[dropcap]మ[/dropcap]న చుట్టూ కొందరు వ్యక్తులుంటారు… మనకన్నా సమాజాన్ని ఎక్కువగా పట్టించుకుంటారు. అందరూ బాగుండాలనే తపనతో మరింత ఎక్కువగా… గట్టి పట్టుదలతో సమాజానికి ఏదైనా చేయాలనుకుంటారు. తమదైన పద్ధతులలో ప్రయత్నిస్తారు. కొందరు కార్యరంగంలో కృషి చేస్తే… మరికొందరు ‘కథ’నరంగంలో కృషి చేస్తారు. తమ కథలలోని పాత్రలను సజీవమూర్తులుగా చేసి సమాజాన్ని కథలలో ప్రతిబింబింపజేసి ‘ఇలా ఉండద్దు, ఇలా ఉంటే అందరికీ బాగుంటుంది’ అని సూచిస్తారు.
అందని ఆశల వెనుక పరిగెత్తుతూ, భవిష్యత్తును రంగులమయం చేసుకోవాలనే తపనతో వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ, బంధాలను, స్నేహాలను పట్టించుకోకుండా మనిషి సమూహం నుంచి విడిపోతున్నాడు. క్షణం క్షణం మారుతున్న వస్తు వినిమయ సంస్కృతి కొండచిలువలా మనిషిని చుట్టేస్తోంది. ఒక వస్తువుని పొందాలన్న కాంక్షతో మంచీ చెడు విచక్షణ మరచి చేయకూడని పనులు చేసి ఎందరినీ క్షోభ పెడుతున్నాడు ఆధునిక మనిషి.
అటువంటి మనుషుల కథలే పలమనేరు బాలాజీ వెలువరించిన “చిగురించే మనుషులు” కథాసంపుటిలో ఉన్నాయి.
ఉన్న సంతోషాలని విస్మరించి ఇంకా ఏవేవో సాధించాలనుకునే మనుషులకు తాము కోల్పోతున్నవి అర్థం కావు. తల్లిదండ్రులు, భార్యలు, భర్తలు, పిల్లలు, కొలీగ్స్, సహాయకులు… ఎవరు ఏమై పోయినా ‘పట్టనితనం’ ఒకటి స్లోపాయిజన్‌లా కమ్ముకుంటోంది సమాజాన్ని.
“భార్యాభర్తల మధ్య అనురాగపు సంభాషణలు కరువవుతున్నాయి. వెంటాడే టార్గెట్స్‌లో కుటుంబం లేకపోవడమే… అన్ని కలతలకు కారణం” అంటారు రచయిత. కాదనలేని వాస్తవమిది.
మంచి చేద్దామనుకునే మనిషికి పరిస్థితులేవీ తన అదుపులో లేకపోవడం, చెప్పినా మాట వినేవారు లేకపోవడం… ఒక రకమైన వేదనలోకి, నిస్సహాయతలోకి దింపుతాయి. అలాంటి మనుషులు ఈ కథలలో కనబడతారు.
ఈ సంపుటిలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.
***
ఒకప్పుడు గాఢంగా ఉన్న తమ మధ్య సంబంధం పలచన పడడానికి కారణాలు ఏంటని అన్వేషించుకుంటుంది స్వాతి. భార్యాభర్తల మధ్య మాటలే కరువైపోతున్న కాలమిది. ‘ఈ పరిస్థితికి కారకులు ఎవరు? అశోక్ మాత్రమేనా? తనా? లేక ఇద్దరూనా?’ అని ప్రశ్నించుకుంటుంది. అశోక్ మాత్రమే మారిపోయాడని ముందు అనుకుంది. కానీ వాస్తవానికి తాను కూడా చాలా మారిపోయిందని గ్రహిస్తుంది స్వాతి. మనసు లోపలి బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ‘ఇద్దరి మధ్య‘ ఆసక్తిగా చదివించే కథ.
