[పాలస్తీనా యుద్ధం మీద మౌమితా ఆలం రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Moumita Alam’s poem by Mrs. Geetanjali.]
~
[dropcap]ఖా[/dropcap]ళీ చేయండి ఇప్పుడే.. ఈ క్షణమే!
మేము మీ నగరం మీద
బాంబులు వేయబోతున్నాం.. వెళ్లిపోండి తక్షణం!
పవిత్రమైన.. కారుణ్యం నిండిన ప్రజలారా..
మీకో ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇస్తున్నాం.
నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోండి!
అనే ప్రకటన వినిపిస్తుంది.. ఎప్పటిలాగే!
గాజాలో పనుల్లో మునిగిపోయిన జనం..
ఏది తీసుకుని పరిగెత్తాలో..
దేన్ని వదిలేసి వెళ్ళాలో తెలీక సతమతమవుతారు.
కూతురికి ఇష్టమైన టీ పాట్.. కొడుకు వేసుకునే చలి కాలపు స్వెటర్..
అమూల్యమైన పెళ్లి గౌను.. లేక
చనిపోయిన నాన్న చివరి ఫోటో..
ఏది.. దేన్ని తీసుకెళ్లాలిప్పుడు?
దేన్ని అక్కడే వదిలేసి పోవాలిప్పటికిప్పుడు?
కంగారు.. అయోమయం.. దుఃఖం!
“అమ్మా.. అమ్మా..
రెఫ్యూజీ క్యాంపుకి మనతో పాటు ఈ ఆలివ్ చెట్టును కూడా తీసుకెళ్ళొచ్చా..
పోనీ నా లెక్కల పుస్తకాన్నయినా?”
పసిపాప అమాయకంగా.. ఆశగా అడిగిన ప్రశ్నకి తల్లి.. తల్లడిల్లిపోతుంది.
“వద్దు పాపా.. యుద్ధ క్షేత్రాల్లో ఆలివ్ చెట్టు ఎన్నటికీ పుష్పించదు..
మనకంటూ జ్ఞాపకాలే మిగిలాయిప్పుడు” అంటూ ఆ తల్లి నిశ్శబ్దంలోకి జారిపోతుంది.
మళ్ళీ.. ఖాళీ చేసి వెళ్లిపోండి..
అన్న హెచ్చరిక గాల్లో మోగుతుంది!
~
మూలం: మౌమితా ఆలం
అనుసృజన: గీతాంజలి
మౌమితా ఆలం పశ్చిమ బెంగాల్‍కి చెందిన కవయిత్రి. ధిక్కార స్వరం ఆమె కవిత్వపు ప్రత్యేకత.