జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-68

2
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]శీ[/dropcap]ర్యభట్టు ప్రోద్బలంతో జైనులాబిదీన్ జిజియా పన్నును గణనీయంగా తగ్గించివేశాడని జోనరాజు రాజతరంగిణిలోని శ్లోకాలు  తెలపటం కాదు, ఐన్-ఇ-అక్బరీలో కూడా స్పష్టంగా రాశాడు అబుల్ ఫజల్.

‘జిజియా కి అజ్ జమాని సాబిఖ్ బర్ హమాద్ ముఖవ్రార్ శూద బూద్ అజ్ కస్రతి ముచాలఘ శ్రీభట్ వా ఇత్తిమాసి ఆప్రు వా బక్షీస్ మూ ఆఫ్ గష్త్’ (పేజీ 388). మూడు ‘పాలలు’ ఉండే జిజియా పన్నును ఒక ‘మాసా’కు తగ్గించాడని పర్షియన్ రచయితల ద్వారా తెలుస్తుంది. ‘తారీఖ్-ఇ-సయ్యద్’లో  కూడా జైనులాబిదీన్ విధించిన జిజియా పన్ను ఉన్నా లేనట్టే అని రాశాడు. 192 ‘మాసా’ల పన్నును ఒక్క ‘మాసా’కు తగ్గించటమంటే, నిజంగానే లేనట్టే. అయితే జిజియా పన్నును పూర్తిగా ఎత్తివేయకపోవటానికి కారణం, ఇస్లామీయులకు ఆగ్రహం కలిగించకుండా జాగ్రత్తపడటం. ఎందుకంటే హమదానీలు విధించిన నియామల ప్రకారం కాఫిర్‍లపై జిజియా పన్ను విధించక తప్పదు. అందుకని పన్నును సంపూర్ణంగా రద్దు చేయలేదు. ఉండీ లేనట్టు ఉంచాడు.

మాంసాదిలోభాన్నిఘ్నస్తు మండలేషు మిషేణ గాః।
గోమాంసకుండీగ్రాహ్యది వారణాత్స న్యవారయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1079)

మాంసంపై లోభంతో  పశువులను చంపటాన్ని నిషేధించాడు. అంతేకాదు, గోమాంస భక్షణను కూడా నివారించాడు.

ఇప్పుడు ఇది చదువుతుంటే, జైనులాబిదీన్ సాధించిన కార్యాలు, అమలుపరిచిన విధి విధానాలు మామూలు విషయాలు కావనిపిస్తుంది. ఇస్లామీయుల ఆధిక్యం ఉన్న రాజ్యంలో కాఫిర్ల లాగా గుర్తింపు పొంది తరిమివేతకు గురైన పండితులను కశ్మీరుకు ఆహ్వానించి, వారికి ఉన్నత  ఉద్యోగాలు, పదవులు ఇచ్చి, రక్షణను భద్రతను ఇవ్వటమే కాకుండా వారిపై పన్ను భారం తగ్గించటం ఊహకందని విషయం. మతఛాందసం ఆమోదయోగ్యమైన అంధ మధ్యయుగంలో ఇలాంటి చర్యలు చేపట్టాలనుకోవటమే ఊహకందదు. అలాంటిది వాటిని అమలుపరచటం అద్భుతాలకే అద్భుతం! ఇవి సరిపోవన్నట్టు, గోమాంస భక్షణను నివారించటం ఇంకో అద్భుతాలకే అద్భుతం అనిపించే అద్భుతం. ఆధునిక వైజ్ఞానికాభివృద్ధి యుగంలో కూడా ‘గోమాంస నిషేధం’ అనగానే మనోభావాలు దెబ్బతినటం, ఉద్యమాలు నడపటం, అత్యున్నత స్థాయి విద్యను గ్రహించే విద్యార్థులుండే విశ్వవిద్యాలయాల్లో నిరసనగా ‘బీఫ్ ఫెస్టివల్స్’ జరగటం, ‘మా తిండిని లాగేసుకుంటున్నార’ని ఆగ్రహావేశాలు ప్రదర్శించటం మనం చూస్తున్నాం. సమాజంలో మనుషులు ‘తిండి’ విషయంలో చీలిపోయి దూషించుకోవటం చూస్తున్నాం. ఒకరు తన స్పూను తాను తీసుకెళ్తానంటే వేల సంఖ్యలో  మనోభావాలు దెబ్బతినటం అనుభవిస్తున్నాం. అలాంటిది  15వ శతాబ్దంలో, ఇస్లామ్ ఛాందసవాదం పలు విభిన్న రూపాలలో కరాళ నర్తనం చేస్తూ, ఇస్లామేతరుల జీవితాలతో చెలగాటమాడుతున్న తరుణంలో, పెల్లుబుకుతున్న మత ఛాందసానికి, సంకుచిత భావాలకు అడ్డుకట్ట వేసి, ఇతరులకు ఇబ్బంది కలగనీయకూడదు, ఎవరి ధర్మం వారిది అన్న ఉదాత్త భావనలను  నమ్మి, అమలుపరచగలగటం ఒక్క జైనులాబిదీన్‍కే సాధ్యమయింది. కంచుకాగడా పట్టుకుని, కళ్ళల్లో వత్తులు వేసుకుని వెతికినా, ప్రపంచమంతటా ఇలాంటి సుల్తాన్ మరొకడు కనబడడు!

