ఆత్మ బంధం

10
4

[శ్రీ జి.వి. కళ్యాణ శ్రీనివాస్ రచించిన ‘ఆత్మ బంధం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]లో[/dropcap]పలి వస్తూనే కాళ్ళు చేతులు కడుక్కుని హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన శానిటైజర్ చేతులకు పులుముకుని నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన గదిలోకి వెళ్లే ముందు నేనే కాదు, మా ఇంట్లో అందరూ అదే చేస్తారు. నర్స్ నన్ను చూడగానే లేచి నిలబడింది. అప్పటికి ఆమె మా ఇంటికి వచ్చిన పన్నెండో నర్స్. ఈ నర్స్ గత సంవత్సరం నుండి మాతోనే ఉంటోంది.

ఇంట్లో మా పిల్ల లాగా, మాతో కలిసి పోయింది.

“ఎలా వున్నారు?” రోజూ నర్స్‌ను నాన్నగారిని గురించి నేను అడిగే సాధారణ ప్రశ్న.

ఇకపోతే, గత నాలుగున్నర సంవత్సరాలనుండి గదిలోకి వచ్చిన తరువాత నేను అడిగే మొదటి ప్రశ్న కూడా అదే. ఆమెకు పరిచయమే ఆ ప్రశ్న. ఆమెకి మాత్రమే కాదు అప్పటి వరకు ఇక్కడ పనిచేసిన నర్సు లు అందరికీనూ. అటునుండి వచ్చే సమాధానం కూడా నాకు అలవాటుగా వినే సమాధానం.

బలవంతంగా పులుముకున్న నవ్వు ముఖంతో “అలానే వున్నారు సార్” అంది నర్స్,

రోజూ ఇంటికి రాగానే ఆయన చెయ్యి నా చేతిలోకి తీసుకుని, ఆయనకు అర్థం కాక పోయినా ఆయనతో కొద్దీ సేపు, ఆట్లాడతాను.

తన కుర్చీ కాకుండా ప్రత్యేకంగా ఆ గదిలో నాన్నగారి కొరకు వచ్చిన వాళ్ళు కూర్చోటానికి వేసిన కుర్చీ చూపించింది.

“కూర్చోండి సార్.”

మూడు బెడ్ రూమ్‌ల ఫ్లాట్‌లో ఆ గది కేవలం నాన్నగారికి, ఆ నర్స్ ఉండటానికి మాత్రమే కేటాయించాము. చాలా శుభ్రంగా ఉంటుంది ఆ గది. ఎప్పుడూ శుభ్రంగా తుడుస్తారు. కుర్చీ జరుపుకుని కూర్చున్నాను.

నాన్నగారు కళ్ళు మూసుకుని వున్నారు. మనిషి బాగా ఎండి పోయారు. పుల్లలాగా ఉన్నారు. ముక్కులోనుండి ఆహారం వెళ్లే ‘నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్’ ఉంది.

మంచం మీద పరుపు అయన శరీరం ఒకేలా వున్నాయి చాలా పలుచగా. ఎముకల ప్రోగును మంచం మీద పడుకో పెడితే ఎలా ఉంటుందో అలా వున్నారు.

నాలుగున్నర ఏళ్ల నుండి మనిషి అలానే మంచం మీద ఉండి పోయారు. మెదడులో వచ్చిన వ్యాధి వల్ల శరీరంలో ఒకొక్క భాగం దెబ్బతింటూ, చచ్చు పడ్డట్టు అయ్యి ఇప్పుడు పూర్తిగా ఆహారం తీసుకోవడం కూడా పోయి ఆలా మంచానికి పరిమితం అయ్యారు. శారీరక జీవక్రియలు కూడా తెలియవు. మొదటి సంవత్సరం బానే నడవగలిగేవారు. అటు తరువాత అన్నీ మంచంలోనే, డైపర్ లోనే. గత మూడు ఏళ్ల నుండి అంతే తంతు. నాన్నగారి చెయ్యి చేతిలోకి తీసుకున్నాను. పుల్ల లాగా ఉంది. అసలు చెయ్యి పట్టుకున్నట్టు లేదు. ఒక సన్నని చీపురు పుల్ల కట్టను పట్టుకున్నట్టు ఉంది. వేళ్ళు పూర్తిగా ఎండి పోయి వున్నాయి. ఛాతి వంక చూశాను. బలహీనంగా గాలి తీసుకుంటున్నారు.

