[dropcap]జా[/dropcap]తీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కృషి సల్పుతున్న పరిశోధక రచయితకు ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2023కి గాను ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డా. చిల్లర భవానీదేవికి ప్రకటించింది.
కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం తదితర తెలుగు సృజనాత్మక రచనలతోపాటు అనువాదం ప్రక్రియలోనూ కేంద్రసాహిత్య అకాడమీ ప్రచురణలకు విశేష రచనలను అందించి బహుముఖ ప్రజ్ఞ కలిగిన భవానీదేవి కృషిని గుర్తించి రచయితల సంఘం ఈ పురస్కారానికి ఎన్నిక చేసింది. ఈ పురస్కారం కింద్ర 3,000/- నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం, శాలువాలతో నవంబర్ 18వ తేదీ సాయంత్రం విజయవాడలోని మహాత్మగాంధీ రోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రచయిత్రిని సత్కరించడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ సభలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమలపూర్ణమ్మ, రచయితల సంఘం ఉపాధ్యకక్షులు ఎ. జయప్రకాష్ తదితరులు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నెలకొల్పిన ఈ ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం గతంలో బహుగ్రంథకర్త, రచయిత, పరిశోధకుడు గబ్బిట దుర్గాప్రసాద్, చారిత్రక పరిశోధకుడు సయ్యద్ నశీర్ అహమ్మద్‌లకు అందజేయగా, ఇప్పుడు అందుకుంటున్న భవానీదేవి మూడవ వారు.
చలపాక ప్రకాష్
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం