తొలగిన తెరలు-6

0
4

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[నందిని ఓ రోజు ఇల్లు శుభ్రం చేస్తుంటే, అక్కడ టేబుల్ పై ఉన్న సందీప్ బ్యాంక్ యాన్యువల్ స్టేట్‍మెంట్ కాగితాలు కనబడతాయి. క్యూజువల్‍గా చూస్తే, ప్రతి నెలా వినీల అనే ఎకౌంట్‌కి పదివేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ అవుతున్నట్లు గుర్తిస్తుంది. ఆమెకేమీ అర్థం కాదు. ఈ వినీల ఎవరు? ఆమెకు ప్రతి నెలా ఎందుకు డబ్బులు పంపుతున్నారు? ఎవరిని అడగాలో తెలియదు. ఇంతలో అక్కడి సందీప్ వస్తాడు. నందిని ఆ కాగితాలు చూసిందని అతనికి అర్థమవుతుంది. సందీప్ ఏదో చెప్పబోతుంటే విరక్తిగా చూస్తుంది. తన స్నేహితురాలైన లాయర్ మాధవికి ఫోన్ చేసి తనకి ఒక అరగంట టైమ్ ఇవ్వమని అడిగి, మాధవి దగ్గరకు వెడుతుంది. మాధవి లోపలికి వెడదాం రా అని అంటే, వద్దు నేను క్లయింటుగా వచ్చాను, ఇక్కడే కూర్చుందాం అంటూ ఆఫీసు గదిలోనే కూర్చుంటుంది. సమస్య ఏమిటి అని అడిగితే తాను సందీప్ నుంచి విడిపోవాలనుకుంటున్నానంటూ వివరంగా చెబుతుంది. సందీప్‍‌ని అడిగావా అంటే అక్కరలేదని, అతని నుండి విడిపోదలచానని అంటుంది. కాసేపాగి బయల్దేరుతుంది నందిని. బీచ్ వైపు వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. కాసేపయ్యాకా, బయల్దేరి కొన్ని పళ్ళు, స్వీట్లు కొని ‘వానప్రస్థం’లోకి అడుగుపెడుతుంది. అందరిని పలకరించి, పళ్ళూ స్వీట్లు పంచి – రంగనాథం గారి గదిలోకి వెడుతుంది. నందిని మొహంలోని నీలి నీడలను పసిగట్టేస్తారయన. ఏమయిందని అడిగితే, ఏం లేదు తాతయ్యా అంటుంది. ఏదైనా మంచి పాట పాడమని అడుగుతారాయన. ఆశ్రమవాసులు మరికొన్ని పాటలు పాడించుకుని వింటారు. కాసేపు వారితో గడిపి ఇల్లు చేరుతుంది. ఒక వారం రోజులు గడుస్తాయి. ఏం జరిగిందో చెప్తానన్న వినని నందిని నొచ్చుకోకుండా – జరిగినది ఆమెకి తెలియజెయ్యాలనుకుంటాడు సందీప్. విషయమంతా వివరంగా ఆడియోలో రికార్డు చేసి లాయర్ మాధవికి పంపుతాడు. ఆ ఆడియోలో తన స్నేహబృందంలోని నవీన్, వినీల ప్రేమ గురించి, పెళ్ళి గురించి చెప్తాడు. చదువులు పూర్తయి, ఉద్యోగాల్లో చేరి ఎవరి జీవితాలలో వాళ్ళు స్థిరపడిపోతారు. అప్పుడు జరిగిందో ఓ సంఘటన – అని చెప్తాడు ఆడియోలో సందీప్. – ఇక చదవండి]

[dropcap]ఒ[/dropcap]కరోజు నవీన్ నుంచి ఫోన్ వచ్చింది.

“ఒరే! దీపూ! అర్జంటుగా రాగలవా?” అని.

ఊళ్ళోనే కదా! ఎంతసేపు?

అరగంటలో వాడి ముందు ఉన్నాను.

నవీన్‌ని చూస్తూనే నిశ్చేష్టుడినయ్యాను. కళ్ళలో నీళ్ళు జలజల రాలుతూ ఉండగా “ఏంటిరా ఇది?” అని మాత్రమే అనగలిగాను.

పిచ్చుక గూడులాంటి జుత్తూ, పెరిగిన గడ్డం, లోతుకు పోయిన బుగ్గలు, పుల్లల్లాంటి చేతులు, మొహం అంతటికీ కనిపిస్తున్నవి అందమైన ఆ పెద్దపెద్ద కళ్ళు మాత్రమే! వెలుగుతున్న ఆ కళ్ళల్లో కాంతి ఎప్పుడు ఆరిపోతుందో అన్నట్టుగా ఉన్నాడు.