“ఈ రోజైనా లోపలి ఏవన్నా వెళ్ళిందా?” అడిగాను.

ఇంజక్షన్ సిరెంజ్ లాంటి దానిని ట్యూబ్‌కు పెట్టి ద్రవ పదార్థం లోపలి ఎక్కిస్తుంది నర్స్.

“ఇచ్చాను సార్, కక్కేశారు” అన్నది.

అంటే గత ఐదు రోజుల నుండి ఏమీ లోపలి వెళ్ళటం లేదు. కొద్దిగా నీరు తప్ప. నెల క్రితమే డాక్టర్ అన్నారు, ఇక వైద్యం కొత్తగా ఏమి వద్దు, ఇక ఏమీ చేయలేము అని. పోయేటప్పుడు ప్రశాంతంగా పంపిచేద్దాం అన్నారు. ఐనా ప్రాణం కొట్టుకుంటున్నది. అయన పోతే వచ్చే బాధ కన్నా అలా జీవచ్ఛవంలా మంచానికి అతుక్కుని దాదాపు ఆరు నెలలుగా మరీ ఇంత అద్వానంగా ఉండిపోవటం చాల బాధగా ఉంది.

అమ్మ వంటింటిలో నించి పిలిచింది.

“కాఫీ ఏవన్నా తాగుతావా? “అని. వద్దన్నాను.

మొదట్లో నర్సు సాయంతో నడిపించేది. క్రమ క్రమంగా మనిషి కృశించి ఇలా అయిపోయారు. నాలుగున్న ఏళ్ళు చాలా ఎక్కువ కాలం. నాన్నగారిని చూస్తే ఈ రోజు ఎందుకో చాలా దుఃఖం అనిపించింది. చిన్నప్పుడు మా చేయి పట్టి నడిపించిన చేతులు, ఎత్తుకుని ముద్దు చేసిన చేతులు అవి. ఆయన పాన్ తినే వాళ్ళు, ఎందుకూ నాకు ఆ వాసనా ముక్కుకు తగిలింది, అయన స్పర్శ, అయన దగ్గిర వచ్చే ఒక రకమైన వాసన ఎందుకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయో తెలియటం లేదు. పొట్టలో చెయ్యి పెట్టి కెలికిన భావన. చాలాకాలం తరువాత నా కళ్ళు ఎందుకో తడి అవుతున్నాయి. గురువారం సాయంత్రం అది. అమ్మ స్నానం చేసి దీపం వెలిగించింది. దీపం కాలుతున్న వత్తి నుండి వస్తున్న వాసన, ఆ పక్క గది నుండి వస్తున్నది.

వెనక నుండి చెయ్యి నా భుజం మీద పడింది. వసుధ.

“ఎప్పుడు వచ్చారు?” అని అడిగింది.

“ఇరవై నిముషాలు అయింది. నువ్వు మన బెడ్ రూంలో ఆఫీస్ కాల్‌లో వున్నావు” అన్నాను.

“రండి ఒక చుక్క కాఫీ తాగుదురు.”

“వస్తాను, నువ్వు వెళ్ళు” అన్నాను.

ఒకసారి నాన్నగారి వంకా, నా వంకా చూసి ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళింది వసుధ.

నాన్నగారి చెయ్యి ఇంకా నా చేతిలోనే ఉంది. తన రెప్పలని బలవంతంగా తెరిచి నా వంక చూసారు. మళ్లీ కళ్ళు మూసుకున్నారు.

అప్పుడు మళ్ళీ గుర్తుకు వచ్చింది, నర్స్ ఆయన్ను నడిపిస్తున్నపుడు అయన దగ్గరకు వెళ్లి అయన పెదవుల వద్దకు నా బుగ్గను చేర్చేవాడిని. ముద్దు పెట్టుకున్నట్టు శబ్దం చేసేవారు.

నేను “ఈయన ఒకే” అనే వాడిని. నర్సులు ఆ విషయం అమ్మతో చెప్పి – “మాట కూడా మాట్లాడని ఈ పెద్దాయన, అలా సార్‌ను ముద్దు పెట్టుకుంటారు ఏమిటి?” అని అడిగేవారు.

అమ్మ అనేది “ఆయనకు వాడు ఒక్కడే గుర్తు ఉన్నాడేమో!!” అని.

