[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
నీకు పెళ్లి అయిందా?
[dropcap]ధీ[/dropcap]రజ్ డిక్టేషన్ ఇస్తున్నాడు.
స్నేహలత షార్డ్‌హేండ్‌లో రాసుకుంటోంది.
అతను ఆ ఆఫీసుకు వచ్చి నెల రోజులే అయింది. స్నేహలతను అడిగి, ఆఫీసు పని గురించీ, పని చేసే వాళ్ల గురించి, పని చేయని వాళ్ల గురించి అడిగి తెల్సుకుంటున్నాడు.
ధీరజ్ డిక్టేషన్ ఇవ్వటం ఆపేశాడు, ఆమె తలెత్తి ప్రశ్నార్థకంగా చూసింది.
“నీకు పెళ్లి అయిందా?” అని అడిగాడు సడెన్‌గా.
ఆమె చాలా ఇబ్బందిగా మొహం పెట్టింది. అయిందనీ చెప్పలేదు. కాలేదనీ చెప్పలేదు.
“దేనికి సర్ అలా అడుగుతున్నారు?” అని ఎదురు ప్రశ్నవేసింది.
“ఏం లేదు, నాకు ఒక సమస్య ఎదురైంది. నువ్వు ఏమన్నా పరిష్కారం చూపుతావేమోనని..” అని అన్నాడు.
“ఏంటండీ అది?”
“ఏం లేదు. తరువాత చెబుతాలే” అంటూ దాటవేశాడు.
అతని విషయాలు తనకు చెప్పకూడదు. కాని తన విషయాలు మాత్రం తెల్సుకోవాలి, ఏదో ఒక వంకతో – అని అనుకుంది.
ఇంతలో ఎవరో రూంలోకి దూసుకు వచ్చాడు సుడిగాలిలాగా. ధీరజ్ చిన్నప్పటి స్నేహితుడు కాబోలు – పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు.
స్నేహలత కుర్చీలో నుంచి లేచి నిలబడింది. ధీరజ్ ఆమెను కూర్చోమన్నాడు. రవీంద్రకు పరిచయం చేశాడు.
“ఈమె నా పర్సనల్ సెక్రటరీ. చాలా ఎఫిషియంట్. ఏ పని అయినా నిముషాల మీద చేసేస్తుంది. నేను వచ్చినప్పటి నుంచి ఆమె మీదనే డిపెండ్ అయ్యాను” అన్నాడు ధీరజ్.
“ఇంట్లో పెళ్లాం ఎలాగో, ఆపీసులో పర్సనల్ సెక్రటరీ అలా అన్నమాట. సారీ, ఏమనుకోకండి, మీ గురించి కాదు. ఇంతకీ మీకు పెళ్లి అయిందా?” అని అడిగాడు రవీంద్ర.
మళ్లీ అదే ప్రశ్న. వీడెవడో తనకు తెలియదు. వచ్చీరాగానే మొదటి ప్రశ్న అది – అని లోలోపలే మథనపడింది గానీ సమాధానం చెప్పలేదు.
“ధీరజ్, ఇప్పుడిలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు గానీ చిన్నప్పుడు కోతి వేషాలు వేసేవాడు. కాలేజీలో ఒక అమ్మాయి కొంగులాగితే, సస్పెండ్ చేశారు. నాలుగు రోజులు స్ట్రయిక్ చేశాం” అని చెప్పకుపోతున్నాడు రవీంద్ర.
“ఒరేయ్, ఒరేయ్, ఆపరా. ఇప్పుడవన్నీ ఎందుకు?” అన్నాడు ధీరజ్ కంగారుగా.
ఇంతలో ధీరజ్‌కు మేనేజర్ డైరెక్టర్ నుంచి ఫోన్‌లో పిలుపు వచ్చింది. తరువాత కనిపిస్తానని రవీంద్ర కూడా వెళ్లిపోయాడు.
స్నేహలత తేలికగా గాలి పీల్చుకుంది. తన సీట్లోకి వచ్చి కూర్చుంది. పని ఏమీ లేదు. కళ్లు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలింది. భుజం మీద చెయ్యిపడితే కళ్లు తెరిచి చూసింది.
పద్మజ ఖాళీగా ఉన్నప్పుడు స్నేహలత దగ్గరకొచ్చి కబుర్లు చెబుతుంటుంది.
“చాలా రోజుల నుండి నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగనా?”
“అడుగు.”
“నీకు పెళ్లి అయిందా?”
“ఎందుకని అలా అడుగుతున్నావు?”
“మొన్న మా సెక్షన్ లోని వాళ్లు ఈ విషయం పై చర్చించారులే.”