చుట్టూ చూశాను.

దూరంగా ఒక ఏడాదిన్నర బాబును ఎత్తుకొని నిలుచుని ఉంది వినీల.

“వినీలా! నువ్వేనా ఏంటి ఇలా? మీకు మేమెవరమూ గుర్తుకు రాలేదా?”

నిశ్శబ్దంగా రోదించసాగింది.

“మీరు హాయిగా ఆనందంగా ఉన్నారని అనుకున్నామేగానీ.. ఇలా ఊహించలేదురా? చాలా బాధగా ఉంది.”

“సందీప్ గారూ! ఆయన ముఖ్యులైన నలుగురు స్నేహితులకూ ఫోన్ చేయించారు. మీరు మాత్రమే వచ్చారు.” కొంతసేపటికి నోరు విప్పింది వినీల.

“హాస్పిటలులో చేర్చుదామా? అంబులెన్సు పిలవనా?”

ఫోన్ తీసి నెంబరు డయల్ చేయసాగాను.

“నవీన్ ఒప్పుకోవడం లేదు.” మెల్లగా అంది వినీల

“ఎందుకని?”

“నా స్నేహితురాలు డాక్టర్ ఉంటే ఫోన్ చేశాను. ఆమె అసిస్టెంట్‌ని పంపింది. పరిస్థితి సీరియస్‌గా ఉంది. హాస్పిటల్‌లో చేర్చమని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఏ హాస్పిటల్?? ఎంత అవుతుంది? తెలీదు. అయినా నవీన్ ఒప్పుకోవటంలేదు. ఎందుకంటే..” దుఃఖంతో మధ్యలోనే ఆపేసింది.

“చెప్పు వినీలా! ఎందుకో?? నేను ఒప్పిస్తాను కదా!” ధైర్యంగా అన్నాను.

“తనకు ఆఖరి క్షణాలు అని తెలిసిపోయింది. ఇంట్లో మమ్మల్నిద్దరిని చూస్తూ..” మిగిలిన మాటలు మింగేసింది.

నవీన్ వైపు చూసాను.

“నవీన్ కంగారు పడకు. నేను ఇప్పుడే డాక్టర్‌ని తీసుకొని వస్తాను.” అంటూ లేచాను.

“వద్దు వెళ్ళకండి.” వినీల ఆపింది.

అప్పుడు చూసాను.

నవీన్ మాట్లాడడం లేదు. దుప్పటి కప్పిన ఆ శరీరంలో కదలికలు సన్నగిల్లుతున్నాయి. ఎంత హృదయవిదారకంగా ఉంది పరిస్థితి!

మిగిలిన స్నేహితులను సహాయంగా పిలుద్దామని వరుసగా ఫోన్‌లు చేసాను.

నా దగ్గర నుంచి ఫోన్ కాబట్టి ఎత్తారు. కానీ.. అందరు చెప్పిన కారణాలు రాలేని పరిస్థితి.

బాబుని తీసుకుని వినీల అతనికి దగ్గరగా జరిగింది.

శరీరంలోని బలమంతా ఉపయోగించి ఒకే మాట “దీపూ! బాబు కోసం సహాయం చెయ్యరా!” అన్నాడు.

“అలాగే మాట ఇస్తున్నాను.” అన్నాను.

అంతే! నిశ్చింతగా వెళిపోయింది ఆ జీవి.

వీలైనంత సింపుల్‌గా తదుపరి కార్యక్రమాలు నిర్వహించాను.

గంటలో అన్నీ పూర్తి అయిపోయాయి.

తననూ, బాబునూ వదిలి వెళ్ళాలి అని లేదు. కానీ ఎంతసేపు ఉండగలడు తాను.

కొంచెం సేపటికి సంబాళించుకుంది వినీల.

“దీపూ అన్నా! మా ఇద్దరికీ కేంపస్‌లో ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇద్దరమూ చేరే పరిస్థితి లేదు. అతనికి ఆరోగ్యం పాడైంది. నాకు కడుపులో బాబు. అతని తల్లిదండ్రులను, మా తల్లిదండ్రులను, మా ఇరువురి స్నేహితులనూ సహాయం అడగని వాళ్లు లేరు. విచిత్రం! ప్రతి ఒక్కరు చూపేది రిక్తహస్తాలనే! కొంచెం కోలుకున్నాక ఉద్యోగ ప్రయత్నం చేస్తాను. ఈ గదిలోనే ఇక్కడే ఉంటాను, ఎవరి దగ్గరకూ వెళ్లాలని లేదు. బాబును పెంచి ప్రయోజకుడిని  చేయటం ఒక్కటే నా ముందున్న లక్ష్యం.”

