[box type=’note’ fontsize=’16’] “తెలంగాణ సాహిత్య వైభవానికి ఇక్కడివారి తెలుగు భాషాభిమానానికి నిలువెత్తు దర్పణాలుగా నిలిచాయి ఆనాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు అలంపురు సభలు” అంటూ “అరవై ఐదు ఏళ్ళ నాటి అలంపురం సభలు” గురించి వివరిస్తున్నారు డా. గుమ్మనగారి బాల శ్రీనివాస మూర్తి. [/box]
[dropcap]ఇ[/dropcap]టీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఒక మహత్తరమైన పరికల్పన, తిరుగులేని వాస్తవికతగా మారిన సందర్భం ఇది. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి మాత్రమే కాదు, వివిధ దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు, స్థానిక తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, చరిత్రకారులు, కళాకారులతో ఏడు రోజుల పాటు భాగ్యనగరం కళకళలాడిన తీరు సభల్లో పాల్గోన్న వారందరికీ తెలిసిందే. చక్కని ఆతిథ్యం ఔచితీవంతమైన సదస్సుల రూపకల్పనలతో మొన్నటి ప్రపంచ తెలుగు మహాసభలు అందరి ఆదరాన్ని అందుకున్నాయి. తెలుగు సాహిత్య చరిత్రలో, వర్తమాన తెలుగు సాహిత్యంలోనూ తెలంగాణ విశిష్ట భూమికను ఈ సభలు విస్పష్టంగా ఆవిష్కరించాయి. మొన్నటి ప్రపంచ తెలుగు మహాసభల అనుభవాలు అరవై ఐదు సంవత్సరాలనాటి అలంపురం మహాసభలను గుర్తుకు తెచ్చాయి. ఆరున్నర దశాబ్దాల నాడు తుంగభద్ర సమీపంలోని అలంపురం – ఆంధ్ర సారస్వత పరిషత్తు మహాసభలకు వేదికగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఉన్న ఆనాటి ఆంధ్ర సారస్వత పరిషత్తును గురించి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. 1943లో అనేక మంది తెలుగు భాషాభిమానుల ఆదరంతో ఆరంభమైన పరిషత్తు మొదట హైదరాబాద్, అటు తరువాత వరంగల్లు, మహబూబ్‌నగర్, తూప్రాన్, మంచిర్యాలల్లో మహా సభలు విర్వహించుకున్నది. ఇవన్నీ గొప్పగానే జరిగాయి. అయితే 1953 జనవరి 11,12,13,14 తేదీల్లో అలంపురంలో జరిగిన మహాసభలు మాత్రం “నభూతో” అన్న రీతిలో అత్యంత వైభవంగా జరిగాయి. పరిషత్తు చరిత్రలో ఈ సభలు చిరస్థాయిలో నిలిచిపోయాయి. అనాటి అలంపురం సభల్ని గురించి మహాకవి దాశరథి, సభల నిర్వాహకుల్లో ముఖ్యులు దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణ శర్మ, ప్రజాకవి కాళోజి ఆత్మకథల్లో ప్రస్తావనలున్నాయి. ఎన్నో వ్యాసాల్లో అలంపురం సభల విశేషాలు దొరుకుతాయి. ఆ సభల్లో పాల్గొన్న కవి పండిత రచయితలందరూ ఏదో ఒక సందర్భంలో అలంపురం విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఆనాటి తెలంగాణాలోని తెలుగు భాషా సాహిత్యాభిమానుల చెతన్యవంతమైన ఆలోచనలు, సాస్కృతిక రంగంలో సుదీర్ఘ కాలం పరిశ్రమించిన మహనీయుల సేవానిరతికి అలంపురం సభలు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
అలంపురం ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో రాయచూర్ జిల్లాలో ఉండేది. రాయచూర్ జిల్లా ప్రధానంగా కన్నడ భాషా ప్రాంతం. అలంపురం హైదరాబాద్ నగరానికి సుదూరంగా ఉంటుంది. అప్పట్లో ఇప్పటి రవాణా సౌకర్యాలు లేవు. మౌలిక వసతులు మామూలు. అయినా అలంపురంలో ఇంత పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని సంకల్పించారు పరిషత్తు ప్రముఖులు. అలంపురానికి చెందిన గడియారం రామకృష్ణ శర్మ ఇందుకు గట్టిగా ప్రతిపాదన చేసి ఉంటారని ఊహించాలి. మహాసభల్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని పరిషత్ నిర్ణయించింది. సభలకు ఆనాటి ఉపరాష్ట్రపతి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్‍ను ఆహ్వానించడం సముచితమని భావించింది. సభా నిర్వహణ ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.
