అలనాటి అపురూపాలు- 192

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

కామిక్ విలన్ యాకూబ్

వెండితెర మీద ‘యాకూబ్’గా ప్రసిద్ధులైన భారతీయ సినీనటుడు యాకూబ్ ఖాన్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ పఠాన్ కుటుంబంలో జన్మించారు. ఆయన హాస్యపాత్రలకు, కామిక్ విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందారు.

3 ఏప్రిల్ 1904 న జన్మించిన యుకూబ్‌ఖాన్ మెహబూబ్ ఖాన్, భారతీయ తెరపై ఎదురులేని విలన్‍గా కొనసాగారు. యవ్వన దశలో కూడా కొంచెం ‘విలన్’గానే ఉండేవారు. ఆయనకి పాఠశాల అంటే ఇష్టం ఉండేది కాదు. హాలీవుడ్ బ్రేవ్ స్టంట్ కింగ్ అయిన ఎడ్డీ పోలో సినిమాలు, ఇంకా పోరాట దృశ్యాలతో కూడిన అన్ని సీరియల్స్ చూసేవారు. యాకుబ్ చిన్న వయస్సులోనే ఇంటి నుండి పారిపోయారు, మెకానిక్, వెయిటర్ వంటి చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. తర్వాత SS మధుర అనే ఓడలో కిచెన్ వర్కర్‌గా చేరారు. లండన్, బ్రస్సెల్స్, పారిస్ వంటి వివిధ ప్రదేశాలను చూశాకా, ఆ ఉద్యోగాన్ని వదిలేసి కలకత్తాకు తిరిగి వచ్చారు. అక్కడ టూరిస్ట్ గైడ్‌గా పనిచేశారు, వేర్వేరు ఉద్యోగాలు చేశారు. 1924లో, బొంబాయికి వెళ్లి శారదా ఫిల్మ్ కంపెనీలో చేరారు. ఎడ్డీ పోలోని ఆదర్శంగా తీసుకుని, సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అప్పట్లో ఆయన వయసు ఇరవైలలో ఉండేది, గడ్డం లేకుండా అందంగా కనిపించేవారు – ఇది 1924ల నాటి మాట; అప్పటికి విలన్‌గా నటించే సందర్భం రాలేదు. జూనియార్ ఆర్టిస్టుగా ప్రారంభించి, కొద్దికాలంలోనే మరిన్ని ముఖ్యమైన పాత్రలు పోషించే స్థాయికి ఎదిగారు. ఉల్లాసంగా, చురుకుగా, పురుషోచితంగా ఉండే ఆయనకి మంచి పాత్రలు దొరికాయి. స్టంట్ చిత్రాలలో అవసరమైన అన్ని విన్యాసాలను ఆయనే స్వయంగా ప్రదర్శించారు. ఆయనకి డూప్‍లు లేరు. ఓడలో శ్రామికుడిగా పొందిన అనుభవం ఆయన కండరాలను పటిష్టం చేసింది, పైగా ఎడ్డీ పోలో చిత్రాలను చూస్తూ, ఆయనేమీ ఖాళీగా కూర్చోలేదు!

ఒక సినిమాని పూర్తి చేయడానికి దాదాపు 4,000/- రూపాయలు అవసరమయ్యే ఆ కాలంలో, యూకుబ్ నెలకు 60/- రూపాయలు సంపాదిస్తూ, అధిక జీతం కలిగిన కళాకారుడయ్యారు. మూకీ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’ ఆయన మొదటి చిత్రం. సెట్స్‌లో చాలా సరదాగా గడిపేవారు. అప్పట్లో సినీ పరిశ్రమ ఒక నవజాత శిశువు లాంటిది, ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా శ్రమించారు, ఆడుతూ పాడుతూ తమ పనిని పూర్తిచేశారు.

సౌండ్ లేకపోవడంతో, తెర మీద నటీనటులు ఏదో మాట్లాడుతున్నారనే భావన కలిగించేలా పెదాలు కదపాల్సి ఉండేది. తత్ఫలితంగా, యాకుబ్, ఇతర తారలు ‘ఏదైనా చెల్లుతుంది’ అనే వైఖరిని అవలంబించారు. డైలాగ్‌ల కోసం వారు జోకులు, ద్వంద్వార్థాల మాటలు, ఇంకా రాయలేని మాటలను ఉపయోగించేవారు!

