మరుగునపడ్డ మాణిక్యాలు – 68: ట్రూత్

0
2

[సంచిక పాఠకుల కోసం ‘ట్రూత్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]ప[/dropcap]త్రికారంగం ప్రజాస్వామ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వార్తా చానళ్ళు కూడా ఆ రంగంలోకే వస్తాయి. మన దేశంలో పత్రికలు, చానళ్ళు పార్టీల వారీగా విడిపోయాయి. విషాదమే అయినా మన దేశంలో పత్రికారంగం విశ్వసనీయతను కోల్పోయి చాలా కాలమయింది. ప్రజలు కూడా వినోదం కోసమే వార్తలు చదువుతున్నారు, చూస్తున్నారు కానీ విశ్వసనీయ సమాచారం కోసం కాదు. అమెరికా లాంటి దేశాల్లో కూడా సమాచారం ఒక వ్యాపారం లాగే అయిపోయింది. కొన్ని పత్రికలు మాత్రం ప్రమాణాలు కాపాడుకుంటున్నాయి. వాటిలో కూడా కొన్నిటికి ప్రపంచంలోని భిన్నస్వరాలు నచ్చవు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు రావటంతో ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నిర్ధారణ లేకుండా సమాచారాన్ని పంచుకునేవారే ఎక్కువ. సమాచారాన్ని సృష్టించేవారు కూడా తయ్యారయ్యారు. ఒకప్పుడు అమెరికాలో జర్నలిజం చాలా బాధ్యతాయుతంగా ఉండేది. ఇరయ్యొకటో శతాబ్దం వచ్చేసరికి మంచి జర్నలిజాన్ని కూడా తొక్కేసే నైజం వచ్చేసింది. అలాంటి ఒక కథే ‘ట్రూత్’ (2015). టీవీలో కథనాలు ఎలా తయారు చేసేవారో, ఎంత శ్రమపడేవారో ఇందులో అద్భుతంగా చూపించారు. ఇలాంటి కథని కూడా ఉత్కంఠభరితంగా ఎలా చెప్పొచ్చో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాబర్ట్ రెడ్ ఫర్డ్, కేట్ బ్లాంచెట్ నటన ఈ చిత్రాన్ని శిఖరాయమానంగా నిలబెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

చిత్రం మొదట్లో టీవీ ప్రొడ్యూసర్ మేరీ మేప్స్ ఒక లాయర్‌ని కలవటానికి వెళుతుంది. ఆమెకి లాయరు అవసరం ఎందుకొచ్చింది? ఆమె ఒక విచారణ ఎదుర్కొంటోంది. సీబీఎస్ చానల్లో ’60 మినిట్స్’ అనే కార్యక్రమంలో ఒక కథనం ప్రసారం చేయటంతో ఆమె మీద అభియోగాలు వచ్చాయి. ఆ కార్యక్రమానికి ఆమే సమాచార సేకరణ చేస్తుంది. దానికి ఒక బృందం ఉంటుంది. విషయాన్ని బట్టి బృందం మారుతూ ఉంటుంది. బృందం మారినా మారనివారు ఒకరు మేరీ అయితే ఇంకొకరు డ్యాన్ ర్యాదర్. అతను ’60 మినిట్స్’ కి యాంకర్. కథనాన్ని అతనే చదువుతాడు, ఇంటర్వ్యూలు అతనే చేస్తాడు. డ్యాన్ వయసులో మేరీ తండ్రి లాంటివాడు. అమెరికా టీవీ రంగంలో ఒకప్పుడు డ్యాన్ లాంటివారికి విశ్వసనీయత ఎక్కువ. వారి అనుభవం వారికి ఒక హోదాని తెచ్చిపెట్టింది. ఇంకా కథలోకి వెళ్ళేముందు కాస్త రాజకీయ నేపథ్యం కూడా చూడాలి. 2000లో జార్జ్ బుష్, ఆల్ గోర్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. జార్జ్ బుష్ రిపబ్లికన్ పార్టీ వాడు. రిపబ్లికన్ పార్టీ సంప్రదాయవాదుల (కన్జర్వేటివ్స్) పార్టీ. అవతలి పార్టీ డెమొక్రటిక్ పార్టీ. వీళ్ళు ఉదారవాదులు (లిబరల్స్). కేవలం ఈ లేబుళ్ళని బట్టి ఎవరి మీదా ఒక అభిప్రాయం ఏర్పరుచుకోలేం. ప్రతి అభ్యర్థి ఏం చేస్తానని చెబుతున్నాడో విని వారికి ఓటు వేస్తారు. మన దేశంలో ప్రధానిని ప్రజలు ఎన్నుకోరు. ప్రజలు ఎంపీలని ఎన్నుకుంటే, వారు ప్రధానికి ఎన్నుకుంటారు. అమెరికాలో ప్రజలే నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మామూలుగా ఫలితం ఎన్నికల నాటి రాత్రే తెలిసిపోతుంది. కానీ ఆ సంవత్సరం చానాళ్ళు ఫలితం తేలలేదు (2020లో కూడా ఫలితం త్వరగా తేలలేదు). చివరికి కేవలం 537 ఓట్ల తేడాతో జార్జ్ బుష్ గెలిచాడు. మేరీ 2000లో ఎన్నికలకి ముందు జార్జ్ బుష్‌కి వ్యతిరేకంగా ఒక కథనం ప్రసారం చేయాలనుకుంది. అప్పుడు ఆమె తల్లి మరణించటంతో ఆ కథనం పని పూర్తి కాక ప్రసారం జరగలేదు. “ఆమె తల్లి మరణించకుండా ఉండి ఉంటే జార్జ్ బుష్ బదులు ఆల్ గోర్ అధ్యక్షుడయ్యేవాడేమో” అంటాడు ఒకతను. ‘60 మినిట్స్’ లాంటి కార్యక్రమాలకి అంత ప్రజాదరణ ఉండేది. 2004లో జార్జ్ బుష్ మళ్ళీ పోటీ చేశాడు. అప్పుడు మేరీ ఒక కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ.

జార్జ్ బుష్ కుటుంబానికి ఒసామా బిన్ లాడెన్ (2001లో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత వ్యూహకర్త) కుటుంబంతో ఆర్థిక లావాదేవీలు ఉండేవని 2004లో మేరీకి సమాచారం అందుతుంది. దాని కోసం పరిశోధన చేస్తుంటే జార్జ్ బుష్ 1968లో టెక్సస్ ఎయిర్ నేషనల్ గార్డ్ (ఒక మిలిటరీ విభాగం) లో సిఫార్సు మీద పైలట్ శిక్షణ కోసం చేరాడని, 1972లో పైలట్‌గా పని చేస్తూ ఒక సంవత్సరం పాటు విధులు నిర్వర్తించలేదని తెలుస్తుంది. 1965 నుంచి 1973 వరకు వియత్నాం యుద్ధంలో అమెరికా పాల్గొంది. వియత్నాంలో యుద్ధానికి ప్రభుత్వం జార్జ్ బుష్‌ని పంపించకుండా ఉండటానికి సిఫార్సు మీద నేషనల్ గార్డ్‌లో అతని కుటుంబం చేర్పించిందని ఒక అభియోగమైతే, ఒక సంవత్సరం పాటు అక్కడ విధులు నిర్వర్తించకపోయినా నిర్వర్తించినట్టు పత్రాలు సృష్టించారని ఇంకో అభియోగం. మొదటి అభియోగం నేషనల్ గార్డ్‌లో పని చేసిన వారందరూ తోసిపుచ్చుతారు. బుష్‌ని ప్రత్యేకంగా పరిగణించలేదని అంటారు. చివరికి ఒక అధికారి బుష్ కుటుంబం కోరిక మీద తానే బుష్‌ని సిఫార్సు చేశానని ఒప్పుకుంటాడు. రెండో అభియోగం మీద మేరీ బృందం దృష్టి పెడుతుంది. వైట్ హౌస్ (అమెరికా అధ్యక్ష భవనం) మాత్రం ఈ అభియోగాన్ని తోసిపుచ్చుతుంది. బుష్ తన విధులను సక్రమంగా నిర్వర్తించాడని చెబుతుంది. మరి విధులు నిర్వర్తించినట్టు రికార్డులు లేవేం అంటే రికార్డులు పారేసి ఉంటారు అంటారు. ఒకరోజు ఒక కల్నల్ దగ్గర బుష్ విధులు నిర్వర్తించలేదని నిరూపించే పత్రాలు ఉన్నాయని తెలుస్తుంది. అతను ముందు నిరాకరిస్తాడు కానీ చివరికి పత్రాలు ఇస్తాడు.

ఈ అభియోగం నిరూపిస్తే లాభం ఏమిటి? అమెరికా అధ్యక్షుడు అబద్ధం చెప్పాడని తేలుతుంది. అయితే ఏమిటి? పైలట్‌గా తన విధులు సరిగా నిర్వర్తించని వాడు ఇప్పుడు అధ్యక్షుడి విధులు సక్రమంగా నిర్వర్తిస్తాడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మళ్ళీ ఏదో విషయంలో అబద్ధం చెప్పడని నమ్మకం ఏమిటి? ప్రజలు అతనికి ఓటు వేసే ముందు ఆలోచిస్తారు. ఇది చిన్న విషయమే కదా అనొచ్చు. కానీ ప్రజలు తప్పులు చేయొచ్చు కానీ రాజు తప్పు చేయకూడదు అనే ధోరణి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. తప్పు చేస్తే ఒప్పుకోవాలి. మేరీ ఈ విషయం ప్రజలకి తెలియజేయాలి అని ఎందుకు అనుకుంది? బుష్ ప్రత్యర్థి జాన్ కెరీపై కూడా అభియోగాలు వచ్చాయి. దాని మీద మేరీ ఎందుకు దృష్టి పెట్టలేదు? అన్ని విషయాల మీద దృష్టి పెట్టాలని నియమేం లేదు. అయితే ఆమె బుష్ విషయమే ఎందుకు ఎంచుకుంది? ఆమె డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరురాలు. ఆమె తనకు నచ్చని అభ్యర్థి మీదే దృష్టి పెట్టిందా? ఇది న్యాయమేనా? ఆమె, డ్యాన్ అనేదేటంటే మనకి ఏదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని ప్రశ్నించాలి. అదే జర్నలిస్టుల పని.

కల్నల్ తన దగ్గర ఉన్న పత్రాలు తనకి ఎలా చేరాయో చెప్పటానికి నిరాకరిస్తాడు. ఆ పత్రాలు నిజమైన పత్రాలేనా అనే అనుమానం మేరీకి వస్తుంది. ఆమె అడిగే ప్రశ్న చాలా చాకచక్యంగా ఉంటుంది. “ఎవరైనా ఈ పత్రాలు మీకిచ్చి మిమ్మల్ని బోల్తా కొట్టించాలని చూస్తున్నారంటారా?” అని అడుగుతుంది. “నాకంత శత్రువులు ఎవరూ లేరు” అంటాడాయన. పైగా అతను అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. “పత్రాలివ్వటమే నా పని. మిగతాది మీరు చూసుకోండి” అంటాడు. కల్నల్ భార్య భయపడుతూ ఉంటే మేరీ ఆమెని సముదాయిస్తుంది. కల్నల్ ఇచ్చిన పత్రాలలో బుష్‌కి శిక్షణ పూర్తి చేయటం మీద శ్రద్ధ లేదని ఒక పత్రం ఉంటుంది. ఇంకో పత్రంలో అతని పని తీరుపై రేటింగ్ ఇవ్వమంటే అతను ఆ సమయంలో పనే చేయలేదు, రేటింగ్ ఎలా ఇస్తాను? అనే విషయం ఉంటుంది. రెండిటి మీద అధికారి జెరీ కిలియన్ సంతకాలు ఉంటాయి. అయితే ఆయన మరణించాడు. మరి పత్రాల ధృవీకరణ ఎలా? పత్రాల పరిశీలనా నిపుణుల సాయం తీసుకుంటారు. ఇవి ఒరిజినల్ పత్రాలు కాదు, నకళ్ళు. కాబట్టి కాగితాలను కానీ, సిరాని కానీ పరీక్షించటం కుదరదు. అయితే జెరీ కిలియన్ సంతకం నిజమైనదే అని ఒక దస్తూరి నిపుణుడు చెబుతాడు. ఒక పత్రంలో ‘th’ అనే సూపర్ స్క్రిప్ట్ అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకి 111th లో ‘th’ అనే అక్షరాలు కాస్త పైకి ఉంటాయి. ‘నూట పదకొండవ’ అనే అర్థం వస్తుంది. అప్పట్లో అలా అక్షరాలు పైకి ఉండే టైప్ రైటర్ ఉండేదా అని ఒక అనుమానం. ఉండేదని ఒక నిపుణుడు చెబుతాడు. డ్యాన్ “పత్రాల సంగతి సరే. ఎవరైనా ఈ పత్రాల్లో ఉన్న విషయాన్ని ధృవీకరించారా? అది లేకుండా ఎలా?” అని అడుగుతాడు. జనరల్ హాడ్జెస్ అనే అతను అప్పట్లో సీనియర్ అధికారి. అతను ఫోన్లో ఎంత ప్రయత్నించినా దొరకడు. చివరికి దొరుకుతాడు. ఆ పత్రాల్లో ఉన్న విషయాన్ని ధృవీకరిస్తాడు. మేరీ సంబరపడుతుంది. కల్నల్‌కి ఆ పత్రాలు ఎలా వచ్చాయో తెలియాలని మేరీపై ఎడిటర్ ఒత్తిడి చేస్తాడు. కల్నల్ తనకి ఆ పత్రాలు జార్జ్ కాన్ అనే వ్యక్తి ఇచ్చాడని చెబుతాడు. కార్యక్రమం ప్రసారం చేయటానికి సమయం మించిపోతుండటంతో త్వరత్వరగా ఇతర ఇంటర్వ్యూలు చేసి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.

