[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
~
చిత్రం: మహాత్మా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాత్రం: ఎస్పీ.బాలసుబ్రమణ్యం
సంగీతం: విజయ్ ఆంథొని.
~
సాహిత్యం
రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్
సబ్ కో సన్మతి దే భగవాన్.
~
పల్లవి :
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
(కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ)
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడిరోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ ॥ ఇందిరమ్మ ॥
చరణం:
రామ నామమే తలపంతా, ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష, స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత.. అపురూపం ఆ చరిత
కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా సంభవామి అని ప్రకటించిన
అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసినోటి తాత
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ!
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి!
సత్యాహింసల మార్గజ్యోతి నవ శకానికే నాంది ॥ రఘుపతి రాఘవ ॥
చరణం:
గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగజ్జేత
చరఖా యంత్రం చూపించి, స్వదేశీ సూత్రం నేర్పించి,
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడురా జాతిపిత.. సంకల్ప బలం చేత
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి.
సర్వ జనహితం నా మతం, అంటరానితనాన్ని,
అంతఃకలహాల్ని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం.. హే రామ్!
♠
[dropcap]అ[/dropcap]త్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై అహింసే ఆయుధంగా..అసామాన్య పోరాటం చేసిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, Hero of the World గా, ఉత్తమ జాతీయ నాయకుడిగా, భారత జాతిపితగా ఎనలేని కీర్తి శిఖరాలను అందుకున్నాడు. మానవ హక్కుల కోసమైనా స్వేచ్ఛా, సమానత్వం సాధించాలన్నా, (అమెరికా స్వాతంత్ర పోరాటం, ఫ్రెంచ్, రష్యా విప్లవాలు, జర్మనీ, ఇటలీ ఏకీకరణల వంటి) గొప్ప జాతీయ వాదాలను పటిష్టం చేయాలన్న ఉద్యమాలు కానీ.. అన్నిటికీ హింస, రక్తపాతమే పునాదులుగా గాంధీకి ముందు శకమంతా, సాగింది. కానీ, వీటన్నిటికీ విరుద్ధంగా అహింసను, సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలుచుకొని, బ్రిటిష్ పాలకుల వెన్నులో చలి పుట్టించింది గాంధీజీ మార్గం.
ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి మహాత్ముడు చూపిన పోరాట పంథానే కారణం. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చి, స్వాతంత్రోద్యమ బాట పట్టారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన్ని ఆత్మీయంగా ‘బాపూ’ అని పిలుచుకుంటే, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనను ‘మహాత్మా’ అని గౌరవంగా పిలుచుకున్నారు.
గాంధీ మహాత్ముని పై సిరివెన్నెల సాహిత్యాన్ని సమీక్షించే ముందు, 1955 లో దొంగ రాముడు సినిమా కోసం సముద్రాల సీనియర్ వ్రాయగా, సుశీల గారు ఆలపించిన ఈ గీత సాహిత్యాన్ని ఒకసారి గమనిద్దాం. ఆ తరం పిల్లలంతా, ఈ పాటనే గాంధీ జయంతికి పాడుకుంటూ ఉండేవాళ్ళు. తరువాత గాంధీపై ఎన్నో పాటలు తెరమీదికి వచ్చాయి.
భలే తాత మన బాపూజీ – బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ – చిన్నీ పిలక బాపూజీ
కుల మత బేధం వలదన్నాడు – కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు – మనలో జీవం పోసాడు || భలే తాత ||
నడుం బిగించి లేచాడు – అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ – దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం – మనకు లభించెను స్వరాజ్యం || భలే తాత ||
సత్యాహింసలే శాంతి మార్గమని – జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు – మహాత్ముడై ఇల వెలిశాడు || భలే తాత ||
చిన్ని పిలకతో, బోసే నోటితో, స్వాతంత్రానికి నడుం బిగించిన మహాత్ముడు సత్య అహింసలు అనే శాంతి మార్గంలో స్వరాజ్యాన్ని సాధించాడని కితాబునిచ్చారు సముద్రాల సీనియర్.
