పూచే పూల లోన-22

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్ తన ఒంటరితనం గురించి సుందర్‍కి చెబుతుంటాడు. డాఫోడిల్స్ పూలలో సుమారు 32 రకాలున్నాయనీ, వాటిలోని స్పేత్ వంటివాడిని తానని చెప్తాడు. స్పేత్ ఎందుకు విభిన్నమైనదో చెప్తాడు. కారు ఓ పక్కకి ఆపి తన మొబైల్ స్విచ్ ఆపేస్తాడు సమీర్. సుందర్ ఫోన్‍ని కూడా కాసేపు స్విచ్ ఆఫ్ చేయమంటాడు. ఏదో పరికరాన్ని కారు డెక్ లోంచి తీసి ఇగ్నీషన్ దగ్గర పెట్టి కారు స్టార్ట్ చేసి ఆపుతాడు. అలా రెండు మూడు సార్లు చేసి ఊరుకుంటాడు. తరువాత కారు దిగి వెనక ఉన్న సీట్లోంచి మరో మొబైల్ తీసుకుని తిరిగి స్టీరింగ్ దగ్గర కూర్చుంటాడు సమీర్. ఆ మొబైల్‍నే చూస్తూ సిగరెట్ తాగుతాడు. ఓ పావు గంట తరువాత తన మొబైల్ ఆన్ చేసి కారు స్టార్ట్ చేస్తాడు. సుందర్ ఫోన్‍ని ఆన్ చేసుకోమని చెప్తాడు. ఈ చర్యల గురించి ఏమీ అడగవద్దని సుందర్‍కి చెప్తాడు. వీరమణి ఎన్నో విద్యలు నేర్పాడనీ, ఆ కారు షెడ్డులో ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాననీ చెప్తాడు సమీర్. కాసేపయ్యాకా, డెక్ లోంచి ఒక పెన్ డ్రైవ్ తీసి స్పీకర్‍కి కనెక్ట్ చేస్తాడు. అందులోంచి రెండు పాటలు వినిపిస్తాడు. వాటిని తానే రాసి పాడానని చెప్తాడు. తన షెడ్ బయట సాయంత్రం పూట ఓ గిటార్ పట్టుకుని పాడుకుంటూ ఉండేటప్పుడు జోకీ అనే అతనితో పరిచయమైందని చెప్తాడు. జోకీకి చక్కని సమయస్ఫూర్తి ఒక వరంలా ఉండేదనీ, చక్కని కామెడీ చేసేవాడనీ, ఏదైనా లయబద్ధమైన పాట అందుకుంటే దానితో పాటు నాట్యం చేసేవాడనీ, గిటార్ వాయించేవాడనీ చెప్తాడు సమీర్. జోవాక్విమ్ లేదా జోవానిమ్ లేదా కొంకణిలో జోకీ అంటే మన కోసం దైవం పంపిన ఒక వ్యక్తి అని అర్థం అని చెప్తాడు సమీర్. జోకీ తనని జీవితాంతం తోడు అన్న సంగతి తనకి తెలియలేదని అంటాడు.]

[dropcap]“మీ[/dropcap]కు సంగీతంలో ప్రవేశమున్నదా?” సమీర్ అడిగాడు.

“లేదు. కానీ ఆస్వాదించగలను”

కారు అలా సమీర్ గతంలోంచో లేక మా ఇద్దరి ఆలోచనల నుండి ఉద్భవించిన అంతరంగాల లోంచో అలా అలా పయనిస్తూ పోతోంది. ఆ కొండలూ, లోయలూ అలా మా వెనకకి వెళ్ళిపోతున్నాయి.

“మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతున్నాను”

“ఓ మాటనుకుందాం సమీర్ గారూ”

“చెప్పండి”

“మిమ్మల్ని కలిసినప్పటి నుండీ ఆశ్చర్యం పుట్టించని క్షణం లేదు, కణం కూడా లేదు. ఈ చుట్టూతా ఉన్నదంతా ఆశ్చర్యంగానే ఉంది”

ఎందుకో కొద్దిసేపు సమీర్ మాట్లాడలేదు.

“ఏం సార్, ఇబ్బంది పెట్టానా?” అడిగాను.

అతని కళ్ళల్లో ఎందుకో కన్నీళ్ళు కనిపించాయి.

“అరె? భావుకులవుతున్నారే?”

నవ్వాడు.

