దేశ విభజన విషవృక్షం-63

0
4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]కాం[/dropcap]గ్రెస్, ముస్లిం లీగ్ చర్యలన్నీ కూడా దేశాన్ని అనివార్యంగా విభజన దిశగా తీసుకొని పోయాయి. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఆ తరువాత సైమన్ కమిషన్.. అంతకు ముందు 1919 భారత చట్టం.. ఇవన్నీ కలగలిసి వచ్చిన 1935 భారత చట్టం.. దాని ప్రకారం జరిగిన ఎన్నికలు.. అందులో కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్యన విభేదాలు..

ఒకదాని తరువాత ఒకటిగా స్వయం పాలన సాధన దిశగా కాకుండా.. దేశాన్ని ముక్కలు చేసే దిశగానే సాగుతూ వచ్చాయి. వివిధ స్వదేశీ సంస్థానాలను కూడా కాంగ్రెస్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. నిజానికి 1935 చట్టం లోనే అఖిల భారత సమాఖ్య (ఫెడరల్ ఇండియా) ను ఏర్పాటు చేయాలని ఉన్నది. కానీ.. వీళ్ల సెల్ఫ్ సెంట్రిక్ పాలిటిక్స్ మూలంగా అదీ జరుగలేదు. దీనికి తోడు 1939లో జర్మనీపై తాను ప్రకటించిన యుద్ధంలో భారత్‌ను కూడా భాగస్వామిని చేస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకోవడం ముస్లిం లీగ్‌కు బాగా కలిసి వచ్చింది. ముస్లిం లీగ్ కాంగ్రెస్‌తో అన్ని బంధాలను తెంచుకొన్నది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనించిన ముస్లిం లీగ్ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ.. తన లక్ష్య సాధన దిశగా పావులు కదిపింది. కానీ.. గాంధీగారు కానీ, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ కానీ.. ముంచుకొస్తున్న ముప్పును గమనించలేదు. ముస్లిం లీగ్‌తో పాటు వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా బ్రిటన్‌కు మద్దతును ఇవ్వడంతో కాంగ్రెస్ మాటకు విలువే లేకుండా పోయింది. ముందుగానే చెప్పినట్టు బ్రిటన్ సైన్యంలో ముస్లింలో పెద్ద ఎత్తున చేరిపోయారు. ఈలోగా ప్రపంచ రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారుతూ వచ్చింది. 1941 డిసెంబర్‌లో జపాన్ దేశం డచ్, బ్రిటన్, అమెరికాపై యుద్ధం ప్రకటించింది. 1942 ఫిబ్రవరి 15న సింగపూర్ పతనమైంది. 1939లో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం.. దాని పర్యవసానాలు, తదనంతర పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఒక పక్క బర్మాను జయించడంతో జపాన్ సైన్యం భారతదేశానికి అతి సమీపంలోకి వచ్చాయి. ఈ సైన్యంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఉన్నది. దీంతో బ్రిటిష్ సైన్యం క్రమంగా బలహీనమవుతున్నదని భారతీయులు భావించారు. పర్యవసానంగా భారతీయులు బ్రిటన్‌ను డిమాండ్ చేసే స్థాయికి చేరుకున్నారు. అటు సింగపూర్ పతనమైన తరువాత పట్టుబడిన యుద్ధ ఖైదీలలో భారత సైనికులు కూడా ఉన్నారు. రంగూన్ నుంచి బ్రిటిష్ ఇండియా సైన్యాలు వెనుదిరగాల్సి వచ్చింది. సింగపూర్‌లో ఓటమి పాలు కావడమే కాకుండా.. భారత్‌పై కూడా యుద్ధానికి జపాన్ హెచ్చరించడంతో బ్రిటన్‌లో క్రమంగా ఆత్మస్థైర్యం సన్నగిల్లుతూ వచ్చింది. ఇదే సమయంలో సుభాష్ చంద్రబోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్‌తో భారత్‌పై యుద్ధానికి జపాన్ సహాయాన్ని కోరారు. కాంగ్రెస్‌లో రాడికల్స్‌గా ముద్ర పడిన వాళ్లలో లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి వారు అప్పటికే కనుమరుగైపోయారు. అరవిందఘోష్ యోగమార్గంలోకి వెళ్లిపోయారు. ఇక మిగిలింది నేతాజీయే. