యాద్గిర్ – మంత్రాలయం – హంపీ యాత్ర-1

1
4

[ఇటీవల యాద్గిర్, మంత్రాలయం, హంపి దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]ఒ[/dropcap]క సాహితీ మిత్రుడు, కర్నాటక రాష్ట్రంలోని యాద్గిర్ పట్టణంలో ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి, నన్నూ రమ్మని పిలిచాడు. చాలా సంతోషించాను. అది జిల్లా కేంద్రం. మన తెలంగాణకు సరిహద్దులోనే ఉంది. అక్కడ తెలుగు వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా సాహితీ సంస్థ అంటూ లేదు గాని, సాహిత్య ప్రియులు కలిసి ముచ్చటించుకుంటారు. ఆ మిత్రుని పేరు దివాకర్. అతడు ఎల్.ఐ.సిలో పని చేసి రిటైరయ్యాడు, జోనల్ మేనేజర్ హోదాలో. యాద్గిర్ లోని ఎల్.ఐ.సి. వారి గెస్ట్ హౌస్‌లో మాకు బస ఏర్పాటు చేశారు.

హైదరాబాదు నుంచి యాద్గిర్ 220 కి.మీ. ఉంటుంది. టి.ఎస్.ఆర్.టి.సి, కె.యస్.ఆర్.టి.సి బస్సులు కూడా ఉన్నాయి. కాని, నిజామాబాద్ నుంచి, తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, సాయంత్రం 5.20 నిముషాలకు సికింద్రాబాదులో ఎక్కితే, రాత్రి తొమ్మిదింబావుకు యాద్గిర్ చేరుకోవచ్చునని మిత్రుడు తెలిపాడు.

మా అబ్బాయి ప్రహ్లాద్, స్లీపర్ క్లాస్‍లో నాకు బెర్త్ బుక్ చేశాడు తత్కాల్‌లో! మా వాడు నా సాహిత్యాన్ని అంత పట్టించుకోడు గాని, నా టూర్లన్నిటినీ జాగ్రత్తగా ప్లాన్ చేసి, రిజర్వేషన్లు, రూములు అవీ బుక్ చేస్తుంటాడు. నాన్న ఈ వయసులో ఎటువంటి అసౌకర్యానికీ గురికాకూడదని! మంచోడే కదండీ, మావాడు!

రైలు సకాలానికే వచ్చింది. ఖాళీగా ఉంది. చాలా మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్, రిజర్వేషన్ కంపార్టుమెంట్లల్లో హాయిగా కూర్చున్నారు. బేగంపేట, సనత్‍నగర్, లింగంపల్లిలలో జనం బాగా ఎక్కారు. అప్ అండ్ డౌన్ చేసే వారంతా వికారాబాద్, తాండూరులలో దిగిపోయారు. ఈ ‘అప్ అండ్ డౌన్’ అనే ప్రయోగం రైల్వే వాళ్లదనుకుంటా. ఇటు వైపు వెళ్లే రైళ్లను అప్ ట్రయిన్లనీ, అటు వైపు వెళ్లే ట్రయిన్లను డౌన్ ట్రెయిన్లనీ అంటారు. రోజూ ఉద్యోగాలు, చదువుల కోసం తిరిగే వారిని అలా అంటారు. మంచిదే! కాని, ఆంగ్ల భాషాపరంగా చూస్తే, అప్ అండ్ డవున్ చేయడమంటే ‘తలకిందులు చేయడం’!

మరి రోజూ తిరిగే వాళ్లను ఏమనాలి? ‘ప్లయింగ్ బిట్విన్ తాండూర్ అండ్ బేగంపేట’ అనాలి. కొన్ని ప్రయోగాలు ఎలా ముందు ఎస్టాబ్లిష్ అవుతాయో, అలాగే ఉండిపోతాయి. ఎంతైనా, పూర్వాశ్రమంలో ఇంగ్లీష్ లెక్చరర్‌ను కదండీ! అందుకే ఈ అనవసర ప్రసంగం!

