[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘జలగా రావ్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]“స[/dropcap]రిగ్గా సమయం పది గంటలైంది. బ్యాంకుకి బయలుదేరండి” చెప్పింది లక్ష్మమ్మ.
“కంగారు అవసరం లేదు. బ్యాంకు గదులు తెరిచేది పదికే అయినా, ఇప్పుడప్పుడే ఎవరూ రారు. పొరబాట్న వెళ్ళినా, ‘మేం ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే డేగల్లా వాలిపోవాలా! బ్యాంకు తెరిచీ తెరవగానే మాపై పడి ఎందుకీ ఏడుపులు’ అంటూ ఆ లోన్ ఆఫీసర్ చిరాకు పడతాడు. చిందర వందర తొందర పనికి రాదు అంటూ కసురుకుంటాడు” చెప్పాడాయన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో అని మరోమారు అతని గుడ్డ సంచిలో ఉన్న డాక్యుమెంట్స్‌ని సరిచూసుకుంటూ.
శేఖరం గారు, హౌస్ లోన్ కోసం జూజూబి అనే బ్యాంకును సంప్రదించారు. డాక్యుమెంట్లన్నీ చెక్ చేసి తప్పకుండా లోన్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది అని అంటూనే ఒక్కోసారి ఒక్కోటి తెమ్మనడం జరిగేది. మొదట ఎప్పుడో తీరిపోయిన గోల్డ్ లోన్ తాలూకూ రసీదు కావాలని గోలపెడితే ఇచ్చాడు. తరువాత వెహికల్ లోన్ పేరు మీద ఒక నాలుగు వందలు రూపాయలు డ్యూ కట్టాల్సి ఉందనీ, అది పూర్తిగా కట్టేసినట్టుగా రశీదు పట్టుకురమ్మని పోరు పెడితే, సరే అని వెళ్ళి, వాళ్ళని బ్రతిమాలీ బామాలి ఆ డబ్బులు కట్టి ఆ రశీదు తెచ్చాడాయన. ఇలానే గత నెలన్నరగా జరుగుతోంది. అన్నీ ఇచ్చేశారు కాబట్టి సోమవారం వస్తే, విషయం చెబుతా అనడంతో ఈ రోజు బ్యాంకుకు బయలుదేరాడాయన.
కౌంటర్ నెంబర్ ఏడుకి వెళ్ళి, “సార్ నమస్తే. నా హోం లోనూ” అంటూ నవ్వాడు శేఖరం.
“మీరా” అని చిరాగ్గా చూసి, “మరో రశీదు కూడా తేవాల్సి ఉండొచ్చు” అన్నాడు జలగా రావ్ సారీ జలజా రావు
దాంతో కొంచెం ఒళ్ళు మండిన శేఖరం, “ఒకేసారి చెప్పొచ్చు కదా? ఆ చెక్‍లిస్ట్‌లో ఉన్నవన్నీ తెచ్చి తగలడ్డాక కూడా మళ్ళీ, మళ్ళీ ఇవన్నీ తెమ్మనడం ఏవైనా బావుందా చెప్పండి” అడిగాడు.
బదులుగా “మేము స్ట్రిక్ట్‌గా ఉండాలండీ, తప్పదు. లేకపోతే బ్యాంకులు ఎలా నడుస్తాయి చెప్పండి. బ్యాంకు ఉద్యోగులంటే అందరికీ లోకువే” చెప్పాడు జలజారావ్ పేద్ద దేశాన్ని ఉద్ధరించే వాడిలా ఫోజు కొడుతూ.
“నీ బొంద, కమీషన్లకీ, పర్సెంటేజీలకీ కక్కుర్తిపడి, ఎగ్గొట్టే వాళ్ళకి ఎదురెళ్లి మరీ ఇస్తారు కానీ, నా లాంటి మధ్య తరగతి వాడి మీద మాత్రం పేద్ద అజమాయిషీ చేస్తున్నాడు” అనుకున్నాడు మనసులో.
ఆ తరువాత కొద్ది నిమిషాలకి మళ్ళీ శేఖరాన్ని పిలిచి, “శేఖరం గారూ మీకు లోన్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నిన్నటితో మీకు అరవై అయిదు దాటాయి. పైగా మీ క్రెడిట్ స్కోర్ కూడా ఏడువందల యాభైకి తక్కువుంది. ఇలానే రీపేమెంట్ లాంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కనుక ఈ హోం లోన్‌కి మీ అబ్బాయిలను కూడా సహ దరఖాస్తుదారులుగా చూపండి, సరిపోతుంది” చెప్పాడు జలజా రావ్.
