కాజాల్లాంటి బాజాలు-135: ఓలమ్మో ఒదినో!

10
11

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఇ[/dropcap]వాళ నాకెంతో ఆనందంగా ఉంది. ఏదో సినిమాలో విన్న ‘ఏనాడో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే..’ అనే పాట, పాడడం రాకపోయినా గొంతెత్తి పాడేసుకోవాలనిపిస్తోంది. ఇంత ఆనందం కలగడానికి కారణం మా వదినే. అవును.. నిఝంగా మా వదినే. లేకపోతే ఎప్పుడు చూసినా మా వదిన నాకు సలహాలిస్తుండడం, నేనేదో అమాయకురాలిలాగా వెర్రిమొహం వేసుకుని వదిన చెప్పింది వింటుండడం జరిగింది ఇన్నాళ్ళూ.

కానీ, ఇన్నాళ్లకి.. ఊహూ.. ఇన్నేళ్లకి నేను మా వదినకన్నా గొప్పగా ఆలోచించేను. ఎప్పుడూ మా వదిన “ఆ పాతకాలం ఆలోచనలు వదిలై” అంటుండేది. కానీ, ఇప్పుడు ఆ మాట వదినతో నేను గర్వంగా అంటాను, “వదినా, ఆ బూజుపట్టిన పాతకాలం ఆలోచనలు తుడిచెయ్యి. కాలానికి తగ్గట్టు కాస్త కొత్తగా ఆలోచించు.” అని.

డైలాగ్ రిహార్సల్ చేసుకుంటుంటేనే మనసు ఉప్పొంగిపోతోంది. అందుకే ఉదయాన్నే పని కూడా గబగబా ముగించేసుకుని వదినకి ఫోన్ చేసేను.

“ఏంటీ, ఇంత పొద్దున్నే! అప్పుడే పనైపోయిందా!”

వదిన ప్రశ్నకి నేను నవ్వేను.

“ఏంటి వదినా, ఇంకా ఎంతసేపని ఆ వంటిల్లు పట్టుకుని వేళ్ళాడతాం చెప్పు! అందుకే చెక్ పెట్టేసేను.”

ఇంతకీ సంగతేమిటంటూ వదిన ఆరా తీసింది.

నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. వదిన చెప్పినట్టుగానే నెమ్మదిగా, స్థిమితంగా, ఒక్కొక్కమాటే ఎదుటివాళ్లకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను.

“అదే వదినా. దసరా నవరాత్రులు వెళ్ళిపోయేయి కదా!” అన్నాను నెమ్మదిగా.

“ఊ..” అంది వదిన అట్నుంచి.

“దీపావళి రాబోతోంది కదా!”

“ఊ..”

“మరి, ఈసారి దీపావళికి నేనేం చేసేనో తెల్సా!” ఊరించేను.

“ఏం చేసేవూ! లడ్డూల బదులు కాజాలు చేసుంటావూ.” అనుమానం లేకుండా చెప్పేసింది వదిన.

“అబ్బ, ఎప్పుడూ తిండి గోలేనా! దీపావళికి ఇంకా ఏం చేస్తారూ!” వదినని ముగ్గులోకి లాగుతూ అడిగేను.

“ఏం చేస్తారూ! బూజులు దులుపుకుంటారు. స్వీట్లు చేసుకుంటారు. దీపాలు వెలిగించుకుంటారు.” ధీమాగా అంది వదిన.

బలే.. నాక్కావల్సిన పాయింటుకి వదిన వచ్చేసింది అనిపించగానే, “అదే.. ఆ దీపాల సంగతే నేను చెప్పబోయేది” అని సస్పెన్సు కోసం కాసేపు ఆగేను. కానీ వదిన ఏమాత్రం ఆసక్తి చూపించకుండా, “సరే, చెప్పు. ఏం చేసేవో!” అంది.

పాపం వదినకి కాస్త ఆలోచించి చెప్పడానికి ఛాన్సు ఇద్దామనిపించింది.

“నువ్వే చెప్పు ఏం చేసుంటానో!” అన్నాను.

“ఏవుందీ.. దీపాలకి నూనె చవగ్గా ఎక్కడ దొరుకుతుందో కనుక్కునుంటావ్.”

