దేశ విభజన విషవృక్షం-65

0
8

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]క్వి[/dropcap]ట్ ఇండియా ఉద్యమం అణచివేసిన తరువాత కూడా 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు కాంగ్రెస్ నాయకులను జైళ్లలోనుంచి విడిచి పెట్టలేదు. కాంగ్రెసేతర నాయకులంతా హాయిగా తమ కార్యాచరణలో ఉండిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం 1945 సెప్టెంబర్ దాకా కొనసాగింది. యుద్ధ సమయంలో కాంగ్రెస్ వారు క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చి.. జైలుపాలైతే.. ముస్లిం లీగ్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించి.. బ్రిటిష్ వారు అందించిన సహాయంతో.. భారతదేశమంతటా విస్తరించింది. బెంగాల్ సహా పలు చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. యుద్ధం అనంతరం కాంగ్రెస్ పరిస్థితి నిస్సహాయంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధంతో తల బొప్పి కట్టిన బ్రిటన్‌కు మరో తలనొప్పి భారత్‌లో జరిగింది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులపై 1946 జనవరిలో బ్రిటిష్ అధికారులు ఎర్రకోట దగ్గర విచారణ చేపట్టారు. ఐఎన్ఏ అధికారులు ముగ్గురు షానవాజ్ ఖాన్, కల్నల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గుర్ బక్ష్ సింగ్ లను ఇలా బహిరంగంగా విచారించడంపై భారత ప్రజల్లో తీవ్ర నిరసనలకు కారణమైంది. దేశం కోసం పోరాడిన విప్లవకారులను తిరుగుబాటుదారులుగా ముద్రవేయడంతో ఆందోళనలు రేగాయి. ఈ విచారణలు.. ఆందోళనలతో పాటు యుద్ధ సమయంలో నేతాజీ కథలు, బర్మాలో ఐఎన్‌ఏ పోరాట గాథలు, ఇంఫాల్ ముట్టడి వంటి కథనాలన్నీ కూడా ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇవి రకరకాల మీడియాల ద్వారా, వైర్లెస్ సెట్ల ద్వారా నావికా దళ సైనికుల చెవుల్లో పడ్డాయి. ఇది కరాచీలో, మనోరా ద్వీపానికి దూరంగా ఉన్న రాయల్ ఇండియన్ నేవీ షిప్, హెచ్ఎంఐఎస్ హిందుస్థాన్‌లో తిరుగుబాటుకు కారణమైంది. 1946 ఫిబ్రవరి 19న నౌకాదళంలో సమ్మె కమిటీ ఏర్పడింది. బొంబాయి నుంచి వచ్చిన  రేటింగులు (జవానులు) తిరుగుబాటులో చేరిపోయారు. వీళ్లంతా తమ హోదాలను వదిలివేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను నిర్దాక్షిణ్యంగా సముద్రంలోకి తోసివేశారు. కొద్ది రోజుల్లోనే బొంబాయి, కరాచీ, కొచ్చిన్, విశాఖపట్నంల నుంచి అనేకమంది నౌకాదళంలోని రేటింగులు తిరుగుబాటులో చేరారు. హెచ్ఎంఐఎస్ తల్వార్ లో ఉన్న వైర్‌లెస్ సెట్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించుకుంటూ.. తిరుగుబాటును బలోపేతం చేశారు. బొంబాయిలోని స్లోప్‌లు, మైన్ స్వీపర్లు, తీర స్థావరాల నుంచి వందలాది స్ట్రైకర్లు హార్న్ బై రోడ్డు మీద భారీ ప్రదర్శన జరిగింది. తిరుగుబాటు తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారిపోయింది. బ్రిటన్ అధికారులను సుత్తి, హాకీ కర్రలు, క్రౌబార్లు.. ఇలా ఏది దొరికితే దానితో తలలు పగులగొట్టారు. ఓడలపై నుంచి బ్రిటన్ జెండాలు