దేశ విభజన విషవృక్షం-64

0
5

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]క్రి[/dropcap]ప్స్ రాయబారం విఫలం కావడానికి ముందు గాంధీజీ శాసనోల్లంఘన పేరుతో సత్యాగ్రహ ఆందోళనను నిర్వహించారు. ఈ శాసనోల్లంఘన ఉద్యమానికి సైతం ముస్లింలీగ్ మద్దతు ఇవ్వలేదు. కానీ, గాంధీజీ చేపట్టిన ఈ ఆందోళనను ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. బ్రిటిష్ వారు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 14 వేల మందిని అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా కాంగ్రెస్ నాయకులతో అవసరం పడింది కాబట్టి వీరందరినీ విడిచిపెట్టింది. ఆ తరువాతే క్రిప్స్‌ను పంపించడం.. యుద్ధంలో భారతీయులు బ్రిటన్‌కు సహాయ పడాలని కోరటం.. ఎవరూ అడగకముందే అంగీకరించడం, గాంధీగారు మాత్రం ఒప్పుకోకపోవడంతో.. క్రిప్స్ రాయబారం విఫలమైంది. ఆ తరువాత గాంధీగారు కరో యా మరో నినాదాన్నిచ్చారు. ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో క్రిప్స్ రాయబారం ఫెయిల్ కావడంతో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఆమోదించింది. కానీ కాంగ్రెస్‌కు ఇతర పక్షాలేవీ కూడా మద్దతును ఇవ్వలేదు. ముస్లిం లీగ్ ముందుగానే బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ముస్లింలీగ్ ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతూ వెళ్లింది. పాకిస్తాన్ ఏర్పాటే లక్ష్యంగా బ్రిటిష్ వారికి మద్దతును ప్రకటించింది. వీర్ సవార్కర్ నేతృత్వంలోని హిందూ మహాసభ సైతం కాంగ్రెస్ నిర్ణయానికి దూరంగా ఉండింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా కష్కర్ తెహ్రిక్ సంస్థ అధినేత అల్లామా మాష్రిఖిని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కోరారు. కానీ, ఆయన అందుకు తిరస్కరించారు. పాకిస్తాన్ ఏర్పాటుకు అంగీకరిస్తే తప్ప కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ క్రమంలోనే హష్రీఖీ జవహర్ లాల్ నెహ్రూతోపాటు,  మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, గాంధీగారు, సీ రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, పట్టాభి సీతారామయ్య, బులుసు సాంబమూర్తి లకు టెలిగ్రామ్ పంపించారు. అది పత్రికల్లో ప్రచురితమైంది.

I am in receipt of Pandit Jawaharlal Nehru’s letter of 8 July. My honest opinion is that Civil Disobedience Movement is a little pre-mature. The Congress should first concede openheartedly and with handshake to Muslim League the theoretical Pakistan, and thereafter all parties unitedly make demand of Quit India. If the British refuse, start total disobedience.[17]

The resolution said:

The committee, therefore, resolves to sanction for the vindication of India’s inalienable right to freedom and independence, the starting of a mass struggle on non-violent lines on the widest possible scale, so that the country might utilise all the non-violent strength it has gathered during the last 22 years of peaceful struggle… they [the people] must remember that non-violence is the basis of the movement.

ముస్లింలీగ్‌తో పాటు అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వివిధ రాజ సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, వైస్రాయ్ కౌన్సిల్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ వంటి వ్యవస్థలు, సంస్థలు అన్నీ కూడా క్విట్ ఇండియాకు దూరంగా ఉండిపోయాయి. యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం విపరీతంగా ఖర్చు చేసింది. ఈ ఖర్చు వల్ల లాభపడ్డ వ్యాపారులు ఎవరూ కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు.

