[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
అర్థ సంపూర్ణం
సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వతిలకప్రోద్భాసిఫాలాన్తరమ్
కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటమ్।
గణ్డోద్యన్మకరాభకుణ్డలయుగం కణ్ఠోజ్జ్వలత్కౌస్తుభమం
త్వద్రూపంవనమాల్యహారపటలశ్రీవత్సదీప్రం భజే॥
~
సాన్ద్రానన్దావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్।
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్త్వం
తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హన్త భాగ్యం జనానామ్॥
[dropcap]శ్రీ[/dropcap]కృష్ణుని సూచననుసరించి యుధిష్టిరుడు ఆజ్ఞాపించగా భీమసేనుడు ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. నకులుడు శ్రీకృష్ణ వాణిని మహర్షి గణానికి చేరవేశాడు. అందరూ భీష్మ పితామహుని వద్దకు చేరారు. ఎన్నో నీతులు, కథలు, బోధలు చేశాడు గాంగేయుడు. ధర్మజుడు విన్నాడు. వాటితో పాటు శివ సహస్రనామమును కూడా అనుగ్రహించాడు ఆ కురు వృద్ధుడు. అది కూడా రెండు సహస్రనామములు.
కానీ ఏదో లోపం. ఎక్కడో ఏదో దొరకని ఆవేదన కుంతీ పుత్రులలో అగ్రజుడికి. ఇంత మందిని నిహతులను చేసి సంపాదించిన రాజ్యం నెత్తుటి కూడు వంటిదని భావిస్తున్నాడు. ఎందరు ఎన్ని బోధలు చేసినా, స్వయం భగవానుడు వాసుదేవ కృష్ణుడే కర్తవ్య బోధ చేసినా, ఏదో లోటు.
అప్పుడు పలికింది అతని నోట ఒక శ్లోకం!
లోకపు శోకాన్ని తీర్చేందుకు.
కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్।
స్తువన్తః కం కమర్చన్తః ప్రాప్నుయుర్మానవాః శుభమ్॥
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః।
కిం జపన్ముచ్యతే జన్తుర్జన్మసంసారబంధనాత్॥
చూడటానికి మామూలు ప్రశ్నలే. మనలాంటి వారు పెద్దలు కనిపిస్తే అడిగే సామాన్యమైన ప్రశ్నలే.
సమస్యలో ఉన్నాం. పరిష్కారం చూపండి. ఏ దేవుడు గొప్పవాడు? ఏ దేవుడు/దేవతను ప్రార్థిస్తే మా కోరికలు సత్వరం తీరుతాయి? ఎట్సెటరాదులు.
కానీ అడిగిన వాడు ధర్మ దేవత అంశ. సమాధానం చెప్పబోయేవాడు సాక్షాత్ అష్టవసువులలో ఒక్కడు. ఎదురుగా ఉండి ఆమోదం తెలుపుతూ, వినబోయేది స్వయం భగవానుడు. విని ఆచరించవలసినది?
ధర్మజుడు కాదు. మనం. మనమే.
కేవలం మనకోసమే ధర్మరాజు ఈ ప్రశ్నలు అడిగాడు.
నిజమా?
కాదా?
అటు నహుషుని, ఇటు యక్షరూపంలోని ధర్మదేవతను తన సమాధానాలతో మెప్పించిన యుధిష్ఠిరునికి ఈ విషయాలు తెలియవా?
భీష్మ పితామహుడు చెప్పవలసిన అవసరం ఉంది. కర్మ క్షయం కోసం. భగవదనుగ్రహం కోసం. దానికి సమయం వచ్చింది. నూట అరవై సంవత్సరాల క్రితం చెప్పవలసిన రహస్యాలను, విప్పవలసిన ముడులను ఈనాడు విప్పిస్తున్నాడు శ్రీకృష్ణుడు.
అది ధర్మదేవత చేతుల మీదుగా జరగటం వల్ల దానికి ఒక సాధికారత వస్తుంది. ధర్మం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ధర్మం యొక్క గొప్పతనం మీద ఈ కలియుగ వాసుల కోసం వెలుతురును ప్రసరిస్తుంది. అందుకే ఈ లీల. అందుకే మహర్షిసత్తముల ఆగమనం. ఇందరు సాక్షులు. ఈ స్తోత్రానికే.
మరి శివ సహస్రనామం?
॥ఏకం సత్ విప్రా బహుదా వదన్తి॥
ఇక, పై మాటలు చెప్పనవసరం లేదు కదా?
ధర్మరాజు అడిగింది ఆరే ప్రశ్నలు.
అరిషడ్వర్గాలను జయించేందుకు సమస్త మానవాళికి ఉపయోగపడబోయే అపురూప స్తోత్రానికి నాన్ది పలికినవి ఆరే ప్రశ్నలు.
ఆశ్చర్యం చూశారా?
6 x 6 = 36.
అక్కడ నుంచి కలియుగారంభానికి ఉన్నది సరిగ్గా 36 సంవత్సరాల కాలమే.
మరొక విశేషం.
ఆ అరిషడ్వర్గాలలోని కామం చతుర్విధ పురుషార్థాలలో ఒకటి.
- ధర్మ (చూడండి. ధర్మం యొక్క రిఫరెన్స్)
- అర్థ
- కామ
- మోక్ష
4 x 9 = 36
ఈ నాలుగు పురుషార్థాలను నవగ్రహాల ప్రభావం చేత 36 రకాలుగా భ్రష్టు పట్టిస్తారు మానవులు. వారిని ఉద్ధరించేది ఒకటే! ఆ ఒకటే..
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం. కలౌ హరినామ సఙ్కీర్తనమ్!
అంతేనా?
అక్కడ సప్తర్షులు నిలబడి ఉన్నారు. 7.
భీష్మాచార్యులు. గురువు. ఆచార్యుడు. 1.
శ్రీకృష్ణ పరమాత్మ. 1. ఒక్కడే. ఒక్కడే. ఒక్కడే.
మొత్తం 9.
చతుర్విధ పురుయార్థాలను అటు మహర్షిగణంతోను, ఆచార్యునితోను, భగవానునితోను అనుసంధిస్తూ, అనుసంధానిస్తే..
మానవులు తరించవచ్చని సందేశం.
మహర్షులు మనకు గోత్రాలను ఇచ్చారు. అంటే వారు మనకు పితృదేవతలతో సమానం. లేదా మన పితృదేవతలకు ఆద్యులు. అనగా..
తల్లితండ్రులు. అనుకోవచ్చు. తప్పేముంది? అందుకేగా మనకు ఋషి ఋణం ఉండేది!
ఇంతేనా?
మన వంశాలకు వారే మూల పురుషులు.
ఇక ఆచార్యుడు. గురువు.
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాఞ్జనశలాకయా।
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః॥
అజ్ఞాన, తిమిర, అన్ధస్య, జ్ఞాన, అఞ్జనశలాకయా,
చక్షుః, ఉన్మీలితం, యేన, తస్మై, శ్రీగురవే, నమః
అజ్ఞానం అనే అంధకారమునుండి, ఆ చీకటితో ఆ గుడ్డివాని మూసుకు పోయిన కళ్ళని, జ్ఞానం అనే కాటుక లేదా లేపనముచే, సరియైన మార్గదర్శకుడై జ్ఞానం దిశగా నడిపేటటువంటి వానిని అట్టి గురువుకై నమస్కరించుచున్నాను.
భారతీయ సంస్కృతిలో గురువు అత్యంత ప్రాధాన్యమైన వ్యక్తి. అజ్ఞానము అనే అంధకారమునుండి శిష్యుడికి జ్ఞాన సముపార్జన చేసి, సరియైన మార్గనిర్దేశకుడిగా నిలపడములో, ఆ శిష్యుని యొక్క జీవన గమ్యాన్ని సరియైన దారిలో నడపడానికి విశేషమైన పాత్రని పోషించుటలో తల్లిదండ్రుల కంటెను ఉన్నత స్థాయిలో ఉండే ఆ వ్యక్తియే గురువు. అటువంటి గురువు లభించుట అదృష్టం. అట్టి గురువుకై నేను నమస్కరిస్తున్నాను.
गुरु गोविन्द दोऊ खड़े , काके लागू पाय।
बलिहारी गुरु आपने , गोविन्द दियो बताय॥
గురువు, గోవిన్దుడు (భగవానుడు) ఇద్దరూ ఒకసారి నాకు దర్శనమిచ్చారు. అప్పుడు నేను మొదట ఎవరికి నమస్కరించాలి?
