[సంచిక పాఠకుల కోసం ‘ఇజాజత్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[dropcap]భా[/dropcap]రతీయ చిత్రాల్లో సినిమా బావుండి, పాటలు బావుండి హిట్టవటం సాధారణమే. సినిమా బావుండి, పాటలు బాలేక హిట్టవటం కూడా జరుగుతుంది. సినిమా బాలేక కేవలం పాటల వల్ల హిట్టవటం అప్పుడప్పుడూ జరుగుతుంది. కానీ సినిమా బావుండి, పాటలు బావుండి ఫ్లాపయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి కోవ లోనిదే హిందీ చిత్రం ‘ఇజాజత్’ (1987). గుల్జార్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో మరుగునపడిన చిత్రమిది. ఈ చిత్రంలోని ఒక పాటకి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ‘మేరా కుఛ్ సామాన్’ అనే ఆ పాట రాసిన గుల్జార్‌కి ఉత్తమ గీతరచయితగా, పాడిన ఆశా భోంస్లేకి ఉత్తమ గాయనిగా అవార్డులు వచ్చాయి. కాగితం మీద ఆ పాట చూసి సంగీత దర్శకుడు ఆర్. డి. బర్మన్ “ఇదేం పాట? వార్తాపత్రికలా ఉంది. దీనికి స్వరాలు ఎలా కట్టడం?” అన్నారట గుల్జార్‌తో. అయినా ఎంతో అందంగా స్వరపరిచారు. “కష్టమంతా ఆర్.డి.ది, అవార్డులు మాకు” అన్నారు గుల్జార్. సినిమా కథ సున్నితంగా ఉండటం వల్ల పాటలు కూడా అలా కుదిరాయి. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.
మహేందర్, సుధ ఒకప్పటి భార్యాభర్తలు. ఐదేళ్ళ క్రితం ఇద్దరూ విడిపోయారు. ఒకరోజు అనుకోకుండా ఒక రైలు స్టేషన్ వెయిటింగ్ రూమ్‌లో కలుస్తారు. ఆమె మెడలో నల్లపూసలు, పాపిట్లో బొట్టు ఉంటాయి. రాత్రివేళ. హోరున వర్షం. రైళ్ళు రద్దయ్యాయి. తెల్లవారే దాకా మరో రైలు లేదు. ఇద్దరూ మాటల్లో పడతారు. అతను సిగరెట్టు తాగటానికి అగ్గిపెట్టె కోసం వెతుక్కుంటుంటే ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లోంచి తీసి ఇస్తుంది. “మీకు అగ్గిపెట్టె మర్చిపోయే అలవాటు పోలేదు. నాకు నా దగ్గర పెట్టుకునే అలవాటు పోలేదు” అంటుంది. అతనికి ఒక కవిత గుర్తొస్తుంది.
ఈ అలవాట్లెంత వింతయినవి
శ్వాస తీసుకోవటం ఒక అలవాటు
జీవిస్తూ ఉండటం ఒక రివాజు
బతుకు ఈడుస్తూ పోతున్నాం
ఈ అలవాట్లెంత వింతయినవి
ఈ కవిత విని ఆమె “ఇది మాయ రాసిన కవితా? ఆమెకి వర్షం అంటే ఇష్టం కదా. ఇప్పటికీ వర్షంలో షికారుకి వెళుతుందా?” అని అడుగుతుంది. అతను వెంటనే మాట మార్చేస్తాడు. ఆమెకి కోపం వస్తుంది. మాయ గురించి మాట్లాడటం ఇష్టం లేదనుకుని “ఈ రాత్రి గడిచిపోయే దాకా..” అంటుంది అర్థోక్తిగా. “భరించాలా? అన్నాళ్ళు నువ్వే భరించావుగా. నేను నీకేమన్నా అన్యాయం చేశానా?” అంటాడతను. “చూడండి. ఇది ఇల్లు కాదు. వెయిటింగ్ రూమ్” అంటుందామె. “ఇల్లు కూడా అప్పట్లో వెయిటింగ్ రూమ్ లానే ఉండేది” అంటాడతను. “అప్పుడు నేనేం అనలేదే?” అంటుందామె. “అదే కదా. అని ఉంటే..” అంటాడతను. ఆమె ఏమైనా అని ఉంటే జీవితం మరోలా ఉండేదని అతని భావం.
