‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-10

0
3

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

X. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో వస్తు నవ్యత – రెండవ భాగం

3. సోషియో ఫాంటసీ కథా వస్తువులు:

[dropcap]1[/dropcap]960వ దశకంలో ‘దేవాంతకుడు’ పేర ఒక తెలుగు చలన చిత్రం రూపొందింది. అందులో సమకాలీన సమాజానికి చెందిన ఒక మానవుడు సజీవంగా స్వరూపంతో యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుతో, ఇతర పురాణ పాత్రలతో వాగ్వివాదాలకు దిగుతాడు. అలాగే 1970వ దశకంలో ‘దేవుడే దిగి వస్తే’ అన్న చలన చిత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ భూలోకానికి వచ్చి, ఒక మధ్య తరగతి కుటుంబీకునికి సంసార సాగరాన్ని ఈదడంలో మార్గదర్శనం చేస్తుంటాడు. ఇలా ప్రాచీన పురాణ పాత్రలను సమకాలీన సమాజంలోని పాత్రలను కలిపి నడిపిన కథలను ఆంగ్లంలో ‘సోషియో ఫాంటసీ’ లని అంటారు. అసలు చలన చిత్రాలంటేనే తెలియని 19వ శతాబ్దిలోనే తెలుగు సాహిత్యంలో ‘సోషియో ఫాంటసీ’ కథా వస్తువులతో కావ్యాలు వెలువడ్డాయంటే అచ్చెరు వొందక తప్పదు.

సుప్రసిద్ధ కవి శ్రీ మండపాక పార్వతీశ్వర శాస్త్రి (1833-1897) మొట్ట మొదటి సారిగా ‘రాధా కృష్ణ సంవాదము’ అన్న కావ్యంలో ఇలాంటి ప్రయోగం చేశారు.

వేంకటగిరి సంస్థాన పాలకుడైన సర్వజ్ఞ కుమార యాచేంద్రులు తమ జ్యేష్ఠ కుమారులైన రాజగోపాల కృష్ణయాచేంద్రులకు రాజ్యాభిషేకం చేసిన సందర్భంలో ఆ మహోత్సవాలను వర్ణించి చెప్పిన రచన ఇది. ఈ పట్టాభిషేక మహోత్సవాలు క్రీ.శ. 1879లో జరిగినట్లు ఆచార్య తూమాటి దొణప్ప పేర్కొన్నారు. కాబట్టి క్రీ.శ. 1833-1897 మధ్య జీవించిన మండపాక పార్వతీశ్వర కవి ఈ కావ్యాన్ని క్రీ.శ. 1880-1885 ప్రాంతంలో (తన 50 ఏళ్ళ వయసులో) రచించి ఉంటారని భావించవచ్చు. ఈ కావ్య ప్రశంస ‘తెలుగు సాహిత్యకోశము’లో ఇలా ఉంది – “పురాణ పాత్రలతో సమకాలికమైన ఇతివృత్తాన్ని చెప్పించటం దీనిలోని విశిష్టత. కావ్యమంతటా శబ్దాలంకారాలు, చమత్కృతులు, వక్రోక్తి నైపుణ్యం, చమత్కార సంఘటనలు, స్వాభావిక వర్ణనలు ఉన్నాయి. కవి పాండితీ ప్రకర్షలను చాటుతున్న రచన ఇది.”

ఇక కథా వస్తువు విశేషాల్లోకి వెళితే, రాజగోపాల కృష్ణయాచేంద్ర పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షించడానికి ఇంద్రుని కుమారుడైన జయంతుడు వచ్చి ఆ వైభవాన్ని చూచి, తనకా భాగ్యం లేదని నిర్వేదం పొందడం ఒక వైచిత్రి. ఇలా ఒక సమకాలీన సమాజంలో జరిగిన ఒక సంఘటనలో ఒక పురాణ పాత్రను ప్రవేశ పెట్టడం వల్ల దీనిని ‘సోసియో ఫాంటసీ’ కథగా మనం చెప్పవచ్చు. పార్వతీశ్వర కవి గూడా అందుకే దీనిని ‘చిత్ర కథ’ అని పేర్కొన్నారు. అంతే కాదు ఈ కావ్య నిర్మాణాన్ని ‘జగదాశ్చర్య చర్య’గా ప్రస్తుతించుకొన్నారు. కథా ప్రారంభంలోని ఈ భాగాన్ని చూస్తే మనకు ఈ విషయం బోధపడుతుంది.

“వ – అనియిట్లు సకలోప కారణం బగుచు బెన్ని ధియై రాజిల్లిన శ్రీ రాజగోపాల కృష్ణ స్వామి సన్నిధిం గల్పించుకొని, కొనియాడి పోషకానుమతిం దనరి నేనొనరింప బూనిన శ్రీ రాధాకృష్ణ సంవాదంబను జగదాశ్చర్య చర్యకుం బ్రారంభం బెట్టిదనిన-”

అని ఆపైన ‘శ్రీరాధాకృష్ణ సంవాదాంతర్గత చిత్ర కథారంభము’ అన్న శీర్షిక నుంచి కథా కథనాన్ని ప్రారంభంచారు.