మరి ఇప్పుడు అలాంటివి ఏవీ లేవు. ఒక ఎముకల ప్రోగు ఆ మంచం మీద కుప్ప చేసి పడినట్టు ఉన్నారు.

ఎంత కాలం ఇలా? ఇరవై నాలుగు గంటలు కళ్ళు మూసుకుని ఆలా ఉండిపోతే, శరీరం నుండి వ్యర్థాలు బయటకు ఎప్పుడు పోతాయో తెలియదు!! నొప్పి, బాధ తెలియదు, ఏమో లోపల ఆయనకు తెలుస్తున్నాయేమో? మాట్లాడలేరు, ఇదీ అని చెప్పలేరు, శరీరం మీద వాలి కుడుతున్న దోమను కూడా విదిలించలేరు. ఆకలి తెలియదు, దాహం తెలియదు. గంటకు ఒకసారి కొన్ని నీళ్లు ఆ ముక్కులోని ట్యూబ్ ద్వారా నర్స్ ఎక్కిస్తుంది. అంతే. ఏమిటి ఈయనకు ఈ బాధ.

ఆలా ఆర్చుకు పొయ్యి మంచానికి అతుక్కు పోవటం వల్ల బెడ్ సోర్స్ కూడా వచ్చాయి. పుళ్లు. వీపు మీద పుళ్లు. చూడలేక పోయాను. ఇంకా ఈయన ఎంతకాలం జీవించి ఉంటారు?

‘మరో నెల, ఇంకా కొన్ని నెలలు, లేదా ఏడాది.’

అనుకుంటేనే భయం వేస్తున్నది. దుఃఖం తన్నుకు వస్తున్నది.

నర్స్ వంక చూసాను. “అమ్మను, వసుధను, రాజునూ రమ్మను” అన్నాను,.

నర్స్‌కు అర్థం కాలేదు అన్నట్టు చూసింది.. ‘ఒకసారి వాళ్ళను రమ్మను’ అంటూ “వసుధా!!” అని గట్టిగా నేనే పిలిచాను.

“ఏమైయింది?” అంటూ వచ్చింది వసుధ.

“రాజూ” అన్నాను. పద్నాలుకు ఏళ్ల రాజు, వసుధ, అమ్మ వచ్చారు.

ఏమైయింది? ఏమిటి అన్నట్టు చూసింది వసుధ నన్ను, నాన్నగారిని కంగారుగా.

చిత్రంగా నాన్నగారు జీవం లేని ఆ గాజు కళ్ళు తెరిచి నా వంక చూస్తున్నారు. రాజు సంశయంగా గుమ్మం దగ్గిర ఉండిపోయాడు. వాడికి గట్టి రూల్ పెట్టడం జరిగింది. ఆ గది లోకి రావద్దు అని. గత నెల నాన్నగారికి బాగా వాంతులు అవుతున్నప్పుడు, అనవసరమైన సమస్య అని నేనే వాడిని కట్టడి చేశాను. “లోపలి రావద్దు – దూరం నుండి తాతగారిని చూడు” అని. వాడు అదే చేస్తున్నాడు. అయన గత నెల నుండి వాడిని చూడటం లేదు. తల తిప్పి చూసే పరిస్థితీ కాదు ఆయనది.

“పర్వాలేదు, లోపలి రా” అన్నాను.

రాజు వచ్చి నా పక్క న నిబడ్డాడు. నాన్నగారు తీక్షణంగా వాడి వంక చూస్తున్నారు. కళ్ళు చాలా పెద్దవి అయ్యాయి. ఏదో చెప్పాలని, అనుకుంటున్నట్టు వున్నారు. కళ్ళలో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. దిండు మీదా బొట్టు బొట్టుగా పడుతున్నాయి అసలు జీవమే లేని ఆ పెద్ద పెద్ద కళ్ళ నుండి, రెండు పక్కల దిండు పైకి నీళ్లు జారిపోతున్నాయి. వంగి వసుధ అయన కన్నీళ్లు తుడుస్తున్నది. నాన్నగారు ఇంకా అలానే రాజు వంక చూస్తున్నారు. నర్సును బయటకు వెళ్ళమన్నాను. అమ్మ, వసుధ, నా వంక చూస్తున్నారు ఏమిటి అన్నట్టు.

“ఏమైయింది?” అన్నది వసుధ.

