మిస్ యూ!!!!!

11
4

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి ఆంగ్లంలో రచించిన కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]

[dropcap]అ[/dropcap]వును, నేను బాగా మిస్ అవుతున్నాను. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న స్థితిని త్రోసిపుచ్చలేను – నిజానికి గత 52 రోజులుగా నన్ను నేను మభ్యపెట్టుకుంటూనే ఉన్నాను. ఈ రోజుల సంఖ్య – నేను తనని మిస్ అవుతున్నానని గ్రహించినప్పటి నుంచి గడిచిన రోజులు! నిజానికి తనని కోల్పోయి ఎన్నేళ్ళవుతోంది? నాకే తెలియదు. బహుశా 15 ఏళ్ళేమో, లేదా 20 ఏళ్ళు. లేదా అంతకన్నా ఎక్కువేనేమో! ఏదేమైనా తను నన్ను (దిక్కుమాలిన స్థితిలో) వదిలి వెళ్ళిపోయాకా, తనని తిరిగిపొందాలనే.. బహుశా, తీరని ఆశతో పత్రికా ప్రకటన ఇద్దామని నిర్ణయించుకున్నాను.

ప్రకటన చిత్తుప్రతి తయారు చేశాను, పన్నెండు సార్లో, పదమూడు సార్లో తిరగరాశాను. చెత్తబుట్టలో నలిపి పారేసిన కాగితాలను లెక్కపెట్టనా.. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. అయినా ఈ చిన్న విషయం గురించి నేనెందుకు సమయం వృథా చేసుకుంటున్నాను? రాసినదాన్ని మరోసారి చదువుకుని సంతృప్తి పడి, రేపు నేనే స్వయంగా వెళ్ళి ‘సిటీ న్యూస్’ ఆఫీసులో ఇవ్వాలని అనుకున్నాను, ఎల్లుండి దినపత్రికలో రావడానికి.

***

నా ప్రకటనని చూడాలన్న ఆత్రుతతో దినపత్రిక చేతిలోకి తీసుకున్నాను. నా కళ్ళు వెంటనే క్లాసిఫైడ్స్ సెక్షన్ వైపు మళ్ళాయి; దాదాపుగా గత 30 ఏళ్ళుగా వాటివైపు చూడాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఆ చిన్నక్షరాలు కళ్ళకి ఇబ్బంది కలిగించాయి (పేపర్ చదవడం నాకు ఎనిమిదేళ్ళప్పటి నుంచే అలవాటయింది). హెడ్ లైన్స్, సంపాదకీయం, క్రీడా వార్తలు, సెంటర్ పేజ్ ఫీచర్స్ – ఈ క్రమంలో పేపర్ చదివేదాన్ని. అయినా నా కళ్ళు వాటి పని అవి చేశాయి.. ఆ ప్రకటన కనబడింది. జాగ్రత్తగా చదివాను, ఎంతో తృప్తి కలిగింది. ప్రకటనని చక్కగా వేసినందుకు పత్రికాఫీసు వాళ్ళని మెచుకున్నాను. ఇప్పుడు ఆశ కలుగుతోంది. అయినా తనని కలిసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్న సంగతి తనకి తెలియజేయకుండా, తను తిరిగి నా దగ్గరకి రావాలని ఎలా ఆశించను?

బలమైన గాలి వీచి కరెంట్ పోయింది. ‘అయ్యో, ఇప్పుడే పోవాలా?’ అని గొణుక్కున్నాను. రాబోయే రెండు రోజుల కోసం తాగడానికి మంచినీళ్లు పట్టుకుని ఉంచుకున్నాను. మొబైల్ కేసి చూశాను. చార్జింగ్ చాలా తక్కువగా ఉంది. అయ్యో! ఇప్పుడు తను ఫోన్ చేస్తే? నన్ను కపటి అనుకోడు? ఇదంతా నేనెందుకు ఊహించలేకపోయాను? బహుశా మా బంధం అంత దృఢమైనది కాదేమో! Que sara sara – ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. ఇంతలో లాండ్‍లైన్ మ్రోగింది. నాలో ఏదో ఉత్సాహం!, అయ్యో, కరెంట్ లేదుగా, కాలర్ ఐడి పనిచేయదు.. ఫోన్ చేస్తున్నదెవరో తెలియదు.. మా ఊర్లో అండర్‍గ్రౌండ్ కేబుల్స్ ఉన్నా కరెంట్ పోతూనే ఉంటుంది. ఇప్పుడు ఫోన్‍లో చిరాగ్గా మాట్లాడకూడదు.. నన్ను నేను సంబాళించుకుని వీలైనంత కుదురుగా మాట్లాడాలనుకుంటూ ఫోనెత్తి ‘హలో’ అన్నాను.