“ఇదేమన్నా అంతర్జాతీయ సమస్యా మీరంతా తీరిగ్గా కూర్చుని చర్చలు జరపటానికి. ఇది నా పర్సనల్ విషయం..” అన్నది స్నేహలత.
“నిజమేగానీ, నువ్వు పెళ్లి అయిన దానిలా కనిపించటం లేదు.”
“దయ చేసి, ఆ టాపిక్ మానేసి ఇంకేదన్నా మాట్లాడు” అన్నది స్నేహలత.
మాట్లాడటానికి ఇంకేం లేదన్నట్లు పద్మజ వెళ్లిపోయింది.
అయిదు గంటలు అయింది. ధీరజ్ ఇంకా రూంలోకి రాలేదు. ఆయనకు కనిపించి వెళ్లటం కోసం సూపర్నెంటు రంగారావు వచ్చాడు.
“మా ఆవిడ పెందరాళే రమ్మన్నదండి. చిన్న ఫంక్షన్ ఉంది. షాపిగ్ చేయాలి. ఇవన్నీ ఈతి బాధలండీ.. మీకు పెళ్లి అయిందా?” అని అడిగాడు రంగారావు.
ఆ ప్రశ్న విన్నప్పుడల్లా స్నేహలతకు కోపం వస్తుంది.
ప్రతి వాడూ తన పెళ్లి గురించి అడిగేవాడే. తనకు పెళ్లి అయితే వీళ్లకు ఎందుకు, కాకపోతే వీళ్లకు ఎందుకు?
“మీ హస్బెండ్ పేరే మిటండీ?” అని అడిగాడు రంగారావు.
వల్లకాట్లో రామనాధం అని మనసులో అనుకొని పైకి మాత్రం ‘వి.రామనాధం’ అన్నది.
“పిల్లలు ఎంత మంది?”
“ఇద్దరు. ఒక ఆడా. ఒక మగా.. ” అన్నది స్నేహలత ఈ టాపిక్ ఇంతటితో అయినా ముగిసిపోతుందని.
“చిన్న కుటుంబం అన్న మాట. నాకూ అంతే. చిన్న ఉద్యోగం. చిన్న పెళ్లాం, చిన్న కూతురు, చిన్న ఇల్లు, అన్నీ చిన్న చిన్నగా కాలక్షేపం చేస్తున్నాం.” అన్నాడు రంగారావు నవ్వుతూ. ఆమెకు నవ్వు రాలేదు. కోపం తగ్గలేదు.
రాత్రి ఏడు గంటలకు ఇంటికి వచ్చింది. కాఫీ పెట్టుకు తాగుతోంది. కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీసింది. ఒక వయసు మళ్లిన ఆమె ఎదురుగా నిలబడి ఉంది.
“మేం పై ఫ్లాట్‌లో ఉంటున్నాం. ఈ మధ్యనే ఈ ఫ్లాట్ లోకి మీరు వచ్చినట్లున్నారు..” అన్నదామె.
లోపలికి వచ్చి కూర్చున్నారు.
“నీకు పెళ్లి అయిందా?” అని అడిగిందామె.
స్నేహలతకు చర్రున కోపం వచ్చింది. కానీ నిగ్రహించుకుంది.
“అయిందండీ.”
“ఏం లేదమ్మా. మా అమ్మాయి నోము నోచుకుంటోంది. ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వాలని..” అని చెప్పిందామె.
అయిదు నిముషాలు కూర్చుని ఆమె వెళ్లిపోయింది.
మళ్లీ కాలింగ్ బెల్ మ్రోగింది. ఫ్లాట్ ఓనరు వచ్చి కూర్చున్నాడు. ఆయన అద్దె వసూలు చేసుకోవటానికి వచ్చాడు. డబ్బు ఇచ్చింది. లెక్క పెట్టుకుంటూ అడిగాడు.
“మీవారు ఎక్కడా కనిపించటం లేదు.”
“ఆయన ఊళ్లో లేరండి.”
“ఇంత వరకూ ఒక్కసారి అయినా ఆయన్ను నేను చూడలేదు. ఇరుగుపొరుగు వాళ్లూ అదే అంటున్నారు. అసలు నీకు పెళ్లి అయిందా?” అని అడిగాడు.
“నాకు పెళ్లి అయితే మీకెందుకు? కాకపోతే మీకెందుకు? మీ అద్దె మీకు ఇస్తున్నాను కదా..” అని కటువుగా చెప్పింది స్నేహలత.