“ఈయన ఎప్పుడు వెళ్లి పోతారో తెలియదు! ఒక సారి మనలను అందరిని తన కళ్ళతో చూస్తారు అని రమ్మన్నాను” అని అన్నాను.

వసుధ నా భుజం మీద చెయ్యి వేసి నొక్కింది. అమ్మ కళ్ళు ఒత్తుకుంది.

“ఖర్మరా, ఎంతకాలం అయన ఇలా ఉండాలో? తిండికి తిప్పలు లేకుండా ఆ మనిషి అలా మంచంలో కృశించి పోతున్నారు. అంటాము కాని నువ్వు నేను అనుకుంటే అవుతుందా?.. వదిలేయ్ నాయనా.. ప్రాప్తం అనేది ఉంటుంది. పద, నువ్వు కాఫీ తాగి వెళ్లి నీ పని చూసుకో” అమ్మ అన్నది.

విచిత్రంగా జరుతున్న ఈ సన్నివేశాన్ని గది బయట నుండి నర్స్, రూమ్‌లో రాజు చూస్తున్నారు. తాత ఆలా ఆర్చుకు పోయి ఉండటం వాడికి మింగుడు పడటం లేదు.

“మీరు బయటకు వెళ్ళండి, నేను వస్తాను” అన్నాను.

మౌనంగా అందరూ బయటకు వెళ్లారు.

అందరూ బయటకు వెళ్ళాక, నాన్నగారి పాదాలకు దణ్ణం పెట్టాను. నాన్నగారు గాజు కళ్ళతో నా వంక చూస్తున్నారు.

కొద్దిగా బిగ్గరగానే అన్నాను, “నాన్నగారు, నేను మిమ్మల్ని ఇలా చూడలేక పోతున్నాను. మీరు ఇలా మంచంలో ఉండిపోవటం, ఇలా తిండి తినకుండా, ఎండిపోతూ, మా కళ్ళముందు జీవచ్ఛవంలా ఉండటం మేము తట్టుకోలేక పోతున్నాం. మమ్మల్ని చేయి పట్టి నడిపించిన ఆ చేతులు, మమ్మల్ని ఇంతటి వాళ్ళను చేసిన మీరు, ఇలా మంచంలో ఉండిపోవటం, అది ఎంత కలం ఇలా ఉండిపోతారో? అనే దాని కన్నా, ఇలా అంత కాలం ఉంటారా? అన్న ఆలోచనే భయాన్ని, బాధను ఇస్తోంది. ఇక మేము మిమ్మల్ని ఇలా చూడలేక పోతున్నాం. దయచేసి బయలుదేరండి. నా యందు దయ ఉంచి ఇక మీరు వెళ్లి పోండి” అన్నాను.

నా పెదవులు వణుకుతున్నాయి. నా కళ్లు నీళ్లతో నిండిపోయి ధారలు గా కారిపోతున్నాయి. నా మాటలు ఆయనకు వినపడవు.. ఏమో వినపడుతున్నాయేమో?

ఈ శబ్దం ఆ చెవులలో ప్రకంపించి, మెదడులోకి వెళ్లి అక్కడ నుండి గుండెకు చేరి, బాధతో కళ్ళవెంట నీరై వస్తున్నాయా? అన్నట్టు ఆయన కళ్ళు ఇప్పుడు మళ్లీ వర్షిస్తున్నాయి. అంటే విన్నారా?! అయన నా మాటలు విన్నారా?! సందేహం! భయం వేసింది.

ఎన్ని తప్పులు చేసినా “కొడుకా రా రమ్మని పిలువును కానీ ఎంతటివాడినైనా నూతిలో పడతోయునా” నాన్నగారు చిన్నప్పుడు అనేవాళ్ళు నవ్వుతూ.

అయ్యో! ఆయన విన్నారు. అయ్యో ఎంత బాధపడి ఉంటారో?! కదా?

నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. మళ్లీ అన్నాను – “నాన్నగారు, మన్నించండి. నేను మిమ్మల్ని చూడలేక అలా అభ్యర్థించాను”.

అయన ఇంకా అలానే నా వంక గాజు కళ్ళతో చూస్తున్నారు. ఇక అక్కడ ఉండలేకపోయాను. అమ్మ, వసుధ విన్నారో లేదో తెలియదు నా మాటలు. మౌనంగా నా గది లోకి వెళ్ళిపోయాను.