“ఏంటీ గొడవంతా?” కోపంగా వినవచ్చిందో స్వరం. అది మా అమ్మది! నేను పేపర్లో హెడ్ లైన్ కేసి చూశాను. ‘నేడు విశాఖ తీరాన్ని తాకనున్న తుఫాను’. కరెంట్ ఎందుకుపోయిందో ఇప్పుడర్థమైంది. “అమ్మా, కంగారు పడకు. నేను చిన్నపిల్లను కాదు, నా జాగ్రత్తలో నేనుంటాను” అన్నాను.

“మాట మార్చకు. నేను అడుగుతున్నది ప్రకటన గురించి” మా అమ్మ అరిచింది.

“ప్రకటనా? వైజాగ్ లోకల్ ఎడిషన్‍లో వచ్చిన ప్రకటన గురించి చెన్నైలో ఉన్న నీకెలా తెలుసు?” అడిగాను కాస్త తికమకగా, కాస్త బాధతోనూ – ఎందుకంటే నేను వినాలనుకున్న స్వరం ఇది కాదుగా మరి!

“వసుంధరా అంటీ నాకంతా చెప్పారు. నాకు చిరాగ్గా ఉంది. మూడు రోజులు నేను ఊర్లో లేకపోయేసరికి అలాంటి వెర్రి ప్రకటన ఇస్తావా? నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా?”

ఈ వసుంధర అనే ఆవిడ మా అమ్మకి దూరపు చుట్టం. పేరుకి తగ్గట్టే భూమి మీద ఉన్న అన్ని విషయాలూ కావాలావిడకి. సందేహమే లేదు, ఈ పాటికి ఈ న్యూస్ వైరల్ అయిపోయి ఉంటుంది. నేను చాలా సేపు మౌనంగా ఉండిపోవడంతో, అమ్మకి విసుగెత్తింది, “సరే, తుఫానట, జాగ్రత్తగా ఉండు. కిటికీలు, తలుపులు వేసుకో. ఎవరు తట్టినా తలుపు తీయకు. జాగ్రత్త” అంది.

“అమ్మా. నాకిప్పుడు 39 ఏళ్ళు. ఎప్పుడు ఏది ఎలా చేయాలో ప్రతీదీ వివరంగా చెప్పక్కరలేదు. ఆ ప్రకటన గురించి పూర్తి బాధ్యత అంతా నాదే, సరేనా?” అన్నాను..

“నిన్నూ..” అని కోపంగా అంటూ ఫోన్ పెట్టేసింది అమ్మ. అవును, అమ్మ నా మీద కోపంగా ఉంది. కానీ ఆ ప్రకటనలో తప్పేముంది?

ప్రకటనని మళ్ళీ చూశాను. కనబడకుండా పోయిన వ్యక్తి గురించి ప్రకటన అది. ఇటువంటి ప్రకటనలతో తప్పేముంటుంది? ఇందులో దుడుకుతనం ఏముంది? అతిగా స్పందించే తన స్నేహితులని మార్చుకోవాలి అమ్మ.