గతంలోకి వెళితే వారిద్దరికీ నిశ్చితార్థం అయిన తర్వాత అతనికి మాయ పరిచయమయింది. ఇంకా చదువుకుంటున్నానని కొన్నాళ్ళు, ఉద్యోగం చూసుకోవాలని కొన్నాళ్ళు అతను సుధతో పెళ్ళి ఆలస్యం చేశాడు. మాయతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. అదే మాట ఊరికి వెళ్ళి సుధకి చెబుతాడు. ఆమె “మీ మనసు చెప్పినట్టు చేయండి” అంటుంది. అయితే మాయ ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆమె స్నేహితురాలు “ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఎప్పుడొస్తుందో తెలియదు. తనకి తెలిస్తే కదా మనకి చెప్పటానికి” అంటుంది. మాయ నటి కావాలని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరటంతో ఆమె తలిదండ్రులు ఆమెతో తెగతెంపులు చేసుకున్నారు. ఆమె స్వేచ్ఛాజీవి. అతనితో పరిచయం అయ్యాక అతనితో ఉండిపోయింది. అతను ఊరికి వెళ్ళటంతో ఆమె అలిగి వెళ్ళిపోయింది. ఇదే కొంప ముంచింది. మాయ వెళ్ళిపోవటంతో తాతగారి బలవంతం మీద అతను సుధను పెళ్ళిచేసుకున్నాడు.
పెళ్ళయిన తర్వాత మాయ తిరిగి వస్తుంది. స్నేహితురాలి ఇంట్లో ఉంటుంది. మహేందర్, మాయ ఒకరికొకరు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సుధకి అర్థం చేసుకునే మనసుంది. ఒకరోజు అతని పర్సులో సుధకి మాయ ఫొటో కనిపిస్తుంది. “ఈ బతుకు ఎవరితోనో పంచుకుంటున్నట్టు ఉంది” అంటుంది. అతను “ఈ ఇంట్లో మాయ ఒక భాగంగా ఉండేది. ఆ గుర్తులు కొన్ని మిగిలిపోయాయి. అవి కూడా పోతాయి” అంటాడు. ఒకరోజు మాయ ఫోన్ చేస్తుంది. సుధ ఫోన్ ఎత్తుతుంది. మహేందర్‌కి ఇస్తుంది. అతను ఆఫీసుకి ఫోన్ చేయమని చెబుతాడు. సుధతో “నా ఎడబాటు ఆమె భరించలేకపోతోంది. నేను భరించగలుగుతున్నాను. అదే తేడా. కొన్నాళ్ళు ఓపికపట్టు” అంటాడు. మాయ సుధతో మాట్లాడతానంటుంది కానీ సుధ ఇష్టపడదు.
మాయ వస్తువులు కొన్ని ఇంట్లో ఉంటాయి. వాటిని ఆమెకి పంపించమని సుధ అంటుంది. ఆమె ఉద్దేశం వాటిని ఆమె ఉపయోగించుకుంటుందని. ఆ వస్తువులు అందుకుని మాయ ఒక టెలిగ్రామ్‌లో కవిత రాసి పంపిస్తుంది. ‘ఇవేనా? ఇంకా ఉన్నాయి నా వస్తువులు’ అని ఆ కవిత సారాంశం. కానీ ఆమె అంటున్న వస్తువులు అన్నీ అనుభూతులే. మహేందర్ ఆ కవితని సుధకి చదివి వినిపిస్తాడు.
