కాంచన శిఖరం-7

0
3

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[కాసేపు నది ఒడ్డున కూర్చుందామని అంటుంది కేతకి. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందమైన కేతకి – మరింత అద్భుతంగా కనిపిస్తుంది మేరుకి. శ్రీశైలం సైట్‍లోని తాజా సమాచారం ఏమిటని అడుగుతుంది. మేరు చెప్తాడు. ఆమె రీసెర్చ్ గురించి మేరు అడిగితే, సగం అయిందనీ, తనకీ తన సూపర్‍వైజర్‍కీ పొత్తు కుదరడంలేదని అంటుంది. కళాఖండాల ఆధారంగా పురాణ గాథలను పునర్నిర్మించడానికి  తాను శ్రీశైలం వచ్చానని చెబుతుంది. తన స్వప్నసుందరి శిల్ప గురించి, తనకి దొరికినిన శిల్పం శిరస్సు గురించి ఆమెకి చెప్పాలనుకుంటాడు మేరు. మీరు భారతీయ పురాణాల గురించి పరిశోధిస్తున్నారా అని అడిగితే, పురాణాలకు హద్దులు లేవని, వాటి విశ్వజనీనత్వమే తన అధ్యయానికి ప్రేరణ అని చెబుతుంది కేతకి. తననో గతమేదో వెంటాడుతుందని – తానో రాజాస్థానంలో నర్తకిని అనిపిస్తుందని చెబుతుంది. ఇంకా తాను ఓ సెల్కెట్‍లా రూపాంతరం చెందుతుంటాననీ చెబుతుంది. ఆమెని ఓదార్చాలనుకుంటాడు మేరు. కానీ ఓ అదృశ్య భయం వెనక్కి లాగడంతో లేచి అక్కడ్నించి వచ్చేస్తాడు. నిద్ర పట్టదు. కేతకి జ్ఞాపకాలు వదలవు. పదేపదే ఆమె ఆలోచనలే వస్తుంటాయి. కేతకేనా తన ఊహలలోని ‘శిల్ప’? కాని రూపం వేరు.. ఆత్మ శిల్పదేనా? ఇంకా ఆమెని పూర్వజన్మ స్మృతులు నీడలా వెంటాడుతున్నాయా..?  కానీ కేతకిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది, అదే కేతకి గురించి ఆలోచించేలా చేస్తోందని తలుస్తాడు. కాసేపటి నిద్ర పడుతుంది. మేరుకి ఏవేవో కలలొస్తాయి. ఒక కలలో కేతకి రోదిస్తున్నట్టుగా కనబడుతుంది. ఉదయం నిద్ర లేచి స్నానం చేసి కాఫీ తాగుతూ పేపర్ చదువుతాడు. అప్పుడు గుర్తొస్తుంది – కేతకి తన భర్తతో కలిసి ఇదే గెస్ట్‌హౌస్‍లో ఉంటున్నానని చెప్పిన సంగతి. రిసెప్షన్‍కి వెళ్ళి ఆమె గురించి అడిగితే, ఆ పేరుతో ఎవరూ బస చేయలేదని చెప్తారు. కేతకి రూపురేఖల్ని వివరించినా ఉపయోగం ఉండదు. నిన్న రాత్రి తన వెనుకే గెస్ట్ హౌస్‍లోకి వచ్చిందని చెప్పగానే, గుర్తొచ్చిదంటూ ఓ ఉద్యోగి – ఆవిడ జి.వి.సత్యనారాయణ గారి భార్య అనీ, వాళ్ళు ఓ గంట క్రితమే ఖాళీ చేసి వెళ్లారని చెప్తాడు. ఈ జి.వి. సత్యనారాయణా, తన స్నేహితుడి జీవి కాదు కదా అనుకుంటాడు మేరు. ఇంతలో అక్కడ తన పాత క్లాస్‍మేట్ రమేష్ కనబడతాడు. అతను తన భార్య ఆశతో వచ్చానని చెప్తాడు. తాను మనస్తత్వ శాస్త్రం చదివి సైకాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్తాడు రమేష్. కొన్ని విషయాలు అడగాలనీ, మనం హైదరాబాదులో కలుద్దామని చెప్తాడు మేరు. తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్తాడు రమేష్. – ఇక చదవండి.]

