సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-28

0
4

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఉమాదేవిని అందరూ ధైర్యంగా ఉండమని సలహా ఇస్తారు. సంఘమిత్ర కూడా బాగా ధైర్యం చెబుతుంది. సంఘమిత్ర చాలా మారిందని ఉమాదేవి గ్రహిస్తుంది. ఒకరోజు హఠాత్తుగా శంకరం ఉమ వాళ్ళింటికి వస్తాడు. బిత్తరపోతుంది ఉమాదేవి. నీకు నా మీద కోపం ఉండడం సహజం, అయినా మన మధ్య బాంధయ్వాలు ఎక్కడిపోతాయి అని అంటాడు. ఆ బంధాలు బాంధవ్యాలు అన్నీ ఎప్పుడో తెగిపోయాయని కోపంగా అంటుంది ఉమాదేవి. మీకూ నాకూ మధ్య ఏ సంబంధమూ లేదు అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకి సంఘమిత్ర, ఇందిర అక్కడికి వస్తారు. మీరేవరు, ఏంటి గొడవ అని సంఘమిత్ర అతన్ని అడుగుతుంది. తాను ఉమాదేవి భర్తను అంటాడు. సంఘమిత్ర చాలా కోపంగా శంకరంతో మాట్లాడి భర్త అనే వాడు ఎలా ఉండాలో చెబుతుంది.  ఆమె మాటలకి శంకరం అహం దెబ్బతింటుంది. ఇది మా వ్యక్తిగత వ్యవహారం, బయటి వాళ్ళ జోక్యం అక్కర్లేదు అని అంటాడు. తాను మహిళా సంఘం ప్రెసిడెంటుననీ, శంకరం సంగతి తేలుస్తాననీ అంటుంది. మొదటి భార్య అనుమతి లేకుండా అతను చేసుకున్న రెండో పెళ్ళి చెల్లదనీ, రెండవ బారయ్ ద్వారా పుట్టిన పిల్లలు అక్రమ సంతానం అవుతారని హెచ్చరిస్తుంది. బిందు తన కూతురని, తనకి ఆమెపై హక్కు ఉందని అంటాడు శంకరం. బిందు అతన్ని అసహ్యించుకుంటుందని చెప్పి, మళ్ళీ వస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని బెదిరించి శంకరాన్ని పంపేస్తుంది సంఘమిత్ర. కొద్ది రోజుల తరువాత సంఘమిత్ర – ఉమాదేవి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో ఇందిర కూడా అక్కడే ఉంటుంది. ఏమైనా విశేషాలు జరిగాయా అని సంఘమిత్ర అడిగితే, ఉన్నాయంటుంది. ఏంటని అడిగితే, శంకరం భార్య కాత్యాయని ఉమకి ఫోన్ చేసిందని చెబుతుంది. కాత్యాయిని సంఘమిత్రని చాలా పొగిడిందనీ, తనకి ఇలాంటి సహకారం లభించలేదని, తనకీ ఉమాదేవికి ఎదురైన అనుభవాల వంటివే జరిగాయని తెలిపిందని చెబ్తుంది ఇందిర. వాళ్ళ సంభాషణ కాసేపు పిల్లల చదువులపైకి మళ్ళుతుంది. ఆ తరువాత సంఘమిత్ర తన గతం గురించి చెబుతుంది. తన అసలు పేరు వైదేహి అని చెబుతుంది. చిన్నప్పుడు సవతి తల్లి పెట్టిన బాధలు, పెళ్ళయ్యాకా అత్త సత్యవతమ్మ, భర్త మన్మథరావుల హింస గురించి చెబుతుంది. తన పిల్లలని తనని ద్వేషించేలా చేసి, తనకి దూరం చేసిన వైనం చెబుతుంది. ఇక చదవండి.]