దిగిపోయాయి. సమాచారం (మెయిల్ లేదా ఉత్తరాలు) తీసుకెళ్లే వాహనాలను కాల్చివేశారు. బగ్గీల్లో వెళ్తున్న బ్రిటిషర్లను బగ్గీల్లోంచి దింపి రోడ్డు మీద నిలబెట్టి జైహింద్ అని నినాదాలు చేయించారు. బాంబే ప్రెసిడెన్సీలో వినియోగించడానికి నిల్వ ఉంచే మందుగుండు సామగ్రి ఉన్న బుచర్ ద్వీపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. మెరెన్ డ్రైవ్, అంధేరీ లోని దాదాపు వెయ్యి మంది ఆర్ఐఏఎఫ్ సైనికులు కూడా రేటింగ్ లతో జత కూడారు. వీరి ప్రధాన నినాదం ఏమిటంటే.. బ్రిటన్ ప్రభుత్వం బందీలుగా చేసిన 11 వేల మంది ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను తక్షణం విడుదల చేయాలని.. 1946 ఫిబ్రవరి 19వ తేదీన అన్ని నౌకలపై త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ఫిబ్రవరి 21 నాటికి బ్రిటన్ దళాలు బొంబాయి తీరానికి చేరుకున్నాయి. తమ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఆదేశాలతో బ్రిటన్ అధికారులు నౌకాదళ సైనికులపై తుపాకులు ఎక్కుపెట్టారు. బేషరతుగా లొంగిపోవాలని ఆదేశించారు. పరిస్థితి అత్యంత వేగంగా మారిపోయింది. బ్రిటన్ అధికారులకు తోడు ఆస్ట్రేలియా, కెనడా బెటాలియన్లు కూడా రంగంలోకి దిగాయి. దీంతో బ్రిటిషర్లను అడ్డుకోవడానికి ఓడలోని గుమస్తాలు, క్లీనర్లు, వంటవాళ్లు కూడా ఆయుధాలు చేపట్టారు. ఈ పరిస్థితిని గమనిస్తే.. ఈ తిరుగుబాటు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తిరుగుబాటును అణచి వేయడానికి తమ బలగాలకు ముందు భారతీయులనే నిలబెట్టి.. తిరుగుబాటు దారుల స్థైర్యాన్ని బలహీనం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. హిందుస్థాన్ ఓడను ఎక్కడానికి ప్రయత్నించిన అధికారులపై రేటింగులు కాల్పులు జరిపారు. హెచ్ఎంఐస్ బహదూర్, చమక్, హిమాలయ ఓడలను స్వాధీనం చేసుకోవడం బ్రిటన్ అధికారుల వల్ల కాలేదు. దీంతో ఒక బెటాలియన్‌ను మనోరా ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా పంపించారు. రెండు వైపుల నుంచి ఒకేసారి ముట్టడించి ద్వీపాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆ తరువాత హిందుస్థాన్ నౌకను స్వాధీనం చేసుకున్నారు. కానీ హెచ్ఎంఐసీ బహదూర్ తిరుగుబాటు దారుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి బ్రిటన్ అధికారులు శ్రమించాల్సి వచ్చింది. తిరుగుబాటును నియంత్రించాలని చూసిన పలువురు అధికారులను రేటింగులు ఓడ నుంచి విసిరేశారు. కానీ.. రెండో బెటాలియన్ దళాలు బహదూర్‌ను ముట్టడించి స్వాధీనం చేసుకోవడం ద్వారా కరాచీలో తిరుగుబాటును అణచివేయగలిగాయి. బొంబాయిలోని ఒక పాత ఓడలో 25 పౌండ్ల తుపాకీ సిబ్బంది కాజిల్ బ్యారక్‌ల వైపు వరుసబెట్టి కాల్పులు జరిపింది. వాస్తవానికి నౌకాదళ తిరుగుబాటుకు కాంగ్రెస్ నాయకులెవరూ కూడా మద్దతుగా నిలవలేదు. 1946 మార్చి 3 న మహాత్మాగాంధీ ఒక ప్రకటన చేశారు. ‘సమ్మె చేసిన వారు తమకు నచ్చిన విప్లవ పార్టీ, రాజకీయ నాయకత్వం యొక్క మార్గదర్శకత్వం లేకుండా చేయడం సరికాద’న్నారు.

