బాల పాఠకులు – నా అనుభవాలు

4
4

[హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో బాల పాఠకులతో తన అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

[dropcap]హై[/dropcap]దరాబాద్‌లో బుక్ ఎగ్జిబిషన్ జరిగింది. అంతకు ముందు ఏడాదిలాగానే నేను ఈ మారూ రైటర్స్ టేబుల్ పెట్టాను. అంటే ఎగ్జిబిషన్‌లో ప్రత్యేకించి స్టాల్ పెట్టుకోలేని రచయితలకందరికీ కొంత రుసుము వసూలు చేసి ఒక స్టాల్‌లో ఒక్కొక్కరికి ఒక టేబుల్ చొప్పున ఇచ్చారు. ఆ టేబుల్ మీద వారి పుస్తకాలు ప్రదర్శించి ఎగ్జిబిషన్‌లో అమ్మవచ్చు. నాలాంటి చిన్న రచయితలకి ఇదొక సదుపాయం. పాఠకులు మా పుస్తకాలని ఎంత ఆదరిస్తున్నారో కూడా తెలుస్తుంది. కానీ ఈమారు వీటన్నింటితోబాటు నేను పిల్ల దేవుళ్ళని చాలామందిని చూశాను.

నా పుస్తకాలు తెలుసు కదా. ఆలయాల గురించి వ్రాసిన యాత్రా దీపికలు, బాల సాహిత్యంలో మూడు పుస్తకాలు. కిందటేడాది ఇలాగే టేబుల్ పెడితే చాలామంది మా పిల్లలు తెలుగు చదవలేరు.. ఇంగ్లీషులో లేవా అని అడిగారు. తెలుగు పిల్లలు తెలుగు చదవకపోవటమేమిటని మొదట కోపం వచ్చినా తర్వాత మన సాహిత్యం పిల్లలకి అందాలని మా వాళ్ళనడిగితే మావారు కొన్నీ, మా అమ్మాయి కొన్ని కథలు ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే అదోక పుస్తకం.. ఇవి నాలుగు వున్నాయి టేబుల్ మీద.

ఎగ్జిబిషన్‌కి చాలా స్కూల్స్ వాళ్ళు పిల్లలని తీసుకు వచ్చారు. ఈసారి నాకు కనిపించిన విశేషం చాలామంది తల్లిదండ్రులు తెలుగు పుస్తకాలపట్ల ఆసక్తి చూపించటం, ఇంగ్లీషు వద్దు స్కూల్లో వస్తుంది, తెలుగే కావాలి అని అడగటం, పిల్లలని ఆ పుస్తకం పేరు చదివితే అది కొంటానని ప్రోత్సహించటం. అంతే కాదు వాళ్ళ పిల్లలకి నన్ను చూపించి అమ్మమ్మ, నాన్నమ్మ అని చెబుతూ నాతో ఫోటో తియ్యటం, వాళ్ళూ అలా పిలుస్తూ నాతో చనువుగా వుండటం చూస్తే వీళ్ళకి అమ్మమ్మ, నాన్నమ్మల విలువ తెలుస్తోందని సంబరపడ్డాను.

అలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నించి వచ్చిన ఒక పిల్లాడు పుస్తకం కొనలేదుగానీ నన్ను ఇంటర్వ్యూ చేసినట్లు నా వివరాలన్నీ అడిగాడు. ఎక్కడ వుంటాను, మనవళ్ళు, మనవరాళ్ళు వున్నారా, ఏం చదువుతున్నారు వగైరా. కొత్తవాళ్ళతో వాడు మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది. పిల్లలకి ఇలాంటి అవకాశాలు కల్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది అనిపించింది. ఇంకో పిల్లాడు 4, 5 ఏళ్ళు వుంటాయేమో. చాలా సరదాగా నాతో ఆడాడు కొంచెం సేపు. వాళ్ళమ్మ ఫోటో తీస్తానంటే ధైర్యంగా నా భుజం మీద చెయ్యి వేసి నుంచున్నాడు. ఆ ఫోటో నేను మర్చిపోలేనిది.

వీళ్ళు నన్ను ఆడిస్తే, నేను నీతులు చెప్పిన అమ్మాయిలు కూడా వున్నారు. ఒక స్కూల్ నుంచి పిల్లలంతా వచ్చారు. పుస్తకాలు చూశారు. ఆ కథలు చదవాలని వాళ్ళకి ఆసక్తి. కానీ వారి దగ్గర డబ్బులు లేవు. అలాంటివారి ఆసక్తిని గమనించి నేను వాళ్ళతో వచ్చిన స్కూల్ టీచర్లకి కూడా చెప్పాను. ధర తగ్గించి ఇస్తాను. స్కూల్‌కి రెండు పుస్తకాలు కొనండి, పిల్లలంతా చదువుకుంటారు కదా అని. స్కూల్ వాళ్ళు ఆ ప్రయత్నం ఎందుకు చెయ్యరో తెలియదుగానీ చెయ్యని వారి సంఖ్యే ఎక్కువ.