“వినీలా! అన్నా! అని నోరారా పిలిచావు. తప్పక సహాయం చేస్తాను. నెలకు ఒక పదివేలు నీ అకౌంట్‌లో వేస్తాను.” అన్నాను.

“అన్నా! ఒక మాట ఇవ్వగలవా! ఈ మాట మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఎవరికీ అమ్మా, నాన్నకు కూడా చెప్పవద్దు. అలాగే నన్నూ, బాబునీ చూడడానికి రావద్దు. ఈ మూడేళ్ళలో ప్రపంచాన్ని కాచి వడబోసాను.” బాధగా ఉన్నా ఆ గొంతులోని స్థిరత్వానికి చకితుడనయాను.

బాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చింది.

“ఈ దురదృష్టవంతురాలైన చెల్లెలి నీడ కూడా నీ మీద పడకూడదు. నవీన్ భౌతికంగా వెళ్ళిపోయినా నాతోనే ఉంటాడు నాకు ధైర్యాన్నిస్తూ.  బాబు ప్రయోజకుడు అవాలని దీవించు అన్నా!” నమస్కరించింది.

‘ఇంకా ఈరోజుల్లో ఇలాంటి స్త్రీలు ఉన్నారా? కాలం మారింది అనుకున్నాను. ప్రేమకు కట్టుబడే విషయంలో స్త్రీలు ఎప్పటికీ ఎవరికీ అర్థం కారు.’ అనుకుంటూ వెనుతిరిగాను.

మలిన వదనంతో అలసిన ముఖంతో ఇంటికి చేరిన నన్ను అమ్మ అడిగింది  ఏమైందని??

దీనురాలైన వినీల మొహం చెప్పవద్దు అని అంటున్నట్లుంటే

“ఏమీ లేదమ్మా! స్నేహితుడికి ఒంట్లో బాగోలేక పోతే చూసి వస్తున్నాను” అని చెప్పాను.

“అవునా! అయితే రెస్ట్ తీసుకో నాన్నా!” అంది అమ్మ.

మరునాడే నా అకౌంట్ నుండి వినీల అకౌంట్ లోకి 10,000 ప్రతినెల వెళ్ళేటట్లు అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను.

ఇదంతా జరిగి ఐదు సంవత్సరాలయింది పీజీ పూర్తి చేసుకున్నాను ఉద్యోగంలో చేరాను.

నందినిని ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో అందరికీ తలలో నాలుకలా ఉండే నందిని నిన్న నా బ్యాంక్ నుండి వచ్చిన వార్షిక రిపోర్ట్ చూసింది. అప్పుడు తనకు తెలిసింది. వినీల పేరుతో 10,000 కట్ అవుతున్నట్లు. ఎవరికీ చెప్పవద్దని వినీల నవీన్ పేరు మీదుగా ఒట్టు పెట్టింది. వివరంగా చెప్పాలని ప్రయత్నించాను. కానీ నందిని విపరీతమైన ఆత్మాభిమాని. వినడానికే ఇష్టపడలేదు.

మాకు విడాకులు ఇప్పించే లాయర్‌గా మీకు పరిస్థితి తెలియాలని ఇదంతా వివరంగా చెప్పాను.

ఉంటాను మాధవి మేడమ్.”

ఆడియో ఆగిపోయింది.

నూటికో కోటికో ఒక్కరూ..

అప్రయత్నంగా మాధవి నోట పలికింది.

ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. ఎలాగైనా వారిరువురినీ కలపడానికి తనవంతు మరొక ప్రయత్నం చేయాలి అనుకుంది.

***

ఒకరోజు నందినికి మాధవి ఫోన్ చేసింది.

“మీ ఇద్దరూ ఒకసారి నా దగ్గరకు రాగలరా? ఫార్మల్‌గా కౌన్సెలింగ్ చేయాలి.”

లాయర్ మాధవి ఎంతో ప్రయత్నం చేసి సందీప్‌ని, నందినిని తన ఎదురుగా కూర్చోపెట్ట గలిగింది.