గడియారం రామకృష్ణ శర్మ రచించిన “శతపత్రం”లో (ఈ ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది) “ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలు” పేరుతో పలు విశేషాలున్నాయి. సభల కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అధ్యక్షులు చల్లా వేంకట రామారెడ్డి. మారం నరసింగారెడ్డి ఉపాధ్యక్షులు. ప్రధాన కార్యదర్శి గడియారం రామకృష్ణ శర్మ, సంయుక్త కార్యదర్శి గన్నమరాజు రామేశ్వరావు, ఇటిక్యాల వెంకటస్వామిశెట్టి కోశాధికారి.
ఎంతోమంది కార్యకర్తలు ప్రధాన నిర్వాహకులతో కలసి పని చేశారు. దాదాపు రెండు నెలల పాటు వీరందరూ విశేషంగా శ్రమించినట్లు అర్థమవుతోంది. గడియారం వారు తెలిపిన వివరాల ప్రకారం; చల్లా వేంకట రామారెడ్డి భోజనాల బాధ్యతను తీసుకొన్నారు. కార్యక్రమాలు జరిగే వివిధ వేదికలు, మంచి నీటి వ్యవస్థ, విద్యుద్దీపాలు, సభావేదిక అలంకరణలు, రవాణా వ్యవస్థ, ఆహ్వానాలు పంపిణీ చేయడం – ఇట్లా అనేక బాధ్యతల్ని అందరూ పంచుకొన్నారు. ఎవరి బాధ్యతల్లో వారు లీనమైపోయారు. వేలమంది అతిథుల కోసం శ్రీశైలం నుంచి లారీల్లో వంటపాత్రలు తీసుకుని వచ్చారు. డజనుమందికి పైగా వంటలు వండే నిపుణులని రప్పించారు. అతిథుల రాక కోసం హైదరాబాద్ నుంచి అలంపురం వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయించారు. అలంపురం సభల ప్రచారం కోసం ప్రత్యేక స్లైడ్లను తయారు చేయించి ఆ రోజుల్లోనే దేశంలోని 200 థియేటర్లలో ప్రదర్శించారు! నాటి సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి వి.బి.రాజు, సారస్వత పరిషత్తు పట్ల ప్రత్యేకాభిమానాన్ని ప్రకటించిన మంత్రి ఫూల్‌చంద్ గాంధీ, మరొక ప్రముఖ నాయకుడు జి. ఎస్. మేల్కోటేల సహకారం లభించింది. నాటి సభల్లో అతిథులకు పండుగ భోజనాన్ని వడ్డించారు. ఆ విశేషాల్ని గడియారం వారి మాటల్లోనే చెబితే:
“పూటకు మూడు నాలుగు వేల మంది భోజనం చేస్తారనుకున్న మా అంచనా తలక్రిందులైంది. దాదాపు ప్రేక్షకులు 30 వేల వరకు వచ్చిరి. మా వంటవారు సాయంకాలమే ప్రజలను అంచనా వేసి 20 వేలమందికి వంట చేసి ఉండిరి. వెంకట రామారెడ్డి గారు మా అంచనాలు తారుమారైనందుకు బాధ పడలేదు. ఉత్సాహంతో ఎంతమందికైనా అన్నం పెడతానని మాట ఇచ్చిరి. తెల్లవార్లూ లారీలు, ట్రాక్టర్లలో కర్నూలు నుండి బియ్యము, బేడలూ (కందిపప్పు), నెయ్యి, నూనె, కూరగాయలు, విస్తళ్ళూ తెప్పించిరి. 13వ తేదీ సాయంకాలం నన్ను పిలిచి రేపు సంక్రాంతి పండుగ, ఇంతమంది పండితులు వచ్చినారు, వారికి పప్పన్నం పెడితే బాగుండదనీ, దాదాపు రెండు వేల కంటే ఎక్కువ ఉన్నా పండుగ భోజనం పెడదామని చెప్పిరి. నేను సంతోషించితిని. వంటవాళ్ళు లడ్డూ, పులిహోర చేస్తామని చెప్పిరి. తెల్లవార్లూ పిండివంటలు వండి పండగనాడు రెండువేల మందికి పండగ భోజనం పెట్టిరి. అందరూ మా సభలనూ, అన్నదాత వేంకటరామారెడ్డిని ప్రశంసించిరి (శతపత్రం – 131 పుట).
“అలంపురం సభలు సారస్వత పరిషత్ చరిత్రలో మహోజ్వల ఘట్టం” అని “యాభై సంవత్సరాల జ్ఞాపకాలు”లో దేవులపల్లి రామానుజరావుగారు వ్రాశారు. కార్యక్రమాలకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆహ్వానించాలని ఆయన గట్టిగా కోరుకున్నారు. రాధాకృష్ణన్‍ను కలిసేందుకు వెళ్ళినప్పుడు తనతో పాటు పార్లమెంటు సభ్యులు పుచ్చలపల్లి సుందరయ్య, రాజ్ బహాదూర్ గౌర్‌లు ఉన్నారని రామానుజరావు గుర్తు చేసుకున్నారు. రాధాకృష్ణన్ అలంపురం సభలకు వచ్చేందుకు అంగీకరించారు. అప్పటికే ఆయనకు జాతీయ – అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప విద్వాంసులుగా గుర్తింపు ఉంది. నిరుపమానమైన వకృత్వ ప్రతిభ రాధాకృష్ణన్ స్వంతం. ఆయన ప్రసంగం కొరకు వేలాదిమంది ఆసక్తితో ఎదురుచూశారు. 11వ తేదీనాడు ప్రారంభమైన కార్యక్రమంలో రాధాకృష్ణన్ ప్రసంగం అత్యద్భుతమని ఆనాటి ప్రముఖుల జ్ఞాపకాలు చెబుతున్నాయి. కొంతసేపు తెలుగు, మరికొంత సమయం ఇంగ్లీషులోనూ సాగిన సర్వేపల్లి ప్రసంగం శ్రోతల హృదయాలపై చెరగని ముద్రవేసింది. రాధాకృష్ణన్ ప్రసంగం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందని దాశరథి “యాత్రాస్మృతి”లో రాశారు. నాటి సభలో విశ్వనాథ స్నాతకోపన్యాసం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సాంస్కృతిక ప్రదర్శలని ప్రారంభించారు.
మహాకవి దాశరథి ఆత్మకథ “యాత్రాస్మృతి”లో ‘గుణభద్రా-తుంగభద్రా నదీ’ అన్న వ్యాసంతో పాటు మరొక రెండు వ్యాసాలూ అలంపురం సభల్ని గుర్తు చేస్తాయి. “పెద్ద పందిళ్ళూ, షడ్రసోపేతమైన భోజనాలు, కావ్యగోష్ఠులు, చర్చలు, వాదోపవాదాలు, మంగళవాద్యాలు – ఆ వైభవం వర్ణనాతీతం” అంటూ సభలు జరిగిన ముప్ఫై మూడు సంవత్సరాల తర్వాత కూడా (1985) పదిలమైన మధురమైన స్మృతులకు అక్షరాకృతిని ఇచ్చారు దాశరథి. యాత్రాస్మృతిలోని ఒక అంశాన్ని ఇక్కడ ఉటంకించడం సముచితం. రాధాకృష్ణన్ సహృదయత, గడియారం విద్వత్తు ఇందులో కనబడతాయి.