తమ పిల్లలు ఏదో సాధించేయాలనీ, తమకి గొప్ప పేరు తేవాలన్న ఆరాటం చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. మంచి ర్యాంకుల కోసం కుటుంబానికి దూరంగా ఎక్కడో హాస్టల్‌లో ఉంచి తమ పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు – పిల్లలకి చదువొస్తే చాలనుకుంటూ మిగతా విషయాలు పట్టించుకోరు. హాస్టల్స్‌లోనూ, కాలేజీలలోనూ విషపురుగులు ఉంటాయనీ, కాటేయడానికి సిద్ధంగా ఉంటాయని గ్రహించరు. ఇలా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటూ హాస్టల్లోనూ, కాలేజీలోనూ తనకెదురవుతున్న దురదృష్టకర అనుభవాలను తల్లికి ఉత్తరం రాయాలనుకుంటుందో ఓ అమ్మాయి. కానీ రాయలేక డైరీలో రాసుకుంటుంది. తల్లిదండ్రుల తృప్తి కోసం ‘అంతా ఓకే’ అనే అమ్మాయి ఎంత క్షోభ అనుభవిస్తుందో ‘ప్రార్థన‘ కథ చెబుతుంది. మనసుని చెమ్మగిల్లించే కథ ఇది.
కొందరి ప్రవర్తన మనకి ఆక్షేపణీయంగా ఉంటే, వాళ్ళకి మాత్రం ఆ ప్రవర్తనకి తగిన కారణాలుంటాయి. కదిరప్ప అనే వ్యక్తి ఇంట్లో దినాలకి వంట చేయడానికి వెళ్ళేందుకు ముగ్గురు ఆటో ఎక్కుతారు. ఆటోని వేగంగా నడుపుతున్న వెంకటేసుని ఆ వంటవాళ్ళు మందలిస్తే, ఆ వేగం వెనుక కారణం తెలుస్తుంది. ‘పిలిస్తే చాలామందే వస్తారని, ఎక్కువ ఖర్చవుతుందని’ కదిరప్ప ఎవరికీ చెప్పకూడదనుకుంటాడు. ఆయన పిలిచినా పిలవకపోయినా వచ్చే జనం వస్తారని అంటాడు వెంకటేసు. మార్గమధ్యంలో ఆటో ఎక్కిన మునెప్ప… వీళ్ళెక్కడికి వెళ్తున్నారో తెలుసుకుని వండేటప్పుడు కొద్దిగా ఎక్కువ వండమంటాడు. జనాలు ఆకలి మీదున్నారంటాడు. ఎందుకో తెలుసుకోవాలంటే “ఆకలేస్తున్నప్పుడు” కథ చదవాలి.
పని కోసం ఓ ఇంటికి వెళ్ళిన కమలమ్మ – యజమానురాలు అడగక ముందే తమ కులమేమిటో ఎందుకు చెప్పిందో ‘అదే ప్రశ్న’ కథ వెల్లడిస్తుంది.
ఈ సంపుటిలోని ‘జీవావరణం‘ కథ మనసుని మొద్దుబారుస్తుంది. మనుషులు ఎందుకిలా అయిపోతున్నారని ఆలోచింపజేస్తుంది. సమాజానికి వేస్తున్న బహురూపాల ఆకలిని తీర్చడం ఎలా అని మథనపడేలా చేస్తుంది. సమాజానికి కొత్త పరిశోధనాకేంద్రమైన ఈ కథలోని ‘జీవావరణం’ లాంటిది కావాలిపుడు అనిపిస్తుంది.
తన మిత్రుడు తెలుసుకున్న సత్యం ఒక వైపు; తన జీవితంలో అనేక సంఘటనలు ఒకవైపు; తన నిరాదరణ, భార్య ఔదార్యం గుర్తొచ్చి కలవరానికి లోనైన భర్త ఏం చేశాడో చెబుతుంది ‘ఒక మెలకువ‘. తాను చేసే పని వల్ల ‘అలసిన ఆమె కళ్ళలోని నిశ్శబ్దం కాస్తయినా కరుగుతుందా?’ అనుకుంటాడా భర్త. ఇదే తప్పు మనమూ చేస్తుంటే సులువుగా దిద్దుకోవచ్చని చెప్పే కథ.
జనాలకి ‘రోడ్ సెన్స్’, ‘సివిక్ సెన్స్’ లోపించి ఆంబులెన్స్‌లకు కూడా దారి ఇవ్వడం మానేస్తున్న ఈ రోజులలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ముగ్గురు సామాన్యులు కలసి ఏదో ఒకటి చేయాలనుకుంటారు “ఏం చేద్దాం” కథలో.
