[‘కథలు 1980-2023’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం వాడ్రేవు చినవీరభద్రుడు గారూ.
వాడ్రేవు చినవీరభద్రుడు: నమస్కారం.
~
1.కథకుడిగా మీ వయస్సు 43 ఏళ్ళు. ఇన్నేళ్ళలో మీరు రాసినవి 35 కథలు మాత్రమేనా? ఇన్ని కథలు మాత్రమే రాయటానికి మీకు తోస్తున్న కారణాలేమిటి?
జ. ‘యు షుడ్ ప్రొడ్యూస్ లైక్ ఎ మిల్ ‘అని అన్నారు భమిడిపాటి జగన్నాథరావుగారు, 1981 లో, నా ‘ట్రాఫిక్’ కథ చదివి. కథారచనలో ఆయన మా గురువు. కానీ ఆయన చెప్పినట్టుగా విరివిగా రాయలేకపోడానికి రెండు కారణాలు.
మొదటిది, నాకు తెలియనిదీ, నా అనుభవంలోకి రానిదీ నేను కథగా రాయలేను. విన్నవో, ఊహించినవో లేదా నా వాదనని నిలబెట్టుకోడానికి పనికొస్తాయనుకున్నవో కథలుగా రాయలేకపోయాను. ఆ కథనుంచి నాకొక ట్రూత్ దొరకాలి. అది నా అనుభవానికి సంబంధించింది అయితేనే ఆ కథ నన్నొక సత్యానికి చేరువగా తీసుకుపోగలుగుతుంది. కాబట్టి వేరేవాళ్ల అనుభవాలు, అవి ఎంత ఆసక్తికరంగా అనిపించినా, వాటిని కథలుగా రాయడం పట్ల నాకు ఆసక్తి లేకపోయింది.
మరో కారణం కథకి నిర్దిష్టత ఉండాలి. డిటెయిలింగ్ చాలా అవసరం. వెలుగునీడలు స్పష్టంగా తెలియాలి. చాలాసార్లు నా అనుభవాల్లో అటువంటి కథలు తారసపడుతుండేవిగాని, నా అనుభవంలోకి వచ్చినవాటిని నేరుగా రాయడానికి నా ఉద్యోగ జీవితం అడ్డుపడుతుండేది. ఆ అడ్డంకిని దాటాలంటే అప్పుడు ఆ సంఘటనల్ని మరెక్కడో, మరెవరికో జరిగినట్టుగా కథలు అల్లాలి. నా ఉద్యోగం నాకు అంత వెసులుబాటు ఇవ్వలేదు.
2.మీరు ప్రధానంగా కవి. ఆలోచనాపరులు. కథా రచనకూ, కవిత్వ సృజనకూ మీరు గమనించిన భేదాలేమిటి? మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు, కథా రచనకా? కవిత్వ రచనకా?
జ. రాయగలిగే మెలకువ తెలిస్తే రెండూ సులువేగాని, కవితకన్నా కథ రాయడం కష్టం. ఎందుకంటే కవిత్వంలో భాష, సంగీతం, అనుభూతి, మూడ్ వంటి వాటివల్ల కవికి చాలాసార్లు తాను చెప్పాలనుకున్నది చెప్పడం ఏమంత కష్టమనిపించదు. కాని కథలో అలాకాదు, అక్కడ ప్రతి ఒక్కటీ నిర్దిష్టంగా ఉండాలి. వివరాలు చాలాముఖ్యం. ఉదాహరణకి ఒక చెంచు జీవితానికి సంబంధించి కథ రాయాలనుకోండి. చెంచు మూగెన్న పొద్దున్నే లేచి వేటకి బయల్దేరాడు అని రాస్తే సరిపోదు. అతను తీసుకువెళ్ళిన ధనుర్బాణాలు ఎటువంటివి. ఆ బాణం ఏ వెదురుతో తయారుచేసారు? దాన్ని అడవిలో ఎప్పుడు కొట్టారు? ఆ బాణం ములుకు ఏ కమ్మరి దగ్గర చేయించాడు? లేదా ఏ సంతలో కొన్నాడు? ఎంతకి కొన్నాడు? ఆ బాణానికి కట్టిన తాడు ఏ నారతో తయారుచేసారు? ఎన్ని ముళ్ళు చుట్టాడు? ఆ అంబుకి బిగించిన ఈకలు ఏ పక్షివి? ఆ పక్షివే ఎందుకు వాడతాడు? ఇలా వందప్రశ్నలు పుట్టుకొస్తాయి నాకు. ఈ వివరాలేవీ కూడా ఆ కథలో నేను వాడకపోవచ్చు. కాని ఈ వివరాలేవీ తెలియకుండా నేను ఆ మూగెన్న ఆ రోజు వేటకి వెళ్ళి ఏం చేసాడన్న ట్రూత్ కి చేరుకోలేనని నమ్ముతాను. అందుకే కథలు రాయడం నా దృష్టిలో చాలా చాలా కష్టం.
