ఔరా.. అగ్గిరవ్వ

0
4

[శ్రీ షేక్‌ మస్తాన్‌ వలి రచించిన ‘ఔరా.. అగ్గిరవ్వ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నూ[/dropcap]ర్పిళ్ళు ముమ్మరంగున్నాయి. టోకున వడ్లు కొంటానికి బొద్దికూరపాడు చేరా. పాతవి కొన్ని, కొత్తవి కొన్ని ఖాతాలు కలసి బేరాలు చక చక జరిగాయి. సాయంత్రానికి సరుకు ట్రాక్టర్‌లో దరిశిలోని మా కొట్టుకు పంపా. వ్యాపారం లాభసాటిగా జరగటంతో సంతోషంగుంది.

పని పూర్తయ్యాక చెల్లి వరసయ్యే దూరపు చుట్టం మంగమ్మవాళ్ళు పరామర్శ కెళ్ళా. “రాఁ.. అన్నా! రా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు” నన్ను చూడగానే ఆమె ఆహ్వానించింది.

“ఏదమ్మా.. ఎప్పుడు చూసినా.. ఒకే పనులు! ఇప్పుడే వడ్ల కొనుగోలు అయింది. ఎలాగు యింత దూరం వచ్చాను కదా.. ఓసారి నిన్ను, బావను చూద్దామని వచ్చా!” అన్నా.

“పోన్లే.. అన్నా! అట్టన్నా వచ్చావ్‌! శానా సంతోషం! కాళ్ళు కడుక్కో!” మంగమ్మ ఆప్యాయంగా నీళ్ల తొట్టి దగ్గరకు దారి చూపి ఓ టవల్‌ అందించింది.

“ఓహో! పున్నయ్య.. బావే! శానా రోజుల కొచ్చావ్‌! కొంపదీసి.. దారి గాని తప్పలేదు గదా!” అప్పుడే పొలం నుండొచ్చిన ఆ యింటి యజమాని రంగయ్య తొట్టి దగ్గర్నుండి పంచలో కొస్తున్న నన్ను పలకరించాడు.

“లేదు లేవయ్యా.. బావా! చెల్లెల్నిచ్చుకున్నాక.. తప్పిద్దా! కావాలనే వచ్చాన్లే! అయినా.. ఏంటీ? యింత పొద్దుదాక పొలంలో వున్నావ్‌!” నే సంభాషణ దారి మళ్ళించా.

“ఎక్కడ బావా! అసలే కూలోళ్ళు దొరకటం లేదు. యిటు సూత్తే కల్లాలతో వల్లమాలిన పనాయే! దాంతో సీకటి పడింది!” రంగయ్య టవల్‌ దండెంపై వేసి కాళ్ళు కడుక్కొని, నాకెదురుగా మంచంపై కూర్చున్నాడు.

ఆపై మేం లోకాభిరామాయణంలో పడ్డాం.

ఈలోగా లావుగా, పొట్టిగా, గుండు లాగున్న పద్దెనిమిదేళ్ళ కుర్రోడు పైకి మడిచిన ప్యాంటు, గీరల చొక్కా, కురుచ క్రాఫులతో వచ్చి తొట్టి దగ్గర ముఖం కడుక్కుంటున్నాడు.

“ఎవరూ? మీ అబ్బాయే గదా బావా!” అటే చూస్తూ అడిగా.

“ఆఁ! వాడు మా వెంకయ్యే! వట్టి మొద్దవతారం.. చదువబ్బకపోతే నాతో పొలం తీసుకెళ్తున్నా” రంగయ్యన్నాడు.

“మరి.. తప్పుద్దా! మనిషన్నాక ఏదో ఒక జీవనోపాధి కావాలిగా” నే నవ్వా.

ఇంతలో తొట్టి దగ్గర కుర్రోడు గబగబ వచ్చి నా ఎదురుగా నుంచోని తన చూపుడువ్రేలుతో నన్ను చూపుతూ, “ఈ నెవరూ?” అంటూ వాళ్ళమ్మ నడిగాడు కొంచమైతే నా మూతి పొడిచేవాడే.

“ఒరే! అలా చేయెట్టి చూపెట్తావేందిరా? తప్పు కదూ! ఆయన మీ పున్నయ్య మామరా! మా పిన్ని జేజయ్య కొడుకు! నువ్వు.. ఆయన్ను సూసి శాన్నాళ్ళయింది! అప్పుడు నువ్వు సిన్నొడివిలే” మంగమ్మ సర్ది చెప్పింది.

