[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
వయసు మళ్ళాక..!!
[dropcap]మ[/dropcap]నిషి అన్నవాడు పుట్టాక, మరణించే వరకూ జీవితంలో ఎన్నో మార్పులూ చేర్పులూ సంభవిస్తుంటాయి. ఎవరికైనా ఇది తప్పదు. ఇందులో బాల్యం నుండి యవ్వన దశ వచ్చి, చదువుసంధ్యలు పూర్తి చేసుకుని, ఉద్యోగమూ పెళ్లి అనేవి జరిగేవరకూ తప్పనిసరిగా తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. కొంతమంది జీవితంలో స్థిరపడకపోయిన, ఉద్యోగం సద్యోగం లేకున్నా పెళ్ళిళ్ళు చేసుకోవడం, లేదా తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్ళి చేసేసాం అని చేతులు దులిపేసుకోవడం వంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి.
పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి వారి పద్ధతుల్లో వాళ్ళు స్థిరపడిపోయాక, తల్లిదందుల పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు ఎలా వున్నా, ఇప్పుడు తల్లిదండ్రులది ఏకాంత జీవితమే. అంటే పిల్లలు ఇతర జిల్లాలలోనో, ఇతర రాష్ట్రాలలోనూ, లేదా ఇతర దేశాలలోనూ, ఉద్యోగరీత్యానో, ఇతర కారణాల వల్లనో, ఆయా ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ స్థిరపడిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇంటిదగ్గర తల్లిదండ్రులది ఒంటరి జీవితమే అవుతున్నది. ఆ తల్లిదండ్రులు ఉద్యోగస్థులైతే, పదవీ విరమణ తర్వాత ఇలాంటి ఒంటరి జీవితం ఏర్పడుతుంది. మిగతా వారికి పిల్లలు, వారిని వదిలి వెళ్ళినప్పటినుండీ ఒంటరి జీవితమే!
ఈ వంటరి జీవితాలు వారిలో జవసత్వాలు ఉన్నంతవరకూ సాఫీగానే సాగిపోతుంది. తర్వాత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడు అనుకూలం వున్నలేదా హృదయమున్న పిల్లలు,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని చనిపోయేవరకు తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకునే పిల్లలు వున్నారు. అలా కాకుండా పెద్దలకు ఇష్టం లేకపోయినా, వృద్ధాశ్రమాలకు నెట్టివేసే పిల్లలూ మన సమాజంలో మెండుగా కనిపిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు తల్లిదండ్రులు, ఒకరు పొతే మరొకరు భరించలేని సున్నిత హృదయులు, నేను ముందు చనిపోవాలంటే, నేను ముందని వాదులాడుకోవడమూ గమనిస్తుంటాం. కొందరు స్త్రీలు తాము సుమంగళి గానే ముందుపోవాలని, వేయి దేవుళ్ళకు మొక్కుకుంటూ వుంటారు. పూర్తిగా భార్య మీదనే అన్నింటికీ ఆధారపడడం అలవాటైన భర్తలు తామే ముందుపోవాలని కోరుకుంటారు. ఇవన్నీ ప్రతిచోటా కనిపంచేవే అయితే, భర్త పోయిన భార్య కొంతకాలం బాధపడినా, తర్వాత మామూలు జీవితానికి అలవడే ప్రయత్నం చేస్తారు. కానీ, భార్యను కోల్పోయిన భర్తలు చాలామట్టుకు ఎక్కువకాలం బ్రతకరు.
పిల్లలు తమ జీవితాలలో స్థిరపడిపోయాక, ఏకాంత జీవితం గడిపే, తల్లి గానీ తండ్రి గానీ, పునర్వివాహంకోసం ప్రయత్నించేవాళ్లూ లేకపోలేదు. కొందరికి చివరి దశలో ఒక తోడు ఉండాలనే కోరిక అయితే, మరికొందరు,అప్పటికీ ఇగిరిపోని శృంగార జీవితాన్ని కొనసాగించాలనే దిశలో కొందరు ఆత్రుత పడుతుంటారు. 60 ఏళ్ళు దాటిన తర్వాత శృంగార జీవితాన్ని కోరుకునే స్త్రీలు బహుతక్కువ. అలాంటి వారు తొందరపడి పునర్వివాహం చేసుకుంటే, పెళ్లి చేసుకున్న ఆనందం బహు స్వల్పకాలంలోనే ఆవిరి అయిపోతుంది. భర్తలు చనిపోయినా, విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధ మహిళలు కొందరు, తమను ప్రేమగా చూసుకుని, ఎలాంటి శారీరక సుఖాలను ఆశించకుండా, తమకు సేవచేసే పురుషులను కోరుకుంటారట. శాస్త్రీయంగా ఆలోచిస్తే ఇది సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది. ఏమో, ఎక్కడైనా వెదికితే కొన్ని ఉదాహరణలు దొరుకుతాయేమో! ఇలా ప్రతి స్త్రీ జీవితమూ, మరణించే వరకూ వివిధ రూపాల్లో విశ్రాంతి దొరకని శ్రామికురాలిగా ముగిసిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, వృద్ధాప్యం వచ్చిన తల్లి గానీ, తండ్రి గానీ, పునర్వివాహం చేసుకోవడానికి ఎంతమంది పిల్లలు అనుమతి ముద్ర వేస్తారు? కొంతమంది పిల్లలు తమ స్వార్థం కోసం సేవ చేయించుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. మరి కొందరు, సంస్కృతి, సాంప్రదాయాలూ చట్టుబండలూ అంటూ వాటిని పట్టుకుని వ్రేలాడే చాదస్తులూ ఉండవచ్చు. అలా కొందరు అసంతృప్తికి లోనై అతిత్వరగా జీవితాన్ని ముగించుకునే ప్రయత్నం చేస్తే, మరికొందరు పిల్లలతో మనుమలతో, మునిమనుమలతో బ్రతికినంత కాలం సంతోషకరమైన జీవితాన్ని గడిపినవారు వున్నారు. వృద్ధాప్యం వచ్చినా, ఆ లక్షణాలు కనిపించక నిత్యం ఆనందంగా ఆరోగ్యంగా, చలాకీగా వుండే ఒంటరి స్త్రీ/పురుషులకే ఇది ఒక సవాలుగా మిగిలిపోతుంది. యవ్వనంలో ఉండగానే విడాకుల వల్ల గాని, ప్రమాదాల వల్ల గానీ భర్తలను కోల్పోయిన ఒంటరి స్త్రీల జీవితమూ, పిల్లలు ఉండగా పునర్వివాహం చేసుకున్న వనితల జీవితం ఎన్నెన్ని సమస్యలను దాటుకుపోవాలో చెప్పలేము, అది వేరే విషయం అనుకోండి.