అధ్యాయం 12

[dropcap]హం[/dropcap]పీ అనుభవాలు, అక్కడ కేతకిని కలవడం, వదలని ఆమె ఆలోచనలు సంశయాలతో మానసికంగా అలసిపోయి హైదరాబాదు తిరిగి వచ్చాడు మేరు. శిల్పకి తొమ్మిది నెలలు నిండిపోయాయి. అతి కష్టం మీద బ్యాంకుకి వెళ్తోంది. ఇప్పుడు ఆఫీసు విషయాల కన్నా, పుట్టబోయే బిడ్డ మీదే ఆమెకి దృష్టి ఎక్కువగా ఉంది. శారీరక అలసట బాగా తెలుస్తుంది.

“సెలవు పెట్టొచ్చుకదా చూడు ఎంత అలసటగా కనిపిస్తున్నావో..” అంటూ ఆప్యాయంగా పొట్టమీద చెయ్యి వేస్తూ అడిగాడు మేరు. అతని చేతులని ఇంకా దగ్గరగా లాక్కొని “చూడు ఎలా తంతున్నాడో ‘బాబు’ లోపల” అంటూ పొట్టమీద చేతులని ఆన్చింది.

“నిజంగానే కుదుపు తెలుస్తోంది. నువ్వు ఇంకా విశ్రాంతి తీసుకో. డాక్టరు చెప్పిన ప్రకారం ఇంకో పదిరోజులే ఉంది.”

“ఏమో చెప్పలేం. ఇంకా ముందుగా కూడా కావచ్చునని డాక్టరు చెప్పింది.. ఇంకా నేను కూడా బ్యాంక్ పని చెయ్యలేకపోతున్నాను. అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి.. ఇబ్బందిగా ఉంది. వచ్చే వారం నుంచి సెలవు కోసం అప్లికేషను ఇచ్చివచ్చాను.. ఎన్ని సెలవులు మిగల్చుకున్నానో తెలుసా వీడి గురించి” అంది పక్కమీద పడుకుంటూ. ఆ పడుకోవడంలో కూడా చాలా ఇబ్బంది కనిపించింది.

“శిల్పా, స్కానింగ్ రిజల్ట్స్‌లో మగపిల్లాడో, ఆడపిల్లో తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడలేదుకదా.. మరి ఇప్పుడు పుట్టబోయేది మగపిల్లవాడు అన్నట్లుగా మాట్లాడుతున్నావు..?”

“ఎందుకో తెలియదు, బాబు పుడతాడని అనిపిస్తోంది. కొన్నిసార్లు మన ‘సిక్స్త్ సెన్స్’ అలా అనిపిస్తుంది.. ఒక వేళ అమ్మాయి అయినా బాధపడను.. నిజానికి నాకు అమ్మాయిలంటే ఇష్టం.. అబ్బాయిలకన్నా వాళ్ళకు అభిమానం ఆప్యాయత ఎక్కువ కదూ” నవ్వుతూ అంది శిల్ప, మేరుని ఉడికించాలని చూస్తూ.

“చూసావా నువ్వే అంటున్నావు అదొక సిక్స్త్ సెన్స్ అనీ. దానినే నేను గూఢమైనదని అంటాను. దానికి ఒక లాజిక్ కానీ,  అర్థం కానీ వుండదు అవునా.. ఎక్కడో అంతరాల్లో ఉన్న శక్తి, ఒక ఊహా – బలీయమై మన నమ్మకాలకీ తోడు అవుతుంది. అది భగవంతుడి అనుజ్ఞ అనుకో లేదా నీవు నమ్మిన సిద్ధాంతాలు నిజమయ్యావనుకో. ఏది ఏమైనా మనలోన ఒక శక్తి ఉంది కదా.. అదే మనల్ని వెన్నడుతూ వుంటుంది..”

శిల్ప దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు.. అప్పుడు చూసాడు, ఆమె గాడనిద్రలోకి జారిపోయింది. ఎందుకో తన మాటలు వినలేదని చాలా అసంతృప్తి.. శిల్ప నల్లటి కేశాలు రెండు పాయలుగా తెల్లటి అందమైన నుదురుని కప్పేస్తూ నుదిటిమీద కదులుతున్నాయి. ఆప్యాయంగా వాటిని సర్దాడు. మంచం మీద శిల్పకి తగినంత స్థలం ఉంచి, ఓ పక్కకి తిరిగి పడుకొన్నాడు.

***

“లోపలకి రావచ్చాండీ?”

ఫైల్లో లీనమైపోయిన మేరు తలెత్తి చూసాడు.