మేరా కుఛ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై
సావన్ కె కుఛ్ భీగే భీగే దిన్ రఖే హైఁ
ఔర్ మెరే ఎక్ ఖత్ మేఁ లిప్టీ రాత్ పడీ హై
వో భిజ్వాదో, మెరా వో సామాన్ లౌటాదో
భావం:
నా సామాను కొంచెం నీ దగ్గరుంది
వర్షకాలపు తడి తడి రోజులున్నాయి
నా ఉత్తరపు పొట్లంలో రేయి ఉంది
అవి పంపించెయ్, నా సామాను తిప్పి పంపెయ్
వర్షకాలపు తడి రోజుల్లో కలిసి గడిపిన క్షణాలు తిరిగి ఇచ్చెయ్యమని అంటోంది. అంటే నీ మనసులో నుంచి ఆ అనుభూతుల్ని చెరిపేయగలవా అని అడుగుతోంది. ‘ఉత్తరపు పొట్లంలో రేయి’ గొప్ప ప్రయోగం. పొట్లం కట్టి ఆ రేయి భద్రంగా పెట్టానని, దాన్ని తిరిగి ఇవ్వమని అడుగుతోంది. కంటికి కనిపించే వస్తువుల్ని ఇస్తావు గానీ జ్ఞాపకాల్ని తిరిగి ఇచ్చేయగలవా అని నిగూఢంగా ప్రశ్నిస్తోంది.
(చరణాలన్నీ అనువాదం చేయటం లేదు. ఒక్క చరణం మాత్రమే అనువదిస్తున్నాను.)
ఏక్ అకేలీ ఛత్రీ మేఁ జబ్ ఆధే ఆధే భీగ్ రహే థే
ఆధే సూఖే ఆధే గీలే.. సూఖా తో మైఁ లే ఆయీ థీ
గీలా మన్ షాయద్ బిస్తర్ కే పాస్ పడా హో
వో భిజ్వాదో, మెరా వో సామాన్ లౌటాదో
భావం:
ఒక్క గొడుగులో అప్పుడు సగం సగం తడిసామే
సగం పొడిగా, సగం తడిగా.. పొడిగా ఉన్నది నే తెచ్చుకున్నా
తడి మనసు పానుపు పక్కన పడి ఉందేమో
అది పంపించెయ్, నా సామాను తిప్పి పంపెయ్
‘నా దగ్గరున్న మనను ముక్క పొడిబారిపోయింది. తడి మనసు ముక్క పానుపు పక్కనే ఉండిపోయిందేమో’ అంటోంది. అంటే ఆర్ద్రత నిండిన మనసు అతని పడకింట్లోనే ఉండిపోయిందని, అతను లేక తన దగ్గరున్న మనసు మొద్దుబారిపోయిందని భావం. మనసు విరిగిపోయింది అని అన్యాపదేశంగా చెప్పటం ఇక్కడ విశేషం. కవులు సాధారణంగా ‘నా మనసంతా నీ దగ్గరే ఉంది’ అనే అర్థం వచ్చేలా రాస్తారు. కానీ ‘సగం మనసు నా దగ్గర, సగం మనసు నీ దగ్గర’ అనటం గుల్జార్‌కే చెల్లింది. దీనికి ఉపోద్ఘాతంగా ఒక్క గొడుగులో ఇద్దరుండటం, సగం సగం తడవటం అనే సాధారణ విషయాన్ని ఎంచుకున్నారు. ఇంతకీ ఆమె అతని దగ్గరున్న తన మనసు ముక్క తిరిగి ఇచ్చేయమని అంటోంది. గడుసుతనం ఏమిటంటే ‘నా మనసు నాకిచ్చెయ్ చూద్దాం’ అనటంలో ‘నిన్ను నేను మర్చిపోయేలా చెయ్యి చూద్దాం’ అనే భావం ఉండటం.
ఈ కవిత విని సుధ ప్రతిస్పందించే తీరు గుండెల్ని పిండేస్తుంది. “ఆ సామాను పంపించి తప్పు చేశాను. మాయ ఎలాగూ రేపవలూ మనతోనే ఉంటోంది. సామాను కూడా ఉంటే ఏం మునిగిపోయేది?” అంటుంది. భార్య అయి ఉండి కూడా వారి ప్రేమను అర్థం చేసుకుంది. మరి తెలిసి కూడా ఎందుకు పెళ్ళి చేసుకుంది? జీవితంలో ఇలాంటి తప్పులు అందరం చేస్తాం. మాయని మర్చిపోతానని మహేందర్ అనటంతో పెళ్ళి చేసుకుంది. మరచిపోవటం అంత తేలిక కాదని అనుభవం మీద గానీ తెలియదు. ఒక్కోసారి ‘నా వ్యక్తిత్వం గొప్పది’ అని అహంకారం వస్తుంది. కానీ పరీక్ష ఎదురైతే గానీ నిజం బయటపడదు. “నేను సాధారణ స్త్రీని. నాకూ అసూయ, స్వార్థం ఉన్నాయి” అంటుంది సుధ ఒకసారి. ఇలా ముగ్గురూ నలిగిపోతుంటారు.
