అరవయ్యేళ్ళ ‘యువ’ భారతి

0
3

[షష్ట్యబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న యువభారతి చరిత్రని సంక్షిప్తంగా వివరిస్తున్నారు శ్రీ పి. అశ్వనీ కుమార్.]

[dropcap]గ[/dropcap]తంలోని మంచిని జీర్ణించుకొని, వర్తమానాన్ని సక్రమంగా అవగాహన చేసుకుని, సమ్యక్ దృక్పథంతో పయనించడానికి యువతరం ఉద్యమించగలిగినప్పుడే, జాతీయ శక్తులు ఉద్దీప్తిని పొందగలుగుతాయనే విశ్వాసంతో, “చుట్టూరా ఆవరించుకొని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది” అనే సూక్తి ఊపిరిగా, యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, 1963 సెప్టెంబర్ 24 వ తేదీ (శనివారం) నాడు, 102, జీరా, సికిందరాబాద్‌లో ఉద్భవించింది.

వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుల వివరాలు:

హైదరాబాద్ AGs Office లో UDC గా పనిచేసిన శ్రీ కె రఘునాధ రావు గారు అధ్యక్షులు;

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా పనిచేస్తున్న శ్రీ ఎం వి ఎస్ ప్రసాద్ కార్యదర్శి;

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా పనిచేస్తున్న శ్రీ వంగపల్లి విశ్వనాథం గారితో పాటు, వివిధ సంస్థలలో పనిచేస్తున్న శ్రీ టి ఆంజనేయులు, శ్రీ టి ఎస్ నారాయణ, శ్రీ ఎం వి రామకృష్ణ; శ్రీమతి శ్రీదేవి, కార్యవర్గ సభ్యులుగా ఈ క్రింది ఆశయాలు రూపొందించబడ్డాయి.

  1. దేశానికి, సంఘ శ్రేయస్సుకు అనువైన పద్ధతిలో సభ్యులలో పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందింప జేయడం;
  2. పరిపూర్ణమైన, సమగ్రమైన వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడే విధంగా, వచోరీతిని (oratory skills), రచనా పాటవాన్ని (literary skills) అలవరచే అధ్యయన శీలతనూ, ఆలోచనా శక్తికీ దోహదం చేసే కార్యక్రమాలను నిర్వహించడం;
  3. బాల బాలికలను, యువతీ యువకులను ‘కలం స్నేహం’ ద్వారా, సమావేశాల ద్వారా పరిచయం చేసి స్నేహ సౌహార్ద్ర భావాలను పెంపొందించడం;
  4. సభ్యుల మంచి అభిరుచులను పెంపొందించడానికి అనువైన వైజ్ఞానిక, సాహిత్య, సంగీత కార్యక్రమాలను జరపడం;
  5. సంఘసేవ ద్వారా సమాజానికి తోడ్పడడం;

పై ఆశయసాధనకు అవసరమైతే అనుబంధ శాఖలను ఏర్పరచుటకు కూడా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అలా ఏర్పడ్డ యువభారతి సంస్థ, 1964 జనవరి 4వ తేదీన ఒక సాహితీ సాంస్కృతిక సంస్థగా రిజిస్టరు కాబడింది (రిజి. నెం. 1 /64).

ఈ ఆశయసాధనలో – ప్రతి నెలా మొదటి, మూడు ఆదివారాలలో సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ‘పక్ష సమావేశాలు’ నిర్వహించబడేవి. అందులో ‘క్లుప్తగోష్టి’, ‘పునరపి’, ‘స్వీయరచనాపఠనం’, ‘నా ఊహాపథంలో’, ‘నాకు నచ్చనివి, నేను మెచ్చినవి’, ‘పుస్తక సమీక్ష’ మొదలైన అంశాలు చైతన్యవంతంగా సాగేవి. అప్పటి పక్ష సమావేశాలన్నీ శిక్షణ శిబిరాలుగా ఉండేవి. ఈ పక్ష సమావేశాల ద్వారా ఎందఱో యువతీ యువకులు యువభారతి పట్ల ఆకర్షితులై యువభారతి లక్ష్యసాధనలో చురుకుగా పాల్గొనడమే కాక, ‘యువభారతి’కి తాము ఎలా దగ్గర అయ్యారో, ఈ సమావేశాలు తమ జీవన గమనాన్ని, వ్యక్తిత్వాన్నీ ఎలా మార్చివేసాయో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలా 1965 విజయదశమి నాటికి యువభారతి ఒక సమగ్రరూపం దాల్చింది.

