సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-30

0
5

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఉమాదేవి పట్ల ఒకప్పటి తన ప్రవర్తనకి పశ్చాత్తాపపడతాడు శంకరం. బిందు తనని తండ్రిగా గుర్తించకపోవడం అతనికి బాధ కలిగిస్తుంది. సంఘమిత్రని గుర్తుచేసుకుంటే, ఆమె బెదిరించినట్టే తన పరువుతీసి, జైలుపాలు చేయగల సమర్థురాలేనని అనుకుంటాడు. భర్త ఆలోచలని కనిపెడుతుంది కాత్యాయిని. పెళ్ళయిన కొత్తలో తన అనుభవాలను గుర్తుచేసుకుంటుంది. భార్య ఆలోచనల్లో లీనమై ఉండడం చూసిన శంకరం ఏమా ఆలోచిస్తున్నావని అడిగితే, మీ గురించే అని అంటుంది. భర్త ఉమాదేవి గురించి ఆలోచిస్తున్నాడని తనకి తెలుసనని అంటుంది. బిందులో తండ్రి మీద అసహ్యం పోవాలంటే కొంత సమయం పడుతుందని చెబుతుంది. ఒకరోజు కాత్యాయిని ఉమాదేవి వాళ్ళింటికి వెళ్తుంది. లోపలికి ఆహ్వానిస్తుంది ఉమాదేవి. తన భర్త ఉమాదేవి పట్ల ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాపడుతున్నాడని చెప్తే, అవన్నీ ఇప్పుడు అనవసరం అని, అది తెగిపోయిన బంధమని, దాని గురించి మాట్లాడవద్దని అంటుంది ఉమాదేవి. అయితే కాత్యాయినితో స్నేహంగా ఉండడానికి అభ్యంతరం లేదని అంటుంది. ఉమకి నచ్చని విషయాన్ని ప్రస్తావించినందుకు క్షమించమని అంటుంది కాత్యాయిని. పర్వాలేదు, మీరు మీ భర్త  మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పారు, ఓ భార్యగా మీరు అలా మాట్లాడడంలో  తప్పులేదు అంటుంది ఉమ. కాసేపు సామజిక స్థితిగతులు, లోకం తీరు గురించి మాట్లాడుకుంటారు. బిందు సుందరి గురించి, మధు గురించి అడిగితే, కాత్యాయిని వాళ్ళిద్దరి గురించి చెబుతుంది. తాను తండ్రి ప్రేమకి దూరమయ్యానని బిందు భావిస్తుంది. ఇక చదవండి.]

అధ్యాయం-59

[dropcap]కా[/dropcap]లం ముందుకు పడుగెడ్తూనే ఉంది. ఆ కాలంతో పాటే పరుగు తీద్దామనుకున్న వాళ్ళకి నిరాశే తప్ప ఏం మిగలదు. బిందూ, శకూ ఇంజనీరింగు ఫైనల్ పరీక్ష పూర్తి చేసారు. వాళ్ళ చదువు ఆ కాలేజీలో పూర్తయినట్టే. ముందు ముందు ఏం చేయాలన్నదే వారి సమస్య.

ఉమాదేవి ఒకసారి కూతుర్ని ఇంకా చదివించాలనుకుంటుంది. మళ్ళీ – పెళ్ళి చేసేయాలి, ఎలాగూ సిద్ధార్థను ఇష్టపడుతోంది కూతురు. ఇద్దరూ వరస అయిన వాళ్ళే – అని అనుకుంటుంది.

మనం ఇష్టపడిన వాళ్ళ దగ్గర కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళ దగ్గర మనకి ప్రేమ, ఆప్యాయతానురాగాలు లభిస్తాయి. సిద్ధూ బిందును ప్రేమిస్తున్నాడు కాబట్టి కూతురు అతడ్ని పెళ్ళి చేసుకుంటే ఎక్కువ సుఖపడ్తుంది అని ఉమాదేవి అనుకుంటుంది.

సిద్ధార్థ, రవి, వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు వృత్తుల్లో ఉన్నా సిద్ధార్థ, రవి, బిందు, శకుంతల మధ్య కమ్యూనికేషన్సు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలా కంటిన్యూ అవడం చాలా చెప్పుకోదగ్గ విషయమే.