ఇందులోని కథా లక్ష్యం వేంకటగిరి సంస్థానాధీశులైన వెలుగోటి వంశీయుల చరిత్రను, రాజగోపాల కృష్ణయాచేంద్రుల పట్టాభిషేకం వరకు వర్ణించి చెప్పడం. ఆ సమకాలిక ఇతివృత్తాన్ని పురాణ పాత్రలైన రాధాకృష్ణుల మధ్య సంవాదంగా చెప్పడం ఇందులో నవ్యత. దానికి భూమికగా జయంతుని ఘట్టాన్ని కమనీయంగా కల్పించారు కవి. రాజగోపాల కృష్ణయాచేంద్రుల పట్టాభిషేకాన్ని వీక్షించిన జయంతుడు తనకా యోగం లేదని నిర్వేదం పొందినప్పుడు. ఇంద్రుడు కోపించి, బృహస్పతిని పిలిపించి, అతని ఎదుట తన పుత్రుని చీవాట్లు పెడతాడు. ఇదంతా చూసి కృష్ణ పరమాత్మ నవ్వుతాడు. అకారణంగా హసించడానికి కారణమేమిటని రాధ అడుగగా, శ్రీకృష్ణుడు పైన పేర్కొన్న విధంగా వెలుగోటి వంశ చరిత్ర మొదలుకొని రాజగోపాలుని పట్టాభిషేక మహోత్సవం వరకు వివరించి చెప్పినట్లుగా కల్పన చేసారు కవి.

మండపాక పార్వతీశ్వర కవి విద్వత్కవి. కావ్యమంతా విశేషమైన చమత్కారాలతో శ్లేషాలంకారాలతో రమణీయంగా తీర్చిదిద్దారాయన. మచ్చుకు ఒక చిన్ని పద్యాన్ని గమనిద్దాం.

పట్టాభిషేక మహోత్సవానికి పిఠాపురం మహారాజు రాత్రి వేళ వచ్చిన సందర్భంలో –

“మనమునందు దదీయాగమనమునందు
ద్వి విధమై తమి దోచె – దిద్వివిధ జనుల
కుభయమును రాజదర్శన ప్రభవమయ్యే!
గరము స్నేహ రసోద్దీపకంబునయ్యె!”

వేంకటగిరి యందు వివిధ జనులకు మనసులో ఆ పిఠాపురం మహారాజు రాకతో రెండు రకాలుగా ‘తమి’ కలిగింది. కవి ఈ ‘తమి’ శబ్దంలో శ్లేషను ప్రక్షిప్తం చేశారు. ఇక్కడ ‘తమి’ అంటే ‘సంతోషము’ అని ఒక అర్థం. ‘చీకటి’ అని మరో అర్థం. రాజు రాకతో సంతోషము కలిగిందని ఒక అర్థం. రాత్రి వేళ రావడం వలన చీకటి తోచిందని మరో అర్థం. అప్పుడు వారికి ‘ఉభయము’ అనగా రెండు విధాల ‘రాజ దర్శన’ మయింది. మళ్ళీ ‘రాజు’ శబ్దానికి అర్థాలు – ఒకటి – రాజు అంటే

పిఠాపురం మహారాజు దర్శనమయిందని. రెండు – ‘రాజు’ అంటే చంద్రుని దర్శనమయిందని. రాత్రి వేళ కాబట్టి రెండు విధాలుగా రాజ దర్శనమయిందని చమత్కరించారు కవి. ‘కరము స్నేహ రసోద్దీపకంబు నయ్యె’ అనడంలో కూడా రెండర్థాలు ఉన్నాయి. ‘స్నేహము’ అంటే మైత్రీ భావం. ‘స్నేహము’ అంటే చమురు. ఆ రాత్రి వేళ రాజగమనం వలన ప్రజలలో ఆయన పట్ల మిక్కిలి స్నేహ భావం ప్రకాశించిందని ఒక అర్థం. రాత్రి వేళ రాజు రావడం వలన ప్రజలు చమురు పోసి దీపాలు వెలిగించారని ఆ వాక్యానికి మరో అర్థం. ఎంత రసాంచితమైన పద్యం!

మరో చమత్కార పద్యం చూద్దాం.

గొడె నారాయణ గజపతి రాయ ప్రభువు వేంచేసాడని వార్తాహరుల ద్వారా తెలుసుకొని వేంకటగిరి మహారాజు ఎదురేగిన సందర్భంలో –

“అని చారులు దెలుపగ దా
విని చారు ముఖాబ్జు డతడు వేగ మెదురుగా
జని, చేరువను న్నతనిం
గని జేరుచు కొనియె గరము గరము గరమునన్!”

గజపతి రాయడు వచ్చాడని చారులు తెలియజేయగా అందమైన పద్మం వంటి ముఖం కల వేంకట గిరి రాజు వేగంగా ఎదురేగి దగ్గరికి చేరి, అతనిని చూచి, ‘కరము కరము కరములో’ చేర్చుకొన్నాడట. ఇక్కడ ఒక ‘కరము’ అంటే మిక్కిలి. ఇంకో ‘కరము’ అంటే గజపతి రాయని హస్తం. మరో “కరము’ తన స్వీయ హస్తం. వేంకట గిరి రాజు మిక్కిలి అభిమానంతో తన చేయిలోనికి అతని చేయిని గట్టిగా చేర్చుకొన్నాడు. అంటే మిక్కిలి అభిమానంతో గట్టిగా ‘కరచాలనం’ చేశాడన్న మాట.