చిన్నపిల్లల్లాగా అలిగి చెరోవైపూ మొహం తిప్పుకుని కూర్చున్న ఆ జంటను చూస్తూంటే అనేక భావాలు కలగాపులగంగా ఆమెను చుట్టు ముట్టాయి. ముందుగా తనే మాటలు మొదలుపెట్టింది.

“మీరిద్దరూ నాకు చాలా చాలా చాలా కావలసిన వాళ్ళు. మీరు విడిపోవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ మధ్య ఏర్పడిన అపోహలు అనుమానాలు నివారించుకోవాలి. తొలగించుకోవాలి అని కూడా అనుకోకపోవడం మాట్లాడుకోకపోవడం విచారకరం.

అయితే విడాకులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలపడం నా విధి. కనుక చెపుతాను.

వివాహబంధాన్ని రద్దు చేయడమే విడాకులు అనుకుంటే –

1955 హిందూ వివాహ చట్టం ప్రకారం సెక్షన్ 13 బి (2) భార్యాభర్తలు విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆరునెలలు ఆగమని తర్వాత విడాకులు మంజూరు చేయవచ్చు. ఈ సమయం ఇవ్వడానికి కారణం వివాహబంధాన్ని నిలపాలని పునరుద్ధరించాలని అది మన దేశ సంస్కృతి అని న్యాయస్థానం భావించడం.

అయితే చట్టం దృష్టిలో న్యాయం అందరికీ సమానం కనుక పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, న్యాయం మారుతూ వచ్చింది. అందువలన కాలానుగుణంగా న్యాయవ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అదే విధంగా విడాకుల వ్యవస్థలో కూడా మంచి మార్పులు వచ్చాయి.

భార్య భర్త కలిసి ఉండే విషయంలో వారి యొక్క సమస్యలను పరిష్కరించే విషయంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో కొన్ని కొత్త మార్పులు చేశారు.

భార్యాభర్తలు పరస్పర ఒప్పందం ప్రకారము విడిపోదామని అనుకున్నప్పుడు ఆరు నెలల వ్యవధి ఉండాలనే పాత చట్టాన్ని సుప్రీంకోర్టు సడలించింది.

తప్పనిసరి పరిస్థితులలో విడిపోయేటప్పుడు గొడవలు లేనిపక్షంలో పిల్లల పెంపకం బాధ్యత మొదలగు విషయాలపై అవగాహనతో సరైన నిర్ణయం తీసుకున్న పక్షంలో శాంతియుతంగా విడిపోయేందుకు వెసులుబాటు కల్పించేందుకు ఆరు నెలల కాల వ్యవధిని తన డిస్క్రిషన్ ప్రకారము ఆరు నెలల కాలవ్యవధిని కుదించాలని నిర్ణయించింది.

భార్యాభర్తలలో ఏ ఒక్కరు పెళ్లిని రద్దు చేసుకుని విడాకులు తీసుకోవాలి అనుకున్నప్పుడు రెండవవారు ఒప్పుకోకపోయినా కోర్టు వారు కారణాలు తెలుసుకుని కొంత సమయం ఇచ్చి మంజూరు చేసే అవకాశం చట్టాలలో చొప్పించారు.

మద్యము, మగువ, జూదం కారణంగా తనకు, పిల్లలకు హాని జరుగుతున్న పక్షంలో, మార్పు వస్తుందని ఆశ లేని పక్షంలో విడాకులు తీసుకోవడమే మంచిదని న్యాయస్థానం చెబుతుంది. బలవంతంగా కలిసి ఉండమని ఏ కోర్టూ తీర్పునివ్వదు.

భర్తకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేకపోతే కోర్టుకు రాకపోతే భార్య అతనిపై వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్‌లో 498 సెక్షన్ క్రింద కంప్లైంట్ చేయవచ్చును. విడాకులకు ఒత్తిడి చేయవచ్చును. మెయింటెనెన్స్ ఖర్చులకు న్యాయస్థానంలో అపీల్ చేసుకోవచ్చును.

ఈ రోజుల్లో ఫ్యామిలీ కోర్టులు స్త్రీలకు సహాయకారిగా ఉన్నాయి. ఫ్యామిలీ కోర్టు ద్వారా లీగల్‌గా విడిపోవడానికి విడాకులకు తేడా ఉంది. ఫ్యామిలీ కోర్టు ద్వారా విడిపోయినవారు డైవర్సీ కాదు మేరీడ్ కాదు ఇంకొకరిని వివాహం చేసుకునే అవకాశం ఉండదు.