మాయకి కాస్త దూరం ఉంటే పరిస్థితి మెరుగవుతుందని మహేందర్ సుధని తీసుకుని హనీమూన్‌కి వెళతాడు. ఇక్కడ సుధ పాడే పాట.. పైకి జీవితంలో సుఖం కొంచెం కొంచెం దొరుకుతుందని, దాన్ని ఆస్వాదించాలని చెప్పినట్టున్నా నిగూఢార్థం కూడా ఉంటుంది.
కత్రా కత్రా మిల్తీ హై, కత్రా కత్రా జీనేదో
జిందగీ హై బెహనే దో
ప్యాసీ హూఁ మైఁ ప్యాసీ రెహనే దో
స్వేచ్ఛానువాదం:
బొట్టూ బొట్టుగ అందేను, మెట్టూ మెట్టుగ వెళతాను
(ఇక్కడ కత్ర అంటే సందర్భాన్ని బట్టి బొట్టు బొట్టుగా , చుక్క చుక్క గా, కొంచెం కొంచెంగా క్షణం క్షణం క్షణం గా అన్న అర్ధాలలో అన్వయించుకోవాల్సివుంటుంది. జీవితం అంతా ఒకేసారి ఏదీ లభించదు. ఏదయినా కొంచెం కొంచెంగా, క్షణం క్షణం గా లభిస్తుంది. బ్రతకటం కూడా అలాగే క్షణం క్షణం బ్రతుకుతాము. అలాంటి అనేక క్షణాలు కలిపితే జీవితం అవుతుంది. జీవితం ఒక ప్రవాహం. ప్రవహిస్తూనే వుంటుంది. ఎన్నో నీటి చుక్కలు కలిస్తే ప్రవాహమవుతుంది. నీటి ప్రవాహాన్ని కాలంతో పోలుస్తారు. కవి ఇక్కడ రెండు రకాల భావాలను స్ఫురింపచేస్తూ, సందర్భానికి తగ్గట్టు కవితలాంటి గేయం రాశాడు. )
జీవితమింతే, సాగిపోతాను
పిపాసిని, పిపాసిగానే ఉంటాను
కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోకూడదనే పరిణతి ఉంది సుధకి. ప్రవాహాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఒడ్డున కూర్చుని సాక్షిగా ఉంటూ జీవితాన్ని అస్వాదించాలి. ఏదో అందుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికని కూడా సాక్షిగా చూడాలంతే. పిపాస తీరకపోయినా బాధపడకూడదు. ఇందులో ఇంకో అర్థం మాయని మర్చిపోయి మహేందర్ తనకి సొంతమవ్వాలని కోరిక, అది తీరదనే ఎరుక, అయినా పర్వాలేదనే నిర్లిప్తత.
తుమ్నే తో ఆకాశ్ బిఛాయా
మేరే నంగే పైరోఁ మేఁ జమీఁ హై
పాకే భీ తుమ్హారీ ఆర్జూ హో
షాయద్ ఐసీ జిందగీ హసీఁ హై
ఆర్జూ మేఁ బెహనే దో
ప్యాసీ హూఁ మైఁ ప్యాసీ రెహనే దో
స్వేచ్ఛానువాదం:
నీవేమో నింగిని పరిచావు
నా పాదాల్లో మన్నే ఉంది
( అంటే నా పాదాలు భూమిపైనే వున్నాయి అని అర్ధం. నాయకుడు కలల్లో జీవిస్తున్నాడు. నాయిక నిజాన్ని అర్ధం చేసుకుని నిజంతో రాజీ పడుతోంది.)