***

గడచిన రెండు రోజులు భారంగా కదిలాయి. మధ్య మధ్య నాన్నగారి గదిలో తొంగి చూస్తూ గడిపాను. శనివారం మధ్యాహ్నం భోజనం చేసి ఒక కునుకు తీద్దాం అనుకున్నాను. రాజు టెన్నిస్ ప్లేయర్. ఇంటర్-స్కూల్ టోర్నమెంట్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. రాజు మార్నింగ్ సెషన్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసి, మళ్ళీ నాలుగు గంటలకు టెన్నిస్ గ్రౌండ్‌లో ఉండాలి. నేను నిద్రపోతే ఒక మూడుగంటలు తక్కువ నిద్రపోను. ఇప్పుడు పడుకుంటే వాడి టెన్నిస్ టైం అయిపోయాక లేస్తాను. ఉహు పడుకోకూడదు. లేచి నాన్నగారి గదిలోకి తొంగి చూసాను. అమ్మ, నాన్నగారి మంచం పక్కన కూర్చుని నర్స్‌తో టీవీ చూస్తున్నది. బయట టీవీ ఉన్నప్పుడు నర్స్ – ఆయనని పట్టించుకోకుండా టీవీ చూస్తున్నదని వసుధ రెండేళ్ల క్రితం ఆ గదిలోనే టీవీ ఆరెంజ్ చేసింది. నాన్నగారు మౌన యోగి లాగా వున్నారు. ఆయన ఛాతి పైకి కిందకి ప్రశాంతంగా కదులుతోంది.

“ఎలా వున్నారు?” అని నర్స్‌ను అడిగాను.

“ఎలా వుంటారు? అలానే వుంటారు” అమ్మ అన్నది.

నర్స్, అమ్మ నవ్వుతున్నారు. అమ్మకు అలవాటూ అయిపోయింది నాన్నగారి పరిస్థితి.

మళ్ళీ తానే అన్నది, “వాడు వెళ్లాడా? టెన్నిస్‌కు” అంది.

“లేదు నిద్ర లేపాలి” అన్నాను. “వసుధ ఏమో పడుకుంది” అన్నాను

నాన్నగారి రూమ్ డోర్ దగ్గిరకు వేసి, రాజు గది దగ్గిరకి వెళ్లి..

“ఏరా!!, మూడున్నర అయింది. టెన్నిస్ టైం అవుతోంది, లేచి రెడీ అవ్వు” అన్నాను.

రాజు మంచం మీద బోర్లా పడుకుని వున్నాడు. ఏడుస్తున్నాడు.

ఏమైయింది? ఎక్కడన్నా పట్టేసిందా? పొద్దున్న ప్రాక్టీస్‌లో ఎక్కడన్నా పట్టేసిందేమో అన్న అనుమానం వచ్చి.. గబాలున వాడి దగ్గిరకు వెళ్లి వీపు మీద చెయ్యి వేసాను.

వాడు ఇటు తిరిగి గట్టిగా నన్ను హత్తుకుని, “తాత చనిపోయారు. ఇప్పుడే. నా కల లోకి వచ్చి ‘నేను వెళ్లిపోతున్నా..’ అన్నారు” చెప్పాడు రాజు.

నాకు చిరాకు వేసింది. “నోరుమూయ్!! ఏదో కల వచ్చి ఉంటుంది. మొన్న నువ్వు తాతను అలా చూసే సరికి నీకు అదే ఆలాపన.. వల్ల అలా.. కల వచ్చి ఉంటుంది. అంతే!! వెధవ వేషాలు ఆపి, టెన్నిస్‌కు రెడీ అవ్వు” అన్నాను.

“తాతను ఇప్పుడే చూసి వస్తున్నా, హాయిగా పడుకుని వున్నారు. ఇక నీ ఏడుపు ఆపి టెన్నిస్‌కు బయలుదేరు. బామ్మా, లోపల తాత పక్కన కూర్చుని టీవీ చూస్తున్నది” అన్నాను. వాడు సంశయంగా, అన్యమనస్కంగా నాన్నగారి గది వైపు కదిలాడు.

“అటు ఎక్కడికి? నా గదిలో బాత్రూం లోకి పోయి రెడీ అవ్వు. అక్కడకు పోయి మరో అరగంట వేస్ట్ చేస్తావా?” అన్నాను నిష్ఠురంగా.

తప్పదన్నట్టు రాజు నా గదిలోకి వెళ్ళబోయాడు. మా గదిలో మంచం మీద వసుధ పడుకుని ఉంది. మెలకువ వచ్చి “ఏమైయింది?” అన్నది.