పళ్ళు నూరి, బుర్ర గోక్కుని, ఓ నిట్టూర్పు విడిచి, “చెరువులో దిగాక జలగకి భయపడితే ఎలా” అని అతనికి వినబడేలా అని మళ్ళీ కాళ్లీడ్చుకుంటూ కొంప చేరాడు. జలజా రావ్ చెప్పినట్టే వాళ్ళ అబ్బాయిలతో కలిసి వచ్చి ఐడి ప్రూఫ్స్, పే స్లిప్పులు, మిగతా డాక్యుమెంట్లు పట్టుకుని వచ్చి మధ్యాహ్నం ఇచ్చేసి సంతకాలు వగైరా కూడా పూర్తి చేశారు.
తరువాత జలజా రావ్ అన్నీ పరిశీలించి, మూతి విరుస్తూ “అబ్బే స్థలం తాలూకు లింకు డాక్యుమెంట్లు సరిగా ఉన్నట్టు అనిపించడం లేదు నాకు. చూద్దాం రేపు రండి” అన్నాడు.
ఇంటికి వచ్చిన శేఖరానికి అతని బావమరిది గిరి కనిపించాడు. “ఏంటి బావ, ఎక్కడి నుండీ రావడం” అడిగాడతను చిరునవ్వుతో.
“బ్యాంకుకి వెళ్లి వచ్చాను. హోమ్ లోన్ కోసం అప్లై చేశానులే. నువ్వు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎంచక్కా అప్పు తెచ్చి కట్టేశావ్ కాబట్టి, ఇలాంటి కష్టాలు నీకు తెలియవులే” అన్నాడు శేఖరం.
“భలేవాడివే బావా! నేను కూడా ఈ జూజూబి బ్యాంకులో నుండే యాబై లక్షల రూపాయలు లోన్ తీసుకుని ఇల్లు కట్టడం జరిగింది తెలుసా” చెప్పాడు హుషారుగా నవ్వుతూ.
“నీది చిన్న ఉద్యోగం, అయినా నీకు అంత పెద్ద లోను ఎలా వచ్చింది. పైగా నువ్వు పెద్ద చదువుకోలేదు. అయినా అన్ని డాక్యుమెంట్లు ఎలా ఇచ్చావురా నాయనా! నువ్వు గ్రేట్” మెచ్చుకోలుగా చూశాడు శేఖరం.
“నేను కొంత తెలివిగా వ్యవహరించానులే. నా స్నేహితుడు చేసిన తప్పు నేను చేయలేదు. అందుకే లోను వేగంగా వచ్చేసింది నాకు” చెప్పాడు గొప్పగా కళ్లెగరేస్తూ
“అలాగా! ఇంతకీ నీ స్నేహితుడు చేసిన తప్పేవిటీ” అడిగాడు శేఖరం ఆసక్తిగా అతని మొహంలోకి చూస్తూ .
“ఓ ఇల్లు కట్టుకోవాలని నేరుగా బ్యాంక్‌కి వెళ్ళాడు నా స్నేహితుడు సుబ్బారావ్. అలా వెళితే ఎన్నో డాక్యుమెంట్స్ అడిగారాట. అవన్నీ ఇస్తూ ఇస్తూ వచ్చాడట.. ఆఖరికి ఏడెనిమిది నెలల తరువాత లోను వచ్చే అవకాశం ఉందని వాళ్ళావిడకి ఫోన్ చేశారట. ఆవిడ బోరుమని, ఆయన లోనూ, లోనూ అని చెప్పులరిగేలా తిరిగి పోయారు. మీ డబ్బుతో ఆయన సమాధి కట్టించనా వెధవా అందట. ఆ బ్యాంక్ వాడు, ఆమె మాటలు పట్టించుకోకుండా, అలాగా అయితే ఆ సమాధి ఇంజనీరింగ్ ప్లాన్, మున్సిపల్ అప్రూవల్ లాంటివి సిద్ధంగా ఉంచుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసాడట దరిద్రుడు. కనుక, మనకి అలా జరగకూడదంటే, మధ్యలో ఓ చంచా ఏజెంట్‌నో లేదా లోన్లు ఇప్పిస్తాం అనే సంస్థలనో పట్టుకోవాలి. నేనూ అదే చేశాను. ఇలాంటి బాధలు లేకుండా జీవకుమార్ అనే మీడియేటర్ని పట్టుకున్నాను. అతను రెండు పర్సెంట్ అడిగాడు. అంటే ఒక లక్ష రూపాయలు. సరే అనేసాను. దాంతో సంతకాలకు, అప్లికేషన్లు నింపడానికి కూడా ఓ అసిస్టెంట్‌ని మా ఇంటికి పంపాడు. దాంతో నా పని చాలా సులువు అయిపోయింది. లోనూ వచ్చేసింది.” చెప్పాడు గొప్పగా.