“నమస్కారమండీ. నా పేరు సుబ్బన్న, కడప నుంచి వచ్చాను. మీ కొలీగ్ చంద్రశేఖర్ నా మేనల్లుడు..” అంటూ తనని తాను పరిచయం చేసుకొన్నారాయన.

“రండి రండి. చంద్రశేఖర్ అంటే చంద్రం.. మా ఫోటోగ్రాఫర్ గారా, ముందా కుర్చీలో కూర్చోండీ..” అంటూ కుర్చీ చూపించాడు.

“అవును ఆ చంద్రశేఖరే, మీతో కొద్దిగా మాట్లాడాలి. మీకు తీరిక ఉంటే” అంటూ వినయంగా అడిగారు.

“అలాగే, తప్పకుండా. ముందు కూర్చోండి. చెప్పండి నా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలి” అని అడిగాడు మేరు.

సుబ్బన్న కూర్చున్నారు.

“నేను మా గ్రామంలో స్కూల్ హెడ్మాష్టార్‌ని. కాని పురావస్తు శాస్త్రం మీద నాకు ఆసక్తి. అది ఒక హబీలా కూడా అయింది.. ఇప్పుడు నేను ఒక పుస్తకం గురించి చాలా విషయాలు సేకరిస్తున్నాను. మీ గురించి చంద్రం చాలా చెప్పాడు. మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకోవచ్చునని చెప్పి పంపించాడు..”

“ఈ ఆర్కియాలజి ఉందే, ఇదో పెద్ద సముద్రం లాంటిది సుబ్బన్న గారు.. నేను చిన్నగా మొదలు పెట్టానంతే..” అన్నాడు మేరు.

“అవునా సర్” అన్నాడు సుబ్బన్న.

“మీరు నాకన్నా పెద్దవారు.. మేరు అనండి చాలు.” అన్నాడు మేరు ఆప్యాయంగా.

సుబ్బన్నగారు, ఒక ఆల్బమ్‌ని అతని ముందుంచారు. ఆల్బమ్‌ని తిరగేస్తున్న మేరుకి చాలా పురాతనమైన దేవాలయాల ఫోటోలు కొన్ని కనిపించాయి.

“మేరు గారు ఈ ఫోటోలన్నీ 108 శివుడి దేవాలయాలవి. ఇవి క్రీ. శ. 1213 నాటివి. ఇవన్నీ ఇసుకలో సమాధి చేయబడ్డాయి.. పెన్నానదిలో. మా గ్రామంలోనే ఈ 108 ఎనిమిది శివుని దేవాలయాలు ఉన్నాయి.”

“నూట ఎనిమిదా?” అంటూ ఆశ్చర్యపొయ్యాడు మేరు. ఇంకో ఫొటో చూస్తూ, “ఇది ఓ పెద్ద రథంలా ఉంది.. వీటి సంగతి మా డిపార్టుమెంట్ వాళ్ళకి తెలుసా?” అని అడిగాడు.

“తెలుసు. వాళ్ల రికార్డులలో ఉంది.. ఇది పోయిన సంవత్సరమే తెలిసింది.” అని చెప్పి, “కాని అక్కడ పుట్టి పెరిగిన నాకు వీటి చరిత్ర గురించి ఇంకా బాగా తెలుసు. ఈ దేవాలయాలన్నీ రాజు అయిన రక్కసి గంగదేవరామ, వారి సహాయకుడు జంటిమ నాయకుడు కలిసి వీటిని 12వ శతాబ్దంలో నిర్మించారు..” అన్నారు సుబ్బన్న గారు.

“మరి ఇదేమిటండీ?”

“చెప్పాలంటే ఇది శిలాశాసనం లాంటిది అనుకోండి. దీనిలో వెండి రథం, వజ్రాల కిరీటం.. బహుమతిగా దైవం – జ్యోతి సిద్ధవతేశ్శతునికి ఇవ్వబడిందని రాసి ఉంది.”

మేరు మరికొన్ని ఫోటోగ్రాఫ్స్ తిరగేస్తుంటే.. సుబ్బన్నగారు ఇంకా చాలా విషయాలు తెలియచేసారు.