ఓనాటి సాయంకాలం సిద్ధార్థ, రవి, బీచిలో కలుసుకున్నారు. తనని కలవమని సిద్ధార్థ రవికి కబురు పంపాడు. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్తూ ముందుకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్తున్నాయి. ఆ కెరటాల ఉధృతి అలాగే వుంది. ఆ కెరటాల వేపు నిశితంగా చూస్తున్నాడు సిద్ధార్థ.

ఏ పని చేస్తున్నా మన మనస్సు మాత్రం ఖాళీగా ఉండకుండా ఏవో ఆలోచన్లతో సతమతమవుతూ ఉంటుంది. అతని ఆలోచనల్లా తనకి, బిందుకి పెళ్ళి జరగబోయే విధం గురించే.

కూతురుకి పెళ్ళి చేస్తున్నప్పుడు కన్యాదాత అదే పెళ్ళి కూతురు తండ్రి తన భార్య నీళ్ళు పోస్తూ ఉంటే అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. ఇప్పుడు మామయ్య శంకరం తన కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు బిందు తల్లి ఉమాదేవికి బదులు కాత్యాయిని అత్త నీళ్ళు పోయాలి. తన కూతురు పెళ్ళి తన ప్రమేయం తన ఉనికి లేకుండా జరుగుతుండడం ఉమాదేవికి ఇష్టం ఉండకపోవచ్చు.

ఈ విషయం ప్రక్కన పెడ్తే అసలు శంకరం తనకి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం పెళ్ళి కూతురు బిందుకి ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే తన తండ్రి అయినా శంకరం మామయ్య మీద బిందుకి సదభిప్రాయం లేదు. తన తల్లి కష్టాలకి, కన్నీళ్ళకి కారకుడయిన కన్న తండ్రినే అసహ్యించుకుంటోంది. ద్వేషిస్తోంది. బిందులో తండ్రి యడల పాజిటివ్ థింకింగ్ వచ్చి నెగిటివ్ థింకింగ్ పోవాలంటే కొంత సమయం పట్టచ్చు.

“సిద్ధూ! ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?”

“మా పెళ్ళి సమస్య గురించే,” అంటూ పరిస్థితిని వివరించాడు సిద్ధార్థ రవికి. రవి కూడా ఆలోచిస్తున్నాడు నిజమే. బిందు మానసిక పరిస్థితి కూడా తండ్రిని ద్వేషిస్తుండడానికే పరిమితి అయింది. ఆమె తల్లికి కూడా – సిద్ధూ మామయ్య శంకరం గారు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం, పీటల మీద కూర్చోడం ఇష్టం ఉండకపోవచ్చు.

ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న రవి “నాకు ఓ ఆలోచన వచ్చింది” అన్నాడు.

“ఏంటది?”

“రిజిష్టారు ఆఫీసులో మీరిద్దరూ రిజిష్టర్ మ్యారేజ్ చేసుకోకూడదా? ఆ తరువాత నలుగుర్ని పిలిచి ఏ హోటల్లోనో గ్రాండ్ పార్టీ ఇవ్వచ్చు. ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు.”

“సమస్య ఉండదని నీవు అంటున్నావు. నాకు అనేక సమస్యలు. అలా పెళ్ళి చేసుకోవడం మా కుటుంబ సభ్యుల్లో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు.”

“కుటుంబ సభ్యుల్ని ఒప్పించడానికి ప్రయత్నించాలి మరి” రవి అన్నాడు.

రవి చెప్పింది కొంత మట్టుకు సబువుగా ఉన్నా ముఖ్యంగా తన తల్లిదండ్రులు ఇష్టపడకపోవచ్చు. పాత తరానికి – కొత్త తరానికి మధ్య మార్పు అదే. తన తండ్రి శాస్త్రోక్తంగా పెళ్ళి జరగాలంటాడు. ‘అలాంటి మనిషిని తను ఒప్పించగలడా?’ సిద్ధార్థ ఆలోచిస్తున్నాడు.

‘ఇవతల తన కుటుంబ సభ్యుల్ని ఒప్పించాలి. అవతల బిందు తల్లిని కూడా ఒప్పించాలి,’ తిరిగి అనుకున్నాడు సిద్ధార్థ.