“లేదు సార్..” చెప్పాడు. “..జీవితమంతా సంఘటనలు, గొడవలు, సిద్ధాంతాలు మిగిలిపోయిన ఏ మనిషికైనా అసలు హాయిగా ఓ క్షణం గడిపే అవకాశం ఉండదేమో అనిపిస్తుంది”

“నిజమే. ఓ మంచి పాటగాడిని ఊరికే వదలరు. పాడిన ప్రతిసారీ బాగా పాడాల్సిందే. బాట్ పట్టుకుని దిగిన ప్రతిసారీ వంద బాదాల్సిందే”

“ఒక హీరోకి జీవితమంతా పెర్‍ఫార్మెన్సే! మీరు ప్రతి క్షణం అని పలికినప్పుడు ఈ క్షణాలనేవి అసలు ఎలా ఉంటాయో అనే చిత్రమైన ఆలోచన వచ్చింది”

“ఏదో చెబుతూ ఆగిపోయారు”

“అవును. ఎసిడిటీ, అల్కలైన వ్యవహారంలో పిహెచ్ వాల్యూ అనేది మీరు విని ఉంటారు”

“విన్నాను. పదునాల్గు లోపల ఉండాలన్నది వింటూ వుంటాను”

“కరెక్ట్. సంగీతం వినేవారికి, పాడేవారికి, ఆస్వాదించేవారికి ఆ సమయంలో ఏదైనా పరికరం ద్వారా ఈ పరీక్ష చేస్తే సరిగా ఏడు – మధ్యలో ఉంటుంది”

“ఓ. అంటే శబ్దం యొక్క మహిమ”

“ప్రకృతిలో అన్నింటినీ సమంగా తీసుకుని వచ్చే ఓ గొప్ప శక్తి ఉంది. జోకీ నన్ను కలిసినప్పటి నుండే నాకు గిటార్ మీద మోజు మరింత పెరిగిపోయింది. ఒక్కోసారి నేను పాడేవాడిని, అతను వాయించేవాడు. మధ్యలో ఆపి నా తొడ మీద గట్టిగా బాదేవాడు. ఏమయింది? అని అడిగేవాడిని. ‘కాలితో టాపింగ్ చెయ్యకపోతే, నా ప్రపంచంలోకి ఎలా రాగలుతావు?’ అని అడిగేవాడు. మెల్లగా అలా చెయ్యటాం మొదలుపెట్టాక నా మనస్సుకు, మరో ప్రపంచానికి వారధి శబ్దం – లయలో ఉన్నదని అర్థం చేసుకున్నాను. అది చెయ్యలేనప్పుడు ఆ వారధి లేదు. ఆ ప్రపంచమూ లేదు. ఒక్కొక్కసారి మూడ్ వచ్చినప్పుడు జోకీ గంటల తరబడి పాడేవాడు. ఆ సంచీలోని డబ్బులు జేబుల్లో పెట్టుకుని రెండు మూడు గుటకలు మ్రింగి మెల్లగా ఆ కుక్కతో ఎటో వెళ్లిపోయేవాడు. ఒంటరితనం నన్నెపుడూ బాధించలేదు. కానీ జోకీ ఎప్పుడైనా రాలేకపోతే అలా పిచ్చివాడిలా నడుచుకుంటూ ఆ రోడ్డు మీద అటూ ఇటూ తిరిగేసే వాడిని. అతను తాగి పారేసిన సిగరెట్ ముక్కలన్నింటినీ ఒక చోటకి చేర్చి నిప్పుపెట్టి ఆ ట్యూనులు పాడుకుంటూ ఉండేవాడిని. అలా కూర్చున్నప్పుడు ఓ సాయంత్రం ఒకాయన వచ్చాడు:

‘నీ పార్ట్‌నర్ ఏడి?’ అడిగాడు.

‘ఇవాళ రాలేదు’ అన్నాను.

జేబులోంచి ఓ రెండు కరెన్సీ నోట్లు అందించాడు.

‘అతడికిచ్చెయ్. అతనిది మామూలు గొంత కాదు. ఎక్కడుంటాడు?’

‘తెలీదు. వస్తాడు, వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు అడిగినా ఆ వివరాలు నాకు చెప్పలేదు’

అతను వెళ్లిపోయాడు. ఇక షెడ్ మూసేసి పడుకుందామనుకుంటున్నాను. దూరంగా ఆ కుక్క మొరిగిన శబ్దం వినిపించి వెనక్కి తిరిగాను. జోకీ హడావిడిగా వస్తున్నాడు.

‘ఏమైంది జోకీ?’ అడిగాను.

ఎప్పుడు కూర్చునే రాయి మీద కూర్చున్నాడు. ఓ సంచీ లోంచి ఓ కేకు ముక్క తీసి నా ముందర పట్టుకున్నాడు.

‘పెళ్ళి కుదిరిందా?’

తల అడ్డంగా ఊపాడు.

‘బర్త్ డే నా?’

మళ్ళీ అలానే చేసాడు. ముంద నోట్లో పెట్టుకోమని సైగ చేసాడు. కేకు తిన్నాను.

‘ఒక్క ఇరవై రూపాయలు తక్కువయింది’ అన్నాడు.

‘దేనికి?’

ఆ కుక్క తల నిమిరాడు.

‘అప్పు చేసావా?’ అడిగాను.

నవ్వాడు. ఒక సంచీ తీసి చూపించాడు. అందులో అన్నీ కరెన్సీ నోట్లే.

‘ఎవరిచ్చారు?’ అడిగాను.

‘నువ్వే. ఈ గిటార్ కవర్‍లో పడ్డవన్నీ జాగ్రత్తగా పోగేసాను’

‘ఏం కొనాలనుకున్నావు?’