ఒక పెద్ద శివలింగాన్నీ చూపిస్తూ, “దాని పక్కనే ఉన్న సందు సరిగ్గా శివలింగానికి కూడి పక్కగా ఒక పెద్ద సొరంగంలా కనబడుతోంది.. ప్రస్తుతం దాని నిండా గబ్బిలాలు నివసిస్తున్నాయి. కొన్ని దేవలయాల మీద స్వస్తిక్, సూర్య చంద్రులు, ఎద్దు గుర్తులు కూడా వున్నాయి..” చెప్పారాయన.

‘ఈ దేవాలయాల నిర్మాణము శిల్పాలు చెక్కిన విధానము విజయనగర సామ్రాజ్యం కాలం వాటికి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి’ అనుకొన్నాడు మేరు.

“మేరు గారు ఇక్కడ దేవాలయంలో ఒకటైన కామాక్షి దేవాలయంలోకి మా గ్రామం మహిళలు ప్రవేశించి పూజలు కూడా జరిపిస్తున్నారు. ప్రవేశద్వారం పాక్షికంగా తెరవబడి ఉంది. పాకుతూ లోపలికి వెళ్ళి పూజలు చేయాలి” చెప్పారు సుబ్బన్నగారు.

“మన దేశం ఆధ్యాత్మిక దేశం.. ఈ దేవాలయాలు మన నమ్మకాలకి ప్రతీకలు కదండీ” అన్నాడు మేరు..

“నిజమే.. మేరూ, ఇంకా కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ పుస్తకాన్ని ప్రచురించాలనుకుంటున్నాను. వర్గీకరణకి మీ సహాయం కావాలి.. ఇప్పటికే నేను చాలా సమాచారాన్నీ సేకరించాను. అది దగ్గర దగ్గర 500 పేజీలు అయి ఉంటుంది. అవే కాకుండా 100 పైన ఫోటోగ్రాపులు కూడా ఉన్నాయి”

“నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ శ్రద్ధకి, నేను డా॥ కృష్ణశాస్త్రిగారితో మాట్లాడుతాను.. మీకు ఆర్థిక సహాయం అందించమని..”

“చాలా సంతోషం మేరు… ఇంకో సహాయం కూడా చెయ్యాలి… స్టేట్ ఎండోమెంట్స్ డిపార్టుమెంట్ వారితో పరిచయం చేయిస్తే వాళ్ళతో మాట్లాడి.. ఈ దేవాలయాలన్నింటిని పునరుద్ధరించవచ్చు. ఎలాగూ అది వారి విధుల్లో భాగమే.”

“తప్పకుండా. వాళ్ళు సహాయం చేస్తారు.. అయితే కొత్త ఆలయాలని నిర్మిస్తారని అనుకోను. కాని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 32,000 దేవాలయాలు ఉన్నాయి. కానీ వాటిల్లో సగానికిపైగా సరైన స్థితిలో లేవు. ఆర్కియాలజీ డిపార్టుమెంటు – వాళ్ళతో సంబంధాలు ఏర్పచుకోవాలి. చారీ గారితో మాట్లాడుతాను.”

“థాంక్స్ మేరూ, ఇవన్నీ ఒక ప్రాజెక్టులాగ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.. నాతో పాటు ఇంత సమయాన్ని గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది.”

“మీరు అలా అనకూడదు. మీరు పెద్దవారు. మీకు సహాయం చేయడం నా ధర్మం.. నేను ఆఫీసు తరఫున మీ గ్రామానికి.. ఆ ప్రదేశానికి.. వివరాలు సేకరించడానికి వస్తాను సుబ్బన్నగారు” చెప్పాడు మేరు.

“చాల సంతోషం నాయనా. అది నా అదృష్టంగా భావిస్తాను.. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను.. మరి వస్తాను” అంటూ మరిన్ని ధన్యవాదాలు చెప్పి సుబ్బన్నగారు వెళ్ళిపోయారు.

అధ్యాయం 13

“ఎలా వున్నావు మేరు? శిల్ప బాగుందా, మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా?” అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ మేరుని అభిమానంగా పలుకరించారు చారీగారు.

“బాగున్నం సార్, చాలా సంతోషంగా వున్నాం. ఇప్పుడు నేను పాటర్నటీ లీవ్‍లో వున్నాను” ఆనందంగా అన్నాడు మేరు చారీగారితో.

“చాలా సంతోషం తండ్రి కాబోతున్నందుకు..”

“సార్ మీరు ఎలా వున్నారు.. మిమ్మల్ని మేము చాలా మిస్ అయ్యాము.. మీరు తరచూ జ్ఞాపకం వచ్చేవారు” అన్నాడు మేరు.