‘మహాత్మ’ చిత్ర నేపథ్యానికి వస్తే, మహాత్మ సినిమా మొత్తం వీధి రౌడీ అయిన దాస్ (శ్రీకాంత్) చుట్టూ తిరుగుతుంది. హైదరాబాద్ గాంధీనగర్ లోని గాంధీ విగ్రహం, ఈ రౌడీ గ్యాంగ్‌కి అడ్డా. డబ్బు కోసం రకరకాల నేరాలు, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు దాస్, అతని గ్యాంగ్‌తో కలిసి. అతని అమాయకత్వాన్ని చూసి, దాస్‌ను ప్రేమించే లాయర్ కృష్ణవేణి (భావన) అతన్ని అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటుంది. హీరో అవ్వాలని, ఎమ్మెల్యే దాదా (జయప్రకాశ్ రెడ్డి) గ్యాంగ్‌లో చేరిన తర్వాత, ఆయన దాస్ ను తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ ఉంటే, ఒకానొక సందర్భంలో, దాదా మీదే పోటీ చేసి గెలుస్తానని దాస్ ఛాలెంజ్ చేస్తాడు. ఈ సందర్భంగా రౌడీయిజం నుంచి గాంధీయిజం వైపు దాస్ పొందే పరివర్తనే.. కథ సారాంశం. గాంధీ పార్టీ స్థాపించి, ఎన్నికలలో గెలవాలనే తపనలో, గాంధీ గురించి హీరో తెలుసుకుంటున్నప్పుడు, గాంధీ తత్వాన్ని గురించి విడమర్చి చెప్పే సందర్భం లోనిది ఈ పాట.
మహాత్మా సినిమా కాన్సెప్ట్‌కు పూర్తిగా అద్దం పడుతూ, ఆయువుపట్టులా నిలిచి, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు సాధించింది ఈ పాట. ఈ పాటలో మహాత్ముని జీవన సందేశాన్ని, గాంధీ తత్వాన్ని ఎంతో హృద్యంగా నిర్వచించారు సిరివెన్నెల. ఇక పాట విశ్లేషణ లోకి వెళ్దాం.
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
(కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ)
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడిరోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ ॥ ఇందిరమ్మ ॥
గాంధీ ఎవరో తెలియని వారికి, గాంధీ గురించి ఏమి తెలుసుకోవాలో, ఎంత తెలుసుకోవాలో, పాట పల్లవిలోనే ఎంతో స్పష్టంగా వివరించారు సిరివెన్నెల. ప్రతి ఊరిలోనూ ఒక గాంధీ రోడ్డు తప్పనిసరిగా ఉంటుంది. వీలైనన్ని గాంధీ విగ్రహాలు, కూడళ్లలో ప్రతిష్ఠింపబడి ఉంటాయి. కరెన్సీ నోట్ల మీద బోసినవ్వుల గాంధీ ముద్రించబడి ఉంటాడు. ఇందిరాగాంధీ ఇంటి పేరులో గాంధీ చేరి ఉంటాడు. కానీ ఈ బొమ్మల్లోనో, ఈ కరెన్సీ నోట్ల మీదనో కనిపించేవాడు కాదు గాంధీ.
తన ఉక్కు సంకల్పంతో, భరతమాత బానిస సంకెళ్లు తెంచి, తలరాతను మార్చి, స్వతంత్ర భారతిగా ఆమె వైభవాన్ని తిరిగి నిలబెట్టిన, విధాత గాంధీ. భారతీయులు ఎన్నో తరాలుగా అనుభవించిన బానిసత్వపు యమ యాతన నుండి బయటకు తెచ్చిన వరదాతగా గాంధీని కొనియాడారు సిరివెన్నెల. సెన్సార్ బోర్డులో వచ్చిన అభ్యంతరాల మేరకు, సినిమాలో ‘ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ’ అన్న వాక్యాన్ని ‘కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ’గా మార్చారు. ఇందులో ఎవరినీ కించపరిచే భావన, నాకైతే ఎక్కడా కనిపించలేదు. కళ్లకు కనిపించే రూపాల్లో, చెవులకు వినిపించే పేరులో కాకుండా, మనసుకు అర్థమయ్యే ఆయన గొప్పదనంలో మహాత్ముడిని దర్శించమనేది సిరివెన్నెల భావన.
