పేదవాడి చావు

0
4

[శ్రీమతి మాలతి ముదకవి గారు రచించిన ‘బడవనిగె సావ కొడవేడ శివనే’ అనే కన్నడ కథను అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు]

[dropcap]“కొ[/dropcap]రేగావి హనుమంతు ఎవరయ్యా?” వార్ట్ బాయ్, ఆస్పత్రి లోని విశాలమైన కారిడార్ లోకి వచ్చి పిలిచాడు. ఖాళీ బెంచి మీద కునికిపాట్లు పడుతున్న హనుమంతు ఆ పిలుపుకు ఉలిక్కిపడి లేచి, గబగబా పరుగెత్తికెళ్ళి, ఆ వార్డ్ బాయ్ ముందు చేతులు కట్టుకుని, “నేనేనయ్యా, మా నాయన శవాన్ని ఎప్పుడిస్తారయ్యా?” అని అడిగాడు వినయంగా.

“హనుమంతూ, కోట్లాటలో ఏటు తిని మీ నాయన సచ్చిపోయినాడు. ఇది పోలీస్ కేసు. ఖూనీ అయ్యింది. శవాన్ని కోసి ఖూనీ ఎలా అయిందని రిపోర్ట్ ఇయ్యాల. ఆపైనే శవాన్ని అప్పజెప్పేది. అది సెయ్యటానికి వేరే డాక్టర్లు ఉంటారు. ఆళ్లు రావాల. ఇప్పుడు ఎనిమిది గంటలు. డ్యూటీకి హాజరవుతారు. అప్పుడు ఆళ్ళని కలు. ఆ తర్వాతే మిగతా పని” అని చెప్పి వాడు వెళ్లి పోయాడు.

హనుమంతు స్వంత ఊరు కొరేగావి అనే కుగ్రామం. నగరానికి నూరు కిలోమీటర్ల దూరం. పోసెట్టి దంపతులకి, ఎన్నో పూజలు చేసిన అనంతరం పుట్టిన ఏకైక సంతానం హనుమంతు. అనుకునే అంత ఆస్తి లేకపోయినా, మగ సంతానం కలిగినందుకు పోసెట్టికి కొమ్ములు వచ్చినంత సంబరం. హనుమంతుని విద్యావంతుణ్ణి చేయాలనే ఆశ నిరాశే అయ్యింది పోసెట్టికి. అఆ లతోనే వాడి చదువు ఆగిపోయింది. విద్య వచ్చినా రాకపోయినా వయసు పెరుగుతూనే వుంటుంది కదా. ఉన్న కాస్తా పొలం పైనే ఆ కుటుంబం ఆధారపడి బతుకుతూ వుంది. ఉన్నంతలో హాయిగానే గడచిపోతున్నాయి రోజులు. హనుమంతుకు పెళ్లి చేయాలని వాడి తల్లి ఆశ. చదువూ సంధ్యలేక పోయె. ఉన్నది ఆరు అంకణాల కొంప, జానా బెత్తెడు పొలం. పిల్లనిచ్చేవారేరీ? ఈ మొద్దు స్వరూపాన్ని పెళ్లి చేసుకోటానికి ఏ ఆడపిల్లా ముందుకు రాలేదు. ఎలాగో తంటాలు పడి తమ సంబంధీకులలోనే ఓ పిల్లను తెచ్చి పెళ్లి అయ్యిందనిపించింది తల్లి.

తొలి రోజుల్లో గ్రామాల్లో గ్రామస్థుల మధ్య ఐకమత్యం వుండేది. అయితే ఈ ఎన్నికలూ, అధికారాలూ అన్నీ చోటు చేసుకున్న తర్వాత గ్రామాల్లో పార్టీలు ఏర్పడి దాంతో పాటుగా వైషమ్యాలూ ఏర్పడ్డాయి. స్వజాతుల మధ్యే అసూయలు ఏర్పడ్డాయి. ఓ జానెడు స్థలం కోసం ఇరువర్గాల మధ్యా పోట్లాటలు సామాన్యమై పోయినయ్.

ఈ నేపథ్యంలోనే ఓ దర్ఘటన జరిగిపోయింది. కరెప్ప, ఆ వూళ్లో ఓపాటి భూస్వామి. కరెప్ప పొలం పోసెట్టి పొలాన్ని ఆనుకునే వుంది. ఆర్థికంగా బలసిన కారణంగా, వాడి ధనమదం అప్పుడప్పుడు తలకెక్కుతూ వుండటం సామాన్యమై పోయింది. వాడిది ఎప్పుడూ పరపీడన బుద్ధే. ఊళ్లో వాళ్లందరితోనూ వాడూ, వాడి కొడుకులూ వైరత్యాన్ని పెంచుకున్నవాళ్లే. అదీగాక ఇటీవల ఎన్నికల పుణ్యమా అని, గ్రామ పంచాయితీ అధ్యక్షుడి గానూ ఎన్నుకోబడిన తర్వాత వాడిని నిలుకరించలేకపోయారు ఎవళ్ళూ, కోతికి కల్లు తాగించినట్లు అయ్యింది. పేదోళ్ళ పొలాలని వడ్డీల క్రింద జమకట్టుకునేవాడు. వాడి కన్నులెప్పుడూ ఇరుగు పొరుగు వాళ్ల పొలాల మీదే. ఆ కళ్లు ఇప్పుడు పోసెట్టి పొలం మీద పడ్డాయి. ఆ పొలం ప్రక్కనే కాల్వ పారుతూ వుంది. నీళ్ళకి కొదవలేక పంట బాగానే పండుతుంది. సమర్థంగా వస్తున్నపంట, కరెప్ప కడుపుమంటకి కారణమయ్యింది.

