నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-48

0
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]ఏ[/dropcap]దో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. హైదరాబాదుతో చర్చలు విఫలమై ఆగిపోవటంతో లాయక్ అలీ బృందం పట్ల పండిట్‍జీకి అసహ్యం కలిగింది. సర్దార్ ఆరోగ్యం మెరుగుపడింది. ఆయన మళ్ళీ ఢిల్లీ చేరుకున్నారు. పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్‍ను ఆరంభిస్తూ ఆయన ఉపన్యసించారు:

“హైదరాబాద్ పరిస్థితి ఏమవుతుందని ఎంతోమంది నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను జునాగఢ్‍లో అన్న మాటలు మరిచిపోయి ఉంటారు. హైదరాబాదు సరైన నిర్ణయాలు తీసుకోకపొతే, జునాగఢ్ మార్గంలోనే ప్రయాణిస్తుందని ఆనాడే చెప్పాను. ఆ మాటలు ఇప్పటికీ వర్తిస్తాయి. నేను ఆ మాటలపైనే నిలబడి ఉన్నాను.”

సర్దార్ పలికిన ఈ నిర్ద్వంద్వమైన పలుకులు దేశమంతా నూతనోత్సాహ వాతావరణాన్ని కలిగించాయి. హైదరాబాదులో సంచలనం సృష్టించాయి.

హైదరాబాదుపై సైనిక సంఘర్షణ నీడ కదలాడుతోంది. దాంతో హైదరాబాదు సైనిక దళాల కమాండర్ జనరల్ ఎల్ ఎద్రూస్ ప్రాధాన్యాన్ని సంతరించుకోసాగాడు. తెర పైకి వచ్చాడు.

ఆరడుగుల ఎత్తుతో, విశాలమైన భుజాలు కల ఎల్ ఎద్రూస్‌ది విశిష్టమైన వ్యక్తిత్వం. ఆయనను చూడగానే ఆయన సైనికుడని సులభంగా గుర్తుపట్టవచ్చు. అతని ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. ఆయన అందరితో స్నేహంగా ఉంటాడు. అతడు, అతడి భార్య పలు మార్లు దక్షిణ సదన్‍కు వచ్చారు. నాతో చక్కగానే మాట్లాడుతాడు ఎల్ ఎద్రూస్.

ఆరంభంలో ఆయన ఇత్తెహాద్‍తో స్నేహంగా ఉండేవాడు. లాయక్ అలీకి అతనిపై సంపూర్ణ విశ్వాసం ఉండేది. చర్చలు సఫలం అవుతాయన్న నమ్మకంతో ఆయన ఇత్తెహాద్‍లను బుజ్జగిస్తూ వచ్చాడు. యుద్ధం పరిస్థితి వస్తుందని ఆయన అనుకోలేదు. ఆయనకు హైదరాబాదు సైన్యం పట్ల నిజంతో సంబంధం లేని గొప్ప ఊహలున్నాయి. భారత్ సేన బనియా సేన (వ్యాపారుల సేన) అనీ, హైదరాబాద్ సైన్యం కనీసం ఆరు నెలల వరకూ భారత్ సైన్యంతో పోరాడగలదని నమ్మేవాడు. అయితే, యుద్ధం అసంభవం అనుకున్నంత కాలం ఉన్న విశ్వాసం, యుద్ధం జరిగే వీలుంటుందనగానే మారిపోయి అవిశ్వాసం అయింది.

నాకు అందిన నివేదికలు సరైనవే అయితే, లాయక్ అలీకి ఎల్ ఎద్రూస్  విధేయతపై అపనమ్మకం కలిగింది. ఓ పాకిస్తానీ సైనిక వ్యవహారాల నిపుణుడి సలహాని అనుసరించి ఈ కీలకమైన సమయంలో ఎల్ ఎద్రూస్‌ని లాయక్ అలీ తొలగించలేదు. లేకపోతే ఆయనని తప్పించాలని లాయక్ అలీ ఆలోచించాడు.

ఇప్పుడు సరిహద్దులలో హైదరాబాద్ సేనలు, భారత సేనల నడుమ ఉద్విగ్నతలు పెరుగుతూండటంతో ఎల్ ఎద్రూస్ నిజానిజాలు గ్రహించాడు. రజాకార్ల బాధ్యతారహితమైన ప్రవర్తన వల్ల బలహీనమైన సేనల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకతను ఆయన గ్రహించాడు.

తమకు ఎదురు లేదన్న భ్రమలో ఉన్నారు రజాకార్లు. సరిహద్దులలో పలు ప్రాంతాలలో వారు భారత సేనలను యుద్ధానికి రెచ్చగొట్టారు. అలా రెచ్చగొట్టటం వల్ల జరిగిన ప్రతి పోరులో రజాకార్లు ఓడిపోయారు. అలా ఓడిపోయినప్పుడల్లా ఆ కసిని వారు పొరుగున గ్రామాలలో ఉన్న హిందువులపై తీర్చుకుని ప్రతీకారం తీర్చుకున్నట్టు సంబరపడిపోయేవారు.