“ఇంట్లో వాళ్ళకి చెప్పాపెట్టకుండా కుటుంబ అనుబంధాలని, సమస్త మానవ సంబంధాల్ని విడిచి అకస్మాత్తుగా ఎందుకు కనబడకుండాపోతారు కొందరు మనుషులు? జీవితంలో ఏం సాధించారో? ఏం పోగొట్టుకున్నారో? ఏం మిగుల్చుకున్నారో వాళ్ళకి తెలుస్తుందా?” అని ప్రశ్నిస్తుంది ‘నిరీక్షణ కూడా ఒక సాహసమే‘ కథ.
తాము ఎరుకలోళ్ళం అని చెప్పుకోడానికి సిగ్గుపడ్డ కొడుకులకు బదులుగా నాలుగు పందుల్ని పెంచినా బాగుండేదన్న భర్త మాటలకి భార్య నొచ్చుకుంటుంది. కొడుకులకి తెలిస్తే బాధ పడతారంటుంది. కొడుకులపై అతి నమ్మకం పెట్టుకుని అప్పుల పాలయినా మౌనంగా భరిస్తుందా తల్లి ‘ముగ్గుపిండి – ఎర్రమన్ను‘ కథలో.
బాల్యం, కౌమారంలో ‘ఆడపిల్లలంటే ఇలాగే ఉండాలంటూ’ అనేక ఆంక్షలతో కూతుర్ని పెంచిన ఓ తల్లి… అదే కూతురు జీవితంతో సతమతమై ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు… ఆ తల్లి పలికిన మాటలు – తాను భరించిన ఒంటరితనాన్ని, దిగులుని కొంత తగ్గించి ఏదో భరోసా కలిస్తాయి కూతురికి ‘కొత్త గాలి‘ కథలో.
“కుదురుగా కూర్చుని మనసు పెట్టి చేయాలి కానీ ఏ పనయినా మనిషికి లొంగకుండా వుంటుందా? కులందే మన్నా… గుణం ముఖ్యం కదా…” అన్న కపాలి వ్యసనాల బారిన పడి… ఏం పొగొట్టుకున్నాడో తెలిపే కథ ‘కబాబ్ కపాలి‘.
వార్తలు… టీవీలలో… దినపత్రికలలో.. వెబ్‌సైట్లలో… ఎక్కడా చూసినా వార్తలే. కాలమంతా తమ కోసమే బ్రతుకుతూ తోటివారిని ఏ మాత్రం పట్టించుకోని స్థితికి చేరిన దశలో ఏ వార్త విన్నా… మనుషుల్లో స్పందించే గుణం నశిస్తోంది. మనుషులలో స్పందన చిగురించేందుకు కొత్త విత్తనాలు నాటాల్సిన అవసరాన్ని ‘చిగురించే మనుషులు‘ కథ చెబుతుంది.
తరతరాల బానిసత్వం, చిన్నప్పటి నుంచి ఊడిగం చేసిన దొరసామిని సొంతంగా సేద్యం చేయిస్తుందతని భార్య నీలమ్మ. అది భరించలేని నాయుడు వీళ్ళ పంటని నాశనం చేయించి ఆ నెపం ఏనుగుల మీదకి నెడతాడు. పదో తరగతి దాకా చదివిన నీలమ్మ వాస్తవం గ్రహించిన, దొరసామి మాత్రం మళ్ళీ ఊడిగానికే సిద్ధపడతాడు. భార్యభర్తల మధ్య గొడవలవుతాయి. ‘వెదుర్లు‘ కథ హృదయాన్ని బరువెక్కిస్తుంది.
కాటేయాలనుకునే మనుషులు చుట్టూ ఉన్నప్పుడు మన గురి తప్పకూడదని చెబుతుంది ‘గురి‘ కథ. తమ పొలానికి ఆధారమైన గుండు బావి ఎండిపోతే… తాగుడికి బానిసవుతాడు మునిరాజు. వ్యవసాయం సరిగ్గా సాగకపోవడంతో పొదుపు సంఘంలో పనిచేసే అతని భార్య మంజుల అదనపు ఆదాయం కోసం మేకలను కాయడం మొదలుపెడుతుంది. మేకని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న కొండచిలువని తెలివిగా నిలువరిస్తుంది మంజుల. తన మీద కన్నేసిన మల్లీశ్వరరెడ్దిని అంతే తెలివిగా అడ్దుకోవాలన్న ఉద్దేశం ఆమెది. ‘బావిలో పూడిక తీయించాల్సిందే‘ అన్న ఆమె నిర్ణయం ఎన్నో సమస్యలకు పరిష్కారమవుతుందన్న నమ్మకం కలుగుతుంది.