మ్యూచ్యువల్ గా విడాకులు తీసుకునే మీ లాంటి వారి విషయంలో

  • ముందుగా విడాకుల కోసం పిటిషన్ ఫైల్ చేస్తారు.
  • లాయర్ తెలియపరచిన రోజున ఇరువురూ న్యాయస్థానం ముందు హాజరు అవుతారు.
  • న్యాయస్థానం ముందు ప్రమాణం చేసి ఇరువురి వాదనలను రికార్డు చేస్తారు.
  • తొలి అనుమతిని ఇస్తారు.
  • చివరిగా ఇరువురి యొక్క వాదన మరి ఒకసారి వింటారు.
  • విడాకులు మంజూరు చేస్తారు.

ఎంతో పవిత్రంగా ఏర్పడిన వివాహబంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరువురి మీదా ఉంది.

నా అభిప్రాయం మీరు మనసు విప్పి మాట్లాడుకోవడం అవసరమని భావిస్తున్నాను.” చెప్పింది మాధవి.

“నందినీకి వచ్చిన అనుమానాన్ని క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.” ముందుగా సందీప్ పలికాడు.

“వినడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే నాది అనుమానం కాదు. ఆధారం.” వెంటనే జవాబిచ్చింది నందిని.

“అది నిరాధారం నందూ!” బ్రతిమాలాడుతున్నట్లు మెల్లగా అన్నాడు.

“అవును. నందినీ! అతడేం చెపుతాడో వినకుండా ఇంత పెద్ద నిర్ణయం సమంజసం కాదు.” మాధవి తన వంతు ప్రయత్నంగా పలికింది.

నందిని మౌనంగానే తల అడ్డంగా ఊపింది.

“మీరు ప్రేమికులు. ఒకరినొకరు క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నాకే పెద్దల అనుమతితో పెళ్ళి చేసుకుని ఒకటయ్యారు. ఒక చిన్న అపోహ! మాట్లాడుకుంటే తొలగిపోతుంది గాలి వీస్తే తొలగిపోయే మబ్బులాగే! అయినా వినకపోతే మీ ఉభయుల క్షేమం కాంక్షించే వ్యక్తిగా మీ ముందు ఒక ప్రపోజల్ ఉంచుతున్నాను. పాటిస్తాను అంటే చెబుతాను.

మన హిందూధర్మం ప్రకారం పూర్వకాలంలో ఒక పని అనుకున్నప్పుడు ఒక దైవాన్ని కొలిచేటప్పుడు మండలం దీక్షచేసే అలవాటు ఉన్నది కదా! ఆ విధంగా మీ ఇరువురూ జంటగా ఒక నలభై రోజులు నచ్చిన ప్రదేశాలు చూసి రండి.

తిరిగి వచ్చేటప్పటికి కూడా మీరు ఇదే ఉద్దేశంతో ఉంటే తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. ఏమంటారు?” మాధవి సుదీర్ఘ ఉపన్యాసం ముగించింది.

అంతా విన్నాక కూడా నందిని “ఈ ప్రపోజల్ నాకు నచ్చలేదు.” అంది.

“మాధవి నీ స్నేహితురాలే కదా! ఆమె చెప్పినట్లు వినవచ్చు కదా! విడిపోయే ముందు మనం కూడా ఒక నలభై రోజులు కలిసి ఉండడము అనేది మన ప్రేమకు, ఇన్నాళ్ళ వివాహ జీవితానికి ఒక ముగింపుగా భావిద్దాం.” తొలిసారిగా సందీప్ నోరు విప్పాడు.

“సరే! మన ప్రయాణం హనీమూన్ లాగా సిమ్లా, డార్జిలింగ్, ఊటీ కాకుండా నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నా ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమైన సప్తపురములలో ఒకటైన కాశీ నగరం వెళ్ళి అక్కడుందాము. అయితే మనం కలిసి ప్రయాణం చేసిన ఈ నలభై రోజుల్లో మనం భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా గడుపుదాం. అలాగని ఎక్కువ చొరవ తీసుకుంటే ఒప్పుకోను.” అంది నందిని.

ఎలాగోలాగా అంగీకరించడమే చాలనుకుని సంతోషంగా చేయి కలిపింది మాధవి.

జీవితమంటే చదువూ, కెరీర్ కావొచ్చు.

పెళ్ళీ, పిల్లలూ కావొచ్చు.

ఉద్యోగాలూ, ప్రమోషన్లూ కావొచ్చు.

కానీ జీవితమంటే ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత నిండిన అన్యోన్య దాంపత్యం..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here