కావ్యమంతటా ఇలాంటి చమత్కారాలు, శ్లేషార్థాలు కుప్పలు పోసారు మండపాక వారు. వస్తు నవ్యతే కాకుండా రస దృష్టితో చూసినా ఈ కావ్యం ఒక ఉత్తమోత్తమ కావ్యం అన్నది నిర్వివాదాంశం.

మహాకవి మండపాక పార్వతీశ్వర శాస్త్రి సమకాలీన సమాజంలోని వస్తువులో పురాణ పాత్రలను కలగలిపి కావ్య రచన చేస్తే, తూము రామచంద్రారెడ్డి అనే ఒక రాజకవి ‘అలమేలు మంగా పరిణయము’ పేరిట ఒక పురాణ కథను కల్పించి, దానిలో స్వయంగా తానే ఒక ప్రధాన పాత్రగా పొందు పరచుకొని కథను నడపడం మరొక రకమైన సోషియో ఫాంటసీగా భాసిల్లింది. ఈ కవి ‘మహబూబునగర్’ జిల్లాలో ఒకప్పుడు సంస్థానంగా ఉండిన ‘మానాజిపేట’కు అధిపతి. ఈ జమీందారు తన రాజ్యంలో అంజనగిరి అన్న కొండపై ఒక వేంకటేశ్వరాలయాన్ని నిర్మించి, తన సోదరి చేత గోపురాన్ని నిర్మింపజేసారు. ఆ దేవాలయ స్థల పురాణంగా ఈ కథను కల్పించారు. ఈ కవి నిజాం సర్కారు దివాన్ చందూ లాల్‌కు సమకాలికుడు. అనగా క్రీ.శ. 1808-1857 మధ్య ఈయన జీవించి ఉండాలి. ఈ కావ్య రచన క్రీ.శ. 1830లో చేసి ఉండవచ్చని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి ఊహించారు.

19వ శతాబ్ది పూర్వార్థంలోనే రచింపబడిన ఈ కావ్యం తెలంగాణంలో వచ్చిన వస్తు నవ్యత గల కొద్దిపాటి అరుదైన కావ్యాలలో ఒకటిగా భావించాలి. స్థూలంగా కావ్య కథా వస్తువు ఇలా ఉంది-

శంకరుడు నారుదునికి చెప్పిన కథను, సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్పినట్లుగా కావ్యాన్ని ప్రారంభించాడు కవి. నారదుడు వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహావిష్ణువు లేకపోవడంతో, ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియక, శివుని వద్దకు వెళ్ళి, శివ కేశవులకు భేదం లేదు. కాబట్టి, విష్ణువు జాడ చెప్పమని కోరుతాడు. అప్పుడా పరమ శివుడు భూలోకంలో ‘తూము రామ భూపాలు’డనే ఒక రాజు (కృతికర్తయే) ఉన్నాడని, అతని భక్తి విశేషాలను గమనించిన విష్ణువు అతనికి దర్శనమీయ తలంచాడని వివరించాడు. అంతకుముందే, వైకుంఠంలో లక్ష్మీదేవి తన ప్రాణనాథుని

“ఏ తత్కలి యుగమందున
భూతలమున సకల జనులు పుణ్య విహీనుల్,
పాతకు, లఘ యుక్తులు, నా
జేతను లేరీతి నిన్ను జేరెద రనఘా?”

అని ప్రశ్నిస్తుంది. దానికి విష్ణువు “పాపపు జనులన్ బాలింప దగునె?” అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి “దీనులన్ బ్రోవక మీకు దీనజన పోషణ కీర్తి యికెట్లు నిల్చెడిన్?” అని నిష్ఠురాలాడుతుంది. ఇది వరకే రామ భూపాలుని అనుగ్రహించాలని నిశ్చయించుకొన్న శ్రీహరి కావాలని లక్ష్మీదేవితో కలహించుకొని, “నన్ను బరుష వాక్యంబు లాడెదవా?” అని అలిగి వైకుంఠాన్ని విడిచి వెళుతాడు. లక్ష్మీదేవి వద్దని వేడుకొన్నా వినని హరి, భూలోకంలో అంజన గిరిపై ఒక గుహలోకి చేరుకొంటాడు. అది చూచిన కొందరు గొల్లవారు ఆ వివరాలను రాజుకు తెలియజేస్తారు. కవి ఈ ఘట్టంలో పాత్రాచిత్య భాషను వినియోగించడం గమనార్హం.

“బొలిబొల్లి నామాలు గలమేను గలవాడు
సంకు సక్రాల బుజాల వాడు.
తెల్లని ముత్యాల డొల్లు బోగుల వాడు
ఎద మీద నెసగు జన్నిదము వాడు
జలతారు వొదిగిన తల కుల్ల గలవాడు
వలిపంపు తగటు దువ్వలువ వాడు
రతనాలు దాపిన పతకంబు గలవాడు
సక్కని నీలాల సాయవాడు.
~
ఎవ్వడో కాని మా బడు నవ్వుకుంట
కాల్ల పాకోల్లు మెట్లపై బెల్లుమనగ
నల్ల కాటుక కొండన మెల్లనెక్కి
పెద్దగై లోన జాచ్చెనీ పొద్దెరాజు!”