పత్యౌ మృతన్యం గచ్ఛన్త్యా విహితం భర్తుగోత్రజైః।
స మహామతి మానషూద్రయా విప్లవం విన్యవారయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1080)

పతి మరణిస్తే, ఆ కుటుంబంలో మరొకరితో వివాహం చేసే పద్ధతిని జైనులాబిదీన్ రద్దు చేశాడు. అంటే,  సంస్కరణలు ఒకరికే పరిమితం చేస్తున్నాడన్న ఆరోపణలు లేకుండా, ఇస్లామేతరుల జీవన విధానంలో, సంప్రదాయాలలో తనకు దోషంగా కనిపించినవాటినీ సంస్కరించే ప్రయత్నం చేయటం ద్వారా అన్ని వర్గాలను శాంతింపచేశాడు జైనులాబిదీన్. అంతేకాదు, తన ప్రజలు కూడా తాను విధించిన నియమాలను పాటించేటట్టు చూసేందుకు ముందుగా తానే వాటిని పాటించి ప్రజల ముందు ఉత్తమాదర్శం నిలిపాడు. పర్వ దినాల్లో మాంసం తినటం మానేశాడు జైనులాబిదీన్. అన్య మతస్తుల పర్వ దినాల సమయంలో వారు తమ పండుగను స్వేచ్చగా గడుపుకునే భద్రతనిచ్చాడు.

న్యవారయత్స పుత్రీనామౌర్ధ్య దైహిక విప్లవమ్।
అపుత్రస్య విపకృస్య లుబ్ధైస్త ద్వేత్రజైః కృతమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1081)

పుత్రుడు లేకుండా, అంటే వారసుడు లేకుండా మరణించిన వాడి కర్మకాండలు వదిలి ఆస్తిని కాజేయాలని చూసేవారికి అడ్డుకట్ట వేశాడు.

శిశూనాం శాస్త్రపాఠాధి సూహభట్టేన నాశితమ్।
వృత్తిదానేన విదూషాం విద్యావానానయత్పునః॥
(జోనరాజ రాజతరంగిణి 1082)

సూహభట్టు వల్ల మృగ్యమై పోయిన సంప్రదాయాలు, విజ్ఞానం, వేద పఠనం తిరిగి ప్రారంభమయింది. శిశువులకు వేదం నేర్పటం, భారతీయ విజ్ఞానం బోధించటం మళ్ళీ కశ్మీరుకు చేరిందన్న మాట. అందుకనే గతంలో ఓ శ్లోకంలో జోనరాజు, కశ్మీరు వదిలి వెళ్ళిన విజ్ఞాన స్రవంతి మళ్ళీ కశ్మీరులో ప్రవహించటం ఆరంభమయింది జైనులాబిదీన్ వల్ల అని అన్నదాన్ని ఈ శ్లోకం వివరిస్తుంది. కశ్మీరు నుండి విజ్ఞానాన్ని సూహభట్టు వెడలనడపటం వల్ల సరైన వైద్యుడు లభించని  పరిస్థితి నెలకొనటంతో, మళ్ళీ కశ్మీరును విజ్ఞానవంతం చేయాలని జైనులాబిదీన్ సంకల్పించాడు. ఫలితంగా ప్రాచీన విజ్ఞానాన్ని కశ్మీరంలో పునరుద్ధరించాడు. వేద పఠనంతో మళ్ళీ కశ్మీరులో పర్వతాలు ప్రతిధ్వనించటం ప్రారంభమయింది.