“అంటే.. మా..మ..నా!” పెదాలు దాటని మాటలతో సదరు వెంకయ్య కొయ్యలా లోనికెళ్ళాడు. కొత్తవాళ్ళను పరిచయం చేసినప్పుడు నవ్వాలనే యింగితమూ అతన్లో లేదు.

‘పాపం.. బిడియస్తుడ్లాగుంది!’ నా మనస్సు జాలి పడింది.

ఆపై వెంటనే బయల్దేరుదామనుకున్న నన్ను మంగమ్మవాళ్ళు బలవంతంగా ఆపారు. తప్పలే! రాత్రికి అక్కడే బస చేశా. ఓ గంట తర్వాత స్నానాలు, భోజనాలు వగైరా ముగించి పడకలపై చేరిన మేం చాలాసేపు పాత సంగతులు గుర్తు చేసుకుంటూ కాలం గడిపాం.

ఆ సందర్భంగా మంగమ్మ “చూశావుగా అన్నా! మా వెంకయ్య ఓ మాలోకం! పొద్దున్నే చద్దన్నం, పొద్దెక్కాక పొలం, రాతిరికి యిల్లు తప్ప మరేవి తెల్దు! మడుసులతో.. ఎట్టా మసులుకోవాలో తెలియదెదవకు. దరిశిలో పంతులమ్మగా పని చేస్తున్న మా సునీతేమో తమ్ముడ్ని పంపమని ఒకే గోల! వీడొక్కడా.. ఎల్లలేడు. మీ బావకేమో పొలం పనితో సెనం తీరిక లేదు! ఎలాగు నీవెల్తున్నావుగా! వీడ్ని కూడా నీతో తీసుకెల్లి పున్నెం గట్టుకో!” అంటూ ఓ పని పురమాయించింది.

“పున్నయ్య కదెంత పన్లేవే! అట్టాగే సేత్తాడ్లే!” రంగయ్య పరోక్షంగానే భార్య ప్రతిపాదనకు ఊదరేశాడు.

ఇక తప్పిద్దా! “అలాగే” అన్నా.

***

తెల్లవారి వెంకయ్య, నేను మూటా ముల్లె సర్దుకొని, ప్రయాణానికి తయారై రామాలయం దగ్గరకు చేరాం. వచ్చే పోయే బస్సులాగే ఆ స్థలమే ఊరి బస్టాండ్‌.

ఉదయం ఏడైంది. అప్పటికి రావాల్సిన బస్సింకా రాలేదు. వచ్చే అవకాశం కనిపించలేదు. ఒకరొకరుగా జనం బాగానే చేరారు. సమీపానున్న బడ్డి కొట్లో టీ, కాఫీ, చుట్ట, బీడీ, సిగరెట్టు, చిరు తిండ్ల వ్యాపారం జోరుగుంది.

ఓ గంట గడిచింది. ఏడుది కదు గదా… ఎనిమిది గంటల బస్సు కూడా రాలేదు. అందర్లో ఆత్రం, విసుగు కనిపిస్తున్నాయి. యిక వెంకయ్య విషయంలో అవి ఒకాకు ఎక్కువగానే వున్నాయి. అందుకే అతగాడు “బచ్చింకా రాలేదేంది మామా? యింకెంతసేపు కూకోని సావాల!” అంటూ విరుచుకు పడ్డాడు.

“వస్తుందిలే.. అబ్బయ్యా! ఎక్కడో.. ఎందుకో ఆలశ్యమైంది! యింకాస్సేపటికన్నా రాకపోద్దా” నే సర్ది చెప్పా.

“మరెందుకు మామా! యింటికాడ.. బచ్చు పోద్దీ.. బచ్చు పోద్దీ అని ఒకటే రొద సేత్తివి? ఆ. కాడికి దాని చంగతి నీగ్గూడ తేల్దనేగా అరదం!” వెంకటయ్య సూటిగన్నాడు.

‘ఓరి వీడి దుంపతెగ! ఏకంగా నన్నే ఎత్తిపొడుస్తున్నాడే! పోను పోనూ వీడితో కష్టంగుండే లాగుందే!’ మనస్సు గునుస్తుంటే, పైకి “ఆ సంగతి యిక్కడ కొచ్చాక గదయ్యా తెలిసింది! తొందరపడ్తే ఎట్టా? వస్తుందిలే” అన్నా.

