[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఆనంద రాగాల అమృత ఝరి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]కాశం నుండి జాలువారుతున్న
ఒక్క వాన చినుకు
పుడమితల్లిని ప్రియంగా ముద్దాడుతుంది!
గులాబీలు
వినిపిస్తున్న వర్ష రాగానికి పులకరిస్తూ
పుప్పొడిని వెదజల్లుతూ
సువాసనల పరిమళాలు నలుదిక్కులా పంచుతూ
హర్షాతిరేకాలని తెలియజేస్తున్నాయి!
నీలాల నింగిని అందంగా అల్లుకున్న
ఇంద్రధనస్సు సప్తవర్ణ శోభలతో మెరుస్తూ
అవనికి సరికొత్త సందళ్ల ని అందిస్తూ
లోకాన్ని మురిపిస్తుంటుంది!
గలగలా పారుతున్న సెలయేరులు..
కొండకోనల్లో పచ్చని చెట్టూచేమల మధ్యనుండి కదులుతూ
సరిగమల సంగీత స్వరాలను వీనులవిందుగా వినిపిస్తూ
పారవశ్వంగా పరుగెడుతూ
వీక్షిస్తున్న నయనాల ముందు అద్భుతాలని పరిచయం చేస్తుంటాయి!
మయూరాల నర్తనాలు..
కోయిలమ్మల కమ్మని గానాలు..
ఇంద్రధనస్సుల సోయగాలు..
వర్ష రాగాల హర్షాలు..
కదిలే కరిమబ్బుల వయ్యారాలు..
ప్రకృతి పరవశమయ్యే శుభసమయాలు!
మనసంతా ఆనందించే సుమధురక్షణాలు!