‘ఓ బిల్డింగ్’

నవ్వాను.

‘ఓ పిచ్చివాడా! దీనితో ఏమొస్తుందిరా?’

ప్యాంటు బాగా పైకి లాగి గోక్కున్నాడు.

‘ఇది దేవుడి సొమ్ము..’ చెప్పాడు. ‘..కలాన్‍గుటె లో ఓ పాత బంగళా వేలంపాట కొచ్చింది’

‘దీనితో పాడతావా?’

‘అవును. ఇరవై రూపాయలు తగ్గాయి. అందుకు పరుగు పరుగున వచ్చాను’

అప్పుడే సాయంత్రం ఎవరో ఇచ్చిన ఆ రెండు కాగితాలు జేబులోంచి తీసాను.

‘ఇదిగో.. ఎవరో నీకిమ్మనే ఇచ్చారు’

అతను అందుకుంటూ నా కళ్ళల్లోకి చిత్రంగా చూసాడు.

‘ఇంతకీ పాట పాడాక ఆ డబ్బులెక్కడ్నించి వస్తాయి? బిడ్డుకే ఇరవై తగ్గాయి!’ అన్నాను.

‘కరెక్ట్‌గా ఇరవై రూపాయలే ఇచ్చారా?’

‘అవును’

రెండు గుటకలు మింగాడు. బాటిల్‍ను అటూ ఇటూ ఊపాడు. ఆకాశం బద్దలయ్యేటట్లు నవ్వాడు.

‘చూసావా? ఇందులోనూ రెండు చుక్కలే మిగిలాయి!’ అన్నాడు.

***

కారు ఓ తోటలోంచి లోపలికి వెళ్ళింది. చాలా అందంగా ఉంది. పోర్టికో క్రింద పార్క్ చేసాడు సమీర్. ఇద్దరం దిగాం.

“ఈ మొక్కలు చూసారా?”

అటు చూసాను. కాంపౌండ్ వాల్‍కి ఆనుకుని ఉన్నాయి.

“వీటిని ‘మీరాబిలిస్ జలప’ అంటారు”

“తెలుగువాళ్ళు ‘చంద్రకాంత’ అంటారు” అన్నాను.

“ఇవి ఒకే మొక్కలో రకరకాల రంగులలో పూలను మనకిస్తాయి. అంతే కాదు, ఈ పువ్వుని నీటిలో వేసినప్పుడు దాని పిహెచ్ వాల్యూ న్యూట్రల్ అవుతుంది”

“ఛా”

“అవును. రండి..”

మెల్లగా లోపలికి వెళ్ళాం. ఓ చిన్న గేటు తీసి అటుగా నడిపించాడు. ఓ పెద్ద ఆడిటోరియమ్ లోకి మరో గేటు లోంచి వచ్చినట్లు అర్థమైంది! ఆ ఆడిటోరియమ్ మీద ‘డాఫోడిల్స్’ అన్న మాట ధగధగా మెరిసిపోతోంది.

“ఏదైనా షో ఉందా సమీర్ గారూ?”

“నో. మీకు ఈ భవనం చూపించటానికి తీసుకుని వచ్చాను”

“చాలా బాగుంది.”

“ఇది గోవాకే కలికితురాయి. ఇది శిధిలమైపోయి ఉన్నప్పుడు జోకీ దీనిని వేలంపాటలో పాడాడు”

“ఓ! అంత డబ్బు ఎలా వచ్చింది అతనికి?”

“అదే ఆశ్చర్యం. ఇదిగో, మనం నిలబడ్డ చోటు నుండే అలా పాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రోజు అందరూ కలిసి మనల్ని తన్నులు తన్నేందుకు సిద్ధమవుతున్నారనే సమయానికి ఓ చాలా పెద్దాయన ముందరికి వచ్చాడు.

‘ఎందుకు పాడావు?’ అని అడిగాడు.

‘తెలియదు, కళాకారుడ్ని’ అన్నాడు జోకీ.

‘ఈ శిధిలాన్ని కళా నిలయంగా మారిస్తే పాడతావా ఇందులో?’

పిచ్చివాడిలా చూసాడు జోకీ. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చింది. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఆ సాయంత్రం ఇరవై రూపాయలు ఇమ్మని నా చేతిలో పెట్టింది ఈయనే.

‘భయపడకు. నీ గొంతులో పాట వినగలను కానీ నీ గొంతులో పాడలేను..’ తెలుగులో చెప్పాడు. ‘..పాడలేను, కొనలేను. కానీ నీకొక స్టేజ్ ఇస్తాను. ఈ భవనం నీది. డబ్బు నేను కడతాను..’ అన్నాడు.”

కలా, నిజామా అన్నట్లు చుట్టూతా చూసాను. అక్కడ డాఫోడిల్స్, చంద్రకాంతలు అలా గాలికి మెల్లగా ఊగుతున్నాయి.

ఈ పూచే పూల లోన ఏముందో ఏమో.. ఇవి కూడా పాడతాయి. అది నిశ్శబ్దంలోని మధురమైన సుగంధానుభూతి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here