ఆ రోజు సాయంత్రం – కరెప్ప కొడుకులు, పోసెట్టి పొలంలో కడు సొగసుగా పెరిగి వస్తున్న జొన్న కంకుల్ని చూసి, తమ పశువులని ఆ పొలంలోకి తోలారు మేయటానికి. ఈ సంగతిని ఎవరో పోసెట్టి చెవిన వేశారు. వెంటనే తన హనుమంతుని తోడుగా లగెత్తుకొని పోసెట్టి ఆ పశువుల్ని అదిలించాడు. పచ్చి జొన్న కంకుల్ని తినమరిగిన ఆ పశువులు ఆ స్థలం నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కు వెళ్లక పోయేసరికి చిర్రెత్తుకొచ్చింది పోసెట్టికి. అందుబాటులో వున్న కర్ర పుచ్చుకొని వాటిని తరమటానికి ప్రయత్నించాడు. అంతే, కరెప్ప కొడుకులు ముగ్గురూ, పోసెట్టి, హనుమంతు పైన యుద్ధానికి దిగారు. తిట్లు, శాపనార్థాలు మొదలయ్యాయి. కరెప్ప కొడుకులు వీరంగం చేయటమే కాక, వాళ్ళల్లో ఒకడు చేతిలో ఉన్న కొడవల్ని విసిరాడు. అది వేగంగా వచ్చి బలంగా పోసెట్టి తలను తాకింది. అంతే పోసెట్టి కుప్పకూలాడు. రక్తం బొటబొటా కారసాగింది. ఈ పోట్లాట తెల్సి పోగయ్యారు ఊరి జనం. తమ పశువులదేమీ తప్పులేదని కరెప్ప కొడుకుల వాదన. క్షణాల మీద ఈ సంగతి పోలీసులకి తెల్సి, వాళ్ళు రంగప్రవేశం చేశారు. ఈలోగా కాగూడని ఆఘాయిత్యం జరిగే పోయింది.

కొడవలి వేటుతో నేలకూలిన పోసెట్టిని ఉళ్ళోవాళ్లు బండి మీద ఆస్పత్రికి తీసుకెళుతూండగానే వాడి ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి. వెనక్కు తీసుకెళ్దామని అనుకున్నారు కాని – డాక్టర్ నోటి ద్వారా చనిపోయింది నిజమని సర్టిఫికెట్ కావాల్సి వుంటుందని, వెంటవచ్చిన పోలీసులు చెప్పటంతో ఆ రాత్రే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేశారు. డ్యూటీ డాక్టర్ ఒకాయన వచ్చి పోసెట్టి చచ్చిపోయాడని నిర్ధారి౦చినా పోస్ట్ మార్టమ్ అయ్యేదాకా శవాన్ని ఇవ్వటం కుదరదని, శవాన్ని శవాగారంలోకి తరలించారు. శవాన్ని ఒప్పగించేంత వరకు తమకేమిటి పని అని ఊరి జనం, పోలీసులు వెళ్ళిపోయారు. శవజాగరణం చేసేవారు లేకపోయినా పర్వాలేదు గాని పాడె కట్టేవారు వుండాలి కదా ఊళ్లో. హనుమంతు ఒక్కడే మిగిలిపోయారు. దూరపు బంధువులు, ఊరి వాళ్లు మరుసటి రోజు రాగలమని చెప్పి వెళ్లిపోయారు.

ఎవరు పుట్టనీ, చావనీ ఆకలి దప్పులు మాత్రం దూరం కావు గదా! ఈ ఘటన ఈ జరిగినప్పట్నుంచీ హనుమంతు ఒక్క గుక్కెడు నీళ్లు తాగిన పాపాన పోలేదు. తాగటానికి మనసొప్పలేదు. తండ్రి శవాన్ని శవాగారానికి ఒప్పజెప్పిన అనంతరం, ఆ రాత్రంతా చలిలో ఆ బెంచీపైన, ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా అని రాత్రంతా జాగరణ చేయక తప్పలేదు. తెల్లవారింది. కాస్త టీ అయినా తాగి వద్దామని బయటకొచ్చాడు. అంతలోనే ఎదట ప్రత్యక్షమయ్యాడు వార్డ్ బాయ్. “చాయ్ తాగి వస్తాను!” అనగానే, వాడి వెంట వార్డ్ బాయ్ కూడా అడుగులు వేశాడు క్యాంటిన్ వైపు. వేడి వేడి చాయ్ రెండు గుటకలు వేశాక బయటకొచ్చాడు హనుమంతు ఇద్దరి బిల్లును తానే కట్టేసి.