“నీకు తెలుసు కదా.. నేను మా అమ్మాయిని చూడడానికి యు.ఎస్. వెళ్ళాను.. అక్కడ నుంచి తిరిగి రాగానే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి కబురు వచ్చింది. వాళ్ళంతా గుజరాత్ వెళుతూ, ఆ బృందంలో నన్ను కూడా చేరమని కోరారు.. మేరూ, నీకు తెలుసా; గుజరాత్ సముద్ర తీరంలో 40 అడుగుల లోతులో ఓ అందమైన పురాతనమైన నగరం మునిగిపోయింది, అది చూడడానికి వెళ్ళాము” అని చెప్పి తన నోట్‍పాడ్ తెరిచి కొన్ని పెన్సిల్ స్కెచ్ లను చూపిస్తూ మరిన్ని వివరాలు చెప్పారు:

“ఆ నగరం చాలా వరకు సింధు నాగరికతను పోలివుంది.. అక్కడ దొరికన మానవ పుర్రెల శిలాజాలు, చెక్కతో చేయపడ్డ వస్తువులను ఇప్పుడు ఎన్.జి.ఆర్.ఐ. వాళ్ళు పరిశోధిస్తున్నారు.. ఇవి క్రీ.పు. 7,500 బి.సి నాటివని చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు.

మేరూ, ఇది గనక మనం నిరూపిస్తే ప్రపంచం మొత్తం మీద భారతదేశం అత్యంత పురాతనమైన నాగరికత గల దేశంగా అవుతుంది.” అన్నారు.

“అవును సార్ మీరన్నది నిజమే. కాని సముద్రంలో పనిచేయడం చాలా కష్టం కదా?”

“కష్టమేమీ కాదు కానీ, అదొక భిన్నమైన అనుభవం.. అయినా మన దగ్గర – పూర్తిస్థాయిలో అత్యున్నతమైన లేబరేటరీస్ కలిగిన అద్భుతమైన సబ్ మెరీన్లు వున్నాయి. ఇంకా సోలార్ ఫోటోగ్రాఫీలు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాని ఒక ఇబ్బంది చాలా చికాకు పెడుతుంది. సముద్రంలో శతాబ్దాలుగా పేరుకుని వున్న శిధిలాల ‘సీబెడ్’! వాటిని తొలగించుకుంటూ వెళ్ళాలి. భూమి మీద జరిగినంత సులభంగా జరగదు.. భిన్నమైన వ్యూహాన్ని పాటించాలి.”

“ఇవన్నీ వింటుంటే నాకు మీతో రావాలనుంది. ఈసారి మీరు ఒప్పుకుంటే.. దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా వుంటాను.”

“తప్పకుండా మేరు. ఇంతకీ.. ఆ శ్రీశైలం సైటు యొక్క మొత్తం రిపోర్టు కావాలి.. అవి సిద్ధంగా వున్నాయా.. అక్కడి విశేషాలు ఏమిటి?” అడిగారు చారీగారు.

“చాలా లోతువరకు వెళ్ళము సార్ తవ్వుకుంటూ. ఇంచుమించు అడుగు భాగం వరకూ.. ఇప్పుడు ఆ ప్రదేశం ఓ పెద్ద దిగుడు భూమిలా కనిపిస్తుంది. రెండు వైపులా మెట్టు ఏర్పాటు చేసారు. కుడి వైపున సోరంగం మాత్రం కొంతదూరం వెళ్ళి ఆగిపోయింది. అక్కడ నుండి ఇంక మార్గం లేదు. అన్ని కళాఖండాలని జి.వి. తన రూములో భద్రంగా వుంచారు. కానీ ప్రస్తుతం అతను సెలవులో వున్నాడు. నా దగ్గర డూప్లికేట్ తాళం వుంది. మీరు చూస్తానంటే వాటిని హైదరాబాదుకు తెప్పిస్తాను.” చెప్పాడు మేరు.

చారి కొద్దిసేపు మౌనంగా వుండిపోయారు. తరువాత.. “మేరు ఆ శిలాశాసనాల్లాంటి పలకల మాటేమిటి?” అడిగారు.

“సిద్ధమయ్యే వుంటాయి సార్.. అప్పుడు నేను హంపీలో టోని లొపెంటోతో వున్నాను.”