అధ్యాయం-55

[dropcap]స[/dropcap]మాజంలో కొంతమంది జీవితాలు ఇంతేననిపిస్తుంది. వాళ్ళ జీవితాల్లో కష్టాలు, కన్నీళ్ళు, నిరాశ, మనస్తాపం, అశాంతి, భావోద్వేగాలు – వీటి మధ్య నలిగిపోవడమే. అలా నలిగిపోతున్న వైదేహి జీవితం అనుకోకుండా మలుపు తిరిగింది. ఒక విధంగా అది ఆమెకి టర్నింగ్ పాయింటే. ఆమె ఉన్న ఇంటి ప్రక్కనే మహిళా సంఘం ప్రెసిడెంట్ వసుంధర ఉంటోంది.

ఆమె ఒక కంట వైదేహి కష్టాన్ని గమనిస్తూనే ఉంది. ‘ఈ అమ్మాయి ఏంటి ఇలా నూతిలో కప్పలా కష్టాలు భరిస్తూనే ఉండిపోతోంది. ప్రతీ దానిని గంగిరెద్దులా తల ఊపుతూ బానిస బ్రతుకు బ్రతికేస్తోంది. ఈ అమ్మాయి జీవితంలో మార్పు తీసుకుని రావాలి. మహిళా సంఘాలన్నీ ఏకమై ఈ అన్యాయం ఎదిరించాలి,’ అని అనుకుంది వసుంధర.

అనుకోవడమే కాదు తన ఆలోచనని కార్యరూపం పెట్టడం ఆరంభించింది. అవకాశం ఉన్నప్పుడల్లా వైదేహితో కల్పించుకుని మాట్లాడేది. ఆమెలో క్రమంగా ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ప్రయత్నించింది. ఆమెలో క్రమంగా తిరుగుబాటు తనం వచ్చేలా ప్రయత్నించేది.

సత్యవతమ్మకి కోడలు ఇలా వసుంధరతో కలిసి మాట్లాడ్డం ఇష్టం ఉ౦డేది కాదు, “ఆవిడతో ఇక మీదట మాట్లాడితే నిన్ను ఇంటి నుండి తగిలేస్తాను,” అని రెండు మూడు పర్యాయములు కోడల్ని హెచ్చరించింది కూడా. ఇది తెలుసుకుని వసుంధర మహిళా సంఘ సభ్యుల్ని అందర్నీ కూడదీసుకుని వచ్చి సత్యవతమ్మ ఇంటి మీద దాడి చేయించింది. మహిళా సంఘ సభ్యులు మన్మథరావుని కూడా హెచ్చరించి వెళ్ళారు.

ఆ తరువాత వైదేహి జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట మహిళా సంఘ సభ్యురాలయింది. క్రమేపి ఆ సంఘానికి ప్రెసిడెంట్ కూడా అయింది. వైదేహి పేరు సంఘమిత్రగా మారింది. చిన్నప్పటి నుండి ఆమె అనేక ఆటుపోట్లుకి గురయింది. అందుకే ఆమెలో మనుష్యుల మీద, సమాజం మీద కసి పెరిగింది. ఆమెకి తన పరిస్థితి మీద కసి. పాజిటివ్ థింకింగ్ స్థానంలో ఆమెలో నెగిటివ్ ఫీలింగ్సు ఎక్కువడడం ఆరంభించాయి.

ఒకానొప్పుడు భర్త దగ్గర ఆమె పిల్లి. ఇప్పుడు పులి. తనని అన్ని అగచాట్లకి గురి చేసిన అత్తగారు సత్యవతమ్మ అంటే కసి ఇప్పుడు. “అందరూ సంఘమిత్ర అత్తగార్ని కాల్చుకు తింది. పాపం ఆవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్పించి ఈ ముసలి వయస్సులో మనస్తాపానికి గురి చేసింది కోడలు అని అనుకుంటారు. కాని ఆవిడ నిజ స్వరూపం తెలుస్తే ఆవిడ్ని అసహ్యించుకుంటారు” అని అంటుంది సంఘమిత్ర.