దానికి శేఖర్ ఓ నిట్టూర్పు విడిచి, “అలాగా! అందుకే కాబోలు ఇలాంటి మీడియేటర్లు, లోన్లు ఇప్పిస్తాం అనే సంస్థలు పెరుగుతున్నాయి ఈ మధ్య. ఇవి పుట్టగొడుగుల్లా పెరిపిగిపోయి, కస్టమర్ల పాలిట పావు పడగల్లా తయారవుతున్నాయి.. ఇలాంటి కొన్ని బ్యాంకులు వల్ల వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ వాళ్ళు, ఆన్లైన్ యాప్ లలో మోసాలు చేసే వారు, హాయిగా బూట్లకి దుమ్ము అంటకుండా కోట్లు సంపాదిస్తున్నారు. బాంకు రుణాలు రాని వారికి వల వేసి, ఎక్కువ వడ్డీతో మోసం చేసి వారి ప్రాణాలు తీస్తున్నారు. అవసరం ఉన్న మధ్యతరగతి మానవుడు ఎక్కడకి పోతాడూ. అటు జూజుబి లాంటి పెద్ద బ్యాంకుల జిమ్మిక్కులకి విసిగి, అలాంటి కాల్ మనీ రాకెట్ ముఠాల చేతిలో పడి పాడై పోతారు. అలాగే అందరూ, మీడియేటర్లు అడిగినంత ఇవ్వలేరు కదా గిరి. అలా ఇవ్వడం కొంతమందికి ఇష్టం కూడా ఉండదు” చెప్పాడు శేఖరం.
మరుసటి రోజు బ్యాంకుకు వచ్చిన శేఖరాన్ని చూసిన జలజా రావు, “వచ్చారా, మంచిది మరొక్క డాక్యుమెంట్” అని ఏదో చెప్పే లోపు,
“ఎన్నిసార్లు ఎన్నని చెప్తావ్? కొన్ని వందలు జెరాక్స్‌లు అడిగావు, ఇచ్చాను. ఏవేవో రసీదులు అడిగావ్ తెచ్చాను.. ఎన్నో డాక్యుమెంట్లు నింపించావ్, నింపాను. వేళాకోళంగా ఉందా” అడిగాడు.
దాంతో జలజా రావు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిన తరువాత, “సరే సార్. మీరు ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక నుంచి ఎలాంటి ఫారమ్స్ నింపాల్సిన పనిలేదు. ఎందుకంటే మీ లోను ఆగిపోయింది” చెప్పాడు
అతని వంక తినేసేలా చూస్తూ, ‘ఇలాంటి కొన్ని బ్యాంకులు వలన మిగిలిన వాటికీ చెడ్డపేరు. మీలాంటి వెధవల్ని బాగుచేయలేం’ అని మనసులో అనుకుని, ఆ డాక్యుమెంట్లు చించి చెత్త బుట్టలో వేసాడు.
అది చూసిన జలజా రావ్, “అందుకే సులువు తెలుసుకోవాలి. ఇన్ని సార్లు మిమ్మల్ని బొంగరంలా మా బ్యాంక్ చుట్టూ తిప్పినా, మీరు నాకు కావాల్సింది ఏవిటో మాత్రం గ్రహించలేదు. అది గ్రహించి ఉంటే, నాకు మీపై ఆగ్రహానికి బదులు అనుగ్రహం చూపించి మీ లోన్ క్లియర్ చేసేవాడ్ని. దాంతో మీ పని సులువు అయిపోయేదిగా! చూడండి ఇపుడు ఏమైందో” అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ.
“చూశాను, టి.వి.ల్లో అప్పుడప్పుడూ చూశాను,. మీలాంటి కొందరే, లోన్లు ఇస్తామని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, పనిచేసే బ్యాంకులోనే డబ్బులు దారి మళ్ళించడం, రైతు రుణాలు పేరు చెప్పి డబ్బు కాజేయడం ఇలా చాలా చూశాను” చెప్పాడు శేఖరం
“నువ్వు ఎన్ని చెప్పినా, నాకు డబ్బులు ఇవ్వకుండా నీ పని అవ్వదు.”
“కానీ నీ పని అయిపోయిందిపుడు. నాలాగా ఇంకెవరూ నీ చుట్టూ తిరిగి అరిగి మానసికంగా విరిగిపోకూడదని, నేను ఓ ఛానల్‌తో కలిసి స్టింగ్ ఆపరేషన్‌కు ఒప్పుకున్నాను. నీ వాగుడు లైవ్ చూస్తున్నారు ప్రేక్షకులు” చెప్పడంతో కళ్ళు తేలేశాడు జలగా రావ్. బహుశా అదే సరైన పేరు అతనికి.