“ఏదో కలట. మొన్న నాన్నను ఆలా చూసాడు కదా, అదే కల వచ్చి ఉంటుంది” అన్నాను.

“వదిలేయ్ బంగారు! హాయిగా వెళ్లి ప్రాక్టీస్ చేసుకో” అన్నది వసుధ కొడుకు తల నిమురుతూ.

సరే అంటూ, రాజు బాత్రూం లోకి వెళ్ళాడు. లోపల టాప్ చప్పుడు వినపడుతోంది. మరో పదిహేను నిమిషాల వరకు వాడు బయటకు రాదు.

“మీరు రెడీ అవ్వండి” అంది వసుధ. “టీ ఏమన్నా తాగుతారా?” అడిగిడిగింది.

“వద్దు వాడిని దింపి వచ్చి తాగుతా” అన్నాను, మంచం మీద కూర్చుండి.

ఇంతలో అమ్మ గుమ్మం వద్ద కనిపించింది.

“అరే!! నాన్నగారు చూడు, ఊపిరి తీసుకోవటం లేదు” అన్నది. ‘అవునా?’ అనుకుంటూ అమ్మ వెనకాల కదిలాను. ఒక్క ఉదుటున వసుధ అమ్మతో కలిసి నాన్నగారి గదిలోకి వెళ్ళింది.

నాన్నగారు మంచం మీద నిర్జీవంగా వున్నారు. అయన ఛాతి మీద చెవి పెట్టి ఏమన్నా వినపడుతోందో అని వినటానికి వసుధ ప్రయత్నిస్తున్నది. ఏ శబ్దం లేదు. నర్స్ ఏడుస్తున్నది. అమ్మ, వసుధ ఏడుస్తున్నారు. అమ్మ అన్నది “పోయారు అనుకుంటా” అని.

నాకు ఏడుపు రావటం లేదు. తెలియదు ఎందుకో. నేను వెళ్లి అయన ఛాతి మీద చెయ్యి వేసి చూసాను. ఒళ్ళు ఇంకా వెచ్చగా వుంది. గుండె ఆగిపోయింది. ముక్కు దగ్గిర చేయ్యి పెట్టి చూసాను, గాలి ఆడటం లేదు.

“ఇక్కడే ఉండండి, రాజును టెన్నిస్ కోర్ట్ దగ్గిర దింపితే నాకు రెండు గంటలు టైం దొరుకుతుంది. వాడు ఇక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదు. ఉండి మాత్రం ఏమి చేస్తాడు. డాక్టర్ గారిని పిలుస్తాను. క్లినికల్ కన్ఫర్మషన్ అవసరం” అన్నాను. ఎవ్వరు ఏమి మాట్లాడలేదు. తలుపు దగ్గిరకు వేసి అందరిని వదిలి, బయటకు వచ్చాను.

అప్పుడే రాజు వచ్చాడు.

“అమ్మ ఏది?” అని అడిగాడు. “తాతగారి గదిలో టీవీ చూస్తున్నది” అన్నాను. అబద్ధం చెప్పాను.

“పద” అన్నాను, వాడు గబా గబా డ్రెస్ మార్చుకుని టెన్నిస్ కిట్‌తో రెడీ అయ్యాడు. పద పద అని తొందర పెట్టాను. రాజు బయటకు వస్తూ, “అమ్మను పిలువు డాడీ” అన్నాడు.

“నువ్వు పద” అంటూ “వసుధా.., డోర్ వేసుకో” అన్నాను. ఎర్ర పడ్డ కళ్ళతో వసుధ బటయకు వచ్చింది..

‘ఇప్పుడు వాడిని టెన్నిస్‍కు ఎందుకు?’ అని అనాలని ఉంది ఆ చూపు. ఆమెకు అర్థం కావటం లేదు నా వైఖరి.

“ఏమైయింది అమ్మ? అలా ఉన్నావు?” అన్నాడు రాజు.