“the strikers for revolting without the call of a ‘prepared revolutionary party’ and without the ‘guidance and intervention’ of ‘political leaders of their choice’. He added: “If they mutinied for the freedom of India they were doubly wrong. They could not do so without a call from a prepared revolutionary party.”

తిరుగుబాటుకు మద్దతునిచ్చిన అరుణా అసఫ్ అలీ తీరును కూడా ఆయన తీవ్రంగా ఖండించారు.  “If the union at the barricade is honest then there must be union also at the constitutional front.” అని గాంధీ అన్నారు. దీంతో అరుణా అసఫ్ అలీ మనస్తాపానికి గురై సీపీఐలో చేరిపోయారు. ముస్లిం లీగ్ పార్టీ కూడా తిరుగుబాటును సమర్థించలేదు. పరిస్థితులు చేజారిపోకుండా ఉండటానికి బ్రిటన్ అధికారులు జాతీయ వాద నాయకుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను రేటింగ్ లతో చర్చలు చేయాల్సిందిగా కోరారు. తిరుగుబాటు దారులతో పటేల్ చర్చలు జరిపి వారి డిమాండ్లు చాలా వరకు బ్రిటన్ అధికారులు అంగీకరించేలా చేశారు. ఆ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ నౌకాదళ తిరుగుబాటును సమర్థించింది. నేతాజీ మార్గంలో సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్ పాలనను అంతం చేయాలని ఆశించింది. జాతీయ రాజకీయాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌తో పోటీ పడేందుకు, పై చేయి సాధించేందుకే కమ్యూనిస్టు పార్టీ నౌకాదళ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిందని ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా (తరువాత సుప్రీంకోర్టుగా మారింది)లో న్యాయమూర్తి ఎంఆర్ జయకర్ ఒక లేఖలో రాశారు.

There is a secret rivalry between the Communists and Congressmen, each trying to put the other in the wrong. In yesterday’s speech Vallabhbhai almost said, without using so many words, that the trouble was due to the Communists trying to rival the Congress in the manner of leadership.

సర్దార్ పటేల్ చర్చలతో నౌకాదళంలో తిరుగుబాటు చల్లారింది. కానీ.. బ్రిటిష్ వారికి మాత్రం నిద్ర పట్టడం మానేసింది. భారత్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ప్రవేశించింది మొదలు.. 1946 దాకా.. ఎన్నడూ కూడా కనీ వినీ ఎరుగని రీతిలో జరిగిన తిరుగుబాటును బ్రిటిష్ అధికారులు జీర్ణించుకోలేకపోయారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు విన్‌స్టన్ చర్చిల్ సూత్రప్రాయంగా స్వాతంత్ర్యం ఇస్తామని హామీ ఇచ్చినట్టు నటించి ఆ తరువాత నట్టేట ముంచుదామని ప్రయత్నించారు కానీ.. నౌకాదళ తిరుగుబాటు బ్రిటిష్ పాలకులు కలలో కూడా ఊహించనిది. దీంతో ఇక భారత్‌ను వదిలి పెట్టక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని గ్రహించింది. దీనికి తోడు అమెరికా వైపు నుంచి ఒత్తిడి కూడా పెరిగింది. దీనికి తోడు.. బ్రిటన్ యుద్ధం ముగిసిన వెంటనే భారత్‌ను విడిచిపెట్టేందుకు ప్రణాళికలు రచించడం మొదలు పెట్టింది. అనుకొన్న వెంటనే (1946 ఫిబ్రవరి) భారత్‌కు ఒక క్యాబినెట్ మిషన్ వచ్చింది. భారత్‌లో ప్రభావిత పార్టీలైన కాంగ్రెస్, ముస్లింలీగ్ లతో సదరు మిషన్ చర్చలు మొదలుపెట్టింది. బ్రిటన్ ముందుగా తాను ఒక ప్రతిపాదనను ఈ రెండు పార్టీల ముందుకు తెచ్చింది. పెథిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవీ అలెగ్జాండర్ సభ్యులతో కూడిన ఈ మిషన్.. కొన్ని అంశాల అజెండాతో వచ్చింది.