విధిత్సునోః స్వాభివిత్తం ద్విజదేహే మహీపతిః।
వ్యధన్త తినకవ్యాజాద్విభాగం సత్యధర్మయోః॥
(జోనరాజ రాజతరంగిణి 1083)

ఇది కొత్త విషయం. కశ్మీరులో బ్రాహ్మణులను ఇతరుల  నుంచి వేరు చేసి గుర్తు పట్టేందుకు వారి శరీరంపై ఏదో ఓ గుర్తు ఉండాలని భావించాడు సుల్తాన్. ఫలితంగా ద్విజులు నుదుటన తిలకం ధరించాలని ఆజ్ఞాపించాడు. ఈ గుర్తు సత్యధర్మాలకు ప్రతీక.

నుదుటన తిలకధారణ మన గుర్తింపు అని ఈనాడు అందరూ చెప్తారు. నుదుటన తిలకం లేకపోతే అన్యమతస్తులుగా భావిస్తాం. ఇటీవలి కాలంలో ‘బొట్టు’ ఒక అలంకరణగా మారింది తప్ప, దాని ప్రాధాన్యం, అర్థం రెండూ సమాజం మరచిపోయింది. కొందరు అభ్యుదయ రచయితలు బొట్టు పెట్టుకోనందుకు తాము వివక్షతకు గురవుతున్నామని వాపోతూ రచనలు చేస్తూ అవార్డులు కొట్టేస్తున్నారు. ఎలాగయితే ‘నాజీ’ల కాలంలో యూదులను గుర్తించేందుకు వారు ‘స్టార్ ఆఫ్ డేవిడ్’ను ధరించాల్సి వచ్చిందో, అలా కశ్మీరులో విద్యావంతులు, విజ్ఞానవంతులయిన విప్రులను గుర్తించేందుకు తిలకధారణ ఆవశ్యకమయిందన్న మాట.

గ్రామాణాం ప్రథమే వర్షే సంక్రాంతం కారకాన్తరైః।
పత్తలాఘోషదేశేషు లోత్రదండం న్యవారయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1084)

ఇస్లామీ పాలన ఆరంభమయిన తరువాత కశ్మీరు సమాజం అలవాట్లు, పద్ధతులు అన్నీ మారిపోయాయి. దాంతో సమాజంలో సందిగ్ధాలు ప్రతి విషయంలోనూ పెరిగిపోయాయి. కశ్మీరు వదిలి వెళ్ళిన పండితులను శీర్యభట్టు సహాయంతో కశ్మీరుకు రప్పించిన తరువాత జైనులాబిదీన్ ఒక్కో రంగంలో సంస్కరణలు ఆరంభించాడు. ముందుగా తూనికలు కొలతలను సంస్కరించాడు. న్యాయవ్యవస్థను సంస్కరించాడు. భూమికి  వెల కట్టే పద్ధతిని సంస్కరించాడు.

“In 1420, the condition of the population as a whole, and peasantry in particular, was deplorable. Owing to the reign of terror during the preceding twenty years, the population  enormously declined with the result that large tracts of land had fallen out of cultivation. Those who still tilled the land were groaning under official oppression. There were then no records to indicate a cultivator’s holdings and the share of the state.” (A History of Muslim Rule in Kashmir, 1320–1819, R.K. Parmu, Page 170)

పర్షియన్ రచయితల రచనలు, పర్యాటకుల అనుభవాలు, జోనరాజ రాజతరంగిణి, శ్రీవరుడి రాజతరంగిణి వంటి గ్రంథాలలో పొందుపరిచిన అంశాల ఆధారంగా జైనులాబిదీన్, శీర్యభట్టు సహాయంతో కశ్మీరును పునర్నిర్మించిన విధానం గ్రహించవచ్చు. కొలతలను నిర్ధారించాడు. భూమి విలువను కొలిచే విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆస్తుల లెక్కలు, జాబితాలు తయారు చేయించాడు.

