[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ద్వంద్వాతీత స్థితికి సాధనా మార్గం’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]ధ్యాత్మిక ఉన్నతికి ద్వంద్వాతీత స్థితికి చేరుకోవడం ఎంతో అవసరం అన్నది శాస్త్ర వాక్యం. ద్వంద్వాతీతుడు అంటే సుఖ ధుఃఖాలకు, కష్ట నష్టాలకు, లాభా లాభాలకు, రోగాలు, మరణాలు వంటి వాటికి చలించని వాడు. ఎంతో తీవ్రమైన అభ్యాసం ద్వారా మాత్రమే సాధకుడు ఈ స్థితికి చేరుకోగలడు.
ఎల్లవేళలా అందు వలన వాడి మనసు పరిశుధ్ధంగా ఉంటుంది. ఆ పరిశుధ్ధ మనసులో లౌకికమైన కోరికలేమీ ఉండవు. పరమాత్మకు కైంకర్యం చేసే వారు ఏ ఇతర ప్రయోజనాలను ఆశించ కుండా పరమాత్మకు కైంకర్యం చేయటమే పరమ ప్రయోజనంగా భావించి కైంకర్యం చేయాలి. దీనినే మనోవాక్కాయ కర్మణ కైంకర్యం అని కూడా అంటారు.
ఈ మార్గం ద్వారా మాత్రమే మన అన్ని కర్మలకు ఉన్నత ఫలితాలు లభిస్తాయి. మనసులో ఇతర కోరికలు తలయెత్తకుండా, నోటితో పరమాత్మ నామం తప్ప మరేదీ పలకకుండా, కరణాలతో పరమాత్మలు సంబంధించిన కార్యములు తప్ప ఇతరములేవీ చేయకుండా ఉండటమే త్రికరణ శుధ్ధి అంటారు.
భగవద్గీతలో కూడా ఇందుకు ఒక మంచి ప్రమాణం వుంది.
శ్లో:
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే
(భగవద్గీత 2వ అధ్యాయం, 15వ శ్లోకం)
“ఓ అర్జునా, జీవితంలో నిత్యం ఎదురయ్యే సుఖ దుఖాలకు కలత నొందక, ఆ రెండింటి యందు కూడా సమదృష్టి వహించి ధీరుడై నిలిచేవాడే మోక్షమునకు అర్హుడు” అని కృష్ణుడు చెప్పడం ఈ శ్లోకం తాత్పర్యం.
భగవానుడు అర్జునుడిని జ్ఞాన-వివక్ష ద్వారా ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నాడు. తద్వారా సకల మావవాళికి కూడా పరోక్షంగా సుఖ దుఖాలు, కష్టనష్టాలనే ద్వంద్వాలకు అతీతం కావాలని ప్రబోధిస్తున్నాడు.
ఆధ్యాత్మికంగానే కాక పారమార్థికంగా కూడా ఉన్నతిని సాధించాలంటే మానవులు ద్వంద్వాతీతులై వుండాలి. ఉన్నత ఆధ్యాత్మిక ప్రాప్తి కోసం ద్వంద్వముల తాకిడిని సహించేందుకు స్థిరమైన మనోనిశ్చలత పాటు భగవంతుని సంపూర్ణ కరుణా కటాక్షాలు అవసరం.
మహాభారతంలో కపిల యుధిష్టిర సంవాదంలో కూడా ద్వంద్వాతీత స్థితి పై ఒక మంచి వ్యాఖ్యానం వుంది. ద్వంద్వాతీతుడు పేరు ప్రతిష్ఠల కొరకు పాకులాడడు. కళ్ళకు కనపడే ప్రకృతిని కనపడని పరమాత్మను సాక్షీభూతంగా చూస్తుంటాడు. అటువంటి వాడు నిజమైన బ్రాహ్మణుడు. అలా కాని వాడు కర్మలు చేస్తూ కర్మలలో మునిగి తేలుతుంటాడు అని కపిలుడు చెప్పాడు.