రేల్ యాత్రీ యాప్‌లో చూస్తే, నల్వార్ అనే స్టేషన్ తరువాత స్టాపే యాద్గిర్. తెలంగాణలో చివరి స్టేషన్ నవాంగి. ఆ రైలు (రాయలసీమ ఎక్స్‌ప్రెస్), మంత్రాలయం, అదోని, గుంతకల్, కడప మీదుగా తిరుపతి చేరుకుంటుంది. కర్నాటకలో చివరి స్టేషన్ రాయచూర్. మన హైదరాబాద్ నుండి తిరుపతికి చుట్టూ తిరిగి వెళ్లే రైలు ఇదొక్కటే. ఏ రైలుకూ దొరకకపోతే, ‘రాయలసీమ’ చివరి ఆప్షన్. ఇలా ‘round about’ గా వెళ్లడాన్ని మా నాన్నగారు బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారు “ఏమిటిరా, అసావాదిత్యోబ్రహ్మ అయింది ప్రయాణం!” అనేవారు. సంధ్యావందనంలో, ప్రాణాయామం చేసేటపుడు, అనామిక, అంగుష్టములతో (ఉంగరపు, బొటనవేళ్లు) ముక్కు చివర పట్టుకోవడానికి, తల వెనుక నుంచి చేతిని తెచ్చి పట్టుకుంటారు. డైరెక్టుగా ముందు నుంచి పట్టుకోకుండా! అప్పుడు ‘అసావాదిత్యో బ్రహ్మ’ అంటారు. తర్వాత ఆచమనం చేసి కేశవనామాలు ప్రారంభిస్తారు.

వికారాబాద్ దాటిం తర్వాత ‘భేల్’ వాడొచ్చాడు. బొరుగులు (మరమరాలు), సన్న కారప్పూస, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పల్లీలు, కారం, ఉప్పు, టమోటాముక్కలు వేసి కలిపి, ఒక శంఖాకారపు కాగితం పొట్లంలో ఇచ్చాడు. తినడానికి వీలుగా తాటాకు ముక్క. అది స్పూన్ అన్నమాట. ‘భేల్’ రుచి బ్రహ్మాండం! నిమ్మకాయరసం కూడా పిండి ఇవ్వడంతో, అది సుసంపన్నమయింది! మొదలయిందిరా తిండిగోల! అనుకుంటున్నారు కదూ! తప్పదండి! నా యాత్రా సాహిత్యంలో ‘తిండి’ కూడ దండిగా పాత్ర పోషిస్తుంది. అలా అంటారు గాని, ‘భేల్’ వర్ణన చదువుతుంటే మీ నోట్లో నీళ్లు ఊరే ఉంటాయి!

రైలు పావుగంట ఆలస్యంగా యాద్గిర్ చేరింది. మా దివాకర్, ఇంకో ఆయన స్టేషన్‌కు వచ్చి, నన్ను ఆదరంగా రిసీవ్ చేసుకుని, కారులో ఎల్.ఐ.సి. గెస్ట్ హౌస్‌కు తీసుకువెళ్లారు. ఎల్.ఐ.సి ఆఫీసు ఆవరణలోనే, స్టాఫ్ క్వార్టర్స్, రెండు అతిథి గృహాలున్నాయి.

వాతావరణం చల్లగా హాయిగా ఉంది. ఆవరణంతా పెద్ద పెద్ద టేకు, నీలగిరి వృక్షాలున్నాయి. లాన్ ఉంది. కాని దోమలు లేవు. “మక్షికాః సర్వవ్యాపినః” అని కదా అంటారు! కానీ అది ఆక్కడ “నడుస్తలేదు”!

