[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘నిజం చేయి నా స్వప్నాన్ని!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap] చీకటి ఇంట చిరు దీపమై వెలుగు నింపావు
నా ఇంటి వాకిలిలో వెన్నెలలు ఆరబోసినావు
విశాల గగనాన్ని ఏలుతున్న నెల రాజువే
ఈ చెలియనెందుకో మనసారగ వలచినావు
సంధ్యా సమయాన నా నుదుట సిందూరమై నిలిచినావు
నా కాలి అందియల రవళిలో నీ పిలుపే విన్నాను
ఏటి గలగలలు నీ పదసవ్వడిగా అనుకున్నాను
ఆకాశమార్గాన వెలిగే రేడువి తోకచుక్కగా మారి ఇలపైకి జారివచ్చినావు
ఇంద్రచాపమై నా జీవితాన రంగులు ఎన్నో నింపినావు
నల్లమబ్బు తునకవై నా మీద చిరుజల్లు కురిపించావు
చిత్రకారుడివై నా హృదయఫలకమున వొదిగినావు
ఏటిఒడ్డున ఇసుకతిన్నెలపై నన్ను అల్లుకున్నావు
నా కంటిపాపలో నెరజాణవుగా నిలిచిపోయావు
నా హృదయవీణను మీటి ప్రణయరాగాలు ఆలపించినావు
వెన్నెల సెలయేరువై నన్ను ముంచివేసినావు
చేయిజారనీకు ఈ అందమైన అనుభవాన్ని
నా జీవిత నౌకను నడిపించు చుక్కానివై నిలిచిపోవోయి కలకాలం
నిజం చేయి చెలికాడా నా ఈ సుందర స్వప్నాన్ని!