అమ్మణ్ని కథలు!-4

0
3

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని నెహ్రూ భక్తి!

[dropcap]అ[/dropcap]ప్పటికి యేడేళ్లుంటాయేమో నాకు! ఆగస్టు నెల వచ్చిందంటే చాలు.. మాకు దేశభక్తి గీతాలు నేర్పించేవారు మా అయ్య వారమ్మలు.. అయ్యవార్లు!

మగపిల్లలందరినీ గాంధీ గ్రూపు – నెహ్రూ గ్రూపు అని, ఆడపిల్లలను సరోజినీ నాయుడు గ్రూపు- కస్తూర్బా గ్రూపు అని విభజించేవారు. ఏవేవో పాటలు నేర్పేవారు.

అందులో గాంధీ గ్రూపు వాళ్లకు, సరోజినీ నాయుడు గ్రూపు వాళ్లకూ “భలే తాత మన బాపూజీ.. బాలల తాతా బాపూజీ.. బోసినవ్వులా బాపూజీ.. చిన్నీ పిలకా బాపూజీ” లాంటి పాటలు నేర్పేవారు.

నెహ్రూ గ్రూపు వాళ్లకు “వినండి నెహ్రూ చరితం.. ఇది సత్యానికి సంకేతం.. ఆతని చరితం.. జాతికి దీపం.. ప్రపంచప్రగతికి సంకేతం.. (వినండి.. నెహ్రూ చరితం..)

– పద్ధెనిమిది వందల ఎనభైతొమ్మిది నవంబరూ పదునాలుగునా

మోతీలాలుకు ముద్దుబిడ్డగా పుట్టాడలహాబాదునా..

బాల్యమునందే విజయాలెన్నో సాధించాడూ…”

ఇలా సాగేది ఆ పాట! కస్తూరిబా గ్రూపు వాళ్లు, నెహ్రూ గ్రూపు వాళ్లతో కలిపి పాడాలి.

ఆ పాటలు మా రక్తంలో ఎలా జీర్ణించుకుపోయాయంటే.. మేము ఇంటిదగ్గర ఆటలాడుతూ, డాన్సు లాడుతూ అవే పాటలు పాడుకునేవాళ్లం!

చివరకు పేరంటాలకు పోయినా అవే పాటలు!

కోమట్ల ఇళ్లలో పేరంటాలకు పెట్రోమాక్సు లైట్లు పట్టుకోనిపోయే ఖాదరు మా అన్నావాళ్లకు నేస్తుడు. అప్పట్లో కరెంటు వున్నా అదెప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో యేమో ఎవరికీ తెలీదు. అందుకే పెళ్లిళ్లలో, పేరంటాల్లో పెట్రోమాక్సు దీపాలు ఏర్పాటు చేసుకునేవారు.

పేరంటాల్లో కోమట్ల ఆడవాళ్లు దేశభక్తి గీతాలను ఎట్లా పాడేవాళ్లో అతను చెప్పేవాడు.

‘మన గ్రాంధి మహాత్ముడు స్వాతంత్రఫలమును తెచ్చెన్..’ అనీ,

‘మోహనలాలుని తపఃఫలముగా మోతీలాలుని కీర్తివిశేషము.. దేశభిమానీ సుభాసు నెహ్రూ.. మాత కస్తూరిబాయి మమ తల్లివే.. దేశాభ్యుదయమిదే..’ అనీ యెలా పాడతారో వెక్కిరించేవాడు. పేరంటాల్లో ఈ పాటలా పాడేది.. దేవుడి పాటలు పాడాల గానీ.. అని అతని వెక్కిరింత!

గాంధీ ఎలాగూ పోయాడు. ఇక నెహ్రూ ఒక్కడే మనల్ని రక్షించే వాడు మిగిలాడని గాఢంగా నమ్మేవాళ్లం!

ఒకరోజు నా చెల్లెలు జయ భయపడిపోయి పరిగెత్తుకుంటూ, ఒగుర్చుకుంటూ ఒచ్చింది. నేను, సావిత్రి, రమా ఆడుకుంటూ వున్నాము, రమా వాళ్ల అరుగు మీద!