అప్పటికి కాంగ్రెస్, ముస్లింలీగ్ మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రజలకు ప్రతినిధిత్వం వహించే సంస్థలుగా గుర్తించి వాటితోనే ప్రధానంగా చర్చలు జరుపుతున్నది. క్రిప్స్ కూడా వీటితోనే ప్రధాన చర్చలు జరిపారు. అవి విఫలమయిన తరువాత. కాంగ్రెస్ ఒంటరిగానే క్విట్ ఇండియా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కొనసాగించింది. 1942 ఆగస్టు 8 న బొంబాయిలోని గోవాలియా ట్యాంకు మైదానంలో గాంధీగారు క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన గంటల్లోనే ఆయన్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. యుద్ధంలో తమకు సహకరించకూడదని క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన కాంగ్రెస్‌పై తీవ్రంగా అణచివేత చర్యలను చేపట్టింది. విచారణ అనేదే లేకుండా కాంగ్రెస్ నాయకులందరినీ జైళ్లల్లో పెట్టింది. వీళ్లలో చాలామంది యుద్ధం ముగిసే దాకా కూడా జైల్లోనే ఉండిపోయారు. అహింసాయుతంగా ఆందోళనలు చేయాలని గాంధీగారు పిలుపునిచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా చాలాచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. బ్రిటన్ అధికారి జాన్ ఎఫ్ రెడిక్ ఇందుకు సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దాని ప్రకారం ఉద్యమం మొదలైన నెలన్నర రోజుల్లో 550 పోస్టాఫీసులు, 250 రైల్వే స్టేషన్లపై ఆందోళన కారులు దాడులు చేశారు. 70 పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేశారు. చాలా రైలు మార్గాలను ధ్వంసం చేశారు. 85 ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. దాదాపు 2500 ప్రాంతాల్లో టెలిగ్రాఫ్ వైర్లను కత్తిరించారు. (ఆ రోజుల్లో వేగంగా కమ్యూనికేషన్ టెలిగ్రామ్ ద్వారానే సాగేది) బీహార్‌లో అత్యధిక స్థాయిలో హింస జరిగింది. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దళాలను మోహరించింది. స్వాతంత్ర్యం సంగతి యుద్ధం తరువాత చూద్దామని చెప్పినా అందులో విశ్వసనీయత లేకపోవడంతో చేపట్టిన ఈ ఆందోళనను చేపట్టినప్పటికీ.. దీనికి ఒక స్పష్టమైన కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ నిర్దేశించలేకపోయింది. నాయకులంతా జైళ్లలో ఉండిపోవడంతో పార్టీ కార్యాలయంలో జండా ఎగురవేయడానికి కూడా నాయకుడు లేకపోవడంతో యువనాయకురాలిగా అరుణా అసఫ్ అలీ వచ్చి జెండా ఎగురవేయాల్సిన పరిస్థితి. సరైన నాయకత్వం, మార్గదర్శకత్వం లేకపోవడంతో క్విట్ ఇండియా ఉద్యమం స్థానిక ప్రజల ఇష్టం వచ్చినట్టుగా పలు దిశల్లో సాగింది. కొన్ని చోట్ల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేశారు. పరిపాలనలను తోసిరాజని.. స్వపరిపాలన వ్యవస్థలను స్థాపించారు. కొన్ని చోట్ల అయితే.. సమాంతర ప్రభుత్వాలు కూడా స్థాపించారు. ఉత్తరప్రదేశ్ లోని బలియాలో జిల్లా పరిపాలనను ప్రజలు తమ చేతుల్లోకి తీసుకొన్నారు. అక్కడ జైలు తలుపులు బద్దలు చేసి కాంగ్రెస్ నాయకులను విడుదల చేశారు. వారు తమ సొంత స్వతంత్ర పరిపాలన స్థాపించారు. బ్రిటిష్ వారు తమ అధికారాన్ని తిరిగి సాధించడానికి కొన్ని వారాలు పట్టింది.  