అవకాశవాది

1
5

[శ్రీమతి దాసరి శివకుమారి రచించిన ‘అవకాశవాది’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]“ఏ[/dropcap]మ్మా! సుజనా! అన్న కొడుకే గదా అని కట్నకానుకల్లోనూ, లాంఛనాలలోను ఏ మాత్రం తక్కువ చేసినా ఊరుకునేది లేదు. నా కోడలికి కూడా భారీగానే నగలు చేయించి పెట్టాలి. మా వాడికి కూడా డైమండ్స్ వేసిన ఉంగరమూ, పెద్ద పతకంలో పులిగోర్లు ఇమిడ్చిన పొడవాటి గొలుసూ, కుడిచేతికి మందంగా ఉన్న కడియం – అన్నీ చేయించాలి. గుర్తు పెట్టుకో.”

“నీకసలు భారీగా నగలు చేయించటం నచ్చదు. సన్నగా, నాజూగ్గా వుండాలంటావు గదా వదినా!”

వెంటనే 24 ఏళ్ళ నాడు సుజన పెళ్లప్పుడు తనన్న మాటలు గుర్తుకొచ్చాయి సరళకు. “గాజులకూ, గొలుసుకూ అంతంత బంగారాలెందుకు సుద్దల్లాగా? సన్నగా, నాజూగ్గా చేయించితే అందంగా ఉంటాయి” అంటూ తక్కువ బంగారంతో చేయించమని మామగారికీ, భర్తకు సలహా ఇచ్చింది.

“ఇది వరకటి లాగా కాదులే సుజనా! ఇప్పుడందరూ భారీగానే ఇష్టపడుతున్నారు. ఆఖరికి పెళ్లికూతుళ్ళు కూడా బంగారు జడా, దానికింద కుప్పెలూ వేసి మరీ చేయించుకుంటున్నారు.”

“మా అమ్మాయికి అలా దిగేసుకోవటం ఇష్టముండదు వదినా. అంతా నీ మాదిరే. సింపుల్‍గా, నాజుగ్గా వుండాలంటుంది. అసలు ఇలా మేనరికం చేసుకోవటం మా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. మా అన్నయ్య నోరు తెరిచి అడిగాడు గదా అని ఆలోచిస్తున్నాం. మా అమ్మాయి కూడా అదే అంటున్నది. ఏం చేయాలో పాలుపోవటం లేదు.”

ఆడపడుచు మాటలకు సరళ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్లుగా అయింది.

“అలా కాదు సుజనా! మరల మరలా మేనరికాలు చేసుకుంటూ పోతే ఇబ్బందులు వచ్చే మాట నిజమే. మన ఇళ్ళల్లో ఇదే మొదటిసారి కాబట్టి ఏం ఫర్వాలేదు.”

“ఏమో వదినా! సీనియర్ డాక్టర్ల సలహా తీసుకోవాలి. ఇద్దరి జాతకాలు కలవాలి. ఇవంతా మేం తెలుసుకోవాలి. ఆ తర్వాతే దీని గురించి ఆలోచిద్దామనుకుంటున్నాం.”

“తెలిసిన సిద్ధాంతి గారికి మీ అన్నయ్య చూపించారు. చాలా బాగా కలిశాయని చెప్పారు.”

“మాకు తెలిసిన సిద్ధాంతికి మేమూ చూపించుకోవాలి” అన్నది సుజన బెట్టుగా.

‘కార్తీక్ మాటలను బట్టి లక్ష్మీమాధవి కూడా ఒప్పుకుంటుందనిపించింది. ఇప్పుడు సుజన మాటలు వేరుగా ఉన్నాయి. ఇదేంటి?’ అన్న ఆలోచనలో పడింది సరళ.

