(‘యమ ద్వితీయ’ సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు మంగు కృష్ణకుమారి)
[dropcap]అం[/dropcap]దరికీ ఇష్టం కార్తీక మాసం,
అందులో రెండో రోజే ‘యమ ద్వితీయ’ట!
ఈ మాసాన ఈ రెండోరోజు,
ఎన్నోసార్లు వచ్చిందీ, వెళ్ళింది కూడా.
అన్నకోసం సదా ఎదురు చూపులు
చూసే ఆ చెల్లి నోము పండింది..
యమున నమ్మకం గెలిచింది.
అన్న వస్తాడన్న శుభవార్త,
అన్నకన్నా ముందే వచ్చింది.
యమున మనసులో
యమునా తరంగాలు..
సంతోషాన్ని భక్తితో కలిపి
రంగరించి గుమ్మం దగ్గరకి చేరి
తొంగి తొంగి చూసేసరికి,
గుమ్మం ముందు దీవెనలలాటి
నవ్వులతో ఉన్నది ఎవరని?
వచ్చింది యముడిలాంటి అన్న కాదు,
సాక్షాత్తూ తన అన్న యముడే!
అయితేనేం ఆమెకేం భయం!
ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న
అన్న, పరివారంతో ప్రత్యక్షం ఐతే!
ఆమె సాక్షాత్తు యమున!
యమునా తరంగాలకి అంతం లేదూ..
యమున మనసులో పొంగే ఆనందానికి హద్దులేదు!
ఉప్పొంగిపోతూ అన్ననీ, అందర్నీ
సాదరంగా ఆహ్వానించింది.
ఆప్యాయంగా వండి,
కొసరి కొసరి వడ్డించి తినిపించింది.
అంత యములవారూ,
చెల్లెలి ప్రేమకి చలించిపోయేరు.
‘ఏదన్నా వరం
కోరుకో తల్లీ’ అన్నారు!
‘అన్నా అన్నా’ అంటున్న నాలిక,
అన్న అడగమన్నా, తన గురించి
అడగలేదే.. అన్నన్నా!
అన్న నాలికకి తీపి తినపెట్టిన ఆ చెల్లి నోటికి
‘అన్నా’ అన్న పిలుపే అన్నం!
అన్న తలపే గుడాన్నమంత బలం!
“అన్నా! ఈ రోజున సోదరి చేతి ముద్ద
తిన్న అన్నలందరికీ ‘అపమృత్యు దోషం’
అంటకుండా కాపాడవా!” అంది.
ఆహా! వరం కూడా అన్నల కోసమే!
అదెంత నమ్మకమో ఆ అన్నమీద!
‘యమున పాశం’ ముందు,
యమపాశం తల దించేసింది.
ప్రాణాలు పట్టుకెళ్లే యముడూ,
పాశధరుడూ మాత్రమె కాదే!
ప్రేమ పాశం అన్నా కూడ తెలిసిన అన్న!
అంత గొప్ప దేముడూ!
అన్నల కోసమే వరమడిగితే, ఆ అన్న
మనసు మిన్నకుంటుందా!
అడిగినంత వరకే, ఇచ్చి ఊరుకోగలదా?
సావిత్రికి పతిని ప్రసాదించిన సమవర్తి!
ఘటనా ఘటన సమర్థుడూ కూడా!
ధర్మం తప్పని చెల్లెల్లో తల్లే కనిపించిందో ఏమో,
‘తథాస్తు’ అంటూనే, ఈ రోజున అన్నకి అన్నం తినిపించిన
చెల్లెమ్మలందరికీ అరగని పసుపూ,
తరగని కుంకం కానుకగా ఇచ్చేసేరు.
ఆప్యాయంగా ‘ అన్నా ‘ అంటూ,
కూరిమితో తిరిగే చెల్లెళ్ల ముందు
అన్నలు ఎంత యములే,
అయినా పిల్లి కూనలే అయిపోరూ!