గుజరాత్ వెస్ట్ (సౌరాష్ట్ర) లో ఉద్యమం చట్ట ఉల్లంఘన కార్యక్రమాలు.. తీవ్ర హింసాత్మక చర్యలకు కారణమైంది. మహారాష్ట్రలోని సతారా, ఒడిశాలోని తాల్చేర్, మిడ్నాపూర్ లోని తమ్లుక్, కొంటాయ్ డివిజన్లలో అక్కడి ప్రజలు ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొన్నారు. తమ  పాలనను తామే పరిపాలించుకోవడం మొదలు పెట్టారు. యుద్ధం తీవ్రం కావడంతో బ్రిటిష్ వారు యుద్ధం పన్నులు వేయడం మొదలు పెట్టారు. వరి ఎగుమతులపై కూడా భారీ పన్నును విధించారు. దీనికి తోడు 1942, 43 లో పెద్ద ఎత్తున కరువు కాటకాలు సంభవించాయి.. దీంతో బెంగాల్ రైతులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. చాలా చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. పలు చోట్ల కరెంటు తీగెలను తెంపి కరెంటు ఆపారు. ప్రభుత్వ భవనాలను తగులబెట్టారు. రోడ్లు ధ్వంసం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. ఎక్కడికక్కడ బ్రిటిష్ అధికారుల సామూహిక నిర్బంధాలు పెద్ద ఎత్తున జరిగాయి. రహస్య రేడియోలు ఏర్పడ్డాయి. ప్రజలకు ఈ రేడియోల ద్వారా సందేశాల ప్రసారం జరిగేది. ప్రజలను మొబలైజ్ చేసేవారు. కరపత్రాలను పంపిణీ చేయడం.. సమాంతర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం వంటివి ఒకరిని చూసి ఒకరు ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. 1942 నుంచి 1945 వరకు మూడేండ్ల పాటు కాంగ్రెస్ నాయకత్వం ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. ఒక దశలో గాంధీతోపాటు, ఇతర కాంగ్రెస్ నేతలను దక్షిణాఫ్రికాకు తరలించేందుకు బ్రిటిష్ పాలకులు సిద్ధపడ్డారు కూడా. ఇందుకోసం ఒక యుద్ధనౌకను తెప్పించారు. కానీ.. అప్పటికే చేజారుతున్న ఉద్యమం మరింత పెచ్చరిల్లుతుందని ఆగిపోయారు. కానీ, నాయకుడు లేక, చుక్కాని లేని నావలా పట్టాలు తప్పిన ఉద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో అణచివేసింది. ఒక దశలో 1857 కంటే పెద్ద ఉద్యమాన్ని తలపించిందని అప్పటి వైస్రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు 57 కంపెనీల బలగాలు బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చాయి. ఎక్కడికక్కడ ప్రదర్శనకారులపై, ఆందోళనకారులపై బ్రిటన్ బలగాలు విరుచుకుపడ్డాయి. పోలీసుల కాల్పుల్లో వందల మంది ప్రజలు మరణించారు. కాంగ్రెస్ నాయకత్వం జైలు నుంచి బయటకు రావడానికి ముందే క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అణచివేసింది. క్విట్ ఇండియాకు మద్దతును ఇచ్చింది ముందుగానే చెప్పుకొన్నట్టు అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ మాత్రమే. రూజ్‌వెల్ట్‌కు తన లెక్కలు తనకు ఉన్నాయి. తనపై ఒత్తిడి ఉన్నప్పటికీ.. చర్చిల్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని సమర్థంగా అణచివేసింది. 1944 నాటికి ఉద్యమం చల్లారింది. ప్రశాంత పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి. క్విట్ ఇండియా సాధించిన విజయం ఏమిటంటే.. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏకం చేసిందీ ఉద్యమం.

క్విట్ ఇండియా ఉద్యమం విఫలం కావడానికి అనేక కారణాలున్నాయి.

  1. దేశ వ్యాప్తంగా కాంగ్రెసేతర వ్యవస్థలన్నీ ఉద్యమానికి దూరంగా ఉండటం
  2. స్పష్టమైన కార్యాచరణను ప్రజలకు అందించకపోవడం
  3. ప్రధాన నాయకులందరూ సుదీర్ఘకాలం జైల్లోనే ఉండాల్సి రావడం
  4. తక్షణ లక్ష్యాలతో దీర్ఘకాలిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకపోవడం
  5. విద్యార్థులంతా సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ కార్యాచరణను సమర్థించడం
  6. సరైన నాయకత్వం లేకపోవడంతో ఉద్యమం పలురకాలుగా పట్టాలు తప్పడం..
  7. హింసాత్మక కార్యకలాపాలు పెట్రేగటంతో తప్పనిసరి అణచివేతకు ప్రభుత్వం పూనుకోవడం.

రెండో ప్రపంచ యుద్ధం బ్రిటన్‌ను తీవ్రంగా నష్టపరుస్తున్నదని ముస్లింలీగ్‌తో పాటు హిందూ మహాసభ, భారత కమ్యూనిస్టు పార్టీ గ్రహించాయి. ఎందుకంటే అంతకుముందే పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి (1941)తో యూరప్‌లో యుద్ధం మరింత సంక్లిష్టంగా మారింది. యుద్ధం అనేది క్రమంగా బ్రిటన్‌కు తలనొప్పిగా మారింది. ఖర్చు పెరిగింది. అప్పటి వరకు భారత్ అనేది బ్రిటిష్ వారికి ఒక ఆదాయ వనరుగా, మార్కెట్‌గా బాగా పని చేసింది. అందువల్లనే బ్రిటన్ ఈ దేశాన్ని అంతకాలం తమ ఆధీనంలో ఉంచుకొన్నారు. ఈ సమయంలోనే భారత దేశానికి బడ్జెట్ కేటాయింపులు జరపాల్సి వచ్చింది. దీంతో పన్నులు విపరీతంగా పెంచారు. ధరలు రెట్టింపు అయ్యాయి.

ఈ సమయంలో బ్రిటన్ బలహీనతను తమ బలంగా మలచుకోవలసిన కాంగ్రెస్ ఆ దిశగా ఆలోచించలేదు. ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత నిర్ణయాత్మకమైన కార్యాచరణ ఎవరైనా చేపట్టారంటే అది కేవలం సుభాష్ చంద్రబోస్ మాత్రమే. జర్మనీలో భారత సైనిక దళాన్ని స్థాపించి.. జర్మనీ, జపాన్‌ల సహాయంతో బ్రిటిష్ పాలకులపై గెరిల్లా యుద్ధం చేసారు. 1942 సెప్టెంబర్ 1 ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే బోసును బ్రిటన్ పాలకులు బంధించారు. కానీ ఆయన తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్, సోవియట్ యూనియన్.. ఆ తరువాత బెర్లిన్ చేరుకొన్నారు. యుద్ధంలో పోరాడి యుద్ధ ఖైదీలుగా చిక్కిన బ్రిటిష్ ఇండియా సైనికులతో మాట్లాడి.. వారితో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జపాన్ సామ్రాజ్యంతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆగ్నేయాసియా వైపు జరిగిన యుద్ధంలో జపాన్ సైనికులతో కలిసి కవాతు చేసింది. బ్రిటిష్ భారతీయ సైనికులను యుద్ధఖైదీలుగా బంధించారు కూడా. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) ఏర్పడినప్పుడు తమ సైన్యంలోని భారతీయ సైనికులు తిరగబడతారని బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురైంది. దానికి తగినట్టుగానే.. జపాన్ దళాలతో కలిసి బ్రిటన్ సైన్యంతో అనేక యుద్ధాలలో ఐఎన్‌ఏ పాల్గొన్నది. బర్మాలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నది. ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి భారత్‌లో కథలు కథలుగా చెప్పుకొన్నారు. దేశంలోని విద్యార్థులంతా కూడా నేతాజీని మాత్రమే తమ నాయకుడిగా, రెబల్ స్టార్‌గా చూశారు. అంతకు ముందు భగత్ సింగ్ విషయంలో గాంధీగారు అనుసరించిన తీరుపై విద్యార్థుల్లో కొంత అసంతృప్తి ఉన్నది. ఆ తరువాత అహింసతోనో.. సత్యాగ్రహాలతోనో స్వాతంత్ర్యం సిద్ధించదని చాలా మంది యువతీయువకులు భావించారు. 1943లో సింగపూర్ నుంచి ఆగ్నేయాసియాలోని భారతీయులను ఉద్దేశించి నేతాజీ వరుసగా ఉత్తేజభరితమైన రేడియో ప్రసంగాలు చేశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా యువతీ యువకులు నేతాజీ పట్ల బాగా ఆకర్షితులయ్యారు. 1945లో నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత ఇండియన్ నేషనల్ ఆర్మీ దళాలు భ్రిటిష్ ఇండియన్ దళాలకు లొంగిపోయాయి. కానీ.. భారతదేశంలోని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోని నౌకాదళంలో ఉన్న ఐఎన్‌ఏ అభిమాన సైనికులు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఈ పరిణామం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పని పరిస్థితిని బ్రిటిష్ ప్రభుత్వానికి కల్పించింది. ఒకవైపు యుద్ధంలో అన్ని విధాలుగా తీవ్రమైన నష్టం వాటిల్లడం, మరోవైపు ఆసియాను డీకొలనైజేషన్ చేయాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరగటం, ఇంకోవైపు నౌకాదళంలో తిరుగుబాటు.. ఇవన్నీ కలిసి బ్రిటన్‌ను భారత్ ను వదిలి వెళ్లేలా చేశాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here