ఇక భర్త విషయమా, పెళ్ళి కాక ముందు నుండి ఉన్నాయి అతని తిరుగుళ్ళు. అయితే అతనితో ఓ ఒడంబడికకి వచ్చింది ఆమె. “నీ తిరుగుళ్ళు నాకు తెలిసినా, నీ ప్రవర్తన నాకు తెలిసినా నేను సర్దుకుపోతున్నాను. మీ తల్లీ కొడుకు నా పిల్లలకి నన్ను దూరం చేశారు. అయినా నేను సహించాను. ఇకపై ఇంట్లో నేను చెప్పిందే వేదం. నేను చెప్పిందే అమలు. నేను చేసిందే సబబు. మాట్లాడానికి వీల్లేదు. లేకపోతే కందిరీగల తుట్టలా మా మహిళా సంఘం ఉంది,” అని హుకుం జారీ చేసింది.

పాపం మన్మథరావు కూడా భార్య ప్రస్తావన అంగీకరించాడు. ఎందుకంటే అతనికున్న బలహీనతలు అతనికున్నాయి. ‘జీవితంలో రాజీపడి బ్రతకడం నేర్చుకుంటే ఏ సమస్యా లేదు,’ అని అతనికి బోధపడింది.

“ఇదే ఈ సంఘమిత్ర జీవితం,” ముగించింది ఆమె. వింటున్న ఉమాదేవి, ఇందిర చాలా బాధపడ్డారు. ఈవిడ జీవితం వెనక కూడా ఇంత విషాదం దాగి ఉందా అని అనుకున్నారు.

“సమాజంలో నాకు వచ్చిన బిరుదు లేంటో తెలుసా? పరమ గయ్యాళి, స్వార్థపరురాలు, అహంబావి, రాక్షసి. అయితే వీటి వేటికి నేను స్పందిచను. ఖాతరు చేయను. అయితే నాది ఒక్కటే బాధ. మాతృమూర్తిగా నా పిల్లలకి నా మాతృప్రేమను అందించలేకపోయాననేదే,” ఇలా అంటున్నప్పుడు ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.

“ప్లీజ్ సంఘమిత్రా! బాధపడకండి. మన ఆడవాళ్ళందరిదీ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ,” అంది ఇందిర.

“మీ పిల్లలు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని తిరిగి మీ దగ్గరికి వస్తారు.”

“నా బొంద. వాళ్ళు తప్పులు తెలుసుకోవడం ఏంటి? చేసిన తప్పుల్లో పీకల దాకా కూరుకుపోతే. బాగా డబ్బు పంపుతున్నాం. అక్కడ వాళ్ళకి అడిగిన వాళ్ళెవరూ లేక హద్దూ అదుపూ లేకుండా జల్సా వెలగబెడ్తున్నారు. నా కూతురు డ్రగ్సుకి అలవాటు పడింది. కొడుకు జులాయిలా తయారయ్యాడు.

పూర్వ జన్మలో చేసిన ఫలితం అని అంటారు. అయితే జరిగిన పరిణామాలు చూస్తుంటే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనే సామెత నమ్మవల్సి వస్తోంది,” అంత అహంబావిగా ఉన్న సంఘమిత్ర వదనంలో బాధ కొట్టొచ్చినట్టు అగుపిస్తోంది.

ఇందిర నిట్టూర్పు విడిచింది. ‘ఆడవాళ్ళకి సమాజంలో భద్రత లేకుండా పోతోంది. మానభంగాలు, ఆడదాని మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ మానభంగానికి ముక్కుపచ్చలారని ఆడపిల్ల నుండి ముదసలి వరకూ అందరూ గురవుతున్నారు.