1965-70 సంవత్సరాల మధ్య యువభారతి తన ఆశయాలకు అనుగుణంగా సాహిత్య కార్యక్రమాలను చేపట్టి ప్రజల మధ్యకు నడిచింది. బలమైన ప్రయోగాలు చిత్తశుద్ధితో చేసి ప్రజల మన్ననలు పొందడం ప్రారంభించింది. మహిళా విభాగ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ‘యువభారతి’ అన్న పేరుతో ఒక సైక్లోస్టైల్డ్ మాస పత్రికను వెలువరించింది. దాదాపు ప్రతి నెలా వెయ్యి ప్రతులు చెల్లిపోయేవి. అంతేకాదు చక్కని నాటకాలను కూడా యువభారతి సభ్యులు ప్రదర్శించారు. అలా యువభారతి ప్రచురణలు, సమావేశాలు, ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో తెలుగువారిని ఆకర్షించడం మొదలు పెట్టాయి.

అలాగే యువభారతి అప్పట్లో ఒక లిఖిత మాసపత్రికను కూడా ప్రారంభించింది. శ్రీ అల్లంరాజు వెంకటరావు ‘సుధామ’ గారు దాన్ని చాలాకాలం నిర్వహించారు. అటు తరువాత శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారి సంపాదకత్వంలో ‘నందిని’ మాసపత్రిక వెలువడి అది కూడా చాలాకాలం నడిచింది. అప్పట్లో ప్రచురించబడిన ‘నందిని’ మాస పత్రికలో దాశరధి గారు, డా. సి నారాయణ రెడ్డి గారు, శ్రీ ఆరుద్ర గారు, దివాకర్ల వేంకటావధాని గారు, వానమామలై వరదాచార్యులు గారు, దేవులపల్లి రామానుజరావు గారు, శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు గారు, కుందుర్తి గారు, ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు వంటి ప్రముఖ కవులు, రచయితలు ‘ప్రభావం’ పేరిట చిన్న చిన్న వ్యాసాలు వ్రాసేవారంటే, నందిని ఎంతటి ఉన్నతమైన సాహితీ విలువలను సంపాదించుకుందో మీకు తెలుస్తుంది. తెలుగులో ‘Readers Digest’ వంటి పత్రికను నడపాలనే ధ్యేయంతో ‘నందిని’ త్రైమాసిక పత్రికను కూడా ప్రారంభించడం జరిగింది. ఐతే పాఠకుల నుండి తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఆ పత్రిక నిర్వహణ మానుకోవలసి వచ్చింది.

యువభారతి పథకాలు:

వీలైనంత ఎక్కువ మంది సాహితీ ప్రియులను యువభారతి ఛత్రఛాయ లోకి తీసుకురావాలనే సంకల్పంతో ‘సాహితీ మిత్ర’, ‘భారతీ మిత్ర’, ‘భారతీ భూషణ’ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ పథకాలలో చేరిన వారు యువభారతి సంస్థ సభ్యులు కాకపోయినా, వారికి యువభారతి ప్రచురణలను అన్నింటినీ ‘ఉచితంగా’ అందజేసే ఏర్పాటు ఉండేది. ఐతే, పెరిగిన ముద్రణ ఖర్చుల కారణంగా ఈ పథకాలను కొనసాగించడం సాధ్యం కాలేదు.

ప్రచురణ పూర్వ విరాళాలు:

ప్రచురణ ఖర్చులను కొంతైనా భరించి సంస్థకు ఆర్థికంగా సహాయం చేసే వదాన్యులను సంస్థకు చేరువ చేసే ఆలోచనతో, ఈ ప్రచురణ పూర్వ విరాళాలను సేకరించే పధ్ధతి ప్రారంభింపబడింది. ఇలా విరాళాలతో ముందుకు వచ్చే సాహిత్య ప్రియులకు ఆ ప్రచురణ అతి తక్కువ ధరకు – దాదాపు ప్రచురిత వెలలో 50 % తగ్గింపు ధరకు అందించడం జరిగింది.

