ఆస్మాసిస్

0
3

[ఆస్మాసిస్ ప్రక్రియ గురించి వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]“అ[/dropcap]మ్మా! అమ్మా!” అరుస్తూ లోపలకు వచ్చాడు శ్రీకర్, వంటింట్లో సుజాత వంట చేస్తూ “ఏమిట్రా ఆ అరుపులు” అన్నది. “అమ్మా నాకివాళ బిర్యానీ చేస్తావా?” ఆశగా అడిగాడు అకర్.

స్టవ్ మీదున్న పప్పు దించి సాంబారు కలుపుతూ అన్నది సుజాత “రేపు చేసి పెడతాను లేరా. ఈ రోజు హాస్పిటల్‌కు వెళ్ళాలి కదా!? త్వరగా వంటంతా పూర్తి చెయ్యాలి.” శ్రీకర్ నిరాశగా మొహం పెట్టాడు.

“అమ్మా ఇప్పుడు హాస్పిటల్‍కు ఎందుకు వెళ్ళటం? ఎవరికేమయింది?” అడిగాడు ఆశ్చర్యంగా శ్రీకర్.

“మొన్న ఊరి నుంచి నాన్నమ్మ వచ్చింది కదా! నానమ్మను హాస్పిటల్‌కు తీసుకెళ్ళాలి రా! అందుకే త్వరగా వంట చేసేస్తున్నాను” అన్నది సుజాత

వంట పూర్తయ్యాక సుజాత రెడీ అయ్యింది. రమేష్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. “త్వరగా బయలుదేరండి, మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి నేను మళ్ళీ ఆఫీసుకు వెళ్ళాలి” అంటూ తల్లినీ, భార్యనీ తొందరపెట్టాడు.

అందరూ కలసి ఆటో ఎక్కి హాస్పిటల్ వెళ్ళారు. అక్కడకు వెళ్ళాగానే రమేష్ “డయాలసిస్ రూమ్ ఎక్కడ?” అని అడిగాడు అక్కడి కాంపౌండరును. అతడు ఒక రూమ్ చూపించగానే అక్కడికి వెళ్ళారు. శ్రీకర్ వాళ్ళ నాన్నమ్మను రూమ్ లోపలికి తీసుకెళ్ళారు. రమేష్ డాక్టర్‌తో మాట్లాడి వచ్చాడు.

బయటకు వచ్చిన రమేష్ భార్యతో “సుజాతా, నేను డాక్టర్‌తో అంతా మాట్లాడాను. నాలుగైదు గంటలు పడుతుంది అట. నువ్వు, శ్రీకర్ ఇక్కడే ఉండండి. నేను ఆఫీసుకు వెళ్ళి వస్తాను. డయాలిసిస్ అయిపోయాక నాకు పోన్ చెయ్యి” అని చెప్పి, శ్రీకర్‌తో “శ్రీకర్, నువ్వు అమ్మకు తోడుగా ఉండు” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు

శ్రీకర్ భయభయంగా అమ్మ వెంట తిరుగుతున్నాడు. శ్రీకర్ 7వ తరగతి చదువుతున్నా చిన్నపిల్లల్లాగే హాస్పిటల్ అంటే భయపడతాడు. శ్రీకరేంటి ఎవరైనా పెద్దవాళ్ళు కూడా హాస్పిటల్ అనగానే వెనకడుగు వేస్తారు. అక్కడ చేసే ఇంజక్షన్లకు సైతం భయపడతారు. ఇంకా ఏమైనా సెలైన్ లాంటింది అయితే బిగుసుకుపోవడమే. అంతలో వీళ్ళను డాక్టరు లోపలికి పిలిచాడు.

“చూడండి! ఇదంతా పూర్తవడానికి నాలుగైదు గంటలు పడుతుంది. మీరు బయట కూర్చొండి. మేం జాగ్రత్తగా చూసుకుంటాం. డయాలిసిస్ అంటే భయపడాల్సిందేమీ లేదమ్మా!” అని డాక్టరు సుజాతకు చెప్పాడు.

శ్రీకర్ మెల్లగా వాళ్ళమ్మతో “డయాలసిస్ అంటే ఏమిటమ్మా? ఎందుకు నాన్నమ్మకు చేస్తున్నారు?” అన్నాడు. సుజాత “ష్ మాట్లాడకు” అంటూ నోటి మీద వేలు పెట్టి సైగ చేసింది.

“చూడు బాబూ! మనిషి దేహంలో ఉండే కిడ్నీలు చెడిపోతే డయాలిసిస్ చేయవలసి వస్తుంది. కిడ్నీలు మనిషిలో ఉండే రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మరి కిడ్నీలు చెడిపోవటం వలన దాని పని అది చేయలేక పోతుంది అందుకని కిడ్నీ చేయవలసిన పనిని ఇదిగో ఈ మిషను చేస్తుందన్నమాట. మీ నానమ్మ వంట్లోని రక్తమంతా బయటకు తీసి ఈ మిషన్ లోకి పంపుతాము. ఈ మిషన్ ఆ రక్తాన్ని మొత్తం శుభ్రం చేసి ఉంచుతుంది. శుభ్రపడిన ఈ రక్తం మొతాన్ని మరల మీ నాన్నమ్మ ఒంట్లోకి పంపిస్తాయి ఇది డయాలిసిస్ అంటే! అర్థమయిందా!” డాక్టర్ చాలా వివరంగా చెప్పాడు.