కార్యక్రమం చూసి బృందమంతా సంతోషిస్తుంది. కానీ మర్నాడు ఇంటర్నెట్ బ్లాగుల్లో (అప్పట్లో సోషల్ మీడియా లేదు) కొందరు ఆ పత్రాలన్నీ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగించి సృష్టించారని, ఆ ఫాంట్లు అప్పట్లో లేవని ప్రచారం ప్రారంభిస్తారు. ‘th’ అక్షరాల విషయంలో కూడా అనుమానాలు ప్రచారం చేస్తారు. సీబీఎస్ చానల్‌కి ప్రత్యర్థి అయిన ఏబీసీ చానల్ ఈ ప్రచారం మీద పరిశోధన మొదలు పెడుతుంది. బుష్ అధ్యక్షుడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా మాట్లాడటానికి చాలామంది భయపడతారు. ఎంతో మందికి తెలిసిన నిజం ఒక మనిషి కాదంటే అబద్ధమైపోతుందా? ఆ మనిషి అమెరికా అధ్యక్షుడైతే అయిపోతుంది మరి. కార్యక్రమంలో ఇంటర్వ్యూలలో ఇద్దరు అధికారులు మాట్లాడారు. ఒక అధికారి ఫోన్లో మేరీతో మాట్లాడి ధృవీకరించాడు. అవి ఎవరూ నమ్మరు. ఏమైనా అంటే వీళ్ళే అబద్ధాలు చెబుతున్నారు అంటారు. ‘పదుగురాడు మాట పాడియై ధరఁ జెల్లు’ అని నానుడి. బలవంతుడైతే ‘ఒక్కడాడిన మాట వేదమై ఒప్పారు’ అన్నట్టు అయిపోయింది నేటి పరిస్థితి. బలవంతుడికి ఎదురు నిలిస్తే తమ వ్యాపారాలు ఎలా సాగుతాయి?

మేరీ మేప్స్ తనకెదురైన అనుభవాలతో రాసిన పుస్తకం ‘ట్రూత్ అండ్ డ్యూటీ: ద ప్రెస్, ద ప్రెసిడెంట్ అండ్ ద ప్రివిలెజ్ ఆఫ్ పవర్’ ఆధారంగా జేమ్స్ వాండర్బిల్ట్ స్క్రీన్ ప్లే రాసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాబర్ట్ రెడ్ ఫర్డ్ డ్యాన్‌గా నటించాడు. రంగస్థలం మీద, టీవీలో నటించిన తర్వాత అతను 1962లో సినీరంగ ప్రవేశం చేశాడు. ‘ద స్టింగ్’ చిత్రానికి ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. 1980లో వచ్చిన ‘ఆర్డినరీ పీపుల్’ కి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. ‘ట్రూత్’ లో అతని పాత్ర ఒక నిజజీవిత వ్యక్తి పాత్ర. అయినా అనుకరణ చేయకుండా ఆ పాత్ర ఎదుర్కొన్న పరిస్థితులను సహజంగా అభినయించాడు. కేట్ బ్లాంచెట్ మేరీ మేప్స్‌గా నటించింది. ‘ది యావియేటర్’ (2004) కి ఉత్తమ సహాయనటిగా, ‘బ్లూ జాస్మిన్’ (2013) కి ఉత్తమ నటిగా ఆస్కార్లు గెలుచుకుంది. ఇంకా పలుసార్లు నామినేషన్లు వచ్చాయి. 2023 లో ఆమెకి ‘టార్’ చిత్రానికి ఉత్తమ నటి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. హాలీవుడ్‌లో పని చేసిన ఉత్తమ నటీమణులలో ఆమె ఒకరు అనేది నిర్వివాదాంశం. ‘ట్రూత్’ లో ఆమె తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే పాత్ర అద్భుతంగా పోషించింది. ఒక దశలో ఆమె పూర్తిగా కుంగిపోతుంది. ధైర్యం ఉండే మహిళని కూడా అలా కుంగిపోయేలా చేసిన వ్యవస్థ మీద మనకి కసి కలుగుతుంది. చిత్రంలో ఎడిటింగ్ కూడా ఎక్కడా ఆసక్తి సడలకుండా ఉండేలా చేశారు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