దాంతో సంగతి సద్దుమణిగింది.

అయితే ఇంకో అరగంట గడిచినా బండి జాడ లేదు. “తూ! దీనెక్క తూ.. దీనెక్క! ఏం బచ్చో? ఏందో!” మాట మాటకు వుమ్ముతూ పదే పదే వాసనకట్టు నేతి తపాళను ఒక చేతి నుండి మరో చేతికి మార్చుకుంటున్న వైనం వెంకయ్య అసహనానికి అద్దం పడ్తుంది.

అలాంటి పరిస్థితిలో అప్పుడే హడావిడిగా వచ్చిన ఓ కుర్రోడు సరాసరి వెంకయ్య వద్దకు వచ్చి, “అన్నా! దరిశి కెల్లటానికేమైనా వుందా?” అని అడిగాడు. అసలే ఆలశ్యానికి విసిగున్న మావాడు “ఆఁ.. వుంది, యీమానం! రెక్కలు కట్టుకొని నీ కోచం నుంచోనుంది! ఎల్లు.. ఎక్కు.. ఎగిరిద్దీ!” అంటూ గాండ్రించాడు.

“అబ్బో.. శానా వుందే! ఆ మాతరం మాకు తెలవదేంది.. నేనడిగేది బచ్చు చంగతయ్యా” కుర్రోడు గుర్రుగన్నాడు.

“దాని కోచమే పొద్దు కాడ్నించి గోతికాడ నక్కలా కూచున్నాం.. నువ్విప్పుడొచ్చి.. కూసేపాగలేవా?” వెంకయ్య మాటకు మాట ధాటిగన్నాడు.

“సెప్పింది సాల్లేవయ్యా చామా! ఇక నీపనేందో నువ్వు సూస్కో” కుర్రోడూ నిష్ఠూరంగన్నాడు.

“ఏందయ్యో.. బోగంటున్నావ్‌? కూత్త.. నువ్వూ నోరు మూచుకో” వెంకయ్య చూపుడు వేలు చూపి భయపెట్టసాగాడు. చూస్తుంటే తగాద రాజుకునేలాగుంది.

దాంతో నే వెంటనే కల్పించుకొని కుర్రోడి భుజంపై లాలనగా చెయ్యేసి “అది కాదులే బాబూ! ఏడుగంటల బస్సు రాలే! ఎనిమిద్దాని కోసం చూస్తున్నాం! ఆ బండి కాసేపటికి వస్తుందని ఆ.. బడ్డి కొట్టాయన చెప్తున్నాడు! వస్తుందిలే” అంటూ సర్దిచెప్పా.

“అయినా.. ఈ మద్దె పెతోడికి ఎటకారమెక్కువైంది చామా!” ఎలాగో కాస్త నెమ్మలించిన కుర్రోడు దూరంగా వెళ్ళి నుంచున్నాడు.

ఇంతలో బస్సు రావటం, మేఘంలా రోడ్డుపై దుమ్ము లేవటం, దాన్ని ఛేదించుకొని జనం బండెక్కటానికి ఎగబడటం వెంట వెంటనే జరిగాయి.

“లగెత్తు.. మామో! లగెత్తు! నాయాల్లందరు కమ్ముకుంటున్నారు” ఒక్కసారిగా హుషారెక్కిన వెంకయ్య గుంపులో జొరబడ్డాడు. నేనూ వేగంగా కదిలా. నెట్టుకునే వారిని తట్టుకోలేక తలుపైతే తల్లడిల్లిందిగాని జనం మాత్రం వెనుకంజ వేయలేదు.

“ఓర్నీ.. యిదేం మడుసులురా తండ్రీ! దొంగముండా కొడుకులు నెట్టుకొని సత్తన్నార్రా చామి, తపేల నెట్టగాకండయ్యా.. దండం బెడ్తా! నేతిబొట్టు నేల పాలైద్దీ!.. ఒక పక్క సెబుతుంటే.. రెండో పక్క ఎగబడతారేందిరా నా కొండెల్లారా!” లాంటి అరుపులతో వెంకయ్య చొరవ చేశాడు. నేనూ ఒక ప్రవాహంలో యిరుక్కున్నా. అంతే! ఒక్క వూపులో యిద్దరం లోపలికి నెట్టబడ్డాం. వెంకయ్య నా వెనుక సీట్లో కుదురుకున్నాడు.