గడియారం రామకృష్ణ శర్మ
“శ్రీ చాళుక్య నృపాల పాలితము, రాశీ భూత విద్యా కళా
ప్రాచుర్యం బల దక్షిణాపథ పవిత్ర క్షేత్ర రాజంబు నా
ప్రాచీనాంధ్ర విభూది చిహ్నమగు ఆలంపురు నందాంధ్ర వా
ణీ చాంపేయ సుమార్చనల్ జరుగుచుండెన్ నేత్ర పర్వంబుగన్…”
అని గళమెత్తి శ్రావ్యంగా పద్యాలు చదువుతుంటే డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ “భేషు, భేషు” అన్నారట (యాత్రాస్మృతి, పుట 43).
తెలంగాణ ప్రాంతంలో కవి సమ్మేళనాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉండేది. ఇది కొంచెం ఇంచుమించుగా ఆనాటి స్థాయిలోనే ఈనాటికీ కొనసాగుతోంది. ఆంధ్ర సారస్వత పరిషత్తు కవి సమ్మేళనాలని బాగా ప్రోత్సహించింది. అటు తరువాత కాలంలో తెలంగాణ రచయితల సంఘం కవి సమ్మేళనాలను పెద్ద సంఖ్యలో నిర్వహించింది. నాడు జరిగే కవి సమ్మేళనాలు రాత్రి ప్రారంభమై తెల్లవార్లూ జరిగేవని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య వంటి పండితుల అప్పటి జ్ఞాపకాలు చెబుతున్నాయి. సారస్వతోత్సవాల రెండవరోజు అంటే జనవరి 12 నాడు రాత్రి కవి సమ్మేళనం జరిగినట్లు దాశరథి యాత్రాస్మృతి చెబుతోంది. మహాకవి మాటల్లోనే చెబితే “తెల్లారేదాకా కవి సమ్మేళనం జరుగుతూనే ఉంది. సభా మండపం శ్రోతలతో కిక్కిరిసిపోయింది. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ దేశోద్ధారక గ్రంథమాల వారు (వట్టికోట ఆళ్వారుస్వామి) కాళోజీ గేయసంపుటిని బహుకరించారు. కవి సమ్మేళనం ముగిసేసరికి పూర్తిగా తెల్లారిపోయింది. గడియారం రామకృష్ణ శర్మగారు గరం గరం చాయ్ కవులకూ, ప్రేక్షకులకూ పిలాయించారు…”.