మరోమాట కూడా చెప్పాలి.. నేను మొదట్లో కథలు కూడా కవితాత్మకంగా రాసాను. కాని తర్వాత తర్వాత రెండూ రెండూ ప్రత్యేక ప్రక్రియలని అనుకున్నాను. నేను చూసిన సౌందర్యాన్ని వ్యక్తపరచడానికి కవిత్వాన్నీ, జీవితంలో నేను చూస్తున్న విషాదాన్నీ, బీభత్సాన్నీ చిత్రించడానికి కథల్నీ ఎన్నుకున్నాను. సహజంగానే సుందరమైన అనుభవాల్ని చెప్పడానికి మనసు ముందుకొస్తుంది. దుఃఖాల్నీ, దారుణాల్నీ చెప్పడానికి మనసు అంత సుముఖంగా ఉండదు. ఏదో కారణం చెప్పి ఆ బాధ్యతని దాటేస్తూ ఉంటుంది. అందుకని కథారచన నాకు కష్టమవుతూ వచ్చింది.
జీవితంలోనూ, సమాజంలోనూ కూడా సాంఘిక అన్యాయం, అసమానతల గురించి కథలు రాయాలి. అది తప్పనిసరి బాధ్యత. కాని ఆ వెంటనే, వాటి గురించి మాట్లాడేవాళ్ళూ, పోరాడేవాళ్ళూ చూపించే ద్వంద్వప్రమాణాలు, వాళ్ళల్లో కనిపించే ఆత్మవంచనల్ని కూడా చిత్రించవలసి ఉంటుంది. అంటే, అటువంటివి రాయడంవల్ల మనసు రెండుసార్లు గాయపడుతుంది. మొదటిది, వాటిని చూసినప్పుడు, రెండోసారి, వాటిని మళ్లా రాసినప్పుడు. మనసుని రెండు సార్లు కష్టపెట్టుకోలేక కూడా చాలా కథలు రాయవలసి ఉండీ, రాయకుండా ఉండిపోయాను.
3.మీరు కథా రచనలో దేనికి ప్రాధాన్యం ఇస్తారు? కథాంశానికా? శైలీ శిల్పాలకా? కథనానికా? ఆలోచనలకా?
జ. కథ అంటే అన్నీను. ఇవేవీ వేరు వేరు అంశాలు కావు. మీరు ఎన్నుకునే ఇతివృత్తమే మీ కథాశిల్పాన్ని నిర్ణయిస్తుంది. కానీ కథ అంటే కేవలం సంఘటననో లేదా పాత్రచిత్రణనో కాదు. ఎడ్గార్ అలన్ పో చెప్పినట్టుగా పాఠకుడి మీద విడిచిపెట్టే single most effect ని బట్టి కథ విజయం ఆధారపడుతుంది. అన్నీ కలిస్తేనే ఆ single most effect సాధ్యపడుతుంది. కానీ గొప్ప కథలుగా సాహిత్యచరిత్రలో మిగిలిపోయినవాటిలో అంతరావలోకన ఒక ప్రధాన గుణంగా కనిపిస్తుంది. అంటే ఆ పాత్రల్లో ఎవరో ఒకరు, కథ చెప్పేవాడుగానీ, ప్రధాన పాత్రగానీ ఎవరో ఒకరు ఆ సంఘటనలు తనలో కలిగించిన సంచలనాన్ని నెమరువేసుకున్నప్పుడు, ఆ కథ పాఠకుణ్ణి చాలా కాలం వెంటాడుతుంది.
