[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పరిపూర్ణ భక్తి’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్రీ భగవానువాచ:
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే।
శ్రద్ధా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః॥
పై శ్లోకం శ్రీ భగవద్గీత లోని 12వ అధ్యాయంలో (భక్తి యోగం) రెండవ శ్లోకం.
“నా స్వీయ రూపంపై మనస్సు లగ్నం చేసి, చిట్టశుద్ధితో, అనంతమైన ప్రేమతో, శరణాగతి భావంతో ఎల్లప్పుడూ నా ధ్యానం యందే నిమగ్నులై వున్నవారు నాకు అత్యంత పరిపూర్ణులైన భక్తులని నేను భావిస్తాను.”
పరిపూర్ణుడైన భక్తుని యొక్క లక్షణాలను భగవానుడు ఈ శ్లోకం ద్వారా అద్భుతంగా తెలియజేస్తున్నాడు.
ఎల్లప్పుడూ తన పాదాలయందే అనురక్తుడై వుండడం, పవిత్రమైన మనస్సు కలిగి వుండడం, హృదయంలో అనన్య చింతన లేక భగవన్నామస్మరణ యందే దృష్టిని లగ్నం చేయడం, శరణాగతి భావన కలిగివుండడం అత్యంత ప్రధాన లక్షణాలుగా భగవంతుడు తెలియజేస్తున్నాడు.
ఈ విధమైన భక్తుడు తన సాధన కోసం అడవులు పట్టుకొని తిరగనవసరం లేదు. గృహస్థుగా వుంటునే, గృహస్థు జీవితంలో తనకు నిర్దేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తునే భగవదారాధనలో నిమగ్నమై పై లక్షణాలను సంతరించుకోవడం సాధ్యమేనన్నది మనకు జ్ఞానదేవుడు, తుకారాం, నామదేవుడు, పోతన వంటి మహా భక్తుల జీవితాలను పరికిస్తే అర్థమవుతుంది. నేటికీ ఎందరో గృహస్థులు తమ గృహస్థాశ్రమ ధర్మాలను అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తిస్తునే భక్తిలో పరిపూర్ణతను సాధించగలుగుతున్నారు.
భక్తి అనేది ఓ మధురమైన భావన. భగవంతుడి కోసం తన అనుకున్న సర్వస్వాన్నీ అర్పించటమే భక్తి అని నారద భక్తి సూత్రాలు తెలియజేస్తున్నాయి. నిజమైన భక్తి అనుభవైకవేద్యమైనదే తప్ప ఇదీ అని నిర్వచించగలిగేది కాదు. అందుకే నిజమైన భక్తుడు నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు. తన మనస్సులో భగవత్ చింతనను సదా నింపుకునే వుంటాడు. భగవంతుడిని ఆరాధించే కొద్ది క్షణాల పాటైనా కూడా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, అన్య చింతనలు లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునిపైనే మనసును లగ్నం చేసి తనను తాను భగవంతుడికి అర్పణ చేసుకోవడమే పరిపూర్ణమైన భక్తి అవుతుంది.
ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతుడికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే అని నారద భక్తి సూత్రాలు తెలుపుతున్నాయి. భగవంతుని పొందడానికి భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని తొమ్మిది రకాల మార్గాలు సూచించారు. ఇవే నవవిధ భక్తిమార్గాలుగా ప్రసిద్ధి చెందాయి. ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంతిమంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది అని భాగవతం ఘంటాపధంగా చెబుతోంది. అయితే తాము ఎంచుకున్న మార్గంలో సాధకులు లేక ముముక్షువులు పరిపూర్ణమైన విశ్వాసంతో సాధన చేయవలిసి వుంటుంది. నిర్మలమైన భక్తికి భగవంతుడి అందదండలు లభించి స్వామి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది.