పూచే పూల లోన-24

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్‍తో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ తాను వచ్చిన పని మీద దక్షిణ గోవాలో తిరుగుతుంటాడు సుందర్. మధుకర్ గవడే చెప్పిన విషయాలను ఓ డైరీలో రాసుకుని కుర్టోరిమ్‍కు వెళ్తాడు సుందర్. హఠాత్తుగా అక్కడ చిత్ర కనబడుతుంది. ఇంకా వెళ్ళలేదా అంటే లేదంటుంది. ఆ రోజు ఓ అమ్మాయిని పరిచయం చేశారు అని జ్యోతి గురించి అడుగుతాడు. చిత్ర చూపించిన చోట జ్యోతి నిలుచుని కనబడుతుంది. దగ్గరికి వెళ్ళాక జ్యోతి పలకరిస్తుంది. ఇక్కడేం చేస్తున్నారని చిత్ర అడిగితే, శిలాశాసనాలని చూడడానికి వచ్చానని చెప్తాడు సుందర్. పక్కన కెమెరా, ట్రైపాడ్ ఉన్నా కూడా, జ్యోతి కాన్వాస్‍ని రోల్ లోంచి క్రిందకి లాగి తగిలించి స్కెచ్ వేయటం ప్రారంభిస్తుంది. సుందర్ ఆశ్చర్యపోతే, చిత్ర గురించి కొన్ని విషయాలు చెప్పాలి అంటూ, ఇదే ప్రదేశం ఒకప్పుడు ఏమిటీ అనేది ఆ స్కెచ్‌ గీసి చూపిస్తుంది జ్యోతి అని చెప్తుంది. జ్యోతి ఓ అద్భుతమైన చిత్రాన్ని గీస్తుంది. ఆమె చిత్రీకరించిన మనుషుల ఆకారాలు ఆలోచింపజేసాయి. జాగ్రత్తగా పరిశీలిస్తాడు సుందర్.  బొమ్మలో వాళ్ళ తలకి తలపాగాలుంటాయి. నుదుటి మీద నామాలుంటాయి. చేతులలో తాళపత్రాలుంటాయి. కర్నాటక ప్రాంతంలో కట్టే వేషధారణ స్పష్టంగా ఉంటుంది. ఇంతకీ మధుకర్ గారు ఈ ప్రదేశం గురించి ఏం చెప్పారని అడుగుతుంది చిత్ర. కుర్టోరిమ్ ఇప్పటి పేరనీ, ఒకప్పుడు ఈ ప్రాంతం కుర్తారిక అగ్రహారం అని చెప్తాడు సుందర్. అమ్మవారి పేరు కుండోదరని, అది మహామాయ క్షేత్రమని, జ్యోతి కరెక్ట్‌గా చిత్రించిందని చెప్తాడు సుందర్. జ్యోతి ఎందుకో కన్నీరు కారుస్తుంది. ఇక చదవండి.]

[dropcap]రి[/dropcap]సార్ట్స్ లోని బాల్కనీ మీది నుండి అలా సూర్యాస్తమయాన్ని మరల చూస్తున్నాను. ఈ రోజు ఏం చూసావు? రేపు ఏం చూస్తావంటూ పరామర్శించి అలా సముద్రం అంచున మెరుస్తూ రేపు కలుసుకుందామని చెబుతూ అస్తమిస్తున్నాడు సూర్యుడు.

నాకు నా మీదనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడికి వచ్చింది ఓ చిన్న పరిశోధనకు మాత్రమే. కానీ అనుభవాలన్నీ వింతగా సాగుతున్నాయి. ఈ ఉదంతాలను ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవటం ఎంతో అవసరమని అర్థమైంది. ఓ టారిస్టులా సందర్శకుడిగా అలా ఒక్కో ప్రాంతాన్ని చూసేసి ఏదో తినేసి, మరేదో తాగేసి బండి ఎక్కి బాయ్ బాయ్ చెప్పటం నా పని కాదని అర్ధమైంది. అలా అని ఒక డైరీలో ఎప్పుడు ఏం చెయ్యాలి, ఏది వ్రాయాలి, ఎవరిని సంప్రదించాలి అని నిర్ధారించుకుని కొంత సాధించి, కొంత వదిలేసి, బాధ పడి, ఎవరినో బాధపెట్టి సగం పనులు పూర్తి చేసే మనిషిగా మిగలటమూ సరైన పని కాదు. కాకపోతే ఒక తృప్తి మిగిలింది. కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. మనిషికీ, మనిషి మనుగడకీ కావలసిన చిన్ని అంశాలు. వేల సంవత్సరాల క్రితమే నీటిలో కలిపి కేవలం జంతువుల్లా ఒకళ్లనొకళ్లు పీక్కుతిని, మరొకరి ఉనికిని నాశనం చేసి ఓ జెండా పాతి నాదే న్యాయం అని చెప్పుకోవటమే నాగరికత, సంస్కృతి అన్న ప్రతిపాదన ఈ భూమి మీద నానాటి బ్రతుకు నాటకంగా కాకుండా వాస్తవంగానే మిగిలిపోయింది.