తనది ఒకలాంటి సమస్య అయిదే ఉమాదేవిది మరోరకమైన సమస్య. సంఘమిత్రకి సమాజంలో పరపతి, ప్రతిష్ఠ ఉన్నా ఆమెది మరో రకమైన సమస్య. శకూది కన్న వాళ్ళ ప్రేమకి దూరమై పెంచిన వాళ్ళ దగ్గర ఏదో అరకొర ప్రేమ పొందుతున్న సమస్య అయితే, బిందుకి తండ్రి ప్రేమ నోచుకోలేని సమస్య. సంఘమిత్ర కూతురుది మరో విచిత్రమైన సమస్య. ఇలా ప్రతీ వాళ్ళని కదలించినా ఏదో విధమైన సమస్య,’ అనుకుంది.

అధ్యాయం-56

సమాజంలో కొంతమంది బాంధవ్యాలు మీద దృష్టిపెట్టరు. వారికి బాంధవ్యాలకంటే బాధ్యతలు ఎక్కువుగా అనిపిస్తాయి. ఆ బాధ్యతలు నెరవేర్చుకోడానికి కాలంతో పోటీపడి ముందుకు సాగుతారు. వారికి కాలం అపారమైన సంపదలా అనిపిస్తుంది. ఆ సంపదను దక్కించుకోవాలంటే దాని విలువ తెలుసుకుని కార్యకలాపాలు సాగించాలి అని అనుకుంటారు.

కాలంతో పాటే మన బాధ్యతను నెరవేర్చుకోవాలని అనే ఆలోచన రావడం సహజం. బిందూ, శకూ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. వారికి కావల్సింది బాంధవ్యాల మీద దృష్టి పెట్టడం కాదు. బాధ్యతల మీద దృష్టిపెట్టాలన్నదే వారి ఆలోచన.

ఇప్పుడు తమ బాధ్యత చదువుకోవడం. అందుకే కాలంతో పోటీపడ్తు చదువుతున్నారు. బిందు బాధ్యత తను ప్రయోజకురాలై తల్లి పడ్తున్న కష్టాలు దూదిపింజల్లా దూరంగా ఎగిరిపోవాలి. తల్లికి సాంత్వన చేకూర్చాలి. సమాజం ఎదుట తను ఓ ప్రయోజకురాలిగా నిలబడాలి.

‘ఎందుకంటే ఎవ్వరూ మనకి ఉన్నతాసనం వేయరు. మన శక్తి సామర్థ్యాలు గుర్తించిన తరువాత మనకి ఉన్నతాసనం వేస్తారు. లేకపోతే ఎదుటివారికి మనం ఏదో విధంగా ఉపయోగపడ్తాము అన్న విషయం తెలిసినప్పుడు ఉన్నతాసనం వేస్తారు.

సమాజం కూడా అంతే సమాజానికి మనము ఏదో విధంగా ఉపయోగ పడ్తాము అని నిర్ధారణకి వచ్చిన తరువాతే సమాజం మనల్ని గౌరవిస్తుంది’ అని అనుకుంటుంది బిందు ఒక్కొక్క పర్యాయము.

శకుంతల ఆలోచన్లు మరోలా ఉంటాయి. జీవన ప్రస్థానంలో మనలో ఉండవల్సింది దక్షత. మనం దక్షులం కాగలిగితే విజేతలం కూడా అవుతాము. ఏ కార్యంలోనేనా దక్షులమై విజేతలుగా నిలుస్తే మనవాళ్ళు అనుకునేవాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం మనం జన్మజన్మలకీ మరిచిపోలేము. తనకి కన్న తల్లిదండ్రులెవరో తెలియదు. పెంచిన తల్లిదండ్రులు పద్మ, సూర్యాన్నే తన తల్లిదండ్రలుగా భావిస్తోంది. వారి ఋణం జన్మ జన్మలకీ తీర్చుకోలేదు. వారు తనని కన్న కూతురు కన్నా ఎక్కువుగా చూసుకుంటున్నారు.

తను జీవితంలో సక్సెస్ పొంది విజేతగా నిలుస్తే వారి సంతోషానికి హద్దు లేకుండా పోతుంది. వారి సంతోషమే తన సంతోషం. వారి బాధలు, బాధ్యతలు తను తన బాధలు బాధ్యతలుగా భావిస్తూ వస్తోంది. అందుకే తను తన బాధ్యతగా చదువులోనే దృష్టి పెడ్తోంది.