1967-70 సంవత్సరాలలో శ్రీ అనుముల కృష్ణమూర్తి గారు రచించిన ‘సరస్వతీ సాక్షాత్కారము’, కాళోజీ గారి ‘జీవన గీత’, యువభారతీయుల కవితా సంకలనం ‘వీచికలు’ తక్కువవెలకు ఉత్తమ సాహిత్యాన్ని అందించడానికి యువభారతి ప్రచురణ పూర్వ విరాళాలను (pre-publication donations) సేకరించి అందించిన తొలి ప్రచురణలు. ఈ ప్రచురణ పూర్వ విరాళాలను సేకరించి దాదాపు సగం ధరకే పుస్తకాన్ని అందజేసే ఉత్తమ సాంప్రదాయాన్ని యువభారతి ఇప్పటికీ పాటిస్తోంది.

ఇతిహాసలహరి గ్రంథావిష్కరణ చేస్తున్నకాళోజీ నారాయణరావు గారు

1970లో ‘మారుతున్న విలువలు – రచయితల బాధ్యతలు’ అనే అంశం మీద నిర్వహించిన గోష్ఠి, దానిని ‘రచన’గా ప్రచురించిన అనుభవం యువభారతికి కీర్తి ప్రతిష్ఠలతో పాటు, ఒక ప్రామాణికమైన సాహిత్య సంస్థకు వచ్చే గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది.

1971-75 మధ్య యువభారతి సమాజంలో ఒక అపూర్వ సాహిత్య చైతన్యాన్ని కలిగించింది. యువభారతి వార్షికోత్సవాల ‘లహరి’ ఉపన్యాస పరంపరలు ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారిచ్చిన ‘కావ్య లహరి’తో మొదలయ్యాయి.

1971 కావ్యలహరి ప్రసంగాలు చేస్తున్న ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు

వేలాది మంది సాహితీ ప్రియులు సాహితీ సభలకు రావడం, సాహిత్యపు విలువల పట్ల సదవగాహన సమాజంలో ఏర్పడడం – యువభారతి సాహిత్యోద్యమం కలిగించిన విలువైన చైతన్యం.

కావ్యలహరి ఉపన్యాస మంజరి తుదిసమావేశంలో ఉపన్యసిస్తూ, అప్పటి రాష్ట్ర విద్యామంత్రిగా, తరువాతి కాలంలో భారతదేశపు ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ పి వి నరసింహారావు గారు “ఇంతటి సాహితీ చైతన్యం ఎన్నడూ తెలుగువారిలో చూడలేదు. ఇది ఇప్పుడు నిజంగా తెలుగు దేశం అనిపిస్తోంది. క్రమబద్ధంగా, క్రమశిక్షణతో జరిగే ఇటువంటి యువభారతి సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే – ఇకమీదట ఫతే మైదాన్ స్టేడియంలో ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తే తప్ప స్థలం చాలదేమో అనిపిస్తోంది.!!” అన్నారంటే – యువభారతి నడిపిన సాహిత్యోద్యమం ఎంత గొప్పదో తెలుస్తుంది.

1971 మహతిని ఆవిష్కరిస్తున్న నాటి విద్యాశాఖామాత్యులు పి.వి.నరసింహారావు

కావ్యలహరి, వికాసలహరి, ప్రతిభాలహరి, ఆలోచనాలహరి, రామాయణసుధాలహరి, కవితా లహరి, నవోదయ లహరి, నవ్య సాహిత్య లహరి, సంస్కృత సాహితీ లహరి, వ్యాస సాహితీ సంహిత, జగద్గురు సాహితీ లహరి, వివేకానంద లహరి హాస్య లహరి, ఉపనిషత్సుధాలహరి నుండి ఇటీవల నిర్వహించిన మహాభారతోపన్యాసలహరి వరకు ఎన్నో విలువైన ఉపన్యాస-వ్యాస మంజరులు వెలువడి తెలుగువారి మన్ననలను అందుకున్నాయి.

స్వీయ కవితా గానం:

స్వీయ కవితా గానం పేరిట కొంతమంది సుప్రసిద్ధ కవులు స్వీయ కవితా గానాన్ని చేసేందుకు వీలుగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో డా. సి నారాయణ రెడ్డి గారు, దాశరధి గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, బోయి భీమన్న గారు, ఉత్పల సత్యనారాయణాచార్య గారు వంటి ప్రముఖులు తమ కావ్యగానంతో శ్రోతలను అలరించారు.

