[తమ ఊరి గొప్పతనాన్ని వివరిస్తూ, కాలక్రమంలో ఊరిలో వచ్చిన మార్పులను ఈ రచనలో వివరిస్తున్నారు శ్రీమతి కళావతి కందగట్ల.]
[dropcap]నా[/dropcap] ఊరు పోరాటాల పురిటి గడ్డ. ఉద్యమాలకు ఊపిరి పోసిన ఊరు. పేరు పరకాల.
స్వాతంత్ర పోరాటానికి సమర యోధులను కన్న పుణ్యభూమి..
నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి రజాకర్ల దౌర్జన్యానికి బలి అయి వేలమంది అమర వీరుల రక్తంతో తడిసిన నేల మా ఊరు..
మరో జలియన్ వాలాబాగ్ ఉదంతంగా పేరుగాంచి చరిత్రలో నిలిచిన మా ఊరు పరకాల..
***
మా ఊరు వరంగల్ జిల్లాకు 32 కిలోమీటర్ల దూరం.. చుట్టుపక్కల 14 ఊర్లకు వ్యాపార కేంద్రం.. వారం వారం సంత ఇసుక వేస్తే రాలనంత జనం.. అమ్మాలన్నా కొనాలన్నా సంతలోనే. ఆదివారం అంగడి అక్కడి రైతులకు వరం..
***
ఇక మా ఊరికి తూర్పున అంబేద్కర్ విగ్రహం.. అక్కడ మలుపు తీసుకుంటే కాలేశ్వరం రోడ్డు.. కొద్దిగా ముందుకెళ్తే వేల ఎకరాల పంట పొలాల దాహార్తిని తీర్చే చలి వాగు.
ఇక.. అంబేద్కర్ విగ్రహం నుండి స్ట్రయిట్‌గా వెళ్తే వరంగల్ రోడ్డు.. దారిలో పెద్ద గిర్నీ, పొగాకు కంపెనీ, దాన్ని దాటుకుంటే పోతే మండలాఫీసు.. ఇంకొంచెం ముందుకెళ్తే కరెంట్ ఆఫీస్.. తర్వాత అంతా రోడ్డుకు ఇరు పక్కలా పచ్చని పంట పొలాలు.
***
ఊరికి పశ్చిమాన హుజురాబాద్ రోడ్డు.. ఊరు దాటగానే అక్కడ మలుపు తీసుకుంటే మొగుళ్ళపల్లికి వెళ్లే రోడ్.. మా అమ్మ పుట్టిన ఊరు.
పరకాల సెంటర్లో పోలీస్ స్టేషన్.. దానికి ఎదురుగా పోస్ట్ ఆఫీస్.. పోస్ట్ ఆఫీస్ ముందు వరంగల్‌కి వెళ్లే ఎర్ర బస్సులు అక్కడే ఆగేవి..
ఆ పోస్ట్ ఆఫీస్ ముందే.. ముల్కీ రూల్స్ అమలుకై నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితులతో కలిసి నిరాహార దీక్ష చేసాను. అది నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి.
పోస్ట్ ఆఫీస్ వెనక ప్రభుత్వ జూనియర్ కాలేజీ.. పెద్ద గ్రౌండ్. కాలేజీ వెనకాల ప్రభుత్వ ఆసుపత్రి.
***
ఊరికి దక్షిణాన మిషన్ హై స్కూల్ సరిహద్దు.. దానికన్నా ముందే ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్.. నేను పదవ తరగతి వరకు ఆడుతూ పాడుతూ చదువుకున్నది అక్కడే.. స్కూల్‌కి దగ్గరలోనే మసీదు.. దాన్ని పక్కనే సరస్వతీ శిశు మందిర్ స్కూల్.. మొట్టమొదటగా నేను అక్షరాలు నేర్చుకున్నది శిశుమందిర్ లోనే.
మిషన్ హై స్కూల్ దాటాక నాగారం చెరువు.. ఆ చెరువు కట్ట దాటితే నాగారం ఆ ఊరు.. మా నాన్న పుట్టి పెరిగిన ఊరు.
***
ఊరికి ఉత్తరాన కుంకుమేశ్వరుని ఆలయం.. ప్రతి సంవత్సరం షష్టి తీర్థం తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగేది ఆ గుడిముందే.. ఊరంతా బతుకమ్మ పండుగ చేసుకునేది అక్కడే.. ఆడి పాడి గుడి వెనకాల ఉన్న దామర చెరువు లోనే కన్నుల పండుగగా జరిగే బతుకమ్మల నిమజ్జనం.
గుడి ముందు తడకలతో కట్టిన భవానీ థియేటర్.. గుడి దాటి ఇంకాస్త ముందుకెళ్తే పశువుల క్రయవిక్రయాలు జరిగే గొడ్ల అంగడి తర్వాత డాక్ బంగ్లా గెస్ట్ హౌస్, దాన్ని దాటితే పూర్ణ థియేటర్..