నావాడవైనా నీకై అభిలాష
జీవితం ఈలాగే బాగుంది
అభిలాషతో సాగనీ నన్ను
పిపాసిని, పిపాసిగానే ఉంటాను
‘నువ్వు ఆకాశాన్నే దించావు. కానీ నా పాదాలు నేల మీదే ఉన్నాయి’ అనటంలో ‘నేను సాధారణ స్త్రీనే’ అనే భావం ఉంది. ‘జమీన్ పే పైర్’ (మన్నుపై పాదాలు) అనకుండా ‘పైరోఁ మేఁ జమీన్’ (పాదాల్లో మన్ను) అనటం ప్రాస కోసమే అయినా ‘పాదాలకు మట్టి అంటుకుంది కాబట్టి ఆకాశం మీద నడవటం ఇష్టం లేదు’ అనే భావం వస్తుంది. ‘నువ్వు నావాడవైనా నీకోసం ఆరాటపడటంలో ఆనందం ఉంది’ అంటోంది. మామూలుగా అయితే కాస్త ఎడబాటుని కూడా తట్టుకోలేను అనే భావం వస్తుంది. ఇక్కడ అతను తనకు పూర్తిగా సొంతం కాలేదు కాబట్టి అతని కోసం ఆరాటపడుతూ ఉంటాను అనే భావం కూడా వస్తుంది. స్త్రీవాదులు దీన్ని వ్యతిరేకించవచ్చు. కానీ ఆమెకి అతనిపై నమ్మకం ఉంది. మహేందర్, మాయ ఒకరినొకరు అమితంగా ప్రేమించుకున్నారని ఆమెకి తెలుసు. ఇదే మాట సుధ తర్వాత మహేందర్ తాతగారితో అంటుంది. అలాంటి ప్రేమ ఒక్క క్షణంలో అంతమైపోదనీ తెలిసింది. అందుకే ఓపిగ్గా ఉంటానని అంటోంది.
మాయకి పెళ్ళంటే నమ్మకం లేదు. ఎందుకంటే ఆమె తలిదండ్రుల మధ్య అన్యోన్యత లేదు. అందుకే మాయ పెళ్ళి చేసుకోనంటుంది. “నాకు నిశ్చితార్థం అయిపోయింది” అని మహేందర్ అంటే ఆమె “పెళ్ళి చేసుకో. మీ బిడ్డని నాకిచ్చెయ్” అంటుందొకసారి. నిశ్చితార్థం అయిపోయినా మరో అమ్మాయితో పరిచయం పెంచుకోవటం అతని తప్పు. ఆ వయసులో ఆ ఇంగితం ఉండదు. పెద్దవాళ్ళకి చెబితే వారు సలహా ఇస్తారు. అలాంటి పరిచయాలు పెరగకుండా ఉండాలంటే దూరంగా ఉండాలి. అవసరమైతే వేరే ఊరికి వెళ్ళిపోవాలి. కానీ కుర్రవాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పరుగా! అందుకే ‘Youth is lost on the young’ అంటారు. కుర్రతనం కుర్రాళ్ళ చేతుల్లో నష్టమైపోతుంది. అనుభవలేమి వల్ల. అనుభవం వచ్చేసరికి కుర్రతనం దాటిపోతుంది. పెళ్ళి ఇష్టం లేదని ముందే చెప్పకపోవటం మాయ తప్పు. స్త్రీపురుషులు కలిసి అన్యోన్యంగా ఉండలేరు అనే అభిప్రాయం ఉంటే ఒంటరిగానే ఉండాలి. పైగా మాయది చంచల స్వభావం. ఇంపల్సివ్ నేచర్. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి వారు ఒంటరిగా ఉంటేనే మంచిది. ఈ చిత్రంలో పెళ్ళి కాకుండా సహజీవనం చేయటం చూపించారు. అప్పట్లో ఇది వింత పోకడ. కానీ ఇప్పుడు సహజీవనం మామూలైపోయింది. ఇష్టం తగ్గినప్పుడు విడిపోవటానికి తేలిగ్గా ఉంటుందని చేసేదే సహజీవనం. ఆలోచిస్తే అది ఎంత మూర్ఖత్వమో ఎవరికైనా అర్థమౌతుంది. ఈ చిత్రంలో మహేందర్‌కి, మాయకి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ఇష్టం. సమస్య ఏమిటంటే మాయకి పెళ్ళంటే ఇష్టం లేదు. మహేందర్ దూరమవుతున్నాడని మాయ ఆత్మహత్యకి ప్రయత్నిస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