“యేమైందే.. అట్లా ఆయాస పడుతున్నావు?” ముక్తకంఠంతో అడిగాం.

“అమ్మణ్నీ..! భాగ్యా వాళ్లింటి దగ్గర ఆకాశం మీద భూమి పోతూ వుందే.. చూపిస్తారా.. కావాలంటే.. భాగ్యా యేమో అంటుందీ.. భూమి ఆకాశం నుంచి జారి కింద పడుతుందేమోనే అని.. నాకు భయం వేసిందే.. మనం అందరం భూమ్మీది నించి కిందపడి చచ్చిపోతామేమోనే.. అమ్మణ్నీ..!” అని బావురుమంటూ యేడుపు మొదలుపెట్టింది.

నాకూ యేడుపు పొంగివొచ్చింది. అందరం యేడుస్తూ భాగ్యా వాళ్ల ఇంటి దగ్గరికి పోయి ఆకాశం పైకి చూశాము. పైన దట్టమైన మేఘాలు పరుగులు తీస్తున్నాయి.

అది అనేకసార్లు చూసినదే.. అయినా మా భయం వల్ల భూమే ఆకాశం మీద పోతున్నట్టు అనిపించి కీసరబాసరమని యేడుస్తూ రమా వాళ్ల అరుగు మీద చేరాము. భాగ్య కూడా వొచ్చింది మాతోటి.

“అయినా మనం నెహ్రూ పాటలు పాడుకుంటాం కదా! నెహ్రూ భూమిని పడిపోకుండా పట్టుకుంటాడులే.. తన పాటలు పాడుకున్నందుకు ఆ మాత్రం సహాయం చెయ్యడా?” అని భాగ్య అన్నది. కొంచెం ధైర్యం తెచ్చుకున్నాము.

రమా వాళ్ల అమ్మ మా ఏడుపులు  విని, విషయం తెలుసుకోని “వెర్రిమొహాల్లారా! తిక్కనా? చాదస్తమా? అవి మొబ్బులేనే.. వాన వచ్చేట్టుంది. భూమి ఆకాశం మీద పోవడమేమిటిది? మీ పిచ్చి కాకపోతే! కూర్చోని యేవో ఆటలు ఆడుకోండి. యేడవ్వాకండి!” అని అదిలించింది. అప్పచ్చులేవో తలా ఒకటీ ఇచ్చింది.

కానీ, ఆ అత్త మమ్మల్ని ‘తిక్కనా? చాదస్తమా? వెర్రిమొహాల్లారా..’ అని తిట్టడం నాకూ, జయకూ మా అహం మీద దెబ్బతగిలి నట్టయింది. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ఇద్దరి మొహాలూ అవమానంతో ఎర్రబడ్డాయి. ఎంతయినా ఆ తాలూకాలోనే పెద్దలాయరుగారి మనవరాళ్లం.. పెద్దింటి ఆడపిల్లలం.. అలాంటి మాటలు ఓర్చుకోలేము. అయినా ఓర్చుకున్నాము.. ఆట కోసం.. రమ స్నేహం కోసం.. పెద్దవాళ్లను ఎదిరించే అలవాటు లేనివాళ్లం మరి! అందునా చిన్నపిల్లలం!

ఇంతలో వాన, మెరుపులు, ఉరుములు మొదలైనాయి. అందరం కలిసి కోరస్‌గా.. “అర్జునా.. అర్జునా.. గోడ కింద పిల్లలున్నారు జాగ్రత్తా..” అని అరవడం మొదలుపెట్టాము. ‘అర్జునా.. ఫల్గునా.. పార్థా..’ అని అర్జునుడి పదిపేర్లూ చెప్పినాము. కాస్సేపటికి వాన వెలిసింది.