“ఊహు, కాదు.”

“అయితే ప్రమిదలు ఎక్కడ్నించో చవగ్గా తెప్పించుకునుంటావ్.”

“ఊహు. కానే కాదు.”

“నువ్వింతకన్న ఎక్కువగా ఆలోచిస్తావని నేననుకోను కానీ, ఇంతకీ ఏం చేసేవో నువ్వే చెప్పు.”

నాకు సంతోషం వేసింది. వదిన కన్న ముందుగా నేనో కొత్త విషయం ఆవిష్కరిస్తున్నా ననుకుంటుంటేనే బలే సంబరంగా అనిపించింది.

అందుకే, “అదికాదు వదినా, ఈ నూనెలూ వత్తులూ కాకుండా కొత్తరకంగా కూడా మనం దీపాలు పేర్చుకోవచ్చు తెల్సా!” అన్నాను.

“అందులో కొత్తేముందీ! కరెంటుతో వెలిగే దీపాల తోరణాలు మార్కెట్లో బోలెడు.” అంది వదిన.

“అబ్బెబ్బే, కరెంటువి కాదు వదినా. నూనే, పత్తి వత్తీ లేకుండా, కరెంట్ అఖ్ఖర్లేకుండా వెలిగే ప్రమిదల్లాంటి దీపాలు వస్తున్నాయి తెల్సా! ఎంచక్క వాటిలో కాసిన్ని నీళ్ళు పోస్తే చాలు, టక్కున వెలుగుతాయి. ఇంకో రకం వాటిల్లో ఆ నీళ్ళు కూడా పొయ్యక్కర్లేకుండా కాస్త బరువుకి ఓ రూపాయికాసు పెడితే చాలు ఇట్టే వెలుగుతాయి. అవి కొన్నాను నూనెజిడ్డూ అదీ లేకుండా ఎంత బాగున్నాయో!”

నేనేకదా, వదినని మించి కొత్తగా ఆలోచించేసి, బ్రహ్మాండమైన పని చేసానన్నట్టు గొప్పగా చెప్పాను.

“హోస్ అవా! అవి కొత్తవేవిటీ! ఎప్పట్నించో వస్తున్నాయి. నీళ్లతో వెలిగేవీ, బరువు పెడితే వెలిగేవీ, చప్పట్లు కొడితే వెలిగేవీ… ఇలాంటి దీపాలు ఎప్పట్నించో వస్తున్నాయి. అవి సెన్సర్‌తో పని చేస్తాయి. అవి నేను కిందటేడే వాడేసేను.”

హా..హెంత అవమానం. ఏదో కొత్త విషయం కదాని వదినకి చెపితే అది కిందటేడే వాడేసిందిట వదిన. నాకు నోటమ్మట మాట రాలేదు.

“అయినా స్వర్ణా, నువ్వు ఇంకా ఇంత వెనకపడుంటే ఎలా! అవన్నీ మనం పనికట్టుకుని నీళ్ళు పోస్తేనూ, బరువు పెడితేనూ, చప్పట్లు కొడితేనూ వెలుగుతాయి. టెక్నాలజీ ఇంత పెరిగేక కూడా మనం కూర్చున్నచోట్నించి కదలకుండా దీపాలు వెలిగించేసుకునే ఉపాయం ఆలోచించకపోతే ఎలా!”

“కూర్చున్నచోట్నించి కదలకుండానా!” ఈసారి కూడా ఆశ్చర్యపోవడం నా వంతే అయింది.

“ఊ.. కూర్చున్నచోట్నించి కదలకుండా, స్విచ్ వెయ్యక్కర్లేకుండా, రిమోట్ బటన్ నొక్కకుండా దీపతోరణాలు వెలిగేలా ఏర్పాట్లు చేసేను నేను.” గర్వంగా అంది వదిన.

వామ్మో వదినో అనుకుంటూ “ఎలా వదినా!” అన్నాను.

సహజంగానే నా దగ్గర్నించి ఆ మాత్రం ఉత్సుకత ఊహించిన వదిన నెమ్మదిగా తనదైన శైలిలో చెప్పడం మొదలెట్టింది.