సరిహద్దు జిల్లాల్లో రజాకార్లదే రాజ్యం. వారు పాడింది పాట, ఆడింది ఆట. వాళ్ళు రైల్వే స్టేషన్లలో జొరబడి, రైళ్ళ నుంచి ప్రయాణీకులను బయటకు లాగి వెతికేవారు. దొరికింది దోచుకునేవరు. తుపాకీ బాయ్‍నెట్ చూపించి వ్యక్తుల నుండి ధనం, ఆహారాలను బలవంతంగా తీసుకునేవారు. కావలసిన వస్తువులను వ్యాపారులను బెదిరించి తీసుకునేవారు. వారి వేధింపులకు గురికాకుండా ముస్లిమేతర మహిళలు ఇంటి బయట కాలు పెట్టగలిగేవారు కాదు.

మే నెల ఆరంభంలో రజాకార్ల విచిత్ర ప్రవర్తన వ్యక్తిగతంగా నన్ను ఇబ్బందికి గురిచేసింది. నా కొడుకు జగదీష్, అతని భార్యతో కలిసి సెలవలు నా వద్ద గడిపి, బెంగుళూరు నుండి బొంబాయి వెళ్ళే రైలెక్కాడు. హైదారాబాదు పరిధిలో ఉన్న చివరి రైల్వే స్టేషన్ గంగాపూర్ వద్ద ఎవరో చైన్ గుంజారు. రైలు ఆగింది. వెంటనే, రైలు ఆగగానే, రజాకార్లు దాడి చేశారు. ప్రయాణీకులపై దాడి చేశారు. వారిని దూషించారు. హింసించారు. పదకొండు మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు. పదమూడు మంది తప్పిపోయారు. అలా ఎటూ అతాపతా తెలియని వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతి కష్టం మీద ఇంజన్ డ్రైవర్ రైలుని స్టేషన్ దాటించాడు.

రైలుపై దాడి వార్త వినగానే నాకు గుండె ఆగినంత పని అయింది. వాళ్ళు కనుక జగదీష్‍ను గుర్తుపడితే, నా మీద కోపం అతడిపై ప్రదర్శిస్తారన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అదృష్టవశాత్తు వాళ్ళు జగదీష్‍ను నా కొడుకుగా గుర్తించలేదు. రైలు శోలాపూర్ చేరిన తరువాత, రైలు భద్రత వ్యవహారాలు చూసే సైన్యాధికారి, నా కొడుకు కోడలు క్షేమంగా భారత భూభాగం చేరారని టెలిగ్రామ్ పంపించాడు.

ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలతో పాటుగా సైనిక వ్యవహారాల్లో రజాకార్లు జోక్యం చేసుకోవటం ఎల్ ఎద్రూస్‌కి అసంతృప్తి కలిగించింది. శోలాపూర్ జిల్లాలోని ‘బర్సి’ ప్రాంతం నలువైపులా హైదరాబాద్ పరిధిలోకి వచ్చే భూభాగం ఉంది. హైదరాబాద్ భూభాగం నడుమ ఉన్న బర్సి ప్రాంతం చేరాలంటే భారత సైన్యం హైదరాబాద్ పరిధిలో ఉన్న నానజ్ గ్రామం గుండా వెళ్ళాలి. ప్రతిరోజూ మామూలుగా సాగే కార్యక్రమం ఇది.

జూలై 24న రజాకార్లు, తాము ఇటీవలే సహాయం కోసం పిలిపించుకున్న పఠాన్‍లతో కలిసి, స్థానిక పోలీసుల సహాయంతో ఓ కోట లాంటి ఇంట్లో దాక్కుని , భారత సైన్యంపై దొంగ  దాడి చేసేందుకు పథకం వేశారు. భారత సైనికుల జట్టు శోలాపూర్ నుంచి బర్సి ప్రయాణిస్తున్నప్పుడు ఈ కోట లాంటి ఇంటి నుంచి భారత సైన్యంపై రజాకార్లు కాల్పులు జరిపారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. దాంతో భారత సైన్యం వెంటనే అదనపు బలగాలను పిలిపించుకుని, తీవ్రమైన యుద్ధం తరువాత ఆ గ్రామాన్ని హస్తగతం చేసుకుంది.