ఈ వివరాలు తెలుసుకొన్న తూము రామచంద్రావనీ పాలుడు, శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొంటాడు.

ఈ లోపు తన చెలులతో కూడి భూలోక మందు తన ప్రాణనాథుని వెదుకడానికి విచ్చేస్తుంది లక్ష్మీదేవి. ఆమె అన్వేషణను కవి కరుణ రసాత్మకంగా రచించాడు.

“సారంగ వరదుని జూడ దెల్పుడటంచు
సారంగముల చెంత జేర బోవు;
బున్నాగ శయను చెందున్నాడు – చెపుడంచు
బున్నాగ గణముల పొంత కేగు;
బుంసింహ రూపుని పొలుపు జూపు డటంచు
బుంసింహముల డాసి పొగడ జనును;
సౌకర్య వేషుడు చనిన చొప్పెది యంచు
సౌకర్య నివహంబు చక్కికరుగు;
~
శంబర ద్వేషి జనకుడే సదన మందు
గలుగునని శంబరాహితావళిని బలుకు;
మేర లేనట్టి వెతలచే సారసాక్షి
పృథుల మృగముల నడుగును బెదరి చనగ!”

ఆ పైన కృతికర్తయైన తూము రామచంద్ర భూపాలుడు ఆ దంపతులిరువురి నడుమ రాయబారం నడుపుతాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి తన చేతిలోని పద్మాన్ని ఆనవాలుగా ఇవ్వగా, అది పట్టుకొని శ్రీనాథుని వద్దకు ఆ భూపతి వస్తున్నప్పుడు పిల్లగాలి ఆ పుష్ప పరిమళాలను ముందుగానే శ్రీహరి వద్దకు చేర్చడంతో ఆ హరి, రమ వచ్చిందని దిగ్గున లేచి కూర్చున్నాడట.

“ఆ వర నాథ పుంగవుడు నబ్జము గైకొని పోవుచుండ ద
త్సూన మనోజ్ఞ వాసన గిశోర సమీరుడు గొంచుబోయి, యా
దానవ వైరి సన్నిధి నుదారత జేర్చిన యంతలో రమా
మానిని వచ్చె – నిక్క మనుమానము లేదిక నంచు దిగ్గునన్”

ఎంత రసార్ద్ర దృష్టి! ఎంత రమణీయ సృష్టి!

ఆ మీదట కృతికర్త తన చాకచక్యంతో జగన్నాథుని కడకు శ్రీకాంతను తీసుకొని వచ్చి, ఆ దంపతులను కలుపుతాడు. అప్పుడు శ్రీహరి రామభూపాలుణ్ణి ఏదైనా వరం కోరుకొమ్మనగా, “మీ ఇరువురి పరిణయం కళ్ళారా చూడాలని ఉంది” అని వేడుకొంటాడా రాజు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యుగ ధర్మాన్ని బట్టి తమ అర్చామూర్తులను రూపొందించుకొని వేడుక తీర్చుకొమ్మని సలహా ఇస్తాడు. అందుకోసం రామచంద్రారెడ్డి భూపతి ఆ అంజనాద్రిపై ఒక దివ్యమైన శ్రీవేంకటాశ్వరాలయం నిర్మించి, అర్చామూర్తులకు కల్యాణం జరిపించి ధన్యత చెందడమే ఈ ‘అలమేలుమంగా పరిణయ’ ప్రబంధ ఇతివృత్తం.

అద్భుతమైన కల్పన, అపురూపమైన రచనా సంవిధానంతో సాగిన ఈ కావ్యంలో కవి, సమకాలీన సమాజంలో తాను స్వయంగా నిర్మించిన ఆలయాన్ని గురించి, తానే ఒక ప్రధాన పాత్రగా కథను నడిపించి, ‘సోషియో ఫాంటసి’ పద్ధతిలో వస్తు నవ్యతను ప్రదర్శించారు. అరాచకాలతో నిండిపోయిన నిజాం రాజ్యంలో, 19వ శతాబ్ది పూర్వార్థంలో ఒక జమీందారు శ్రీకృష్ణ దేవరాయలు వలె తానే స్వయంగా కవియై తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు ఈ కావ్యం అద్దం పడుతుంది.

ఇది కాక ఇంకా విచిత్రమైన కల్పనలతో కావ్య వస్తువులను రూపు దిద్దిన కవులు కూడా 19వ శతాబ్దిలో ఉన్నారు.

4. విచిత్ర కల్పనలతో కావ్య వస్తువులు:

క్రీ.శ. 1912లో అమెరికా దేశానికి ప్రయాణిస్తున్న ‘టైటానిక్’ అనే పేరు గల ఓడ రాత్రి వేళ ‘ఐస్‍బర్గ్’ అనే కొండను ఢీకొని ఘోర ప్రమాదానికి గురి అయింది. చాలా మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ రక్షణకై చేసిన ప్రయత్నంలో ఒకే కుటుంబంలోని సభ్యులు ఎవరికి ఎవరో తెలియకుండా వేరయిపోయారు. ఇది యదార్థ ఘటన. ఈ వాస్తవ సంఘటన జరగడానికి 24 సంవత్సరాల ముందు అనగా క్రీ.శ. 1888లో ఒక తెలుగు కవి ఇలాంటి సంఘటనను ఊహించి, ఒక కావ్య నిర్మాణం చేసాడంటే ఎవరికైనా నమ్మ శక్యం కాని విషయం. కాని ఇది సత్యం. ఆదిభట్ట నారాయణ దాసు కవి రచించిన ‘బాటసారి’ అన్న కావ్యం ఇలాంటి సంఘటనతోనే ప్రారంభమవుతుంది.