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్‌తో చేయి కలిపింది. ఈ ఒక్క కాంగ్రెస్ రాడికల్ వల్ల బ్రిటన్ ప్రభుత్వం కలవర పడింది. క్రమంగా భారత్‌ను విడిచిపెట్టాలన్న ఆలోచన బ్రిటన్ నాయకుల్లో ప్రబలుతూ వచ్చింది. ఈ దిశలో లేబర్ పార్టీ మంత్రులు, కన్జర్వేటివ్ నాయకులూ కూడా భారత్‌ను వదిలేయాలన్న ప్రతిపాదన చేశారు. కానీ, ప్రధాని విన్ స్టన్ చర్చిల్ మాత్రం బ్రిటిష్ సామ్రాజ్య విచ్ఛిన్నానికి అంగీకరించలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం భారత దేశ స్వాతంత్ర్యం ఎలా వచ్చిందనేది. మనల్ని ఇంతకాలం చీకట్లలో ఉంచి తాము తమకు అనుకూలంగా రాసుకొన్న చరిత్రను మన చేత తరాల తరబడి చదివించి అదే నిజమని నమ్మించారు. కానీ అందులోని వాస్తవాలు, అవాస్తవాలు ఏమిటో అప్పుడు జరిగిన పరిణామాలు చెప్పకనే చెప్తాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం ఏమిటన్నది ప్రశ్నార్థకమే. మొదట రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం అన్నారు.. అది ఖిలాఫత్‌కు పూర్వరంగంగా జరిగింది. ఆ తరువాత సహాయ నిరాకరణ అన్నది పూర్తిగా టర్కీలో ఉన్న ఖలీఫా గురించి మన దేశంలో జరిగిన ఆందోళన మాత్రమే. దండి సత్యాగ్రహం కూడా స్వాతంత్ర్యం కోసం జరిగింది కాదు.. పన్నుల తొలగింపు కోసమే. కాకపోతే.. దేశాన్ని ఏకం చేయడానికి.. స్వదేశీ ఉద్యమానికి అది గొప్ప ప్రేరణనిచ్చింది. కాంగ్రెస్ గట్టిగా స్వాతంత్ర్యం చేసిన పోరాటం ఏదైనా ఉన్నదా అంటే.. అది క్విట్ ఇండియా మాత్రమేనని చెప్పవచ్చు. కానీ దీని ప్రభావం కూడా బ్రిటన్ ప్రభుత్వం మీద ఏమాత్రం పడలేదనే చెప్పాలి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం నాటికి జపాన్ దూకుడు బ్రిటన్‌ను అన్ని విధాలుగా ఆత్మరక్షణలో పడేశాయి. స్వదేశంలో రాజకీయ పరిణామాలకు తోడు.. ప్రపంచ పరిణామాలు కూడా బ్రిటన్‌పై ఒత్తిడికి కారణమయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న జపాన్‌కు కళ్లెం వేయాలంటే.. షియాంగ్ షేక్ నేతృత్వంలోని జాతీయవాద చైనాకు సహాయం చేయడం అమెరికాకు అవసరమైంది. ఒకవేళ చైనా తీర ప్రాంతాలను జపాన్ ఆక్రమిస్తే.. చైనాకు సహాయం చేయడానికి అమెరికాకు ఉన్న ఏకైక రవాణా మార్గం భారత్ మాత్రమే. భారత్‌కు సముద్రమార్గంలో మయన్మార్ (నాటి బర్మా) మీదుగా ఆయుధాలు సరఫరా చేయాల్సి ఉన్నది. బర్మా కాకుండా ఇతర మార్గాలను కూడా వినియోగించుకోవాలంటే.. భారత ప్రజల మద్దతు, సైనిక శక్తి అమెరికాకు చాలా అవసరమవుతుంది. భారత్‌లో మెజార్టీ ప్రజల మద్దతు ఉన్న పార్టీ కాంగ్రెస్ కావడంతో దానితో సఖ్యత