భారత మిలిటరీ అధికారులు, హైదరాబాద్ సైన్యాధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని నియమించారు. కమిటీలో భారత్ తరఫున బ్రిగేడియర్ సింగ్, హైదరాబాద్ తరఫున లెఫ్టినెంట్ కలనల్ వెస్టన్‍లు సభ్యులు. విచారణ తరువాత ఇచ్చిన నివేదికలో వారు ఈ సంఘటనకు బాధ్యత పూర్తిగా రజాకార్లదే అని స్పష్టంగా పేర్కొన్నారు. రజాకార్లది దోషం అని తీర్మానించిన నానజ్ నివేదికపై సంతకం చేసినందుకు రజ్వీకి కలనల్ వెస్టన్‍పై కోపం వచ్చింది. ఆయనను సస్పెండ్ చేయమని ఎల్ ఎద్రూస్‌ని కోరాడు. అందుకు ఎద్రూస్ నిరాకరించాడు. పట్టలేని ఆగ్రహంతో నానజ్‍ని  తమ అదుపులోకి   తీసుకోమని ఒస్మానాబాద్   దగ్గర ఉన్న సైన్యాన్ని రజ్వీ ఆజ్ఞాపించాడు. రజ్వీ ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం లేదని ఆ సేనల కమాండర్‍కు ఎల్ ఎద్రూస్ ఆజ్ఞలు జారీ చేశాడు. ఇది రజ్వీకి, కమాండర్-ఇన్-చీఫ్‍కి నడుమ ఉద్విగ్నతలకి దారి తీసింది.

జూలై 27న, 200 మంది రజాకార్లు భారత భూభాగంలోని ఓ గ్రామంపై దాడికి సిద్ధమయ్యారు. ఆ గ్రామానికి రక్షణగా వెళ్తున్న భారత సైన్యంపై సరిహద్దు ఆవల నుండి కాల్పులు జరిగాయి. దాంతో భారత దళ కమాండర్ ఆ కాల్పులు జరిపిన వారిని  అదుపులోకి తీసుకున్నాడు.

రజాకార్లకూ, ఎల్ ఎద్రూస్‍కు నడుమ సంబంధాలు ఏ స్థాయిలో చెడిపోయాయో, జనరల్ ఎద్రూస్ స్నేహితుడు కలనల్ గ్రాహమ్ నన్ను కలిసేదాకా నాకు తెలియదు. కలనల్ గ్రాహమ్ సివిల్ గార్డ్స్  అధికారి. రజ్వీ కార్యకలాపాలు  ఆగి, హైదరాబాదులో మారణాయుధాల చట్టం అమలు అయ్యేదాక తాను హైదరాబాదులో ఉండలేనని అన్నాడు. ఇది జరిగే వీలు లేదు కాబట్టి తాను హైదారాబాద్ వదిలి ఇంగ్లండ్ వెళ్ళిపోతున్నానని అన్నాడు.

కలనల్ గ్రాహమ్ చక్కని వ్యక్తి. ఆయన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీలో పోరాడేడు. ఆ సమయంలో ఆయన ఓ ప్రముఖ ఇటలీ వ్యక్తి నుంచి ఓ ఘనమైన రివాల్వర్‌ను జ్ఞాపకార్థంగా పొందాడు. దాన్ని నా దగ్గరకు తీసుకువచ్చాడు.

“నేను బొంబాయికి దీన్ని తీసుకువెళ్తే దీన్ని పోగొట్టుకుంటాను, కాబట్టి దీన్ని మీరు స్వీకరిస్తారా? భవిష్యత్తులో మనం ఎప్పుడయినా కలిసినప్పుడు  దీన్ని నాకు తిరిగి ఇస్తే సంతోషిస్తాను” అన్నాడు. నేను అలాగే చేస్తానని వాగ్దానం చేశాను.

కలనల్ గ్రాహమ్ ఇంగ్లండ్ వెళ్ళేటప్పుడు నేను అతడికి ఎలాంటి కష్టం  కలగకుండా చూడమని బొంబాయి ప్రభుత్వాన్ని కోరాను. వారు అతడిని బొంబాయిలో కలవటమే కాదు, నా  తరఫున, అతనికి, ఆయన ఎంతో ఇష్టపడిన రివాల్వర్‍ను కూడా అందజేశారు.

నానజ్ సంఘటనతో ఎల్ ఎద్రూస్ సహనం నశించింది. రజ్వీ తన సైనిక వ్యవహారాలలో వేలు దూర్చటం ఆయన భరించలేకపోయాడు. ఆయన తిన్నగా నిజామ్ దగ్గరకు వెళ్ళి రజాకార్లను పూర్తిగా అణచివేయమని, లేకపోతే తన నియంత్రణలో వారుండాలని కోరాడు.  విమానాల ద్వారా సిడ్నీ కాటన్  అక్రమంగా హైదరాబాదులోకి తీసుకువచ్చిన మారణాయుధాలను తనకు అప్పగించాలని ఆయన లాయక్ అలీని కోరాడు. అతని కోరికను నిజామ్ తీర్చలేడు. లాయక్ అలీ తీర్చడు.