“ఒక్క మహానుభావుడు మహోదధియానము చేసి ముప్పున
న్దక్కి తొలంగిపోవు నిజ దార, సుతార్థమునై సరోనదీ
పక్కణ సీమలన్వెదకి, వారలు సుస్థితి నుంట గాంచి పెం
పెక్కును బాటసారియయి – యిక్కథ పేర యశోవిహారియై!
ఎచ్చటి నుంటి – నే నిచటి కెట్టుల వచ్చితి – గన్ను లెంతయు
న్విచ్చిన గాన రాదిదియు – నిక్కమ యేమది పెద్ద మ్రోత? నా
కచ్చెరువై వినంబడు – గటా! తెలిసెన్మది దిట్ట జేతు – బై
వచ్చిన నీటి తాకువడి – బ్రాకుచు నెట్టన నొడ్డు చేరితిన్!
~
చిన్ని కొడుకుతోడ జెలియ యేమయ్యెనో
కొండ తగిలి యోడ కొట్ట బడిన
తెన్ను తోచకుండె – తెరపెనీ దిటు మబ్బు
గ్రమ్మ రేయి మిగులు గాన రాదు”

టైటానిక్ ప్రయాణం మహా సముద్రంలో జరిగింది. కవి కూడా ‘మహోదధి యానము’ అనే పేర్కొన్నారు. టైటానిక్ పెద్ద ఓడ. కవి కూడా దానిని ఓడ అన్నారే గాని నావ లేక పడవ అనలేదు. టైటానిక్ ఓడ కొండను ఢీకొన్న ప్రమాదం జరిగింది రాత్రి వేళలో. కవి కూడా ‘రేయి’ అని పేర్కొన్నారు.

సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ కల్పన తరువాతి కాలంలో జరుగబోయే ఒక వాస్తవ సంఘటనను ఇంత అచ్చంగా పోలి ఉండడం కవి దార్శనికతకు పరాకాష్ఠగా భావించవచ్చు. బాటసారి కథ స్వకల్పితము గాని యింకొక భాషాకావ్యమున కనువాద మెంత మాత్రమున్గాదు” అని, “ఈ బాటసారి న్జేసి యాడుచు బాడుచు వెలుగు వారలకు నే వినిపింప మొదలిడినపుడు నా యీ డిరువది నాలుగేండ్లు” అని, నారాయణ దాసుకవి గ్రంథ పీఠికలో చెప్పుకొన్నారు. ఆదిభట్ట వారు దీనిని ఒక తాత్విక కావ్యంగా తీర్చి దిద్దారు. మహోదధి సంసారమయితే పాపమనే కొండకు తగిలి పగిలిన ఓడ మాయాగర్భం లాంటిది. ఆ మాయాగర్భం నుండి బయట పడిన మానవుడు బాటసారి. ఆ బాటసారి తిరిగి అన్వేషించి విద్యా వివేకాలనే దార సుతులను పొందడమే ఈ కావ్యం చూపే పరమార్థం. అదే విషయాన్ని తన ఆంగ్ల పీఠికలో వివరిస్తూ – “The story embodied in this book is an allegory of human life which begins in sheer ignorance and ends in perfect knowledge” అని తెలియజేసారు. ‘టైటానిక్ ఓడ ప్రమాదం’ వంటి సంఘటనను ముందే ఊహించి కల్పించడమే గొప్పతనమనుకొంటే, దానికి ఇంతటి తాత్విక దృక్పథాన్ని కల్పించడం మరీ, మరీ ప్రశంసనీయమైన ప్రతిభగా చెప్పుకోవాలి. ఇంతకు ముందు అధ్యాయంలో వివరించినట్లు, కవి కృత్యాద్యవస్థలు ‘శ్రీకారం’తో కావ్యాన్ని ప్రారంభించకుండా, ఇంతటి మహూన్నతమైన కల్పనను చేసి, దానికి ఇంతటి తాత్వికతను జోడించిన ఈ కావ్యం ఔన్నత్యాన్ని 19వ శతాబ్దిని క్షీణయుగంగా భావించే సాహితీ వేత్తలు నవ్య దృష్టితో గమనించకపోవడం విచారకరం.