అలా వచ్చిన వారిలో ఒకమ్మాయి తనతో వచ్చిన పిల్లలు కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ వచ్చింది. “అమ్మమ్మా, ఈ పుస్తకం కావాలి నాకు, ఎంత? అంటూ ‘అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు’ చూపించింది. “100 రూపాయలమ్మా, నువ్వు చదువుకుంటున్న పిల్లవి గనుక ఇంకా తక్కువకి ఇస్తాను” అన్నాను. బేగ్‌లో డబ్బులు చూసుకుంది. వంద నోటు బయటకి తీసి “మా పేరెంట్స్ ఇచ్చారు పుస్తకం కొనుక్కొమ్మని. ఆ పిల్లలు కొనరు. వాళ్ళ దగ్గర డబ్బులుండవు” అంటూ ఆ నోటు నాకిచ్చింది. “పుస్తకం కొని చదవాలనే నీ అభిరుచి నాకు నచ్చిందమ్మా” అంటూ 30 రూపాయలు తిరిగిచ్చాను.

సంతోషంగా ఆ డబ్బూ, పుస్తకం తీసుకుని బేగ్‌లో పెట్టుకుంది. “వాళ్ళకి కూడా తగ్గిస్తారా, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు లేవు” అన్నది. “అలాగే తగ్గిస్తానమ్మా, కావాలంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక పుస్తకం కొనుక్కోండి అప్పుడు కూడా ఈ రేట్‌కే ఇస్తాను.. అందరూ చదవవచ్చు” అన్నాను. సరే అని ముందుకు నాలుగడుగులు వేసి మళ్ళీ వచ్చింది. “నాకీ పుస్తకం కూడా కావాలి, దానికి కూడా ధర తగ్గిస్తారా?” అని అనుమానంగా అడిగింది. “అలాగేనమ్మా. నువ్వు చదువుతావు కదా. చదువుతానంటే తగ్గిస్తాను” అన్నాను. “నా కోసమే. నాకు కథలిష్టం. చదువుతాను” అన్నది. బేగ్ లోంచి డబ్బులు తీస్తూ, “ఇది కూడా తీసుకుంటాను. మూడు చదువుతాను” అని ‘రేపటి తరం సైంటిస్ట్’ కూడా తీసుకుంది.

ఆ అమ్మాయి ఆసక్తికి, దానిని ప్రోత్సహించి పుస్తకం కొనుక్కొమ్మని తనకి కొంచెం డబ్బులిచ్చి పంపిన తల్లిదండ్రులను మెచ్చుకోకుండా వుండలేకపోయాను. “మరి మీ ఫ్రెండ్సంతా కొనుక్కోలేక పోయారు కదా, నీ పుస్తకాలు వాళ్ళకి కూడా ఇస్తావా చదవటానికి?” అంటే ఇస్తానన్నది. “నేనీ కథలు క్లాసులో అందరికీ కూడా చెబుతాను” అన్నది. ఆ కథల రచయిత్రిగా నా జన్మ ధన్యమయిందనుకున్నా. తనకి తెలియకుండానే పిల్లల కోసం ఇంకా మంచి కథలు చాలా రాయాలనే స్ఫూర్తిని నాలో నింపింది ఆ పాప.

ఇంకొక స్కూల్ నుంచి ఇంకొక జట్టు వచ్చారు. అందులో ఇంకొక పాప. 12 ఏళ్ళు వుంటాయేమో. పిల్లలు కదా అని పిల్లల కథల పుస్తకాలు చూపిస్తుంటే ఆ అమ్మాయి నా యాత్రా దీపికలు చూస్తూ ‘మా కాశీ యాత్ర’ తీసుకుంది. “అవి పెద్దవాళ్ళవమ్మా, మీ కథల పుస్తకాలివిగో” అంటే, “నాకిదే కావాలి” అన్నది. “ఏం చేస్తావు, నువ్వు చదువుతావా?” అంటే, “కాదు మా అమ్మకిస్తాను” అన్నది. ఆశ్చర్యమో, ఆనందమో తెలియని అవస్థకి నేను లోనయ్యాను. అంత చిన్న పిల్ల తన కోసం ఏదో కొనుక్కోకుండా తన తల్లికి ‘మా కాశీ యాత్ర’ పుస్తకం కొని ఇవ్వాలనుకున్నదంటే ఆ తల్లి నేర్పిన సంస్కారాన్నీ, ఆ అమ్మాయి ఔన్నత్యాన్నీ మెచ్చుకోకుండా వుండలేకపోయాను. నాకొక్క రూపాయి కూడా లాభం లేకుండా ఆ అమ్మాయికా పుస్తకం ఇచ్చి ఆ పుస్తకాల రచయిత్రిగా చెప్పలేనంత సంతోషాన్ని, తృప్తిని మూటగట్టుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here