సీబీఎస్ చానల్ అధికారులు మేరీని తప్పుబట్టటం మొదలుపెడతారు. ఇంతకు ముందు మాట్లాడిన వారందరితో మళ్ళీ మాట్లాడి కథనాన్ని మళ్ళీ నిర్ధారణ చేసుకోమని అంటారు. అంతే కాకుండా ‘th’ అక్షరాలు ఉన్న వేరే పత్రాలు దొరికితే కానీ ఎవరూ నమ్మరు అని కూడా అంటారు. ఆమె బృందం ఆ కాలం నాటి ఇతర పత్రాలలో ‘th’ కోసం వెతకటం మొదలు పెడతారు. మేరీ జనరల్ హాడ్జెస్కి ఫోన్ చేస్తుంది. అతను ఫోన్ ఎత్తడు. ఇంతలో స్టౌట్ అనే అధికారి బుష్‌ని చూసీ చూడనట్టు వదిలేయమని ఒత్తిడి చేసినట్టు ఉన్న పత్రం పట్టుకుని మేరీ పైన పని చేసే ఎడిటర్ వస్తాడు. స్టౌట్ 1972లో నేషనల్ గార్డ్ వదిలిపోయాడని, అలాంటప్పుడు 1973లో ఎలా ఒత్తిడి చేయగలడని కోపంగా ప్రశ్నిస్తాడు. మేరీ “నేషనల్ గార్డ్ వదిలినవారు అదే స్థావరంలో ఎఫ్‌బీఐ ఆఫీసులో పని చేయటం మామూలే. కాబట్టి ఇంకా వారి ప్రభావం నేషనల్ గార్డ్ మీద ఉండేది” అంటుంది. ఆమె బృందంలోని మాజీ మిలిటరీ ఆఫీసర్ ఆమె చెప్పింది నిజమని అంటాడు. ఇలా ఎన్నో ప్రశ్నలను మేరీ ఎదుర్కొంటూ ఉంటుంది. ఇంతలో ‘th’ అక్షరాలు ఉన్న మరో పత్రం దొరుకుతుంది. అంటే అప్పట్లో ‘th’ అక్షరాలు కాస్త పైకి ఉండటం సంభవమే అని తేలుతుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. డ్యాన్ తన తదుపరి వార్తా ప్రసారంలో తమ దగ్గర ఉన్న పత్రాలు నిజమైనవే అని చెప్పటానికి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఆ సాక్ష్యాలను వెల్లడిస్తాడు. కానీ ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది. జనరల్ హాడ్జెస్ ఫోన్ చేసి “ఆ పత్రాలు నకిలీవని నాకనిపిస్తోంది. జెరీ కిలియన్ కుటుంబం ఆ సంతకాలు అతనివి కాదని అంటోంది. నేను వారితో ఏకీభవిస్తున్నాను” అంటాడు. డ్యాన్ “పత్రాలలో ఉన్న విషయం ముఖ్యం. పత్రాలు కాదు. ఆ విషయం నిజమని మీరు ఒప్పుకున్నారు కదా? ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి” అని అడుగుతాడు. హాడ్జెస్ “నన్ను ఇందులో ఇరికించకండి. కావాలంటే ఎన్నికల తర్వాత మాట్లాడదాం” అని ఫోన్ పెట్టేస్తాడు. ఎన్నికల్లో బుష్ గెలిస్తే ఒక లాగ, ఓడిపోతే ఒక లాగ మాట్లాడతాడన్నమాట. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా మాట్లాడతారే కానీ సత్యం మాట్లాడరన్నమాట. రాజకీయ ప్రాపకం కోసం సత్యాన్ని కుదువ పెట్టేశారు. ఈ రోజుల్లో ఇది జరుగుతున్న బాగోతమే. సత్యాన్ని బయటపెట్టాలని ఆరాటపడేవారు చివరికి ఓడిపోయే కాలమిది. కలియుగం ఇలాగే ఉంటుంది.