వాన పడేటప్పుడు మిద్దెపైనుంచి తూముల్లోనించి ఒచ్చే నీళ్లను పట్టుకోవడానికి గంగాళాలు, బిందెలు అన్నీ వరుసగా పెట్టింది రాజమ్మత్త.. రమా వాళ్ల అమ్మ. పడినవి పడినట్టుగా అందరం కలిసి చిన్నచిన్న బిందెలతో, తప్పేలాలతో నింపి వాళ్ల పెరట్లో తొట్టి నింపేశాము. అప్పుడే, ఆ పడుతున్న నీళ్లలోనే ఇంట్లోని మురికి బట్టలన్నీ వుతికేసింది అత్త. ఆ పక్క ఇళ్లవాళ్లు కూడా అదే పని చేస్తున్నారు. వాన వెలిసింది.

అందరం తడిసిన మా బట్టలను ఆరబెట్టుకుంటూ కూచున్నాము.

ఇంతలో హబీబూన్.. మా కంటే చాలా పెద్దదే ఆ అక్క.. మహా తంటాలమారి.. నీళ్ల బిందె చంకన పెట్టుకొని ఉప్పునీళ్ల బావికి పోతూ.. మాతో ముచ్చట్లు మొదలుపెట్టింది.

మేము, ఆకాశం మీద భూమి పోతూందని భయపడడం, అందరం యేడవడం, నెహ్రూ వచ్చి కాపాడతాడని ధైర్యం తెచ్చుకోవడం.. అన్నీ చెప్పాము హబీబూన్‌కు. ఆమె పగలబడి నవ్వింది.

“సరే.. నేను ఇంకో మాట సెబ్తా.. ఇనుకోండ్రి. ఇంక రెండు మూడు రోజుల్లో ప్రలయం వస్తాదంటా.. నెహ్రూ వొచ్చి విమానంలో నించి మన ఊళ్ల మింద నీళ్లు పోస్తాడంట! అప్పుడు మనమంతా మునిగిపోతామంట! జాగత్రగా ఉండండ్రీ.. మాయన్న సెప్పినాడు.. బజార్లో అందరూ అదే మాట్లాడుకుంటా వున్నారంటా!” అని బిందె తీసుకొని బావి వైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది లోపల్లోపల నవ్వుకుంటూ.

ఇక మళ్లీ మేమంతా భయంతోటి కుంగిపోయాము.

చీకటి పడుతుండటంతో భయం భయంగా ఇళ్లకేసి పరిగెత్తాము.

“యేవమ్మా! పెత్తనాల పేరక్కలూ! అయినాయా పెత్తనాలూ.. చాంద్రాయణాలూ.. ఇంకా యేమన్నా మిగిలినాయా? పూర్తి చీకటి పడింతర్వాత రావలసింది.. అర్ధరాత్రి వేళకు..” అమ్మ సాధింపు మొదలుపెట్టింది.

“ఇంకొన్సేపు ఆడుకుందాం అనే అనుకున్నాం అమ్మా.. కానీ, భయపడి తొరగా వొచ్చేసినాం..” జయ ధైర్యంగానే జవాబు చెప్పింది.

అమ్మ ఎవరో పిలవడంతో వంటింట్లోకి వెళ్లిపోయింది.. లేకపోతేనా.. బాగా తిట్లుపడేవి.. ఆ తలతిక్క సమాధానానికి.

రాత్రి అన్నాలు తిన్నాం కానీ, నాకూ, జయకూ లోలోపల భయం భయంగానే వుంది.

మా భయాన్ని ఎవరికైనా చెబితే.. అక్కావాళ్లూ, అన్నావాళ్లూ మమ్మల్ని ఎగతాళి చేసి అల్లరి పట్టిస్తారే గానీ, సరైన సమాధానం ఎవరూ చెప్పరు.

ఆ రాత్రంతా నేనూ, జయా ఒకరి చేతులు మరొకరు పట్టుకొని “యేం కాదులేవే.. నెహ్రూ అట్లా యేమీ చెయ్యడులేవే.. నెహ్రూ అంత అన్యాయం చెయ్యడు లేవే..” అని ధైర్యం చెప్పుకుంటూ పడుకున్నాం!

మరురోజు పొద్దున్నే నిద్రలేచి, మేడమీదినించి కిందికి వొచ్చేసరికి నాయన, తాత రేడియో దగ్గర కూర్చొని హతాశులై పోతూ వింటున్నారు వార్తలను.