తలుపు తట్టిన చప్పుడు! నాలో ఉత్సాహం. నా ప్రకటన చూసి తనే వచ్చాడా? ఓహో! ఒకవేళ పనిమనిషి అయితే? అయినా ఇప్పుడు తనెందుకు వస్తుంది? కాంట్రాక్టులలోని the force majeure clause ఉపయోగించడానికి ఆమెకి ఇదే తగిన సమయం కదా! అయితే నా అంచనా తప్పితే సంతోషమే. వెళ్ళి తలుపు తీసాను. ఓ పిల్లిపిల్ల తలుపు కేసి తన తోకని రుద్దుతూ కనిపించింది. ఆ పిల్లిపిల్ల భద్రంగానే ఉన్నట్టు అనిపించి, దాని సంగతి వదిలేసి, తలుపులేసి, కనబడకుండా పోయిన తన గురించి ఆలోచించసాగాను.

మళ్ళీ తలుపు దగ్గర చప్పుడు! నాకెందుకో ‘ఎవరు తట్టినా తలుపు తీయకు’ అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అయినాసరే, మరోసారి అమ్మ సూచనలని ఉల్లంఘించాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళి తలుపు తీశాను. ఎవరూ లేరు.. గాలికి ఎగిరివచ్చిన ఎండు కట్టెపుల్లల వల్ల ఆ చప్పుడు! ఉన్నట్టుండి ఓ పాట గుర్తొచ్చింది.

‘ప్రతి గాలి సడికి తడబడకు

పదధ్వనులని పొరబడకు..

రానిక నీ కోసం సఖీ

నా కళ్ళల్లో నీళ్లు. అసలు తనని ఎందుకు వెళ్ళనిచ్చాను? అయినా ఫేస్‍బుక్‍ ప్రొఫైల్స్ చూడకుండా పేపర్లో ప్రకటన ఇవ్వడమేంటి? ఆ పనీ చేశాను, కానీ ఉపయోగం లేకపోయింది. కానీ మేం వైజాగ్‍లో కలిసి ఉన్నామనీ, నన్నొదిలి పోవడం తనకీ ఇష్టం ఉండదనీ నాకు తెలుసు. అంటే, నేను చేసినదంతా సరైనదేనన్న మాట.

తుఫాను ప్రభావం మొదలయింది. బలమైన గాలులు, కుండపోతగా వాన, తరచుగా పెద్ద శబ్దంతో ఉరుములు. ఈ క్షణంలో తను నా తలుపు ముందు ఉంటే ఎంత బాగుంటుంది? కానీ ఇంత తుఫానులో.. రిస్క్ చేసి తను ఇక్కడికి రాగలడా? కాఫీ కలుపుకుని నెమ్మదిగా తాగుతూ ఆలోచనల్లో లీనమైపోయాను. తలుపుని సుతారంగా తట్టినట్టయ్యింది. వెళ్ళి తీసాను. ఎవరూ లేరు. తలుపులేసి వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ చప్పుడు. ఈసారి తలుపు తీయదలచుకోలేదు. కాఫీ తాగుతూ డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చున్నాను. నా హృదయంలో ఎవరో సందడి చేస్తున్న ధ్వని, ‘పద్మా, నేనిక్కడే ఉన్నాను! నాతో ఎందుకు మాట్లాడవు’ అన్న పలుకులు మంద్రంగా వినిపించాయి.

నేను వణికిపోయాను. ఆ స్వరం తనదే. వెళ్ళి తలుపు తీశాను. అక్కడ ఎవరూ లేరు.

“హాయ్! ఐ మిస్ యు. నా ప్రకటన చూశావని తెలుస్తోంది. కానీ నాకెందుకు కనబడడం లేదు?”

“నేను కనబడకపోతేనేం? నన్ను నమ్ము. నేను దెయ్యాన్నీ కాదు, భ్రమనీ కాదు. కాసేపు మాట్లాడుకుందాం, నేనిక్కడే ఉన్నానని నమ్మితే”

ఆనందించాను. “ఇన్నాళ్ళూ.. కాదు కాదు ఇన్నేళ్ళూ ఏమయిపోయావ్?”

“సరే, ఓ ప్రశ్న అడుగుతాను, దాంతో నీకు జవాబు దొరుకుతుంది. మనం మొదటి సారిగా కలిసి ఉన్నది ఎప్పుడు?”

“స్కూల్లో. అప్పుడే కదా బడి తోటలో మందారాల మీద వాలిన సీతాకోకచిలుకలని తరిమాం?”

“నీతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళి, సరిగ్గా కదిలే ముందు బస్ ఎక్కిందెవరు?”

“నువ్వే. అవును నువ్వే. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు స్వాతంత్ర దినం. మన కాలేజీ ఫంక్షన్ తొందరగా అయిపోయింది. నేను బస్ మిస్ అయ్యేదాన్నే, కాని నీ వల్ల అందుకోగలిగాను. నాతో ఉన్నందుకు థాంక్యూ”

“నేను నీతో లేనిదెప్పుడు? నువ్వు మొదటిసారిగా ఇంటర్-కాలేజ్ డిబేట్‍లో బహుమతి గెలిచినప్పుడు లేనా? క్విజ్ పోటీల కోసం వేరే ఊరు వెళ్ళినప్పుడు లేనా? వైజాగ్, అంతగా సందడి లేని చిన్న ఊరిగా ఉన్న రోజుల్లో, ఓ సాయంత్రం నీకు బ్రెడ్ తినాలనిపిస్తే, దూరమైనా, వెళ్ళి నీకిష్టమయిన బేకరీ నుంచి బ్రెడ్ తెచ్చివ్వలేదా? నీ గ్రాడ్యుయేషన్‍లో, పోస్టు-గ్రాడ్యుయేషన్‍లో, కెరీర్‍లో నేను నీ విజయాలను పంచుకోలేదా? నువ్వు సముద్రం కేసి చూసేటప్పుడు నేను నీతో లేనా?”

ఆ మాటలు వింటున్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. తను చెప్పేదంతా నిజమే. “మరి మనిద్దరం ఒకరినొకరం ఎలా పోగొట్టుకున్నాం?”, తికమకగా అడిగాను.

“నీకు ఉద్యోగం వచ్చాకా, నీ దృష్టంతా దానిపైనే ఉంది. నన్ను నిర్లక్ష్యం చేశావు. పెద్ద పెద్ద వస్తువులు నీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని భావించావు. కానీ నీ ఆలోచనలు తప్పు, నా వినతుల్ని నువ్వు పట్టించుకోలేదు. నేనిప్పుడు ఇక్కడ నీతో ఉన్నాను, నీ దృష్టిలో పడాలని ఎంతో ప్రయత్నించాను, విఫలమయ్యాను. మొదట్లో కొన్నిసార్లు పక్కకి పెట్టినా, కొన్నిసార్లు దగ్గరకీ తీశావు. కానీ ఉద్యోగ బాధ్యతలు పెరిగేకొద్దీ, దానిలోని చిక్కులు విప్పుకునే క్రమంలో నన్ను పూర్తిగా విస్మరించావు. నేను నీ వెంటే ఉండి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురుచూశాను, నిరాశ చెందాను. కాలక్రమంలో నువ్వు నా నుంచి పూర్తిగా దూరం జరిగిపోయావు, కనబడకుండాపోయావు.”

తను చెప్పినదంతా తర్కించుకున్నాను. నిజమే. కెరీర్‍లో ఎదిగే కొద్దీ, తీరిక లేకుండా అయిపోయి, తనతో గడపలేదు. ఆ ప్రకటనని మరోసారి చూశాను. దాంట్లో ఇలా ఉంది:

“కనబడుట లేదు.

నా చిన్ననాటి నేస్తం, ‘సంతోషం’, కనబడుట లేదు. నాకు గుర్తుండి ఆఖరుగా తను నాతో ఉన్నది చిన్నప్పుడు తోటలో సీతాకోకచిలుకలని తరిమినప్పుడు, అది కూడా దాదాపు 25 ఏళ్ళ క్రితం. నువ్వు లేని లోటు బాగా తెలుస్తోంది, నేస్తం! నువ్వు కనుక ఈ ప్రకటన చూస్తే, ఈ క్రింది అడ్రెసులో/టెలిఫోన్ నెంబరులో నన్ను సంప్రదించగలవు..”