డిన్నర్ వచ్చింది. మృదువైన జొన్నరొట్టె, అలచంద(బొబ్బర్లు) గుగ్గిళ్ల కుర్మా, కొంచెం పెరుగన్నం. అంతే! కర్నాటకలో జొన్న రొట్టెలు బాగుంటాయి.

***

మర్నాడు ఉదయం పది గంటలకు దివాకర్ గారింటి డాబాపైన సమావేశం. ఒక పదిహేను మంది వచ్చారు. ఎక్కువ మంది రిటైరీలే. కొందరు నడివయస్సు వారూ. ఇద్దరు మహిళలు, ఉన్నారు! విశేషమేమిటంటే వారిలో చాలా మందికి ‘సంచిక’ ద్వారా నేను తెలుసు. ‘సాఫల్యం’ చదివేవారట. ఆంధ్రప్రభ ఈ-పేపర్‍లో నా కాలమ్ ‘దత్తవాక్కు’ కూడా కొందరు చదువుతారట. అది విని, నా ఛాతీ, మోదీగారంత, సారీ మోదీగారి ఛాతీ అంత అయింది! దీనినే అతిశయోక్తి అలంకారం అంటారు.

ఒక మిత్రుడు, ఆయన స్వస్థలం వరంగల్ అట. దువ్వూరి రామిరెడ్డిగారి కవిత్వం గురించి కాసేపు చెప్పారు. నేను, సరే, నా పెట్ టాపిక్ ఉంది కదా! ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసపరిమళాలు!’ – దాని గురించే అరగంట చెప్పాను. ‘చూయింగ్ గమ్ టాపిక్’ అని చమత్కరిస్తుంటాడు మా మిత్రుడు ఒకాయన. శ్రోతలు మారతారు గదండీ! ఇదే టాపిక్ కావాలని, మోటివేషనల్ స్పీచ్‌కు పిలుస్తుంటారు ప్రొఫెషనల్ కాలేజీల వాళ్లు! ఆ మధ్య శ్వేత (SVETA) అని, టి.టి.డి వారి శిక్షణా సంస్థ వారు పిలిస్తే, దీని గురించే చెప్పాను. ప్రస్తుతం మన ‘సంచిక’ మాస పత్రికలో అది ధారావాహికంగా వస్తూంది. దాని వెనుక ఉన్న స్ఫూర్తి నా సోదరుడు కస్తూరి మురళీకృష్ణగారే!

***

మర్నాడు ఉదయం దివాకర్ గారి కారులో యాద్గిర్ చుట్టు పక్కల ఉన్న యాత్రా స్థలాలను చూడడానికి బయలుదేరాము. నేను, దివాకర్, డ్రైయివర్ పేరు బసవరాజ్. కన్నడిగుడే కాని, తెలుగు చక్కగా మాట్లాడతాడు.

మొదట, యాద్గిర్ నుంచి 35 కి.మీ. దూరంలో ఉన్న శ్రీ గవి సిద్ధేశ్వర స్వామి క్షేత్రానికి బయలుదేరాము. మా రాయలసీమలో ప్రసిద్ధ టిఫిన్ ఉగ్గాని, బజ్జీ అక్కడంతా దొరుకుతూంది. కర్నూలు జిల్లా వాడిని కదా, ఆ పేరు వినగానే నా జిహ్వ లేచొచ్చింది. దానికి సూపర్ కాంబినేషన్ మిర్చి బజ్జి. యాద్గిర్ పొలిమేరలలోని ఒక చిన్న టిఫిన్ సెంటర్‌లో ఉగ్గాని, బజ్జీలు తిన్నాము.

క్షేత్రం చేరుకోడానికి దట్టమైన అడవిలో ప్రయాణించాలి. దానిని గురుమాట్కార్ ఫారెస్ట్ అంటారట. చుట్టూ పచ్చని కొండలు, ఎత్తైన చెట్లు. దేవస్థానం మొదటే పెద్ద, నల్లరాతితో చెక్కిన నందీశ్వరుడు దర్శనమిచ్చాడు! నల్లగా నిగనిగలాడుతూన్నాడు. ఆ కళ్లలో జీవకళ ఉట్టి పడుతూంది. ఆయన వద్ద ఫోటోలు దిగాము.