బెంగాలీ కథ ‘జతుగృహ’ ఆధారంగా గుల్జార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించారు. మహేందర్‌గా నసీరుద్దీన్ షా, సుధగా రేఖ, మాయగా అనురాధా పటేల్ నటించారు. నసీరుద్దీన్ షా ఆరితేరిన నటుడు కావటం వలన అలవోకగా నటించాడు. వెయిటింగ్ రూమ్‌లో వచ్చే సన్నివేశాలలో అతని నటన తార స్థాయిలో ఉంటుంది. ‘ఉమ్రావ్ జాన్’లో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న రేఖ ఈ చిత్రంలో కూడా గొప్పగా నటించింది. వెయిటింగ్ రూమ్‌లో మొదటిసారి మాయ ప్రస్తావన వచ్చినపుడు మహేందర్ మాట దాటవేస్తే సుధ ముఖంలో కోపం సూక్ష్మంగా కనిపిస్తుంది. రేఖ ఇక్కడ అద్భుతంగా నటించింది. అనురాధా పటేల్ సినీ జీవితంలో ఈ చిత్రంలోని పాత్ర మరపురానిదిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో అందరూ మంచివారే. కాకపోతే మహేందర్, మాయ తెలిసి తప్పులు చేశారు. సుధ తెలిసి తెలిసీ వారి మధ్య ఇరుక్కుపోతుంది. అదే విషాదం. చిత్రంలో ఒక్క విషయం మాత్రం కృత్రిమంగా ఉంటుంది. కథ ప్రకారం అందరూ మధ్య తరగతి వారే కానీ విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉంటారు. మహేందర్ ఇంట్లో పిలిస్తే పలికే నౌకరు కూడా ఉంటాడు.
గుల్జార్ పాటల్లో గొప్ప కవిత్వముంటుందని కొత్తగా చెప్పక్కరలేదు. దర్శకుడైన తర్వాత ఆయన భిన్నమైన చిత్రాలే తీసినా నాటకీయత ఎక్కువగానే ఉండేది. ఆ చిత్రాలు చాలావరకు హిట్టయ్యాయి. నాటకీయత లేకుండా ఆయన తీసిన చిత్రాల్లో ఇదొకటి. భావోద్వేగాలే ప్రధానంగా ఉంటాయి. మొత్తం నాలుగు పాటలు. అన్నీ ఆశా భోంస్లేనే పాడింది. పాటల్లో మగగొంతు వినపడదు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. ‘ఛోటీసీ కహానీ సే’ అనే పాట మొదట్లో నేపథ్య గీతంగా వస్తుంది. ‘ఖాలీ హాథ్ షామ్ ఆయీ హై’ అనే పాట చిత్రం ద్వితీయార్థంలో వస్తుంది. ఆర్.డి.బర్మన్ ప్రతిభకి ఈ పాటలు మచ్చుతునకలు. ఈ పాటలో కూడా గుల్జార్ వాడిన ప్రతీకలు అమోఘం.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
మాయ ఆత్మహత్యకి ప్రయత్నించటంతో మహేందర్ ఆసుపత్రిలో ఆమెని కలుసుకోవటానికి వెళుతుంటాడు. విషయం మాత్రం సుధకి చెప్పడు. ఇదే పొరపాటు. సుధ గురించి తెలిసినవాడే కాబట్టి విషయం తెలిస్తే సుధ తన వల్లే మాయ ఆత్మాహత్యకి ప్రయత్నించిందని అనుకుంటుందని అతను చెప్పలేదనుకోవాలి. ఒకవేళ చెప్పినా చిక్కుముడి మరింత బిగుసుకుంటుంది. సుధకి అతను ఆలస్యంగా ఇంటికి రావటం వల్ల అనుమానం గానే ఉంటుంది. కానీ బయటపడదు. అతని మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేదు. చివరికి ఒకరోజు అతన్ని అడుగుతుంది. అతను అసలు విషయం చెప్పకుండా మాయని ఇంటికి పిలుస్తానంటాడు. అందరూ మాట్లాడుకుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అతని ఆలోచన. సుధ ఒప్పుకోదు. అయినా అతను మాయకి ఫోన్ చేస్తాడు. “సుధ నిన్ను ఇంటికి ఆహ్వానించింది” అని చెబుతాడు. సుధ “అబద్ధమెందుకు చెబుతారు?” అని అరుస్తుంది. మహేందర్ ఆమె మీద కేకలేస్తాడు. ఆ మాటలు మాయకి వినపడతాయి. ఆమె మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతుంది. మహేందర్ ఆమెని వెతుక్కుంటూ వెళతాడు కానీ లాభం ఉండదు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఉత్తరం రాసి సుధ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. “నేను అనవసరంగా మీ మధ్యకు వచ్చాను. వెళ్ళిపోతున్నాను” అని రాస్తుంది. దాంతో అతను తీవ్రమైన వేదనకి గురవుతాడు.