సరళ ఆలోచనలను చెదరగొడుతూ, “నీ కొడుక్కేంటి వదినా? డాక్టరు. అన్నయ్యకూ, నీకూ కట్నకానుకల పట్టింపు వుండదు. ఆషాఢపట్టీల కంటూ చద్దిపెట్టెలు, కావిడి పెట్టెలూ అడగవు. పనులెగ్గట్టి కాలక్షేపం చేయడానికంటూ తోలుబొమ్మలాడే టీ.వీ.లు అడగవు” అన్నది సుజన నెమ్మదిగా.

తన కూతుర్నే కావాలన్నామని ఆడపడుచు, మంత్రసాని దెప్పుళ్ళన్నీ దెప్పుతున్నది అని లోలోపల ఉడికిపోసాగింది సరళ.

***

సుజకు పెళ్ళి సంబంధాలు చూసేటప్పుడు, ఎవరైనా కాస్త కట్నం ఎక్కువ అడిగితే ‘అమ్మాయీ, చదువు సంధ్యలూ ముఖ్యం కానీ, కట్నమంటూ కొసరుతారేంటి? వీళ్ళొట్టి డబ్బు మనుషుల్లా ఉన్నారు. మనం సంతోషంగా ఇస్తామన్నది తీసుకోవాలి గాని ఇవేం మాటలు? ఇలాంటి వాళ్ళే రేపు పెళ్ళయిన తర్వాత అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అని పీక్కుతింటారు’ అని కొన్ని మంచి సంబంధాలను వెనక్కు కొట్టింది. చివరకు సుజన పెళ్ళయింది. వాళ్ళత్తగారు తమ శ్రావణపట్టి తెచ్చింది. కానీ అంతకు ముందు నెలలో వీళ్ళు పంపే ఆషాఢపట్టీకి స్వీట్స్‌తో పాటు ఫ్రిజ్ పంపమన్నది. “మీ అమ్మాయే తీసుకెళ్ళి వాడుకుంటుందిగా సరళా! కొనిపెట్టండి” అనీ అన్నది.

“అయ్యో! పిన్నిగారూ! ఫ్రిజ్ ఎందుకండీ? దాన్ని మేం చద్దిపెట్టె అంటాం. ఇంట్లో ఏ కాస్త కూరా నారా మిగిలినా దాంట్లో పెట్టాలి. మీ అబ్బాయికీ అదే పెట్టాలి. దాంట్లో నిల్వ ఉన్న ఆహారానికి జీవం పోతుంది. ఎందుకొచ్చిన తంటాలంటూ మేం దాని జోలికే పోం. ఫ్రిజ్‍కు బదులుగా ఒక ఇనుప బీరువా కొని పంపుతాం లెండి. బట్టలవీ పెట్టుకోవటానికి వీలుగా వుంటుంది” అంది సరళ.

అప్పట్లో 165 లీటర్ల ఫ్రిజ్ ఖరీదు 6000 రూపాయలు. బీరువా ఖరీదు 2000 రూపాయలు మాత్రమే. అదీ సరళ లెక్క.

“కాపురానికంటూ పిల్లలు సిటీకెడుతున్నారు. సామానుతో పాటు రంగుల టీవీ కూడా కొనివ్వండి. మీ అమ్మాయికి కాలక్షేపంగా ఉంటుంది” అన్నారు సుజనా వాళ్ల అత్తగారు.