సిద్ధార్థ ఉద్యోగంలో స్థిరపడ్డాడే కాని, అతనికున్న బాధ్యతలు అతనికున్నాయి. అతనికున్న సమస్యలు అతనికున్నాయి. తన చదువు విషయంలో ఆర్థికంగా సహాయపడిన బిందూ డబ్బు తిరిగి ఇచ్చేసి ఋణ విముక్తుడు అవ్వాలి. తన వాళ్ళు ఆర్థికంగా చికాకుపడ్తున్నారు. వారి ఆర్థిక చికాకులు తొలగించాలి. బాంధవ్యాల కంటే తనకున్న బాధ్యతలు ప్రాణప్రదాలనుకోవాలి. తను చేస్తున్న తన ఉద్యోగంలో తను సమర్థుడు అని రుజువు చేసుకోవాలి. అంతేకాని మనకు మనమే సమర్థులం అని కితాబు ఇచ్చికున్నంత మాత్రాన్న సరిపోదు.

అంతే కాదు తన కుటుంబంలో మానవ సంబంధాలు, బంధుత్వాలు అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నాయి. విభిన్న దృవాల్లా ఉన్నాయి సంబంధాలు. ఆ సంబంధాల్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్‌గా మార్చిన నాడే బిందూ, తనూ ఒకటవగలరు. ఇలా సాగిపోతున్నాయి సిద్ధార్థ ఆలోచన్లు.

ఇక రవి విషయానికి వస్తే ఏదో ఊరికే కూర్చున్నాడు ఏ పనీ పాటూ లేకుండా అని అనిపించుకోకుండా తను తాత్కాలిక ఉద్యోగం చేస్తూ ఎమ్.బి.ఏ. చదువుతున్నాడు. ఇది చాలదు. జీవితం ఇది కాదు. అసలైన జీవితం ఏదంటే తను జీవితంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. ఇన్నాళ్ళూ అక్క ఇందిర తమ కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. ఎంతో చేసింది. ఏ ఆడది చేయని త్యాగం చేసింది. తను మంచి ఉద్యోగంలో స్థిరపడి ఆమెకు చేదోడు వాదోడుగా నిలవాలి. ఆమెకి సాంత్వన చేకూర్చాలి.

నలుగురు ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి. వారు తమ ఆలోచన్లను ఆలోచన్లగా వదిలి పెట్టలేదు. అవి కార్యరూపం దాల్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

వారి కార్యదీక్ష చూసి సిద్ధార్థ తల్లిదండ్రులు ‘కొడుకు చేతికి అందుకొచ్చాడు. మా కష్టాలు తీరినట్టే అని అనుకుంటారు. కొడుకు సంపాదన పరుడవడం వల్ల తమ ఆత్మగౌరవానికి, ఆత్మభిమానానికి లోటు ఉండదు’ అని అనుకుంటారు.

‘తను పడ్డ కష్టానికి సార్థకత ఏర్పడింది. తన తమ్ముడు ప్రయోజకుడయ్యాడు. కష్టాలు, బాధలు, బాధ్యతలు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ వాడికి తెలిసాయి. తను కూడా తన బాధ్యత నెరవేర్చాలి. శకుని ఇష్టపడుతున్నాడు అని తను గ్రహించింది. శకూ కూడా చాలా మంచిపిల్ల. ఈ విషయం తను గుర్తించింది. తమ ఇంటికి రావడానికి తగిన కోడలు రవి జీవితంలో స్థిరపడిన తరువాత వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలి. శకూ చదువు అయిపోవస్తోంది,’ ఇందిర ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.