  1. భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించే దిశగా భారతీయ నేతలతో ఒప్పందం కుదుర్చుకోవడం
  2. భారత రాజ్యాంగ సభను నియమించడం
  3. భారతదేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం..

ఆ సమయంలో బ్రిటిన్ ప్రధానిగా క్లెమెంట్ అట్లీ, భారత వైస్రాయ్‌గా లార్డ్ వావెల్ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ లతో డీల్ చేయటం ఈ మిషన్‌కు సవాలుగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ యునైటెడ్ ఇండియా కోసం పట్టుపట్టింది. మరోవైపు ముస్లిం మెజార్టీ ఉన్న ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని ముస్లిం లీగ్ మంకు పట్టుతో ఉన్నది. ఈ మిషన్ సభ్యులు మొదట సిమ్లాలో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే ముస్లిం లీగ్ తన ఆధిపత్యాన్ని బ్రిటిష్ అధికారులపై స్పష్టంగా ప్రదర్శించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ పాకిస్తాన్ ఇవ్వాల్సిందేనని జిన్నా తేల్చి చెప్పారు. సిమ్లా కాన్ఫరెన్స్ విఫలమైంది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం పంపించిన మిషన్ తన సొంత ప్రతిపాదనలను రెండు పార్టీల ముందుంచింది. మొత్తం 24 పాయింట్లు.. తొమ్మిది పేజీలతో బ్రిటిష్ అజెండా రూపొందింది. రాజ్యాంగ సభ ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించడంతో పాటు.. అది ప్రాథమికంగా విధులు ఎలా నిర్వహించాలో ఈ ప్రణాళికలో ప్రధానాంశంగా ఉన్నది. ప్రాథమికంగా ఏర్పడిన రాజ్యాంగ సభ భవిష్యత్తులో పూర్తిస్థాయి రాజ్యాంగ నిర్మాణానికి ఒక పునాదిగా ఉంటుందని పేర్కొన్నది. ముఖ్యంగా ఈ అజెండాలోని 15వ పాయింట్ లోని ఆరు సబ్ పాయింట్లు.. భారత రాజ్యాంగ రూపకల్పన.. ముఖ్యంగా సమాఖ్య రూపంలో భారతదేశ నిర్మాణంపై ప్రతిపాదించింది. బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ప్రావిన్సులు, సంస్థానాలతో కలిసి ఇండియన్ యూనియన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇండియన్ యూనియన్‌కు ఒక ప్రధాన మంత్రి ఉంటారని, రక్షణ, విదేశాంగం ఆర్థికం, కమ్యూనికేషన్లు, ఇతర  జాతీయ అంశాలు యూనియన్ చేతిలో ఉంటాయని.. మిగతా అధికారాలు ప్రావిన్సులకు అప్పజెప్తామని పేర్కొన్నది. యూనియన్ నిర్వహణకు యూనియన్, రాష్ట్రాల ప్రతినిధుల భాగస్వామ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్, అసెంబ్లీ ఉంటుంది (ఇదే తరువాత కొద్ది మార్పులతో లోక్‌సభగా మారింది). మతపరమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు మెజార్టీ సభ్యులు ఓటుతో పరిష్కరించుకోవాలి. కార్యనిర్వాహకులు, లెజిస్లేచర్లతో ప్రభుత్వాలు ఏర్పరుచుకోవడానికి ప్రావిన్సులు స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ప్రతి ప్రావిన్సూ దేని రాజ్యాంగాన్ని అది రూపొందించుకుంటుంది. పదేళ్ల తరువాత రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఉండాలి. సహజంగానే బ్రిటిషర్లు చేసిన ఈ ప్రతిపాదనను ముస్లిం లీగ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. తమకు పాకిస్తాన్ ఏర్పాటు తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. పైన అన్ని నిబంధనలతో కూడిన ప్రతిపాదనలు చేస్తూనే.. సంస్థానాలను స్వేచ్ఛగా వదిలేస్తూ.. ప్రావిన్సులను గ్రూపులుగా, సెక్షన్లుగా విడగొడుతూ మరో ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. ఈ గ్రూపులను మత ప్రాతిపదికన ఏర్పరిచింది.