“సరే నువ్వొక పని చెయ్యి. ముందు నేనడిగిన విషయాలన్నీ ఒక చోట చేర్చి ఒక డేటాలా ఫైల్ చేసి వుంచు. మనం దానిగురించి రేపు కూలంకుషంగా చర్చించుకొందాం” అన్నారు చారి.

“అలాగే సార్, తప్పకుండా” అంటూ చారీగారికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆయన పరిశీలనా శక్తికీ, శ్రద్ధకీ మరోసారి మురిసిపోయాడు మేరు.

***

గుల్‍మొహర్ పూలన్నీ రాలి నేల మీద తివాచిలా పరుచుకొన్నాయి. నర్సింగ్ హోమ్ బయట చెట్టుకింద నిలబడ్డ మేరు శుభవార్త కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ప్రసవం కోసం శిల్ప నర్సింగ్ హోమ్‍లో చేరింది. ఘాటైన మందుల వాసన వేస్తున్న ఆ హాస్పిటల్ కారిడార్‍లో ఎక్కువ సేపు ఉండలేక పోయాడు మేరు. శిల్ప లేబర్ రూములో వుంది, నొప్పులు పడుతోంది, వాళ్ళ అమ్మగారు కూడా శిల్పకి పుట్టబోయే బిడ్డ కోసం అన్ని సామాన్లు సిద్ధంగా వుంచుకొని శుభవార్త కోసం నిరీక్షిస్తున్నారు. ఎంత ధైర్యంగా వుందామనుకొన్నా చెమట్లు పట్టేసాయి మేరుకి.. కాస్త చెట్టుకింద నిలబడి చల్లగాలి పీల్చుకోగానే ప్రాణం కుదుటపడ్డట్టనిపించింది.

కొద్ది రోజుల క్రితం శిల్ప పుట్టబోయే బాబుకి పేరు కూడా నిర్ణయిస్తూ “మేరూ, నాకు కొత్త కొత్త పేర్లూ, పురాణ పాత్రల పేర్లు నచ్చవు. హాయిగా సులువుగా పిల్చుకొనే పేరు పెట్టుకుందాం, అయినా ఈ పాత పేర్లు విని వినీ విసుగ్గా ఉంటుంది. అందుకే చాలా సింపుల్‍గా వున్న పేరు సెలెక్టు చేసాను ‘సూర్య’ అని. ఎలా ఉంది మేరూ?” అని అడిగింది శిల్ప.

“నిజం చెప్పనా ఈ విషయంలో నీ ఇష్టప్రకారం కానివ్వు.. నీకు ఏది నచ్చితే అదే నాకు ఇష్టం. నువ్వు నా ప్రేమ కానుకవి, నువ్వు నాకు మరో అపురూపమైన వరాన్ని ఇవ్వబోతున్నావ్. ఇంతకన్నా ఏం కావాలి శిల్పా” అన్నాడు మేరు అభిమానంగా, ప్రేమగా శిల్పని దగ్గరకు తీసుకుంటూ.

శిల్ప మేరు కౌగిలిలో ఒదిగిపోతూ.. “ఎందుకో తెలియదు. అన్ని బాగానే వున్నా చాలా భయంగా ఉంది. మా అమ్మ అంటూ వుంటుంది స్త్రీకి ప్రసవం పునర్జన్మలాంటిది అని”

ఏం బెంగపడకు, అందరు వాళ్ళ అనుభవాలు చెబుతారు. అప్పట్లో వాళ్ళకి ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావు. అందుకని ప్రసవం అంటే మళ్ళీ బతకడమే అనుకొనేవారు. ఈ రోజుల్లో అన్ని ఇంత ఎడ్వాన్స్ ఉన్నప్పుడు ఇంకా భయమెందుకు.. మనకి పుట్టబోయే సూర్యని ఆనందంగా ఆహ్వానిద్దాం”

“ఒక వేళ అమ్మాయి అయితే?” అంది శిల్ప.

‘నీకు సిక్స్త్ సెన్సు బాగా పనిచేస్తుంది’ అని అనుకుంటూనే “నా మీద నీకు నమ్మకం లేదా.. పోనీ ఒక వేళ అమ్మాయి అయితే పేరు నేను పెడతాను.. అయినా ఇవన్నీ మనసులో పెట్టుకోకు. నువ్వు హాయిగా నవ్వుతూ కనిపించాలి, ఒడిలో బంగారం లాంటి బాబుతో సరేనా” అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకొన్నాడు ఆప్యాయంగా…

గుల్‍మొహర్ చెట్టు ఆకులు కదిలి మరిన్ని పూలు విదల్చింది గలగలా… ఆలోచనలో నుంచి తేరుకొన్నాడు మేరు. ఇంతలో ఎదురుగా శిల్ప అమ్మగారు హాస్పిటల్ మెట్లు దిగుతూ కనిపించారు కంగారుగా.