4.మీ కథలలో తాత్వికత అంతర్లీనంగా వుంటుంది. కొన్ని కొన్ని సందర్హాలలో ఒక వాక్యంలో ఎంతో లోతైన భావాన్ని పొందుపరుస్తారు. ఇది సహజంగా మీ శైలిలో భాగమా? లేక, మీరు ఆలోచించి మందుసామగ్రి కూరినట్టు పదాలలో అనంతమైన భావాన్ని conscious గా పొదుగుతారా?
జ. ఒక అనుభవాన్నో, ఇతివృత్తాన్నో కథగా మలచాలని అనుకున్న వెంటనే నేనెప్పుడూ కథ రాయలేదు. ఆ ఇతివృత్తం చాలా ఏళ్ళపాటు నా మనసులో మాగుతూ ఉంటుంది. బహుశా అందువల్ల ఆ ఆలోచనల బరువు ఆ వాక్యాల్లోకి వచ్చి ఉండవచ్చు. కాని చివరి కథలకు వచ్చేటప్పటికి వీలైనంత సరళంగానూ, సూటిగానూ చెప్పడానికి ప్రయత్నించడం కూడా మీరు గుర్తుపట్టివుంటారు.
5.మీ కథా రచన పద్ధతిలో స్పష్టంగా కనిపించే మరో అంశం, మీరు పాఠకుడిని ఉద్విగ్నతకు గురిచేసే బదులు ఆలోచింపచేయటానికే ప్రాధాన్యం ఇస్తారు. అంటే, పఠనీయత కన్నా, ఆలోచింపచేయటానికే మీరు ప్రాధాన్యం ఇస్తారా?
జ. ఈ ప్రశ్నకు సమాధానం పైనే చెప్పాను. కాని మరో మాట చెప్పాలి. కథలో అంతరావలోకనం, అంటే reflection వట్టి ఆలోచనాత్మకంగా ఉంటే పాఠకుణ్ణి కదిలించదు. అది రసాత్మకంగా ఉండాలి. అంటే ఉద్విగ్నభరితంగా ఉండాలి. కథకుడు తానే ఉద్విగ్నతకు లోనైతే పాఠకుడికేమీ రసస్ఫూర్తి ఉండదు. కథకుడు తనని తాను వెనక్కి నెట్టుకుని పాత్రల మనోప్రపంచద్వారాలు బార్లా తెరిచిపెడితే, పాఠకుడు ఆ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఇష్టపడతాడు. నిజానికి కథనకుతూహలం కథకుడి కుతూహలంకన్నా పాఠకుడి కుతూహలమయితేనే రక్తికడుతుంది.
6.మీ కథలను మూడు ప్రత్యేక విభాగాలుగా విభజించటం, కేవలం కాలం ఆధారంగా చేసిన విభజననా, లేక, మీ ఆలోచనలలో, దృక్కోణంలో, కథా రచన సంవిధానంలో, కథాంశాల ఎంపికలో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తుందా ఈ విభజన? కొన్ని కథల విశ్లేషణతో ఈ విభజనను వివరిస్తారా?