సుధ తన ఊరికి వెళుతుంది. తల్లికి అసలు విషయం చెప్పదు. ఆమెకి అర్థం కాదని విషయం దాస్తుంది. టీచరుగా ఉద్యోగంలో చేరుతుంది. సుధ కుటుంబానికి కూడా మహేందర్ తాతగారే పెద్ద దిక్కు. ఆయన తీర్థయాత్ర నుంచి తిరిగివచ్చాక సుధని కలుస్తాడు. “వారి ప్రేమ గొప్పది. వారినలా వదిలేయండి. మీరు మహేందర్‌ని ఏమీ అడగకండి” అంటుంది సుధ. తాతగారు లోకజ్ఞానం ఉన్న మనిషి. అయినా సంప్రదాయవాది. “వాడు పిలిస్తే పట్టుబట్టకుండా వెళ్ళు” అని మాత్రం చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. అయితే సుధ మహేందర్, మాయ కలిసి ఉండాలనే కోరికతో వేరే ఊళ్ళో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతుంది. అతనికి ఉత్తరం రాస్తుంది. “మీ నిజాయితీ నచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను. కానీ ఆ పెళ్ళి తప్పని తెలిసింది. మాయ చాలా భిన్నమైన మనిషి. నేను మామూలు ఆడదాన్ని. తాతగారికి నేను అంతా వివరించి చెప్పాను. ఆయన మిమ్మల్ని ఏమీ అనరు. మీరు మాయని పెళ్ళి చేసుకోండి. నా గురించి ఆలోచించవద్దు. నా అడ్రసు కూడా మీకు పంపటం లేదు” అని రాస్తుంది.
సుధ తనకి తోచిన పరిష్కారం అమలు చేసింది. తాతగారికి కూడా సర్దిచెప్పింది. కానీ అన్నీ అనుకున్నట్టే జరగవుగా. మహేందర్ చెప్పినట్టు ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటే ఈ పరిష్కారమే తేలేదేమో. అప్పుడు అందరూ ఒప్పుకున్నట్టు ఉండేది. ఇప్పుడు సుధ ఒక్కతే నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. మాయ ప్రేమ గొప్పదని అంటుంది కానీ మాయని కలవటానికి ఇష్టపడదు. ఒక్కోసారి భావోద్వేగాలు అలా ఉంటాయి.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
వెయిటింగ్ రూమ్‌లో మహేందర్ సుధకి మాయ ఆత్మహత్య ప్రయత్నం గురించి చెబుతాడు. తర్వాత సుధ ఇల్లు విడిచి వెళ్ళిపోవటంతో వేదనతో అతనికి గుండెపోటు వచ్చింది. మాయ తిరిగి వచ్చి అతనికి సపర్యలు చేస్తుంది. అతను కోలుకున్నాక సుధని తీసుకొస్తానని అంటాడు. అంతలోనే సుధ ఉత్తరం అందుతుంది. ఆమె ఎక్కడుందో తెలియని పరిస్థితి. నిస్పృహతో అతను మాయ మీద కేకలేస్తాడు. ఆ రాత్రి మాయ మోటార్ సైకిల్ మీద ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మహేందర్ శబ్దం విని మేలుకుని ఆమె కోసం కారులో బయలుదేరుతాడు. అతను చేరుకునే సరికి యాక్సిడెంట్లో మాయ మరణిస్తుంది.