ఆగస్టు ఆరంభంలో దక్షిణ భారత చర్చ్‌కు చెందిన మెదక్ జిల్లా అధికారి డబ్ల్యూ. లె కాటో ఎడ్వర్డ్స్ పలు ఫిర్యాదులు పట్టుకుని నా దగ్గరకు వచ్చాడు. ఆయన తన జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితుల పట్ల ఆందోళనను వ్యక్తం చేస్తూ ఓ ఫిర్యాదు పత్రం సమర్పించాడు. నిజామ్ ప్రభుత్వం భారత్‍కు వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇలాంటి నిష్పక్షపాతి అయిన క్రిస్టియన్ మిషనరీ అధికారి సమర్పించిన నివేదికను ప్రజల ముందుంచటం వల్ల విదేశాల ప్రజలలో భారత్ పట్ల ఉన్న అపోహలను తగ్గించవచ్చని అనిపించింది.

నా సూచనని అనుసరించి, ఆగస్టు 5, 1948 తారీఖున రెవరెండ్ ఎడ్వర్డ్స్ నాకు ఆ పత్రాన్ని అందజేశారు. ఆ ఉత్తరం ఇంగ్లండ్ లోని రెండు, ఆస్ట్రేలియా లోని ఒక – మొత్తం మూడు మిషనరీ సంఘాల కేంద్రాలకు పంపారు.

ఆ ఉత్తరంలో మెదక్ జిల్లాలోని పరిస్థితులను మూడు విభాగాల క్రింద వర్గీకరించారు. శాంతిభద్రతల పరిస్థితి, బహిరంగ ఘర్షణ, స్థిరపడిన  విప్లవం అన్నవి ఈ మూడు విభాగాలు. కొన్ని ఉదాహరణలు చూపించిన తరువాత రెవరెండ్ ఇలా రాశారు:

“రజాకార్లు అంత క్రితం రాత్రి దాడులు చేసి దోచుకోవటం వల్ల ప్రజలు ఇళ్ళూ, వాకిళ్ళూ వదిలేసి పారిపోయారు. నిర్మానుష్యమైన గ్రామాలను చూస్తుంటే భరించరాని బాధ కలుగుతున్నది. వారి దాడుల్లో ప్రజలనేకులు తీవ్రంగా గాయపడ్డారు.

క్రిస్టియన్లను మతం మారమని లంచం ఆశ చూపిస్తున్నారు, బెదిరిస్తున్నారు.

ఫణిగిరి ప్రాంతంలో వారిని కమ్యూనిస్టులు ఒత్తిడి చేస్తున్నారు. మరో ప్రాంతంలో కాంగ్రెసూ, ఇంకో ప్రాంతంలో అణగారిన వర్గాల సంస్థలు – అనేకానేక ప్రాంతాలలో రజాకార్లు ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. స్వీయ రక్షణ కోసం క్రిస్టియన్లు ఏదో ఒక పక్షంలో  చేరక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఏదో ఒక వైపు చేరకుండా తటస్థంగా ఉండడం కష్టసాధ్యమవుతోంది.

అమాయాకులు, శాంతికాములయిన గ్రామ ప్రజలందరూ ఎవరో ఒకరి  దాడులను అనుభవించాల్సి వస్తోంది. ఆ ప్రాంతంలో బలం ఉన్న వారు తమను సమర్థించాలని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. వెంటనే వారి  వ్యతిరేక  జట్టు దాడి చేస్తున్నారు. దాంతో అడకత్తెరలో పోక చెక్కలా ప్రజలు నలిగిపోతున్నారు. ఇందువల్ల ప్రజలు అనేకులు అనవసరంగా శిక్షలు అనుభవిస్తున్నారు. దోపిడీకి, దొంగతనాలని గురవుతున్నారు. గ్రామాలు పరశురామ ప్రీతి అవుతున్నాయి. విచక్షణా రహితమైన కాల్పులతో గ్రామ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయా ప్రాంతాలలో పని చేస్తున్నవారు ఇలాంటి అకృత్యాలకు క్రిస్టియన్లు కూడా బలవుతున్నారని చెప్తున్నారు. ఇలా బలవుతున్నవారు అమాయక గ్రామీణ ప్రజలు.

కేవలం ఏదో అనుమానంతో నిరాయుధులయిన  అమాయకులను కాల్చి చంపటం కూడదని అభ్యర్థనలు అందజేశాం. విచక్షణా రహితంగా గ్రామాలను కాల్చివేయటం తగదని అభ్యర్థించాం. కానీ ఏమీ లాభం లేకుండా ఉంది.”

‘స్థిరపడిన విప్లవం’ అన్న విభాగంలో రెవరెండ్ ఎడ్వర్డ్స్ ఈ విధంగా రాశారు:

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here