ఆవిడని చూడగానే గబగబ దగ్గరకి వెళ్లాడు, “ఏమైంది అత్తయ్య గారూ?” అంటూ.

“బాబు మేరూ, మీకు అబ్బాయి పుట్టాడు” అంది ఆనందంగా ఆవిడ ఊపిరి పీల్చుకుంటూ.

“శిల్ప ఎలా ఉందండి?” ఆత్రంగా అడిగాడు.

“తల్లీ పిల్లవాడు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు” అన్నారావిడ.

హాస్పటల్ బెడ్ మీద పడుకున్న శిల్ప కొద్దిగా పాలిపోయినట్టు కనిపించినా, ఆనందంతో మెరిసిపోతోంది. తల్లినయ్యానని గర్వం, సిగ్గు అన్నీ మిళితమై ఇంకా అందంగా ఉంది. తెల్లటి బట్టతో చుట్టిన చిన్నారి సూర్యని మేరు చేతికి అందించింది.

“సూర్యా” అంటూ పిలిచాడు లేత బుగ్గలని మెల్లగా తడుముతూ. అది అనిర్వచనీయమైన ఆనందం.. బాబు చిట్టి బట్టి చేతులు కాళ్ళు ఆడిస్తూ ఒళ్లు విరుచుకుంటున్నాడు. ఎందుకో ఆ క్షణంలో రుక్కమ్మగారు జ్ఞాపకం వచ్చారు. ఆవిడ “మేరు, నీ కొడుకుని చూడాలి రా” అంటూ వుండేది.. ‘వీడు ఆలస్యంగా, ఆవిడ పోయాక ఎనిమిది నెలలకి పుట్టాడు. స్వర్గంలో నుంచి ఆశీర్వదిస్తూ ఉంటుంది’ అనుకుంటుంటే మేరు కళ్ళు చెమ్మగిల్లాయి.

“మేరూ, బాబు ఎలా వున్నాడు? అచ్చం నాలాగే ఉన్నాడు కదూ… జాగ్రత్త.. జాగ్రత్తగా ఉయ్యాలలో పడుకోబెట్టు. వాడు పుట్టి ఇంకా నాలుగు గంటలు కాలేదు” అంటూ బెడ్ మీద నుంచీ కంగారు పడుతూ జాగ్రత్తలు చెప్పింది శిల్ప.

“కంగారు పడకు.. నాకు తెలుసు. నిన్ను, మన బాబుని ఇద్దర్ని జాగ్రత్తగా ఎత్తుకోగలను” అన్నాడు మేరు కొంటెగా.

“మేరూ ఇప్పుడు నేను నీ గూఢత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. సైన్సు అర్థం చెప్పగలదు, వివరించగలదు, కాని అనుభవాలని నేర్పించలేదు కదా..” అంది.

“అలా అనుకోకు. ఇది క్లోనింగ్ యుగం… ఏదైనా జరగవచ్చు. అంతా సైన్స్ అనుకోలేక ఏదైనా అతీతమైన శక్తి అనుకో. జరిగేవి జరుగుతుంటాయి. మన నమ్మకాలు మనల్ని మన దోవలో తీసుకువెళుతుంటాయి.”

“కాని మేరు ఈ అద్భుత సృష్టికి ఆశ్చర్యపోతూ వుంటాను. నా కడుపులో ‘సూర్య’ నాలుగు కిలోల బేబీలా ఎదిగాడంటే, మామూలుగా ఉన్నా పొట్టలో ఈ బేబీని నేనేనా తొమ్మిది నెలలు మోసాను అని అనిపిస్తుంది. చెప్పు బాబు ఎవరి పోలిక?” అంది శిల్ప.

“వాడు అందానికి ప్రతీక.. ఇంకా ఇంకా పొగిడానంటే దిష్టి తగులుతుంది. ముందు నేను ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో అంతా నా గురించే ఆత్రంగా ఎదురు చూస్తూ వుంటారు. వస్తాను శిల్పా” అని చెప్పి వెళ్లిపోయాడు మేరు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here