శ్రీకర్ చాలా ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని విన్నాడు. అందులో రక్తం మొత్తం బయటకు తీసి మరల రక్తం మొత్తం లోపలికి పంపటం అనే పక్రియ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మళ్ళీ మెల్లగా వాళ్ళమ్మకి మాత్రమే వినబడేలా ఇదంతా ఎలా జరుగుతుందని ప్రశ్నించాడు శ్రీకర్. వాళ్ళమ్మ కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది.

“నన్నడుగు చెపుతాను” అన్నాడు డాక్టరు. సుజాత ఆశ్చర్యపోతున్నది. మామూలుగా రెండో మాటకే అవకాశం ఇవ్వని డాక్టరు ఇన్ని విషయాలు చెబుతున్నాడేమిటా అని ఒకటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఏమైందో ఈయనకు అనుకున్నది.

“నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు బాబూ” డాక్టరు శ్రీకర్ ను చూసి అడిగాడు. “నేను ఏడవ తరగతి చదువుతున్నాను సార్”  గొప్పగా చెప్పాడు శ్రీకర్.

“మరి మీ పాఠ్యాంశాలలో ‘ఆస్మాసిస్’ అనే పదం విన్నావా? అంటే ఏమిటో తెలుసా? ఏదైనా ఉదాహరణ చెప్పగలవా” వరసగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు డాక్టర్.

‘ఈయనకీ రోజు పేషెంట్లు లేనట్లున్నారు. ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. లేకపోతే డాక్టరు క్కూడా బోర్ కొడుతుందేమో’ సుజాత మనసులో అనుకుంటున్నది.

శ్రీకర్ మాత్రం ఉత్సాహంగా సమాధానం చెపుతున్నాడు. “సార్ మా సైన్స్ పుస్తకంలో ‘ఆస్మాసిస్’ పాఠం ఉన్నది. మా సైన్స్ మాస్టారు చెప్పారు. ‘తక్కువ గాఢత గల ద్రావణం నుంచి ఎక్కువ గాఢత గల ద్రావణానికి జరిగే నీటి ప్రయాణమే ఆస్మాసిస్’ అని చెప్పారు సార్.

“వెరీ గుడ్ బాయ్! చదువులో చురుకుగా ఉన్నావు. మరి ఉదాహరణ చెపుతావా” అడిగాడు డాక్టరు శ్రీకర్ వైపుకు వంగి.

“చెప్తాను సార్. మా మాస్టారు స్కూలులో చేసి చూపించారు కదా! మామూలు నీటినీ, ఉప్పు కలిపిన నీటినీ కలిపి ప్రయోగించినపుడు మామూలు నీరు మెల్లగా ఉప్పు నీటిలోకి ప్రయాణించింది” చాలా ఆనందంగా మొహమంతా వెరిగిపోతూ చెప్పాడు శ్రీకర్.

“వెరీగుడ్ వెరీగుడ్” అంటూ డాక్టర్ శ్రీకర్ మాటలకు, చప్పట్లు కొట్టాడు. “ఇప్పుడు నేను డయాలిసిస్ గురించి చెపుతా విను. అదే ఆస్మాసిస్ ప్రక్రియ వలననే ఇక్కడ రక్తాన్ని వెలుపలికి తీయడం జరుగుతుంది. అంటే మలినమైన రక్తం మానవ దేహం నుంచి ఒక పక్క బయటకు వస్తూ ఉంటుంది. మరోవైపు శుద్ధి చేయబడిన రక్తం మిషను నుండి దేహం లోకి పంపబడుతుంది. ఇదంతా ఆస్మాసిస్ వలననే జరుగుతుంది. అర్థమయిందా ఇప్పుడు” అడిగాడు డాక్టరు.

శ్రీకర్ చాలా సంతోషంగా ఉన్నాడు. తెలియని విషయాన్ని తెలుసుకున్నాననే ఆనందం శ్రీకర్ మొహంలో కనబడుతోంది

రోజు పేషంట్లతో గడిపే డాక్టరుకు శ్రీకర్‌ను చూడగానే విషయమంతా చెప్పాలనిపించింది. తనలోని టీచర్ బయటకు వచ్చాడు. ఇంట్లో తన కొడుకు గుర్తు వచ్చాడు. కాస్త పని కూడా తక్కువ ఉండటంతో శ్రీకర్‌కు పాఠం బాగా చెప్పాడు.

శ్రీకర్‌కు హాస్పిటల్ అంటే భయం పోయింది. డాక్టర్ అంటే అభిమానం పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here