అదృష్టం! తోటి ప్రయాణికులు సీట్ల వేటలో పడి మావాడి తిట్ల పంచాంగం పట్టించుకోలేదు. కాకుంటే అదో తగాదాకు దారి తీసేదే.

క్రమంగా బస్సు క్రిక్కిరిసి పోయింది. బస్టాండ్‌లో వెంకయ్యతో ఘర్షణ పడిన కుర్రోడు, అతను కూర్చున్న సీటు ప్రక్కనే జనంలో యిరుక్కోని నుంచోనున్నాడు.

ఈలోగా కండెక్టర్‌ వెనుక నుంచి వరుసగా టిక్కెట్లు యివ్వసాగాడు. ఇక మా వెంకయ్య “ఓ కండక్టరూ! ఓ.. కండక్టరూ! దరిశెంత? ఎంత? ఎంత?” అంటూ ఒకటే అరవసాగాడు. అంత గలభాలోను అతని మాటలు ఖంగు మంటున్నాయి.

వెంకయ్య అవతారం, అతని అత్యుత్సాహం గమనించిన కండెక్టర్‌ “ఎంతా! ఇంత!” అంటూ రెండు చేతులతో సంజ్ఞ చేసి మజాగ్గన్నాడు.

“సాల్లే వయ్యా! నీ కాడ శాన సెతురుందే! నేనడిగేది శార్జి సంగతి” వెంకయ్య విసుకున్నాడు. అంతే! ఎదుటి వ్యక్తి తీరు యిట్టే పసిగట్టిన కండక్టర్‌ దారి కొచ్చి, “అదేం లేదులే అబ్బయ్యా! ఛార్జీ అయితే.. నాలుగున్నర రూపాయలు!” అన్నాడు.

“అట్టయితే.. నాకొకటియ్యి! ఆనెక్క ముందు చీట్లో వున్న మా మామ కొకటిచ్చి, పైకం ఆయన దగ్గరే తీచుకో!” వెంకయ్య గుప్పిట్లో నలిగిపోతున్న ఐదు రూపాయల నోటు యిచ్చాడు. అంటే.. ఎవడి టిక్కెట్‌ వాడే చెల్లించాలనే వాక్యం చెప్పకనే చెప్పాడన్నమాట. ఔరా.. తెలివి!

టిక్కెట్‌ యిచ్చిన కండక్టర్‌, దాని వెనుకనే కొరవ చిల్లర వివరం వ్రాసి వెంకయ్య చేతిలో పెట్టి ముందుకు కదిలాడు. “ఏందయ్యా.. సిల్లరియ్యకుండా ఎల్లి పోతున్నావ్‌! ఎర్రోడ్ననుకున్నావా..ఏంది?” వెంకయ్య గుడ్లురిమాడు.

“వెనుక రాశాను! చూసుకోవయ్యా!” కండక్టర్‌ తల కూడా తిప్పకుండా తర్వాత సీటు వారికి టిక్కెటిచ్చే పన్లో వున్నాడు.

“ఓహోఁ! ఎనక రాసేది.. ముందు రాసేది మాగ్గూడ తెలుసుగాని, ముందిక్కడ డబ్బిచ్చి కదలవయ్యా!” వెంకయ్య సంగతి వదిలేలా లేడు.

అసలే రద్దీ. ఆపై జనాల ఉబుసుపోని ముచ్చట్లు, బస్‌ యింజన్‌ రొద కలసి అక్కడి వాతావరణం విసుగు పుట్టిస్తుంది. అందుకే గ్రిప్‌ రాడ్‌ పట్టుకొని నుంచోలేక అవస్థ పడుతున్న కుర్రోడు, “ఎందయ్యా! అట్టా చెవి తెగ్గోసిన మేకలా అరుత్తావ్‌! కాత్త ఎనక సూస్కోరాదు” అంటూ వెంకయ్యను దబాయించాడు.

ఇంతకు ముందు బస్టాండ్‌లో జరిగిన ఉదంతం పైనే గుర్రుగున్న వెంకయ్య, కుర్రోడి వైపు వురిమి చూస్తూ, “ఆహాఁ, మీ వూర్లో ఎనక సూసుకుంటారా! మే మట్టా కాదులే. ముందే సూసుకుంటాం!” అంటూ వెటకారంగన్నాడు.

