[డా. కోగంటి విజయ్ రచించిన ‘కొత్త ఉదయాలు’ అనే కవితని అందిస్తున్నాము.]
~
[dropcap]రెం[/dropcap]డు వారాల క్రితం మిత్రుడొకడు తారసపడ్డాడు
మంచి ఉదయానికై వేచి చూస్తున్నానన్నాడు
మంచి ఉదయమంటే ఎలా ఉంటుందన్నాను
మనసును సంతోషంగా ఉంచేలాంటిదనీ
ఏ దిగులూ ఉండనిదనీ
మనుషులను మనుషుల్లా పలకరించేదనీ
అసూయలకు అవమానాలకు తావీయనిదనీ
స్వార్థాన్ని తలపుకు కూడా తేనిదనీ
స్వచ్ఛమైన నవ్వుల్ని మెరిపించేదనీ
హృదయాలను తేలిక పరచి వూరట నిచ్చేదనీ
భుజం తట్టి ధైర్య పరిచే స్పర్శ లాంటిదనీ చెప్పాడు
ఈమధ్య మళ్ళీ కనిపిస్తే అడిగాను
అలాంటి ఉదయం దొరికిందా అని.
ఆలోచిస్తూ చిన్నగా నవ్వి
అన్నీ కలిసున్న ఉదయాలు దొరకడంలేదనీ
దొరికిన వాటితో సమాధాన పడుతున్నాననీ చెప్పాడు
ఇంకొంత సేపాగి
దిగులు లేని మనుషులుండరనీ
ఉన్నంతలో పూలు పళ్ళూ పంచే చెట్లలా
నవ్వుల్ని సంతోషాన్ని పంచుకోవాలనీ చెప్పాడు
రోజూ కొత్త ఉదయాలకై వెదక నవసరంలేదనీ
వెలుగై నిలిచే నిష్కల్మషమైన మనుషుల్లోనూ
మనల్ని మనలాగా నిలబెడుతున్న దీపాల వంటి వాళ్ళ కళ్ళ లోనూ
కరుణను నింపుకున్న నదులై మనసుల దాహాన్ని తీర్చే వారిలోనూ
రోజూ నులి వెచ్చటి ఉదయమొకటి వెలుగిస్తూ ఉండడాన్ని చూశాననీ కూడా చెప్పాడు.
నేనిపుడు కొత్త ఉదయాలలాటి మనుషులను వెదకటం మొదలెట్టాను.