నేనూ, వృద్ధాప్యంలో అడుగు పెట్టినవాడినే కనుక, నేనూ నా భార్య కంటే ముందు చనిపోవాలని మనసులో అనుకునుంటాను. ఒకసారి నా భార్యకు ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, తాను ఒక రోజు చాలా డల్‌గా ఉంటే, ఎందుకు అలా వున్నావని అడిగినప్పుడు, “నేను పొతే మిమ్మల్ని ఎవరు చూస్తారు?” అన్న మాట, నాకు కన్నీళ్లు తెప్పించింది. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు వికలమై పోతుంది. ఇవన్నీ వయసు మళ్ళాక వచ్చే ఆలోచనలూ, సమస్యలూను.
మా ఇంటి విషయానికి వస్తే, మా అమ్మ చనిపోయిన కొద్దికాలానికే, మా నాయన చనిపోయారు. మా అమ్మ వండిన వంట తప్ప వేరే వాళ్ళ వంటలు ఆయన అసలు ముట్టుకునేవారు కాదు. మా అన్నయ్య చనిపోయి చాలా కాలం అయినా, మా వదిన గారు ఆరోగ్యంగా, ఆనందంగా పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. మా పెదనాన్న మనవరాలు భర్త చనిపోయి చాలా సంవత్సరాలు, అయినా, పిల్లలతో మనుమలతో హాయిగా తన జీవితాన్ని గడపగలుగుతున్నది. మా చిన్నక్క గతించి చాలా కాలమైనా, మా బావగారు జీవితం బాగానే వుంది.
నా మిత్రుడు ఒకాయన ఇన్‌స్పెక్టర్ స్థాయిలో పదవీ విరమణ చేసాడు. భార్యను ఎప్పుడూ హింసించేవాడు. ఆవిడ చనిపోగానే అతను పునర్వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె అతనిని హింసిస్తున్నది. ఈ వివాహం వల్ల అతనికి సుఖశాంతులు కరువైనాయి. హిట్లరులా వుండే మనిషి ఆమెకు బానిసగా తయారయ్యాడు. నా వియ్యంకుడు, భార్య అనారోగ్యంతో (ఆమెకు చాలా సేవ చేసాడు) చనిపోవడంతో, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఆయనకు దక్కలేదు. ఆయన ఆరోగ్యకరమైన, జీవితాన్ని, పిల్లలతో, మనుమలతో వెళ్లదీస్తున్నారు. చెప్పడానికి ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, వృద్దాప్యం వచ్చాక తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు, తొందరపడి చేసేవిగా వుండకూడదు. ఇష్టంగా చేసే కొన్ని త్యాగాలు తప్పవు, ఇష్టం లేకపోయినా, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోనకా తప్పదు. సుఖం, సంతోషం, ఆరోగ్యం, ఆనందం అన్నీ మన చేతిలోనే వున్నా, కొన్నింటికి సమాధాన పడక తప్పదు. వయసు మళ్ళాక వృద్ధాప్యం వచ్చాక, శుభకరమైన శేషజీవితానికి, కొంత కలిసి రావాలి, కొంత అదృష్టం వుండాలని అనిపిస్తుంటుంది.
వయసు మళ్ళాక:
శరీరానికి సుఖాన్ని ఇవ్వకూడదు. ప్రతిరోజూ 30-40 నిమిషాలు నడక అవసరం. నిలబడడానికి, కూర్చోడానికి ప్రయత్నించాలి గాని అస్తమానం పడుకుని ఉండకూడదు. దీనివల్ల వయసు పెరిగేకొద్దీ కండలు కరిగిపోయే ప్రక్రియను కొంతవరకూ అరికట్టవచ్చు. ఎముక చిల్లులు పడడం (ఆస్టియో పోరోసిస్) కంటే, కండలు కరిగిపోవడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
(మళ్ళీ కలుద్దాం)