“అయ్యో! పిన్నీ! ఎందుకా టీ.వీ. అందులో మనుషులు అటూ ఇటూ తోలుబొమ్మల్లా ఊగుతూ కదులుతూ పోతుంటారు. పైగా ఆడాళ్ళు ఇంట్లో పనులు ఎగ్గొట్టి దాని ముందే కూర్చుని బద్ధకస్తుల్లా తయారవుతారు. బాధ్యతల గురించి ఆలోచించరు. అసలే సుజనకు నేను ఏ పనులు చెప్పకుండా చూసుకున్నాను. ఇప్పుడు టీ.వీ. చూస్తూ కూర్చుంటే సుజనకు పనులు ఇంకేం అబ్బుతాయి? ముందు తనను ఇంట్లో పనులకూ, వంట పనులకూ అలవాటు పడనివ్వండి. ఆ తర్వాత వాళ్ళే నిదానంగా ఒక్కోటి కొనుక్కుంటారు. అయినా ఎవరిక్కావల్సినవి వాళ్ళు స్వంతంగా అమర్చుకుంటేనే వాళ్ళకూ సంతృప్తిగా ఉంటుంది. మేమిప్పుడు వంట పాత్రలు, మంచమూ కొనిస్తాం. గ్యాస్ పొయ్యీ అదీ మీరే కొనుక్కోండి. పొయ్యి పుట్టింటివాళ్ళు ఇవ్వకూడదు కదా?” అన్నది తెలివిగా.

సుజన అత్తగారు పేచీకోరు మనిషి కాదు. సుజనకేమో తల్లి లేదు. పెత్తనమంతా సరళదే. తాను ఇంకేమైనా అడిగినా, ఆమె పడనివ్వదు. సుజన తండ్రి మర్యాదస్తుడు. అన్న మెతక మనిషి. వాళ్ళేం కొనిస్తే అవే తీసుకుని తానూ హుందాగా ఉంటే తనకూ మర్యాదగా వుంటుందని ఆవిడకి అనిపించి మరేం మాట్లాడడలేదు.

“సుజనా నువ్వు చిన్నపిల్లవు. ‘మీ పుట్టింటి వాళ్ళను అదడిగి కొనిపించుకో, ఇదడిగి కొనిపించుకో, మీ నాన్నగారి దగ్గర గొడవ చెయ్యి’ అని మీ అత్తగారో, మరొకరో చెప్పొచ్చు. మీ ఆయన కూడా ఏ స్కూటరో అడగొచ్చు. అవన్నీ నువ్వు పట్టించుకోకు. ‘అన్నీ మా వదినకు తెలుసు. తనే చూసుకుంటుంది’ అని చెప్పి తప్పుకో” అంటూ సరళ సుజనకు హితబోధ చేసి పంపింది.

సుజనకు అవన్నీ మనసులో వున్నవి. తల్లి లేకపోబట్టే సరళ ఇలా ఇష్టమొచ్చినట్టు చేస్తున్నదని మనసులో బాధపడేది.

వదిన తన కూతురు పెళ్ళి చేసినప్పుడు కూడా అవతలి వాళ్ళను ఇలాగే మాటల్తో మంత్రించింది. తను అనుకున్నది సాధించింది.

‘వదిన నాకు ఏం పెట్టినా పెట్టకున్నా, నేనంటే అభిమానం చూపించకపోయినా, నాకు మాత్రం పుట్టింటి మీద ఉన్న మమకారం, ప్రేమ ఎప్పటిలానే వున్నాయి’ అనుకున్నది సుజన.