1997 స్వీయ కావ్యగానం సభలో గుంటూరు శేషేంద్ర శర్మ

జయంతులు – పురస్కారాలు:

ఇరివెంటి కృష్ణమూర్తి గారి జయంతి ఉత్సవాలు: యువభారతి పూర్వాధ్యక్షులు డా. ఇరివెంటి కృష్ణమూర్తి సంస్మరణలో ప్రతి సంవత్సరం వారి జన్మదినమైన కృష్ణాష్టమి నాడు సుప్రసిద్ధ సాహితీవేత్తలకు ఇరివెంటి కృష్ణమూర్తి స్మారక పురస్కారాలను అందజేయడం జరుగుతోంది. 1997లో ప్రారంభించబడ్డ ఈ పురస్కారాలు ఇప్పటికీ అందజేస్తూనే ఉన్నది యువభారతి.

తిరుమల శ్రీనివాసాచార్య, శ్రీమతి స్వరాజ్యలక్ష్మి ధర్మనిధి పురస్కారం: యువభారతి ప్రస్తుత గౌరవాధ్యక్షులు శ్రీ తిరుమల శ్రీనివాసాచార్యులు గారు 2011 లో నెలకొల్పిన ఈ ధర్మనిధి పురస్కారాన్ని ఏటేటా ఒక ఉత్తమ సాహితీవేత్తకు అందజేయడం జరుగుతోంది.

ఆచార్య దివాకర్ల వేంకటావధాని స్మారక పురస్కారాలు: యువభారతి దివంగత సభ్యులు శ్రీ గొల్ల కుమారస్వామి నాయుడుగారు, దివాకర్ల వారిమీద గల గౌరవంతో దివాకర్ల వేంకటావధాని మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి, దివాకర్ల వారి శతజయంతి ఉత్సవాలను వారి స్వగ్రామమైన ‘ఎండగండి’ గ్రామంలోనూ, హైదరాబాద్, వరంగల్ పట్టణాలలో ఘనంగా నిర్వహించాము. ఐతే శ్రీ కుమారస్వామి నాయుడిగారి ఆకస్మిక మరణంతో ట్రస్టు కార్యకలాపాలు స్తంభించిపోయాయి.

ఇలా ఐదు దశాబ్దాలకు పైగా (అంటే 1971 నుండి 2022 వరకు) నిర్వహించిన లహరీ కార్యకమాలలో ప్రాచీన కవులు – నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజి, పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతనామాత్యులు, నాచన సోముడు, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు, శ్రీనాథుడు, శ్రీ కృష్ణదేవరాయలు, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు మొదలైన కవుల నుండి, గత రెండు శతాబ్దాలలో సాహితీరంగంలో విశేష కృషి చేసి, సాహితీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న యోగి వేమన, శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీ గురజాడ అప్పారావు, శ్రీ గిడుగు రామమూర్తి పంతులు, శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తిరుపతి వేంకట కవులు, శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పంతులు, శ్రీ ముట్నూరి కృష్ణారావు, శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గుడిపాటి వెంకట చలం, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ జాషువా, శ్రీ నండూరి సుబ్బారావు, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), శ్రీ కుందుర్తి, శ్రీ ఆరుద్ర, శ్రీ దాశరధి, శ్రీ నారాయణరెడ్డి గారలు చేసిన రచనలను సాహితీప్రియులకు  పరిచయం చేసింది యువభారతి.

తెలుగుకవిత లయాత్మకత ప్రసంగాలు చేస్తున్న డా.సి.నారాయణ రెడ్డి గారు

యువభారతి ఒక ప్రచురణ సంస్థ కాకపోయినా, తెలుగు ఎదలో తెలుగుదనం వెల్లువలా పారాలని, తెలుగింటిలో తెలుగు దీపం అఖండంగా వెలగాలని, భాషాభిమానం కలగాలంటే మాతృభాషా సాహిత్య పఠనమే ప్రథమ కర్తవ్యం అన్న భావనతో ఉడతాభక్తిగా కృషి చేస్తోంది. యువభారతి ప్రచురణలలోని వైవిధ్యం చూస్తే మనందరికీ ఆ విషయం అర్ధమౌతుంది.

తెలుగు సాహిత్యాన్ని – సామెతలు, శతకాలు, బాలల కథలు, కృతులు, కీర్తనలు, రూపకాలు, కవితలు, కథానికలు, కథలు, నాటకాలు, నాటికలు, రుబాయీలు, కవిసమయములు – వంటి ఎన్నో సాహితీ ప్రక్రియలు సుసంపన్నం చేశాయి. వీటి ఈ ప్రక్రియలన్నిటి గురించి సాధికారికంగా చెప్పగలిగిన ప్రజ్ఞా దురంధరుల చేత అందరికీ అర్ధమయ్యే భాషలో వ్యాసాలను వ్రాయించి, వాటిని పుస్తకాలుగా ప్రచురించిన ఘనత కేవలం యువభారతిదే.