  1. భారత వాయవ్య ప్రాంతం, పంజాబ్, సింధ్, బెలూచిస్తాన్
  2. మద్రాస్, బొంబాయి, మధ్యభారత్, యునైటెడ్ ప్రావిన్స్.. ఇతరాలు
  3. బెంగాల్, అస్సాం..

ఈ గ్రూపులు పూర్తిగా మత ప్రాతిపదికన ఏర్పడ్డవే. ఈ గ్రూపులు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయని కూడా బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. ఈ గ్రూపుల్లో ఏదైనా దేశం నుంచి విడిపోదలచుకుంటే విడిపోవచ్చని.. గ్రూపు నుంచి రాష్ట్రాలు కూడా విడిపోవచ్చని కూడా ప్రతిపాదించింది. ఈ గ్రూపులను మాత్రం ముస్లిం లీగ్ అంగీకరించింది. ఎందుకంటే.. విడిపోయే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి (కొద్ది అటూ ఇటుగా చివరకు జరిగింది అదే). ఈ మూడు గ్రూపుల్లో 1, 3 గ్రూపులు ముస్లిం డామినేషన్ ఉన్నవి. రెండో గ్రూపు హిందూ డామినేషన్ ఉన్నవి. ఇవి కాకుండా 550 సంస్థానాలు ఉన్నాయి. వాటికీ.. పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరి ఇండియా అన్న మాటకు భౌగోళిక రూపం ఏమిటి? దీనికి బ్రిటిష్ వాళ్ల దగ్గర సమాధానం లేదు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను సాధారణంగా గమనించినా.. బ్రిటన్, ముస్లింలీగ్ కుట్ర స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రూపులన్నీ కూడా దేశంతో ఉండకుండా విడిపోతే.. సదరు ఇండియన్ యూనియన్ పాలించే ప్రాంతం ఏదన్నది ప్రశ్న. ఈ ప్రతిపాదనలను గమనిస్తే.. చివరకు యూనియన్ (కేంద్ర ప్రభుత్వం) చేతిలో ఉండేది ఢిల్లీ తప్ప మరేదీ ఉండదు. ఇదంతా గమనిస్తే, విభజనను అనివార్యం చేసే ప్రయత్నమే తప్ప మొత్తం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే సానుకూల ప్రతిపాదనలేవీ కూడా ఇందులో ఒక్కటీ లేదు. ఈ విషయాన్ని ముందుగా గమనించింది సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్. కాంగ్రెస్ సమావేశాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు కూడా. కానీ, మిగతా నేతలు ఇంకా దేని గురించో ఆలోచిస్తూ.. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. బ్రిటన్ ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడానికి వేరే కారణాలు ఉన్నాయి. ప్రావిన్సులకు కనీస అధికారాలతో.. బలమైన కేంద్రాన్ని ఆ పార్టీ కోరుకొన్నది. (ఇప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ఇదే కోరుకొంటున్నది. ఇందుకోసమే ప్రయత్నిస్తున్నది). ముస్లిం లీగ్ మాత్రం ఈ ప్రతిపాదనను పరోక్షంగా సమర్థించిందే తప్ప తన వైఖరి ఏమిటన్నది తెలపలేదు. ముస్లింలకు చట్ట సభలలో సమాన ప్రాతినిధ్యంతోపాటు, బలమైన రాజకీయ రక్షణ కావాలని కోరుకొన్నది. అయినప్పటికీ పాకిస్తాన్ తప్ప మరే అంశానికీ ఒప్పుకొనేది లేదని ముస్లిం లీగ్ కరాఖండిగా చెప్పేసింది. ముస్లిం లీగ్ తన డిమాండ్ నుంచి ఎక్కడ కూడా ఒక్క అడుగైనా తగ్గలేదు. కాంగ్రెస్ మాత్రం అటూ ఇటూ ఊగిసలాడుతూనే ఉన్నది. బ్రిటన్ పంపించిన ఈ మిషన్ అయితే ఏదీ తేల్చకుండానే విఫలమై వెళ్లిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here