ఆ దారి వెల్లంపళ్లి రోడ్..
***
మా ఊరికి ఒక్కటే కాచం రాజ వీరయ్య షాప్.. జబ్బులొస్తే మెడిసిన్ కొనాలన్నా, విద్యార్థులు పుస్తకాలు నోటుబుక్కులు, పెన్నులు పెన్సిల్లు ఏది కొనాలన్నా అదొక్కటే షాప్..
మా ఊరికి ఒక్కటే గ్రంథాలయం. అందులో ఉన్న పుస్తకాలు, నవలలు మొత్తం స్నేహితులతో పోటీపడి చదివిన జ్ఞాపకాలు ఎన్నో.
అక్కడే అమరవీరుల మైదానం.
నాకు గుర్తున్న ప్రైవేట్ డాక్టర్స్ డా. సాయిరెడ్డి.. డా. చక్రపాణి…
సౌందరయ్య డాక్టర్ గారిది పెద్ద మెటర్నటీ ప్రైవేటు హాస్పటల్.. చుట్టుపక్కల ఊర్ల వారితో ఎప్పుడూ కిటకిట లాడేది ఆ హాస్పిటల్. ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎందుకో భయపడేవారు.
***
అప్పటి నా యాదిలో మా ఊరు ప్రశాంతంగా ఉండే పల్లెటూరు.
ఇప్పుడు మా ఊరు చాలా మారింది. కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులకు లోనై.. పట్నపు వాసనలతో.. పెరిగిన జనాభాతో.. వ్యాపార కూడలిలా మారింది.
మార్పు సహజమే కదా!!
***
ఇప్పుడు మారిన మా పరకాల.. పెరిగిన జనాభాకు అనుగుణంగా, చుట్టుపక్కల ఊర్లకు రవాణా సౌకర్యానికి వెలసిన కొత్త బస్ స్టాండ్.. అన్ని ఊర్లకు చక్కటి రోడ్లు.. సెంట్రల్ లైటింగ్‌తో విశాలమైన మెయిన్ రోడ్డు.
ఎందరో ప్రముఖులు విడిది చేసిన డాక్ బంగ్లా మాయం… దాని పక్కన జిల్లా కోర్ట్ సముదాయం. సబ్ జైలు…
ప్రశాంతంగా ఉండే కుంకుమయ్య గుడికి ఎన్నో మార్పులు చేర్పులు.
స్నేహితులతో వెన్నెల్లో కూర్చుని సినిమాలు చూసి ఎన్నో మధురానుభూతులను అందించిన భవాని టాకీస్ స్థలంలో రూపుదిద్దుకున్న బాయ్స్ హైస్కూలు.
దసరా బుల్లోడు సినిమాతో ఓపెనింగ్ అయిన పూర్ణా థియేటర్ కాకతీయ థియేటర్‌గా మారింది.
కొత్తగా వెలిసిన మరో మూడు థియేటర్లు (నటరాజ్, జయ, మహేశ్వర) రైతుల అవసరార్థం పెద్ద వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు, విశాలమైన దామెర చెరువు.. నేడు కుంచించుకుపోయి కుదేలయింది.
నాడు విద్యార్థులతో కలకలలాడిన కాలేజీ.. ప్రభుత్వ పాఠశాల.. నేడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. నాటి రజాకర్ల దాష్టికానికి బలి అయిన అమరవీరుల స్ఫూర్తిగా తహసీల్ ఆఫీస్ ఎదురుగా వెలసిన అమరధామం నేడు దర్శనీయ స్థలంగా ప్రసిద్ధి గాంచింది.
వరంగల్‌కు వెళ్లే దారిలో అందమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిన సాయి దేవాలయం.
ఊరికి ఈశాన్యంగా ఇప్పటికీ నేనున్నానంటూ పరుగులు తీస్తున్న చలివాగు.
దాని పక్కనే జీవితం చాలించిన పరకాల వాసులను అక్కున చేర్చుకుంటున్న వైకుంఠధామం.
పరకాల ప్రజలకు మేటి జర్నలిస్టుగా సుపరిచితుడు, మా అందరి ప్రియ సోదరుడు మెండు శ్రీనివాస్.. పరకాల లోనే తనువు చాలించడం, తమ్ముడి భౌతిక కాయానికి, ఈ వైకుంఠ ధామం లోనే అంతక్రియలు చేయాల్సి రావడం ఊహించని పరిణామం.
***
విపరీతంగా పెరిగిన భూముల రేట్లు. చాలా కుటుంబాలు హనుమకొండకు వలస వెళ్లాయి. చుట్టుపక్కల ఊర్ల నుండి ఎన్నో కుటుంబాలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాయి. నేను పెరిగిన పరకాల ఆధునీకరణ పేరుతో గుర్తుపట్టలేనంత మారిపోయింది. ఎంతగా అంటే కొత్తగా వచ్చావు? నువ్వు ఎవరు? అన్నంతగా!!