1931లో, యాకూబ్ తన మొదటి టాకీ, ‘రొమాంటిక్ ప్రిన్స్’లో నటించారు, టైటిల్ రోల్‌ను సమర్థవంతంగా పోషించారు, ఈ పాత్ర ఆయనకి బాగా ప్రాచుర్యం కల్పించింది. అయితే ఎల్లప్పుడూ హీరోల పాత్రలు పోషిస్తూ, ప్రతి సినిమాలో ‘ప్రేయసిని పొందే’ పాత్రల్లో నటించడం ద్వారా తాను తన సమయాన్ని, ప్రతిభను వృథా చేస్తున్నానని భావించారాయన. విలన్‍గా తాను బాగా రాణించగలననీ, ప్రతినాయక పాత్రలలో ఎంతో భవిష్యత్తు ఉందని ఆయన గ్రహించారు. పైగా తన ఎడమ చెంపపై ఉన్న ఓ పుట్టుమచ్చ కూడా విలన్ రూపంలో ఉపయోగపడింది. దుష్ట పాత్రలతో యాకూబ్ ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నారు, అప్పటివరకున్న వెండితెర విలన్‍లలో అత్యుత్తమ విలన్‍గా నిలిచారు. సాగర్ మూవీటోన్ బ్యానర్‌పై 1937లో ‘సాగర్ కా షేర్‌’లో నటించారు. ఈ చిత్రంలో బిబ్బో, పేసీ పటేల్, సంకట ప్రసాద్, రాజా మెహదీ, డేవిడ్ ఆయన సహనటులు. ‘ఔరత్’ (1940) సినిమాలో ఆయన పోషించిన ‘బ్రిజు’ పాత్ర మంచి ఆదరణ పొందింది, ఈ చిత్రంలో ఆయన నటన భారతీయ చలనచిత్రాలలో అత్యుత్తమ ప్రదర్శనగా పరిగణించబడుతుంది. నటుడు మహమూద్‍కి తగినన్ని అవకాశాలు లేక కష్టాల్లో ఉన్నప్పుడు – యాకూబ్ కోసం బాంబే టాకీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఆయన ఆర్థిక పరిస్థితి తెలిసిన యాకూబ్ – మహమూద్ గారికి ఒకటి లేదా రెండు రూపాయలు ఇచ్చేవారట.

“విలన్‍గా కంటే హీరోగా నటించడం చాలా సులభం” అని అనేవారు యాకూబ్. “అయినా, విలన్‌కి విదేశీ సినిమాల్లో ఇచ్చే గౌరవం మన సినిమాల్లో ఉండదు. ఇక్కడ నాలుగు అడుగుల ఎత్తు లేని హీరో కూడా విలన్‌ కంటే బలంగా కనిపించేలా చేశారు.” అన్నారాయన.

విదేశీ సినిమాలలో, ఆయన – వాలెస్ బీరీ, డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్ సీనియర్, ఇంకా హంఫ్రీ బోగార్ట్ వంటి – కఠినమైన మరియు సాహసోపేతమైన పాత్రలను పోషించిన నటులను అభిమానించారు. ముఖ్యంగా ఆయనకు బీరీ అంటే బాగా ఇష్టం. చాలా కాలం పాటు, సాహస చిత్రాలలో నటిస్తున్నప్పుడు యాకుబ్ ఈ ప్రసిద్ధ నటుడిని అనుసరించేవారు.

యాకూబ్ దాదాపు మూడు వందల చిత్రాలలో నటించారు, కానీ అన్నీ విలన్‌ పాత్రలు కాదు.

కొన్ని సంవత్సరాల తర్వాత, ఆయన కెరీర్‍లో కొత్త మలుపు తీసుకున్నారు, ఆయన బహుముఖ ప్రజ్ఞ గురించి ఎటువంటి సందేహం లేదు. “నేను కామెడీలోకి ప్రవేశించాను,” అని యాకూబ్ నవ్వుతూ చెప్పారు. “నేను ప్రజలను నవ్వించగలనని ఎప్పుడూ అనుకోలేదు” అన్నారు.

కానీ ఆయన జనాలని నవ్వించేవారు, ఇంకా జనాల పొట్టలు చెక్కలు చేయడానికి గోపే, అఘా వంటి హాస్యనటులతో జతకట్టారు. గోపే-యాకుబ్ ద్వయం చాలా ప్రజాదరణ పొందింది, తరచుగా ఫిల్మ్ క్రెడిట్స్‌లో ఆయన పేరును – మరియు లారెల్-హార్డీ ఆఫ్ ఇండియా: గోప్ & యాకుబ్ – మీ అభిమాన ‘యాకుబ్’ అని వేసేవారు.

