[‘బ్రహ్మసూత్ర శివలింగము’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. జొన్నలగడ్డ మార్కండేయులు.]
[dropcap]కో[/dropcap]నసీమ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపుర మండలంలోని పేరవరం గ్రామము నాది. ఆత్రేయపురములోని మహాత్మాగాంధీ విద్యాసంస్థ ఉపన్యాసకునిగ పదవీవిరమణ, విశ్రాంత జీవితము. సప్తతి వయసు దాటింది. బంధుప్రీతిగ తరచు హైదరాబాద్ నివాసము. రెండునెలలుండి పేరవరము వచ్చిన నేను ఇటీవల మా శివాలయమును సందర్శించాను. మా శివాలయ పూజారి రాంబాబు “మన అర్చామూర్తి శివలింగము బ్రహ్మసూత్రము కలిగి ఉంది” అని చూపించాడు.
మా పేరవరము జొన్నలగడ్డ పేర్రాజు గారి పేరు మీద ‘పేర్రాజువరం’గా మొదట నిర్మించబడింది. ఈ జొన్నలగడ్డ పేర్రాజుగారు వత్సవాయి రాజవంశీకులవద్ద రాజోద్యోగి. ఆయన ఈ గ్రామనిర్మాణము గావించారు. కాని పేర్రాజు నామవ్యక్తుల పేర్లు అయోమయము కలిగించకుండా ఎవరీ పేర్రాజుగా – రాజోద్యోగి వత్సవాయి పేర్రాజుగా చెప్పుకోవడము జరిగింది. నియోగి బ్రాహ్మణశాఖలలో చాలామందికి పేరు చివర రాజు శబ్దము ఉంటుంది. వత్సవాయి క్షత్రియకులములో రాజు కులనామము ధ్వనించే పేర్రాజు పేరు లేదన్నది నిజము. జొన్నలగడ్డ పేర్రాజు నియోగి బ్రాహ్మణుడు.
‘పేర్రాజువరం’గా ఒకే భూభాగము. పేర్రాజువరం. కాటన్ దొర ఆనకట్ట నిర్మాణము జరిపిన తరువాత భూభాగం మధ్య లోంచి కోనసీమను తాకుతూ తవ్వబడిన గోదావరి కాలువ ప్రవహము సాగుతోంది. కాలువ కీవలి ఆవలి భాగాలుగా ఇప్పుడీ భూభాగము పేరవరం, రాజవరం అనే స్వతంత్ర ప్రతిపత్తి గల రెండు పంచాయితీ రెండు గ్రామాలుగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ రెండు గ్రామాలలోను జంటగ్రామాలను ధ్వనిస్తూ స్థలహక్కులు కలిగి ఉన్నాయి.
పేరవరం శివాలయానికి ఉమారామలింగేశ్వరాలయమని పేరు. ఒక ఆసక్తికర విషయం ఉంది. కోనసీమ ప్రాంతమంతా దండకారణ్యప్రదేశముగా రాముడు సంచరించాడని స్థలపురాణాలున్నాయి. రావణ వధానంతరము కూడా పుష్పకములో అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. ఆగిన చోట శివలింగ ప్రతిష్ఠలు చేసాడన్నది నమ్మకము.
కోనసీమలో పునర్నిర్మాణము, లేదా కొత్త గ్రామాల రూపకల్పనలో శివలింగాలు దొరికేవి. పేరవరం గ్రామ నిర్మాణమప్పుడు దొరికిన శివలింగముగా రామలింగేశ్వరుని పేరు మీద శివాలయ నిర్మాణము జరిగింది. కాని గర్భగుడిలో ఒకే పానవట్టము మీద శివలింగముతో బాటు పార్వతిదేవి ప్రతిష్ఠ జరిగింది. నిర్మాణంలో ఉన్న గ్రామం తరచు గృహదహనాలకు గురయ్యేది. అందుచేత పార్వతిని తొలగించారు. అంతరాలయంలో రెండు గూడులు కట్టారు. ఎడమ వైపు వినాయకుడు, కుడివైపు ఉమ పేరుతో పార్వతిని ప్రతిష్ఠించారు. పేరు ఉమ అయినా పార్వతిగానే భక్తులు పిలవడం ఉమారామలింగేశ్వరుడికి విశేషముగా ఈ దేవాలయము నిలుస్తుంది.