భగవంతుడు ‘యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః। ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే॥’ (భగవద్గీత 3.17) అని చెప్పినా మనం వినలేదు. ఆత్మలోనే పరమానందాన్ని పొందుతూ, సంతుష్టుగా అంటే వారికి ఇంకా పైన చేయవలసిన పని ఏమున్నది?

అలా భావిస్తూ అత్మసాక్షాత్కారం వైపు జీవనయానాన్ని సాగించేవారు దారుణాతి దారుణమైన దాడులకు ఇతరులకు తేలికగా దొరికిపోవటం తప్ప ఈ భరత భూమి చరిత్రలో ఏముంది?

కాకపోతే ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తూ నేను కూడా పైవాడు నాకు చెప్పదలచుకుందే వినాలని నిలబడ్డట్టు ఇలా కాలం గడుపుతున్నాను.  ఆ ఆలోచనలో ఆలోచించి జేసే శక్తి ఉంది..

క్రింద టేబుల్సు బాటిల్స్‌తో నిండి పోతున్నాయి. మెల్లగా జనం పోగవుతున్నారు. లైట్లు మెరుస్తున్నాయి. అవతలి గేటు దగ్గర ఓ పోలీసు జీపు వచ్చి ఆగింది. సి.ఐ. రాంక్‌లో ఒకరు, మిగతా ఎవరో ఆ లాన్ లోకి వచ్చి అటూ ఇటూ తిరిగారు. సమీర్ ఎక్కువగా, కూర్చునే టేబుల్ దగ్గర ఓ కుక్కని తిప్పారు. అది అటూ ఇటూ తెగ కదిలి పోయింది. కొంపదీసి నా దగ్గరికి వస్తుందా? ఎందుకో ఆ క్షణం నేను తీసుకుంటున్న రిస్కు గురించి తీవ్రమైన ఆలోచన వచ్చింది. నిజమే. నేను సమీర్‌తో అలా అంత దగ్గరగా ఉండటం మంచిది కాదు కదా? ఆ పోలీసులు రిసార్ట్స్ కారిడార్ లోకి వచ్చారు. గదులలోకి కూడా వెళుతున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? ఇలాంటప్పుడు పారిపోవటం సమంజసం కాదు. కళ్లు మూసుకున్నాను. అలాగే నిలబడి ఉన్నాయి. అవునూ? సమీర్ సరిగ్గా ఈ సమయం లోనే రెవాన్‌కి వెళ్లిపోయాడు. అంటే ఎవరో సమాచారం అందిస్తున్నారన్నమాట. మనం ఇరుకున పడ్డామా?

బెల్ మ్రోగింది. తలుపు వైపు తిరిగాను.

“యస్?” గట్టిగా అన్నాను. తలుపు తెరుచుకుంది.

చిత్ర లోపలికి వచ్చింది. చేతిలో ఏవో పుస్తకాలున్నాయి.

“ఇబ్బంది పెడుతున్నానా?” అడిగింది.

“కూర్చోండి.”

ఆ పుస్తకాలు టీపాయ్ మీద పెట్టి జాగ్రత్తగా కూర్చుంది.

“నిన్న మేం వెళ్లిపోయాక ఎంతసేపున్నారు కుర్టోరిమ్‌లో?” అడిగింది.

“చాలా సేపున్నాను. ఇలాంటి చోట ఒక రోజు చాలదు. ఏం తీసుకుంటారు?”

“గ్లాసు మంచి నీళ్లు, అరటికాయ చిప్స్, అరగంట తరువాత కాఫీ” ముద్దుగా అని పక్కున నవ్వింది.

మొబైల్‌లో మెసేజ్ ఇచ్చి ఎదురుగా వచ్చి కూర్చున్నాను.

“జ్యోతి ఎందుకని అలా కన్నీళ్లు పెట్టుకుంది?”

“ఆ అమ్మాయి మీద పరిశోధన చేస్తే రెండు డాక్టరేట్లు ఒకేసారి ఇచ్చేస్తారు.”