కచ్చితంగా నా గురువుకు నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ గోవిన్దుని నాకు పరిచయం చేసినదే ఈ గురువు.
అదీ గురువు యొక్క గొప్పతనం.
మిగిలినది భగవానుడు. ఆయన స్వయంగా శ్రీకృష్ణ అనే నామధేయముతో, దేవకీ వసుదేవుల సంతానంగా, యశోదా నన్దుల ముద్దుబిడ్డగా వచ్చాడు.
అంతేనా? ఆయన కూడా స్వయంగా గురువు.
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥
జగద్గురువు!!
ఎంత విచిత్రం!
ఎంత ఆశ్చర్యం!!!
సౌలభ్యానికి పరాకాష్ట ఆ సన్నివేశం. అలాంటి సన్నివేశంలోనే
భీష్మ పితామహుల ఙ్ఞానమనే సముద్రాన్ని ధర్మజుడనే (అడిగిన ప్రశ్నలు) కవ్వంతో మధిస్తే పుట్టిన అమృతమే…
॥శ్రీవిష్ణు సహస్రనామము॥
ప్రశ్నలు ఎవరైనా అడుగవచ్చు. కానీ శంఖంలో పోస్తేనే తీర్థమవుతాయి.
ధర్మజుని స్థాయి ఉన్న వ్యక్తి అడిగితేనే శ్రీవిష్ణు సహస్రనామము అనే శక్తి పుడుతుంది. మనను తరింపజేసేందుకు.
ఇక్కడ మరొక విశేషం చెప్పుకోవాలి.
వాల్మీకి ముని లాంటి వాడు కాబట్టే నారద మహర్షి కనబడితే..
కోఽన్వస్మిన్సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః॥
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః।
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః॥
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః।
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే॥
అని ఒక ఆదర్శ మానవుడిని నిర్వచించి, ఉన్నాడా? అని పరిప్రశ్నించాడు.
ఒక విషయాన్ని సమగ్రంగా విని తెలుసుకొనే శ్రద్ధతో ఆ విషయం బాగా ఎరిగిన వారిని వినయంతో అడగడం పరి ప్రశ్న.
వినయంతో, విషయం బాగుగా ఎరిగిన వారిని, ఒక విషయం గురించి సమగ్రంగా తెలుసుకోవాలనే భక్తి శ్రద్ధలతో అడగటాన్నే పరిప్రశ్నించటం అంటారు.
ఎప్పుడూ ఏ ప్రశ్ననైనా అది అడిగిన వారి కతూహలమే కాదు, శ్రద్దా వినయ సంపన్నతను ప్రతిబింబించేదిగా ఉండాలి. అలాగే ఎవరిని అడుగుతామో వారు సర్వమూ ఎరిగిన వారు కావాలి. ఎవరిని పడితే వారిని అడుగకూడదు. వాల్మీకి అడిగాడు కాబట్టే, నారదముని అంతటివాడు చెప్పాడు కాబట్టే శ్రీ రామాయణం లభించింది. డీఎన్ఏ కథ తెలుసా? దాని గురించి జరిగిన పరిశోధనలు తెలుసా? అక్కడ కూడా ఇలాంటి పరిప్రశ్న జరిగింది. దాని విషయం తరువాత చూద్దాం. కానీ..
అడిగినవాడు ధర్మజుడట!
చెప్పినవాడు గాంగేయుడట!
విని ఆమోదించిన వాడు వాసుదేవ కృష్ణుడట!
గతంలో శాంతనవుడు వాక్ రూపంలో చేసిన ఏవైనా పాపములు ఏవైనా ఉంటే అర్జునుడి చేత రప్పింపబడిన పావన గంగని పానం చేయటం వల్ల శుద్ధుడై ఉన్నాడు. స్త్రీల వల్ల కరుగ వలసిన కర్మఫలం స్త్రీ వల్లనే సంపూర్తిగా నశించింది.
నారాయణుడి సమక్షంలో భీష్మాచార్యుడు ధర్మ దేవత అంశ అయిన ధర్మరాజు వల్ల ఉత్పన్నమైన ప్రశ్నలకు సమాధానంగా నరులకు నరుడి సమక్షంలో ఉపదేశించబోతున్నాడు.
ఆ ఆరు ప్రశ్నలు..