నా చిన్నప్పుడు అంతరాలయంలోకి తప్ప గర్భగుడిలోకి అర్చకుడికి మాత్రమే ప్రవేశము. తరువాత తరువాత శివుడు అభిషేకప్రియుడు కాబట్టి స్వయంగా అభిషేకము చేసుకోవచ్చన్న వాదన బలపడినప్పటినుంచి పూజారి సూర్యనారాయణ గారు నిష్కల్మషుడు గావడం, కాలం మారింది కనుక అభిషేకము స్వయంగా ఒక లక్షపత్రి పూజలో చేసుకునే అవకాశమిచ్చారు. మా శివలింగము మీది గీతలను గురించి అడిగితే యజ్ఞోపవీతమని చెప్పారు. బ్రహ్మసూత్రమునకు నిఘంటు అర్థముగా ఇప్పటికీ సరైనదే అనిపిస్తుంది. బ్రహ్మసూత్రం శివలింగంగా ఇప్పటి పూజారి రాంబాబు అది బ్రహ్మసూత్రమని గుర్తించారని చెప్పడం కుతూహలం కలిగించింది.
ఆరాధన ఫలం కోరుకునే భక్తులకు కాలసిన కోణము ప్రత్యేకత. స్వయంభువుగా కావచ్చు, లేదా లింగనిర్మాణలో చాతుర్యముగల స్థలపురాణముగా కావాలి. ఉదాహరణకు, కుక్కుటేశ్వరుడు, కొప్పులింగేశ్వరుడు శివలింగముల అర్చామూర్తులున్నాయి. నిర్మాణాన్ని శాస్త్రీయ కోణంలో విశ్వదర్శన శాస్త్రీయ విశిష్ట నిరూపణ పాండిత్య ప్రకర్ష అవుతుంది. ప్రశంసనీయమే. కాని బ్రహ్మసూత్రం గురించి సంతృప్తికర అర్చామూర్తి భావన సామాన్యభక్తులకు అందదు. ప్రవచనకర్తకు మాత్రం భక్తిముక్తి సాధన ప్రబోధమునకు సరళశైలి వచనామృత అవకాశమయింది.
శివాలయము లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతిష్ఠించిన ప్రతి సర్వసాధారణమైన శివలింగములుపై కేవలము గీతలుగా కనిపించినవి, ఒకప్పుడు భావించినవి ఇప్పుడు మహిమాన్విత బ్రహ్మసూత్రముగల శివాలయములుగా గుర్తించి ఉత్సాహపడుతున్నారా? అది ఒక ప్రత్యేక రూపశిల్పాకృతి గల కారణమైన శివలింగమునకు పేరు అనే భావన కన్న బ్రహ్మసూత్రము అంటే ఏమిటి అన్నది అవగాహనకందుతుందా? గ్రంథాలలో వెతికి పట్టుకోగలమా?
పార్ధివ స్ఫటిక మరకత శివలింగములవలె బ్రహ్మసూత్రలింగనిర్మాణ విధివిధాన ప్రాముఖ్యత వివరణ లేదు. కాని ఊహాజనిత వ్యాఖ్యానము రుచించునట్లు చెప్పడము జరుగుతోందా?
బ్రహ్మసూత్రము అను గ్రంథముంది. శంకరాచార్యులు, రామానుజులు భాష్యములుగా బ్రహ్మసూత్రములు వివరణ జరిగింది. అపరమితమైన వ్యాఖ్యలకు సంస్కృత వాఙ్మయ చరిత్ర రచయిత మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు బ్రహ్మసూత్రార్థదీపిక అను చిన్నగ్రంథము రచించారని చెప్పుకున్నారు. శివుడు జీవనియంత. జీవాంతర్యామి. జీవకృతకర్మములకు అర్హమైన ఫలము నిచ్చునది నిర్విశేష నిర్లిప్త నిర్గుణుడు పరమాత్మగ అద్వైతమూర్తి. జగము నిక్కము కాదు. జీవేశ్వరులకు భేదము లేదు. ఈ వేదాంతసారమును చదివి అవగాహన చేసుకున్న లింగప్రతిష్ఠాపకులకు గుర్తుగా గీతలు కనిపిస్తున్న బ్రహ్మసూత్రనిర్మాణ శివలింగములు ఖ్యాతికెక్కాయన్నది నా ఉద్దేశము. బ్రహ్మసూత్రము ఉంటే గొప్పవి లేకపోతే సాధారణమైనవి అనే భావన పోవాలి. శివాలయము లేని గ్రామము అరుదు. కొసమెరుపుగా మా సమీప గ్రామము పులిదిండిలో శివాలయము లేదు. ఈ మధ్య కట్టారేమొ తెలియదు. ఆసక్తికర విషయము. ఎవరికీ విమర్శ కాదు. తెలుకోదగ్గది అపరిమితము అని చెప్పడము ఈ వ్యాసోద్దేశము.