ఉమాదేవికి కూడా ఆలోచన్లు ఉన్నాయి. ఆమె ఆలోచన్లు అన్నీ అస్తవ్యస్తమైన ఆలోచన్లు. తన బ్రతుకు మొదటి నుండి ఇప్పటి వరకూ అస్తవ్యస్తంగానే ఉంది. తనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతోంది. ఆత్మగౌరవానికి విలువ లేకుండా పోతుందా అన్నది తన అనుమానం.

తనలో రకరకాల భయలు. అనేక సందేహాలు. తన కూతురు వెళ్ళబోయే అత్తవారింటిలో తనకి ఎదురియిన అనుభవాలే కూతురికి ఎదురవుతాయేమో నన్న భయం, దానితో పాటే సందేహం. ఎందుకంటే తన కూతురు వెళ్ళబోయేది తన ఆడపడుచు ఇంటికే. తనని మనస్తాపానికి గురి చేసిన తన ఆడబడుచే తన కూతురికి కాబోయే అత్తగారు. తను తన అత్తవారింటిలో ఎన్ని అగచాట్లు పడిందో తనకి తెలుసు.

ఇప్పుడు రామలక్ష్మిలో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది. అలా మార్పు వస్తే తన కూతురి జీవితం అత్తవారింటిలో సుఖప్రదమే. అంతే కాదు సిద్ధూకి బిందూ అంటే అభిమానం. కూతురు మనస్సు కలతబడనీయడు అతను. ఆ నమ్మకం తనకుంది. సిద్ధూకీ, వాళ్ళ మామయ్యకీ స్వభావాలలో చాలా తేడా ఉంది.

‘శంకరం దృష్టిలో భార్య ఓ ఆటబొమ్మ. తనకి శారీరిక సుఖాన్నిచ్చే మరమనిషి అయితే సిద్ధార్థ దృష్టిలో భార్య తన జీవన సహచరణి. తనలో అర్ధభాగం, జీవన మార్గంలో తనతో బాటే నడుస్తూ కష్టాలు, కన్నీళ్ళు, బాధ్యతలు, ఐరువుల్లో సుఖం, సంతోషం అన్ని అవస్థల్లో తనకి చేదోడు వాదోడుగా ఉండేది,’ ఇలా సాగిపోతున్నాయి ఉమాదేవి ఆలోచన్లు.

మానవ సమాజంలో బిందు, శకూ, సిద్ధార్థ, రవి, ఇందిర, ఉమాదేవి అందరూ సభ్యులే. అయితే అందరి ఆలోచనా విధానం ఒకే విధంగా లేదు. ఎవరి ఆలోచనా విధానాలు వాళ్ళవి. ఎవరి అనుమానాలు వారివి. ఎవరి భయాలు వాళ్ళవి.

మనం ప్రపంచీకరణ సంస్కృతిలో ఉంటున్నాం. అయితే మనం ప్రాపంచికంగా అనేకానేక ఆకర్షణలలో పడి ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నాం. ఆత్మగౌరవం మరుగునపడిపోయింది. ఒకనాటి తరం మనకి ఆదర్శంగా నిలుస్తే, నేటి తరం వారి ఆలోచనలు, ఆచరణలు, ఆదర్శాలు, రాబోయే తరం వారికి పనికి వస్తాయా అన్నది సందేహమే.

ఎందుకంటే నేటి తరం మనుష్యుల ఆలోచనా విధానం ప్రపంచీకరణ నేపథ్యంలో రేపటి తరం వారు ఆదర్శంగా తీసుకోరు అని అనిపిస్తోంది. ఇదంతా కాల మహిమ. కాలమే అనేక పుంతలు తొక్కుతోంది. మన పూర్వీకుల మాటలు, చేతలు మనకి కొంత చాదస్తంగా అని అనిపించేవి. ఇప్పటి మన ఆలోచనా విధానం. మన పనులు రాబోయే తరం వారికి చాదస్తం అనిపించవచ్చు. ఇదంతా మనుష్యుల మనస్తత్వాల్లో వచ్చిన మార్పులే అని అనిపిస్తుంది.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here