రామ నామమే తలపంతా, ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష, స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత.. అపురూపం ఆ చరిత
నిరంతరం రామనామ జపం చేస్తూ, ప్రేమమయమైన తన మనసుతో, స్వతంత్ర సాధనే దీక్షగా, నిస్వార్థ సేవా తత్పరతతో, ఆశ్రమ జీవితాన్ని, గడిపిన అవధూతగా గాంధీని అభివర్ణిస్తూ, అటువంటి చరిత్ర అపురూపమంటూ ప్రశంసించారు. ఆయన మనస్తత్వాన్ని ఎంతో చక్కగా ఆవిష్కరిస్తూ ‘అవధూత’ అన్న పదం ఉపయోగించడం సిరివెన్నెల జ్ఞానపు లోతులకే కాక, ఏ పదాన్ని, ఏ అక్షరాన్ని మార్చలేనంత గొప్పగా, ఆయన సాహిత్యంలో పదాల ఎంపిక ఉంటుందని చెప్పడానికి ఒక ఒక చక్కటి ఉదాహరణ. అవధూత అంటే నిర్వచనానికి దొరకని ఒక ఆత్మ జ్ఞాని. రాగద్వేషాలకు అతీతంగా, విశ్వజనీనంగా ఉంటూ, సర్వజనహితంగా జీవిస్తూ, అందరి మేలు కోసంబ్రతుకంతా అర్పించిన గాంధీజీ అవధూత కాక ఇంకేం అవుతారు? ఒక్క అద్భుతమైన సామ్యంతో గాంధీజీ విశిష్టతను మన కళ్ళకు కట్టినట్టు వర్ణించారు.
కర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంతా, సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత.. ఈ బోసినోటి తాత
భారతీయతకు ఒక సునిశిత దర్పణం గాంధీ జీవితం. ఏ ఫలితాన్ని ఆశించకుండా, కర్మయోగిలా జీవిస్తూ, తన మనసునే ధర్మక్షేత్రం చేసుకొని, బ్రిటిష్ వారిపై పోరాటం సాగించారు గాంధీజీ. ధర్మానికి గ్లాని కలిగిన ప్రతిసారీ, ప్రతి యుగంలో తాను అవతారిస్తానని పలికిన గీతాచార్యుని సందేశాన్ని గుర్తు చేసుకుంటూ, ధర్మ భూమి అయిన భరతభూమిని కాపాడడానికి ఒక యోగి రూపంలో గాంధీ మహాత్ముడు అవతరించాడన్న అంతరార్థాన్ని మనకు అందించారు సిరివెన్నెల.
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ!
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి!
సత్యాహింసల మార్గజ్యోతి నవ శకానికే నాంది ॥ రఘుపతి రాఘవ ॥
ఇక గాంధీ జీవితం నుండీ ప్రతి వారు ఏ స్ఫూర్తి తీసుకోవాలి అంటే.. మామూలు మనుషులు కూడా, మహాత్ముని స్థాయికి చేరవచ్చు! సామాన్యులు మాన్యులు కావచ్చు.. కానీ ఎలా? బాపూజీలాగా అడుగడుగునా, అణువణువునా తనను తాను మలచుకుంటూ.. నిరంతరం రాగ ద్వేషాలను అదుపులో ఉంచుకుంటూ.. సాధన చేస్తూ.. అందరి మేలులో ఆనందాన్ని పొందుతూ..
ప్రతి వారి మనసును తాకే ఈ వాక్యం చూడండి! ‘మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ!’ స్వరాభిషేకంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈ పాట గురించి మాట్లాడుతూ, స్ఫూర్తిదాయకమైన ఈ వాక్యాన్ని ఎంతగానో ప్రశంసించారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో మార్గదర్శనం చేసి ప్రపంచానికే నవ శకానికి నాంది పలికారు గాంధీ. మహాత్ముని గొప్పదనం గురించి, ప్రపంచ మేధావుల అభిప్రాయాలు కొన్ని చూద్దాం.
‘He is a man among men, a hero among heroes, a patriot among patriots and we may well say that in him Indian humanity at the present time has really reached its high water- mark’ – Gopal Krishna Gokhale.
‘If humanity is to progress, Gandhi is inescapable. He lived, thought, and acted, inspired by the vision of humanity evolving toward a world of peace and harmony. We may ignore him at our own risk.’ – Dr. Martin Luther King, Jr
Mahatma Gandhi will go down in history on par with Buddha and Jesus Christ. – Lord Mountbatten
గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత,.. సిసలైన జగజ్జేత
భారత స్వాతంత్రోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహం చాలా ప్రముఖమైనది. ఆ సమయంలో ఉప్పుని చేతిలో పట్టుకుని “ఈ ఉప్పుతో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించబోతున్నాను..” అని గాంధీజీ పలికిన ఉత్తేజితమైన పలుకులు భారతీయులందరిలో ఉద్వేగాన్ని, స్వాతంత్ర కాంక్షను రగిలించింది. అలా మొదలైన ఉప్పు సత్యాగ్రహాన్ని/దండి యాత్రను బ్రిటిష్ వారిపై దండయాత్ర లాగా మార్చగలిగిన, పటిష్టమైన నాయకుడు మహాత్ముడు. ఈ మాట చెప్తూ బాపూజీని ‘సిసలైన జగజ్జేత’ అని కొనియాడారు సిరివెన్నెల. ప్రపంచ అధినేతగా తనను తాను నిరూపించుకుంటానని అలెగ్జాండర్ ద గ్రేట్, తన గురువు అరిస్టాటిల్‌తో చెప్పినట్లు, అనుకున్నంత విజయం అతడు సాధించకపోయినా, (బహుశా అప్పట్లో అలెగ్జాండర్ దండయాత్రల ద్వారా స్థాపించినదే ఒక సువిశాల సామ్రాజ్యం), అప్పటి వరకు చేసిన యుద్ధాల్లో ఓటమిని చవిచూడకపోవడం, ప్రపంచాన్ని జయించాలన్నంత గొప్ప సంకల్పం వల్లే, అతనికి ‘విశ్వ విజేత’ అనే బిరుదు వచ్చింది. కానీ అహింసతో స్వాతంత్ర్యాన్ని సాధించిన మహాత్ముడి సంకల్పబలం ప్రపంచానికి మరో మారు చాటడానికేమో సిరివెన్నెల మహాత్ముడిని, ‘సిసలైన జగజ్జేత’, అని నిర్వచించి ఉండొచ్చు.
చరఖా యంత్రం చూపించి, స్వదేశీ సూత్రం నేర్పించి,
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడురా జాతిపిత.. సంకల్ప బలం చేత
రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం, స్వదేశీ సూత్రం గాంధీజీ తత్వం. చరఖాపై నూలు వడుకుతూ, స్వదేశీ వస్తువుల గొప్పదనాన్ని చాటుతూ, బ్రిటిష్ విదేశీయతను బహిరంగంగా ఎదిరిస్తూ ఉద్యమాన్ని నడిపాడు బాపూజీ. గాంధీజీని, Half Naked Saint అంటూ Winston Churchill, అపహస్యం చేస్తే, దానికి ప్రతిగా గాంధీజీ.. “మా ముడి నూలును ఎగుమతి చేసుకున్న Manchester, Liverpool వంటి వస్త్ర పరిశ్రమల వల్ల, మా స్వదేశీ నూలు పరిశ్రమ ఎంత బలహీనమైందో చెప్పడానికి ఇలా వేసుకున్నాను”, అని సమాధానమిచ్చారట! అత్యంత శక్తివంతమైన నావిక, సైనిక, ఆయుధ బలగాలు కలిగిన సామ్రాజ్యవాదం శక్తి అయిన బ్రిటిష్ వ్యవస్థ మొదటి ఏనుగును, అతి సున్నితమైన నూలుపోగుతూ గాంధీజీ బంధించి అదుపులోకి తెచ్చుకోగలిగాడు. ఎలా? తన సంకల్పమనే మహా మంత్రం చేత, తన సంకల్ప బలం చేత, బ్రిటిష్ వారి కొమ్ములు వంచి, తన లక్ష్యాన్ని చేరుకున్నాడు, గాంధీ. పైకి మామూలుగా కనిపించే ఈ పదాల వెనుక, ఇంత విస్తృతమైన సమాచారాన్ని ఇమడ్చగలగడం సిరివెన్నెలకే సాధ్యమేమో!
