కలుగుతుంది ఈ వ్యాసాలు చదువుతుంటే. తన లోని పాండిత్యాన్నీ, ఆలోచనలను నియంత్రించి సరైన మార్గంలో ప్రయాణింపచేసే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు రచయిత అనిపిస్తుంది.

‘మ్యాజిక్ రియలిజం అంటే నిజంగా ఏమిటి?’ అన్న 18 పేజీల వ్యాసంలో 6వ పేజీ మాత్రమే తెలుగు మ్యాజిక్ రియలిజం కథకులకు కేటాయించటం ఒక విషాదం అయితే, మునిపల్లె రాజు, గోపిని కరుణాకర్, డా. కేశవ రెడ్డి, డా. వి. చంద్రశేఖర రావు వంటి వారు మాత్రమే తెలుగులో మ్యాజిక్ రియలిజం రాసినవాళ్ళుగా ప్రస్తావించటం వ్యాస రచయిత స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రదర్శించటం లేదనిపిస్తుంది. గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనుక్కున్నా అతని కన్నా ముందునుంచే గురుత్వాకర్షణ శక్తి విశ్వంలో ఉన్నట్టు,  మ్యాజిక్ రియలిజం అన్న పదం ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో ఆంగ్ల సాహిత్యంలో వాడినా, తొలి తరం తెలుగు రచయితలు తమ రచనల్లో మ్యాజిక్ రియలిజం నిర్వచనంలో ఒదిగే రచనా  ప్రక్రియను వాడేరు. ఇందుకు ప్రధాన దృష్టాంతం విశ్వనాథ పలు రచనలు. అయితే, తెలుగు సాహిత్య విమర్శకుల హ్రస్వదృష్టి మునిపల్లె రాజు తరం కన్నా ముందు ప్రసరించకపోవటంతో, విదేశీ విమర్శకుల మాటలే  సంపూర్ణ సత్యాలని భావిసస్తూండటం వల్ల  ఈ ప్రక్రియను పాత తరం రచయితలు వాడినట్టు వీరి గ్రహింపుకు రాలేదు. వచ్చినా, దాన్ని ఒప్పుకునేందుకు సిధ్ధంగా లేరు. దీన్నే  denial అంటారు.   బహుశా, పాశ్చాత్య సాహిత్యాన్ని పరిశీలించినంత లోతుగా వ్యాసకర్త తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయలేదేమో! ఈయన దృష్టి సాహిత్య మాఫియా ముఠాల రంగుటద్దాలు చూపినంత మేరకు మాత్రమే  పరిమితమైందని అనిపిస్తుంది ఈ సంపుటి లోని విమర్శ వ్యాసాలు పరిశీలిస్తుంటే!