“స్వర్ణా, నువ్వే చెప్పూ.. మనవేమో వంటింట్లో ఓ పళ్ళెం పెట్టుకుని, అందులో వరసగా ప్రమిదలు పెట్టుకుని నూనె వేసి, దీపాలు వెలిగించి తెచ్చి, వీధిగుమ్మానికి అటూ ఇటూ పెట్టేక, కాంపౌండ్ వాల్ వైపు వెళ్ళబోతుంటే పాపం మగవాళ్ళు మనకి సాయం చేద్దామని ఆ కాంపౌండ్ వాల్ మీద దీపాలు వాళ్ళు పెడుతుంటారు. అలా కాకుండా ఈ మధ్య కొవ్వొత్తుల దీపాలూ, ఇలా సెన్సర్‌తో వెలిగే దీపాలూ కూడా వస్తున్నాయి. కానీ అవైనా మనం పని కట్టుకుని వెళ్ళి పెట్టి రావాలిగా..”

వదిన ఊపిరి తీసుకుందుకు కాసేపాగింది. కిందపడ్ద నేనింకా పైకి లేవలేకపోతున్నాను. వదిన మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.

“నీకో సంగతి తెల్సా స్వర్ణా, సరిగ్గా అదే టైమ్‌కి టీవీ లో మంచి సినిమాలు వేస్తుంటాడు అదేంటో. దృష్టంతా సినిమా మీదకి పోతుంటే ఏదో పనైపోవాలన్నట్టు దీపాలు పెట్టేస్తాం. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచించేను. ఆలోచించగా ఆలోచించగా టెక్నాలజీ ఇంత పెరిగేక దాన్ని మనం వాడుకోపోతే ఎలా అనిపించింది. అందుకని ఈ పనికి టెక్నాలజీ ఎలా వాడాలా అని ఆలోచిస్తే ‘అలెక్సా’ గుర్తొచ్చింది. వెంటనే మీ అన్నయ్యతో నిన్న ‘అలెక్సా’ కొనిపించేసేను.” అని ఆగింది వదిన.

అలెక్సాకీ, దీపాలకీ సంబంధమేంటో నా కర్థం కాలేదు. నా సంగతి కనిపెట్టిన వదిన చెప్పడం మొదలుపెట్టింది.

“ఈ అలెక్సాని వాడుకున్నామనుకో, ఇంక మనం కూడా ఎంచక్క ఆ దేవుడి దగ్గర ఓటీ, తులసికోట దగ్గర ఓటీ నూనెతో దీపాలు పెట్టేసి, మనం వెలిగించాలనుకున్న కరెంట్ దీపాల తోరణాలన్నీ అలెక్సాకి కనెక్ట్ చేసేసి, మనకి కావాలనుకున్నప్పుడు వెలిగించుకోవడవే. అందుకే మీ అన్నయ్య చేత ‘అలెక్సా’ కొనిపించేసేను. నిన్నంతా కూర్చుని మీ అన్నయ్యకి ఆ దీపాలన్నీ ఎక్కడెక్కడ పెట్టాలో చూపించేను. అన్నీ ఎంచక్క చెప్పినట్టు చేసి మీ అన్నయ్య దానిని అలెక్సాకి కనెక్షన్ ఇచ్చేసేరు. ఇంక పండగరోజు శాస్త్రానికి ఆ దేవుడి ముందూ, తులసికోట దగ్గరా మటుకు దీపం పెట్టేసి, హాయిగా మీ అన్నయ్య పక్కన సోఫాలో కూర్చుని, “లైట్సాన్ అలెక్సా” అని చెప్పేసి, దర్జాగా మీ అన్నయ్యతో కలిసి సినిమా ఎంజాయ్ చేస్తాను.”

నాకు నెమ్మదిగా స్పృహ రావడం మొదలయింది. వదినని ఇన్నాళ్ళూ ఎంత తక్కువ అంచనా వేసానూ!

“వామ్మో వదినా..” అని మాత్రమే అనుకున్నాను ఇన్నాళ్ళూ. కానీ, ఇప్పుడు వదిన చెప్పింది విన్నాక “ఓలమ్మో ఒదినో..” అనుకోకుండా ఉండలేకపోతున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here