అక్కడి నుంచి, ఒక 400 మీటర్లు ఒక గ్రిల్డ్ దారిలో నడిచాము. రెండు వైపులా ఏదో సెలయేరు పారుతూ ఉంది. నీరు స్వచ్ఛంగా ఉంది. రంగు రంగుల చేపలు అందులో ఈదుతున్నాయి. స్వామి వారు శివుడే! ఒక గుహలో ఉంటుందట లింగం! ‘గవి’ అంటే కన్నడలో గుహ అని అర్ధమట. ఉంటుందట ఏమిటి? అనుకుంటున్నారా? గుహ లోపలకికి వెళ్లలేము! ఎందుకంటే, గుహ ముందు భాగంలోనే ఒక పెద్ద జలపాతం, గుహ ముఖద్వారాని కడ్డుగా, దూకుతూంది. బట్టలు విప్పేసి, కేవలం అండర్‌వేర్‌తో ఆ నీటి తాకిడిని తట్టుకుని కొందరు వెళుతున్నారు. మాకంత ‘సీన్’(?) లేదు కదా! ఎండాకాలంలో మటుకు, జలధార బాగా నీరసించి, స్వామివారి దర్శనం అవుతుందట. జలపాతానికి ఇవతల పురాతన శివపార్వతుల రాతి విగ్రహాలున్నాయి. వినాయకుడు కూడా! స్వామికి అక్కడే నమస్కరించుకొని వెనుతిరిగాం.

బయట ఆవరణలో, స్వామివారి రథోత్సవాని కోసం నిర్మించిన పెద్ద రథం ఉంది. దాని చక్రాలు రాతివి. దాని నిర్మాణానికంతా తెల్లరంగు వేయిడంవల్ల అది వెండి రథంలా ఎండలో మెరిసిపోతోంది! దాదాపు 40, 50 అడుగుల ఎత్తుందా స్యందనం!

అక్కడ నుంచి మా ప్రయాణం, గురుమాట్కారు అడవుల్లోని ‘ధవే ధవే’ జలపాతానికి సాగింది. దారిలో దివాకర్ చెప్పారు. “స్వామి వారు కనబడరు గాని, అత్యంత మహిమాన్వితులు. గవి మఠ సంప్రదాయం దాదాపు ఎనిమిది శతాబ్దాల నుంచి వస్తూన్నది, అనూచానంగా లింగాయత మఠాలలో ఇది అత్యంత ప్రధానం. స్వామి వారి పేరిట ‘శ్రీగవి సిద్ధేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొప్పల్’, ‘శ్రీ గవి సిద్ధేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ వంటి సంస్థలున్నాయి. గవి మఠపీఠాదిపతి, గురుపరంపరలో పదకొండవ వారు. ఆయన అసలు పేరు ‘గుడదయ్య’ ఆయన పశువుల కాపరిగా ఉంటూ సిద్ధేశ్వర స్వామి అనుగ్రహంతో సిద్ధి పొందారు.”

నేను మనసులోనే ఆ యోగిపుంగవునికి ప్రణమిల్లాను.

జలపాతం ఎక్కడో కొండల్లో ఉంది. కారు దిగి కొండదారిలో ఇరవై నిమిషాలు నడిచాము. డ్రైవర్ బసవరాజ్‍కు ఈ ప్రాంతాలన్నీ కొట్టిన పిండిలా ఉన్నాయి. కొండ దారి ఏటవాలుగా ఉన్నా, పాదాలకు గ్రిప్ లేదు. బండరాళ్ల మీదగా ఎక్కసాగాము.