తన కెరీర్ ప్రారంభంలో, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన యాకూబ్ ‘షాహీ లూటేరా’, ‘సాగర్ కా షేర్’ వంటి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ‘ఉస్కీ తమన్నా’ సినిమాను ‘హర్ లాస్ట్ డిజైర్’ అని కూడా పిలుస్తారు. 1939లో సాగర్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి యాకూబ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యాకూబ్, మాయ, భూడో అద్వానీ, కౌశల్య, సంకట ప్రసాద్, సతీష్, పుత్లీ నటించారు.

1949లో యాకూబ్ తన జీవితంలోకెల్లా పెద్ద పొరపాటు చేశారు. ఇండియన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన ‘అయె’ (Aiye) – ఘోర పరాజయం పాలయ్యింది. ఈ చిత్రానికి నషద్ (షౌకత్ దేహ్ల్వి) సంగీతం అందించారు, గాయని ముబారక్ బేగం‌కు నేపథ్య గాయనిగా ఇది మొదటి చిత్రం. యాకూబ్ సమీప బంధువు అల్లావుదీన్ ఈ చిత్రానికి పాటల రికార్డిస్ట్. అయినప్పటికీ, యాకూబ్ ఈ చిత్రంతో చాలా డబ్బు పోగొట్టుకున్నారు, అయినా చక్కని హాస్యంతో “‘అయే’ సినిమాతో ‘పైసా జాయే” అని అన్నారు!

ఆర్.ఎస్. చౌదరి, శాంతారామ్, నితిన్ బోస్, మెహబూబ్ ఆయన అభిమాన దర్శకులు. మెహబూబ్ గారి ‘ఔరత్’లో సర్దార్ అక్తర్ ‘గూండా’ కొడుకుగా యాకూబ్ మరపురాని, గొప్ప పాత్రని పోషించారు. అది ఇప్పటికీ భారతీయ తెరపై అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా ఉంది.

‘వతన్’, ‘జడ్జ్‌మెంట్ ఆఫ్ అల్లాహ్’, ‘పతంగా’, ‘గ్రహస్తి’, ‘దీదార్’, ‘మాల్కిన్’ వంటివి ఆయన నటించిన విజయవంతమైన చిత్రాలలో కొన్ని.

సోహ్రాబ్ మోడీ గారి ‘వారిస్’లో విలన్‌గా నటించారు. ధరమ్‌సే గారి ‘ఈనామ్’లో హాస్య పాత్రను పోషించారు.

మతపరమైన ఆచారాలను చక్కగా పాటించే యాకూబ్‍ను ఆయన స్నేహితులు ‘మౌలానా’ అని పిలిచేవారు. వీళ్ళదో బృందం. ఆయన వారితో సులభంగా కలిసిపోయేవారు, మంచి స్వభావం గల యాకూబ్ అందరికీ సహకరించేవారు. స్టూడియోలలో ఆయనకి నచ్చని ఏకైక విషయం అక్కడ వడ్డించే భోజనం. తన ముప్పై సంవత్సరాల సినీజీవితంలో ఆయన ఎన్నడూ స్టూడియోలో భోజనం చేయలేదట. ‘నటన’ తప్ప మరేతర అలవాట్లు లేని యాకుబ్‌కు ఒకే ఒక అభిరుచి ఉంది – అదే బిలియర్డ్స్. నటన తర్వాత అంతటి ఇష్టమైనది.

షూటింగులు లేని సమయంలో ఇస్లాం జింఖానా మైదానంలో, తన మిత్రులతో, తనకెంతో ఇష్టమైన ఆటలో లీనమయ్యేవారు యాకూబ్.

అయితే నటన ఆయన తొలి ప్రాధాన్యత. నటన కాకుండా తాను వేరే ఏదీ చేయలేనని ఆయన భావించేవారు. ‘గొప్ప విజయాల’ను ‘గొప్ప వ్యక్తుల’కు వదిలివేసి జీవితంలో చాలా తృప్తిగా ఉండేవారు.

చలనచిత్రాలు కళాత్మకమైనవిగా చెప్పుకోగలిగే పాత రోజులను తలచుకునేవారు. ప్రేమ సాహిత్యం, సర్వాలంకారాలతో కూడిన సెట్‌ల కంటే నటీనటులు ముఖ్యమైన వాళ్ళుగా ఉన్న పాత రోజులను ఆయన తరచూ గుర్తుచేసుకునేవారు. “కానీ, కాలం మారిపోయింది. ఒకప్పడు హీరో అంటే గౌరవం ఉన్న వ్యక్తి. ఈనాటి హీరో – అవకాశం లభించినప్పుడల్లా అద్దంలోకి చూసుకుంటూ తన అందంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. ఆ మంచి పాత రోజులు ఇక రావు” అన్నారు.

యాకూబ్ తన 54 సంవత్సరాల వయస్సులో, 24 ఆగస్టు 1958న కన్నుమూశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here