అలాగే ‘కవితా వైభవం’ series లో జగద్గురు శంకరాచార్య, కాళిదాసు, మాఘుడు, నన్నయ, పాల్కురికి సోమనాథుడు, నన్నె చోడుడు, తిక్కన, నంది తిమ్మన, ధూర్జటి, పింగళి సూరన, అయ్యలరాజు రామభద్రుడు, తులసీదాసు, అల్లసాని పెద్దన, సూరదాసు, చేమకూర వేంకట కవి, కంకంటి పాపరాజు, స్వామి వివేకానంద, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, తిరుపతి వేంకట కవులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కుందుర్తి వంటి కవుల రచనలను విశ్లేషించి ప్రచురించింది. బహుశా ఇంతమంది కవుల కవితా వైభవాలను ప్రచురించిన ఘనత కూడా యువభారతిదే.

గత ఆరు దశాబ్దాలుగా యువభారతి సంస్థ చేసిన ఈ సాహితీ కృషిని చిరస్థాయిగా ఉంచడానికి, యువభారతి ప్రచురణలను అన్నింటినీ scan చేసి internet లో ఉంచడమే కాక, ఆయా పుస్తకాల QR codes కూడా యువభారతి ప్రచురణ “ద్విశత భారతి” అన్న పుస్తకంలో పొందుపరచ బడ్డాయి.

యువభారతి సభ్యుల గ్రూప్ ఫోటో

ఈ రకంగా ప్రస్తుతం అలభ్యంగా ఉన్న ఎన్నో యువభారతి ప్రచురణలను ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టకుండా, మీరు చదువుకోవచ్చు. అంతేకాదు, సాహితీప్రియులైన మీ బంధుమిత్రులకు ఈ పుస్తకాన్ని కానుక ఇస్తే – యువభారతి ప్రచురణల లైబ్రరీని వారికి బహుకరించినట్లే..!!

చివరగా – చాలాకాలం పాటు యువభారతి ప్రచురణలకు సంపాదకులుగా తమ విశిష్ట సేవలను అందించిన డాక్టర్ జి వి సుబ్రహ్మణ్యం గారు ‘యువభారతి’ కార్యకలాపాల గురించి కవితాత్మకంగా చెప్పిన ఈ సీసపద్యంతో నా ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

చిమ్మచీకట్లను చీదరించుటకంటె చిరుదివ్వె వెలిగించు శిల్పమెరిగి
సామాన్యజనులలో సాహిత్య చైతన్య సందీప్తి పోషించు సభలు తీర్చి
కమనీయకావ్యాల కవితాకళాశిల్ప వైభవాల్ వివరించు ప్రభలు చిమ్మి
మానవమూల్యాల మహనీయ సంస్కృతి నిర్మాణ శిక్షణ నీతి నెరపి
~
భారతీపాదమంజీర భవ్యరవము
తెలుగువారల గుండెలో వెలుగునట్లు
ఆంధ్రజనతకు నవతకు అంకితమ్ము
ఆంధ్రజనతకు నవతకు అంకితమ్ము.
~

తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతీ, సాంప్రదాయం వంటివి నిలబడాలంటే, సాహితీ సాంస్కృతిక సంస్థల్ని ప్రజలే ఆదరించి పోషించాలి. వారి కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి. అలాంటి సంస్థలతో మమేకం కావాలి. అప్పుడే, మన భాషా సాహిత్యాలు, సంస్కృతీ సాంప్రదాయాలు పది కాలాలపాటు నిలబడతాయి.

యువభారతి వివిధ ప్రచురణలలో ‘ముందుమాట’లుగా, ‘మా మాట’లుగా, ‘ఆముఖాలు’ గా శ్రీ అయల సోమయాజుల నాగేశ్వరరావు గారు, శ్రీ వంగపల్లి విశ్వనాధం గారు, కీ.శే. డా. జి. వి సుబ్రహ్మణ్యం గారలు వ్రాసిన వ్యాసాలు – ఈ వ్యాస రచనలో నాకెంతో సహాయపడ్డాయి. వారికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి.


యువభారతి షష్ట్యబ్ది ఉత్సవాలు ప్రారంభ సమావేశం YouTube link
https://www.youtube.com/watch?v=ek0BNXpuHXA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here