జ. నా కథాసంపుటంలో మూడు భాగాల విభజన నిజానికి కాలవిభజననే. కాని కాలం కథకుడి జీవితంలోనూ, ఆలోచనలోనూ తెచ్చిన మార్పులు ఆ విభజనలో ప్రతిఫలించడం సహజమే కద. మొదటిభాగంలో కథలు, నాకు బాగా తెలిసిన మా ఊరు, మా గ్రామీణజీవితం, మా కుటుంబం, నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన రాజమండ్రి – ఆ చిన్న ప్రపంచానికి పరిమితమైన కథలు. ఆ కథలు రాస్తున్న కాలంలో నా కథలు ప్రచురణయోగ్యమని సంపాదకులు భావిస్తే చాలని అనుకునేవాణ్ణి. నేను రాసిన ‘గృహోన్ముఖంగా’ కథ 1984లో ఆంధ్రజ్యోతికి పంపిస్తే సుబ్రహ్మణ్యశర్మగారు నాకో చిన్న కార్డు రాసారు ‘కథ చాలా గొప్పగా ఉంది’ అంటూ. అది నాకిచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. అలాగే ‘సొంత ప్రపంచం, పరాయి ప్రపంచం’ కథల్ని వసీరా తీసుకువెళ్ళి కాళీపట్నం రామారావు మాష్టారికి చూపిస్తే, ఆయన నాకో ఉత్తరం రాసారు. ఆ ఉత్తరం చదివిన చాలా రోజుల పాటు నా కాళ్ళు నేలమీద ఆనలేదు.
ఇక 1990 నుంచి నేను రిటైరయ్యేదాకా దాదాపు 33 ఏళ్ళ కాలంలో రాసినవి పన్నెండు కథలు. ఉద్యోగరీత్యా నేను వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు నేను లోనైన అనుభవాల్లోంచి రాసిన కథలు అవి. వాటిని రాసిన కథకుడు పూర్వపు చిన్నపిల్లవాడు కాడు. తనకి సంప్రాప్తిస్తున్న అనుభవాల సారాన్ని నిగ్గుతేల్చుకోడానికి ప్రయత్నించిన మనిషి. అందుకే ఆ కథలన్నిటిలో అంత తీవ్రమైన అంతరావలోకన కనిపిస్తుంది.
మిగిలిన తొమ్మిది కథలు నేను రిటైరయ్యాక ఒక్క గుక్కలో రాసినవి. ఎన్నాళ్ళుగానో రాయాలనుకుని వాయిదా వేస్తూ వచ్చినవి. ఇక్కడకి చేరుకునేటప్పటికి అనుభవాలు ఆశ్చర్యపరచడం మానేసాయి. వాటి స్థానంలో ఒక గంభీర విషాదం చోటుచేసుకోవడం మీరు గమనిస్తారు.
7. మీ పలు కథల్లో సంసార బాధ్యతలు, ఉద్యోగం రొటీన్‍లో పడి మిమ్మల్ని మీరు కోల్పోయిన భావన కనిపిస్తుంది. మొదటి కథ శరణార్ధిలో ‘ఆ లెక్కన సెటిలయినట్టే. అయినా నాకు ఎందుకా తెలియని అశాంతి? నా తోటి ఆఫీసర్లు కూడా ఇదే అశాంతిలో. ఏమిటిది?’ అన్నారు. గృహోన్ముఖంగా కథలో ‘ఆ పెద్ద యంత్రంలో అత్యావశ్యకమయిన పనిముట్టుని అయిపోయాను. ఇలా ఎందుకు జరిగింది?’ అని రాశారు. ప్రశ్నభూమి మొత్తం ఒక అంతరంగ సంఘర్శణ చిత్రణ. చివరికి ఎన్.హెచ్. 44 కథలో తన చేతిలో మొత్తం జిల్లా యంత్రాంగం వుంది. కానీ తనెందుకు చేయలేకపోయాడిలా? అనుకుంటాడు కలెక్టర్. ఆరంభంనుంచీ మీలో ఒక అశాంతి వుందనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? కథా రచన catharsis లాంటిదంటారు. మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోవటంలో, మానసిక శాంతి లభించటంలో కథా రచన ఎలా తోడ్పడింది? కథా రచనద్వారా మీరు వ్యక్తిగా మీరు సాధించిన పరిణతి వివరిస్తారా?