మరీ చిన్నపిల్లల చేష్టలా అనిపించింది, ఈ ప్రకటన ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ దీని వల్ల నా సంతోషం నాకు దక్కింది. నిజానికి నా సంతోషం నాలోనే ఉంది, కానీ నేనే, దాదాపుగా రెండు దశాబ్దాలుగా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశాను! సముద్ర తీరంలో వెయ్యికి పైగా ఆల్చిప్పలు సేకరించినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను? బాగా పొద్దుపోయాకా, బ్రెడ్ తినాలనిపిస్తే, నాన్న ఎంతో దూరం వెళ్ళి నాకిష్టమైన బేకరీ నుంచి బ్రెడ్ తెచ్చినప్పుడు ఎంత పొంగిపోయాను? ఓ అంధుడిని రోడ్డు దాటించినప్పుడు ‘సంతోషం’ నా సహచరుడే కదా? అలాగే చదువులో వెనుకబడ్డ ఓ విద్యార్థికి – పరీక్షల ముందు- అర్థమయ్యేలా పాఠాలు చెప్పినప్పుడూ ఎంతో ఆనందం కలిగింది కదా? ఇలాంటి సంతోషపు క్షణాలన్నీ ఏమయిపోయాయిప్పుడు?

నాకు సంతోషాన్ని కలిగించేందుకు ఇలాంటి క్షణాలెన్నో ఎదురై ఉంటాయి, కానీ వాటిని అందుకోడానికి నేను ఆసక్తి చూపలేదు. విలాసాలను ‘హక్కు’లుగా, ‘అవసరాలు’గా మార్చుకోడంలో తీరికలేకుండా ఉన్నాను. తోటివారిని అధిగమించి ముందుకు దూసుకుపోయేందుకు వ్యూహాలు పన్నుతున్నాను. జీవితాన్ని నేనో ఆటగా భావించాను, జీరో-సమ్ గేమ్‍లా, విజయం – పరాజయంలా తలచాను. కానీ ఆ గెలుపుల ద్వారా నాకు సంతోషం లభించలేదు. పైగా వాటివల్ల నాలో ఒత్తిడి పెరిగింది, మరిన్ని సమస్యలు ఎదురయ్యాయి, శత్రువులు ఏర్పడ్డారు. ఫలితంగా కొత్త సవాళ్ళను ఏర్పర్చుకున్నాను, వాటిని అధిగమించాను, మరిన్ని తాజా సవాళ్లకు సిద్ధమయ్యాను, అలా ఓ విషవయలంలో చిక్కుకుపోయాను. ఈ క్రమంలో నేను నాలోనే ఉండి, నా నిర్లక్ష్యానికి నిశ్శబ్దంగా వెక్కిళ్లు పెడుతున్న సంతోషానికి దూరమవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

సంతోషం విలువ నాకిప్పుడు తెలిసింది. “నీ విలువ తెలిపినందుకు ధన్యవాదాలు” అంటూ గట్టిగా అరిచాను ఆనందంతో.

***

“ఇంత పెద్దదానివైనా, ఇంకా నీ అరుపులతో నా నిద్ర చెడగొడుతున్నావ్” నన్ను కుదుపుతూ లేపి, అంది అమ్మ. నిద్ర మత్తు వదల్లేదు నన్ను. కళ్ళు నులుముకుని “ఆ పేపర్ ప్రకటన నాకు ఉపయోగపడింది. అందుకనే అరిచాను, నన్ను తిట్టకు” అన్నాను.

“ఏ పేపరు? ఏ ప్రకటన? దేని గురించి మాట్లాడుతున్నావసలు?” అడిగింది అమ్మ.

నేనేం మాట్లాడకపోయేసరికి, “ఈ పిల్లకేదో పీడకల వచ్చినట్టుంది” అని, మళ్ళీ నిద్రపోయింది.

(సమాప్తం)

(చిన్ననాటి సంతోషాన్ని ఒక మిత్రుడిగా భావించి – జీవితంలో ఎదిగే క్రమంలో అతడిని కోల్పోయిన వైనాన్ని చెబుతూ, ఆ సంతోషాన్ని తిరిగి పొందాలని కోరుకున్న యువతి కథ ఇది)

మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here