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
The phrase “The Empire on which the Sun never sets” (Spanish: el imperio donde nunca se pone el sol) was used to describe certain global empires that were so extensive that it seemed as though it was always daytime in at least one part of its territory.
సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా అభివర్ణించుకునే ప్రతి సామ్రాజ్యాన్ని ఎదిరించి, ఓటమిని చవిచూపించిన ‘క్రాంతి’గా సిరివెన్నెల గాంధీని కొనియాడారు. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చి, చీకట్లో తొలగిపోయి, స్వేచ్ఛ భానుడు భారతదేశంలో ఆవిర్భవించాడు, 1947 ఆగస్టు 15 నాడు.
పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి.
మహాత్ముడు లోని గొప్పదనాన్ని మరో మారు గుర్తు చేశారు సిరివెన్నెల.. ‘పదవులు కోరని పావన మూర్తి’.. అంటూ.. అయితే అంతటి పావనమూర్తికి సింహాసనం ఎక్కడుంది అంటే.. భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన.. ఆయనతో సమున్నత స్థానమే! సామాన్య ప్రజలే కాకుండా, రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాల్సిన, నిస్వార్థపరత్వం ఇది.
Generations to come will scarce believe that such a one as this walked the earth in flesh and blood. – Albert Einstein, 1948.
ఇలాంటి మహనీయుడొకడు, సజీవంగా ఈ భూమిపై నడయాడాడు అంటే నమ్మడానికి ముందు తరాలు భయపడతాయేమో! అన్న ఐన్‌స్టీన్ మాటల్ని తన పాటలో పలికించారు సిరివెన్నెల. భావితరాలు ఇంతటి మహనీయుడిని గురించి తెలుసుకొని, తమ భవితకు మరచిపోని స్ఫూర్తిని నింపుకోవాలని,
తరువాత తరానికి ఈ విషయాన్ని తెలియజేయడం మనందరి బాధ్యత అనీ! సిరివెన్నెల మనందరినీ హెచ్చరిస్తున్నారు.
గాంధీ మరణానంతరం, నెహ్రూ జాతి ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇది. ఈ కాంతి ఈ తరానికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచమంతటికీ ప్రసరిస్తుంది, తరతరాల వరకు ప్రసరిస్తుందని.. నెహ్రూ గాంధీకి నివాళి అర్పించారు.
“Friends and Comrades, the light has gone out of our lives and there is darkness everywhere. The light has gone out, I said, and yet I was wrong. For the light that shone in this country was no ordinary light. The light that has illumined this country for these many years will illumine this country for many more years, and a thousand years later, that light will be seen in this country and the world will see it…” – Jawaharlal Nehru.
ఈ పాటని, ఒక పాఠ్యాంశంగా చేర్చి, విద్యార్థులందరికీ పాఠశాల దశలోనే స్ఫూర్తిని నింపాలన్నది బాలుగారి బలమైన కోరిక. గాంధీజీ భావజాలాన్ని, సిద్ధాంతాలను, స్వభావాన్ని.. వర్ణిస్తూ ఎన్నో పాటలు ఉన్నా, ఇంత అద్భుతంగా, ఇంత నిశితంగా, ఇంతగా మనసుకు హత్తుకునేలా ఉన్న పాట మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో! జనగణమన అధినాయకా జయహో! భారత భాగ్య విధాతా జయహో! భారత స్వతంత్ర దాతా జయహో! ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రీ.. జయ జయహో!
Images Courtesy: Internet