“హనుమంతూ.. మీ నాయనికి, పాణెం పోయేటంత దెబ్బ ఎట్లా తగిలింది? ఏం జరిగినాది?”

“మా పొలం లోకి ఆ పెద్దింటి కరెప్ప కొడుకులు వాళ్లు పశువుల్ని తోలినారు మేసేందుకు. నడుమెత్తున పెరిగిన జొన్నసేను. అప్పుడప్పుడే కాయలు కాస్తా వుండె. కంకుల్ని తినేస్తే పంట సేతికి సిక్కేనా! మరి మా నాయనికి కోపం రాదా ఏంది. ఆడున్న కర్ర దీస్కోని నాలుగు పీకులు పీకినాడు. అంతే ఆళ్లు కొట్లాట పీకినారు. అది ఇట్లా ముగిసినాది. ఆళ్లూ ఏట్లు దినినారు. అయితే ఆ కరెప్ప కొడుకు ఇసిరిన కొడకవలేటుకి మా నాయన కిందబడినాడు. ఆసుపత్రికి తెచ్చేలోపలే ప్రాణం పోయినాదయ్యా.”

అల్లాంటి సమయంలో తన గోడును మొఱ పెట్టుకోటానికి ఆ వార్డ్ బాయ్ ఒక్కడే అన్పించి తన దుఃఖానంతట్ని వాడి ముందు వెళ్ళగక్కాడు.

ఆ వేళకి పోస్ట్‌ మార్టమ్ డ్యూటీ చేసేవాళ్లు వచ్చారు. వాళ్లకి నమస్కరించి చేతులు గట్టుకోని నిల్చున్నాడు హనుమంతు. శవ పరీక్ష ఎల్లాగో ముగిసింది. శవాగారం లోకి వెళుతూన్న హనుమంతుని అడ్డగించి, “తమ్ముడూ! అవసరపడొద్దు. శవాన్ని చూసేందుకు వీల్లేదు!” అన్నారు పోలీసులు. హమమంతుని ఎవరో పిలిచి, “శవాన్ని చుట్టడానికి వస్త్రం, ప్లాస్టిక్ కవర్, కట్టడానికి పగ్గాలు తేవాల” అన్నారు. హనుమంతు స్నేహితుడు, “అయ్యా, ఈ ఊరు మాకు కొత్త. ఇవి యాడ దొరుకుతాయ్? మాకు తెలవదే” అన్నాడు. వాణ్ణి పక్కకు పిలిచి, “అవన్నీ మేము తెచ్చి పెడతాం గాని పైసలిస్తే సాలు” అన్నారు వాళ్లు. “ఎంతవుతుందయ్యా?” అని అడిగితే “మూడు వేలు” అన్నారు వాళ్లు.

“కొంచం తగ్గించడయ్యా” వేడుకొన్నట్లు అడిగాడు హనుమంతు. దానికి వాళ్ల చేత తిట్లు తినాల్సివచ్చింది.

ఆ తర్వాత తెల్సి వచ్చింది, శవాన్ని తీసుకెళ్ళడానికి ఆసుపత్రి వాహనం లభ్యం లేదని, ప్రైవేట్ వాహనమే గతి అని. దానికి హనుమంతు చేతినుంచి కొన్ని వేలు జారి పోయినాయి. అన్నీ ముగిసాక, ఆస్పత్రి సిబ్బందిని సంతోషపరిస్తే, శవాన్ని వాహనంలోని పెట్టడం జరుగుతుందన్నారు. ఇది సంతోష సమయమా అని ఆలోచన వుండగా వార్డ్ బాయ్ లక్ష్మణ్ “హమమంతూ, నీవిపుడు దుఃఖంలో వున్నావు. అయితే ఇంతవరకూ మీ నాయన శవాన్ని ఇయ్యడానికి సాయం జేసినారు కదా. ఆళ్ళ సంతోసానికి..” అని అన్నాడు, హనుమంతుకి వచ్చిన సందేహాన్ని తీర్చడానికని,

“పోయినోళ్లందరూ మంచోళ్లు.. పుణ్యవంతులు – సావక బతికినోళ్లే – మేము పాపం చేసినోళ్లం” అని మిగిలిన పైసల్ని వాళ్ల చేతిలో పెట్టాడు హనుమంతు. ఏడవటానికీ శక్తి లేదు వాడికి.

కన్నడ మూలం: మాలతి ముదకవి

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here