జ. నేను ఇంతకుముందే చెప్పినట్టు జీవితం ఎక్కడ విఫలమవుతోందో అక్కడ కథ పుడుతుంది. మన కళ్లముందు జరుగుతున్న అన్యాయాలూ, అక్రమాలూ, వాటికి కారణాలు తెలిసి కూడా మనం వాటిని చక్కదిద్దలేకపోవడంతో మరేమీ చెయ్యలేక మనం కథలు చెప్పుకోవడం మొదలుపెడతాం. కొన్నిసార్లు మనం స్పష్టంగా కారణాలు చెప్పుకోలేని విషాదాలు కూడా ఉంటాయి. మనం ఆ దుఃఖాన్ని ఉపశమిపంచేసుకోడానికి కూడా కథలు చెప్తాం. కథలు ప్రధానంగా ఒక మనిషి తన అనుభవంలోంచి గ్రహించిన వివేకాన్ని నలుగురికీ పంచడానికి సంబంధించినవి. అందువల్ల అవి విజయగాథలే కానక్కరలేదు. కాని అంతిమంగా ఒక హోప్ కనబడితేనే కథ చెప్పడానికి పూనుకోవాలన్నది నా ఉద్దేశ్యం. ఆ హోప్ కథలో కథకుడి ద్వారానే రానక్కరలేదు, మరే పాత్ర నుంచి వచ్చినా మంచిదే. అది అన్నిసార్లూ loud గానే ఉండక్కరలేదు. సూక్ష్మంగా చెప్పినా సరిపోతుంది. మీరు ప్రస్తావించిన కథలన్నిటిలోనూ కథకుడి నిస్సహాయతతో పాటు, ఎవరో ఒకరు hopeful గా కనిపించడం కూడా గమనించి ఉంటారు. నిజానికి అటువంటి హోప్‌ని వెతకడమే కథకుడి కర్తవ్యం.
8. మీరు రాసిన కథల్లో ‘మాప్ మేకింగ్’ కథ ప్రత్యేకంగా అనిపిస్తుంది. మీరు మీ కథల్లో పలు సందర్భాలలో వ్యక్తపరచిన భావాలను పరిగణనలోకి తీసుకుంటే, బహుశా, ఏదో ఒక సందర్భంలో మీకు ఇవన్నీ వదలి అడవుల్లో గిరిజనుల నడుమ జీవించాలని తీవ్రమైన ఆకాంక్ష కలిగినట్టనిపిస్తుంది. ఈ కథలో ఆ ఆకాంక్ష వ్యక్తమయినట్టనిపిస్తుంది. Story writing is a form of wish fulfilling wishful thinking అంటారు. ఈ కథలో ఈ wish fulfilling wishful thinking స్పష్టంగా వుంది. మీరేమంటారు?
జ. మీరు ‘మాప్ మేకింగ్’ కథని ప్రస్తావించినందుకు మీకు నా కైమోడ్పు. ఆ కథలో ఉన్నది కేవలం wish fulfilment కాదు. అదొక utter helplessness లోంచి వచ్చిన కథ. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా కూడా, స్వాతంత్య్రానికి పూర్వం గిరిజనేతరుల వల్ల అన్యాక్రాంతమైన గిరిజన భూమికన్నా, స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వం రకరకాల ప్రాజెక్టుల పేరిట స్వాధీనం చేసుకున్న గిరిజనభూమి విస్తీర్ణంలో ఎన్నో రెట్లు అధికం. నాకు తెలిసి, రెండు రాష్ట్రాల్లోనూ పోలవరం ప్రాజెక్టు గిరిజనుల పాలిట ఒక దుస్స్వప్నం. ఇంకా చెప్పాలంటే, గిరిజనేతర ప్రభుత్వాలు రాజ్యాంగం పేరిట చేసిన ఒక దురాగతం. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో టాస్మేనియన్లు అని ఒక తెగ ఉండేది. యూరపియన్ వలసవాదులు ఆ తెగని నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసారు. పోలవరం ప్రాజెక్టు పేరిట ఒక పచ్చని గిరిజన ప్రపంచాన్ని మన ప్రభుత్వాలు ఛిన్నాభిన్నం చేసేసాయి. గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా అదంతా నేను నా కళ్ళతో చూస్తూ రావడంలోని నిస్సహాయతలోంచి ఆ కథ వచ్చింది. నా దృష్టిలో ఇది నేను కళ్ళారా చూసిన విపత్తుల్లోకెల్లా గొప్ప విపత్తు. దాన్ని కథగా చెప్పాలనుకున్నప్పుడు, అందులో ఇతివృత్తం ఏమిటి? కథకుడి నిస్సహాయత. ప్రపంచమంతా ఈ మాప్ మేకింగ్ జరుగుతూనే ఉంది. ప్రపంచమంతా కూడా సున్నితహృదయులు తమ నిస్సహాయతలోంచి కథలు రాయడం తప్ప మరేమీ చెయ్యలేకపోతున్నారు.
ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న సాహిత్యంలో ప్రభావంతమైన సాహిత్యం సరిహద్దులకు సంబంధించిందే. గత అయిదేళ్ళల్లో కనీసం ముగ్గురు నవలా రచయితలు జాతుల, దేశాల, సంస్కృతుల, సరిహద్దుల మీద రాసినవాళ్ళే. పోయిన ఏడాది బుకర్ ప్రైజు వచ్చిన గీతాంజలి శ్రీ నవల కూడా సరిహద్దులకు సంబంధించిన కథనమే. ఈ రచయితలు సరిహద్దుకు ఎటో ఒకవైపు నిలబడటం కాదు, అసలు సరిహద్దులు గీసుకోడంలోని అమానుషత్వాన్ని ఎత్తిచూపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, 21వ శతాబ్దపు సాహిత్యం మాప్ మేకింగ్ విషాదాలకు సంబంధించిందే అవుతుంది.
9. రాముడు కట్టిన వంతెన కథలో తనని కోల్పోయిన వాడే రాముడిని పొందుతాడన్న ఆలోచనను వ్యక్త పరిచారు. ఈ ఆలోచనను మరింత విశదీకరిస్తారా? ఎందుకంటే, మీరు రాసిన కథలన్నిటిలో కనబడే అన్వేషణా గమ్యాన్ని అందుకునే మార్గం ఈ కథలో మీకు దొరికిందనిపిస్తుంది. అందుకని ఇంకాస్త విపులంగా వివరిస్తే పాఠకులూ ఈ వాక్యం ప్రదర్శించే లోతైన తాత్వికతను గమనిస్తారు.
జ. అసలు నా కథల పుస్తకానికి ‘రాముడు కట్టిన వంతెన, మరికొన్ని కథలు’ అనే పేరుపెట్టాలనుకున్నాను. ఈ సంపుటిలో ఆ కథకి మానసికంగా నేను ఇచ్చుకున్న స్థానం అది. రాముడు కట్టిన కథలో ప్రమోద్ మా అబ్బాయి. ఆ సంఘటన మొత్తం యథాతథంగా జరిగిందే. చిన్నపాటి మలుపును కూడా నేను అందులో కల్పించలేదు. వాడికి రాముడంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే, రామాయణం నాటకం వెయ్యడంకోసం చివరికి వాడు రావణుడి పాత్ర ధరించడానికి కూడా సిద్ధమయ్యాడు. ఆ చిన్నసంఘటనలో నాకు గొప్ప ట్రూత్ కనిపించది. యుగయుగాల భారతీయ సామాజిక-రాజకీయ భావధారని నిర్దేశిస్తున్న మహారహస్యమేదో అవగతమైందనిపించింది. నేను రాసిన వాక్యం తనని తాను కోల్పోయినవాడు రాముడికి దగ్గరవుతాడని కాదు, తోటిమనుషులకు దగ్గరవడానికి, అవసరమైతే, తనని నిరాకరించడానికి సిద్ధపడ్డవాడికి రాముడు తానే చేరువవుతాడు అన్నది ఆ కథలో స్ఫూర్తి. యుగయుగాల భారతచరిత్రనీ, భావజాల చరిత్రనీ చదివితే మనకి స్పష్టంగా అర్థమయ్యేది, self-denial. తనని తాను నిరాకరించుకోడానికి ఏ protagonist సిద్ధపడతాడో అతణ్ణి భారతీయ సమాజం దేవుడిగా భావిస్తుంది. ఇది