ఈ సంపుటిలో తీవ్రమైన నిరాశ కలిగించి – రచయిత తనకు ఏమి తోస్తే అది పేజీల కొద్దీ రాసేయటం తప్ప తాను రాస్తున్న అసలు విషయాన్ని మరిచిపోయారేమో అన్న భావన కలిగిస్తుంది – ‘సైన్స్ ఫిక్షన్ అంటే నిజంగా ఏమిటి?’ అన్న వ్యాసం. నిజానికి రచయిత తెలుగు సైన్స్ ఫిక్షన్ వైపు దృష్టి సారించలేదనిపిస్తుంది. ‘తెలుగులో సైన్స్ ఫిక్షన్’ అన్న డా. ఎన్. సుధాకర్ నాయుడు సిద్ధాంత గ్రంథం వ్యాస రచయిత ఒకసారి పరిశీలించవలసి ఉంటుంది. ఇందులో ‘సైన్స్ ఫిక్షన్ నిర్వచనం – లక్షణాలు – వర్గీకరణ’ అన్న అధ్యాయాన్ని చదివితే ఈ సంపుటిలోని  వ్యాసం ఎంత వ్యర్థమో అర్థమవుతుంది. సైన్స్ ఫిక్షన్‌కు ఒక్క నిర్వచనం ఇచ్చేసి, సినిమాలుగా వచ్చిన కొన్ని నవలల పేర్లు చెప్పి, వాటి గురించి, ఓ నాటకం గురించి చెప్తే అది నిజంగా సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటో చెప్పినట్టు కాదు. “ఈ genre తెలుగు పాఠకులకు బాగా పరిచయమైనది కాదు. ఆస్వాదనీయమైనది కాదు అని కొందరి అభిప్రాయం” అనేసి విదేశీ సైఫి రచనలు చెప్పటం, తెలుగు పాఠకులకు సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటో నిజంగా తెలపటం కాదు. ఇది సాహిత్య వ్యాసాల సంపుటి కాబట్టి ఇంగ్లీషులోనైనా క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ రచనల ప్రస్తావన ఉంటే బాగుండేది. ఇలాంటి వ్యాసాలు చదివినప్పుడే రచయితకు నిజంగా లోతైన అధయ్యనం ఉందా లేక name dropping చేస్తున్నారా? అనిపిస్తుంది. ఈ వ్యాసంలో అసలైన సైన్స్ ఫిక్షన్ రచనలను అధికంగా ప్రస్తావించే బదులు, నాటకాలు, ఫాంటసీ రచనలను ప్రస్తావిస్తూ కారెల్ కాపెక్ నాటకాన్ని విపులంగా చర్చించటం అర్థరహితం. వ్యాసం పేరుకీ, వ్యాసంలోని అంశానికీ పొంతన కుదరదు. తెలుగులో సైన్స్ ఫిక్షన్ గురించి పాఠకులకే కాదు విమర్శకులకూ అవగాహన అణుమాత్రమైనా లేదని ఈ వ్యాసం నిరూపిస్తుంది. కనీసం కొన్ని తెలుగు సైన్స్ ఫిక్షన్ రచనల  ఉదాహరణలిచ్చినా వ్యాసం విలువ పెరిగేది.  తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాస్తున్న రచయితలకు ఉత్సాహం కలిగేది. పాఠకులకు కూడా తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు వస్తున్నాయని తెలిసేది. ఆంగ్లంలో క్లాసిక్స్ గా పరిగణనకు గురయి మార్గదర్శనం చేసిన రచనలను ప్రస్తావించినా, పాఠకులకు, సైన్స్ ఫిక్షన్ పై ఆసక్తి కల రచయితలకు పఠనీయ యోగ్యమైన రచనలను పరిచయం చేసినట్టయ్యేది.

ఇక ఈ పుస్తకంలో వున్న కొన్ని ఆంగ్ల రచనలను ఈ వ్యాసం స్పృశించటంలేదు. దీనికి కారణం, ఇప్పటికే ఈ విమర్శ నిడివి పెరిగిపోతోంది. ఈ వ్యాసాలు కూడా తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలలాగే దిశలేని దిక్చక్రంలాగా అనిపిస్తాయి.  వ్యాస రచనలో ఒక పద్ధతి ప్రణాళిక లేక, ప్రవహించే నీరు భౌగోళిక పరిస్థితులననుసరించి మార్గాన్ని వెతుకున్నట్టు ఎటు వీలుంటే అటు దశ దిశ లేకుండా పరుగులిడతాయి. సార్త్రె ఎక్జిస్టెన్శియలిజం వివరణతో ఆరంభమయిన వ్యాసం 1984  లాంటి  డిస్టొపియన్  ఫిక్షన్, రైట్ వింగ్ అథారిటేరియనిజం కు ప్రతీకగా భావించే ఫారన్ హీట్  451  ప్రస్తావనతో ముగుస్తుంది. ఇలాంటి రచనా పద్ధతిని ఆంగ్లంలో  aimlessly meandering style of writing  అంటారు.  వీటి గురించి మరెప్పుడయినా సందర్భం లభించినప్పుడు చర్చించుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు వ్యాసాలకు పరిమితమవటం ఉత్తమం.