మాయ మరణం సంగతి తెలిసి సుధ దుఃఖిస్తుంది. తెల్లవారుతుంది. సుధ రైలు అందుకోవటానికి సిద్ధమవుతుంది. ఇంతలో ఆమె భర్త హడావుడిగా వస్తాడు! ఆమె రైలు రద్దవటంతో అతను ఆమె కోసం బయల్దేరి వచ్చాడు. వారి మాటలు విని మహేందర్ అవాక్కయి ఉండిపోతాడు. అతను సుధ మెడలో నల్లపూసలు, పాపిట బొట్టు చూసి ఆమె ఇంకా తన భార్యగానే ఉందని అనుకున్నాడు. విడాకుల్లేకుండా ఆమె మరో పెళ్ళి ఎలా చేసుకుంది? దీనికి నా దగ్గర సమాధానం లేదు. అప్పట్లో పెళ్ళికి పత్రాలేవీ ఉండేవి కాదేమో. లేకపోతే సినిమా కాబట్టి కొంచెం స్వతంత్రం తీసుకున్నారేమో. ఆమె భర్త రాకపోతే ఆమె తన పెళ్ళి గురించి మహేందర్‌కి చెప్పేదా? చెప్పేదనే నాకు అనిపించింది. చివరికి ఆమె అతని అనుమతి (ఇజాజత్) తీసుకుని భర్తతో వెళ్ళిపోతుంది. అతను ఆమెతో “వీలైతే నన్ను క్షమించు” అంటాడు.
సుధ దాదాపు చిత్రం చివరి దాకా మహేందర్ మాయని పెళ్ళి చేసుకున్నాడనే అనుకుంది. అందుకే ఆమె కాస్త కోపంగా ఉంటుంది. నిజానికి ఆమె మొదట్లో అతనికి కనపడకుండా వేరే వెయిటింగ్ రూమ్‌కి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంది. కానీ అతను ఆమెని చూస్తాడు. ఆమె అతనికి అగ్గిపెట్టె ఇస్తూ కూడా ఆ అగ్గిపెట్టె తన భర్త కోసం పెట్టుకున్నానని చెప్పదు. చివర్లో తన భర్తకి అగ్గిపెట్టె ఇస్తూ కాస్త అపరాధభావంతో మహేందర్ వంక చూసి మళ్ళీ చూపు మరల్చుకుంటుంది.
జీవితంలో ఏ నిర్ణయాలైనా సంబంధించినవారితో మాట్లాడి తీసుకోవాలి. కొందరు స్వార్థంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ సుధ, మాయ ఇద్దరూ త్యాగం చేస్తున్నామనుకుని తొందరపడ్డారు. మాయ ఆత్మహత్యకి ప్రయత్నించింది. తర్వాత కనపడకుండా వెళ్ళిపోయింది. సుధ కూడా అడ్రసు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. విధి వారితో ఆడుకుంది. మహేందర్ ఎవరికీ న్యాయం చేయలేకపోయాడు. అప్పట్లో పెళ్ళి చేసుకున్నాక భార్యని వదిలిపెట్టాలంటే వందసార్లు ఆలోచించేవారు. ఇప్పుడు విడాకులు సాధారణమైపోయాయి. కాబట్టి ఈ కథ ఇప్పటి తరానికి వింతగా ఉండొచ్చు. ఇప్పుడు స్వతంత్రం పెరిగింది. మంచిదే. ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చు. కానీ భార్యకి కట్టుబడి ఉండాలి. పిల్లలున్నవారు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం భావితరాలపై పడుతుంది. ఈ చిత్రంలో పిల్లలు లేరు కానీ ఒకరి కోసం ఒకరు ఆలోచించినా దుష్పరిణామాలు తప్పలేదు. అసలు ఈ కథలో దుష్పరిణామాలు లేని పరిష్కారం ఏదైనా ఉందా అని కూడా అనిపిస్తుంది. కొందరు ఈ కథ సుల్జార్ జీవితానుభవాలకు దగ్గరగా వుందని అంటారు.