“నాకూ అలాగే అనిపించింది”

“ఏవో కనిపిస్తాయి ఆ అమ్మాయికి. కొన్ని చెప్పగలదు, కొన్నింటిని భాషలోకి దింపలేక కన్నీళ్ళు కార్చేస్తుంది. అక్కడ ఎక్కువ సేపు ఆ గుడి గురించి చెప్పింది. ఆ గడి వైపే చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది.”

‘ఆ గుడి అమ్మవారి గుడి..” చెప్పాను “..కుండోదరీ మహామాయ! ఆ గుడికి చుట్టుప్రక్కలా ఆ కాలంలో ఒక ఆగ్రహారం ఉండేది. మంత్ర సాధనకు, తంత్ర సాధనకు అది నిలయం. శాస్త్రాలను అక్కడ అధ్యయనం చేసారు. దాదాపు అది ఒక విశ్వవిద్యాలయం.”

“మీరు బాగా లోపలికి వెళ్లి ఏదో శాసనాలను చూస్తానని అన్నారు. దొరికాయా?”

“దొరికాయి. కొంత తెలిసింది. తెలియనిది చాలా ఉంది. ఇవి ‘కుడతారి రాగి రేకుల’ పేరుతో ప్రసిద్ధి చెందాయి. 1049లో కదంబ వంశీయుడైన వీరవర్మదేవుడు ఇచ్చిన శాసనాలు ఇవి. నాగరి లిపిలో కన్నడ భాషలో శ్రీ మాలిగె భైరవ అని సింహం బొమ్మతో వృత్తాకారంలో మూడు శాసనాలు ఇవి. ఈ కన్నడ భాష కేవలం సీల్ మీద ఉంది.

శాసనం నాగరి లిపిలో సంస్కృతంలో ఉంది. కదంబ రాజులకు ఆద్యుడు త్రిలోచనుడని చెప్పారు. ఈ వీరవర్మదేవుడు రెండవ శాస్తదేవుడి కుమారుడు..” నా డెయిరీలోంచి చదువుతుండగా చిత్ర అడిగిన పదార్థాలతో బేరర్ లోపలికి వచ్చాడు. వాటన్నిటినీ చక్కగా టీపాయ్  మీద పెట్టాడు.

“సార్, కాఫీ తరువాత తెస్తాను. సార్..”

“ఏంటి? డబ్బులు..”

“కాదు సార్. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వచ్చారు. మిమ్మల్ని కలవాలన్నారు.”

అటు చూసాను. అతను మర్యాదగా కాప్ తీసి తల వంచి గ్రీట్ చేసాడు.

“లోపలికి రండి!” అన్నాను.

నేరుగా నా దగ్గరకి వచ్చి చిత్రని ఓ చూపు చూసాడు. నాకు ఓ ఫొటో చూపించాడు. ఊహించినట్లు అది సమీర్‌దే! కాకపోతే గడ్డం లేదు.

“ఇతని పేరు సమీర్ కుమార్. మూవీ స్టార్. మీకు తెలిసే ఉంటుంది. ఈ ప్రాంతంలో చూసారా?”

ఆలోచించాను. పోలీసులతోనూ, లాయర్ల తోనూ, మరో అలాంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇంకెవరైనా చుట్టుప్రక్కల ఉన్నా వారి వైపు చూడకుండా మాట్లాడాలి. అతని వైపే చూసాను.

“ఇతనో కాదో చెప్పలేను, కానీ ఇలాంటి వాడ్ని చూసాను” అన్నాను.

“ఎక్కడ? కరెక్ట్‌గా చెప్పగలరా?”

అతన్ని బాల్కనీ లోకి తీసుకుని వెళ్లాను.

“ఆ చివార్న ఉన్న టేబుల్ దగ్గిర డ్రింక్ చేసేవాడు. సరిగ్గా, నిక్కచ్చిగా చెప్పలేను”

“అతనితో మాట్లాడారా?”

“పెద్దగా లేదు. ఒకసారి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నా ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. మందు మైకంలో తనలో తాను మాట్లాడుకున్నాడు. ఎవరో వచ్చి తీసుకెళ్లి పోయారు”

అతను ఆలోచించాడు.

“ఎవరయి ఉంటారు?”

“ఓ ముసలి జంట”

“ఓ. ఇంకా?”

“అంత కంటే పెద్దగా ఏమి చెప్పలేను సార్”

“గుడ్. అతను మరల కనిపిస్తే మాకు ఫోన్ చెయ్యగలరా?”

“తప్పకుండా.”

