నృగ రాజు – శాపము – శాపవిమోచనం

0
3

[అంబడిపూడి శ్యామసుందర రావు గారి ‘నృగ రాజు – శాపము – శాపవిమోచనం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]నృ[/dropcap]గ రాజు ఎవరు, ఆయనను ఎవరు శపించారు, ఎందుకు శపించారు, ఆ శాపం నుండి ఎలా ఎవరు విమోచనము కలిగించారు? మొదలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే నృగ రాజు చరిత్ర తెలుసుకోవాలి. దానధర్మాలు వంటి మంచి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, అహంకారం ఉండకూడదు అని  వివరించే కథ ఇది.

నృగ రాజు కథ మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చర్యకి ప్రభావం ఉంటుందని వివరిస్తుంది. కారణం మరియు ప్రభావం యొక్క చట్టాన్ని ఈ కథ అనుసరిస్తుంది. ఈ కథ శ్రీమద్ భాగవత పురాణంలో ఉంది. నృగ రాజు చాలా దయగల రాజు, ‘దానం’ ఇవ్వడాన్ని నమ్ముతాడు. అందుచేత అతను అవసరమైన వారికి, సత్యవంతులైన, నిస్వార్థపరులకు వేల వేల ఆవులను దానంగా ఇచ్చేవాడు.

Image courtesy: Internet

ఒకరోజు రాజు దానం ఇవ్వడానికి ఉంచిన ఆవుల మంద పొలంలో గడ్డి మేస్తుండగా ఒక బీద బ్రాహ్మణుడి ఆవు ఒకటి రాజు గారి ఆవుల మందలో కలిసి పోయింది. ఆవుల కాపరి ఈ విషయాన్నీ గమనించకుండా ఆవులను గోశాలకు తరలించాడు. గోశాలకు వచ్చినాక కూడా నిర్లక్ష్యంతో వాటి సంఖ్యను లెక్క పెట్టలేదు. మరుసటి రోజు నృగ రాజు సిద్ధంగా ఉన్న ఆవుల మందను అర్హులైన బ్రాహ్మణ కుటుంబాలకు దానంగా ఇచ్చాడు. దానం తీసుకున్న ఒక బ్రాహ్మణుడికి పేద బ్రాహ్మణుడికి చెందిన ఆవు కూడా దానంగా ఇవ్వబడింది. ఆ బ్రాహ్మణుడు తనకు దానం చేసిన ఆవులను తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఆ పేద బ్రాహ్మణుడు తన అవును చూసి రాజు నుండి దానం తీసుకున్న బ్రాహ్మణుడితో తగాదా పడ్డాడు. చివరకు తగవు రాజుగారి కొలువుకు చేరింది. ఆ ఆవు గురించి ఆ బ్రాహ్మణులూ ఇద్దరు ఆ ఆవు నాదంటే నాది అని రాజు గారి సమక్షంలో వాదులాడుకున్నారు. నృగ రాజు తప్పుగా రెండుసార్లు అవును దానం చేశానని గ్రహించాడు. రాజు వారికి 1000 ఆవులను దానం చేయడం ద్వారా తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. వివాదాస్పద అవును మాత్రమే కోరుకుని ఆ ఆవుని అక్కడే వదిలి వెళ్ళిపోయారు.

తర్వాత కొంతకాలానికి నృగ రాజు మరణించాడు. భౌతిక కాయాన్ని వీడి రాజు యమలోకానికి చేరాడు. అక్కడ యమధర్మరాజు ఆ రాజుతో, “చేసిన చిన్న చిన్న పాపాలకు శిక్ష అనుభవించాలనుకుంటున్నావా? లేక పుణ్యము మరియు చేసిన మంచి పనుల ఫలితాలను అనుభవించాలనుకుంటున్నావా?” అని అడుగుతాడు. నృగ రాజు తాను చేసిన పాపపు ఫలితాలను ముందుగా అనుభవిస్తానని చెపుతాడు. ఒకసారి దానం చేసిన అవును తెలిసో  తెలియకో ఇంకో బ్రాహ్మణుడికి దానం చేసిన ఫలితంగా, నృగ రాజు తన చర్యకు ప్రత్యక్షంగా బాధ్యత వహించినప్పటికీ, రాజుగా మరియు యజమానిగా, ఆవుల కాపరి యొక్క బాధ్యతారహిత ప్రవర్తనకు అతను పరోక్షంగా బాధ్యత వహించాడు.

నృగ రాజు ఒక బావిలో ఊసరవెల్లిగా జన్మించాడు. శ్రీ కృష్ణుని చూడగానే తిరిగి తన పూర్వ మానవ రూపాన్ని పొందుతావని యముడు శాప విమోచనానాన్ని చెప్పాడు. కానీ అయన చేసిన పుణ్యాల కారణంగా బావిలో ఊసరవెల్లిగా జన్మించినప్పటికీ ఎల్లప్పుడూ భగవంతుని స్మరిస్తూ ధ్యానిస్తూ కాలం గడిపేవాడు.

ఊసరవెల్లిగా మారిన నృగ రాజు ఆ తర్వాత శ్రీకృష్ణునిచే ఏ విధముగా రక్షించబడ్డాడో తెలుసుకుందాము.

ఒకరోజు శ్రీకృష్ణుడు ఇతర యాదవ బాలురు మైదానంలో ఆడుకుంటున్నారు. ఒక ఊసరవెల్లి ఒకటి అక్కడ ఉన్న మంచినీటి బావి లోకి ప్రవేశించింది. ఊసరవెల్లి ఆ నీటిని పాడు చేస్తుంది అని భావించి ఆ బాలురు తాళ్ల సహాయంతో దానిని పైకి లేపేందుకు ప్రయత్నించారు, కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు. పదేపదే ప్రయత్నించినా బాలురు, గ్రామస్థులు విఫలమయ్యారు. ఈ సమస్య విన్న శ్రీకృష్ణుడు బావి దగ్గరకు వచ్చాడు. శ్రీ కృష్ణుడు ఆ ఊసరవెల్లిని బయటికి తీసి రక్షించాలని చేసిన ప్రయత్నంలో, ఊసరవెల్లి తన కాళ్ళతో శ్రీ కృష్ణుడి చేతిని తాకింది. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఊసరవెల్లి తన శరీరాన్ని వదిలి పూర్వజన్మ మానవుడిగా మారిపోయి తన పూర్వజన్మను వివరిస్తూ తాను రాజుగా దానం చేసేటప్పుడు చేసిన తప్పిదాన్ని శ్రీ కృష్ణునికి వివరిస్తాడు.

నృగ రాజు కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు, అతని గొప్పతనాన్ని కీర్తించాడు. శాపవిమోచనం పొందిన నృగ మహారాజు తనకు మోక్షం ఇచ్చినందుకు కృష్ణుడికి కృతజ్ఞతలు తెలిపి దివ్య విమానంలో అదృశ్యమయ్యాడు మరియు సాలోక్యం పొందాడు.  తరువాత సాయుజ్యం – మోక్షాన్ని పొందాడు.

ఈ విధంగా మనం తెలిసో తెలియకో చేసే ప్రతి పని, మదిలో మెదిలే ప్రతి ఆలోచన ప్రభావం చూపుతుందనే వాస్తవాన్ని ఈ కథ వివరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here