అధ్యాయం-60

కొడుకు పెళ్ళంటే ఊహల్లో తేలిపోతున్నారు సిద్ధార్థ తల్లిదండ్రలు. తమ తల్లిలో మార్పు కనిపిస్తోంది. ఉమాదేవి పేరు చెప్తేనే ముఖం చిట్లించేది, అలాంటాది తల్లి ప్రసన్నంగా ఉంది. బిందుని కూడా ప్రేమగా చూసుకుంటుందన్న నమ్మకం తనకుంది. ఆమె ఎమోషన్సు, ఫీలింగ్సులో మార్పు అగుపడుతోంది ఇలా అనుకుంటున్నాడు సిద్ధార్థ.

ఆ తరువాతే కుంటుంబంలో అసంతృప్తి చోటు చేసుకుంది. కొడుకు శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకోవడానికి బదులుగా రిజిష్టర్ ఆఫీసులో పెళ్ళి చేసుకుంటాడు అని తెలిసిన తరువాత రామశాస్త్రి అసంతృప్తికి లోనయ్యాడు.

ఏంటో ఈ కాలం పిల్లలు. ఎంత కాలం మారుతున్నా నూతన పోకడలు సమాజంలో సంతరించుకుంటున్నా మనకి పూర్వం నుండి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలూ ఉన్నాయి. వాటిని వదిలి పెట్టడం అంత మంచిది కాదు.

అందుకే మన హైందవ మతం పోకడలు కొన్నాళ్ళకి సమసిపోతాయి. ఆ మతం ఉనికే లేకుండా పోతుందన్న అనుమానం కూడా కలుగుతోంది.

‘పెళ్ళి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆడ, మగని జంటగా కలుపుతున్నప్పుడు దాన్ని పవిత్రమైన కార్యంగా భావించి శాస్త్రోక్తంగా సంప్రదాయంగా వేదమంత్రాల మధ్య వాళ్ళను ఒకటిగా చేయడం. ఈ పెళ్ళి తంతు సందర్భంలో చదివే ఈ పెళ్ళి మంత్రాలకి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఇవేవీ నేటి వాళ్ళకి అక్కరలేదు. ఏదో తూతూ మంత్రంగా పెళ్ళి జరింపిచేయడం లేకపోతే ఇలా రిజిష్టారు ఆఫీసులో పెళ్ళి చేసుకోవడం. ఈ తంతు తనకేం నచ్చలేదు. సమస్య వచ్చినప్పుడు ఇలా పెళ్ళి చేసుకోవడం తప్పదంటాడు కొడుకు. ఇదీ ఓ పెళ్ళేనా అని తనకి అనిపిస్తుంది’ ఇలా అసంతృప్తిగా ఆలోచిస్తున్నాడు రామశాస్త్రి.

తల్లి రామలక్ష్మి ఆలోచన్లు మరోవిధంగా ఉన్నాయి. ‘తన తల్లి సమయంలో పెళ్ళిళ్ళు ఐదు, ఆరు రోజులు చేసేవారట. ఎంతో సందడి. ఇప్పటిలాగ బేషజాలు, కృత్రిమత ఉండేది కాదు. మగపెళ్ళి వారిని ఆడపెళ్ళివారు ఎకసెక్కాలు ఆడుతూ పాటలు పాడితే, ఆడపెళ్ళి వారిని ఆటపట్టిస్తూ మగపెళ్ళి వారు పాటల్తో బదులిచ్చేవారుట. బావా మరదళ్ళ పాటలు ఇలా ఉండేవి. అంత ఎందుకూ తన పెళ్ళి సమయంలోనో?

తన భర్తది పల్లెటూరు. అందులోనూ అగ్రహారం. తన అత్తవారు పెళ్ళిలో ఎంత సందడి చేసేవారు. తన తరుపువారుగా దీటుగా హాస్యోక్తుల్తో పెళ్ళి పందిరి చాలా సందడిగా ఉండేది. పెళ్ళి పాటలే కాదు. భోజనాల సమయంలో పాటలూ, ఎంత పెద్ద గొంతుక పెట్టి చదివేవారు.