కల్నల్ దగ్గర నుంచి పత్రాలు లభించాయి కాబట్టి అతనితో మాట్లాడతానని సీబీఎస్ చానల్ అధ్యక్షుడు ఆండ్రూ అంటాడు. కల్నల్ భార్య ప్రతిఘటిస్తుంది. మేరీ ఆమెని బతిమాలి ఒప్పిస్తుంది. ఆండ్రూ కల్నల్‌తో ఫోన్లో మాట్లాడతాడు. మేరీ, డ్యాన్‌తో పాటు మిగతా అధికారులు కూడా ఉంటారు. కల్నల్ తనకి ఆ పత్రాలు జార్జ్ కాన్ ఇవ్వలేదని, ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చాడని చెబుతాడు. ఒక స్త్రీ తనతో ఫోన్లో ఆ పత్రాల గురించి చెప్పిందని అంటాడు. ఆండ్రూ ఒక టీవీ ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతాడు. డ్యాన్ “ఇంటర్వ్యూ ఇస్తే మంచిది. ఎలాగూ మన మీద దాడి జరుగుతోంది” అంటాడు. కల్నల్ ఒప్పుకుంటాడు. అందరూ గదిలో నుంచి వెళ్ళాక ఆండ్రూ మేరీని ఉండమని ఆమెతో మాట్లాడతాడు. “కల్నల్ ఎందుకు అబద్ధం చెప్పాడో తేలాలి. లేకపోతే డ్యాన్ ఉద్యోగానికే ప్రమాదం” అంటాడు. ప్రజల్లో గుర్తింపు ఉంటే ఇదే ప్రమాదం. తప్పులు జరిగితే బలిపశువు కావాల్సి వస్తుంది.

డ్యాన్ కల్నల్‌ని ఇంటర్వ్యూ చేస్తాడు. కల్నల్ ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. ఆక్సిజన్ ట్యాంక్ తనతో పాటు తెచ్చుకుంటాడు. “ఆ మనుషులు తమ గురించి ఎవరికీ చెప్పొద్దని చెప్పారు. మేరీ మాత్రం పత్రాలు ఎవరిచ్చారో చెప్పమని ఒత్తిడి చేసింది” అంటాడు. “దాంతో అబద్ధం చెప్పారు కదా?” అంటాడు డ్యాన్. “అవును” అంటాడు కల్నల్. ‘అబద్ధం’ అనే పదం వాడేలా డ్యాన్‌కి ఇంటర్వ్యూ మధ్యలో సీబీఎస్ అధికారుల నుంచి సూచనలు వస్తూ ఉంటాయి. “వాళ్ళు ఇలా చేయమని చెప్పారా?” అని డ్యాన్ అడిగితే “వాళ్ళు అబద్ధం చెప్పమని చెప్పారా?” అని అడగమంటారు. “వాళ్ళు ఆ పత్రాలు నా దగ్గరికి ఎలా వచ్చాయో చెప్పొద్దన్నారు” అంటాడు కల్నల్. “పత్రాలు ఇచ్చినప్పుడు మాకు నిజమెందుకు చెప్పలేదు?” అంటాడు డ్యాన్. తిప్పి తిప్పి ఒకే ప్రశ్న అడిగినట్టు ఉంటుంది. “సత్యం (ట్రూత్) చెప్పటానికి ప్రయత్నిస్తున్నవారిని కాపాడటానికి నేను నిజం దాచాను” అంటాడు కల్నల్. ఇంతకీ వారు ఎవరు? బుష్ మళ్ళీ అధ్యక్షుడు కావటం ఇష్టం లేనివారని తెలుస్తూనే ఉంటుంది. అతని ప్రత్యర్థి మనుషులా? అయి ఉండొచ్చు. బహిరంగంగా నిజం చెప్పవచ్చు కదా? సాక్ష్యం చెప్పటానికి సాక్షులు ఎందుకు జంకుతారు? తమకి ప్రమాదం ఉంటుందని. ఇక్కడ అధ్యక్షుడి మీద అభియోగం. ప్రమాదం ఇంకా ఎక్కువ. అధ్యక్షుడి అభిమానులు కూడా దాడి చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రహస్యంగా ఉండిపోతే వారి తప్పు లేదు కదా? మరి మేరీ ఎందుకు ఈ సాహసం చేసింది? ఆమె జర్నలిస్టుగా తన బాధ్యత చేస్తున్నానని నమ్మింది. కల్నల్‌తో ఇంటర్వ్యూ అయ్యాక అతని భార్య మేరీతో “అబద్ధం చెప్పానని మళ్ళీ మళ్ళీ ఆయన చేత అనిపించారు. అసలే జబ్బు మనిషి. నీ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి అతన్ని దోషిగా నిలబెట్టావు. నన్ను కాపాడుకోవటానికి ఇతరులని నాశనం చేయటం నాకు తెలియదు” అని వెళ్ళిపోతుంది. మేరీ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