కవి సమ్మేళనాన్ని శ్రీశ్రీ ప్రారంభించారు. కవిత్వాన్ని ప్యూర్ పొయెట్రీ, అప్లయిడ్ పొయెట్రీ అనే పేరుతో శ్రీశ్రీ ఈ సభలలో విశ్లేషించినట్టు యాత్రాస్మృతి ద్వారా తెలుస్తోంది. “కవి కావ్య నిర్మాణానికి ముందు పొందే అనుభూతులు, చేసే పరిశోధనలూ, ఆర్జించే విజ్ఞానం మొదలైన పూర్వరంగమంతా ప్యూర్ పొయెట్రీ. కవిత్వం వ్రాసిన పిమ్మట దాన్ని ప్రజలకు అందించడమే అప్లయిడ్ పొయెట్రీ” అంటూ శ్రీశ్రీ ఆనాటి అభిప్రాయాన్ని యాత్రాస్మృతిలో పేర్కొన్నారు దాశరథి.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు “నా గొడవ” కావ్య ఆవిష్కరణ అలంపురం సభల్లో ఆసక్తికరమైన మరో అంశం. ఈ విషయాన్ని ఆయన ఆత్మకథ “ఇదీ నా గొడవ”లో ప్రస్తావించారు. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల “నా గొడవ”ను ప్రచురించింది. “నా గొడవ మొదటి ముద్రణ అలంపూర్ సారస్వత పరిషత్తు వార్షికోత్సవ సభలో శ్రీశ్రీ ఆవిష్కరించాలని దాశరథి, రామరాజు, డి. రామలింగం వగైరా మిత్రుల ప్రయత్నం” అని కాళోజీ గుర్తు చేసుకున్నారు. అయితే పుస్తక ఆవిష్కరణ ప్రధానమైన అధికారిక ఎజెండాలో చేరలేదు. దీనితో ప్రధాన కార్యక్రమాల్లో “నా గొడవ” కావ్యావిష్కరణ సాధ్యం కాలేదు. అయితే కాళోజీ కవిమిత్రులు “నా గొడవ”ను శ్రీశ్రీతో ఆవిష్కరింపజేయాలన్న సంకల్పంతో ఉన్నారు. దాన్ని సాధ్యం చేశారు. “రాత్రి భోజనాలయ్యాక, పదకొండున్నరకో ఏమో శ్రీశ్రీ “నా గొడవ” ఆవిష్కరించినట్టున్నది” అని కాళోజీ “ఇదీ నా గొడవ”లో రాశారు. ఈ సందర్భంలోనే కాళోజీని లూయీ ఆరగాన్‌తో పోల్చి శ్రీశ్రీ ప్రసంగించారు. నాటి ప్రసంగంలో శ్రీశ్రీ చేసిన ప్రశంసాత్మక వ్యాఖ్యలు సాహిత్య చరిత్రలో సుస్థిరంగా నిలిచాయి.
“పుణ్య గుణి భూమి మా అలంపూరు సీమ, స్వాగతము బల్కె మీకు సుస్వాగతంబు” అంటూ ఆహ్వానాన్ని పలికిన సారస్వత పరిషత్తు సభల వైభవంపై పత్రికలు ఆనాడు ప్రశంసల జల్లులు కురిపించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విలేకరులు ప్రశంసలతో కూడిన పలు వార్తా కథనాల్ని ప్రచురించారు. “మరాఠ్వాడా” అనే మరాఠీ ద్వైవార పత్రిక సభలపై ఒక సంపాదకీయాన్నే రచించినట్టు దాశరథి స్మృతులు చెబుతున్నాయి. లోక్ విజయ్ అనే మరాఠీ వారపత్రిక కూడా సభల్ని ప్రశంసిస్తూ రాసింది. తెలుగుతో పాటు సంస్కృత, కన్నడ, మరాఠీ, హిందీ పండితులు కూడా అలంపురం సభలలో పాల్గొన్నారు. సభానుభవాలను, అనుభూతులను తమ సాహితీ మిత్రులకు పంచిపెట్టారు. సభల తర్వాత గడియారం రామకృష్ణ శర్మ కృషితో “సుజాతా పత్రిక” తెలంగాణ ప్రత్యేక సంచిక వెలువడింది. ఇది అపురూపమైనది.
తెలంగాణ సాహిత్య వైభవానికి ఇక్కడివారి తెలుగు భాషాభిమానానికి నిలువెత్తు దర్పణాలుగా నిలిచాయి ఆనాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు అలంపురు సభలు.
ఆ సభల విశేషాలను చదవడమేగాని చూడని మా తరం వారికి మళ్ళీ అలంపురం సభావైభవాన్ని కళ్ళముందు నిలబెట్టాయి – మొన్నటి ప్రపంచ తెలుగు మహాసభలు.