“ఏమి లేదు.. నువ్వు పద” అన్నాను,

వెళుతున్న మాకు వెనుక నుండి ఫ్లాట్ గ్రిల్ డోర్ వేసుకుంటున్న శబ్దం వినిపించింది. కార్ టెన్నిస్ కోర్ట్ వైపు పోనిచ్చాను. “నేను నిన్ను దింపి మళ్ళీ ఒక రెండు గంటల తర్వాత వస్తాను. నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యి. నేను ఒక పది నిమిషాలు లేట్ అయినా గ్రౌండ్ లోనే ఉండు” అని చెప్పాను రాజుతో. ‘వీడిని దింపి డాక్టర్ గారికి ఫోన్ చెయ్యాలి’ అనుకున్నాను మనసులో.

కార్ అద్దం లోంచి ముందుకు చూస్తుంటే మళ్ళీ గుర్తుకు వచ్చింది మొన్నటి సంఘటన.

నా అభ్యర్థన విని నాన్నగారు వెళ్లి పోయి ఉంటారా? ఛీ! ఏమి మనిషిని? ఎవరన్నా చావు బతుకుల్లో వున్న తండ్రిని అలా అడుగుతారా? ఎంత దారుణం. ఎంతగా ప్రేమించే నేను ఆయనను వెళ్లిపోండి అని ఎలా అనగలిగాను? నా తండ్రి మనసు ఎంతగా బాధపడి ఉంటుంది!! నేను అలా అడిగిన తరువాత ఆయనకు కన్నీళ్లు రావటం గుర్తుకు వచ్చింది. మనసంతా బరువుగా ఉంది. ఏడుపు రావటం లేదు. అసలు నా కళ్ళలో నీరే లేదా?!! నేను రాయినా? అనుకున్నాను.

తండ్రి చనిపోతే, కనీసం ఏడవను ఏమిటి? పోయారు అన్న దిగులు లేదా? లేక ఆ కష్టం ఆయనకు పోయింది అన్న ఆలోచనా?!!

గ్రౌండ్ దగ్గిరకు రాగానే రాజును దింపాను. “రెండు గంటల్లో వస్తాను” అన్నాను. “సరే” అంటూ రాజు గ్రౌండ్ లోపలి వెళ్లి పోయాడు.

కార్ రివర్స్ చేస్తూ, డాక్టర్‌కు ఫోన్ చేశాను.

“డాక్టర్!! నాన్నగారు పోయినట్టు వున్నారు. గుండె మీద చెవి పెట్టి వినటానికి ట్రై చేస్తే అయన గుండె శబ్దం వినపడటం లేదు. ఊపిరి కూడా తీసుకుంటున్నట్టు లేదు” అన్నాను.

“అవునా? మీరు ఎక్కడ వున్నారు?” అన్నారు డాక్టర్.

“టెన్నిస్ కోర్ట్ దగ్గిర”

“అదేమిటి అక్కడ?” డాక్టర్ అడిగారు.. అర్థం కాక.

“రాజును టెన్నిస్ కోర్ట్ దగ్గిర దించి మీకు కాల్ చేస్తున్నా. వాడు ఇంట్లో ఉంటే.. నేను నెక్స్ట్ చేసే పనులకు ఇబ్బంది అని”.

నాకు తెలుస్తోంది, తలా తోకా లేకుండా ఏదో చెపుతున్న అని.

ఇదేమి పట్టించుకోకుండా డాక్టర్ అన్నారు, “ఇంకో 5 నిమిషాలలో వస్తాను” అని.

ఫోన్ పెట్టేసి కార్ ఇంటి దారి పట్టించాను. ఇంకా చాల మందికి ఫోన్ చెయ్యాలి. అమ్మ తరుపు వాళ్లకు, నాన్నగారి తరపు వాళ్లకు, ఇంకా వసుధ తరపు వాళ్లకు.

కారు ఇంటికి వెళ్లే మలుపు తిరిగింది. మళ్ళీ మొన్నటి ఆలోచనలోకి వెళ్ళాను.

ఇలా అడిగానో లేదో అయన అలా వెళ్లి పోయారు. ఇదేమి చిత్రం. మళ్ళీ మళ్ళీ అనుకున్నాను. అయన నా చిన్నతనం నుండి ఇంటికి పెద్ద వాడిని అయిన నన్ను ఎంతో ప్రేమించారు. తండ్రికి పెద్ద కొడుకు అంటే ప్రేమ ఎక్కువ అంటారు.

‘నేను నిన్ను చూడలేకపోతున్నా నాన్నా’ అన్నాను, అంతే, అయన అది విని వెళ్లిపోయారా..?

అసలు ఏమిటి ఇదంతా..?

ఆలోచనలతోనే కార్ ఇంటివద్దకు వచ్చేసింది.