1.కిమేకం దైవతం లోకే?
లోకంలో ఒక్కడే అయిన దేవుడు (పరమాత్ముడు) ఎవరు?
2.కిం వాప్యేకం పరాయణం?
జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
3.స్తువన్తః కం ప్రాప్నుయుర్మానవాః శుభం?
ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
4.కమర్చనాత్ ప్రాప్నుయుర్మానవాః శుభం?
ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
5.కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః?
మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
6.కిం జపన్ముచ్యతే జన్తుర్జన్మసంసారబంధనాత్?
ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?
సమాధానంగా..
॥శ్రీ భీష్మ ఉవాచ॥
జగత్ప్రభుం దేవదేవమనన్తం పురుషోత్తమమ్।
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః॥
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్।
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ॥
అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్।
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్॥
బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్।
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్॥
ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః।
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా॥
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః।
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్॥
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్।
దైవతం దైవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా॥
యతః సర్వాణి భూతాని భవన్త్యాదియుగాగమే।
యస్మింశ్చ ప్రలయం యాన్తి పునరేవ యుగక్షయే॥
తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే।
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్॥
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః।
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే॥
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః।
ఛన్దోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః॥
అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః।
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే॥
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్।
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్॥
ఈ విధంగా అటు మహర్షి గణం, ఇటు భీష్మాచార్యుడు, ఆ పైన శ్రీకృష్ణ పరమాత్మ.. వీరందరి సమక్షంలో నరుడైన అర్జునుడు కూడా వింటుండగా..
నరులమైన మనకు
అర్థ సంపూర్ణమైన శ్రీవిష్ణు సహస్రనామం అందింది.
ఆరు ప్రశ్నలను, వాటికి సమాధానంగా భీష్ముడు చెప్పిన 9 శ్లోకాలు, అవి ఎక్కడి నుంచీ వచ్చాయి? దాని బీజ, శక్తి, కీలకాలు, ఆ శ్లోకాలు ప్రతిపాదించిన ఏకైక పరబ్రహ్మ గురించి చెప్పిన నాలుగు శ్లోకాలను మథించాలి. నామముల గురించి ఆలోచించే ముందు.
***
గురువాయు పురం లేదా గురువాయూర్ పట్టణం కేరళలో ప్రసిద్ధికెక్కిన ఆథ్యాత్మిక కేంద్రం. పుణ్యక్షేత్రం. ఆ గురువాయూరు అనగానే చాలామందికి గుర్తొచ్చేది గురువాయూరప్పన్ అనబడే ఉన్నికృష్ణన్. అదే.. చిన్ని కృష్ణుడు. కరుణా సముద్రుడైన ఆ స్వామి తన మామగారైన సముద్రుడికి ఒక యోజనం పైన ఒక క్రోసు దూరాన కొలువై ఉన్నాడు. ఆయనది ఆశ్చర్యకరమైన చరిత్ర.
కానీ భగవంతునికి తన చరిత్ర కన్నా తన భక్తుల చరిత్ర జనులకు తెలియుట ప్రీతి. అందుకే భాగవతంలో భగవత్ చరిత్ర కన్నా భాగవత చరిత్రే ఎక్కువ. అందులోను తనను నమ్ముకుని ఉన్న, తననే ఆరాధించే వారిని ఆయన అసలు వదిలిపెట్టడు. వారి కోసం ఏమి చేయాలన్నా సదా సిద్ధంగా ఉంటాడు. ఒక బాలెంతరాలైన స్త్రీ నిద్రలోనైనా తన బిడ్డను మరస్తుందేమో కానీ, స్వామి లేదా ఆ దైవీశక్తి నిరంతరం తనను తలచువారిని మరువదు. సదా వారితోనే ఉంటుంది.
దానికి ఉదాహరణ మేల్పత్తూర్ నారాయణ భట్టాతిరి. ఇక్కడ ఆ భక్తుడు పణ్డితుడా, పామరుడా, సామాన్యుడా అన్న తేడా ఉండదు.