అప్పుడు ఈ కేటరింగులూ లేవు. ప్లేటు పట్టుకుని వరసలో నిలబడి ప్లేటుతో ఆహార పదార్థాలు వేయించుకుని వచ్చి నిలబడి తినే ఈ బఫే పద్ధతి కూడా లేదు. నేల మీద విస్తరాకులు వేసి వడ్డన చేస్తే నేల మీద కూర్చునే తినేవారు. ఆ తరువాత వచ్చాయి ఈ టేబుళ్ళ మీద భోజనాలు. ఆ రోజుల్లో వంట మనుష్యుల్ని పెట్టించుకుని వండించుకునేవారు.

పెళ్ళి నెల రోజులు ఉండగా అప్పడాలు వత్తడం, వడియాలు పెట్టడం, కందిపొడి మొదలైనవి తయారు చేయడం అబ్బ ఎంత సందడిగా ఉండేది. వియ్యపురాలికని అప్పడాలకి కన్నాలు చేసి, కన్నం అప్పడాలు తయారు చేసేవారు.

అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎంత హైరాన పదోవారు. ఎంత శ్రమ పడేవారు. అయినా ఆ శ్రమలోనే ఎంతో ఆనందం ఉండేది. ఇప్పుడో కట్టిన బట్ట నలగకుండా, చేసుకున్న ముస్తాబు చెదరకుండా డబ్బులు పడెస్తే ఈ క్యేటరింగు పద్ధతి వచ్చింది. బ్రతికాం శ్రమ లేకుండా ముచ్చట్లాడుకుంటూ పెళ్ళి తంతు చూడచ్చు అనుకుంటున్నారు. తన పెళ్ళి మూడు రోజులు జరిగింది. ఈనాడో ఒక్క పూట. ఒక్క రోజుతో పెళ్ళి తంతు ముగించేస్తున్నారు.

అన్నిటిలోనూ సహజత్వం లోపించినట్టే పెళ్ళి తంతులో కూడా సహజత్వం లోపించింది. అదీ కాదు, ఇదీ కాదు ఇప్పుడు ఈ పెళ్ళి తంతు కొత్త పుంతలు తొక్కి ఈ రిజిష్టరు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి’. రామలక్ష్మి కూడా తన అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఉమాదేవి మాత్రం తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. తన కూతురుకి శంకరం, కాత్యాయిని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే మనస్సులో ఏదో తెలియని బాధ కలిగేది. అసంతృప్తి కలిగేది. కొన్ని కావాలనుకున్నప్పుడు మరి కొన్నింటిని వదులుకోక తప్పదు. శాస్త్రోక్తంగా ఉన్న ఒక్కగాని ఒక్క కూతురు పెళ్ళి జరించలేకపోయాను అని తనకి బాధ ఉండచ్చు. అయితే అసాధ్యమయిన పరిస్థితిల్లో తప్పదు రాజీపడడమే అనుకుంది ఆమె.

తల్లి అభీష్టమే తన అభీష్ఠం. తన తల్లికి మనస్తాపం కలిగించే ఏ ఒక్క పని తను చేయకూడదు అని అనుకుంది బిందు. ‘సిద్ధార్థ చదువు విషయంలో సహాయం చేయడం ఆ తరువాత అతడ్ని పెళ్ళి చేసుకున్న విషయంలో తల్లికి కొంత అసంతృప్తి ఉన్నా తల్లి తనని అర్థం చేసుకుంది. తన కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తోంది. తను కూడా ఇక ఆమె మనస్సును నొప్పించకుండా మసలుకోవాలి,’ బిందు ఆలోచన్లు దాకా సాగిపోతున్నాయి.

‘అమ్మయ్య! ఎలాగయితేనేమి పెద్దవాళ్ళను ఒప్పించాను. వాళ్ళకి అసలు ఇలా రిజిష్టరు మ్యేరేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. పాత తరం భావాల మధ్య కొత్త తరం భావాల మధ్య సంఘర్షణ తప్పదు. తేడా తప్పదు. అయితే ఎవరో ఒకరు రాజీకి వచ్చి తంతు జరిపించాలి. మనస్సులో ఎన్ని భిన్న భావాలున్నా – అభిప్రాయాలున్నా ఈ పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు.

మామయ్య కూడా ఇలా పెళ్ళి జరగడానికి విముఖత చూపించాడు. అన్నీ సవ్యంగా ఉంటే తన ఊరిలో అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించేవాడు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సర్దుకోక తప్పదు,’ ఇది సిద్ధార్థ ఆలోచన.