సీబీఎస్ ఈ మొత్తం ఉదంతంపై విచారణ మొదలుపెడుతుంది. ఆ సంగతి డ్యాన్ చేత టీవీలో చెప్పిస్తారు. డ్యాన్ చేత క్షమాపణలు కూడా చెప్పిస్తారు. డ్యాన్ మేరీతో “నీ తప్పేం లేదు. నా గురించి ఆలోచించకు. నీ గురించి ఆలోచించుకో” అని ఒక లాయరు బిజినెస్ కార్డ్ ఇస్తాడు. అంటే లాయర్‌ని పెట్టుకోమని సలహా. మైక్ స్మిత్ అనే యువకుడు మేరీ బృందంలో సభ్యుడు. ఈ మొత్తం వివాదం మధ్యలో ఒకసారి మైక్ డ్యాన్‌ని “మీరు జర్నలిస్టుగా ఎందుకు మారారు?” అని అడుగుతాడు. “ఉత్సుకత వల్ల” అంటాడు డ్యాన్. తర్వాత డ్యాన్ అదే ప్రశ్న మైక్‌ని వేస్తాడు. “మీ వల్ల” అని మైక్ జవాబిస్తాడు. డ్యాన్‌కి అంత మంచి పేరు ఉంది. ఇప్పుడు అతనికి ఈ మచ్చ వచ్చింది. ఒకరోజు మైక్ సీబీఎస్ ఆఫీసు బిల్డింగులోకి వెళితే అతన్ని అధికారులు అడ్డుకుంటారు. మైక్ “సీబీఎస్ పేరెంట్ కంపెనీ వయాకామ్ రిపబ్లికన్ మెజారిటీ ఉన్న పార్లమెంటులో డీరెగ్యులేషన్ కోసం, పన్ను రాయితీల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ప్రసారం చేసిన కథనం వల్ల ఆ రిపబ్లికన్లకు అధ్యక్షపదవి దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే వయాకామ్ సీబీఎస్ మీద ఒత్తిడి తెచ్చి ఆ కథనం తప్పని చెప్పించటానికి ప్రయత్నిస్తోంది” అంటాడు. రాజకీయం, వ్యాపారం అలా ముడిపడిపోయాయి. వ్యాపారులు పార్టీలకు విరాళాలు ఇస్తారు. పదవి వచ్చిన తర్వాత పార్టీలు వ్యాపారులకు బోలెడు ఉపకారాలు చేస్తాయి. ఇదీ తెలిసిన బాగోతమే. ఈ మొత్తం వ్యవహారంతో మేరీ కుంగిపోతుంది. ఆమె భర్త ఆమెకి ధైర్యం చెబుతాడు. మేరీ విచారణకి సిద్ధపడుతుంది. లాయర్‌ని పెట్టుకుంటుంది.

లాయరు ఆమెని శాంతంగా ఉండమని చెబుతాడు. విచారణ కమిటీ రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తే ఆ ఉచ్చులో పడవద్దని చెబుతాడు. విచారణ కమిటీ వారు “మీరు బుష్ గురించి ప్రతికూల సమాచారం కోసం పరిశోధన చేశారని అంటే సబబేనా?” అంటారు. “బుష్ నేషనల్ గార్డ్‌లో ఉన్నప్పుడు మరుగున పడిన కొన్ని విషయాల కోసం పరిశోధన చేశామంటే సబబుగా ఉంటుంది” అంటుంది మేరీ. “బుష్ తప్పు చేశాడు అని నిర్ణయించేసుకుని అది నిరూపించటానికి ప్రయత్నించారు కదా? దోషి అని తేలేవరకు ఎవరైనా నిర్దోషే అనుకోవటం పద్ధతి కదా?” అంటారు కమిటీ వారు. “అన్ని విషయాలు ఆ కాలానికి సరిపోయేలా ఉన్నాయా లేదా అని చూసుకున్నాం. పత్రాలలో ఉన్న సమాచారం కూడా సరైనదా కాదా అని కూడా సంబంధించిన వారిని అడిగాం. ఇందులో దురుద్దేశం ఏమీ లేదు” అంటుంది మేరీ. ఇంకా ఒక పత్రంలో ఉన్న ‘OETR’ అనే అబ్రీవియేషన్ గురించి అడుగుతారు. అది తప్పని, అసలు ‘OER’ అని ఉండాలని అంటారు. మేరీ ‘OETR’ కూడా వాడుకలో ఉందని మాన్యువల్ లో చూపిస్తుంది. ఇలా అన్ని విషయాల్లో ఆమె సహనంగా జవాబులు చెబుతుంది. చివరికి కమిటీవారు విచారణ ముగిసిందని చెబుతారు. అప్పుడు మేరీ “నా రాజకీయ భావజాలం గురించి అడగరా?” అంటుంది. ఆమె లాయరుతో సహా అందరూ ఆశ్చర్యపోతారు. “మీరు లిబరల్ కదా?” అని ఒక కమిటీ సభ్యుడు అంటాడు. “మీ ఉద్దేశం నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ లిబరల్‌నా కాదా అనేనా?” అంటుందామె. ఒకప్పుడు అమెరికాలో కమ్యూనిస్టులని అనుమానించేవారిని ఈ ప్రశ్న వేసేవారు. ఇప్పుడు తమతో ఏకీభవించని వారినెవరినైనా అవతలి పార్టీ పేరు చెప్పి ఆక్షేపించటం మామూలైపోయింది. మనతో ఏకీభవించని వారందరనీ ఆక్షేపిస్తే ఎలా? ఇదే ఈరోజుల్లో సాధారణమైపోయింది. కమిటీలో వారందరూ రిపబ్లికన్లే ఉండేలా సీబీఎస్ ఏర్పాటు చేసిందని మేరీ పరోక్షంగా అంటోందన్నమాట. కొంత వాగ్వాదం నడిచిన తర్వాత కమిటీ అధ్యక్షుడు “పలుకుబడి గల కుటుంబాల నుంచి వచ్చినంత మాత్రాన ఆ యువకుల్లో నైపుణ్యం ఉండదని అంటారా?” అంటాడు. “ఉండదు” అంటుంది మేరీ. తమ పలుకుబడి ఉపయోగించి వారు అక్రమంగా కొన్ని స్థానాల్లో చేరతారని ఆమె ఉద్దేశం. ఆమె కొంచెం సంకుచితంగా ఆలోచిస్తుందని అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో జరిగే అక్రమాలు చూస్తే ఆమెలో ఆ భావాలు కలగటం తప్పు కాదని కూడా అనిపిస్తుంది.

కమిటీ నివేదిక డ్యాన్, మేరీలకు వ్యతిరేకంగా వస్తుంది. వారి ఉద్యోగాలు పోతాయి. మొత్తానికి నిజం చెప్పటానికి ప్రయత్నించినందుకు వారిని బలిపశువులని చేశారు. రాజకీయం, వ్యాపారం కలిసి ఒక మలినమైన వ్యవస్థ ఏర్పడింది. మరి మనం భరించాల్సిందేనా? మన కర్తవ్యం మన కౌన్సిలర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను బాధ్యతాయుతంగా ఎన్నుకోవటమే. మనవాళ్ళు అని, మనకేదో చేస్తారని కాకుండా సమాజానికి మంచి చేస్తారా అని ఆలోచించాలి. పార్టీలు కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయి. అభ్యర్థిని చూసి ఓటు వేయవచ్చు. అతని/ఆమె సామర్థ్యమే ప్రాతిపదిక. అలాంటివారెవరూ లేకపోతే ఇప్పుడు నోటాకి ఓటేసే అవకాశం కూడా ఉంది. అంటే వీళ్ళెవరూ నాకు నచ్చలేదు అని చెప్పటమన్నమాట. నోటాకే ఎక్కువ ఓట్లొస్తే? అప్పుడు పార్టీలన్నీ ఉలిక్కిపడతాయి. అభ్యర్థులని మార్చి మళ్ళీ ఎన్నిక పెట్టాలి. ఆ రోజు కూడా వస్తుందని నాకనిపిస్తోంది. రాజకీయాలు మారాలంటే ప్రజాచైతన్యమే మార్గం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఒకప్పుడు పత్రికారంగాన్ని నమ్మే అవకాశం ఉండేది. ఇప్పుడు అదీ లేదు. కృత్రిమ మేధ వచ్చాక నకిలీ పత్రాలు, నకిలీ వీడియోలు, నకిలీ వార్తలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. మన ఇంగితం మీదే మనం ఆధారపడాలి. వేరే దారి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here