‘ఈ వయసులో ఇదంతా అవసరమా?’ అనిపించింది నాకు. కానీ వెంటనే ఆల్‌ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ వ్రాసిన Ulysses (యులిసెస్) పద్యం గుర్తొచ్చింది నాకు. ఆయన అందులో ఇలా అంటారు.

“Old age hath its own honour and toil.”

“Death closes all! but something ere the end!”

“To find, to strive, to seek, yet not to yield.”

వృద్ధులమని ఈసురోమని ఉండకండని చెప్పాడు మహానుభావుడు! వృద్ధాప్యానికి దాని గౌరవం, దాని శ్రమ, దానికున్నాయాట! ఆ మాటలు గుర్తొచ్చి, నాకు ఉత్సాహం వచ్చింది! బసవరాజ్ మాకు మార్గదర్శి.

కొండల వెనక నుంచి, లోయల మీదుగా జలపాతం వచ్చి దూకుతూంది. కాని, దాని దగ్గరికి వెళ్లలేం. దూరం నుంచి చూశాము. దాని హోరు కొండల్లో ప్రతిధ్వనిస్తూంది. మెల్లగా కొండ దిగాము. బసవరాజ్ అన్నాడు.

“సార్, జాగ్రత్తగా దిగాల. ఎక్కడం కంటే దిగడం సులభం అనిపిస్తాది. కాని ఇదే కష్టము. బూమాత మనల్ను కిందికి లాగుతాది.”

“నిజమే!”

జలపాతం నుంచి వచ్చే నీటిని, ఒక చోట, ఒక అక్విడక్ట్ కట్టి క్రింద పొలాలకు మళ్లిస్తున్నారు. అక్విడక్ట్ మీదుగా నీరు పొంగి పొరలుతూంది. దానిని ఆనుకొని చిన్న కాలి బాట. అది రెండడగుల వెడల్పు కూడ లేదు. దాని మీదుగా వెళితే కారు దగ్గరకి వేగంగా చేరుకోవచ్చునట. మా దివాకర్ దాని మీదుగా చక చక నడిచాడు కాని నాకెందుకో భయం వేంసింది! దారికిటు వైపు ఇరవై అడుగులలోతు నీటి ప్రవాహం, అటు వైపు ఒక అగాధం. వెడల్పు తగినంత ఉన్నా, నా కెందుకో కళ్లు తిరుగుతున్నట్లు అనిపించింది. బసవరాజ్ అది గ్రహించి, వెనక్కు వచ్చి “నా భుజాల మీద చేతులు వేసి మెల్లగా రండి సార్. పక్కలకు చూడకండి” అని, జాగ్రత్తగా తీసుకువెళ్లాడు. అంతా చేసి ఆ దారి 50 మీటర్లు కూడా పొడవు లేదు.

నా భయాన్ని చూసి మిత్రుడు దివాకర్ నవ్వాడు. “మిత్రమా! దీనికే ఇలా అయితే, ఏ ఆధారమూ లేకుండా, తాడు మీదనడిచే వారి సంగతేమిటి? దారి మనం నడవడానికి తగినంత వెడల్పు ఉంది కదా!”

అక్కడ నుంచి బయలుదేరాము. అక్కడంతా ఘాట్ రోడ్డు. ఒక మలుపు వద్ద కారు ఆపాడు బసవరాజ్. అక్కడ నాలుగుడుగుల ఎత్తున్న సరిహద్దు గోడ ఉంది. దాన్ని ‘వ్యూ పాయింట్’ అంటారు. అక్కడ నిలబడి చూస్తే, దూరంగా కొండల మధ్య దూకుతున్న జలపాతం దర్శనం ఇచ్చింది. జూమ్ చేసి దాన్ని వీడియో తీశాము.