ఆయన గురువాయు పురం చేరి స్వామి వారి చరిత్రను గానం చేసి (వ్రాసి), శ్రీమన్నారాయణీయమ్ అనే భాగవత గ్రంథాన్ని రచించాడు. ఆ కథ, ఆ రచన వల్ల, ఇతః పూర్వం ఆయనకు కలిగిన ఘోరమైన అనారోగ్యం తొలగి స్వస్తుడవటం జగమెరిగిన చరిత్రం. అందుకే నారాయణీయ పారాయణాన్ని అనారోగ్యాలు, పెద్ద పెద్ద సమస్యలు తొలగించుకునేందుకు వాడతారు. అద్భుతమైన పద సంపదతో వైభవోపేతంగా నిలిచే ఆ నారాయణీయంలో 100 అధ్యాయాలలో 10 నుంచీ 12 శ్లోకాలలో భాగవతాన్ని స్వతంత్ర్యాలోచనతో చెప్పాడు నారాయణ భట్టాతిరి. కానీ, ఏ గ్రంథమైనా, ప్రత్యేకించి దైవశక్తితో నిలిచి ఉండేది ఒక దైవకార్యంగా ఒక కారణం కోసం సృజింపబడుతుంది. శ్రీమన్నారాయణీయమూ అలాంటిదే.
శ్రీమన్నారాయణీయమ్ సృజనకు కొంత కాలం మునుపు,
16వ శతాబ్దం మధ్యకాలం.
పూన్తనం నంబూతిరి అనే విష్ణు భక్తుడుండేవాడు. ఈయన కీళత్తూరులో (Keezhattur) ఉండేవాడు. అందరిలాగానే ఆయనకు కూడా బ్రహ్మచర్యం, విద్యాభ్యాసానంతరం వివాహమైనది. సంతానం మాత్రం సరైన సమయంలో కలుగలేదు. అందుకే సంతానహరణం లేదా సంతాన గోపాలం అనే కావ్యం రచించి గురువాయూరప్పన్‌ను స్తుతించాడు. చివరకు ఒక శుభ సమయాన ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆరు నెలలు ఆరోగ్యంగా పెరిగిన ఆ బిడ్డడికి అన్నప్రాశనం చేద్దామని నిశ్చయించి తన వారినందరినీ పిలిచాడు పూన్తనం. కానీ సరిగ్గా అన్న ప్రాశన ముహుర్తం సమీపించే సరికి ఆ బిడ్డడు తన కార్యం ముగిసింది కనుక దేహాన్ని విడిచాడు.
పూన్తనం శోకసంద్రంలో మునిగిపోయాడు. దాదాపు అదే సమయంలో నారాయణ భట్టాతిరి గురువాయూరు చేరి తనకు సంక్రమించిన వ్యాధిని నయం చేసుకుని ప్రతిరోజూ అక్కడ ఆలయంలో శ్రీమన్నారాయణీయం చదువుతున్నాడు. అమృతోపమానమైన ఆ కావ్య శోభను, దానిలోని తత్వాన్ని ఆస్వాదించటానికి భక్తులు అక్కడ ఆయన పారాయణం చేసే సమయానికి పోగుపడటం ప్రారంభించారు.
పూన్తనం స్వామి సన్నిధిలో కూర్చుని ఒకనాడు తన కష్టాన్ని చెప్పుకుని సన్తాన గోపాలం చదవటం మొదలుపెట్టాడు. ఎంత ఆర్తితో చదివాడంటే ఆ ఉన్నికృష్ణన్ ఇక ఆగలేక ఆయన ఒడిలో ఒక కుమారుడి లాగా చేరి ఆటలాడి, ఆయన కుమారుడు లేని లోటు తీరేంతగా సాంత్వన పరచాడు. ఆ స్పర్శ వల్ల పూన్తనానికి కలిగిన మానసిక స్వస్థతను వర్ణించటానికి మాటలు చాలవు. దానికి ఆలయం వెలుపల మణ్టపంలో నారాయణ భట్టాతిరి చేస్తున్న శ్రీమన్నారాయణీయ పఠనం కూడా తోడ్పడింది.
నారాయణ భట్టాతిరి రచించన కావ్యం సంస్కృతంలో ఉంది. పూన్తనం రచన వ్యావహారిక మలయాళ భాషలో ఉంది.
