తందనాలు-15

0
3

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

141
ఆధారాలుండవు భవిష్యత్తు అంచనాకి
గ్రంథాలెన్ని వెతికినా
సాదా సీదా మానవులకేమి గోచరించు
విధాన పరమైన నిర్ణయం ప్రకృతిదే

142
గోల్ మాల్ గోవిందం మార్కెట్లో ప్రవేశించె
వీలైనన్ని మాయం చేసె
చాలినన్ని సంచిలో సర్దుకునె, వెళ్లేందుకు
కలవరపడె పట్టుబడే సరికి

143
మూఢ నమ్మకాలతో మగ్గి పోయే జనం
కడవ కొండ ఎక్కిందని కొందరు
కొండ కదుల్తుందని కొందరు
మండే ఎండలో చిందులేస్తే అన్నీ పోతవని

144
ఎక్కే కొండ దిగే కొండ
ఎక్కడా కనబడడే దేవుడు
చక్కగా పది కొండలెక్కితే కనపడును
లెక్క ప్రకారం యెక్కినా దేవుడు కనపడలా

145
పూలు ఆహ్వానించాయి తేనెటీగలను
కూలీ ఈగలు ముసిరినవి
తలుపులు తట్టి లేపినవి
నలుపు రంగు ఈగలు మకరందాన్ని గ్రోలినవి

146
తేనెటీగల ముద్దులతో పూలు గర్భం దాల్చినవి
రానే వచ్చాయి ఆరు నెలలు
కనే సమయము ఆసన్నమాయె
కొనేవారు చేరి పిల్లలను దించె

147
కొండకు కోపమొచ్చింది
ఎండలో కదల లేని స్థితిలో ఎండుతున్నందుకు
చండశాసనుడైన సూర్యుని మీద
దాడి చేసే ప్రయత్నం వృథా అని తెలిసె

148
కొండకు వెంట్రుక కట్టి లాగే ప్రయత్నం
బండ రాయి కదులుతుందా?
కండలున్న వానికే సాధ్య మవదే
దండ తీగ పెద్దదైతే ప్రయత్నం చేయవచ్చులే

149
వయ్యారి భామ లందరూ చేరిరి ఒకచోట
కయ్యాలకు
తయ్యారైరి మాట తూటాలతో
గయ్యాళి భామలందురూ దూషించుకొనిరి వొకరిమీదొకరు

150
సభికులందరూ చేరిరి
గుభిల్లుమని శబ్దం సభా ప్రాంగణంలో
మభ్య పెట్టటానికి చేసిన పనని గుస గుసలు
సభ అసంపూర్తిగా ముగిసె

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here