ఒక్క రామాయణానికే పరిమితమైన సూత్రం కాదు. వర్ధమాన మహావీరుడి జీవితం చూడండి. సిద్ధార్థుడు తన భార్యనీ, పిల్లవాణ్ణీ, రాజ్యాన్నీ వదిలి అడవులకు వెళ్ళడం చూడండి. గాంధీగారి జీవితం మొత్తం చూడండి. చివరికి గురజాడ swansong అని చెప్పదగ్గ ‘లంగరెత్తుము’ కవిత చూడండి. తనో, తోటిమనిషినో ఎవరో ఒకరు మాత్రమే బతుకుతారంటే, ‘యుద్ధమా ఇక ఏమి లోకము? చాలు చాలును లంగరెత్తుము’ అని ఎవరు అనగలరో అతడు మన సమాజానికి ఆరాధ్యపురుషుడు లేదా ఆరాధ్య నాయిక. ‘తేనత్యక్తేన భుంజీథాః’ ఇది వట్టి ఆధ్యాత్మిక వాక్యం కాదు. రాజనీతి వాక్యం కూడా. నువ్వు మనుషులకి ఏమైనా చెయ్యాలనుకుంటున్నావా? వాళ్ళ సాంఘిక-ఆర్థిక విమోచనకు నాయకత్వం వహించాలనుకుంటున్నావా? అప్పుడు నీ హృదయంలో ఈ వాక్యాన్ని పచ్చబొట్టు పొడిపించుకో. Careerist రాజకీయనాయకుల్ని భారతీయ సమాజం దీర్ఘకాలం భరించలేదు. ‘సొంత లాభం’ ఏ ‘కొంత’మానుకున్నా ఆ మనిషి మాట మనకి శిరోధార్యమవుతుంది. పూర్తిగా మానుకున్నాడనుకోండి, అప్పుడు మనం నేరుగా అతడికి పాదుకలకి కూడా పట్టాభిషేకం చెయ్యడానికి వెనకాడం. భారతీయ రాజకీయ మనస్తత్వంలోని ఈ అంశాన్ని గ్రహించనంతవరకూ, ఈ సమాజాన్ని మార్చాలనుకునే ఏ ఉద్యమాలూ, విప్లవాలూ కూడా జయప్రదం కానేరవు.
10. ఈ సంపుటిలోని కథల్లో మీ మనసుకు బాగా దగ్గరగావున్న కథ ఏది?
జ. ‘సంజీవి.’ ఒక పసిబిడ్డ మరణించినప్పుడల్లా దేవుడి ఉనికి ప్రశ్నార్థకమవుతుంది అన్నాడు డాస్టొవిస్కీ. నేను భగద్విశ్వాసిని. కాబట్టి, ప్రతి అకాలమరణం నుంచీ మనం నేర్చుకోవలసిన పాఠమేదో ఉందనుకుంటాను. కాని అది ఒకపట్టాన అర్థమయ్యేది కాదు. ముందు ఆ బరువుని మనం మోసుకుంటూ తిరగాలి. దాన్ని పక్కనపెట్టేయకూడదు. అందుకనే ఆ కథలో రాసిన సంఘటన జరిగిన ముప్ఫై ఏళ్ళ తరువాత కూడా నేను ఆ కథ రాయకుండా ఉండలేకపోయాను. కాని కథ రాసాక కూడా ఆ బరువుదిగలేదు కదా, నేను దాన్ని మోసుకుతిరక్క తప్పదనే అర్థమయింది. అంటే ఆ పిల్లవాడి అకాలమరణం అనే కాదు, అసలు ప్రపంచంలో అకాలంగా మరణిస్తున్న పిల్లలందరి బరువూ కూడా. కారణాలేమన్నాగానీ, ఆకలి, యుద్ధం, వ్యాధులు, నిరాదరణ- ఏ కారణమైనా సరే, మరణించిన ప్రతి శిశువుకీ, బ్రతికున్న ప్రతి ఒక్కరూ జవాబుదారులే అనుకుంటాను.