ఒకరోజు పూన్తనం తన కావ్యాన్ని నారాయణభట్టు వద్దకు తీసుకుని వెళ్ళి చూపాడు. సంస్కృతంలో తాను వ్రాసిన శ్రీమన్నారాయణీయం కన్నా మలయాళ భాషలో వ్రాయబడ్డ పూన్తనం రచనను తక్కువదని భావిస్తూ అవహేళన చేశాడు నారాయణ భట్టాతిరి. పూన్తనం గంభీరంగా ఉండిపోయాడు. మంచైనా, చెడైనా కృష్ణార్పణం.
మరునాడు ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక చామనచాయ రంగులో ఉన్న 21 సంవత్సరాల యువకుడు వచ్చాడు. పూన్తనం ఆలయంలో కూర్చుని సంతాన గోపాలం పారాయణం చేస్తున్నాడు. ఆ కుర్రవాడు బయట ప్రాంగణంలో శ్రీమన్నారాయణీయం చదవటానికి ఉద్యుక్తుడవుతున్న నారాయణ భట్టాతిరి వైపు ఒక చూపు విసిరి, ఆలయం లోపలకు వడి వడిగా వెళుతున్నాడు.
ఆ చూపు తాకిడికి భట్టాతిరి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అటువైపు తల తిప్పాడు.
“నాయనా, నారాయణీయమ్ చదువుతున్నాను. ఈ సమయంలో అందరూ మొదట ఇక్కడ కూర్చుని, పారాయణం అయ్యాకే ఆలయ ప్రవేశం చేస్తారు,” అని అన్నాడు.
ఆ యువకుడు పెద్దగా నవ్వి, “ఆ తప్పుల తడక గ్రంథం నీవు పారాయణం చేయటం, నేను వినటం!” అంటూ అక్కడికక్కడే ఆ గ్రంథంలో ఉన్న దోషాలను ఎత్తి చూపాడు. ఏ సహాయం లేకుండానే. భట్టాతిరికి ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు.
నిలువెల్లా అవమానం కలిగించిన తపనతో దహించుకుపోతూ ఆ రోజంతా స్వామిని ప్రార్థిస్తూనే ఉన్నాడు.
రాత్రికి స్వప్నంలో స్వామి దర్శన మిచ్చాడు. పోలికలు చూస్తే ఆ కుర్రవాడిని కలిశాయి.
“శ్రీమన్నారాయణీయం సృజన జరగటం నా సంకల్పం. అందులో తప్పులు, ఒప్పులు నావే. నీవి కావు. నీకెందుకు బాధ? అవమానం?”
“రాసింది నేనే కదా స్వామీ?”
“ఎందుకు రాశావు”
“నాకు ఆరోగ్యం బాగు పడటం కోసం”
“అది నీ స్వీయ ఆలోచనా?”
“ఎళుతచాన్ (Ezhuthachan) చెప్పబట్టీ.”
“ఏమి చెప్పాడు?”
“మీన్ తిట్టు కూట్టుక”
“అంటే”
“చేపతో మొదలుపెట్టు.”
“ఏ భాష అది?”
“మలయాళం.”
“సూచన అందినది మలయాళంలో. చెప్పినవాడు ఒక సంస్కృతంలో మహా పండితుడు.”
భట్టాతిరికి ఏదో అర్థమవుతున్నట్లే తోచింది.
“నీవు మాత్రం ఒక మలయాళ కావ్యాన్ని ధిక్కరిస్తావు?”
స్వామి స్వరం సౌమ్యంగానే ఉన్నా ఆయన పైకి చూపని ధర్మాగ్రహాన్ని నారాయణ భట్టాతిరి గ్రహిస్తున్నాడు.
స్వామి పాదాల పైన పడ్డాడు. పూన్తనాన్ని తగురీతిలో గౌరవించి ఆ కావ్యాన్ని చదువుతానని చెప్పాడు.
“నీకు అర్థమే అయింది. సరే!” అని స్వామి అంతర్థానమయ్యాడు. భట్టాతిరికి మెలకువ వచ్చింది.
అర్థమే అవ్వటం ఏమిటి? ఆలోచనలో పడ్డాడు.
తెల్లవారి ఆలయంలో పూన్తనాన్ని కలిసి తన తప్పుని మన్నించమని అడిగాడు. సహృదయంతో పూన్తనం స్నేహహస్తం సాచాడు.
ఆయనకు సంస్కృతంలో పట్టు చిక్కటానికి నారాయణ భట్టాతిరి శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం చేయిస్తున్నాడు. పూన్తనం చేస్తున్నాడు.