అవసరమైంది. కానీ.. అప్పటికి నెహ్రూ సోవియట్ యూనియన్ వెంట నడుస్తున్నారు. అంతే కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పరిస్థితుల గురించి అప్పటికే అమెరికా అంచనాలు మొదలు పెట్టింది. ఏకధృవ ప్రపంచ దిశగా తన ఆధిపత్యాన్ని సాధించడం కోసం కావాల్సినన్ని ఎత్తులు వేస్తూ వస్తున్నది. యుద్ధానంతర ప్రపంచ రూపాన్ని రూపొందించే క్రమంలో అమెరికాలో రూజ్‌వెల్ట్ ప్రభుత్వం బిజీ అయిపోయింది. ఈ విషయంలో రూజ్‌వెల్ట్ వేసిన ప్రణాళికే ఇవాళ్టి అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి ప్రధాన కారణమైంది. అమెరికా జాతీయ ప్రయోజనాలు ప్రధానంగా.. సైద్ధాంతిక వాణిజ్య కలాపాలు నిరాటంకంగా సాగటం కోసం ఆసియా ప్రాంతం స్వేచ్చ పొందాల్సిన అత్యవసరం ఉన్నదని రూజ్‌వెల్ట్ భావించారు. ఆసియా డి-కొలనైజేషన్ అమెరికా ప్రయోజనాలకు అత్యంత ప్రధానం కావటంతో మిత్రదేశం బ్రిటన్‌పై ఒత్తిడి పెరిగింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ సామగ్రి కోసం అమెరికా మీదే బ్రిటన్ ఆధారపడి ఉన్నది. అప్పటికి బ్రిటన్‌కు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. చర్చిల్‌కు మాత్రం అప్పటికి డికొలనైజేషన్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే.. అప్పటికే ఆగ్నేయాసియాలో తగిలిన ఎదురుదెబ్బలు మళ్లీ తగలకుండా చూసుకోవాలంటే.. అమెరికాతో ఏదో రకంగా రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం రెండో ప్రపంచ యుద్ధం గండం గట్టెక్కడానికి అమెరికా ఆకాంక్షపై కనీసం ఆలోచనైనా చేస్తున్నారని అనిపించేలా వ్యవహరించాల్సి వచ్చింది. భారత్‌కు స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం నామమాత్రంగానైనా చెప్పాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రధాని చర్చిల్.. క్రిప్స్ రాయబారానికి తెర లేపారు. క్రిప్స్ 1942 మార్చి 22 న క్రిప్స్ భారత్‌కు వచ్చాడు. అతను వచ్చిన మర్నాడే.. పాకిస్తాన్ కోసం లాహోర్‌లో తీర్మానం చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముస్లింలు ఆకుపచ్చ జండాలతో వీధుల్లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని చూసిన క్రిప్స్ తనదైన ఆలోచనలకు తెరతీశాడు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారత్‌కు స్వాతంత్ర్యం ఇస్తామని తాను కలిసిన నేతలతో క్రిప్స్ ప్రయివేటుగా చెప్పాడే తప్ప అధికారికంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. తాను కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నా.. ఇతరత్రా కూడా అన్ని తలుపులూ తెరిచి ఉంచానని ప్రకటించాడు. క్రిప్స్ ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింల ప్రయోజనాలకు భిన్నంగా ఉండకూడదని.. ప్రధానంగా లాహోర్‌లో చేసిన పాకిస్తాన్ సిద్ధాంతానికి ప్రతికూలంగా ఉండరాదని మహమ్మద్ అలీ జిన్నా విస్పష్టంగా తేల్చి చెప్పాడు. తమకు వ్యతిరేకంగా ఉండే ఏ ఒక్క ప్రతిపాదనను అంగీకరించేది లేదని కూడా పేర్కొన్నాడు.

ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిందేమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధంలో ముస్లింల మద్దతు కోసం బ్రిటన్ పాలకులు ఆత్రంగా ఎదురుచూశారు. ఎందుకంటే.. నెహ్రూను కాదని కాంగ్రెస్ అడుగు ముందుకు వేసే పరిస్థితిలో లేదు. నెహ్రూగారి మద్దతుతో చక్రవర్తుల రాజగోపాలాచారి.. క్రిప్స్ దగ్గరకు వెళ్లి చర్చలు జరిపారు. బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలంటే.. ముందుగా భారత్‌కు స్వపరిపాలన అందించాలని.. యుద్ధం ముగిసిన తరువాత దేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వాలని రాజగోపాలాచారి డిమాండ్ చేశారు. క్రిప్స్ కూడా సానుకూలంగా మాట్లాడారు. భారతదేశం కామన్వెల్త్ నుంచి పూర్తిగా వెళ్లిపోవడానికి.. పూర్తి స్వాతంత్ర్యాన్ని (డొమినియన్ స్టేజ్) ఇస్తామని హామీ ఇచ్చాడు. రక్షణ శాఖ మాత్రం బ్రిటన్ దగ్గర ఉంటుందని నమ్మించారు. ఆ తరువాత గాంధీగారిని కూడా క్రిప్స్ కలిసి మాట్లాడారు. స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నదని చెప్పారు. కానీ గాంధీగారు యుద్ధం అన్న భావనకే నైతికంగా వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల యుద్ధంలో భారతీయులు పాల్గొనడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వేళ యుద్ధంలో పాల్గొనేందుకు ప్రస్తుతం స్వాతంత్ర్యం ఇస్తామని క్రిప్స్ చెప్పినప్పటికీ, యుద్ధం తరువాత వారు నాలుక మడత పడుతుందని అభిప్రాయపడ్డారు. క్రిప్స్ ప్రతిపాదన దివాలా తీయనున్న బ్యాంకు పోస్టు డేటెడ్ చెక్కు ఇచ్చినట్టుగా ఉన్నదని కూడా గాంధీగారు వ్యాఖ్యానించారు. ఇలా గాంధీగారి మాటతో, నెహ్రూగారి సోవియట్ ప్రభావంతో కాంగ్రెస్‌వాదులు యుద్ధానికి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో ముస్లింలీగ్ కాంగ్రెస్ బాటకు పూర్తి భిన్నంగా బ్రిటిష్ వారికి మద్దతు ప్రకటించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ సొంత స్వేచ్ఛకే ముప్పు వాటిల్లిన సమయం కావడంతో ముస్లింల మద్దతు అత్యవసరమైంది. అదే సమయంలో క్రిప్స్ ప్రతిపాదనలు ముస్లిం ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించాడు. ముస్లింలకు అనుకూలంగా తమకు స్వతంత్ర పాకిస్తాన్‌కు సంబంధించిన ప్రతిపాదన లేకపోతే.. తీవ్రంగా వ్యతిరేకిస్తామని జిన్నా హెచ్చరించాడు. దీంతో కొన్ని నిబంధనలను క్రిప్స్ ప్రైవేటుగా ప్రతిపాదించాడు. యుద్ధం తరువాత స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు దేశంలోని ప్రావిన్సులు భారతదేశంలో చేరాలా వద్దా అనే స్వేచ్ఛను వాటికే వదిలేయాలన్న పనికిమాలిన ప్రతిపాదన చేశాడు. ఇది ముస్లింలకు బాగా బాగా అనుకూలమైన ప్రతిపాదన అయింది. ఈ నిబంధన కారణంగానే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జునాగఢ్, హైదరాబాద్ వంటి సంస్థానాలను విలీనం చేసుకోవడానికి సైనిక చర్య తీసుకోవాల్సి వచ్చింది. కశ్మీర్ ఇవాళ్టికీ రావణ కాష్టంలా మండుతూనే ఉన్నది. అయితే క్రిప్స్ చేసిన ప్రతిపాదనలన్నీ కూడా ప్రైవేటుగా చేసినవే తప్ప అధికారికంగా చేసినవేవీ కాదు. అయన అధికారికంగా చేసిన ప్రతిపాదన ఒక్కటే. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో భారతీయుల సంఖ్యను పెంచుతామని మాత్రమే. మిగతావన్నీ కూడా ప్రైవేటుగా ఎన్నికల వాగ్దానాల మాదిరి ఇవ్వటమే. క్రిప్స్ రాయబారం అంతా కూడా ఏదో రకంగా భారతీయులను రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేందుకు ఒప్పించడమే ధ్యేయంగా సాగింది. ఈ పరిస్థితిని ముస్లిం లీగ్ చక్కగా వినియోగించుకున్నది. ఒక పక్క క్రిప్స్ రాయబారాన్ని వ్యతిరేకించింది. తమ లాహోర్ తీర్మానాన్ని అనుసరించి పాకిస్తాన్ డిమాండ్‌కు క్రిప్స్ న్యాయం చేయలేదని జిన్నా అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్రిటన్ ప్రభుత్వం యునైటెడ్ ఇండియా ప్రతిపాదనకే అనుకూలంగా ఉన్నదని, పాకిస్తాన్ ప్రతిపాదనకు లేదని 1942 ఏప్రిల్‌లో విలేఖరుల సమావేశం పెట్టి మరీ నిరసన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ విషయం తేల్చకుండా.. ముస్లిం స్వతంత్ర రాజ్యంగా పాకిస్తాన్‌ను ఇవ్వకుండా భారతదేశానికి తక్షణ స్వాతంత్ర్యం ఇవ్వాలని కాంగ్రెస్ చేసిన డిమాండ్‌ను జిన్నా తీవ్రంగా వ్యతిరేకించాడు. అదే సమయంలో చాలా తెలివిగా రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతూ ప్రకటించాడు. ఒకేసారి ద్వంద్వ వైఖరులను అవలంబించడం బ్రిటన్ వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చింది. క్రిప్స్ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందుగానే చెప్పినట్టు స్వాతంత్ర్యం ఇస్తామని మాటల్లో చెప్పాడే తప్ప చేతల్లో సాధికారికంగా చెప్పలేదు. చర్చిల్ వ్యూహాన్ని తూచ తప్పకుండా పాటించాడు. అచ్చం ఇవాళ మన రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగుల పై అధికారులు కానీ వ్యవహరించినట్టే క్రిప్స్ కూడా వ్యవహరించాడు. ఈ విషయాన్ని గాంధీగారు ఊహించారే తప్ప, ముస్లిం లీగ్ ఎత్తుగడ భవిష్యత్తులో దేశం ముక్కలు చేయడానికి దారి పరుస్తున్నదన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. క్రిప్స్‌తో చర్చల ప్రక్రియను గాంధీగారి నిర్ణయంతో కాంగ్రెస్ నిలిపివేసింది. యుద్ధానికి మద్దతు కావాలంటే తక్షణం భారత్‌కు పూర్తి స్థాయిలో స్వయంపాలన ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. కానీ, బ్రిటిష్ వారు ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు.

క్రిప్స్ ప్రతిపాదనలు విఫలం కావడంతో గాంధీగారు భారత్ ఛోడో ఆందోళనకు పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్త ఆందోళన మొదలైంది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు జైలుపాలయ్యారు. క్విట్ ఇండియాలో ముస్లింలు పాల్గొనలేదు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడాన్ని వ్యతిరేకించింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని జిన్నా తీవ్రంగా ఖండించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌తో పాటు పాల్గొనాలని భారతీయ ముస్లింలకు పిలుపునిచ్చాడు. ముస్లింల సహకారం బ్రిటిష్ వారికి పూర్తి ఉత్సాహాన్ని ఇచ్చింది. యుద్ధ సమయంలో భారతదేశాన్ని పరిపాలించడానికి కూడా ముస్లింల సహాయం తీసుకొన్నది. నెహ్రూ తన తొందరపాటుతో అన్ని ప్రావిన్సుల్లో ప్రభుత్వాలను రద్దు చేయడంతో ముస్లిం నాయకులు, అధికారులతో పరిపాలన సాగించింది. దీంతో దాదాపు అన్ని ప్రావిన్సుల్లో ముస్లిం నేతలు పాలకులయ్యారు. ముస్లిం సైనిక సిబ్బంది.. బ్రిటన్‌కు యుద్ధంలో చాలా ఉపయోగపడింది. 1945లో యుద్ధం ముగిసే వరకు కూడా రాజకీయ యవనికపై ముస్లింలు కీలక పాత్ర పోషించారు.

యుద్ధం ముగిసే సరికి బ్రిటన్ బలహీనపడుతూ వచ్చింది. 1945 నాటికి విమాన ప్రమాదం జరిగి సుభాష్ చంద్రబోస్ కన్నుమూశారు. కానీ.. ఆయన ఇచ్చిన ప్రేరణతో ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యం బ్రిటిష్ ఇండియా నౌకా దళంలో క్రమంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించింది. అదే సమయంలో 1945-1946 ఎన్నికలలో కాంగ్రెస్ రాజకీయ నాయకులు పోటీలో నిలబడి ప్రాంతీయ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం బలహీనమవుతుండటంతో కాంగ్రెస్ రాజకీయ నాయకుల స్వరం కూడా సంపూర్ణ స్వరాజ్యం డిమాండ్ చేసే దిశగా పెరగనారంభించింది. అటు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు.. యుద్ధసమయంలో పరిపాలనలో సహకరించిన ముస్లింలకు వారి డిమాండ్లు నెరవేర్చుకోవడం చాలా చాలా తేలిక దారి ఏర్పడింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here