ఎదురు దాడి తీవ్రత గ్రహించిన కుర్రోడు సర్దుకొని “చాల్లేవయ్యా! నే సెప్పాల్సింది సెప్పా! ఆనెక్క.. నీ యిట్టం” అంటూ మౌనం వహించాడు.

ఈలోగా వెంకయ్య ప్రక్కనున్న ఓ చదువరి “ఇతనెక్కడ ఫూలండీ! ఒకే సొద పెడ్తున్నాడు” అని గొణిగాడు.

“పూల్లేదు, కాయ లేదు! నువ్వూర్కోహే! నేనూ కండట్రూ సూసుకుంటాం! మద్దెలో నీకేంది నొప్పి?” వెంకయ్య దబాయింపుతో ఆ పెద్దమనిషి నోరు మూతపడింది. కళ్ళైతే కారంగానే చూస్తున్నాయి.

ఈలోగా విషయ ప్రాముఖ్యత గమనించిన కండక్టర్‌ “బ్బా..బ్బా..బూ! అరవమాకు! పైసలు నేనిస్తాగా!” అని మరో పాసింజర్‌ దగ్గర చిల్లర తీసుకొని, వెంకయ్య కిచ్చి టికెట్‌ వెనుకున్న రాతను కొట్టేసి ముందుకు కదిలాడు. ‘మరి అట్టా రా! దారికి’ వెంకయ్య విజయగర్వంతో వూగిపోతుంటే నాకతని ప్రవర్తన ఎబ్బెట్టనిపించింది.

చివరకు కండక్టర్‌ టకటకలతో బస్సు కదిలింది. అప్పటివరకు చెమటన మగ్గుతున్న ప్రయాణికులు కిటికీల గుండా వీచే చల్లగాలితో హాయి ననుభవించసాగారు.

ఆ పై గంట ప్రయాణం మమ్మల్ని గమ్యం చేర్చింది.

***

దరిశి బస్టాండ్‌లో నేను బేరమాడి సునీత యింటికెళ్ళటానికి ఓ రిక్షా మాట్లాడా. “ఇదిగో మామా! ఈ రిచ్చా శార్జీలో చగం నేనిత్తా! అందుకు నువ్వేమీ అనుకోవద్దు. ముందే చెబుతున్నా! ఆనెక్క వద్దంటే బాగుండదు!” వెంకయ్య ముందలి కాళ్ళకు బంధాలేశాడు.

“అట్టాగే లేవయ్యా. కాకుంటే, బస్సులోలా చిల్లర పేచి పెట్టమాకు” నే నవ్వా.

“భలే వాడివే మామా! అట్టెందుకు సేత్తా! నువ్వు మా వాడివిగా” ఓ హామీ విసిరిన వెంకయ్య, సామాన్లతో సహా రిక్షా ఎక్కాడు. నేనూ కూర్చున్నా.

“పద పదవే..” కూని రాగాలతో రిక్షావాలా దూసుకెళ్తున్నాడు. పొట్టిగా, ధృడంగా వున్నతనిలో ఎలాంటి అలుపు లేదు. అయితే అక్కడక్కడ రోడ్డుపై నున్న గతుకులకు వూగే రిక్షా మాత్రం మమ్మల్ని అతలాకుతలం చేయసాగింది.

“ఇదేందయ్యా! ఈ వూర్లో రోడ్లన్నీ.. ఒట్టి గుంతల్లాగున్నాయే!” నేతి తపేళను కాపాడలేక తంటాలు పడుతున్న వెంకయ్య గొణిగాడు.

“మరే బాబూ! అవంతే! అయ్యేమన్నా బాగుపడాలంటే.. మల్లా ఎలచ్చన్లు రావాల్సిందే” రిక్షావాలా కాస్త వేగం తగ్గించాడు.

“అవులే! మా వూరి దారుల్లో కూడా గుంతలున్నాయిగానీ.. మరీ మీ వూర్లో అంత పెద్దవి గావులే!” వెంకయ్య యధాలాపంగన్నాడు.

“అట్టానా!” రిక్షావాలా మలుపు తిప్పాడు.

“అయినా.. మీ వూరి పెద్ద గుంతలే శానా మేలనుకుంటా”

వెంకయ్య పొంతనలేని మాటలు అర్థం గాక అతనివైపు ప్రశ్నార్థంగా చూశా. ఇక రిక్షావాలా ఏకంగా “అదేందబ్బయ్యా! పెద్ద గుంతలెట్టా మేలౌతాయ్‌?” అంటూ ఆత్రంగా అడిగాడు.