“ఇది ఊరు కదా. మనిషిని మనిషే ఆదుకోవాలి. లేదంటే దీన్నిఊరని ఎలా అంటారు?” అంటుందో పాత్ర ‘ప్రయత్నం‘ కథలో. సామూహిక మేలు జరగాలంటే అందరు ఒక్క మాటపై ఉండడం ఎంత అవసరమో ఈ కథ చెబుతుంది.
‘డార్క్ ఏరియా‘ కథ విద్యావ్యవస్థలోని సమస్యలను, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుంది. అంతర్గతంగా చాలా సమస్యలకు ఉదారీకరణ కారణమవుతోందని చెబుతుంది. విలువలకు కట్టుబడ్డ ఓ ఉపాధ్యాయుడి నేపథ్యంగా సాగే కథ ఇది.
***
ఈ పుస్తకంలోని అన్ని కథలకూ అంతఃసూత్రం మానవ సంబంధాలే. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం… ఇలా ఒక్కో స్థాయిలో వస్తున్న మార్పులు మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ కథలు చెబుతాయి.
మనిషి మనిషిగా మిగలడం లేదని, మనుషులలో స్పందన నశిస్తోందని, బంధాలు సడలిపోతున్నాయని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు జీవితాలను క్రుంగదీస్తున్నాయని ఈ కథలు చెబుతాయి. సమస్యలను ప్రస్తావించడమే కాకుండా పరిష్కారాలను సూచిస్తాయి.
మార్పుకు లొంగిపోయిన మనుషులు, తమని తాము కోల్పోతున్న మనుషులు ఉన్నట్లే… అవాంఛిత మార్పులకి వశులు కాకుండా ఎదుర్కునే మనుషులు ఉన్నారు. తాము బ్రతుకుతూ, ఇతరులను బ్రతికిద్దామని తపనపడే మనుషులు ఉన్నారు. తమ కోసం, తమ కుటుంబం కోసం, సమాజం కోసం ఆలోచించే మనుషులు ఉన్నారు. అందరి బాగుకు ఏదో ఒకటి చెయ్యాలని తపించేవారున్నారు. కులాల, ఆర్థిక అసమానతల ఆధారంగా మనుషుల్ని లొంగదీసుకుందామనుకునేవారికి – చదువుతోనూ, తెలివితోను, ప్రాపంచిక జ్ఞానంతోనూ జవాబిచ్చిన మనుషులు ఉన్నారు.
ఈ కథల్ని చదవడమంటే మనమూ ఆ ప్రయత్నాలలో భాగం కావడమే. మనుషులు చిగురించడం తక్షణ అవసరం అయితే, చిగురించిన మనుషులని ప్రేమా, ఆదరణలతో సంరక్షించుకుని మానవత్వం వృక్షమయ్యేలా కాపాడుకోవాలి. అప్పుడే మనుషుల హృదయాంతరాలలోకి చేరిన మంచితనమనే జల మళ్ళీ పైకి వస్తుంది. తప్పక చదవాల్సిన పుస్తకం. సాహిత్యపు నిజమైన ప్రయోజనాన్ని అందించే కథా సంపుటి “చిగురించే మనుషులు”.
***
పలమనేరు బాలాజీ 2009 – 2014 మధ్య కాలంలో వ్రాసిన కథలివి. పవిత్ర ప్రణీత ప్రచురణల వారు ప్రచురించిన ఈ సంపుటిలో 20 కథలున్నాయి. పేజీలు: 168; వెల: 100
ప్రతులకు: కె.ఎన్.జయమ్మ, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా-517408; ఫోన్: 9440995010
ఇంకా నవోదయ, ప్రజాశక్తి, విశాలంధ్ర బుక్ హౌజ్ శాఖలు.