మా తరువాతి మజిలీ శ్రీ లక్ష్మీ తిమ్మప్ప దేవస్థానం, బోరబండ. మనకు హైద్రాబాద్‌లో కూడ ఒక బోరబండ ఉంది కదా! దాదాపు పది కిలోమీటర్లుంది ఆ చోటు. తిమ్మప్ప అంటే వెంకటేశ్వరస్వామి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. మా కర్నూలు జిల్లాలో తిమ్మప్ప అంటే ఆంజనేయస్వామి. తిమ్మన్న అంటారు. తిమ్మరాజు, తిమ్మయ్య, తిమ్మమ్మ అనే పేర్లు పెట్టుకుంటారు. ఇది గురుగు మట్కల్ తాలూకాలో, బోరబండ అనే గ్రామంలో కొండ మీద ఉంది. దేవాలయాన్ని ‘సుక్షేత్ర’ అని అంటారు.

దేవాలయం వరకు చిన్న ఘాట్ రోడ్ ఉంది. దేవాలయం చాలా పెద్దది. పక్కన పెద్ద ఉద్యానవనం పెంచారు. ఒక చేదబావి ఉంది. లక్ష్మీసమేత తిమ్మప్పస్వామి వారు గర్భగృహంలో వేంచేసి ఉన్నారు. దివ్యమంగళ విగ్రహుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఐన శ్రీనివాసుడు ఎక్కడ ఉన్నా ఆయనకు వైభోగమే!

‘కల్యాణాద్భుతగాత్రాయ..’ శ్లోకం రాగయుక్తంగా పాడాను. తీర్థం తీసుకుని, శఠగోప స్పర్శ శిరస్సుకు చేయించుకున్నాము. దేవాలయం లోపలి భాగం అందమైన స్తంభాలు, కళాత్మకమైన పైకప్పుతో శోభాయమానంగా ఉంది. చుట్టూ గోడల మద పెయింట్‌తో రామ, కృష్ణ, లీలలను కుడ్య చిత్రాలు వేశారు.

కారు పార్కింగ్‌కు వెళుతూంటే, బసవరాజ్ అన్నాడు “సార్, ఇటు వైపు రండి. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది.”

అక్కడ ఎత్తైన ప్రదేశంలో రెయిలింగ్స్ అమర్చిన వ్యూ పాయింట్ ఉంది. అక్కడ నుంచి చూస్తే మనసు పులకరించింది. కనుచూపు మేర పచ్చని కొండలు, విశాలమైన మైదానాలు కనువిందు చేశాయి. ఆ ప్రకృతి శోభమాకేదో సందేశం ఇస్తున్నట్లనిపించింది.

 

“Let Nature be your teacher” అని అన్నారు కదా విలియం వర్డ్స్‌వర్త్ గారు!

అక్కడ నుంచి వస్తూంటే, అడవి తగ్గిపోయి, ప్రత్తి, మొక్కజొన్న, అరట తోటలు కనిపించాయి. ఎండ లేదు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఒక చోట పాక హోటల్లో టీ తాగాము. బెల్లం టీ అట. చాలా బాగుంది.

“దివాకర్, డయాబెటిక్స్‌కి, చెక్కెర కంటే బెల్లం మంచిదట కదా?” అన్నాను టీ తాగుతూ.

“దొందూ దొందే!” అన్నాడాయన నవ్వి. “ఏ రాయైతేనేమి తల పగలగొట్టుకోవడానికి!” అన్నాడు పైగా!

యాద్గిరి, జిల్లాలోని గురుమట్కూరు తాలూకాలోనే ‘కళబెళగుండి’ అన్న గ్రామంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బనదేశ్వర స్వామి వారి దేవస్థానం ఉందట. అరగంట ప్రయాణించి అక్కడికి చేరుకున్నాము. స్వామివారి పూర్తి పేరు ‘శ్రీరాయచోటి వీరజయ, కళాబెళగుండి బనదేశ్వర స్వామి వారు’. అమ్మవారు శ్రీ భద్రకాళీదేవి. గుడి చాలా పెద్దది. అక్కడికి కె.యస్.ఆర్.టి.సి బస్సులు కూడ నడుపుతుంది. రెండు మూడు ఎర్ర బస్సులు నిలిచి ఉన్నాయి.