ఇంత అత్యాధునిక కల్పన కాకపోయినా, సంప్రదాయంలో కూడా సామాజిక దృష్టితో కావ్య రచన చేసిన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ఆస్థాన కవిగా నియమితులయ్యారు. ప్రఖ్యాత కవి చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారికి గురువు. వినాయక చతుర్థి తెలుగు వారికి ఒక విశిష్టమైన పండుగ. ఆ రోజు సాయంత్రం చంద్రుని చూడకూడదని హిందువుల విశ్వాసం. ఒక వేళ పొరపాటున ఎవరైనా చూసినా వినాయకుని శ్రద్ధగా పూజించి, ఆ గజాననుని కథ చెప్పుకొని వింటే, ఆ పాపం పరిహారమవుతుందని తెలుగువారు భావిస్తారు. అయితే 19వ శతాబ్ది వరకు ఆ కథ ఒక నిర్దిష్ట కథా సంవిధానంతో ఉండేది కాదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకొనే వారు. అలాంటి పరిస్థితులతో, వినాయక ఉత్పత్తి, శిరఃఖండనం, పునరుజ్జీవనం, గణాధిపత్యం, ఆపైన చంద్రుని పరిహాసం, వినాయకుని శాపం, శమంతక మణి వృత్తాంతం మొదలైన అంశాలను పలు పురాణాలలో పరిశోధించి తన తండ్రిగారు బోధించగా, వాటన్నిటిని గుదిగుచ్చి, కావలసిన చోట కొన్ని కొన్ని కల్పనలను చేసి, ముఖ్యంగా ఆ పర్వదినం నాడు చదువుకోడానికి అనుకూలంగా ‘గజానన విజయము’ పేరిట ఒక కావ్యాన్ని రచించారు కృష్ణమూర్తిశాస్త్రి.

ఈ విషయం కవి కావ్యంలో స్పష్టంగా చెప్పారు.

“ముదమొప్పన్ గణరాట్చతుర్థి జదువం బోలించి యాలింప భ
ద్రదముల్ గ్రంథము లెవ్వియుం గలుగమిన్ దానెంచి నిర్మించె శ్రీ
పద కృష్ణుండిది – దీని భక్తి బఠియింప న్విన్న నీలాప నిం
ద దొలంగున్, సిరి వచ్చు, హెచ్చు మతి విద్యాపుణ్య శీలంబులున్!”

ఈనాటికి ప్రతి తెలుగింటిలో వినాయక చవితినాడు వచన రూపంలో ఆ కథే చదువుకోడం, లేదా పెద్దల ద్వారా పిన్నలు చెప్పించుకోడం జరుగుతున్నది. ఇలా ఒక తెలుగు సంప్రదాయానికి, సంస్కృతికి సామాజిక దృష్టితో నవ్యమార్గంలో దోహదపడే విధంగా రూపొందిన ఈ కథా కావ్యం 19వ శతాబ్దిలోనే (క్రీ.శ. 1890 ప్రాంతంలో) రచింపబడడం గణుతింపదగిన నవ్య విషయం.

ఆధునిక కథ కాకపోయినా, ఇలాగే పురాణ కథలో నవ్య కల్పనలు చేసిన మరో కవి రంగరాజు కేశవరావు. క్రీ.శ. 1880 ప్రాంతంలో ఈనాటి వరంగల్ జిల్లాలో ఖిలాషాపురంలో జీవించిన ఈ కవి, ‘ఇంద్రద్యుమ్నాయము’ అనే కావ్యంలో భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టానికి ముందు చరిత్రగా అనేక నవ్యమైన కల్పనలను చేసారు. గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడని, మకరి శాపగ్రస్థుడైన గంధర్వుడని భాగవతంలో రేఖామాత్రంగా చెప్పిన వివరాల ఆధారంగా, వారిరువురి పూర్వ యుద్ధగాథని, వైరాన్ని కవి తన కల్పనాచాతుర్యంతో ఒక మహాకావ్యంగానే రూపుదిద్దారు. 19వ శతాబ్దిలో తెలంగాణ ప్రాంతంలో అనేకమైన విశిష్ట ఛందస్సులతో, నవ్య కల్పనలతో వెలువడిన అరుదైన కావ్యంగా దీనిని పేర్కొనవచ్చు.

కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోనూ, వ్యాస మహర్షి విరచిత సంస్కృత మహాభారత మూలంలోనూ లేని ఒక కల్పిత కథ ‘మాయాబజార్’. మరాఠీ జానపదులాడుకొనే నాటకాల ద్వారా ఈ కమనీయ కల్పిత కథ బహుళ ప్రచారం పొందింది. అది అలా అలా ఆంధ్ర దేశంలోకి ప్రసరించి తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమయింది. అభిమన్యునికి ఉత్తరతో బాటు, శశిరేఖ అనే బలరాముని కూతురుతో కూడ వివాహం జరిగినట్లు ఈ కథలో ఉంది. ఆ ఆ పెళ్ళి బలరామునికి ఇష్టం లేక వ్యతిరేకించినప్పుడు, శ్రీకృష్ణుని లీలా వినోదం, ఘటోత్కచుని మాయాజాలంతో కథ సుఖాంతమయినట్లు ఉండే ఆ పూర్తి హాస్య రస పూరమైన కథతో తెలుగులో 20వ శతాబ్దిలో ఒక చలన చిత్రం కూడా రూపొందింది. ఈ చిత్రం ‘నభూతోనభవిష్యతి’ అనదగ్గ కళాఖండంగా రూపుదిద్దుకోడంలో ఆ కథా కల్పనాచాతుర్యం కూడా ఎంతో దోహదపడిందన్న విషయం సర్వజన విదితమే. అలాంటి ఆ కల్పిత కథతో 19వ శతాబ్దిలోనే పలువురు కవులు కావ్యాలు రచించడం ఒక నవ్యత. క్రీ.శ. 1800 ప్రాంతంలో కాకరపర్తి కృష్ణ కవి – ‘శశిరేఖా పరిణయము’ పేరుతో ఒక కావ్యాన్ని రచించారు. క్రీ.శ. 1842 ప్రాంతంలో మరింగంటి (ద్వితీయ) వేంకట నరసింహాచార్యులు రచించిన ‘తాలాంకనందినీ పరిణయము’ మరొకటి. క్రీ.శ. 1827 -1898 మధ్య జీవించిన రత్నాకరం అప్పప్పకవి రచించిన ‘శశి రేఖా పరిణయము’ మూడవది. ఈ మూడింటిలో మరింగంటి వారి తాలాంక నందినీ పరిణయం ప్రసిద్ధ ప్రౌఢ కావ్యం. ఇందులో శశిరేఖ పానుపు వర్ణన 19వ శతాబ్ది కాలం నాటి పట్టె మంచాన్ని పోలి ఉండడం కవి నవ్య దృష్టిని తెలియజేస్తుంది.