నివార్య శాకటతులామానకూటం చిరస్థితమ్।
అర్థవ్యవస్థా వస్తూనాం ప్రతిమాసమకారయత్॥
(జోనరాజ రాజతరంగిణి 1085)

బహిర్దేశా గతార్థానం దేశకాలద్యపేక్షయా।
వ్యవస్థాప్యర్ధముత్పిద్ధ మచ్చినాద్వి నమోషణమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1086)

గతంలోని కొలత పద్ధతులను మార్చి, నూతన కొలమానాలను అర్థవ్యవస్థను ఏర్పాటు చేశాడు. అలాగే విదేశాల నుంచి వచ్చే వస్తువుల విలువను – ఆ వస్తువు ఏ దేశంలో ఉత్పత్తి అయింది, ఎప్పుడు తయారైంది వంటి అనేకానేక విషయాలను పరిగణనలోకి తీసుకుని వాటి ధరను, పన్నులను నిర్దేశించాడు. ఇలా కశ్మీరు ఆర్థిక, సామాజిక వ్యవస్థలో శీర్యభట్టు సహాయంతో జైనులాబిదీన్ విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చాడు.

విదగ్ధః శీర్యభట్టోపి నోత్కచ ఫలమాదిత।
అవినాశి పునధర్మఫలం వర్షోపకారాతః॥
(జోనరాజ రాజతరంగిణి 1087)

దేహస్థైవార్థినాం జ్ఞానరస విజ్ఞాన కాంక్షిణామ్।
తదేచ్ఛా సిద్ధార భవద్రాజ్ఞః పుణ్యఫలాద్ దృతమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1088)

మహాశ్రీ శీర్యభట్టస్య ముఖాద్రాజా న్యవారయత్।
ధర్మ ప్రకాశ నామానం రాజకుంటికం ప్రభుః॥
(జోనరాజ రాజతరంగిణి 1089)

దూరం నివారయామస నిర్ధారణ పదాంకితమ్।
భావినాం భుమి పాలనాం దుర్వ్యవస్థ పథార్గలం॥
(జోనరాజ రాజతరంగిణి 1090)

అస్థాపయత్స ధర్మస్థః సద్‍కృత్తం ప్రతిపత్తనమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1091)

శీర్యభట్టు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఎవరెంతగా ప్రలోభ పెట్టినా అవినీతికి పాల్పడలేదు. దాంతో సత్యం ధర్మం పాటిస్తూ చిరకీర్తిని ఆర్జించాడు. ధర్మాన్ని అనుసరించటం వల్ల అవినాశి అయిన కీర్తిని సంపాదించాడు. ఆయన సుల్తాన్ మనసులో మాటను గ్రహించాడు. సుల్తాన్ ఎలాంటి విజ్ఞానవంతుడిని, ధర్మ తత్పురుడిని ఊహించాడో అలాంటివాడు శీర్యభట్టు. ఆయన శరణార్థులను ఆదరించాడు. అందరికీ న్యాయం చేశాడు. కశ్మీరులో పాటించవలసిన నియమ నిబంధనలను, నీతి సూత్రాలను, చట్టాలను, న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసే  బాధ్యతను సుల్తాను శీర్యభట్టుకు అప్పగించాడు. భవిష్యత్తరాలకు చక్కని సూత్రాలను ఏర్పాటు చేశాడు శీర్యభట్టు. అర్హతకు  కాక ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి కీలకమైన పదవులలో నియమించటాన్ని అదుపులో పెట్టాడు శీర్యభట్టు. ఫలితంగా కశ్మీరులో ప్రతి గ్రామంలో సత్ప్రవర్తన ప్రజలకు అలవాటయింది.

ఇంతవరకూ ప్రస్తావించుకున్న శ్లోకాలు జోనరాజ రాజతరంగిణిలో భాగం కావని, ఎవరో జోడించినవి అని పలువురి అభిప్రాయం. అందుకని వీటిని ప్రత్యేకంగా వ్యాఖ్యానిస్తారు. కానీ శీర్యభట్టు ఆగమనంతో జైనులాబిదీన్ ప్రవర్తనలో, ఆలోచనలో వచ్చిన మార్పులు గ్రహించాలన్నా, జైనులాబిదీన్ పాలన వల్ల కశ్మీరు రూపాంతరం చెందిన విధానం విశ్లేషించాలన్నా ఈ శ్లోకాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై మళ్ళీ జోనరాజ రాజతరంగిణి లోని శ్లోకాల విశ్లేషణ ఆరంభమవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here