“నెహ్రూ దాటుకున్నాడట.. రాత్రి.. గుండెనొప్పితో..” నాయన చెప్పలేక చెప్పలేక చెప్పారు అమ్మతో.

అమ్మ కళ్లలో నీళ్లు..

“ఇంక మన దేశాన్ని కాపాడే వాళ్లెవరు? ఇక మన గతి అధోగతే! నెహ్రూ వుండినాడు కాబట్టి ఇన్నాళ్లూ దేశాన్ని రక్షించినాడు మహానుభావుడు! ఆయన తర్వాత అంతటివాడు ఎవరూ కనిపించడంలే! ఆ నిండైన విగ్రహం, ఆ ఇంగ్లీషులో వాగ్ధాటీ ఎవరి కున్నాయి కనుక! మళ్లీ బ్రిటిషువాళ్లే ఆక్రమించుకుంటారు ఈ దేశాన్ని! ఎంత చెడ్డరోజు ఈ రోజూ..” తలపై చేత్తో కొట్టుకుంటూ తాత నిరాశ.. నిస్పృహతో గాల్లోకి చూస్తూ కూర్చున్నారు.

మాకందరికీ పెద్దదిక్కయిన తాతే దిగులుపడిపోవడం చూసేసరికి నాకూ, జయకూ కళ్లలో నీళ్లొచ్చేసినాయి. ఇద్దరం ఒకర్నొకరం పట్టుకొని భోరుమని యేడ్చేశాం! ‘ఇంక మనల్నెవరు కాపాడుతారే…’ అని భయపడ్డాం!

కానీ, అంతలోకే ధైర్యం ఒచ్చింది.. “అమ్మయ్య! ఇక నెహ్రూ వొచ్చి విమానంలోనించి నీళ్లు పొయ్యడే జయా. మనం మునిగిపోము” అని ఊపిరి పీల్చుకున్నాను సంభ్రమంగా.

జయ కూడా అన్నది.. “పోతే పోయాడులే.. ముసలోడు.. మన మీద నీళ్లు పోయలేడు ఇంక!” అని ధైర్యం తెచ్చుకుంది.

హబీబూన్ కనిపించింది.. “ఇంక ప్రళయం రాదు.. యేమీ రాదు.. చచ్చిపోయాడులే మీ నెహ్రూ..” అని చేతులు తిప్పుతూ వెక్కిరించినాము.

“రార్రి.. రార్రి.. ఇట్ల రార్రి.. ఇంకో ఇసయం జెప్తా…” పిలిచింది హబీబూన్ .

“యేం చెప్పొద్దు.. నీవన్నీ తిక్కమాటలే!” ఈసడించింది జయ.

“అమ్మనాయనోయ్! మీరు పెద్దోళ్లయిపోయినార్రో!.. మళ్లా ఎప్పుడైనా నా దగ్గరికి కత చెప్పమని రాండ్రి జెప్తా మీ సంగతి..” అని బెదిరిస్తూ వెళ్లిపోయింది హబీబూన్.

వ్వెవ్వెవ్వెవ్వె.. వెక్కిరించినాము మేమిద్దరం. నెహ్రూ తెచ్చే ప్రళయం భయం పోవడంతో హాయిగా ఆడుకున్నాము!

మళ్లీ బడిలో “దేశోద్ధారకా! నెహ్రూనాయకా! కదలిపోయితివా కన్నుమూసీ..” అని, ‘పగలే వెన్నెలా.. జగమే ఊయలా..’ పాట బాణీలో వుండే పాట నేర్పించినారు.

రమా వాళ్ల అరుగు మీద మేము ఈ పాటకు డాన్సు చేస్తుంటే మా అన్నావాళ్లు, వాళ్ల స్నేహితులూ ఒక్కటే నవ్వడం!!

అయినా దాంట్లో నవ్వడానికేముంది గనుక? ఎవరు నవ్వితే వాళ్ల పండ్లే బయటపడతాయిలే..అని మళ్లీ మొదలు పెట్టినాము మా డాన్సు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here