“పగడాల్దిద్దిన కోళ్ళ దోమతెర జాళ్వా పట్టె మంచంబుపై
జిగి జల్తారు మెరుంగు చాందిని సిరుల్ జిల్కుం బుటీదారు మేల్
తగటుం జిల్కు టొరుంగు తక్కియల నిద్దా పాన్పునం దర్పకా
శుగ పాతా హత చేతయై దొరలు లేచున్ వంతలం జింతిలన్”

ఇదిలా ఉంటే, క్రీ.శ. 1800-1850 మధ్య వేల్పూరి వేంకటేశ్వర కవి రచించిన ‘గోవ్యాఘ్ర సంవాదము’ బహుళ ప్రసిద్ధి చెందిన ఒక జానపద కథ ఆధారంగా రూపొందిన కావ్యం. తనను మ్రింగబోయిన ఒక పులితో గోవు తన దూడకు పాలిచ్చి వచ్చేందుకు అనుమతిని కోరి వెళ్ళి, మళ్ళీ అన్న మాట ప్రకారం ఆ పులికి ఆహారం కావడానికి తిరిగి రావడం అన్న కథా వస్తువుతో రూపొందిన ఈ కృతి, తెలుగు సాహిత్యంలో జంతువులు ప్రధాన పాత్రలుగా రూపొందిన మొట్ట మొదటి పద్య కావ్యం అని చెప్పవచ్చు. ఈ కావ్యం 19వ శతాబ్ది పూర్వార్థంలోనే వెలువడడం గమనార్హం.

అయితే ఇంతకన్నా వినూత్నమైన ఊహాపథంలో సాగిపోయారు ఇదే శతాబ్దికి చెందిన మరో తెలుగు కవి. ఈ రోజుల్లో సెక్స్ మార్పిడిని ఒక వైజ్ఞానిక విజయంగా మనం భావిస్తున్నాం. విదేశాల్లో ఈ వైజ్ఞానిక ప్రగతి ఫలంగా కొందరు స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీలుగా మారిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 19వ శతాబ్దిలోనే ఈ తెలుగు కవి ఇలాంటి ఊహతో కావ్య కథా వస్తువుకు రూపకల్పన చేసారు. క్రీ.శ. 1890 దశకంలో శొంఠి భద్రాద్రి రామశాస్త్రి అనే కవి ‘చిత్రసీమ’ పేరిట రచించిన కావ్యంలో కావ్యారంభాన్ని ‘శ్రీ’ కారంతో కాకుండా ‘క’ అనే అక్షరంతో చేసినట్లు ఇంతకు ముందు అధ్యాయంలో వివరించడం జరిగింది. అంతే కాకుండా ఈ కవి ఈ కావ్యంలో వినూత్నమైన కల్పనతో వస్తు నవ్యతను కూడా సాధించడం విశేషం.

ఈ కావ్యంలో ‘చిత్రసీమ’ అనే ఒక వివాహిత స్త్రీ పురుషాభరణాలు, పురుష వస్త్రాలు ధరిస్తూ ఉంటుంది. దానికి ఆమె చెలికత్తెలు.

“మగ సొమ్ములేల తొడగెదు?
మగువా! యీ వార్త విన్న మగనికి నీపై
వెగటు జనింపక మానదు!
నగుబాటగు జుమ్ము నీకు నలుగురిలోనన్!”

అంటూ హెచ్చరిస్తారు. సదా పురుషులతో గోష్ఠి సలుపుతున్న కుమార్తె విషయం తెలుసుకొన్న ఆమె తండ్రి సింహవాహనుడు, కూతురు తనకు అప్రతిష్ఠ తెస్తున్న దన్న కోపంతో ఆమెను తన కరవాలంతో వధిస్తాడు. నేలపై కుప్పకూలిన ఆ స్త్రీ ఆశ్చర్యంగా పురుషుడై మళ్ళీ లేస్తుంది.

“కూలినయంతనే మగుడ గొబ్బున లేచిన దేమి చిత్రమో!
బాలిక రూపు బోవిడిచి, పంకజ పత్ర విశాల నేత్రు డు
త్తాల భుజార్గళుండు – సిత దామ విభూషిత పీన వత్స శో
భా లలితుండునైన మగవాడయి నిల్చెను బుష్ప వృష్టితోన్!”