11. మీకు బాగా నచ్చిన కథ ఏది?
జ. ‘అమృతం’ కథ. చెహోవ్ లాగా ఒక కథ రాయగలనా అనుకున్నాను. ముఖ్యంగా 1895 తర్వాత చెహోవ్ రాసిన కథల్లాంటి కథ. ఒక తంత్రీవాద్యం మీద రాగప్రస్తారం చేసినట్టుగా ఆ కథలో భావప్రస్తారం చెయ్యడానికి ప్రయత్నించాను. ఒక షార్ట్ ఫిల్మ్ తియ్యడానికి స్క్రీన్ ప్లే రాసుకున్నట్టుగా ఆ కథలో సన్నివేశకల్పన, సంభాషణ, దృశ్యవివరణ చేసాను. నిజానికి నాకు జీవితం అనుకూలించి ఉంటే, మరెన్నో కథలు అటువంటివి రాసి ఉండాలి.
12. ఏ కథ రాయటానికి మీరు చాలా కష్టపడ్డారు?
జ. ‘రెండు ప్రపంచాలు’. ఆ కథ రాయడానికి, టైపు చేయడానికి పట్టిన టైముకన్న అదనంగా ఒక్క నిమిషం కూడా అవసరం కాలేదు. కానీ కథ మొదలుపెడుతూనే కళ్ళమ్మట నీళ్ళు. ఎడతెగని కన్నీళ్ళమధ్యనే ఆ కథ పూర్తిచేసాను.
13. ఏదయినా కథ ఇంకా బాగా రాసివుండాల్సింది అనిపించిందా?
జ. చిట్టచివరి కథ. ‘తల్లులూ, కొడుకులూ.’ నిజానికి అది ఒక నవలగా రాయవలసిన కథ. 2015లో మొదలుపెట్టిన కథ అలానే ఉండిపోతుందేమో, కనీసం కథగానైనా పూర్తిచేద్దామని తొందరతొందరగా ముగించాను. చూడాలి. ఎప్పటికైనా దాన్ని ఒక నవలగా రాయగలనేమో చూడాలి.
14. మీరు ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కథలు విరివిగా రాసే ప్రణాళికలేమయినా వున్నాయా?
జ. చాలా ఉన్నాయి. వాటితో పాటు ప్రపంచ కథ పుట్టుక, పరిణామం, కథాశిల్పం మొదలైనవాటిని సోదాహరణంగా వివరిస్తూ తేవాలనుకున్న పెద్ద ప్రాజెక్టు కూడా ఒకటి ఉంది. అందులో ‘ప్రాచీన కాలంలో కథ’ వరకూ పూర్తి చేసాను. కళా ఉద్యమాలకు సంబంధించీ, కథాశిల్పానికి సంబంధించీ కొన్ని వ్యాసాలు పూర్తిచేసాను. ఇంకా రాయవలసిన వ్యాసాలు చాలా ఉన్నాయి.
~
సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని వెచ్చించి సంచికకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు చినవీరభద్రుడు గారూ.
చినవీరభద్రుడు: ఈ ఇంటర్వ్యూకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలు ఎంతో లోతుగా ఉన్నాయి. కథాసంపుటంలో కథలన్నీ ఎంతో శ్రద్ధగా చదివితే తప్ప ఇటువంటి ప్రశ్నలు అడగడం సాధ్యం కాదు. మీరు ఆ కథలపట్ల చూపించిన ఆసక్తికీ, వాటిగురించీ నలుగురికీ తెలియచేయాలన్న మీ ఉద్దేశ్యానికీ మరొక మారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
***
వాడ్రేవు చినవీరభద్రుడు కథలు 1980 – 2023
రచన: వాడ్రేవు చినవీరభద్రుడు
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 504
వెల: ₹300.00
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్ పై. లి.
#33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643.
ఆన్లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1283&BrandId=297&Name=Kathalu+1980-2023
https://www.amazon.in/Vadrevu-Chinaveerabhadrudu/dp/B0C14K7SRX