ప్రతి చోటా ఇదే ప్రశ్న. ఇదే గోల. ఇంటి ఓనరు దగ్గర నుంచి వీధులు ఊడ్చే వాడి దాకా ప్రతివాడూ “నీ భర్త ఏడి?” అని అడిగేవాడే. విసిగిపోయి ఏది నోటికొస్తే అది చెప్పేస్తోంది.
మర్నాడు ఆఫీసులో ధీరజ్ సాయంత్రం ఆరు గంటల దాకా ఉన్నాడు. లేటు అయింది గనుక ఆమె కారులో ఇంటి దగ్గర దించుతానన్నాడు.
ఇంటికి వచ్చాక, ఇల్లు చూస్తానంటూ లోపలికి వచ్చాడు.
“మీ ఆయన ఎక్కడా?” అని అడిగాడు.
“క్యాంపుకి వెళ్లారు” అని చెప్పింది.
“పిల్లలు ఎక్కడ?”
“మా పుట్టింట్లో ఉన్నారు.”
“నువ్వు ఇద్దరు పిల్లల తల్లి లాగా లేవు. దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నాం. నా కోసమే నువ్వు జన్మ ఎత్తినట్లు గానూ ఉంది. ఈ ఏకాంతంలో, ఒంటరితనంలో, రెండు చేతులూ చాస్తే, నువ్వు నా కౌగిట్లోనే ఇమిడి పోతావు” అంటూ ఆమెను కౌగిలించుకోబోయాడు.
ఆమె తప్పించుకుంది “మా మాట కాదనకుండా ఒప్పుకుంటే, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేసి, నీ పాదల దగ్గర పడి ఉంటాను. సమాజమూ, సంప్రదాయాలూ, చట్టుబండలూ ఇవేవీ లెక్క చేయను” అంటూ ఆవేశంతో మీద పడి ముద్దు పెట్టుకోబోయాడు.
ఇలాంటి అవమానాలు ఇది వరలోనూ ఆమెకు ఎదురైనయి. అందు చేత తెలివిగా అతన్ని బెడ్ రూంలోకి తీసుకెళ్లి, గదిలో బంధించింది.
“నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నాను. పది నిముషాల్లో వాళ్లు వస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ వాళ్లకు చెప్పు..” అన్నది స్నేహలత.
ధీరజ్ కాళ్ల బేరానికి వచ్చాడు.
“తప్పు అయిపోయింది. ఇంకెప్పుడూ నీ జోలికి రాను. నన్ను విడిచి పెట్టు. చాలు” అని వేడుకున్నాడు.
ఒక అరగంట బెదిరించి, అతని చేత చెంపలు వేయించి, వదిలి పెట్టింది. బ్రతుకు జీవుడా అని పారిపొయ్యాడు.
ఆమె శారీరికంగా, మానసికంగా అలిసిపోయింది. రెండు నిముషాలు పడుకుంది. నిద్ర పట్టబోతోంది.
కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీసింది.
ఎవరో కాగితాలు చిట్టా పట్టుకొని గుమ్మంలో నిలబడ్డారు.
“పొద్దున వచ్చాం మీరు లేరు. ఐ.డి కార్డులు ఇష్యూ చేస్తున్నాం. మీ పేరు చెప్పండి” అని అడిగాడు.
పేరు చెప్పింది.
“మీకు పెళ్లి అయిందా?”
మళ్లీ అదే ప్రశ్న. ఇంత కాలంపంటి బిగువున ఆపుకుంటున్న కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశం, దుఃఖం ఒక్కసారిగా ఉప్పెనలా పెల్లుభిగి వచ్చాయి. “నాకు పెళ్లి అయితే నీకెందుకు? కాకపోతే నీకెందుకు రా? అంట్ల వెధవా” అని అరిచింది.
“అదేంటండీ. మా డ్యూటీ మేం చస్తున్నాం.”
“ఏంట్రా నీ డ్యూటీ? నా పెళ్లి అయిందో లేదో తెల్సుకోవటమేనా నీ డ్యూటీ. ప్రతి అడ్డగాడిదా అడిగేవాడే. వెళ్లు. నాకు కనిపించకు పోరా..” అని గొంతు చించుకుంది.
భళ్లున తలుపు మూసి, వెళ్లి పరుపు మీద పడుకుంది. మనసంతా కందిరీగల తుట్టెలా ఉంది. గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నయి.
టాబ్లెట్ వేసుకుని, కళ్లు మూసుకుని పడుకుంది.
మళ్లీ కాలింగ్ బెల్ మ్రోగింది. ఆమె లేవలేదు. అసహనంగా మసులుతూనే ఉంది, నిద్ర పట్టే వరకూ.