రవి సిద్ధార్థను ఒక్క విషయంతో హర్షిస్తున్నాడు. శంకరం అతని కూతుర్ని సిద్ధార్థ పెళ్ళి చేసుకోడానికి ఇష్టపడలేదని అతడి చదువుకి ఆర్థికంగా సహాయం చేస్తున్న సహాయం ఆపు చేశాడు. అటువంటి మేనమామ శంకరం యడల సౌమ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని బలహీనత అర్థం చేసుకున్నాడు.

అధ్యాయం-61

రిజిష్టారు ఆఫీసులో సిద్ధార్థకి హిమబిందుకి రిజిష్టరు మ్యేరేజ్ జరుగుతుంది. ముఖ్యులైన వారందరూ హాజరయ్యారు. రిజిష్టారు ఫార్మాలిటీ పూర్తి చేశాడు. సాక్షి సంతకానికి సంఘమిత్ర, ఆమె భర్త మన్మథరావు వచ్చి సంతకాలు పెట్టారు.

వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. మధు తనకేం పట్టనట్టు నిర్వికారంగా చూస్తూ ఉన్నాడు. కాని సుందరిది సందడే సందడి. జీవితంలో ఎంత అపురూపమైన సంఘటన జరిగింది. తన కళ్ళెదుట తిరుగుతున్న బిందూ, తను ఒకే తండ్రి పిల్లలు అని తెలియగానే తనకి ఎంత ఆనందం కలిగింది. ‘బావ కూడా బిందూకి తగిన భర్త. తను అతని భార్య కాలేకపోయినందుకు విచారించటం లేదు. తన కన్నా పెద్దదయిన బిందూని పెళ్ళి చేసుకోవడమే అన్ని విధాలా తగిన పని’ ఇలా సాగిపోతున్నాయి సుందరి ఆలోచన్లు.

‘బిందు తనని ఇప్పుడు అసహ్యించుకుంటున్నా తనని అర్థం చేసుకుంటుంది ఏదో రోజున. తనని క్షమిస్తుంది’ అని శంకరం ఆలోచిస్తూ ఉంటే కాత్యాయిని ‘బిందు లాంటి కూతురికి జన్మనిచ్చిన ఉమాదేవి అదృష్టవంతురాలు. ఎందుకూ, తనకీ ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం’ ఇలా అనుకుని నిట్టూర్పు విడిచింది.

అక్కడే అందరికీ స్వీట్లు తినిపించారు. ఆ పనిలో తలమునకలై ఉన్నారు రవి, శకుంతల. వాళ్ళే అన్నీ తామై అన్ని పనులు చక్కబెడ్తూ అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళను చూస్తుంటే అందరికీ ముచ్చట వేస్తోంది. “వీళ్ళిద్దరూ కూడా పెళ్ళి చేసుకుంటారుట” ఎవరో అన్నారు, “చూడ ముచ్చట జంట” అన్నారు మరొకరు.

“మా తమ్ముడికి ఇలా పెళ్ళి తంతు జరిపిస్తే నేను ఊరుకోను.” అంది నవ్వుతూ ఇందిర పద్మతో. “ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి శాస్త్రోక్తంగా పెళ్ళి తంతు జరిపిస్తాం. సమ్మతమేనా?” పద్మ నవ్వుతూ అంది. సూర్యం కూడా హాయిగా నవ్వుకున్నాడు.

సాయంత్రం పెద్ద హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్తు దీపాలు వెలుతురులో ఆ పరిసరాలు ఎంతో శోభాయమానంగా ఉంది. విందు ఆరంభమయింది.

అయితే రామలక్ష్మిలో ఏదో అసంతృప్తి. ఎంత రిజిష్టారు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నా దండలు మార్చుకున్నా కొంత మన సంప్రదాయం ఉండాలి. అందుకే శాస్త్రోక్తంగా పెళ్లి జరగపోయినా కొంతయినా సంతృప్తిగా పెళ్ళి తంతు ముగించాలన్నదే ఆమె భావన.

