[డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రచించిన ‘తెలంగాణ బాపుజీ మొగ్గలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]మొ[/dropcap]గ్గలు అనే కవితా ప్రకియలో ఆద్యులైన డా. భీంపల్లి శ్రీకాంత్ – శ్రీ కొండా లక్ష్మణ్ గారి జీవితాన్ని, కృషిని, వ్యక్తిత్వాన్ని అత్యంత సరళంగా చిన్న చిన్న కవితలుగా మొగ్గలుగా అందించారు.
కొండా లక్ష్మణ్ తెలంగాణ బాపూజీగా సుప్రసిద్ధులు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాలలో ఆదర్శవంతమైన పాత్ర నిర్వహించారు. ఈ చిన్న పుస్తకంలో డా. శ్రీకాంత్ – కొండా లక్ష్మణ్ బాపూజీ గారి బాల్యం, విద్యాభ్యాసం, న్యాయవాద వృత్తి, నిజాం వ్యతిరేక పోరాటం, చేనేత సహకార ఉద్యమం వంటి జీవన ఘటనలలు ప్రస్తావిస్తూ – వారి కృషికి నివాళులు అర్పించారు.
క్విట్ ఇండియా ఉద్యమం లోనూ, సత్యాగ్రహ ఉద్యమంలోనూ, పౌరహక్కుల ఉద్యమంలోను పాలుపంచుకున్న ధీరుడు కొండా లక్ష్మణ్ గారని డా. శ్రీకాంత్ గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన ఎన్నికలలో పోటీ చేసి పలుసార్లు గెలుపొంది మంత్రిగా పనిచేసిన బాపూజీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మంత్రిపదవికి రాజీనామా చేసిన వైనం చెబుతారు.
రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుడని, అసలైన తెలంగాణవాది బాపూజీ అంటారు డా. శ్రీకాంత్ మొదటి కవితలో.
చిన్ననాటనే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారనీ, యువజన సంఘాలు ఏర్పాటు చేసిన సహజనాయకుడని కొనియాడారు ఒక కవితలో.
విద్యార్థి దశలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని హైదరాబాదులో జాతీయ జెండాను ఎగురవేసిన ఘనుడని, ఉద్యమకారుల కేసులను స్వంతఖర్చులతో వాదించిన న్యాయవాదని ఒక కవితలో వెల్లడించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి, తెలంగాణకై ఉద్యమించిన తొలి వీరుడు బాపూజీ అని చెప్తారు ఒక కవితలో.
తెలంగాణ మలి ఉద్యమానికి బాసటగా నిలిచారని, ఉద్యమానికి ప్రాణప్రతిష్ఠ చేశారని అంటారు మరో కవితలో.
సామాజిక సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నిస్వార్థజీవియనీ, నిమ్నవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బతికారని ప్రశంసించారు ఒక కవితలో.
సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు రప్పించడంలోనూ, సినీకళాకారులను ప్రోత్సహించేందుకు నంది అవార్డును ప్రవేశపెట్టడంలోనూ బాపూజీ పాత్రను గుర్తు చేస్తారు డా. శ్రీకాంత్.
ప్రతి జిల్లాలోనూ పారిశ్రామికవాడల ఏర్పాటు, కార్మికుల కొరకు ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి స్థాపన వంటి విషయాలలో బాపూజీ ఎంతో కృషి చేశారని వివరిస్తారు.
సమున్నత విలువలతో కూడిన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారనీ, భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం చేశారని ఒక కవితలో కొనియాడారు డా. శ్రీకాంత్.
నవసమాజ్ పార్టీ స్థాపన ద్వారా దళిత బహుజనుల సామాజిక రాజ్యాధికారం కోసం పాటుపడ్డారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ శక్తులన్నింటినీ ఏకం చేసిన వీరుడని, తెలంగాణవాదులకు ఉద్యమ స్ఫూరి బాపూజీ అని తెలిపారు.
చేనేత రంగం పురోగభివృద్ధి కోసమై ఆప్కో సంస్థను స్థాపించారనీ, హైదరాబాదులో పద్మశాలీయుల విద్యాభివృద్ధి కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పద్మశాలి నిత్యాన్నదాన సత్రాలను నెలకొల్పి భక్తు ఆకలిని తీర్చారనీ, నీతినిజాయితీల జీవితాన్ని గడిపి, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని పేర్కొనారు.
కొండా లక్ష్మణ్ గారి సతీమణి డా. శకుంతలా దేవి చైనా యుద్ధం సమయంలో మన రక్షణ దళాలకు వైద్యసేవలందించారని తెలిపారు.
ఉద్యమమే జీవితంగా బతికి, తెలంగాణ బాపూజీగా గుర్తింపు పొందారని తెలిపారు డా. శ్రీకాంత్.
తెలంగాణ జనసిగలో ఎప్పటికీ మెరిసే తారక బాపూజీ అని కొనియాడారు.
***
తెలంగాణ బాపుజీ మొగ్గలు
రచన: డా. భీంపల్లి శ్రీకాంత్
ప్రచురణ: పాలమూరు సాహితి
పేజీలు: 40,
వెల: ₹ 30/-
ప్రతులకు:
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,
ఇంటినెంబర్ : 8-5-38,
టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్- 509001
ఫోన్: 9032844017
srikanth.bheempally@gmail.com