“థాంక్యూ సార్. ఆ క్రింద లాన్‍లో కూడా ఇలాగే కొంత మంది చెప్పారు. మీ గురించి మధుకర్ గారు చెప్పారు. మిమ్మల్ని కలవటం మాకు ఆనందంగా ఉంది.”

“థాంక్స్”

అతను వెనక్కి తిరిగాడు. తలుపు దగ్గర ఆగాడు.

“ఆయన ఫోన్ నంబర్ ఇస్తారా?” అడిగాడు.

అలానే చూస్తూ ఉండిపోయాను. కొద్ది సేపటికి తేరుకున్నాడు.

“సారీ సర్. తొందర పడ్డాను. మీకు తెలిస్తే ఇస్తారేమో అనుకున్నాను. వస్తాను!”

వెళ్లిపోయాడు. చిత్ర చిప్స్ సగం తినేసి ఆ సగం ప్లేట్లో ఉంచింది.

“నాకు చాలా ఇష్టం” అంది.

“ఎవరు? సి.ఐ.నా?”

నవ్వింది. “కాదు. ఈ చిప్స్. కూర్చోండి. ఇంకా చెప్పండి” అంది.

నాకు ఆ వ్యవహారం వచ్చింది. పోలీసులెందుకొచ్చారు? ఇలాంటి ప్రశ్నలన్నీ వెయ్యకుండా విషయానికి వచ్చేసింది.

“ఇందులో ఒక విషయం తెలుస్తోంది. వనవాసి అనే అతి పెద్ద నగరానికి ఈయన అధీశ్వరుడు. పెర్మట్టి అనే సంగీత వాయిద్యం ఇక్కడ వాడేవారు. దానితో జనబాహుళ్యంలో కీర్తింపబడ్డవాడని చెప్పారు. ఎనభై నాలుగు నగరాలకి అధిపతి ఈ వీరవర్మదేవుడు.

పదునెనిమిది మార్లు అశ్వమేధం చేసినట్లు వ్రాసారు. ఈ సంఖ్య రాహువుకు చెందినది. ఇది అమ్మవారి ఉపాసన లోనూ, తంత్ర విద్యలోనూ ప్రధానమైన సంఖ్య. కుండోదరి మహిమల గురించి శాస్త్రాలలోనూ ఉంది. పంచ మహాశబ్ద మహామండలేశ్వర అనబడటం ఆలోచింప చేస్తుంది. ఈ శాసనాలలో మాధవార్యుడనే ఓ బ్రాహ్మణునికి కొంత భూమిని దానం ఇచ్చినట్లుంది. ఒక్కొక్క బంగారు నాణెం 4.75 గ్రాములని తెలుస్తోంది. దానానికి టాక్స్ లేదని తెలిసింది. ఈయన ప్రధాన పట్టణం పేరు గోపక అని చెప్పారు. దానంగా ఇచ్చిన భూమి విలువ 24 భైరవ గడ్యాణకములు అని వ్రాసారు. మంత్రులలో ప్రధానంగా ఇద్దరు – సంధికి ఒకరు, విగ్రహికానికి ఇంకొకరు అని చెప్పారు.

దీనిని బట్టి ఇది శక్తి ఉపాసనకు పెట్టిన పేరు. ఒక ఉదాత్తమైన రాజ్యపాలన, వ్యవస్థ, వ్యాపారం, అర్థశాస్త్రంతో పాటు సంధి – విగ్రహములనే రాజనీతి కూడా పాటించారు.”

చిత్ర అన్నీ చక్కగా వ్రాసుకుంది.

“ఏం చేస్తారు?” అడిగాను.

“మధుకర్ గారిని కలుస్తాను. అనుమతి తీసుకుని డాక్యుమెంటరీ తీస్తాను.”

లేచింది. చిప్స్ వైపు చూపించింది. న్యాయం పడితే అవి నాకు. కానీ అన్నట్లు తల ఊపాను. చక్కగా చేతిలోకి తీసుకుని నమివేసింది..

“మీకు థ్రిల్లింగ్‌గా లేదా?” అడిగింది.

“ఏంటి? నా వాటా చిప్స్ మీరు తిన్నప్పుడా?”

చీదరింపుగా మొహం పెట్టింది.

“రైటరు బుద్ధి. అది కాదు, జ్యోతి గీసిన స్కెచ్, మీరు ఇచ్చిన వివరాలు ఎంత అద్భతంగా కలిసాయో చూసారా?”

“నిజమే. ఏ మనిషీ ఇప్పటి వాడు కాడు. పూర్తిగా తెలియని ఓ చరిత్రకి తనను తాను అర్థం చేసుకోలేని ప్రతినిధి!”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here