అందుకే ఆవిడ బలవంతం మీద పురోహితుడిని పిలిపించారు. ఆ హోటల్లోనే పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే సిద్ధార్థ బిందు మెడలో మూడు ముళ్లు వేసాడు. నల్లపూసలు కూడా కట్టాడు. కాళ్ళకి మట్టెలు తొడిగాడు సిద్ధార్థ. అందరూ అక్షింతలు జల్లారు. సన్నాయి వాయిద్యం వినిపిస్తోంది.

ఒక విధమైన క్రొత్త పెళ్ళి తంతు అన్నారు ఎవరో జోక్ వేస్తూ, అందరూ నవ్వారు.

‘ఏంటో ఈ పెళ్ళిళ్ళు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా పెళ్ళిళ్ళలో కూడా మార్పులు వచ్చాయి. పవిత్రమైన వివాహ బంధం కూడా వ్యాపారమయమైపోయింది.

యాంత్రిక జీవనంలో ప్రతీ ఒక్కరూ మర్చిపోతున్న అనుబంధాలను, ఆప్యాయతలను తిరిగి తెచ్చేదే పెళ్ళి వేడుకల సందర్భం. ఇలాంటి పెళ్ళి వేడుకలు నేడు కమర్షియల్‌గా మారిపోయాయి. పెళ్ళి అనేది జీవితంలో మరిచిపోలేని అపురూపమైన బంధం. ఇద్దరి వ్యక్తుల బంధం అది. ఇంకా చెప్పుకుంటే ఆడ, మగ పెళ్ళి అనే బంధంతో కాపురం చేయడానికి లైసెన్సు మాత్రమే కాకుండా ఎన్నో నైతిక అంశాలతో ముడిపడి ఉంటుంది. నేడు ఈ పెళ్ళి తంతు అట్టహాసంగా వేడుకగా మారిపోయింది.

మధ్య తరగతి మనుష్యులు కూడా ఆడంబరమైన వేడుకలు జరిపిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బట్టలు, బంగారం దగ్గర నుండి అన్నీ ఖరీదయిన వేడుకగా మారిపోయాయి. అంతేకాదు పూర్వం పెళ్ళికి గుర్తుగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది. పెళ్ళి తంతునంతటిని ఫోటోగా తీసుకునేవారు. మరి నేదో నిశ్చితార్థం నుండి పెళ్ళి తంతు పూర్తి అయ్యే వరకు మాటలతో సహా వీడియో షూటింగు ఆరంభమవుతుంది.

అసలు చెప్పే విషయం ఏమిటంటే జీవిత కాలపు ఆనందాలకు నెలవైన వివాహ బంధంలో ప్రవేశించడానికి మధ్య తరగతి మనుష్యులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆడంబరాలకి కేరాఫ్‌గా నేటి వివాహ వ్యవస్థ తయారయింది. మధ్య తరగతి కుటుంబీకులు కూడా ఆడంబరాలకి పోయి లక్షలకి లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ వేడుకలు సింపుల్‌గా చేసుకుంటే ఆ ఇంట్లో భౌతిక సౌందర్యం కంటే మానసిక సౌందర్యం వెల్లివిరుస్తుంది.

నేడు వివాహ వ్యవస్థ ఎలా మారిపోయిందంటే వివాహం చేయడానికి కూడా సమయం లేని బిజీ మనుష్యుల కోసం వెడ్డింగ్ ప్లానర్స్ అందుబాటులోకి వచ్చేసేరు. మనం వారికి వివాహ నిమిత్తం ఎంత ఖర్చు చేయగలమో వారికి తెలియజేస్తే వారు దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసెస్తున్నారు. వారి చేతిలో మన స్తోమత ప్రకారం డబ్బు పోసేస్తే చాలు. పెళ్లి సందడి అంతా వారిదే. నేడు పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే సామెత తప్పు అని రుజువు చేస్తున్నారు. పెళ్ళి ఏర్పాట్లు చేయడానికి వెడ్డింగ్ ప్లానర్సు ఉన్నారు. ఇల్లు కట్టి ఇయ్యడానికి బిల్డర్సు ఉన్నారు,’ ఇలా సాగిపోతున్నాయి ఇందిర ఆలోచన్లు.

ఎవరు ఆలోచన్లు వాళ్ళవి. అయితే ఫంక్షను మాత్రం జరుగుతూనే ఉంది. ఒక ప్రక్క ఉమాదేవి, ఇందిర, సంఘమిత్ర, మన్మథరావు. ఉమాదేవకి సంబంధించిన వాళ్ళు కూర్చుని ఉన్నారు. ప్రక్క వరుసలో శంకరం కుటుంబం, సిద్ధార్థ కుటుంబం కూర్చున్నారు. సమాంతర రేఖల్లా శంకరం ఉమాదేవి కూర్చున్నారు. ఎన్నటికీ ఒకరితో మరొకరు కలిసేది లేదన్నట్లు వాళ్ళ నడుమ స్పర్శ రేఖల్లా సిద్ధార్థ, హిమబిందు కలిసి ఉండి అందరి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు.

***

“భూతకాల స్మృతుల నుండి, వర్తమానంలోకి వచ్చి భవిష్యత్ గురించి ఆలోచించు సిద్ధూ!” హిమబిందు సిద్ధార్థతో అంది.

“ప్చ్! బిందూ! నా స్వీట్ మెమరీస్‌ను పాడుచేసావు,” ఆలోచనా ప్రపంచం నుండి బయటపడిన సిద్ధార్థ నొచ్చుకుంటూ అన్నాడు.

“మీ స్వీట్ మెమరీస్ ఎంత వరకూ వచ్చాయి?”

“పెళ్ళి జరిగినంత వరకూ!”

“మహాశయా! మీరు వర్తమానానికి వచ్చి భవిష్యత్ గురించి ఆలోచించమని చెప్తున్నాను. వర్తమానంలో బ్రతకడం గొప్ప అనుభవం. దీన్ని పొందడం అంత సులువు కాదు. దీనికి కొంత సాధన చేసి అలవర్చుకోవాలి. గతం గురించి కూడా ఆలోచించడం అవసరమే. అలాగే భవిష్యత్ గురించి ఆలోచించడం కూడా అవసరమే! గతాన్ని ఆలోచిస్తూ వర్తమానాన్ని, భవిష్యత్తుని పట్టించుకోబోతే జీవితం వృథా అయిపోతుంది. వర్తమానంలో బ్రతుకుతూ గతాన్ని, భవిష్యత్తుని పరిశీలించాలి. గతాన్ని గురించి పాఠాలు నేర్చుకోవాలి. వర్తమానంలో జీవించాలి.

“బిందూ..బిందూ! నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా! ఏవేవో నాకు అర్థం కాని మాటల్ని వేదాంత ధోరణిలో మాట్లాడేస్తూన్నావు,” సిద్ధార్థ గలగల నవ్వుతూ అన్నాడు.

“నేను చెప్తున్నది వేదాంతం కాదు. ఉన్న విషయమే చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన ముందున్నది స్ఫూర్తి విషయం.”

“అదా! మన కాలేజీ జీవితం. అప్పుడు కాలేజీలో జరిగే ర్యాగింగ్ విషయం. ఆ సమయంలో నీవు పడ్డ టెన్షను. ఆ తరువాత నీ, నా అనుభవాలు, అనుభూతులు, ఆ తీపి జ్ఞాపకాల్ని స్ఫూర్తికి చెప్తే దానికి ర్యాగింగ్ అంటే భయం పోతుంది,” నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ.

“మన సమయంలోనే సమాజ తీరు తెన్నులు అంత మంచిగా లేవు. ఇప్పుడయితే మరీను. ఇప్పుడు మనం చేయవల్సింది మన అనుభవాలు చెప్పడం కాదు. స్ఫూర్తిని ర్యాగింగ్ అంటే భయపడకుండా చేయడం. దానికి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఈయడం, అంతేకాని నేర్పవల్సింది ప్రేమ పాఠాలు కాదు మహాశయా!” బుంగ మూతి పెట్టింది బిందు.

ఆమె వేపు ఓ లిప్త కాలం మురిపెంగా చూస్తూ కూతురు గది వేపు అడుగులు వేశాడు. సిద్ధార్థ.

‘సమాంతర రేఖల్లా ఉన్న తన తల్లిదండ్రుల జీవితంలో స్పర్శ రేఖల్లా తమిద్దరి జీవితాలు ఒకదానితో మరొకటి కలిసిపోయాయి. స్ఫూర్తి జీవితం కూడా ఆనందమయంగా ఉండాలి,’ అనుకుంది హిమబిందు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here