ఆపైన, కొన్నాళ్ళకు చిత్రసీమ మామగారైన భూరివర్మ నుండి కోడలిని పంపుమని పిలుపు వస్తుంది.

“ఓడక పుట్టినింట దడవుంచగ జెల్లునే చాననెందు? మా
కోడలి నంపు – డొక్క తియె కూతురు మీకని యిన్ని నాళ్ళు, మీ
వేడుక కంద యుంచితిమి – వేడుక మాకును లేదె? భర్త సొ
మ్మాడుది యంచు గమ్మనట కంచెనొకప్పుడు భూరి వర్మ తాన్!”

ఇక దాచేదేముందని సింహవాహనుడు జరిగిన వృత్తాంతమంతా ఒక లేఖ ద్వారా భూరివర్మకు తెలియజేస్తాడు. చిత్రసీమ చిత్రసీమునిగా మారిపోయిందన్న విషయాన్ని చదివిన భూరి వర్మ, సింహవాహనుడు తనను మోసం చేసాడని యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో అందరు చూస్తుండగానే ఆకాశం నుండి ఒక పత్రం నేలపై వాలుతుంది. దేవ భాషలో ఉన్న అందులోని విషయాన్ని తెలుగులో చెప్పమని అక్కడి వారంతా కోరుతారు.

“దేశ భాషయైన దెల్ల మెల్లరకునౌ
నస్మదీయ దేశ మాంధ్ర మగుట!
దీని యర్థమెల్ల దెనుగున వివరించి
పలుకు మెల్లరకును దెలియు ననియె”

అంటూ సింహవాహనుడు చిత్రసీమునితో అన్నట్లుగా పద్యాన్ని రచించి, కవి ఈ సందర్భాన్ని వినియోగించుకొని తన మాతృ భాషాభిమానాన్ని చాటుకొన్నారు. పత్రంలోని విషయాన్ని చిత్రసీముడిలా వివరిస్తాడు –

“వేకటి సింహవాహ పృథివీపతి పాణిగృహీతి మూర్కొ నెం
జేకొని గర్భ వాంఛబడి – చెన్నగునా సరసీ రుహంబు దా
నాకత మౌట దజ్జఠర మందలి బాలుడు వ్యత్యయంబునం
గైకొనె నాడు రూపునెటు – గాదొకొ దైవము సేయ బూనినన్”

ఇలా చిత్రవిచిత్ర కల్పనలతో రసరమ్యంగా సాగిపోతుందీ కావ్యం. ఈ కావ్యంలోని ఆశ్వాసాలను కవి ‘దళా’లని పేర్కొన్నారు. అయితే కావ్యాన్ని ‘ప్రథమ దళం’తో కాక, ద్వితీయ దళంతో ప్రారంభించడం – కథా సంవిధానంలో ఒక భాగమేనని కావ్యం ఆసాంతం చదివితే అవగతమవుతుంది. ఇదీ ఒక నవ్యతే కదా!

ఇలా 19వ శతాబ్దిలో చిత్రాతి చిత్రమైన కల్పనలతో, సమకాలీన సామాజికాంశాలతో, అనేకమైన నవ్య విషయాలపై ఎన్నో కావ్యాలను వెలయించి వస్తు నవ్యతను సాధించిన కవులెందరో ఉన్నారు.

ఈ అధ్యాయంలో కొన్ని చోట్ల చలన చిత్రాల ప్రసక్తి తేవడం జరిగింది. భారతదేశంలో తొలి చలన చిత్రం ఆవిర్భవించింది క్రీ.శ.1931లో. ఈ 20, 21 శతాబ్దులలోని చలన చిత్రాలలో నవ్య కథా వస్తువులుగా పేర్కొనబడుతున్న అంశాలను, మన తెలుగు కవులు చలన చిత్రాలంటే ఏమిటో తెలియని 19వ శతాబ్దిలోనే ఊహించి కల్పించడం, వారి నవ్య భావనా పటిమకు పరాకాష్ఠగా వివరించే ఉద్దేశ్యంతోనే ఆ ప్రస్తావన చేయడం జరిగింది.

ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. 19వ శతాబ్దిలో వెలసిన ఎన్నెన్నో నవ్య కావ్యాలలో, మార్పును వెంటనే అంగీకరించని సమాజంలో ఏ కొందరో ఉదారులైన పోషకుల సహాయంతో ముద్రించబడిన కొన్ని కావ్యాలలో, 19వ శతాబ్దిని క్షీణయుగమన్న 20వ శతాబ్ది పండితుల దురవగాహన వలన సరైన ఆదరణ లేక మరుగున పడిపోగా, ఏ కొందరో మహనీయుల శ్రద్ధాసక్తుల వలన ఈనాడు లభ్యమవుతున్న కొన్ని కావ్యాలలోని నవ్యతను ఈ అధ్యాయంలో వివరించగలిగాను. వీటిలోనే ఇంత వస్తు నవ్యత గోచరిస్తే, ఇంకా మరుగున పడ్డ మాణిక్యాలెన్నో! వాటి జిలుగుల వెలుగుల మెరుపులెన్నో!!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here