***

మరో పదిహేను రోజుల్లో అంతా పూర్తి అయిపోయింది. అమ్మ తరపున, నాన్నగారి తరఫు వాళ్ళు, వసుధ తరపు వాళ్ళు అందరూ వచ్చి వెళ్లారు. నేను అస్సలు ఏడవ లేదు. ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నర్స్ వెళ్లి పోయింది. ఆ గదిలో ఇప్పుడు అమ్మ పడుకోనంది. ఆవిడా హల్ లోనే పడుకుంటున్నది. మంచం తీసేసి ఎవరికో ఇచ్చేసాము. ఒక్క కుర్చీ తప్ప ఏమి లేవు ఆ గదిలో. గది మధ్యలో ఉన్న ఆ కుర్చీలో కూర్చున్నాను.

పదిహేను రోజుల క్రితం వరకు అక్కడ ఒక మనిషి పడుకుని ఉండేవారు. పలుకక పోయినా, ఎవ్వరితో మాట్లాడక పోయినా, ఆ మనిషితో ఈ కుటుంబం మొత్తానికి ఒక బంధం ఉండేది. ఇప్పుడు ఆ మనిషి లేడు. అసలు నేను అలా ఎందుకు అన్నాను వెళ్లిపొమ్మని? అసలు అలా ఎందుకూ ఆయనను ఎందుకు అభ్యర్థించానో అని అనిపించింది.

గదిలోనించి చూస్తే రాజు సోఫాలో కూర్చుని తాతగారి ఫోటో చూస్తున్నాడు. వాడి ముఖం దుఃఖంతో ఎర్రపడి ఉంది. ఈ పదిహేను రోజుల్లో వాడితో ఒక్క 5 నిముషాలు కూడా గడపలేదు.

అప్పుడు గుర్తుకు వచ్చింది. అవును నాన్నగారు పోయిన కొన్ని నిమిషాల ముందు రాజుకు కలలో వచ్చారు కదా?

ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. అవును నాన్నగారు వాడి కల లోకి వచ్చి ‘వెళ్లి పోతున్నా’ అని చెప్పి వెళ్లారు. వాడు చెపుతూనే వున్నాడు, తాత చనిపోతారు అని. ‘నేను వెళ్లిపోతున్నా! జాగ్రత్త నాన్న’ అన్నారు అని.

నేనే వాడిని పట్టించుకోలేదు. వాడి మాటలు కొట్టి పారేసాను. అప్పుడు గుర్తుకు వచ్చింది, వాడు నాన్నగారి గదిలోకి నెల రోజులు తరువాత అడుగు పెట్టినపుడు అయన చూపు. కళ్ళు పెద్దవి చేసి చూడటం. అప్పుడు అయన కళ్ళ వెంట నీరు రావటం. నా వీపు మీద ఎవరో చరిచినట్టు అయింది.

“కష్టం అండీ, మరింక ఏమి వైద్యం అక్కర లేదు. ఆయనను ప్రశాంతంగా పోనివ్వండి” డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చాయి.

రాజు నెల రోజుల తరువాత నాన్నగారి గదిలోకి అడుగు పెట్టినపుడు ఆయన చూపు, ‘వచ్చావా నీ కోసమే ఇంకా వేచి వున్నా, నిన్ను చూశాకే వెళతా కన్నయ్య!’ అన్నట్టు ఉంది.

అంటే ఇప్పటివరకు నేను అనుకున్నట్టు – నేను మిమ్మలిని చూడలేకపోతున్నా, ఇక బయలుదేరండి – అంటే అయన వెళ్ళలేదు.

ఆయన మనవడిని చూశాక ఆయనంతట ఆయనే వెళ్లిపోయారు. అంటే నెల రోజుల నుండి అయన వాడి కోసం వేచి వున్నారు. ప్రాణాలను వదలకుండా..

నా పెదవులు వణుకుతున్నాయి, నా కళ్ళు వర్షిస్తున్నాయ్.. రెండు చేతులతో ముఖం దాచుకుని గట్టిగా ఏడ్చాను.

వసుధ నా భుజం మీద చెయ్యి వేసింది.. అమ్మ నా తల మీద చెయ్యి వేసి నిమురుతోంది. రాజు గుమ్మం బయట నుండి నన్ను గమనిస్తున్నాడు.

నేను ఏడుస్తూనే ఉన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here