గుడి పై భాగమంతా, విశాలంగా రేకులతో ఇనుప స్తంబాలపై, పైకప్పు ఏర్పాటయి ఉంది. స్వామివారి లింగ స్వరూపుడే! వైరాగ్య శేముషీ సంపన్నుడైన, శివస్వరూపుడిని దర్శించుకొని ధన్యులమయ్యాము. ఆవరణ ఎంత పెద్దదంటే ఒక్క ప్రదక్షిణం చేయాడనికి ఐదు నిమిషాలు పట్టింది. ఒక వైపు విఘ్నేశ్వరుని విగ్రహం, ఇంకో వైపు స్కందుని విగ్రహం, మంటపాలలో వెలసి ఉన్నాయి. ముఖద్వారం, ఇరవై అడుగుల ఎత్తు తలుపులతో చేశారు. వాటి పై ఇత్తడి తొడుగు, మధ్యలో గుబ్బలు. దాని ముందు న్లలరాతి అరుగులు. వాటి మీద సేద తీరాము.

కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో విపరీతమైన భక్తుల రద్దీ అట. శివరాత్రికి జాతర జరుపుతారట. రథోత్సవం జరుగుతుందట.

అప్పుడు టైం మధ్యాహ్నం రెండు కావస్తూంది. జఠరాగ్ని ప్రజ్వరిల్లడం ప్రారంభించింది. కేవలం భక్తి మాత్రమే చాలదు, ప్రసాదం కూడా కావాలి ఈ కళేబరానికి! అదేమిటి కళేబరం అంటే శవం కదా! అనుకుంటున్నారా? అబ్బే కాదండి.

“చందన చర్చిత నీల కళేబర, పీతవసన వనమాలీ!” అని జయదేవుల వారు శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించలేదా? కొన్ని ఎందుకో వ్యతిరేకార్ధాలే ఎస్టాబ్లిష్ అవుతాయి, ‘వాటిక’ అంటూనే మనకు ‘స్మశాన వాటిక’నే గుర్తొస్తుంది. మా వనస్థలిపురంలో ‘ఆగ్రా స్వీట్ హౌస్’ అని రైతు బజారు ఎదురుగా ఉంటుంది. దాని క్రింద తెలుగులో ‘మిఠాయి వాటిక’ అని ఉంటుంది!

బసవరాజ్ చెప్పాడు “సార్, ఇక్కడ స్వామి వారి అన్న ప్రసాదం దొరుకుంది. చాలా బాగుంటుంది”

“అంతకంటే భాగ్యమా?” అన్నాం మేము.

గుడిని ఆనుకునే అన్నదాన సత్రం ఉంది. పురాతన మంటపం లాంటిది. లోపల పురాతన స్తంభాలున్నాయి. ఒక ఎత్తైన నాప బండల మీద ఒకాయన, మూడు పెద్ద డేగిశాలు పెట్టుకుని ఉన్నాడు. వాటి మీద మూతలు.

కుర్చీలు, బల్లలు ఏమీ లేవు. ఆర్.టి.సి సిబ్బంది, మరి కొందరు భక్తులు క్రిందనే కూర్చుని స్వామివారి ప్రసాదం తింటున్నారు.

బయట ఒక పెద్ద ప్లాస్టిక్ టబ్బులో మీడియం సైజు స్టీలు ప్లేట్లున్నాయి. తలా ఒకటి తీసుకున్నాము. పొగలు కక్కుతున్న అన్నం, వంకాయ బంగాళదుంప బటాణీ ముద్ద కూర వేశాడు ప్లేట్లో. అన్నం ఒక గుంటగా చేసుకోమని చెప్పాడు కన్నడలో. దాంట్లో చిక్కని సాంబారు పోశాడు. అంతే!