“తెలియలేదా?” వెంకయ్య చిద్విలాసంగా నవ్వాడు.

“ఊ.. హూఁ!” రిక్షా అతను తల అడ్డంగా వూపాడు.

“అదేలే! మీ వూర్లో రిచ్చాలోంచి దొర్లి గీన గుంతలో పడి సత్తే.. అట్టానే పూడిసేయొచ్చు! అదే.. మా వూర్లో నైతే మల్లా గుంత తొవ్వాలిగా!” వెంకయ్య పళ్ళికిలించాడు.

“భలేవాడివే నబ్బయ్యా!” రిక్షా అతను పెద్దగా నవ్వాడు. ‘బాబోయ్‌! వీడు సామాన్యుడు గాదయ్యో’ లోలోనే అనుకున్న నేనూ నవ్వా.

ఇంకో పదినిమిషాలలో రిక్షా సునీత యింటి ముందాగింది.

అంతే! బండి నుండి ఒక్కుదుట్న దూకిన వెంకయ్య, “అక్కో! ఓ అక్కో.. నే వచ్చా! నీకు నెయ్యి గూడా తెచ్చా, చూడు” అంటూ సామాన్లతో యింట్లోకి పరుగెత్తాడు.

“ఎవరూ” అంటూ ఎదురొచ్చిన సునీత “నువ్వట్రా.. వెంకూ! ఎన్నాళ్ళకెన్నాళ్లకురా.. అమ్మా అయ్యలు యిప్పటికి పంపారన్నమాట” అంటూ తమ్ముడి చేతిలోని తపేళ అందుకుంది.

ఈలోగా రిక్షా కిరాయిచ్చి నే లోపలికొచ్చా.

“అరరే మామ! రా.. రా.. వీడు నీకెక్కడ తోడయ్యాడు భలే తమాషాగుందే” సునీత నన్నాహ్వానించింది.

“వీడు నాకు తోడు కాదమ్మా! నేనే ఇతగాడికి తోడయ్యాను” కుర్చీలో కూర్చుంటూ నా బొద్దికూరపాడు బస సమాచారం వివరించా.

“ఓహోఁ! అదా సంగతి! నేనెన్నిసార్లు అడిగినా పంపనివాడ్ని.. మీరున్నారని పంపారన్నమాట!” అంటూ సునీత లోనికెళ్ళి ఓ గ్లాస్‌ నీళ్లు, ఓ ప్లేట్లో జంతికలు తెచ్చి పెట్టి అతిథి మర్యాద చేసింది. అవి తింటూ కాసేపు కాలక్షేపం చేశా.

ఈలోగా యింట్లో కెళ్ళొచ్చిన వెంకయ్య “మామా! చగం రిచ్చా శార్జికింద యిదుంచు!” అంటూ మడత పెట్టిన ఓ పది రూపాయల నోటు నా జేబులో కుక్కాడు.

“ఒరే.. ఒరే.. వద్దులేవయ్యా!” అన్న నా అడ్డంకులు అతగాడి పట్టుముందు తుత్తునిలయాలయ్యాయి. ఆ పై కాసేపు ఊరి సంగతులపై మాటా మంతి జరిగాయి. చివరిగా “ఇక వస్తానమ్మా! యింటి దగ్గర బోలెడు పనుంది!” అంటూ లేచా.

“ఏదోలే మామా! మీ పుణ్యమా అని ఈ అమాయకుడు యిక్కడికి రాగలిగాడు!” సునీత కృతజ్ఞతగా అంది.

“ఏదీ? మీవాడు అమాయకుడా తల్లీ! అలా అనుకునే మనమే అమాయకులం! నిజానికి వాడో అగ్గిరవ్వ! ఎక్కడబడితే అక్కడ కాల్చేస్తున్నాడు!” నేనన్న మాటలకు సునీత, “ఆఁ..” అని యింకేదో చెప్పబోయింది.

ఈలోగా నే గడప దాటా.

ఇంటికెల్లి వెంకయ్య యిచ్చిన పదినోటు జేబు నుండి బయటకు తీసి చూశా. అది.. దాదాపు పది పై చిలుకు చినుగులతో నా అమాయకత్వాన్ని వెక్కిరిస్తూ కనిపించింది.

దాంతో, “ఔరా.. అగ్గిరవ్వ!” అని అనకుండా వుండలేక పోయాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here