***

సరళకు మనసంతా గుబులు గుబులుగా వున్నది. తన ప్రవర్తన కారణంగా కొడుకు పెళ్ళి ఆగిపోతుందా అన్న దిగులు పట్టుకున్నది. ఆడపడుచు విషయంలో వెనక తానన్న మాటలూ, చేసిన పనులూ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. ఆడపడుచు పెళ్ళయి కాపురానికి వెళ్ళిపోయిన తరువాత తనూ టీ.వీ. తెచ్చుకున్నది. ఇంట్లోకి ఫ్రిజ్ కొనిపించింది. సుజన పుట్టింటికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ వాటి సంగతి ప్రస్తావించలేదు. అడిగితే తను ముఖం ఎక్కడ పెట్టుకునేది? సుజనను కానీ, ఆమె కుటుంబాన్ని కాని, ఎప్పుడో తప్పితే పుట్టింటికి రమ్మని పెద్దగా పిలిచేది కాదు. ఇప్పుడు సుజనా వాళ్ళు భాగ్యవంతులయ్యారు. వాళ్ళాయన సంపాదన బాగా వున్నది. ఇద్దరే కూతుళ్ళు. బాగా చదువుకున్నారు. చక్కని చుక్కలు. అందులో పెద్దమ్మాయి లక్ష్మీమాధవి మరీ అందంగా వుండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. పైగా హౌస్ సర్జన్ చేస్తున్నది. తన కొడుకు ఎం.డి. చేస్తున్నాడు. తను డాక్టర్‍నే పెళ్ళి చేసుకోవాలని బాగా కోరుకుంటున్నాడు. ఇలా అయినవాళ్ళలో అన్నీ సరిపోయినవాళ్లు దొరకటం కష్టం. తన అదృష్టం బాగుండి లక్ష్మీమాధవే తన ఇంటి కోడలుగా వచ్చేస్తున్నదని సంబరపడింది. కానీ, తెలివితక్కువగా ఆలోచించి, వాళ్ళ పిల్లను ఇస్తే చాలు అని కళ్ళకద్దుకుని చేసుకోవాల్సింది పోయి, తనే ఆనాడూ ఈనాడూ పనికిమాలిన మాటలు మాట్లాడి పిచ్చివాగుడు వాగుతున్నది. ఇప్పుడు తన మాటలు, చేతలు కడుపులో పెట్టుకుని సుజనే ఈ సంబంధం కాదంటుందేమో? తన భర్త వెళ్ళి అడిగినంత మాత్రాన సుజనా వాళ్ళాయన ఒప్పుకోవాలని ఎక్కడున్నది? ఇలా అవుతున్నదేమిటీ? తన కొడుకు భవిష్యత్తు తానే నాశనం చేసినట్లు అవుతుందా? ఇలాంటి ఆలోచనలతోనే పగలంతా ఏ పనీ చేయబుద్ధి కాలేదు. తిండి నోటికి సహించలేదు. రాత్రి కంటికి కునుకు రాలేదు.

కొద్ది రోజులు గడిచాయి. మంచి రోజులు అయిపోతున్నాయి. సుజనా వాళ్ళ దగ్గర నుంచీ ఏ కబురూ లేదు. తనే సుజనా వాళ్ళ ఊరు వెళ్ళి బ్రతిమాలుకుందామనుకున్నది సరళ. ఈ ఆలోచనల్లో ఉండగానే వాకిట్లో కారు ఆగింది. కార్తీక్ వచ్చి వుంటాడని అనుకున్నది.

కార్తీక్, సుజన కూతురు లక్ష్మీమాధవి మెళ్ళో పూలదండలతో, పట్టుబట్టలతో ఇంట్లోకి అడుగుపెట్టారు. సరళ నోరు తెరుచుకుపోయింది.

“అమ్మా! నీ గొంతెమ్మ కోర్కెలతో, నీ సమయానుకూల మాటలతో అందర్నీ చికాకు పెడతావని తెలుసు. అత్తయ్యా వాళ్ళ ఆస్తిలో లక్ష్మీమాధవికి వచ్చే వాటాను ఇప్పుడే తేల్చాలని ఇబ్బంది పెడతావనిపించి, ఇలా నేనూ, లక్ష్మీ ఆలోచించి రిజిస్టర్ మారేజ్ చేసుకొచ్చాం. ఇప్పుడే వేడుకలు వద్దు. రేపు మా చదువులు అయిపోయిన తరువాత మేం పెట్టుకోబోయే హాస్పటల్ ప్రారంభోత్సవం భారీగా చేసుకుంటాం” అన్నాడు కార్తీక్.

“తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదువు గాని వదినా, ముందు హారతిచ్చి కొడుకునూ, కోడల్ని లోపలికి తీసుకుని రా” అన్నది సుజన వాళ్ళ వెనకే నిలబడి.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here