మొత్తానికి ‘దిక్చక్రం’ లోని సాహిత్య వ్యాసాలు చదువుతుంటే – ఒక విషయం గురించి అవగాహన ఉండవచ్చు, పాండిత్యం ఉండవచ్చు, కానీ విమర్శ రచనలో ప్రణాళిక లేకపోతే, చెప్పవలసిన అంశం గురించి సూటిగా చెప్పలేకపోతే కేవలం పాండిత్య ప్రదర్శన, అప్రస్తుత విషయాల ప్రస్తావన నడుమ అసలు విషయం మరుగున పడిపోతుందన్న ఆలోచన బలంగా కలుగుతుంది. అవసరమైనంత వరకే వ్యాసాన్ని రచించే స్పష్టత, నియంత్రణలు లేకపోతే, వ్యాసాలు ఎలా ఉంటాయంటే దిశలేని  ‘దిక్చక్రం’లో వ్యాసాలలా ఉంటాయని చెప్పవచ్చు. అలాగని ఇందులో వ్యాసాలు నాణ్యమైనవి కావని కాదు. కానీ నక్షత్రాలను మబ్బులు కమ్మేసినట్టు అనవసరమైన అంశాలు, నిడివి వంటివి అసలు విషయాన్ని మరుగున పరుస్తాయి.

‘కళ’కు ‘విమర్శ’ జగతికి ప్రకాశం వంటిది. విమర్శ – ప్రకాశం విడదీయరాని సంబంధం కలవి. ప్రకాశింప చేయని విమర్శ విమర్శ కాదు. జగతి ఉన్నా ప్రకాశం లేనిదే ఎలా కంటికి కనబడదో, అలా విమర్శ లేని రచన, ఉన్నా లేనట్టే. తెలుగు సాహిత్యంలో ఎన్నో మంచి రచనలు, చక్కని రచయితలు చీకటిలో ఉండిపోవటానికి ప్రధాన కారణం వారు పలు సాహిత్యేతర కారణాల వల్ల విమర్శకుల దృక్పథంలోకి రావపోవటమే. దానితో ఒక రచనలోని సూక్ష్మాంశాలను , రచనలోని సౌందర్యాన్ని, రచన ప్రాణాన్ని పాఠకుడికి వివరించేవారు లేక ఆయా రచనలు, రచయితలు విస్మృతి లోకి పడుతున్నారు. కాబట్టి విమర్శ అన్నది ఎంతో బాధ్యతాయుతమైన సాహిత్య ప్రక్రియ. విమర్శ ఒక శాస్త్రం. విమర్శ ఒక కళ. కానీ సహృదయ విమర్శకులు లేని లోటు తెలుగు సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. ‘దిక్చక్రం’ పుస్తకం ఆ లోటుని  మరింత స్పష్టంగా చూపించటమే కాదు, ఎంతో లోతైన అధ్యయనం, పాండిత్యం ఉన్న విమర్శకుడు కూడా – వ్యాసకర్త వివరించినట్టే ఒక అస్వాభావిక మానసిక స్థితికి లోనై inhibitions తో ఇమేజీకి తగ్గట్టు వ్యవహరించాల్సిన temptationకు అనివార్యంగా లోనై (పేజీ 61) విమర్శించటం కనిపించి తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది.  ఎలాగయితే తెలుగులో కథకులకు కథా రచనలో శిక్షణనిస్తునారో అలాగే రచనలను అధ్యయనం చేయటం, అర్ధం చేసుకుని విమర్శించటంలోనూ శిక్షణ అవసరం అని ఈ పుస్తకం నిరూపిస్తుంది.

***

దిక్చక్రం (సాహిత్య వ్యాసాలు),
రచన : ఆడెపు లక్ష్మీపతి
పేజీలు: 426
వెల: ₹ 300/-
ప్రచురణ : ఆదిత్య (లిటరరీ) పబ్లికేషన్స్, హైదరాబాద్,
ప్రతులకు: ఏ. రామలక్ష్మి, 9701227207
నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్, 9000 413 413
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/dikchakram-sahitya-vyasalu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here