బయట ఒక చిన్న అరుగు లాంటిది ఉంటే మేమిద్దరం కూర్చుని తినసాగాము. ఆ భోజనం రుచి అమోఘం. ఆ కూర శ్రీకాకుళం జిల్లాలో ఫంక్షన్ లకు తప్పని సరిగా చేస్తారు. 80లలో నేను అక్కడంతా లెక్చరర్‌గా పనిచేశా కదా! నలభై సంవత్సరాల తర్వాత ఆ కూర మళ్లీ జిహ్వకు కమ్మగా విందు చేసింది. ఆ సాంబారు అమృతోపమానం.

“ఎంత బాగుంది కదా మిత్రమా!” అన్నాడు దివాకర్.

పక్కనే నిలబడి తింటున్న బసవరాజ్ అన్నాడు.

“స్వామి వారి ప్రసాదం కదండి!”

నిజమే! ఒకసారి సింహాచలంలో అప్పలాచార్యులు గారని అర్చకులు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది.

“పేరుమాళ్లకు నివేదనం చేసిన తర్వాతనే పులిహోరకు ఈ రుచి వస్తుందండి. మా ఇంట్లో వండితే ఇలా రాదు.”

సింహాచలం వరాహ నరసింహ స్వామి వారి పులిహోర ప్రసాదం తిరుపతి లడ్డూ ప్రసాదమంత రుచికరం అన్నది లోకవిదతం.

ఆవరణలో మహా వృక్షాలున్నాయి. చల్లగా గాలి వీస్తూంది. ప్రకృతి తన ఎ.సి. ఆన్ చేసింది. అది అందరికీ ఉచితమే. అన్న ప్రసాద కేంద్రం నడిపేది లింగాయత్ సమితి, గురుమట్కూరు వారట. తిన్న ప్లేట్లు మనమే పక్కన ఉన్న కొళాయి వద్ద శుభ్రంగా కడిగి పెట్టాలి. ఏమయినా విరాళం ఇద్దామనుకుంటే, రశీదు బుక్కు పెట్టుకుని ఎవరూ కనిపించలేదు.

వడ్డించే ఆయనను అడిగాము. ఆయన నవ్వి కన్నడలో ఏదో చెప్పాడు. ఏమంటున్నడని మా దివాకర్‌ను అడిగితే “అలాంటివి ఏవీ స్వీకరించము” అన్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. హరహర మహదేవ!

పక్కనే ఒక పెద్ద రావి చెట్టు. చుట్టూ నాప బండలతో చెప్టా. దాని ఆకులు గాలికి గలగల శబ్దం చేస్తున్నాయి. వెళ్లి చెప్టా మీద కూర్చున్నాము. నాకు ఆ భోజనం, ఆ గాలికి కళ్లు మూతలు పడుతున్నాయి.

“దివాకర్, మీరు అనుమతిస్తే, ఇక్కడ కాసేపు నడుము వాలుస్తాను” అన్నాను.

“నేను కూడ అదే అనుకుంటున్నాను” అన్నాడాయన నవ్వి.

ఒక ఆరగంట పాటు మాగన్నుగా పడుకుని, భుక్తాయాసం తీర్చుకున్నాం. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు తీసే కునుకు చాలా సుఖంగా ఉంటుంది. దానిని ఇంగ్లీషులో ‘siesta’ అంటారని ఆర్.కె.నారాయణ్ గారి ఒక కథ చదివి తెలుసుకున్నాలెండి!

లేచి కొళాయిల దగ్గర ముఖం కుడుక్కుని, ఫ్రెష్ అయ్యాము. నాకు తల దువ్వుకునే బాధ లేదు. ఈ మధ్యే తిరుపతి వెళ్లి వచ్చాను. స్వామివారికి తలనీలాలు ఇచ్చాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here