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః..
సాగుతోంది పూన్తనం పారాయణం.
అక్కడ లుప్తమైన అకారాన్ని జోడించకుండా పూన్తనం పద్మనాభో మరప్రభుః అని చదివాడు. అప్పుడే ఆలయ ప్రవేశం చేస్తూ అది గమనించిన నారాయణ భట్టాతిరి నవ్వాడు.
ఈసారి ఆలస్యం కాలేదు. గురవాయూరప్పన్ స్వయంగా వచ్చాడు.
సౌమ్యమైన స్వరంలోనే.. “నీకు అర్థమే అయింది నారాయణ భట్టాతిరీ.”
భట్టాతిరి అవాక్కై నిలబడ్డాడు.
పద్మనాభోఽమరప్రభుః
అమర ప్రభుః – మృతి చెందని వారికి అనగా దేవతలకు లేదా అమరులకు ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే.
కానీ పూన్తనం పలికింది మరప్రభుః – అంటే మృతి చెందే వారికి ప్రభువు. అంటే చరాచర సృష్టిలో మృతి చెందే వారికి లేదా మరణించిన, స్తున్న, బోయే వారికి ప్రభువు. (ఇక్కడ చెప్పకుండా ఆపింది ఒక అద్భుతమైన విషయం ఉంది. దాన్ని ఆ నామం వచ్చిన చోట తెలుసుకుందాం).
“కాదా?” స్వామి అడిగాడు.
“అవును.”
“అంటే నీకు అర్థమే అయ్యింది.”
అప్పుడు తెలిసింది స్వామి మాటలకు అసలు అర్థం భట్టాతిరికి. అర్థమే అయ్యింది.. సగమే తెలిసింది.
“ఆకాశంలో చూస్తే చందురుని అర్థ భాగమే కనబడుతుంది. కానీ మిగతా సగమూ ఉండదా?”
“ఉంటుంది.”
భట్టాతిరి తన లోపాన్ని తెలుసుకున్నాడు.
కానీ, ఒక సందేహం.
అదే అడిగాడు. “స్వామీ! మరి వ్యాకరణ పరంగా..”
“పూన్తనానికి ఉన్న భక్తికి, నా మీద ఉన్న ప్రేమకు వ్యాకరణ దోషాలు అంటవు నారాయణ భట్టాతిరీ! అంటినా వాటిని నేనే తొలగిస్తాను.”
నారాయణ భట్టాతిరి పులకితుడైనాడు. తన తప్పులను కూడా, దోషాలను కూడా స్వామి తొలగిస్తున్న సంగతి తెలుస్తోంది.
క్షేత్రఙ్ఞోఽక్షరయేవచ
“నేను అక్షరాన్నే కదా. అక్షర! మలయాళ భాష కూడా అక్షరాల ఆధారంగా పుట్టినదే కదా. అంటే నా స్వరూపమా కాదా?”
స్వామి ఇక చెప్పాల్సిన పని లేకుండా నారాయణ భట్టాతిరికి తెలియవలసినది తెలిసింది.
అక్షర అక్షర అక్షర!
***
ద్వైతమైనా, అద్వైతమైనా, విశిష్టాద్వైతమైనా.. ఏదైనా భక్తి ప్రేమతో ఉన్నవారికి స్వామి/విశ్వశక్తి అయిన ఆ నారాయణుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మోక్షమూ లభిస్తుంది. కాకపోతే జ్ఞానయోగ సాధనలో అద్వైతం ప్రామాణికమై త్వరితగతిన చేరవలసిన చోటుకు చేరుస్తుందని పెద్దల మాట. అంత వరకే! విశిష్టాద్వైతము ఆ శ్రీమన్నారాయణుడి సౌలభ్య వాత్సల్యానికి పట్టం కట్టింది.
అందుకే ద్వైత వ్యాఖ్యానమూ ప్రధానమే. కానీ,
స్వీయ ఆచరణ. సర్వ ఆదరణ అలవర్చుకోవాలి.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః॥
ఇది తెలుసుకొనుటే అర్థ సంపూర్ణం.
నిరంతర రామనామ స్మరణ చేసే శివుడు పరమ భాగవతోత్తముడు. ఆయనను అవమానించటం, తిరస్కరించటం భాగవతాపచారమే!
(సశేషం)